కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గొప్ప ఆధ్యాత్మిక కోతపనిలో పూర్తిగా భాగం వహించండి

గొప్ప ఆధ్యాత్మిక కోతపనిలో పూర్తిగా భాగం వహించండి

గొప్ప ఆధ్యాత్మిక కోతపనిలో పూర్తిగా భాగం వహించండి

“ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.”—1 కొరిం. 15:58.

1. యేసు తన శిష్యులను ఏమి చేయమని ఆహ్వానించాడు?

 యేసు సా.శ. 30వ సంవత్సరం చివర్లో సమరయ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు, విశ్రాంతి కోసం సుఖారు అనే ఊరుకు దగ్గర్లోవున్న ఓ బావి దగ్గర ఆగాడు. అక్కడ యేసు తన శిష్యులతో, “మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవి” అని అన్నాడు. (యోహా. 4:35) యేసు రైతులు చేసే కోతపని గురించి మాట్లాడలేదుగానీ తన అనుచరులయ్యే యథార్థ హృదయులు సమకూర్చబడడమనే కోతపని గురించి మాట్లాడాడు. ఆ మాటలు చెప్పడం ద్వారా ఆయన ఆ ఆధ్యాత్మిక కోతపనిలో భాగం వహించమని తన శిష్యులను ఆహ్వానించాడు. చేయాల్సిన పని ఎంతో ఉన్నా, దాన్ని పూర్తిచేయడానికి మాత్రం కొంచెం సమయమే ఉంది.

2, 3. (ఎ) మనం కోతకాలంలో జీవిస్తున్నామని ఏది చూపిస్తోంది? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలిస్తాం?

2 కోత పని గురించి యేసు చెప్పిన మాటలకు మన కాలంలో ఓ ప్రత్యేకమైన అర్థముంది. మానవ ప్రపంచమనే పొలం ‘తెల్లబారి కోతకు వచ్చిన’ కాలంలో మనం జీవిస్తున్నాం. ప్రతీ సంవత్సరం, జీవాన్నిచ్చే సత్యాలను తీసుకోమని లక్షలాదిమందికి ఆహ్వానం ఇవ్వబడుతోంది. దానికి స్పందించి వేలాదిమంది కొత్త శిష్యులు బాప్తిస్మం తీసుకుంటున్నారు. కోత యజమాని అయిన యెహోవా దేవుని పర్యవేక్షణలో చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ జరగని అత్యంత గొప్ప కోతపనిలో పాల్గొనే అవకాశం మనకుంది. ఈ కోతపనిలో ‘మీరు ఎప్పటికీ ఆసక్తులై’ ఉన్నారా?—1 కొరిం. 15:58.

3 యేసు తన మూడున్నర సంవత్సరాల భూపరిచర్యలో తన శిష్యులను కోతపనివారిగా తయారుచేసేందుకు వారికి శిక్షణనిచ్చాడు. యేసు తన శిష్యులకు నేర్పించిన అనేక ప్రాముఖ్యమైన పాఠాల్లో మూడింటిని ఈ ఆర్టికల్‌లో చూద్దాం. మన కాలంలో జరుగుతున్న శిష్యులను సమకూర్చే పనిలో మనం చేయగలిగినదంతా చేస్తుండగా మనకు ఎంతో అవసరమైన ఒక్కొక్క లక్షణం గురించి ఆ మూడు పాఠాల్లో నేర్చుకుంటాం. మనం ఇప్పుడు ఒక్కొక్క లక్షణాన్ని పరిశీలిద్దాం.

వినయం చాలా అవసరం

4. వినయానికున్న ప్రాముఖ్యతను యేసు ఎలా తెలియజేశాడు?

4 మీరు ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. అప్పుడే యేసు శిష్యులు తమలో ఎవరు గొప్ప అనే విషయంమీద వాదులాడుకున్నారు. అపనమ్మకం, కోపం బహుశా వారి ముఖాల్లో కొటొచ్చినట్లు కనిపిస్తుండవచ్చు. అందుకే యేసు ఓ చిన్నపిల్లవాణ్ణి తమ మధ్యలో నిలబెట్టి ఇలా అన్నాడు: “ఈ బిడ్డవలె తన్ను తాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.” (మత్తయి 18:1-4 చదవండి.) లోకస్థులు ఓ వ్యక్తికున్న అధికారాన్నిబట్టి, ఐశ్వర్యాన్నిబట్టి, హోదానుబట్టి అతని గొప్పతనాన్ని లెక్కకడతారు. వారిలా ఆలోచించకుండా ఇతరుల ముందు ‘తమను తాము తగ్గించుకోవడంలోనే’ గొప్పతనం ఉందని ఆయన శిష్యులు అర్థం చేసుకోవాల్సివుంది. శిష్యులు నిజమైన వినయం చూపిస్తేనే యెహోవా వారిని ఆశీర్వదించి, తన సేవలో వారిని ఉపయోగించుకుంటాడు.

5, 6. కోత పనిలో పూర్తిగా భాగం వహించడానికి మనం ఎందుకు వినయం కనబరచాలి? దీనికి సంబంధించి ఓ అనుభవం చెప్పండి.

5 ఇప్పటికీ లోకంలోని చాలామంది అధికారం, ధనం, హోదా వంటి వాటికే తమ జీవితాలను అంకితం చేసుకుంటారు. దానివల్ల వారు ఆధ్యాత్మిక విషయాలకు పెద్దగా సమయం కేటాయించడంలేదు లేక అసలు సమయమే కేటాయించడంలేదు. (మత్త. 13:22) దానికి భిన్నంగా యెహోవా ప్రజలు, కోత యజమాని ఆశీర్వాదాన్ని, ఆమోదాన్ని పొందేలా ఇతరుల ముందు ‘తమను తాము తగ్గించుకోవడానికి’ ఇష్టపడుతున్నారు.—మత్త. 6:24; 2 కొరిం. 11:7; ఫిలి. 3:8.

6 దక్షిణ అమెరికాలో పెద్దగా సేవచేస్తున్న ఫ్రాన్సిస్కూ అనే సహోదరుని ఉదాహరణ తీసుకోండి. యువకునిగా ఉన్నప్పుడు పయినీరు సేవకోసం ఆయన యూనివర్సిటీ చదువులను వదిలేశాడు. ఆయన ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “మా పెళ్లి నిశ్చయమైనప్పుడు నాకూ, నా భార్యకూ ఎంతో ఆర్థిక భద్రతను తీసుకొచ్చే ఉద్యోగంలో చేరేవాణ్ణే. కానీ మా జీవితాలను నిరాడంబరంగా మార్చుకొని పూర్తికాల సేవలో కొనసాగాలని అనుకున్నాం. ఆ తర్వాత పిల్లలు పుట్టడంతో మా కష్టాలు పెరిగాయి. కానీ, మేము మా నిర్ణయానికి కట్టుబడివుండేలా యెహోవా సహాయం చేశాడు.” ఆయన చివరిగా ఇలా చెప్పాడు: “గత 30 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా, నేను పెద్దగా సేవచేస్తున్నాను. దానితోపాటు ఇంకా ఎన్నో బాధ్యతలను చేపట్టాను. నిరాడంబరంగా జీవిస్తున్నందుకు మేము మా జీవితంలో ఒక్క క్షణం కూడా విచారించలేదు.”

7. రోమీయులు 12:16 లోని ఉపదేశాన్ని అన్వయించుకునేందుకు మీరు ప్రయత్నించారా? ఎలాంటి ఫలితాలొచ్చాయి?

7 ఈ లోకంలోని ‘హెచ్చువాటిని’ వద్దనుకొని, “తగ్గువాటియందు ఆసక్తులై” ఉంటే మీరు కూడా ఈ కోతపనిలో ఎన్నో అదనపు బాధ్యతలను చేపడతారు, ఎన్నో ఆశీర్వాదాలను అనుభవిస్తారు.—రోమా. 12:16; మత్త. 4:19, 20; లూకా 18:28-30.

కష్టపడి పనిచేస్తే ఆశీర్వాదాలను అనుభవిస్తాం

8, 9. (ఎ) యేసు చెప్పిన తలాంతుల ఉపమానాన్ని క్లుప్తంగా వివరించండి. (బి) ఈ ఉపమానం ప్రత్యేకంగా ఎవరిని ప్రోత్సహిస్తుంది?

8 కోతపనిలో పూర్తిగా భాగం వహించడానికి మనకు మరో లక్షణం కూడా అవసరం. అది కష్టపడి పనిచేసే స్వభావం. యేసు తాను చెప్పిన తలాంతుల ఉపమానంలో దాన్ని ఉదహరించాడు. a ఆ ఉపమానంలో, ఓ యజమాని వేరే దేశానికి వెళ్లేముందు తన ఆస్తిని చూసుకునే బాధ్యతను ముగ్గురు దాసులకు అప్పగిస్తాడు. మొదటి దాసునికి ఐదు తలాంతులు, రెండవ దాసునికి రెండు తలాంతులు, మూడవ దాసునికి ఒక తలాంతు చొప్పున అప్పగిస్తాడు. యజమాని వెళ్లిన తర్వాత, మొదటి ఇద్దరు దాసులు కష్టపడే స్వభావాన్ని చూపిస్తూ వెంటనే తలాంతులతో ‘వ్యాపారం చేస్తారు.’ కానీ మూడవ దాసుడు ‘సోమరితనాన్ని’ చూపిస్తాడు. అతడు తనకు ఇవ్వబడిన తలాంతును భూమిలో దాచిపెడతాడు. విదేశాల నుండి తిరిగివచ్చిన ఆ యజమాని మొదటి ఇద్దరు దాసులను “అనేకమైనవాటిమీద” నియమించడం ద్వారా వారికి తగిన ప్రతిఫలమిస్తాడు. ఆయన మూడవ దాసుని దగ్గర ఉన్న తలాంతును వెనక్కి తీసుకొని ఆ దాసుణ్ణి తన ఇంటి నుండి వెళ్లగొడతాడు.—మత్త. 25:14-30.

9 మనం యేసు ఉపమానంలోని కష్టపడి పనిచేసిన దాసులను అనుకరిస్తూ శిష్యులను చేసే పనిలో సాధ్యమైనంత ఎక్కువ చేయాలని ఖచ్చితంగా అనుకుంటుండవచ్చు. మీ పరిస్థితుల వల్ల మీరు ప్రస్తుతం ఎక్కువ చేయలేకపోతుంటే అప్పుడేమిటి? తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల మీరు కుటుంబ పోషణ కోసం ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుండవచ్చు. వయసు పైబడడంవల్ల మీరు ముందులా పనిచేయలేకపోతుండవచ్చు లేదా మీ ఆరోగ్యం క్షీణించివుండవచ్చు. అలాగైతే, తలాంతుల ఉపమానంలో మిమ్మల్ని ప్రోత్సహించే ఓ సందేశముంది.

10. ఉపమానంలోని యజమాని వారి సామర్థ్యాలను అర్థం చేసుకొని ఎలా ప్రవర్తించాడు? ఇది ఎందుకు మీకు ప్రోత్సాహాన్నిస్తుంది?

10 ఆ ఉపమానంలో యజమాని ఒక్కొక్క దాసునికి ఒక్కొక్క సామర్థ్యముందన్న విషయం గుర్తించాడని మీరు గమనించవచ్చు. “ఎవని సామర్థ్యము చొప్పున వానికి” తలాంతులను ఇవ్వడం ద్వారా ఆయన దాన్ని చూపించాడు. (మత్త. 25:15) ముందు ఊహించినట్లుగానే, మొదటి దాసుడు రెండవ దాసునికన్నా ఎక్కువ సాధించాడు. అయితే, యజమాని వారిద్దరినీ “నమ్మకమైన మంచి దాసుడా” అని మెచ్చుకొని ఒకే విధమైన ప్రతిఫలాన్ని ఇవ్వడం ద్వారా వారిద్దరి కృషిని గుర్తించాడు. (మత్త. 25:21, 23) అదే విధంగా, మీ పరిస్థితులనుబట్టి మీరెంత చేయగలరో కోత యజమానియైన యెహోవా దేవునికి తెలుసు. తనను సేవించడానికి మీరు మనస్ఫూర్తిగా చేస్తున్న ప్రయత్నాలను ఆయన తప్పక గుర్తించి ప్రతిఫలమిస్తాడు.—మార్కు 14:3-9; లూకా 21:1-4 చదవండి.

11. అననుకూల పరిస్థితుల్లోనూ కష్టపడి పనిచేయడంవల్ల ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయని చూపించే ఓ అనుభవం చెప్పండి.

11 బ్రెజిల్‌కు చెందిన సెల్మీర అనే క్రైస్తవ సహోదరి ఉదాహరణ తీసుకోండి. అననుకూల పరిస్థితుల్లోనూ దేవుని సేవలో కష్టపడి పనిచేయవచ్చని ఆమె ఉదాహరణనుబట్టి అర్థమౌతోంది. ఇరవై ఏళ్ల క్రితం సెల్మీర భర్తను ఎవరో దోచుకొని చంపేశారు. దాంతో ముగ్గురు చిన్నారుల బాధ్యత ఆమె మీదపడింది. కుటుంబ పోషణ కోసం ఆమె ఎన్నో గంటలపాటు పనిమనిషిగా పనిచేయాల్సివచ్చేది, కిక్కిరిసిన ప్రయాణ సౌకర్యాల్లో అలసట కలిగించే ప్రయాణాలు చేయాల్సివచ్చేది. ఇన్ని కష్టాలున్నా, ఆమె క్రమపయినీరుగా సేవచేయడానికి కొన్ని సర్దుబాట్లు చేసుకుంది. ఆమె ముగ్గురు అమ్మాయిల్లో ఇద్దరు ఆ తర్వాత పయినీరు సేవ చేపట్టారు. ఆమె ఇలా చెబుతోంది: “ఇప్పటివరకు నేను దాదాపు 20 కన్నా ఎక్కువమందితో బైబిలు అధ్యయనం చేశాను. అలా వారు నా ‘కుటుంబ’ సభ్యులయ్యారు. ఇప్పటికీ నేను వారి ప్రేమను, స్నేహాన్ని ఆస్వాదిస్తున్నాను. అది డబ్బుతో కొనలేని సొత్తు.” సెల్మీర కష్టపడి చేసిన ప్రయత్నాలను కోత యజమాని నిజంగానే ఆశీర్వదించాడు!

12. ప్రకటనా పనిలో మనం కష్టపడి పనిచేసే స్వభావాన్ని ఎలా చూపించవచ్చు?

12 ఇప్పుడున్న పరిస్థితులనుబట్టి మీరు పరిచర్యలో ఎక్కువ చేయలేకపోతున్నప్పటికీ, మీరు మీ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా కోత పనిలో మీ వంతును పెంచుకోవడానికి ప్రయత్నించవచ్చు. ప్రతీవారం సేవా కూటంలో ఇవ్వబడే ప్రయోజనకరమైన సలహాలను జాగ్రత్తగా అన్వయించుకుంటే, మీరు మీ ప్రకటనా నైపుణ్యాలను సానబెట్టుకొని, సాక్ష్యమివ్వడానికి కొత్త పద్ధతులను కనుగొనేందుకు ప్రయత్నించవచ్చు. (2 తిమో. 2:15) అంతేకాక, సంఘంతో కలిసి క్రమంగా క్షేత్రసేవలో భాగం వహించేందుకు మీరు వీలైతే అనవసరమైన పనులను వాయిదావేయవచ్చు లేదా వాటిని పక్కనబెట్టవచ్చు.—కొలొ. 4:5.

13. కష్టపడి పనిచేయాలనే కోరిక మనలో కలగాలన్నా, దాన్ని ఎల్లప్పుడూ చూపించాలన్నా మనం ఏమి చేయాలి?

13 మనకు దేవునిపట్ల ప్రేమ, కృతజ్ఞత ఉంటే కష్టపడి పనిచేయాలనే కోరిక దానంతటదే వస్తుంది. (కీర్త. 40:8) యేసు ఉపమానంలోని మూడవ దాసుడు తన యజమాని పరిస్థితిని అర్థం చేసుకొనని కఠినమైన వ్యక్తియని భావించి, ఆయనకు భయపడ్డాడు. అందుకే, ఆ దాసుడు తనకివ్వబడిన తలాంతును యజమాని ఆస్తి పెంచేందుకు ఉపయోగించే బదులు భూమిలో దాచిపెట్టాడు. అలాంటి లెక్కలేనితనం మనలో పెరగకూడదంటే మనం కోత యజమానియైన యెహోవాతో ప్రేమపూర్వకమైన సంబంధాన్ని పెంచుకొని దాన్ని కాపాడుకోవాలి. ఆయనకున్న ప్రేమ, ఓర్పు, దయ వంటి మంచి లక్షణాల గురించి అధ్యయనం చేసి, ధ్యానించడానికి సమయం తీసుకోండి. అలా మీరు ఆయన సేవలో చేయగలిగినదంతా చేయడానికి పురికొల్పబడతారు.—లూకా 6:45; ఫిలి. 1:9-11.

‘మీరు పరిశుద్ధులుగా ఉండండి’

14. కోతపనివారిగా ఉండాలనుకునేవారు ఏ ప్రాముఖ్యమైన ఆజ్ఞను పాటించాలి?

14 అపొస్తలుడైన పేతురు హెబ్రీ లేఖనాలను ఉల్లేఖిస్తూ, భూమ్మీద ఉన్న తన సేవకుల విషయంలో దేవుని చిత్తాన్ని ఈ మాటల్లో తెలియజేశాడు: “నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా . . . మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.” (1 పేతు. 1:14-16; లేవీ. 19:2; ద్వితీ. 18:13) కోత పనివారు నైతిక, ఆధ్యాత్మిక విషయాల్లో పరిశుభ్రంగా ఉండాలని ఆ వాక్యం చెబుతోంది. అలంకారార్థంగా మనం పరిశుభ్రంగా కడగబడేందుకు తగిన చర్యలు తీసుకోవడం ద్వారా ఆ ప్రాముఖ్యమైన ఆజ్ఞను పాటించవచ్చు. అది ఎలా సాధ్యమౌతుంది? దేవుని సత్యవాక్యంతో అది సాధ్యమౌతుంది.

15. దేవుని వాక్యసత్యానికి ఏ శక్తి ఉంది?

15 దేవుని సత్యవాక్యం పరిశుభ్రపరిచే నీటితో పోల్చబడింది. ఉదాహరణకు, అభిషిక్త క్రైస్తవుల సంఘం దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉందని పౌలు రాశాడు. అంతేకాక అది క్రీస్తు పవిత్రమైన పెండ్లికుమార్తెలా “పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను” ఉండేందుకు “వాక్యముతో ఉదకస్నానముచేత” క్రీస్తు దాన్ని కడిగాడని కూడా ఆయన రాశాడు. (ఎఫె. 5:25-27) అంతకుముందు, పరిశుభ్రపరిచే విషయంలో దేవుని వాక్యానికున్న శక్తి గురించి యేసు కూడా మాట్లాడాడు. ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. యేసు తన శిష్యులతో మాట్లాడుతూ “నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీరిప్పుడు పవిత్రులై యున్నారు” అని అన్నాడు. (యోహా. 15:3) కాబట్టి, దేవుని వాక్యసత్యానికి నైతికంగా, ఆధ్యాత్మికంగా పరిశుభ్రం చేసే శక్తివుంది. దేవుని సత్యం మనల్ని పరిశుభ్రపరిచేందుకు అనుమతిస్తేనే మనం ఆయనకు ఇష్టమైన విధంగా ఆరాధించగలుగుతాం.

16. ఆధ్యాత్మిక, నైతిక విషయాల్లో మనం ఎలా పరిశుభ్రంగా ఉండగలుగుతాం?

16 కాబట్టి, కోత పనివారిగా మనం అంగీకరించబడాలంటే మొదట నైతికంగా, ఆధ్యాత్మికంగా మలినపరిచే అన్ని విషయాలను మన జీవితం నుండి తీసివేసుకోవాలి. అంతేకాక, ఆ అవకాశాన్ని కోల్పోకుండా ఉండాలంటే మనం యెహోవా ఉన్నత నైతిక, ఆధ్యాత్మిక ప్రమాణాలకు కట్టుబడివుండే విషయంలో మాదిరిగా ఉండాలి. (1 పేతురు 1:14-16 చదవండి.) ఎలాగైతే శారీరక శుభ్రత కోసం మనం పదేపదే జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే దేవుని సత్యవాక్యంతో ఎల్లప్పుడు కడగబడుతూ ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మనం బైబిలును చదువుతూ, క్రైస్తవ కూటాలకు హాజరౌతూ ఉండాలి. అంతేకాక, మన జీవితంలో దేవుని నియమాలను అన్వయించుకునేందుకు మనస్ఫూర్తిగా కృషిచేయాలి. అలా చేస్తే మనకున్న పాప స్వభావాలతో, మనల్ని మలినపరిచే ఈ లోక ప్రభావాలతో పోరాడగలుగుతాం. (కీర్త. 119:9; యాకో. 1:21-25) దేవుని వాక్య సత్యంతో మన గంభీరమైన పాపాలు కూడా ‘కడుగబడతాయి’ అని తెలుసుకోవడం మనకు ఎంత ఊరటనిస్తోంది!—1 కొరిం. 6:9-11.

17. మనం పరిశుభ్రంగా ఉండేందుకు ఏ బైబిలు ఉపదేశాన్ని పాటించాలి?

17 దేవుని సత్యవాక్యంతో శుభ్రపరచబడడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఉదాహరణకు, ఈ లోకంలోని దిగజారిన వినోదం వల్ల కలిగే ప్రమాదాల గురించి మీరు హెచ్చరించబడితే ఎలా స్పందిస్తారు? (కీర్త. 101:3) మీ నమ్మకాలను పంచుకోని తోటి విద్యార్థుల, ఉద్యోగస్థుల స్నేహానికి దూరంగా ఉంటున్నారా? (1 కొరిం. 15:33) యెహోవా ముందు మిమ్మల్ని అపవిత్రులనుగా చేసే బలహీనతలను జయించేందుకు మీరు నిజాయితీగా కృషిచేస్తున్నారా? (కొలొ. 3:5) ఈ లోక రాజకీయ పోరాటాలకు, అనేక క్రీడా పోటీల్లో కనిపించే జాతీయతా భావానికి మీరు దూరంగా ఉంటున్నారా?—యాకో. 4:4.

18. నైతిక, ఆధ్యాత్మిక విషయాల్లో పరిశుభ్రంగా ఉండడం వల్ల మనం ఎలా మంచి కోతపనివారిగా ఉండగలుగుతాం?

18 అలాంటి విషయాల్లో నమ్మకంగా విధేయత చూపిస్తే మంచి ఫలితాలు వస్తాయి. తన అభిషిక్త అనుచరులను ద్రాక్ష తీగెలతో పోలుస్తూ యేసు ఇలా అన్నాడు: “నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన [నా తండ్రి] తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.” (యోహా. 15:2) దేవుని సత్యవాక్యమనే నీళ్లతో మీరు శుభ్రపరచబడే కొద్దీ మీరు మరిన్ని ఫలాలను ఫలిస్తారు.

ఇప్పుడు, భవిష్యత్తులో పొందే ఆశీర్వాదాలు

19. కోత పనివారిగా తాము చేసిన ప్రయత్నానికి యేసు శిష్యులు ఎలా ఆశీర్వదించబడ్డారు?

19 యేసు ఇచ్చిన శిక్షణను అన్వయించుకున్న నమ్మకమైన శిష్యులు “భూదిగంతముల వరకు” సాక్షులుగా ఉండేలా సా.శ. 33 పెంతెకొస్తు రోజు పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. (అపొ. 1:8) వారు ఆ తర్వాత పరిపాలక సభ సభ్యులుగా, మిషనరీలుగా, ప్రయాణ పైవిచారణకర్తలుగా సేవచేస్తూ, “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” రాజ్య సువార్త ప్రకటించే విషయంలో ప్రముఖ పాత్ర పోషించారు. (కొలొ. 1:23) వారు ఎన్నో ఆశీర్వాదాలు పొందారు, ఇతరులకు ఎంతో సంతోషం కలిగించారు.

20. (ఎ) ఆధ్యాత్మిక కోతపనిలో పూర్తిగా భాగం వహించడం వల్ల మీరు ఏ ఆశీర్వాదాలు పొందారు? (బి) మీరు ఏమి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారు?

20 వినయాన్ని, కష్టపడి పనిచేసే స్వభావాన్ని చూపించడం ద్వారా, దేవుని వాక్యంలోని ఉన్నత ప్రమాణాలకు కట్టుబడివుండడం ద్వారా మనం ఇప్పుడు జరుగుతున్న గొప్ప ఆధ్యాత్మిక కోతపనిలో మరింత ఎక్కువగా, సమర్థంగా భాగం వహించగలుగుతాం. ఈ లోకంలో ధనసంపదల కోసం, సుఖభోగాల కోసం ప్రయాసపడడం వల్ల వచ్చే బాధను, నిరాశను ఎంతోమంది అనుభవిస్తున్నారు. కానీ మనం మాత్రం నిజమైన సంతోషాన్ని, సంతృప్తిని అనుభవిస్తున్నాం. (కీర్త. 126:6) అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, మన “ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదు.” (1 కొరిం. 15:58) కోత యజమానియైన యెహోవా దేవుడు ‘మనం చేసిన కార్యమును, తన నామమునుబట్టి మనం చూపిస్తున్న ప్రేమను’ గుర్తుంచుకొని నిత్యమూ మనల్ని ఆశీర్వదిస్తాడు.—హెబ్రీ. 6:10-12.

[అధస్సూచి]

a తలాంతుల ఉపమానం అభిషిక్త శిష్యులతో యేసుకున్న సంబంధం గురించే ప్రాముఖ్యంగా వివరిస్తున్నప్పటికీ దానిలోని సూత్రాలు క్రైస్తవులందరికీ వర్తిస్తాయి.

మీకు గుర్తున్నాయా?

కోత పనిలో పూర్తిగా భాగం వహించేందుకు మీరు కృషిచేస్తుండగా,

• వినయం చూపించడం ఎందుకు ప్రాముఖ్యం?

• కష్టపడి పనిచేసే స్వభావాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు? ఎల్లప్పుడూ దాన్ని ఎలా కనబరచవచ్చు?

• నైతిక, ఆధ్యాత్మిక విషయాల్లో పరిశుభ్రంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

[అధ్యయన ప్రశ్నలు]

[17వ పేజీలోని చిత్రం]

వినయం ఉంటే రాజ్య సంబంధ విషయాలకు ప్రాముఖ్యతనిచ్చేలా నిరాడంబర జీవితం గడుపుతాం