కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చదవడంపట్ల, అధ్యయనంపట్ల మీ పిల్లల్లో కోరికను పెంచండి

చదవడంపట్ల, అధ్యయనంపట్ల మీ పిల్లల్లో కోరికను పెంచండి

చదవడంపట్ల, అధ్యయనంపట్ల మీ పిల్లల్లో కోరికను పెంచండి

మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రులుగా మీరు చేయగలిగిన ప్రాముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయి. అయితే చదవడాన్ని, అధ్యయనం చేయడాన్ని మీ పిల్లలకు నేర్పించేందుకు తీవ్రంగా కృషిచేయడం వాటిలో ఒకటి. ఇది చేసినప్పుడు మీరెంత ఆనందిస్తారు! చిన్నప్పుడు తమ తల్లిదండ్రులు తమకు చదివి వినిపించిన సందర్భాలు కొంతమంది వ్యక్తులకు ఇప్పటికీ మధురస్మృతులుగా ఉండిపోయాయి. చదవడం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, దానివల్ల వచ్చే ఫలితాలు కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్రత్యేకంగా దేవుని సేవకుల విషయంలో ఇది నిజం, ఎందుకంటే బైబిలు అధ్యయనం వల్ల వారు యెహోవాతో మరింత దగ్గరి సంబంధాన్ని పెంపొందించుకోగలుగుతారు. “చదవడాన్ని, అధ్యయనం చేయడాన్ని మేము ఎంతో విలువైనవిగా ఎంచుతాం” అని ఓ క్రైస్తవ తండ్రి అన్నాడు.

మీ పిల్లలకు మంచి అధ్యయన అలవాట్లు ఉంటే వారు దేవునితో దగ్గరి సంబంధాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. (కీర్త. 1:1-3, 6) రక్షణ పొందడానికి అక్షరాస్యత అంత ప్రాముఖ్యం కాకపోయినా, దానివల్ల ఎంతో మేలు జరుగుతుందని బైబిలు చెబుతోంది. ఉదాహరణకు, ప్రకటన 1:3 ఇలా చెబుతోంది: “ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.” అంతేకాక, అధ్యయనం చేస్తున్నప్పుడు ఏకాగ్రత నిలపడం ఎంతో ప్రాముఖ్యమని అపొస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చిన ఈ ప్రేరేపిత ఉపదేశంలో స్పష్టమౌతోంది: “నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.”—1 తిమో. 4:15.

ఒక వ్యక్తికి చదవడం, అధ్యయనం చేయడం తెలిసినంత మాత్రాన ఆయన ప్రయోజనం పొందుతాడని ఏమీలేదు. ఆ సామర్థ్యాలున్న చాలామంది వాటిని ఉపయోగించకుండా అంతగా ప్రయోజనం చేకూర్చనివాటికి సమయాన్ని కేటాయిస్తారు. అయితే తమకు ప్రయోజనం కలిగించే జ్ఞానం సంపాదించుకోవాలనే కోరికను పిల్లల్లో తల్లిదండ్రులు ఎలా వృద్ధి చేయవచ్చు?

మీ ప్రేమ, మీ మాదిరి

ప్రేమగల వాతావరణంలో అధ్యయనం చేస్తే పిల్లలు ఎంతో ఆనందిస్తారు. ఓవన్‌, క్లాడియ అనే క్రైస్తవ దంపతులు తమ ఇద్దరి పిల్లల గురించి ఇలా గుర్తుచేసుకుంటున్నారు: “వాళ్లు ఎప్పుడెప్పుడు అధ్యయనం చేస్తామా అని ఎదురుచూసేవారు. ఎందుకంటే వారు దాన్ని ఓ ప్రత్యేకమైన సమయంగా చూసేవారు. అధ్యయన సమయంలో తాము సురక్షితంగా, హాయిగా ఉన్నామని భావించేవారు. అదెంతో ప్రేమపూర్వక వాతావరణంలో జరుగుతున్నట్లు వారికి కూడా అనిపించేది.” పిల్లలు కౌమారదశకు ఎదుగుతుండగా వారికి సమస్యలు ఎదురౌతాయి. కాబట్టి ప్రేమపూర్వక వాతావరణంలో కుటుంబ అధ్యయన కార్యక్రమాలు జరుపుకుంటే, అధ్యయనం పట్ల వారు ఇష్టాన్ని పెంచుకుంటారు. ఓవన్‌, క్లాడియ వాళ్ల పిల్లలు ఇప్పుడు పయినీరు సేవచేస్తున్నారు. చదవడం, అధ్యయనం చేయడం పట్ల వారు చిన్నప్పుడే ఇష్టాన్ని పెంచుకున్నారు కాబట్టి వారు ఇప్పటికీ వాటినుండి ఎంతో ప్రయోజనం పొందుతున్నారు.

ప్రేమతోపాటు మాదిరి ఉంచడం కూడా ఎంతో ప్రాముఖ్యం. తరచూ తమ తల్లిదండ్రులు చదవడాన్ని, అధ్యయనం చేయడాన్ని చూసే పిల్లలు, సహజంగానే వీటిని తమ దినచర్యలో భాగంగా పరిగణిస్తారు. అయితే చదవడం మీకు కష్టంగా ఉంటే, తల్లిగా లేదా తండ్రిగా మీరెలా మంచి మాదిరి ఉంచగలుగుతారు? ప్రాముఖ్యతనివ్వాల్సిన వాటికి ప్రాముఖ్యతనిస్తూ, చదివే విషయంలో మీకున్న అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి రావచ్చు. (రోమా. 2:21) మీ దినచర్యలో చదవడానికి మీరు ప్రాముఖ్యతనిస్తే మీ పిల్లలు కూడా తమ జీవితాల్లో చదవడానికి ప్రాముఖ్యతనిస్తారు. ముఖ్యంగా బైబిలు పఠనం చేయడానికి, కూటాలకు సిద్ధపడడానికి, కుటుంబ ఆరాధన చేయడానికి మీరు పట్టుదలతో కృషి చేస్తుంటే, వాటి విలువ మీ పిల్లలకు స్పష్టంగా తెలుస్తుంది.

మీ పిల్లల్లో చదవాలన్న కోరికను పెంచేందుకు మీ ప్రేమ, మీ మాదిరి చాలా అవసరం. అయితే వారిని ప్రోత్సహించడానికి మీరు ఏమి చేయవచ్చు?

పిల్లల్లో చదవాలన్న కోరికను పెంచండి

దీనికి, మీరు తీసుకోవాల్సిన ప్రాముఖ్యమైన కొన్ని చర్యలేమిటి? చిన్నప్పటి నుండే వారికి పుస్తకాలు ఇవ్వండి. తన తల్లిదండ్రులను చూసి చదవాలన్న కోరికను పెంచుకున్న ఒక క్రైస్తవ పెద్ద ఇలా చెబుతున్నాడు: “మీ పిల్లలు పుస్తకాలు పట్టుకోవడాన్ని, వాటిని ఉపయోగించడాన్ని అలవాటు చేసుకోనివ్వండి. దానివల్ల వారు పుస్తకాలతో స్నేహం చేస్తారు, అవి వారి జీవితంలో భాగమైపోతాయి.” చాలామంది పిల్లలకు ఇంకా చదవడం రాకపోయినా నా బైబిలు కథల పుస్తకం వంటి బైబిలు సాహిత్యాలను పట్టుకు తిరగడానికి ఇష్టపడతారు. మీ పిల్లలకు అలాంటి పుస్తకాల నుండి కథలను చదివి వినిపించినప్పుడు వారికి భాషతో పరిచయం ఏర్పడడమే కాక, “ఆధ్యాత్మిక భావాలు [విషయాలు], ఆధ్యాత్మిక పదాలు” కూడా తెలుస్తాయి.—1 కొరిం. 2:13, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.

క్రమం తప్పకుండా బిగ్గరగా చదివి వినిపించండి. ప్రతీరోజు క్రమం తప్పకుండా మీ పిల్లలకు ఏదైనా చదివి వినిపించండి. అలా చేస్తే వారు సరైన ఉచ్చారణను తెలుసుకోవడమే కాక చదివే అలవాటును కూడా పెంచుకుంటారు. మీరు ఎలా చదువుతున్నారనేది కూడా ప్రాముఖ్యం. మీరు ఉత్సాహంగా చదివితే వారూ ఉత్సాహంగా వింటారు. నిజానికి చదివిన కథనే మళ్లీ మళ్లీ చదవమని మీ పిల్లలు కోరడం మీరు గమనించే ఉంటారు. వారు కోరినట్లే చేయండి. అలా చేస్తే కొంతకాలానికి వారు కొత్త అంశాలను తెలుసుకోవాలనుకుంటారు. చదివేటప్పుడు మీతోపాటు కూర్చోమని మీ పిల్లల్ని బలవంతపెట్టకండి. ఈ విషయంలో యేసు చక్కని మాదిరిని ఉంచాడు. ఆయన “వారికి వినుటకు శక్తి కలిగినకొలది” బోధించాడు. (మార్కు 4:33) మీరు మీ పిల్లలను బలవంతపెట్టకుండా ఉంటే వారు చదివే సమయం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. మీరు మీ పిల్లల్లో చదవాలన్న కోరికను పెంచగలుగుతారు.

భాగం వహించమని ప్రోత్సహించండి, చదివిన వాటిని చర్చించండి. కొంతకాలానికి మీ చిన్నారులు చాలా పదాలను గుర్తుపట్టగలుగుతారు, పలుకగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. చదివిన భాగాన్ని చర్చిస్తే వారు త్వరగా ప్రగతి సాధిస్తారు. మాట్లాడుకోవడం వల్ల “పిల్లలు కొత్త పదాలు నేర్చుకుంటారు. దానివల్ల, చదువుతున్నప్పుడు వారు ఆ పదాలను గుర్తించి అర్థం చేసుకోగలుగుతారు” అని పిల్లలు మంచి చదువరులుగా తయారయ్యేందుకు ఎలా సహాయం చేయాలనే దాని గురించిన ఓ పుస్తకం వివరిస్తోంది. ఆ పుస్తకం ఇంకా ఇలా చెబుతోంది: “ఎదుగుతున్న పిల్లల మెదడు అక్షరాలను చదివేందుకు ప్రయత్నిస్తుంది కాబట్టి మాట్లాడుకోవడం చాలా అవసరం. ప్రయోజనకరమైన విషయాలు ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటే . . . వారికి అంత మంచి జరుగుతుంది.”

మీ పిల్లలను చదవమనండి, ప్రశ్నలు అడగమని ప్రోత్సహించండి. మీరే ప్రశ్నలు వేసి వాటికి ఇవ్వగల కొన్ని జవాబులు చెప్పండి. అలా చేస్తే, పుస్తకాల్లో సమాచారం ఉంటుందనీ, వారు చదువుతున్న పదాలకు ఓ అర్థముందనీ తెలుసుకుంటారు. మరిముఖ్యంగా దేవుని వాక్యానికి సంబంధించిన పుస్తకాలను చదువుతున్నప్పుడు ఇలా చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యమైన బైబిలు ఇతర పుస్తకాలన్నిటికన్నా ప్రయోజనకరమైనది.—హెబ్రీ. 4:12.

చదవడం చాలా కష్టమైన పని అని ఎప్పుడూ మరచిపోవద్దు. సరిగ్గా చదవాలంటే సమయం తీసుకోవాలి, అభ్యాసం చేయాలి. a కాబట్టి చిన్నపిల్లలు చదవడంపై మక్కువను పెంచుకుంటున్నట్లైతే వారిని మెచ్చుకోవడం ద్వారా ప్రోత్సహించండి. వారిని మెచ్చుకుంటే వారు చదవడం పట్ల మరింత మక్కువను పెంచుకుంటారు.

ప్రయోజనాలు, ఆనందం

అధ్యయనం ఎలా చేయాలో మీ పిల్లలకు నేర్పించినప్పుడు వారు ఓ ఉద్దేశంతో చదవగలుగుతారు. అధ్యయనం చేయడమంటే వాస్తవాలను తెలుసుకుని ఒకదానితో మరొకదానికి ఎలా సంబంధముందో గ్రహించడం అని అర్థం. అలా చేయాలంటే, వ్యవస్థీకరించే, గుర్తుపెట్టుకునే, ఇవ్వబడిన సమాచారాన్ని ఉపయోగించే సామర్థ్యం ఉండాలి. అధ్యయనం చేయడం ఎలాగో పిల్లవాడికి ఒకసారి తెలిసిందంటే చాలు అది తనకు ఎలా సహాయపడుతుందో అర్థం చేసుకోగలుగుతాడు. అప్పుడు అది పిల్లవాడికి ప్రయోజనాల్ని, ఆనందాన్ని ఇస్తుంది.—ప్రసం. 10:10.

అధ్యయనం చేయడానికి ఏవి అవసరమో తెలియజేయండి. కుటుంబ ఆరాధనా సమయంలో, దినవచనం చర్చించే సమయంలో లేదా అలాంటి ఇతర సమయాల్లో మీ పిల్లలకు అధ్యయన నైపుణ్యాలను నేర్పించేందుకు చక్కని అవకాశాలు దొరుకుతాయి. కదలకుండా ఓ చోట కూర్చొని కొంతసేపు ఒకానొక అంశంపై దృష్టినిలపడం వల్ల ఏకాగ్రత నిలపడాన్ని నేర్చుకుంటారు. ఏదైనా నేర్చుకోవాలంటే ఏకాగ్రత నిలపడం చాలా అవసరం. ఇప్పుడు నేర్చుకున్న విషయానికీ, గతంలో తనకు తెలిసిన దానికీ ఎలాంటి సంబంధం ఉందో చెప్పమని మీ అబ్బాయిని అడగవచ్చు. అలా చేస్తే పిల్లవాడు పోల్చడం నేర్చుకుంటాడు. అంతేకాక, చదివినదాని సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పమని మీ కూతుర్ని అడగవచ్చు. అలా చేస్తే చదివినదాని అర్థాన్ని గ్రహించి దాన్ని గుర్తుపెట్టుకోగలుగుతుంది. గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడే మరో విధానం పునఃసమీక్ష చేయడం, అంటే ఒక ఆర్టికల్‌ను చదివిన తర్వాత ముఖ్యాంశాలను మళ్లీ ఒకసారి సొంత మాటల్లో చెప్పమని అడగడం. దీన్ని కూడా మీరు మీ పిల్లలకు నేర్పించవచ్చు. అంతేకాక, కుటుంబ ఆరాధనప్పుడు లేదా సంఘ కూటాలు జరుగుతున్నప్పుడు క్లుప్తంగా నోట్సు రాసుకోమని కూడా మీరు మీ పిల్లలకు నేర్పించవచ్చు. ఏకాగ్రత పెట్టడానికి ఇది వారికి ఎంతో సహాయం చేస్తుంది. ఇలాంటి చిన్నచిన్న విధానాలను పాటిస్తే మీలో, మీ పిల్లల్లో నేర్చుకోవాలనే ఆసక్తి కలగడమేకాక మీరంతా ప్రయోజనం పొందుతారు.

 రిసరాలను అధ్యయనానికి అనువుగా ఉండేలా చూడండి. అధ్యయనం చేయడానికి పరిసరాలు ప్రశాంతంగా, సౌకర్యంగా ఉండాలి, గాలి, వెలుతురు కూడా బాగా ఉండాలి. అలాంటి చోటును ఎంచుకుంటే ఏకాగ్రత నిలపడం సులభమౌతుంది. అంతేకాదు, అధ్యయనం పట్ల తల్లిదండ్రుల వైఖరి కూడా చాలా ప్రాముఖ్యం. ఒక తల్లి ఇలా చెబుతోంది: “ఒక సమయాన్ని కేటాయించి ఆ సమయానికి కట్టుబడి క్రమంగా చదవడం, అధ్యయనం చేయడం చాలా అవసరం. అలా చేసినప్పుడు మీ పిల్లలు ఏ పనైనా ఓ క్రమ పద్ధతిలో చేస్తారు. ఏది ఎప్పుడు పూర్తిచేయాలో వారు నేర్చుకుంటారు.” చాలామంది తల్లిదండ్రులు అధ్యయనం చేసే సమయంలో ఇతర పనులు పెట్టుకోరు. మంచి అధ్యయన అలవాట్లను పిల్లలకు నేర్పించడానికి ఇది ఎంతో చక్కని విధానమని ఓ అధికారి చెబుతున్నాడు.

అధ్యయనం చేయడం ఎంత ప్రాముఖ్యమో చెప్పండి. చివరిగా, తాము నేర్చుకున్నదాన్ని ఎలా పాటించవచ్చో తెలుసుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి. నేర్చుకున్నదాన్ని పాటిస్తే తాము అధ్యయనం ఎందుకు చేస్తున్నారో వారికి అర్థమౌతుంది. ఓ యువ సహోదరుడు ఇలా అంటున్నాడు: “నేను చదువుతున్నదాని వల్ల వచ్చే ప్రయోజనాన్ని గుర్తించకపోతే అధ్యయనం చేయడం చాలా కష్టమౌతుంది. అదే, అన్వయించుకోవాల్సిన విషయాలు ఉన్నాయని గుర్తిస్తే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇష్టంగా చదువుతాను.” ఒక ప్రాముఖ్యమైన లక్ష్యాన్ని సాధించడానికి అధ్యయనం చేయాలనే విషయాన్ని యౌవనస్థులు గుర్తిస్తే వారు దానిలో లీనమైపోతారు. అప్పుడు వారు చదవడానికి ఇష్టపడినట్లే, అధ్యయనం చేయడానికి కూడా ఇష్టపడతారు.

గొప్ప ప్రతిఫలం

మీ పిల్లల్లో చదవాలన్న కోరికను పెంచడం వల్ల వచ్చే ప్రయోజనాలు చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో పుస్తకాలు రాయవచ్చు. ఆ కోరిక వల్ల వారు స్కూల్లో, ఉద్యోగస్థలంలో రాణించగలుగుతారు, తోటి మానవులతో మంచిగా వ్యవహరించగలుగుతారు, ప్రపంచ సంఘటనలను వాటి అర్థాన్ని గ్రహించగలుగుతారు, తల్లిదండ్రులకూ పిల్లలకూ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ప్రయోజనాల మాట అటుంచితే చదవడం, అధ్యయనం చేయడం వల్ల నిజంగా ఎంతో సంతృప్తి కలుగుతుంది.

అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలు అధ్యయనం చేయాలన్న కోరికను పెంచుకుంటే దైవభయంగల వారిగా తయారౌతారు. లేఖన సత్యాల “వెడల్పు పొడుగు లోతు ఎత్తు” గ్రహించేలా వారి మనసును, హృదయాన్ని ప్రేరేపించాలంటే అధ్యయనం పట్ల కోరికను పెంచాలి. (ఎఫె. 3:15-18) క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు చాలా విషయాలు బోధించాల్సివుంది. తమ పిల్లలకు తల్లిదండ్రులు తమ సమయాన్ని, అవధానాన్ని ఇచ్చి వారి జీవితాన్ని తీర్చిదిద్దడానికి చేయగలిగినదంతా చేసినప్పుడు తమ పిల్లలు యెహోవా ఆరాధకులు కావాలని ఆశిస్తారు. మీ పిల్లలకు మంచి అధ్యయన అలవాట్లను నేర్పిస్తే వారు యెహోవాతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకొని దాన్ని కాపాడుకుంటారు. అందుకే మీ పిల్లలు చదవడం పట్ల, అధ్యయనం పట్ల కోరికను పెంచుకునేలా సహాయం చేయడానికి మీరు కృషి చేస్తుండగా యెహోవా ఆశీర్వాదం కోసం తప్పక ప్రార్థించండి.—సామె. 22:6.

[అధస్సూచి]

a నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతతో జీవించే పిల్లలకు చదవడం, అధ్యయనం చేయడం చాలా కష్టమనిపిస్తుంది. అలాంటి వారికి తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చనే దాని గురించి తేజరిల్లు! మార్చి 8, 1997, 3-10 పేజీలు చూడండి.

[26వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

చదవడం . . .

• వారికి పుస్తకాలు ఇవ్వండి

• బిగ్గరగా చదవండి

• భాగం వహించమని ప్రోత్సహించండి

• చదివేదాన్ని చర్చించండి

• మీ పిల్లల్ని చదవమనండి

• ప్రశ్నలు అడగమనండి

అధ్యయనం చేయడం . . .

• తల్లిదండ్రులు మంచి మాదిరి ఉంచాలి

• మీ పిల్లలకు ఈ కింది విషయాలు నేర్పించండి . . .

○ ఏకాగ్రత నిలపడం

○ పోల్చడం

○ సారాంశాన్ని చెప్పడం

○ పునఃసమీక్ష చేయడం

○ నోట్సు తీసుకోవడం

• పరిసరాలను అధ్యయనానికి అనువుగా ఉండేలా చూడండి

• అధ్యయనం చేయడం ఎంత ప్రాముఖ్యమో చెప్పండి