కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంఘాన్ని బలపరుస్తూ ఉండండి

సంఘాన్ని బలపరుస్తూ ఉండండి

సంఘాన్ని బలపరుస్తూ ఉండండి

‘ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి.’—1 థెస్స. 5:11.

1. క్రైస్తవ సంఘంలో సభ్యులుగా ఉండడంవల్ల ఎలాంటి ఆశీర్వాదాలు అనుభవిస్తాం? అయినా, ఎలాంటి సమస్యలు ఎదురుకావచ్చు?

 క్రైస్తవ సంఘంలో సభ్యులుగా ఉండడం నిజంగా ఓ ఆశీర్వాదకరమైన విషయం. ఎందుకంటే, మీకు యెహోవాతో మంచి సంబంధం ఉంది. దేవుని వాక్యాన్ని మార్గనిర్దేశక పుస్తకంగా ఉపయోగిస్తున్నారు కాబట్టి క్రైస్తవులకు తగని విధంగా జీవించడం వల్ల వచ్చే చెడు ఫలితాలను తప్పించుకోగలుగుతున్నారు. మీ మంచిని కోరే నిజమైన స్నేహితులు మీకు ఉన్నారు. ఇలా ఎన్నో ఆశీర్వాదాలను మీరు అనుభవించవచ్చు. అయితే, చాలామంది క్రైస్తవులు ఏదో ఒక విధమైన సమస్యతో సతమతమౌతున్నారు. కొంతమందికి దేవుని వాక్యంలోని లోతైన విషయాలు అర్థం చేసుకోవడానికి సహాయం అవసరం కావచ్చు. మరికొంతమంది అనారోగ్యంతో బాధపడుతుండవచ్చు లేదా మానసికంగా కృంగిపోయి ఉండవచ్చు. ఇంకొంతమంది జీవితంలో తాము తీసుకున్న తప్పుడు నిర్ణయాలవల్ల కష్టాలు అనుభవిస్తుండవచ్చు. అదీగాక, మనమందరం భక్తిహీన లోకంలో జీవిస్తున్నాం.

2. మన సహోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి? ఎందుకు?

2 మన తోటి క్రైస్తవులు బాధలుపడడాన్ని గానీ కష్టాలు అనుభవించడాన్ని గానీ మనం చూడలేం. అపొస్తలుడైన పౌలు సంఘాన్ని శరీరంతో పోలుస్తూ, “ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును” అని అన్నాడు. (1 కొరిం. 12:12, 26) సహోదర సహోదరీలు కష్టాలను అనుభవిస్తున్నప్పుడు మనం వారికి సహాయం చేయడానికి కృషి చేయాలి. కష్టాలను అధిగమించేలా ఇతరులకు సహాయం చేసిన కొంతమంది సంఘ సభ్యుల ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ ఉదాహరణలు పరిశీలిస్తుండగా, వారిలాగే మీరు ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చో ఆలోచించండి. యెహోవాను సేవిస్తూ ఉండడానికి మీ సహోదరులకు మీరు ఎలా సహాయం చేయవచ్చు? అలా చేయడం ద్వారా మీరెలా సంఘాన్ని బలపర్చవచ్చు?

‘వారు ఆయనను చేర్చుకున్నారు’

3, 4. అకుల ప్రిస్కిల్లలు అపొల్లోకు ఎలా సహాయం చేశారు?

3 అపొల్లో ఎఫెసుకు వచ్చేనాటికే ఓ ఉత్సాహవంతుడైన సువార్తికుడు. ఆయన ‘ఆత్మయందు తీవ్రపడి, యోహాను బాప్తిస్మం మాత్రమే తెలిసికొనిన వాడైనను, యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి, బోధిస్తూ’ వచ్చాడని అపొస్తలుల కార్యముల పుస్తకం చెబుతోంది. ఆయనకు, “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములో” బాప్తిస్మం పొందడమంటే ఏమిటో తెలియదు. దీన్నిబట్టి, ఆయన సా.శ. 33 పెంతెకొస్తుకు ముందు బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యుల ద్వారానో, క్రీస్తు అనుచరుల ద్వారానో సువార్తను వినుంటాడని తెలుస్తోంది. అపొల్లో ఉత్సాహవంతుడైన సువార్తికుడే అయినా ఆయనకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియదు. తోటి విశ్వాసులతో సహవసించడం వల్ల ఆయనెలా ప్రయోజనం పొందాడు?—అపొ. 1:4, 5; 18:25; మత్త. 28:19.

4 అపొల్లో సమాజమందిరంలో ధైర్యంగా ప్రకటిస్తున్నాడని క్రైస్తవ దంపతులైన అకుల ప్రిస్కిల్లలు విని ఆయనను చేర్చుకుని, మరిన్ని విషయాలు బోధించారు. (అపొస్తలుల కార్యములు 18:24-26 చదవండి.) వారు ప్రేమతో ఆ పని చేశారు. తనను విమర్శించడానికి కాదుగానీ తనకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారు వచ్చారనే భావన అపొల్లోకు కలిగేలా అకుల ప్రిస్కిల్లలు నేర్పుతో ఆయనకు ప్రకటించివుంటారు. అపొల్లోకు తొలి క్రైస్తవ సంఘ చరిత్ర గురించి తెలియదు. ఈ విషయంలో ఆ కొత్త స్నేహితులు తనకిచ్చిన వివరాలను బట్టి అపొల్లో ఎంతో కృతజ్ఞత కనబరచివుంటాడు. ఆ వివరాలు తెలుసుకోవడం వల్ల అపొల్లో అకయలోని సహోదరులకు “చాల సహాయము” చేసి శక్తివంతమైన సాక్ష్యాన్ని ఇచ్చాడు.—అపొ. 18:27, 28.

5. వేలాదిమంది రాజ్య ప్రచారకులు ప్రేమతో ఎలాంటి సహాయాన్ని చేస్తున్నారు? దాని వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి?

5 క్రైస్తవ సంఘంలోని చాలామంది, బైబిలును అర్థం చేసుకునేందుకు తమకు సహాయం చేసిన వారిపట్ల ఎంతో కృతజ్ఞత కలిగివుంటారు. బోధకులకు, విద్యార్థులకు మధ్య చిరకాల స్నేహాలు ఏర్పడ్డాయి. చాలా సందర్భాల్లో, ప్రచారకులు ప్రజలకు సత్యాన్ని నేర్పించడానికి ఎన్నో నెలలపాటు క్రమం తప్పకుండా వారితో అధ్యయనం చేయాల్సిరావచ్చు. అయితే అది జీవన్మరణాలకు సంబంధించిన విషయమని రాజ్య ప్రచారకులకు తెలుసు కాబట్టి వారు ఇష్టపూర్వకంగా ఆ త్యాగాన్ని చేస్తున్నారు. (యోహా. 17:3) ప్రజలు సత్యాన్ని గ్రహించి దాన్ని తమ జీవితంలో పాటిస్తూ, తమ జీవితాలను యెహోవా ఇష్టాన్ని నెరవేర్చేందుకు ఉపయోగించడాన్ని చూసినప్పుడు మనం ఎంత సంతోషిస్తాం!

‘అతడు మంచి పేరు పొందినవాడు’

6, 7. (ఎ) పౌలు తన ప్రయాణ సహచరునిగా ఉండేందుకు తిమోతిని ఎందుకు ఎంచుకున్నాడు? (బి) తనకు అందిన సహాయం వల్ల తిమోతి ఎలాంటి ప్రగతి సాధించాడు?

6 అపొస్తలులైన పౌలు సీలలు తమ రెండవ మిషనరీ యాత్రలో లుస్త్రకు వెళ్లినప్పుడు అక్కడ తిమోతి అనే యువకుణ్ణి చూశారు. అప్పుడు తిమోతికి దాదాపు 20 ఏళ్లు ఉండివుంటాయి. “అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొందినవాడు.” తిమోతి వాళ్లమ్మ యునీకే, అవ్వ లోయి సమర్పిత క్రైస్తవులే కానీ, వాళ్ల నాన్న అవిశ్వాసి. (2 తిమో. 1:3-5) దాదాపు రెండేళ్ల క్రితం మొదటిసారి ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు పౌలుకు ఈ కుటుంబంతో పరిచయం ఏర్పడివుంటుంది. కానీ ఈసారి పౌలు తిమోతిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. ఎందుకంటే తిమోతి అసాధారణ సామర్థ్యమున్న యువకుడిగా కనిపించాడు. కాబట్టి, స్థానిక పెద్దల సభ ఆమోదంతో తిమోతి మిషనరీ యాత్రలో పౌలుకు సహాయకుడయ్యాడు.—అపొస్తలుల కార్యములు 16:1-3 చదవండి.

7 వయసులో పెద్దవాడైన స్నేహితుడి నుండి తిమోతి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సివుంది, ఆయన నేర్చుకున్నాడు కూడా. ఆయన ఎంతగా ప్రగతి సాధించాడంటే కొంతకాలానికి పౌలు ఆయన మీద పూర్తి నమ్మకంతో ఆయనను సంఘాలను సందర్శించడానికి తన ప్రతినిధిగా పంపించాడు. తిమోతి అనుభవంలేనివాడే కాక బహుశా బిడియస్థుడు కూడా. అలాంటిది, ఆయన దాదాపు 15 ఏళ్లు పౌలుతో సహవసించడం వల్ల ఓ చక్కని పైవిచారణకర్తగా ఎదిగాడు.—ఫిలి. 2:19-22; 1 తిమో. 1:3.

8, 9. యువతీయువకులను ప్రోత్సహించడానికి సంఘ సభ్యులు ఏమి చేయవచ్చు? ఓ ఉదాహరణ చెప్పండి.

8 నేడు క్రైస్తవ సంఘాల్లోవున్న చాలామంది యువతీయువకులకు గొప్ప సామర్థ్యాలున్నాయి. యెహోవా సేవలో మంచి మాదిరిగా ఉన్న వ్యక్తులు వారిని ప్రోత్సహించి వారిపై శ్రద్ధ చూపిస్తే వారు ప్రగతి సాధించేందుకు కృషి చేసి యెహోవా ప్రజల మధ్య పెద్దపెద్ద బాధ్యతల్ని స్వీకరించవచ్చు. సంఘంలో మీ చుట్టూ ఉన్నవారిని ఒకసారి చూడండి. తిమోతిలాగే యెహోవా సేవలో తమను తాము అందుబాటులో ఉంచుకోగల యువతీయువకులు ఎవరైనా మీకు కనిపిస్తున్నారా? మీ సహాయంతో, ప్రోత్సాహంతో వారు పయినీర్లుగా, బెతెల్‌ సభ్యులుగా, మిషనరీలుగా లేదా ప్రయాణ పైవిచారణకర్తలుగా ప్రగతి సాధించవచ్చు. అలాంటి లక్ష్యాలను సాధించేందుకు కృషి చేసేలా వారికి మీరు ఎలా సహాయం చేయవచ్చు?

9 గత 20 ఏళ్లుగా బెతెల్‌లో సేవ చేస్తున్న మార్టెన్‌ అనుభవాన్ని పరిశీలించండి. 30 ఏళ్ల క్రితం పరిచర్యలో తనతో పనిచేస్తున్నప్పుడు ఓ ప్రయాణ పైవిచారణకర్త చూపించిన శ్రద్ధను మార్టెన్‌ కృతజ్ఞతతో గుర్తుచేసుకుంటున్నాడు. ఆ ప్రయాణ పైవిచారణకర్త తాను యువకునిగా ఉన్నప్పుడు చేసిన బెతెల్‌ సేవ గురించి ఎంతో ఉత్సాహంగా నాతో మాట్లాడాడు. యెహోవా సంస్థలో సేవ చేసేందుకు అందుబాటులో ఉండే అవకాశం గురించి ఆలోచించమని ఆయన మార్టెన్‌ను ప్రోత్సహించాడు. ఎప్పటికీ గుర్తుండిపోయే ఆ మాటలు, ఆ తర్వాత తాను తీసుకున్న నిర్ణయాలను ఎంతగానో ప్రభావితం చేశాయని ఆయన భావిస్తున్నాడు. ఆధ్యాత్మిక లక్ష్యాల గురించి మీ యువ స్నేహితులతో మాట్లాడడంవల్ల మీరు వారికి ఎలాంటి మేలు చేయగలరో ఎవరికి తెలుసు?

“ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి”

10. ఎపఫ్రొదితు ఎలా భావించాడు? ఎందుకు?

10 పౌలు తన విశ్వాసాన్ని బట్టి చెరసాలలో వేయబడినప్పుడు ఎపఫ్రొదితు ఆయనను కలవడానికి ఫిలిప్పీ నుండి రోముకు వెళ్లాడు. అలా వెళ్లడానికి ఆయన ఎంతో కష్టమైన సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆయన అక్కడికి ఫిలిప్పీయుల ప్రతినిధిగా వెళ్లాడు. ఆయన వారిచ్చిన బహుమానాన్ని తీసుకువెళ్లాడు. అంతేకాక, ఆ కష్టకాలంలో పౌలుతో ఉంటూ ఆయనకు కావాల్సిన సహాయం చేయాలనుకున్నాడు. అయితే, రోములో ఉన్నప్పుడు ఎపఫ్రొదితు ‘చనిపోయేంతగా’ అనారోగ్యం పాలయ్యాడు. తనకు అప్పగించబడిన పని చేయలేకపోయినందుకు ఎపఫ్రొదితు కృంగిపోయాడు.—ఫిలి. 2:25-27.

11. (ఎ) సంఘంలో ఎవరైనా కృంగిపోతే మనం ఎందుకు ఆశ్చర్యపోకూడదు? (బి) ఎపఫ్రొదితు విషయంలో ఏమి చేయమని పౌలు చెప్పాడు?

11 వివిధ రకాల ఒత్తిళ్ల వల్ల ప్రజలు మానసిక కృంగుదలకు గురౌతున్నారు. ప్రతీ ఐదుగురిలో ఒక్కరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో కృంగుదలతో బాధపడే అవకాశం ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చూపిస్తున్నాయి. యెహోవా ప్రజలు కూడా కృంగుదలకు లోనౌతున్నారు. కుటుంబాన్ని పోషించడం, అనారోగ్యం, జీవితంలో ఎదురైన వైఫల్యాల వల్ల కలిగిన నిరుత్సాహం లేదా మరితర విషయాలు ఒక వ్యక్తిని కృంగదీయవచ్చు. అయితే, ఎపఫ్రొదితు విషయంలో ఫిలిప్పీయులు ఏమి చేయాల్సివుంది? పౌలు ఇలా రాశాడు: “నా యెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తుయొక్క పనినిమిత్తము చావునకు సిద్ధమైయుండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి.”—ఫిలి. 2:29, 30.

12. కృంగిపోయినవారిని మనం ఎలా బలపర్చవచ్చు?

12 నిరుత్సాహపడిన లేదా కృంగిపోయిన సహోదరులను మనం కూడా ప్రోత్సహించాలి. యెహోవా సేవలో వారు ఎన్నో మంచి పనులు చేసివుంటారు, వాటి గురించి వారితో మాట్లాడవచ్చు. క్రైస్తవులు కావడానికి లేదా పూర్తికాల సేవ చేయడానికి వారు తమ జీవితంలో పెద్దపెద్ద మార్పులు చేసుకొని ఉండవచ్చు. వారు చేస్తున్న కృషిని మనం విలువైనదిగా ఎంచుతున్నామనీ, యెహోవా కూడా అలాగే పరిగణిస్తున్నాడనీ వారికి అభయమివ్వవచ్చు. వయసు పైబడడం వల్ల లేదా అనారోగ్యం వల్ల కొంతమంది ఒకప్పుడు చేసినంత ఇప్పుడు చేయలేకపోతుండవచ్చు. అయినా, ఎన్నో ఏళ్లపాటు చేసిన సేవనుబట్టి వారు మన గౌరవానికి అర్హులు. ఏదేమైనా, తన నమ్మకమైన సేవకులకు యెహోవా ఇలా చెబుతున్నాడు: “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి.”—1 థెస్స. 5:14.

అతణ్ణి ‘క్షమించి ఆదరించండి’

13, 14. (ఎ) కొరింథు సంఘం ఎలాంటి కఠిన చర్య తీసుకుంది? ఎందుకు? (బి) ఆ చర్య తీసుకోవడం వల్ల ఏ ఫలితాలు వచ్చాయి?

13 మొదటి శతాబ్దపు కొరింథు సంఘంలో ఒక వ్యక్తి, ఎలాంటి పశ్చాత్తాపం చూపించకుండా జారత్వానికి పాల్పడుతూ వచ్చాడు. అతని ప్రవర్తన సంఘ పవిత్రతకు మచ్చ తెచ్చింది. అదీగాక అవిశ్వాసులు కూడా అతడు చేసిన పనిని బట్టి విభ్రాంతి చెందారు. అందుకే, అతణ్ణి సంఘం నుండి బహిష్కరించమని పౌలు నిర్దేశించాడు.—1 కొరిం. 5:1, 7, 11-13.

14 ఆ క్రమశిక్షణ వల్ల మంచి ఫలితాలే వచ్చాయి. సంఘం చెడు ప్రభావం నుండి కాపాడబడింది. అంతేకాదు, ఆ వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకొని నిజమైన పశ్చాత్తాపాన్ని చూపించాడు. అతడు పశ్చాత్తాపానికి తగిన క్రియలు చూపించాడు కాబట్టి ఆయనను సంఘంలోకి తిరిగి చేర్చుకోమని పౌలు తన రెండవ పత్రికలో సూచించాడు. అయితే అలా తిరిగి చేర్చుకుంటే సరిపోదు. పశ్చాత్తాపపడిన పాపిని “క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును” అని కూడా పౌలు ఆ సంఘపు వారికి సూచించాడు.—2 కొరింథీయులు 2:5-8 చదవండి.

15. పశ్చాత్తాపం చూపించడంవల్ల సంఘంలోకి తిరిగి చేర్చుకోబడిన తప్పిదస్థులను మనమెలా దృష్టించాలి?

15 ఆ వృత్తాంతం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఒక వ్యక్తి సంఘం నుండి బహిష్కరించబడినప్పుడు మనం బాధపడతాం. వారు దేవుని నామానికి అపకీర్తి తీసుకొచ్చి సంఘానికి చెడ్డపేరు తెచ్చివుంటారు. వారు మన విషయంలో కూడా పాపం చేసివుండవచ్చు. అయితే ఆ కేసును పరిశీలించడానికి నియమించబడిన పెద్దలు యెహోవా నిర్దేశానికి తగినట్లుగా, పశ్చాత్తాపపడిన వ్యక్తిని సంఘంలోకి తిరిగి తీసుకోవాలని నిర్ణయిస్తే, ఆ వ్యక్తిని యెహోవా క్షమించాడని అర్థం. (మత్త. 18:17-20) ఈ విషయంలో మనం యెహోవాను అనుకరించడానికి ప్రయత్నించవద్దా? ఒకవేళ మనం కఠినంగా వ్యవహరిస్తూ అతణ్ణి క్షమించకపోతే అది యెహోవాను వ్యతిరేకించడంతో సమానమౌతుంది. సంఘంలో శాంతి ఐక్యతలకు తోడ్పడాలన్నా, యెహోవా ఆమోదం పొందాలన్నా నిజమైన పశ్చాత్తాపం చూపించడంవల్ల సంఘంలోకి తిరిగి చేర్చుకోబడిన తప్పిదస్థుల పట్ల మనం మన ‘ప్రేమను స్థిరపరచాలి.’—మత్త. 6:14, 15; లూకా 15:7.

“నాకు ప్రయోజనకరమైనవాడు”

16. మార్కును బట్టి పౌలు ఎందుకు నిరాశ చెందాడు?

16 మనల్ని నిరాశపరిచిన వారి పట్ల చెడు భావాలను పెంచి పోషించుకోకూడదని మరో లేఖన వృత్తాంతం చూపిస్తోంది. ఉదాహరణకు, మార్కు అనే మారుపేరుగల యోహాను పౌలును ఎంతో నిరాశపరిచాడు. ఎలా? పౌలు బర్నబాలు తమ మొదటి మిషనరీ యాత్రను ప్రారంభించినప్పుడు, వారికి సహాయం చేయడానికి మార్కు వారితోపాటు వెళ్లాడు. కానీ, తమ యాత్రలో ఒకానొక సమయంలో ఏదో కారణాన్నిబట్టి మార్కు వారిని విడిచిపెట్టి ఇంటికి వెళ్లిపోయాడు. దానికి పౌలు ఎంతో నిరాశపడ్డాడు. అందుకే, రెండవ మిషనరీ యాత్రకు సంబంధించి ప్రణాళిక వేసుకుంటున్నప్పుడు మార్కును వెంటబెట్టుకొని వెళ్లాలా వద్దా అనే విషయంపై బర్నబాతో ఆయనకు భేదాభిప్రాయాలు వచ్చాయి. మొదటి యాత్రలో జరిగిన దాన్నిబట్టి, మార్కును తమతో తీసుకువెళ్లడానికి పౌలు ఇష్టపడలేదు.—అపొస్తలుల కార్యములు 13:1-5, 13; 15:37, 38 చదవండి.

17, 18. పౌలు మార్కుల మధ్య వచ్చిన మనస్పర్థలు సమసిపోయాయని మనకు ఎలా తెలుసు? దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

17 పౌలు తనను తిరస్కరించినందుకు మార్కు అతిగా నిరుత్సాహపడలేదని తెలుస్తోంది. ఎందుకంటే, ఆ తర్వాత మార్కు బర్నబాతో కలిసి వేరే ప్రాంతంలో మిషనరీ పనిని కొనసాగించాడు. (అపొ. 15:39) పౌలు కొన్ని సంవత్సరాల తర్వాత మార్కు గురించి రాసిన మాటలనుబట్టి ఆయన నమ్మకంగా సేవచేశాడని తెలుస్తోంది. పౌలు రోములో ఖైదీగా ఉన్నప్పుడు ఓ పత్రిక రాసి తిమోతిని పిలిపించాడు. అదే పత్రికలో, “మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు” అని రాశాడు. (2 తిమో. 4:11) అవును, మార్కు ఎంతో ప్రగతి సాధించాడని పౌలు నమ్మాడు.

18 దీని నుండి మనం ఓ పాఠం నేర్చుకోవచ్చు. మార్కు ఓ మంచి మిషనరీకి ఉండాల్సిన లక్షణాలను పెంపొందించుకున్నాడు. పౌలు తనను తిరస్కరించినందుకు మార్కు బాధపడి వెనకడుగువేయలేదు. పౌలు, మార్కులిద్దరూ ఆధ్యాత్మిక వ్యక్తులు కాబట్టి వారి మధ్య ఏర్పడిన మనస్పర్థలు ఎంతోకాలం కొనసాగలేదు. పౌలు ఆ తర్వాత మార్కును ఎంతో ప్రయోజనకరమైన పరిచారకుడిగా పరిగణించాడు. సహోదరులు కష్టాలను, సమస్యలను అధిగమించిన తర్వాత మనం గతాన్ని మరచిపోయి ముందుకెళ్తూ ఆధ్యాత్మిక ప్రగతిసాధించేలా ఇతరులకు సహాయం చేస్తూవుండడం మంచిది. ఇతరుల్లో ఉన్న మంచి లక్షణాలను గుర్తించినప్పుడు మనం సంఘాన్ని బలపర్చగలుగుతాం.

సంఘం, మీరు

19. క్రైస్తవ సంఘంలోని సభ్యులందరూ ఒకరికొకరు ఎలాంటి సహాయం చేసుకోవచ్చు?

19 ఈ ‘అపాయకరమైన కాలాల్లో’ సహోదర సహోదరీల సహాయం మీకు అవసరం. అలాగే మీ సహాయం వారికి అవసరం. (2 తిమో. 3:1) వివిధ పరిస్థితుల్లో సమర్థంగా ఎలా వ్యవహరించాలో క్రైస్తవులకు అన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు కానీ, యెహోవాకు తెలుసు. సరైన మార్గంలో వెళ్లేందుకు ఇతరులకు సహాయం చేసేలా యెహోవా సంఘంలోని వేర్వేరు వ్యక్తుల్నేకాక మిమ్మల్ని కూడా ఉపయోగించవచ్చు. (యెష. 30:20, 21; 32:1, 2) కాబట్టి, పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని మీ జీవితంలో పాటించండి. “మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి” కలుగజేస్తూ ఉండండి.—1 థెస్స. 5:11.

మీరెలా జవాబిస్తారు?

• క్రైస్తవ సంఘంలో ఒకరినొకరు ఎందుకు బలపర్చుకోవాలి?

• ఎలాంటి సమస్యల్ని అధిగమించడానికి మీరు ఇతరులకు సహాయం చేయవచ్చు?

• మనకు సంఘంలోని ఇతరుల సహాయం ఎందుకు అవసరం?

[అధ్యయన ప్రశ్నలు]

[11వ పేజీలోని చిత్రం]

తోటి క్రైస్తవులు ఓ కష్టమైన సమస్యతో సతమతమౌతున్నప్పుడు మనం వారికి సహాయం చేయవచ్చు

[12వ పేజీలోని చిత్రం]

నేడు క్రైస్తవ సంఘాల్లోవున్న చాలామంది యువతీయువకులకు గొప్ప సామర్థ్యాలున్నాయి