కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఆత్మ దేవుని మర్మములను పరిశోధిస్తోంది’

‘ఆత్మ దేవుని మర్మములను పరిశోధిస్తోంది’

‘ఆత్మ దేవుని మర్మములను పరిశోధిస్తోంది’

‘ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధిస్తోంది.’—1 కొరిం. 2:10.

1. పరిశుద్ధాత్మ ఏమి చేస్తుందని పౌలు 1 కొరింథీయులు 2:10లో చెప్పాడు? మన మనసులో ఏ ప్రశ్నలు వస్తాయి?

 పరిశుద్ధాత్మ పనిచేస్తున్నందుకు యెహోవాకు మనం ఎంత రుణపడివున్నాం! పరిశుద్ధాత్మ ఆదరణకర్త అని, ఒక వరమని, సాక్షియని, మన కోసం విజ్ఞాపన చేస్తుందని లేఖనాలు చెబుతున్నాయి. (యోహా. 14:16; అపొ. 2:38; రోమా. 8:16, 26, 27) పరిశుద్ధాత్మ మరో ప్రాముఖ్యమైన పని కూడా చేస్తుందని అపొస్తలుడైన పౌలు ఈ మాటల ద్వారా సూచించాడు: ‘ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధిస్తోంది.’ (1 కొరిం. 2:10) లోతైన ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడిచేయడానికి యెహోవా తన పరిశుద్ధాత్మను ఉపయోగిస్తాడు. ఈ సహాయమే లేకపోతే ఆయన సంకల్పాల గురించి మనకేమైనా తెలిసేదా? (1 కొరింథీయులు 2:9-12 చదవండి.) అయితే, మనకు ఇలాంటి ప్రశ్నలు రావచ్చు: ‘పరిశుద్ధాత్మ’ ఎలా ‘దేవుని మర్మాలను పరిశోధిస్తుంది?’ సా.శ. మొదటి శతాబ్దంలో యెహోవా ఎవరి ద్వారా ఈ మర్మాలను తెలియజేశాడు? మనకాలంలో దేవుని మర్మాలను పరిశుద్ధాత్మ ఎవరి ద్వారా, ఎలా పరిశోధిస్తోంది?

2. ఏ రెండు విధాలుగా పరిశుద్ధాత్మ పనిచేస్తుంది?

2 పరిశుద్ధాత్మ రెండు విధాలుగా పనిచేస్తుందని యేసు చెప్పాడు. తాను చనిపోయే ముందు ఆయన తన అపొస్తలులతో ఇలా అన్నాడు: “ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.” (యోహా. 14:26) దీన్నిబట్టి పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుందని, నేర్చుకున్న విషయాలను జ్ఞాపకం చేస్తుందని చెప్పవచ్చు. ఇంతకుముందు అర్థంకాని విషయాలను ఇప్పుడు అర్థం చేసుకోవడానికి క్రైస్తవులకు సహాయం చేయడం ద్వారా అది బోధిస్తుంది. వివరించబడిన విషయాలను జ్ఞాపకం చేసుకొని, సరైన విధంగా అన్వయించుకునేందుకు సహాయం చేయడం ద్వారా అది మనకు గుర్తుచేస్తుంది.

మొదటి శతాబ్దంలో

3. పరిశుద్ధాత్మ ద్వారా క్రమక్రమంగా ఆధ్యాత్మిక మర్మాలు వెల్లడిచేయబడతాయని యేసు చెప్పిన ఏ మాటలు సూచించాయి?

3 యేసు తన శిష్యులకు ఎన్నో కొత్త సత్యాలను బోధించాడు. అయితే వారు నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అందుకే, యేసు తన అపొస్తలులతో ఇలా అన్నాడు: “నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును.” (యోహా. 16:12, 13) పరిశుద్ధాత్మ ద్వారా క్రమక్రమంగా ఆధ్యాత్మిక మర్మాలు వెల్లడిచేయబడతాయని ఆ మాటల్లో యేసు సూచించాడు.

4. సా.శ. 33 పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ ఎలా బోధించింది, ఎలా జ్ఞాపకం చేసింది?

4 సా.శ. 33 పెంతెకొస్తు రోజున “సత్యస్వరూపియైన ఆత్మ” యెరూషలేములో సమకూడిన 120 మంది క్రైస్తవులమీద కుమ్మరించబడింది. ఆ రోజు ప్రజలు పరిశుద్ధాత్మ పనిచేయడాన్ని కళ్లారా చూశారు, చెవులారా విన్నారు. (అపొ. 1:4, 5, 15; 2:1-4) “దేవుని గొప్పకార్యముల” గురించి శిష్యులు వివిధ భాషల్లో వివరించారు. (అపొ. 2:5-11) ఏదో కొత్త విషయం బయలుపర్చబడాల్సిన రోజు అది. పరిశుద్ధాత్మ ఇలా కుమ్మరించబడడం గురించి యోవేలు ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. (యోవే. 2:28-32) అక్కడ సమకూడిన వారంతా ఎవ్వరూ ఊహించని రీతిలో ప్రవచనం నెరవేరడాన్ని చూశారు. ఆ రోజు జరిగిన సంఘటన గురించి వివరించడానికి అపొస్తలుడైన పేతురు చొరవతీసుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 2:14-18 చదవండి.) శిష్యులు చవిచూసింది ఆ ప్రాచీన ప్రవచన నెరవేర్పని పేతురు అర్థం చేసుకునేందుకు సహాయం చేయడం ద్వారా పరిశుద్ధాత్మ బోధించింది. పరిశుద్ధాత్మ పేతురుకు అనేక విషయాలను జ్ఞాపకం చేసిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన యోవేలు ప్రవచనాన్నే కాకుండా, దావీదు రాసిన రెండు కీర్తనలను కూడా ఉల్లేఖించాడు. (కీర్త. 16:8-11; 110:1; అపొ. 2:25-28, 34, 35) ఆ రోజు యెరూషలేములో సమావేశమైనవారు నిజంగా దేవుని మర్మాలను చూశారు, విన్నారు.

5, 6. (ఎ) సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత కొత్త నిబంధన గురించి ఏ ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు అవసరమయ్యాయి? (బి) ఎవరు ఈ విషయాలను చర్చకు తీసుకువచ్చారు? నిర్ణయాలు ఎలా తీసుకోబడ్డాయి?

5 మొదటి శతాబ్దపు క్రైస్తవులకు అర్థంకాని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు, పెంతెకొస్తు రోజు నుండి అమలులోకి వచ్చిన కొత్త నిబంధన గురించి వారి మనసుల్లో ప్రశ్నలు మెదిలాయి. ఆ కొత్త నిబంధన యూదులకు, యూదా మతప్రవిష్టులకు మాత్రమే పరిమితమా? అన్యులు కూడా ఆ నిబంధనలోకి వచ్చి పరిశుద్ధాత్మతో అభిషేకించబడే అవకాశముందా? (అపొ. 10:45) ఈ నిబంధనలోకి రావాలంటే అన్యుల్లో నుండి వచ్చిన పురుషులు మొదట సున్నతి పొంది, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరముందా? (అపొ. 15:1, 5) అవి చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. ఈ మర్మాలను పరిశోధించడానికి యెహోవా ఆత్మ సహాయం అవసరమైంది. అయితే, అది ఎవరి ద్వారా పనిచేసింది?

6 జవాబులు అవసరమైన అలాంటి విషయాలను బాధ్యతగల సహోదరులు చర్చకు తీసుకొచ్చారు. పరిపాలక సభ కూటంలో పేతురు, పౌలు, బర్నబాలు సున్నతి పొందని అన్యులతో యెహోవా ఎలా వ్యవహరిస్తున్నాడో వివరించారు. (అపొ. 15:7-12) ఆ సహోదరులు అందించిన రుజువులను, హెబ్రీ లేఖనాలను పరిశీలించిన తర్వాత పరిశుద్ధాత్మ సహాయంతో పరిపాలక సభ ఓ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వారు ఆ నిర్ణయాన్ని పత్రికల ద్వారా సంఘాలకు తెలియజేశారు.—అపొస్తలుల కార్యములు 15:25-30; 16:4, 5 చదవండి; ఎఫె. 3:5, 6.

7. దేని ద్వారా లోతైన సత్యాలు బయలుపరచబడ్డాయి?

7 యోహాను, పేతురు, యాకోబు, పౌలు రాసిన ప్రేరేపిత పత్రికల ద్వారా మరిన్ని విషయాలు స్పష్టం చేయబడ్డాయి. క్రైస్తవ లేఖనాలు రాయడం పూర్తైన తర్వాత ఒకానొక సమయంలో ప్రవచించే, అద్భుతరీతిలో జ్ఞానాన్ని బయలుపర్చే వరాలు నిలిచిపోయాయి. (1 కొరిం. 13:8) ఆ తర్వాత కూడా పరిశుద్ధాత్మ బోధిస్తుందా, విషయాలను జ్ఞాపకం చేస్తుందా? దేవుని మర్మాలను పరిశోధించడానికి క్రైస్తవులకు అది సహాయం చేస్తుందా? సహాయం చేస్తుందని ప్రవచనాలు సూచించాయి.

అంత్యకాలంలో

8, 9. అంత్యకాలంలో ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో ఎవరు ‘ప్రకాశిస్తారు’?

8 అంత్యకాలం గురించి మాట్లాడుతూ ఓ దేవదూత ఇలా ప్రవచించాడు: “బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు . . . తెలివి అధికమగును.” (దాని. 12:3, 4) ఈ బుద్ధిమంతులు లేదా పరిజ్ఞానంగలవారు ఎవరు? ఎవరు ప్రకాశిస్తారు? గోధుమలు, గురుగుల ఉపమానంలో వారెవరో యేసు సూచించాడు. “యుగసమాప్తి” గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అన్నాడు: “అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు.” (మత్త. 13:39, 43) యేసు ఆ “నీతిమంతులు” ‘రాజ్య కుమారులని’ లేదా అభిషిక్త క్రైస్తవులని వివరించాడు.—మత్త. 13:38, అధస్సూచి.

9 అభిషిక్త క్రైస్తవులందరూ ‘ప్రకాశిస్తారా?’ ఒకవిధంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే క్రైస్తవులందరూ ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో భాగం వహిస్తారు, కూటాలప్పుడు ఒకొరినొకరు బలపర్చుకుంటారు. ఈ విషయంలో అభిషిక్తులు మాదిరిగా ఉంటారు. (జెక. 8:23) అయితే అవే కాక, అంత్యదినాల్లో మర్మాలు కూడా బయలుపరచబడాల్సివుంది. దానియేలు ప్రవచనం అంత్యకాలం వరకు ‘ముద్రించబడింది.’ (దాని. 12:9) పరిశుద్ధాత్మ ఎలా, ఎవరి ద్వారా మర్మాలను పరిశోధిస్తుంది?

10. (ఎ) అంత్యదినాల్లో లోతైన సత్యాలను పరిశుద్ధాత్మ ఎవరి ద్వారా బయలుపరుస్తోంది? (బి) యెహోవా గొప్ప ఆధ్యాత్మిక ఆలయానికి సంబంధించిన సత్యాలు ఎలా స్పష్టం చేయబడ్డాయి?

10 మన కాలంలో ఏదైనా ఆధ్యాత్మిక విషయాన్ని స్పష్టం చేయాల్సి వచ్చినప్పుడు, ప్రపంచ ప్రధాన కార్యాలయంలో ఉన్న “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన” దాసుని తరగతికి ప్రాతినిధ్యం వహించే పరిపాలక సభకు పరిశుద్ధాత్మ సహాయం చేస్తుంది. ఆ సహాయంతో వారు గతంలో అర్థంకాని లోతైన సత్యాలను అర్థం చేసుకోగలుగుతారు. (మత్త. 24:45; 1 కొరిం. 2:13) కొత్త వివరణను పరిపాలక సభ సభ్యులందరూ కలిసి పరిశీలిస్తారు. (అపొ. 15:6) ఆ తర్వాత తాము తెలుసుకున్నవి, అందరి ప్రయోజనం కోసం ప్రచురిస్తారు. (మత్త. 10:27) కాలం గడుస్తుండగా మరికొన్ని విషయాలు స్పష్టం చేయాల్సిరావచ్చు. వాటిని కూడా వారు నిజాయితీగా వివరిస్తారు.—“ఆధ్యాత్మిక ఆలయానికి సంబంధించిన వివరణను పరిశుద్ధాత్మ ఎలా బయలుపరచింది?” అనే బాక్సు చూడండి.

పరిశుద్ధాత్మ నేడు పోషిస్తున్న పాత్ర నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు?

11. దేవుని మర్మాలను బయలుపరిచే విషయంలో పరిశుద్ధాత్మ పోషిస్తున్న పాత్ర నుండి క్రైస్తవులందరూ ఎలా ప్రయోజనం పొందుతున్నారు?

11 దేవుని మర్మాలను బయలుపరిచే విషయంలో పరిశుద్ధాత్మ పోషిస్తున్న పాత్ర నుండి నమ్మకమైన క్రైస్తవులందరూ ప్రయోజనం పొందుతున్నారు. మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లాగే మనం కూడా అధ్యయనం చేస్తాం. ఆ తర్వాత, పరిశుద్ధాత్మ సహాయంతో అర్థం చేసుకున్న విషయాలను గుర్తుచేసుకొని మన జీవితంలో అన్వయించుకుంటాం. (లూకా 12:11, 12) ప్రచురించబడిన లోతైన ఆధ్యాత్మిక సత్యాలను అర్థంచేసుకోవడానికి మనం పెద్దపెద్ద చదువులు చదవాల్సిన అవసరంలేదు. (అపొ. 4:13) అయితే, దేవుని మర్మాలపట్ల మనకున్న అవగాహనను ఎలా పెంచుకుంటూ ఉండవచ్చు? కొన్ని సలహాలను మనమిప్పుడు పరిశీలిద్దాం.

12. మనం పరిశుద్ధాత్మ కోసం ఎప్పుడు ప్రార్థించాలి?

12 పరిశుద్ధాత్మ సహాయం కోసం ప్రార్థించండి. ఏదైనా లేఖన సమాచారం చదివే ముందు మనం పరిశుద్ధాత్మ నడిపింపు కోసం ప్రార్థించాలి. మనం ఒంటరిగా ఉన్నా లేదా మనకు సమయం కొద్దిగానే ఉన్నా అలా ప్రార్థించాలి. మనం వినయంతో వేడుకుంటే మన పరలోక తండ్రి తప్పక సంతోషిస్తాడు. యేసు చెప్పినట్లు, మనం యథార్థంగా విన్నవించుకుంటే యెహోవా తన పరిశుద్ధాత్మను ధారాళంగా ఇస్తాడు.—లూకా 11:13.

13, 14. దేవుని మర్మాలను అర్థం చేసుకునే విషయంలో కూటాలకు సిద్ధపడడం ఏ పాత్ర పోషిస్తుంది?

13 కూటాలకు సిద్ధపడండి. దాసుని తరగతి ద్వారా మనం “తగినవేళ” ఆహారాన్ని పొందుతున్నాం. లేఖన సమాచారం అందించడం ద్వారా, అధ్యయనానికి, కూటాలకు సంబంధించిన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా ‘దాసుడు’ తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. ఫలాని సమాచారాన్ని ‘సహోదరులందరూ’ పరిశీలించాలని చెప్పారంటే వారు ఎంతో పరిశోధించిన తర్వాతే ఆ మాట చెబుతారు. (1 పేతు. 2:17; కొలొ. 4:16; యూదా 3) వారు చెప్పిన దాని ప్రకారంగా నడుచుకోవడానికి మనం చేయగలిగినదంతా చేసినప్పుడు పరిశుద్ధాత్మకు సహకరించినవారమౌతాం.—ప్రక. 2:29.

14 క్రైస్తవ కూటాలకు సిద్ధపడుతున్నప్పుడు మనం పేర్కొనబడిన లేఖనాలను చూసి, చదువుతున్న విషయానికీ ఆ లేఖనాలకూ మధ్య సంబంధమేమిటో అర్థంచేసుకునేందుకు ప్రయత్నించాలి. ఇలా అలవాటు చేసుకుంటే మనం క్రమక్రమంగా బైబిలు విషయాలపట్ల మనకున్న అవగాహనను పెంచుకోగలుగుతాం. (అపొ. 17:11, 12) వచనాలను చూస్తే అవి మన మనసులో ముద్రపడిపోతాయి, ఆ తర్వాత వాటిని గుర్తుచేసుకోవడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. అంతేకాక, మనం బైబిలును తెరచి లేఖనాలను చూసినట్లయితే, ఫలానా పేజీలో ఏవైపున ఓ లేఖనం ఉందనేది మన మనసులో ముద్రపడిపోతుంది. మనకు అవసరమైనప్పుడు దాన్ని కనుగొనగలుగుతాం.

15. ప్రచురణలను మనం ఎప్పటికప్పుడు ఎందుకు చదవాలి? మీరు ఎలా వాటిని పూర్తిచేస్తున్నారు?

15 కొత్త ప్రచురణలను ఎప్పటికప్పుడు చదవండి. కొన్ని ప్రచురణల్లోని సమాచారాన్ని మన కూటాల్లో చర్చించకపోయినా, దానిలోని సమాచారం మన ప్రయోజనం కోసమే సిద్ధంచేయబడింది. ప్రజలకు మనం అందించే పత్రికలు కూడా మనల్ని మనసులో ఉంచుకొనే సిద్ధం చేయబడ్డాయి. తీరిక దొరకని ఈ లోకంలో మనం చాలాసార్లు దేనికోసమైనా, ఎవరికోసమైనా వేచివుండాల్సి వస్తుంది. మనం చదవని లేదా కొంత చదివిన ఏ ప్రచురణనైనా మనతోపాటు తీసుకెళ్తే, దానిలోని ఓ భాగాన్ని చదవడానికి ఆ సమయాన్ని ఉపయోగించవచ్చు. నడుస్తున్నప్పుడు లేదా బండి నడుపుతున్నప్పుడు మన ప్రచురణల ఆడియో రికార్డింగులను వినడం ద్వారా కొందరు తాజా పత్రికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పూర్తిచేయగలుగుతున్నారు. పత్రికలోని సమాచారం ఎంతో పరిశోధించి రాయబడినప్పటికీ అది సగటు పాఠకుడు చదివి ఆనందించేలా తయారుచేయబడింది. అంతేకాక, అది ఆధ్యాత్మిక విషయాలపట్ల మన అవగాహనను పెంచుతుంది.—హబ. 2:2.

16. మనకు వచ్చే ప్రశ్నలను రాసుకొని, ఆ తర్వాత పరిశోధించడం వల్ల ఏ ప్రయోజనముంది?

16 ధ్యానించండి. బైబిలును గానీ బైబిలు సాహిత్యాన్ని గానీ మీరు చదువుతున్నప్పుడు ఆలోచించడానికి సమయం తీసుకోండి. వివిధ విషయాలు ఏ క్రమంలో వివరిస్తూ వచ్చారో మీరు జాగ్రత్తగా ఆలోచించినప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు రావచ్చు. వాటిని రాసుకొని వాటి గురించి తర్వాత పరిశోధించండి. సాధారణంగా మనకు ఆసక్తి కలిగించిన విషయాల గురించి పరిశోధించినప్పుడే మనం లోతుగా అధ్యయనం చేస్తాం. అవి మన వ్యక్తిగత ధననిధిలో భాగమౌతాయి. అవసరమైనప్పుడు మనం వాటిని ఉపయోగించుకోగలుగుతాం.—మత్త. 13:52.

17. మీరు కుటుంబ లేదా వ్యక్తిగత అధ్యయనం ఎలా చేస్తున్నారు?

17 కుటుంబ ఆరాధన కోసం సమయం కేటాయించండి. వ్యక్తిగత లేదా కుటుంబ అధ్యయనం కోసం వారంలో ఓ సాయంత్రం గానీ, వేరే సమయం గానీ కేటాయించమని పరిపాలక సభ మనందరినీ ప్రోత్సహించింది. మన కూటాల్లో చేయబడిన మార్పువల్ల ఈ ఉపదేశాన్ని అనుసరించడం సులభమౌతుంది. కుటుంబ ఆరాధన సమయంలో మీరు దేన్ని పరిశీలిస్తారు? కొందరు బైబిలు చదివి, చదివిన భాగంలో తమకు వచ్చిన ప్రశ్నల గురించి పరిశోధించి, తమ బైబిల్లో క్లుప్తంగా నోట్సు రాసుకుంటారు. చాలా కుటుంబాలు చదివిన భాగాన్ని కుటుంబంగా ఎలా అన్వయించుకోవచ్చో చర్చించేందుకు సమయం తీసుకుంటాయి. కొందరు కుటుంబ పెద్దలు తమ కుటుంబానికి అవసరమని భావించిన సమాచారాన్ని ఎంపిక చేసుకుంటారు లేదా కుటుంబ సభ్యులు ఫలానా విషయం చర్చించాలని కోరినప్పుడు లేదా వారు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు దాన్ని చర్చిస్తారు. సమయం గడిచేకొద్దీ, వేరే అంశాలను కూడా మీరు ఎంపికచేసుకోవచ్చు. a

18. దేవుని వాక్యంలోని లోతైన సత్యాలను అధ్యయనం చేయడానికి మనం ఎందుకు వెనకాడకూడదు?

18 పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుందని యేసు చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యంలోని లోతైన సత్యాలను అధ్యయనం చేయడానికి వెనకాడకూడదు. ఆ సత్యాలు అమూల్యమైన ‘దేవుని విజ్ఞానములో’ భాగంగా ఉన్నాయి. ఆ సత్యాలను వెదకమని మనం ప్రోత్సహించబడుతున్నాం. (సామెతలు 2:1-5 చదవండి.) “దేవుడు తన్ను ప్రేమించువారికొరకు సిద్ధపరచిన” వాటి గురించి అవి ఎంతో తెలియజేస్తున్నాయి. ‘ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధిస్తోంది’ కాబట్టి, యెహోవా వాక్యం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి మనం కృషి చేస్తుండగా పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది.—1 కొరిం. 2:9, 10.

[అధస్సూచి]

a మన రాజ్య పరిచర్య, అక్టోబరు 2008, 8వ పేజీ చూడండి.

మీరెలా జవాబిస్తారు?

• ‘దేవుని మర్మములను’ పరిశోధించడానికి పరిశుద్ధాత్మ ఏ రెండు విధాలుగా మనకు సహాయం చేస్తుంది?

• మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మ ఎవరి ద్వారా లోతైన సత్యాలను బయలుపరచింది?

• మన కాలంలో ఏదైనా ఆధ్యాత్మిక విషయాన్ని స్పష్టం చేయడానికి పరిశుద్ధాత్మ ఎలా సహాయం చేస్తుంది?

• పరిశుద్ధాత్మ పోషిస్తున్న పాత్ర నుండి ప్రయోజనం పొందాలంటే మీరు ఏమి చేయవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[22వ పేజీలోని బాక్సు]

ఆధ్యాత్మిక ఆలయానికి సంబంధించిన వివరణను పరిశుద్ధాత్మ ఎలా బయలుపరచింది?

మొదటి శతాబ్దంలో ‘దేవుని మర్మాలు’ ఎన్నో బయలుపరచబడ్డాయి. ఆలయ గుడారం, ఆ తర్వాత నిర్మించబడిన ఆలయాలు మరింత గొప్ప ఆధ్యాత్మిక వాస్తవాన్ని సూచిస్తున్నాయనేది వాటిలో ఒకటి. పౌలు ఆ వాస్తవాన్ని “మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారము” అని అన్నాడు. (హెబ్రీ. 8:1, 2) అది ఓ గొప్ప ఆధ్యాత్మిక ఆలయం అంటే యేసుక్రీస్తు అర్పించిన బలివల్ల, ఆయన యాజకత్వం వల్ల దేవుణ్ణి సమీపించేందుకు చేయబడిన ఏర్పాటు.

సా.శ. 29లో యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు యెహోవా ఆయనను ఓ పరిపూర్ణ బలిని అర్పించే వ్యక్తిగా అంగీకరించాడు. అప్పుడే “నిజమైన గుడారము” ఉనికిలోకి వచ్చింది. (హెబ్రీ. 10:5-10) యేసు చనిపోయి పునరుత్థానం చేయబడిన తర్వాత, ఆయన ఆధ్యాత్మిక ఆలయంలోని అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి ‘దేవుని సముఖములో’ తన బలి విలువను అందించాడు.—హెబ్రీ. 9:11, 12, 24.

మరో చోట అపొస్తలుడైన పౌలు అభిషిక్త క్రైస్తవుల గురించి మాట్లాడుతూ, వారు ‘యెహోవానందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధిపొందుచున్నారు’ అని రాశాడు. (ఎఫె. 2:20-22) మరి ఈ ఆలయమూ, పౌలు ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రస్తావించిన ‘నిజమైన గుడారమూ’ ఒకటేనా? ఆ రెండూ ఒకటేనని యెహోవా సేవకులు ఎంతోకాలంపాటు నమ్ముతూ వచ్చారు. పరలోకంలోవున్న యెహోవా ఆలయంలో ‘రాళ్లుగా’ ఉండడానికి అభిషిక్త క్రైస్తవులు ఈ భూమిపై సిద్ధం చేయబడుతున్నారని దేవుని సేవకులకు అనిపించింది.—1 పేతు. 2:5.

అయితే 1971 వచ్చేసరికి, పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రస్తావించిన ఆలయమూ యెహోవా గొప్ప ఆధ్యాత్మిక ఆలయమూ ఒకటి కాదని దాసుని తరగతిలోని బాధ్యతగల సభ్యులు గుర్తించనారంభించారు. ఒకవేళ “నిజమైన గుడారము” పునరుత్థానం చేయబడిన అభిషిక్త క్రైస్తవులతో రూపొందించబడివుంటే, అది ‘ప్రభువు రాకడలో’ వారి పునరుత్థానం ప్రారంభమైన తర్వాతే మొదట ఉనికిలోకి వస్తుంది. (1 థెస్స. 4:15-17) కానీ, ఆలయ గుడారం గురించి మాట్లాడుతూ పౌలు ఇలా రాశాడు: “ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది.”—హెబ్రీ. 9:9.

ఈ లేఖనాలనూ మరితర లేఖనాలనూ జాగ్రత్తగా పోల్చిచూసినప్పుడు, ఆధ్యాత్మిక ఆలయం ఇప్పుడు నిర్మించబడడం లేదనీ, అభిషిక్త క్రైస్తవులు దానికోసం తయారు చేయబడుతున్న ‘రాళ్లు’ కాదనీ స్పష్టమైంది. దాంతో అభిషిక్త క్రైస్తవులు ఆధ్యాత్మిక ఆలయంలోని ఆవరణములో, పరిశుద్ధ స్థలంలో సేవచేస్తూ ప్రతీరోజు దేవునికి ‘స్తుతియాగాలు’ చేస్తున్నారనీ దేవుని సేవకులు అర్థం చేసుకున్నారు.—హెబ్రీ. 13:15.

[23వ పేజీలోని చిత్రం]

‘దేవుని మర్మములపట్ల’ మనకున్న అవగాహనను ఎలా పెంచుకోవచ్చు?