కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భర్త లేదా భార్య చేసిన నమ్మకద్రోహాన్ని తట్టుకోవడం ఎలా?

భర్త లేదా భార్య చేసిన నమ్మకద్రోహాన్ని తట్టుకోవడం ఎలా?

భర్త లేదా భార్య చేసిన నమ్మకద్రోహాన్ని తట్టుకోవడం ఎలా?

మహిమా, ఆమె భర్త రాహుల్‌ కలిసి పూర్తికాల సేవకులుగా ఎన్నో సంవత్సరాలు యెహోవాను సేవించారు. a వాళ్ల మొదటి అబ్బాయి పుట్టిన కొంతకాలానికి రాహుల్‌ యెహోవాకు దూరమౌతూ వెళ్లాడు. ఆయన అనైతిక జీవితానికి అలవాటు పడడం వల్ల సంఘం నుండి బహిష్కరించబడ్డాడు. “ఇదంతా జరిగినప్పుడు నా గుండె పగిలినంత పనైంది, నేను చనిపోతానేమో అనుకున్నాను. ఏమి చేయాలో తోచలేదు” అని మహిమా చెప్పింది.

పెళ్లైన కొంతకాలానికే జ్యోతి భర్త ఆమె ప్రేమను మరచిపోయి, ఆమె తనపై చూపించిన నమ్మకాన్ని మరో విధంగా వమ్ము చేశాడు. ఆమెను శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. జ్యోతి ఇలా అంటోంది: “మొదటిసారి నన్ను గుద్దినప్పుడు, నేను నివ్వెరపోయాను, అవమానంతో కుమిలిపోయాను. అలా ఆయన నన్ను కొట్టిన ప్రతీసారి క్షమించమని అడిగేవాడు. ఎప్పుడూ ఇదే తంతు. ఎల్లప్పుడూ క్షమించి, మరచిపోవడమే క్రైస్తవురాలిగా నా బాధ్యత అని నేను అనుకునేదాన్ని. మా సమస్య గురించి ఇతరులకు చెప్పినా, చివరకు సంఘ పెద్దలకు చెప్పినా నా భర్తకు ద్రోహం చేసినట్లౌతుందేమో అని అనుకునేదాన్ని. ఆయన నన్ను కొడుతూ ఉండేవాడు, నేను ఆయనను క్షమిస్తూ ఉండేదాన్ని. అలా ఏళ్లు గడిచాయి. ఆ సమయంలో, నా భర్త నన్ను ప్రేమించాలంటే నేను చేయాల్సింది ఏదో ఉందని అనుకుంటూ వచ్చాను. చివరకు ఆయన నన్ను, మా కూతుర్ని విడిచిపెట్టి వెళ్లిపోయినప్పుడు నేను జీవితంలో ఓడిపోయాననుకున్నాను. మా బంధాన్ని కాపాడుకోవడానికి నేను ఇంకేదో చేసి ఉండాల్సిందని లేక ఇంకేదో మాట్లాడి ఉండాల్సిందని అనుకున్నాను.”

మహిమా, జ్యోతిలలాగే భర్త చేసిన నమ్మకద్రోహం వల్ల మీరు కూడా మానసికంగా కృంగిపోయి ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండవచ్చు, యెహోవాతో మీకున్న సంబంధం దెబ్బతిని ఉండవచ్చు. లేక మీ భార్య మీకు నమ్మకద్రోహం చేసినందువల్ల వేదనను, కష్టాలను అనుభవిస్తుండవచ్చు. నిస్సందేహంగా, బైబిలు చెబుతున్నట్లు మనం “అపాయకరమైన కా[లాల్లో]” జీవిస్తున్నాం. “అంత్యదినములలో” కుటుంబాల్లో ఉండాల్సిన ప్రేమానుబంధాలు ఉండవనీ చాలామంది అనురాగరహితులుగా తయారౌతారనీ ఆ ప్రవచనం చూపిస్తోంది. అంతేకాక కొంతమంది దేవుని సేవకులమని చెప్పుకున్నా, నిజానికి వారు దేవుణ్ణి సేవించరని కూడా అది చూపిస్తోంది. (2 తిమో. 3:1-5) అయితే, నిజ క్రైస్తవులకు సహితం అలాంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీ భర్త లేక భార్య చేసిన నమ్మకద్రోహాన్ని మీరెలా తట్టుకోవచ్చు?

యెహోవాకు మీమీదున్న అభిప్రాయాన్నే మీరూ కలిగివుండండి

మీరు ప్రేమించే వ్యక్తే మిమ్మల్ని అంతగా బాధపెడతారనే విషయాన్ని మీరు మొదట్లో జీర్ణించుకోలేకపోవచ్చు. అవతలి వ్యక్తి చేసిన పాపానికి కూడా మిమ్మల్ని మీరు నిందించుకుంటుండవచ్చు.

పరిపూర్ణ మానవుడైన యేసుకు కూడా నమ్మకద్రోహం జరిగింది. ఆయన ప్రేమించిన, నమ్మిన వ్యక్తే ఆయనకు ద్రోహం చేశాడని గుర్తుంచుకోండి. ప్రార్థనాపూర్వకంగా చాలా ఆలోచించిన తర్వాతే యేసు తన ప్రియ సహచరులను అంటే అపొస్తలులను ఎంపిక చేసుకున్నాడు. యేసు ఎంపిక చేసుకునే సమయానికి ఆ 12 మంది నమ్మకస్థులైన వ్యక్తులే. అందుకే, యూదా “ద్రోహి[గా]” మారినప్పుడు యేసు ఖచ్చితంగా ఎంతో దుఃఖపడి ఉంటాడు. (లూకా 6:12-16) అయితే, యూదా చేసిన దానికి యెహోవా యేసును బాధ్యునిగా ఎంచలేదు.

నిజానికి భార్యాభర్తలిద్దరూ అపరిపూర్ణులే కాబట్టి ఇద్దరూ తప్పులు చేస్తారు. అందుకే కీర్తనకర్త ఇలా రాశాడు: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” (కీర్త. 130:3) యెహోవా క్షమించినట్లే భార్యాభర్తలిద్దరూ ఒకరి అపరిపూర్ణతలను ఒకరు క్షమించుకోవడానికి సిద్ధంగా ఉండాలి.—1 పేతు. 4:8.

అయితే, “మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.” (రోమా. 14:11, 12) ఒకవేళ భార్య లేక భర్త ఎప్పుడూ తిడుతూ, కొడుతూ ఉన్నట్లయితే, తప్పు చేసిన వ్యక్తే యెహోవాకు జవాబు చెప్పాల్సివుంటుంది. యెహోవా హింసను, దూషణను ద్వేషిస్తాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా భాగస్వామితో ప్రేమ, గౌరవం లేకుండా వ్యవహరించకూడదు. (కీర్త. 11:5; ఎఫె. 5:33; కొలొ. 3:6-8) ఒక క్రైస్తవుడు/క్రైస్తవురాలు ఎలాంటి పశ్చాత్తాపం చూపించకుండా తరచూ కోపాన్ని వెళ్లగ్రక్కుతున్నట్లయితే అతనిని లేదా ఆమెను సంఘం నుండి వెలివేయాలి. (గల. 5:19-21; 2 యోహా. 9, 10) క్రైస్తవులకు తగని అలాంటి ప్రవర్తన గురించి సంఘ పెద్దలకు చెప్పి తప్పు చేశానని అనుకోకూడదు. వాస్తవానికి అలా నమ్మకద్రోహానికి గురైనవారి పట్ల యెహోవా కనికరం చూపిస్తాడు.

ఓ భార్య/భర్త వ్యభిచారానికి పాల్పడినప్పుడు, తమ భాగస్వామి విషయంలోనే కాక యెహోవా విషయంలో కూడా పాపం చేసినవారౌతారు. (మత్త. 19:4-9; హెబ్రీ. 13:4) తప్పు చేయని వ్యక్తి బైబిలు ప్రమాణాల ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అవతలి వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి బాధపడాల్సిన అవసరం లేదు.

మీరెలా భావిస్తున్నారో యెహోవాకు తెలుసు. ఆయన తనను తాను ఇశ్రాయేలు జనాంగానికి భర్తగా వర్ణించుకున్నాడు. ఆ ఇశ్రాయేలు జనాంగం ఆధ్యాత్మిక వ్యభిచారానికి పాల్పడినందువల్ల ఆయన ఎంత వేదనను అనుభవించాడో చూపించే వృత్తాంతాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. (యెష. 54:5, 6; యిర్మీ. 3:1, 6-10) ఒకవేళ మీ భాగస్వామి ఏదో విధంగా మీకు నమ్మకద్రోహం చేసినందువల్ల మీరు బాధపడుతున్నట్లయితే, మీరు పడే వేదన గురించి యెహోవాకు బాగా తెలుసనే అభయాన్ని కలిగివుండండి. (మలా. 2:13, 14) మీకు ఓదార్పు, ప్రోత్సాహం అవసరమనే విషయం ఆయనకు తెలుసు.

యెహోవా మిమ్మల్ని ఎలా ఓదారుస్తాడు?

యెహోవా తన ప్రజల్ని ఓదార్చడానికి ఉపయోగించే విధానాల్లో క్రైస్తవ సంఘం ఒకటి. జ్యోతికి అలాంటి సహాయమే అందింది. ఆమె ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది: “నేను మానసికంగా చాలా కృంగిపోయిన సమయంలోనే ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనం జరిగింది. నా భర్త విడాకుల కోసం కేసు దాఖలు చేసినందువల్ల నేను ఎంత కృంగిపోయానో ఆ పైవిచారణకర్తకు తెలుసు. ఆయన 1 కొరింథీయులు 7:15 వంటి లేఖనాలను ఉపయోగించి నాతో చర్చించేందుకు సమయం తీసుకున్నాడు. తప్పుచేశానన్న ఆలోచనను మనసులో నుండి తీసేసుకోవడానికి, కొంత మనశ్శాంతిని పొందడానికి బైబిలు లేఖనాలు, ఆయన చెప్పిన దయగల మాటలు నాకు సహాయం చేశాయి.” b

క్రైస్తవ సంఘం ద్వారా యెహోవా అవసరమైన సహాయం చేస్తాడని పైన ప్రస్తావించబడిన మహిమా కూడా తెలుసుకుంది. ఆమె ఇలా చెబుతోంది: “ఇక నా భర్త మారే అవకాశమే లేదని అర్థమైనప్పుడు నా ఇద్దరు అబ్బాయిలను తీసుకొని మరో ఊరికి వెళ్లిపోయాను. అక్కడ మాకు రెండు గదులున్న ఇల్లు అద్దెకు దొరికింది. బాధను దిగమింగుకుంటూ సామాన్లు సర్ధడం ఆరంభించాను. అప్పుడే ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. బహుశా పక్కింట్లో ఉంటున్న ఇంటి ఓనరేమో అనుకున్నాను. మా అమ్మతో బైబిలు అధ్యయనం చేసి మా కుటుంబం సత్యంలోకి రావడానికి సహాయం చేసిన సహోదరే మా ఇంటి తలుపుతట్టడం చూసి ఆశ్చర్యపోయాను. ఆమె నా కోసం రాలేదు కానీ మా ఇంటి ఓనరుతో బైబిలు అధ్యయనం చేయడానికి వచ్చింది. ఆమెను చూడగానే నా ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది. నేను దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. నా పరిస్థితి గురించి వివరిస్తూ ఏడ్చేశాను, ఆ సహోదరి కూడా నాతో ఏడ్చింది. వెంటనే ఆమె ఆ రోజు జరిగే కూటానికి మేము హాజరయ్యేలా ఏర్పాటు చేసింది. సంఘ సభ్యులు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు, నా కుటుంబ ఆధ్యాత్మిక అవసరాలను నేను తీర్చేలా సంఘ పెద్దలు నాకు కావాల్సిన సహాయం చేశారు.”

ఇతరులు ఎలా సహాయం చేయవచ్చు?

సంఘ సభ్యులు అనేక విధాలుగా కావాల్సిన సహాయాన్ని అందించవచ్చు. ఉదాహరణకు, మహిమా కొత్త ఊర్లో ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది కాబట్టి అవసరమైతే పిల్లలు స్కూలు నుండి వచ్చిన తర్వాత వారిని చూసుకుంటామని ఓ కుటుంబ సభ్యులు చెప్పారు.

“నాతో, నా పిల్లలతో కలిసి పరిచర్య చేస్తామని సహోదర సహోదరీలు ముందుకొచ్చినప్పుడు నాకు ఎంతో సంతోషమనిపిస్తుంది” అని మహిమా చెబుతోంది. అలా సంఘ సభ్యులు కావాల్సిన సహాయం అందించడం ద్వారా వారు ‘ఒకరి భారములను ఒకరు భరిస్తూ, క్రీస్తు నియమమును’ నెరవేరుస్తున్నారు.—గల. 6:2.

ఇతరులు చేసిన పాపం వల్ల కష్టాలను అనుభవిస్తున్నవారు అలాంటి సహాయాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతారు. మోనిక భర్త ఆమెను వదిలేశాడు. క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఆయన చేసిన 15,000 డాలర్ల (7,00,050 రూపాయల) అప్పు ఆమె మీద వచ్చిపడింది. అంతేకాదు ఒంటరిగా నలుగురు పిల్లలను పెంచే బాధ్యత ఆమెపై ఉంది. ఆమె ఇలా చెబుతోంది: “నా ఆధ్యాత్మిక సహోదర సహోదరీలు చాలా ప్రేమగలవారు. వారి సహాయం లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో అని నాకు అనిపిస్తుంటుంది. మంచి సహోదరత్వాన్ని యెహోవా నాకు ఇచ్చాడని అనిపిస్తుంది. నా పిల్లల కోసం వారు చేయగలిగినదంతా చేశారు. వారి సహాయంతో నా పిల్లలు ఇప్పుడు ఆధ్యాత్మికంగా పరిణతి సాధించడం చూసి నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఏ విషయంలోనైనా నాకు సలహా అవసరమైనప్పుడు సంఘ పెద్దలు సహాయం చేశారు. నేను ఏదైనా విషయం గురించి మాట్లాడాలనుకున్నప్పుడు వారు ఓపిగ్గా విన్నారు.”—మార్కు 10:29, 30.

అవతలి వ్యక్తికి ఎదురైన చేదు అనుభవం గురించి మాట్లాడడం ఎప్పుడు మంచిదికాదో ఓ నిజమైన స్నేహితుడు గ్రహిస్తాడు. (ప్రసం. 3:7) మహిమా ఇలా అంటోంది: “ఈ కొత్త సంఘంలో ఉన్న సహోదరీలతో నా సమస్య గురించి కాక ప్రకటనా పని గురించి, బైబిలు అధ్యయనాల గురించి, పిల్లల గురించి ఎప్పుడూ మాట్లాడుతుంటాను. గతాన్ని పక్కన పెట్టి నేను ఓ కొత్త జీవితాన్ని ఆరంభించేలా వారు నాకు సహాయం చేసినందుకు సంతోషిస్తున్నాను.”

పగ తీర్చుకోవాలనే ఆలోచనను రానివ్వకండి

కొన్నిసార్లు మీ భాగస్వామి పాపానికి ఏదో విధంగా మీరు కూడా బాధ్యులే అని భావించకపోవచ్చు కానీ, వారు చేసిన తప్పుల వల్ల మీరు కష్టాలు పడుతున్నారని వారిమీద కోపాన్ని పెంచుకునే అవకాశముంది. అయితే కోపాన్ని అలా పెంచుకుంటూ వెళ్తే యెహోవాకు యథార్థంగా ఉండాలన్న మీ కృతనిశ్చయాన్ని కోల్పోవచ్చు. ఉదాహరణకు నమ్మకద్రోహం చేసిన భాగస్వామిపై ఎలా పగతీర్చుకోవాలా అని మీరు చూస్తుండవచ్చు.

పగతీర్చుకోవాలన్న కోరిక మీలో పెరిగినట్లు మీకు అనిపిస్తే యెహోషువ కాలేబుల ఉదాహరణను గుర్తుతెచ్చుకోండి. ఈ నమ్మకమైన వ్యక్తులు వాగ్దాన దేశాన్ని వేగుచూడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వేగుచూడడానికి వెళ్లిన ఇతరులకు విశ్వాసం లేకపోవడంతో, వారు ప్రజలను యెహోవాకు అవిధేయులయ్యేలా చేశారు. యెహోవాపై నమ్మకముంచమని యెహోషువ కాలేబులు ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రోత్సహించినప్పుడు కొంతమంది వారిని రాళ్లతో కొట్టి చంపేద్దామనుకున్నారు. (సంఖ్యా. 13:25–14:10) తమ తప్పేమీ లేకపోయినా యెహోషువ కాలేబులు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరగాల్సి వచ్చింది.

దానివల్ల యెహోషువ కాలేబులు బాధపడివుండవచ్చు. అయినా తమ సహోదరులు పాపం చేశారని వారిపై పగను పెంచుకోలేదు. యెహోవా సేవకే వారు ప్రాముఖ్యతనిచ్చారు. అరణ్యంలో 40 సంవత్సరాలు సంచరించిన తర్వాత ఆశీర్వదించబడిన వారిలో లేవీయులేకాక యెహోషువ కాలేబులు కూడా ఉన్నారు. వారు తమ ప్రాణాలను దక్కించుకుని, వాగ్దాన దేశంలోకి ప్రవేశించగలిగారు.—సంఖ్యా. 14:28-30; యెహో. 14:6-12.

మీ భాగస్వామి చేసిన నమ్మకద్రోహం వల్ల మీరు కొంతకాలం పాటు బాధలను అనుభవించాల్సి రావచ్చు. మీకు విడాకులు అయిపోయినా మానసిక క్షోభ, ఆర్థిక ఇబ్బందులైతే ఉండవచ్చు. అయితే అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులకు అరణ్యంలో జరిగినదాన్ని పరిశీలిస్తే తన ప్రమాణాలను పట్టించుకోని వారితో ఎలా వ్యవహరించాలో యెహోవాకు బాగా తెలుసు అనే విషయం అర్థమౌతుంది. కాబట్టి దాన్ని గుర్తుంచుకొని కృంగదీసే ఆలోచనల్లో మునిగిపోకుండా ఉందాం.—హెబ్రీ. 10:30, 31; 13:4.

మీరు తట్టుకోగలరు!

చేదు అనుభవాల గురించి ఆలోచిస్తూ కృంగిపోయే బదులు యెహోవా ఆలోచనలతో మీ మనసులను నింపుకోండి. జ్యోతి ఇలా చెబుతోంది: “కావలికోట, తేజరిల్లు! పత్రికల రికార్డింగులు వినడం వల్ల నేను బాధను తట్టుకోగలిగాను. కూటాలు కూడా నాకు ఎంతో బలాన్నిచ్చాయి. కూటాల్లో చురుగ్గా భాగం వహించడం వల్ల సమస్యల గురించి ఆలోచించకుండా ఉండగలుగుతున్నాను. పరిచర్య కూడా నాకు సహాయం చేసింది. యెహోవాపై నమ్మకం పెంచుకునేలా ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆయనపై నాకున్న విశ్వాసం బలపడింది. బైబిలు విద్యార్థులపై శ్రద్ధ చూపించడం వల్ల ప్రాముఖ్యమైన విషయాలపై నా మనసు నిలపగలుగుతున్నాను.”

పైన ప్రస్తావించబడిన మోనిక ఇలా చెబుతోంది: “కూటాలకు క్రమంగా హాజరవడం వల్ల, వీలైనన్నిసార్లు పరిచర్యలో భాగం వహించడం వల్ల నేను నా బాధను తట్టుకోగలుగుతున్నాను. నేనూ నా పిల్లలూ ఒకరికొకరం మరింత దగ్గరయ్యాం, సంఘానికి కూడా దగ్గరయ్యాం. నేను పడిన కష్టాల వల్ల నా బలహీనతలేమిటో గుర్తించగలిగాను. పరీక్షలు ఎదురైనా యెహోవా సహాయంతో వాటిని తట్టుకోగలిగాను.”

మీరూ అలాంటి పరీక్షలను తట్టుకోవచ్చు. భాగస్వామి చేసిన నమ్మకద్రోహం వల్ల మీరు బాధను అనుభవిస్తున్నా, పౌలు ఇచ్చిన ఈ సలహాను పాటించడానికి కృషి చేయండి: “మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము.”—గల. 6:9.

[అధస్సూచీలు]

a కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

b వేరుగా ఉండడం గురించి, విడాకుల గురించి బైబిలు అభిప్రాయాన్ని మరింత తెలుసుకోవాలంటే ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ అనే పుస్తకంలో 142-148, 251-253 పేజీలు చూడండి.

[31వ పేజీలోని చిత్రం]

నమ్మకద్రోహానికి గురైనవారు, పరిచర్యలో తమకు సహాయం చేసినవారికి కృతజ్ఞులై ఉంటారు