యెహోవా దినం వచ్చినప్పుడు ఏమౌతుంది?
యెహోవా దినం వచ్చినప్పుడు ఏమౌతుంది?
‘యెహోవా దినం దొంగవచ్చినట్లు వచ్చును. భూమి, దానిమీదనున్న కృత్యములు కాలిపోవును [“బయలుపర్చబడును,” NW].’—2 పేతు. 3:10.
1, 2. (ఎ) ప్రస్తుత దుష్ట విధానం ఎలా అంతమౌతుంది? (బి) మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?
యెహోవా సహాయం లేకుండా మానవులు తమను తాము సమర్థంగా పరిపాలించుకోగలరనే మొదటి అబద్ధం కారణంగా ప్రస్తుత దుష్ట వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. (కీర్త. 2:2, 3) అబద్ధం కారణంగా ఉనికిలోకి వచ్చింది ఏదైనా నిరంతరం నిలుస్తుందా? నిలువనే నిలవదు. అలాగని, సాతాను వ్యవస్థ దానంతటదే నాశనమయ్యేంతవరకు మనం వేచివుండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, దేవుడు తన నియమిత సమయంలో, తన పద్ధతిలో దాన్ని నాశనం చేస్తాడు. తన న్యాయాన్ని, ప్రేమను పరిపూర్ణంగా ప్రతిబింబించే విధంగా దేవుడు ఈ దుష్టలోకం మీద చర్య తీసుకుంటాడు.—కీర్త. 92:7; సామె. 2:21, 22.
2 “ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును [‘బయలుపర్చబడును,’ NW]” అని అపొస్తలుడైన పేతురు రాశాడు. (2 పేతు. 3:10) ఇక్కడ ప్రస్తావించబడిన “ఆకాశములు,” “భూమి” వేటిని సూచిస్తున్నాయి? లయమైపోయే “పంచభూతములు” వేటిని సూచిస్తున్నాయి? ‘భూమి, దానిమీదనున్న కృత్యాలు బయలుపర్చబడతాయి’ అని పేతురు చెప్పిన మాటలకున్న అర్థమేమిటి? ఆ ప్రశ్నలకు జవాబు తెలుసుకుంటే, త్వరలో జరగబోయే భయానకమైన సంఘటనలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండగలుగుతాం.
గతించిపోయే ఆకాశాలు, భూమి
3. రెండవ పేతురు 3:10లో ప్రస్తావించబడిన “ఆకాశములు” వేటిని సూచిస్తున్నాయి? అవి ఎలా గతించిపోతాయి?
3 ‘ఆకాశములు’ అనే పదం బైబిల్లో సూచనార్థకంగా ఉపయోగించబడినప్పుడు, అది తరచూ ప్రజలపై అధికారం చెలాయించే ప్రభుత్వాలను సూచిస్తోంది. (యెష. 14:13, 14; ప్రక. 21:1, 2) ‘గతించిపోయే ఆకాశములు,’ భక్తిహీన సమాజంపై ఉన్న మానవ పరిపాలనను సూచిస్తున్నాయి. ఆకాశములు “మహాధ్వనితో” గతించిపోవడం లేక మరో అనువాదం ప్రకారం “గర్జిస్తూ” గతించిపోవడమనేది, అవి ఎంత వేగంగా నాశనమౌతాయనే విషయాన్ని సూచిస్తోంది.
4. “భూమి” దేన్ని సూచిస్తోంది? అది ఎలా నాశనం చేయబడుతుంది?
4 “భూమి” దేవుని నుండి దూరమైపోయిన మానవ లోకాన్ని సూచిస్తోంది. నోవహు కాలంలో అలాంటి లోకం ఉండేది, దేవుడు ఆజ్ఞాపించడం వల్ల అది జలప్రళయంలో నాశనం చేయబడింది. “అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.” (2 పేతు. 3:7) గతంలో వచ్చిన జలప్రళయం భక్తిహీనులనంతా ఒకేసారి నాశనం చేసింది కానీ ‘మహాశ్రమలప్పుడు’ జరిగే నాశనం మాత్రం వివిధ ఘట్టాల్లో చోటుచేసుకుంటుంది. (ప్రక. 7:14) మహాశ్రమల మొదటి ఘట్టంలో, ‘మహా బబులోనును’ నాశనం చేసేలా దేవుడు ఈ ప్రపంచ రాజకీయ నాయకులను ప్రేరేపిస్తాడు. అలా ఈ మత సంబంధమైన వేశ్యను తానెంత అసహ్యించుకుంటున్నాడో యెహోవా చూపిస్తాడు. (ప్రక. 17:5, 16; 18:8) ఆ తర్వాత, మహాశ్రమల చివరి ఘట్టమైన ‘హార్‌మెగిద్దోనులో’ యెహోవాయే స్వయంగా మిగతా సాతాను వ్యవస్థనంతటినీ తుడిచివేస్తాడు.—ప్రక. 16:14-16; 19:19-21.
“పంచభూతములు . . . లయమైపోవును”
5. సూచనార్థక పంచభూతముల్లో ఏవి ఉన్నాయి?
5 అసలు ‘లయమైపోయే పంచభూతములు’ ఏమిటి? ఓ బైబిలు నిఘంటువు “పంచభూతములు” అన్న పదాన్ని “ప్రాథమిక సూత్రాలు” లేక “ప్రాథమిక విషయాలు” అని నిర్వచించింది. ఈ పదం “ఒక భాషకు మూలాధారమైన అక్షరమాలను సూచించడానికి ఉపయోగించబడింది” అని కూడా ఆ నిఘంటువు చెప్పింది. కాబట్టి, పేతురు ఉపయోగించిన “పంచభూతములు” అనే పదం, ఈ లోకంలోని భక్తిహీన లక్షణాలకు, వైఖరులకు, విధానాలకు, లక్ష్యాలకు కారణమైన ప్రాథమిక విషయాలను సూచిస్తోంది. ఈ ‘పంచభూతముల్లో’ ‘అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే లౌకికాత్మ’ కూడా ఉంది. (1 కొరిం. 2:12; ఎఫెసీయులు 2:1-3 చదవండి.) ప్రస్తుతం సాతాను లోకం మొత్తం ఆ ఆత్మతో లేక ‘వాయువుతో’ నిండిపోయింది. అది తిరుగుబాటుదారుడూ గర్విష్ఠీ అయిన ఈ ‘వాయుమండల సంబంధమైన అధిపతియగు’ సాతానులా ఆలోచించేందుకు, ప్రణాళిక వేసుకునేందుకు, మాట్లాడేందుకు, ప్రవర్తించేందుకు ప్రజలను ప్రేరేపిస్తుంది.
6. లౌకికాత్మ మానవుల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
6 తెలిసో, తెలియకో లౌకికాత్మ చేత ప్రభావితులైనవారు తమ మనసుల్ని, హృదయాల్ని సాతాను చేతుల్లో పెట్టేస్తారు. అలా వారు వాడిలా ఆలోచిస్తారు, ప్రవర్తిస్తారు. దానివల్ల వారు దేవుని చిత్తాన్ని పట్టించుకోకుండా తమకు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తారు. వారు అన్ని సందర్భాల్లో గర్వంతో లేదా స్వార్థంతో వ్యవహరిస్తారు, అధికారానికి తిరుగుబాటు చేస్తారు, ‘శరీరాశకు, నేత్రాశకు’ దాసులౌతారు.—1 యోహాను 2:15-17 చదవండి.
7. మనం ఎందుకు మన ‘హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి?’
7 మన స్నేహితులను, చదివే సమాచారాన్ని, వినోదాన్ని, ఇంటర్నెట్‌లోని వెబ్‌సైట్ల వంటివాటిని ఎంచుకునే విషయంలో దైవిక జ్ఞానాన్ని కనబర్చడం ద్వారా మన ‘హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడం’ ఎంత ప్రాముఖ్యం! (సామె. 4:23) అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “[క్రీస్తును] అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.” (కొలొ. 2:8) యెహోవా దినం సమీపిస్తుండగా ఆ హెచ్చరికకు మరింత ప్రాముఖ్యతను ఇవ్వాల్సిన అవసరముంది. ఎందుకంటే, ఆ దినంలో యెహోవా మునుపెన్నడూ చూపనంత కోపాన్ని సాతాను వ్యవస్థలోని పంచభూతముల మీద చూపిస్తాడు. ఆయన కోపమనే వేడి ఆ ‘పంచభూతములను’ కరిగించి ఆయన కోపాన్ని తట్టుకునే శక్తి వాటికి లేదని రుజువుచేస్తుంది. ఇది మనకు మలాకీ 4:1లోని మాటలను గుర్తుచేస్తుంది: “ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండ, రాబోవుదినము అందరిని కాల్చివేయును.”
“భూమియు దానిమీదనున్న కృత్యములును” బయలుపర్చబడతాయి
8. భూమి, దానిమీదున్న కృత్యములు ఎలా ‘బయలుపర్చబడతాయి?’
8 ‘భూమియు దానిమీదనున్న కృత్యములును బయలుపర్చబడతాయి’ అని పేతురు అన్నప్పుడు ఆయన మాటల భావమేమిటి? ‘బయలుపర్చబడడం’ అనే పదానికి “వెల్లడి కావడం” లేదా “బట్టబయలు కావడం” అనే అర్థాలు కూడా ఉన్నాయి. సాతాను లోకం తనమీద, తన రాజ్యం మీద తిరుగుబాటు చేసిందనీ, ఆ కారణంగా అది నాశనానికి తగినదనీ యెహోవా మహాశ్రమల కాలంలో బట్టబయలు చేస్తాడనేది తెలియజేసేందుకే పేతురు ఆ మాటలు అన్నాడు. ఆ కాలం గురించిన ప్రవచనం యెషయా 26:20లో కనిపిస్తోంది. అక్కడిలా ఉంది: “వారి దోషమునుబట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును.”
9. (ఎ) మనం వేటిని తిరస్కరించాలి? ఎందుకు? (బి) మనం వేటిని అలవర్చుకోవాలి? ఎందుకు?
9 లోకంచేత, దాని దుష్ట స్వభావం చేత మలచబడినవారు యెహోవా దినంలో తమ అసలు స్వరూపాన్ని చూపిస్తారు, ఒకరినొకరు చంపుకుంటారు కూడా. నిజానికి, నేడు ప్రజాదరణ పొందిన అనేక రకాల హింసాపూరిత వినోదం వల్ల చాలామంది మనసులు పాడై, ‘ఒకరికొకరు విరోధులై ఒకరిమీదనొకరు పడే’ సమయం కోసం సిద్ధపడుతున్నారు. (జెక. 14:13) హింసను ప్రేమించడం, గర్వం వంటి లక్షణాలను దేవుడు అసహ్యించుకుంటాడు. అయితే అలాంటి లక్షణాలను మనలో పెంచి పోషించే వేటినైనా అవి సినిమాలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, వీడియో గేములు కావచ్చు, మరింకేదైనా కావచ్చు వాటిని తిరస్కరించడం ఎంత ప్రాముఖ్యం! (2 సమూ. 22:28; కీర్త. 11:5) దేవుడు అసహ్యించుకునేవాటిని ప్రేమించే బదులు దేవుని పరిశుద్ధాత్మ ఫలంలోని లక్షణాల్ని అలవర్చుకుందాం. ఎందుకంటే యెహోవా కోపమనే వేడిని తాళుకొని నిలబడేందుకు అవి మనకు సహాయం చేస్తాయి.—గల. 5:22, 23.
‘కొత్త ఆకాశములు, కొత్త భూమి’
10, 11. ‘కొత్త ఆకాశములు, కొత్త భూమి’ వేటిని సూచిస్తున్నాయి?
10 రెండవ పేతురు 3:13 చదవండి. “అన్యజనముల కాలములు” ముగిసిన తర్వాత 1914లో స్థాపించబడిన దేవుని పరలోక రాజ్యమే ఆ ‘కొత్త ఆకాశములు.’ (లూకా 21:24) ఈ ప్రభుత్వంలో క్రీస్తుయేసు, ఆయన సహచరులైన 1,44,000 మంది ఉంటారు. 1,44,000 మందిలో చాలామంది ఇప్పటికే తమ పరలోక బహుమానాన్ని అందుకున్నారు. ప్రకటన పుస్తకంలో, “నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి” వచ్చినవారిగా వీరు ప్రస్తావించబడ్డారు. (ప్రక. 21:1, 2, 22-24) ప్రాచీన ఇశ్రాయేలులో యెరూషలేము పరిపాలన కేంద్రంగా ఉండేది. అదేవిధంగా నూతన విధానంలో నూతన యెరూషలేము, ఆమె భర్తతో కూడిన ప్రభుత్వం పరిపాలన కేంద్రంగా ఉంటుంది. ఈ పరలోక పట్టణం భూవ్యవహారాలను తన అదుపులోకి తీసుకోవడం ద్వారా “దేవుని యొద్దనుండి దిగి” వస్తుంది.
11 ‘కొత్త భూమి,’ దేవుని రాజ్యానికి ఇష్టపూర్వకంగా లోబడ్డామని చూపించిన నూతన మానవ సమాజాన్ని సూచిస్తోంది. దేవుని ప్రజలు ఆధ్యాత్మిక పరదైసును ఇప్పటికే ఆస్వాదిస్తున్నారు. చివరికి, భవిష్యత్తులో దేవుడు ఉద్దేశించినట్లు దాన్ని ‘రాబోయే’ అందమైన ‘లోకములో’ ఆస్వాదిస్తారు. (హెబ్రీ. 2:5) ఆ నూతన విధానంలో మనం ఉండాలంటే ఏమి చేయాలి?
యెహోవా మహాదినం కోసం సిద్ధపడండి
12. యెహోవా దినం ఈ లోకానికి ఎందుకు విభ్రాంతి కలిగిస్తుంది?
12 యెహోవా దినం ‘దొంగలా’ గుట్టుచప్పుడు కాకుండా, అకస్మాత్తుగా వస్తుందని పౌలు, పేతురు ముందే చెప్పారు. (1 థెస్సలొనీకయులు 5:1, 2 చదవండి.) ఆ దినం కోసం కనిపెట్టుకొని ఉంటున్న నిజక్రైస్తవులు కూడా అది అకస్మాత్తుగా రావడం చూసి ఆశ్చర్యపోతారు. (మత్త. 24:44) అయితే, ఈ లోకానికి కేవలం ఆశ్చర్యం మాత్రమే కలగదు. పౌలు ఇలా చెప్పాడు: “లోకులు [యెహోవా నుండి దూరమైపోయిన ప్రజలు]—నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు.”—1 థెస్స. 5:3.
13. ‘నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు’ అనే అరుపును విని మనం మోసపోకూడదంటే ఏమి చేయాలి?
13 ‘నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు’ అనే అరుపు దయ్యాల ప్రేరణతో వచ్చే మరో అబద్ధం మాత్రమే. కానీ దాన్ని విని యెహోవా సేవకులు మోసపోరు. “ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు. మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు” అని పౌలు రాశాడు. (1 థెస్స. 5:4, 5) కాబట్టి, మనమందరం సాతాను లోకంలోని చీకటికి దూరంగా వెలుగులో ఉందాం. పేతురు ఇలా రాశాడు: “ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల [క్రైస్తవ సంఘంలోనే ఉండే అబద్ధ బోధకుల] తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి.”—2 పేతు. 3:17.
14, 15. (ఎ) యెహోవా మనల్ని ఎలా ఘనపరిచాడు? (బి) మనం ఏ ప్రేరేపిత మాటల్ని మనసులో ఉంచుకోవాలి?
14 మనం ఏమీ చేయకుండా కేవలం ‘కాచుకొని’ ఉండాలని యెహోవా చెప్పలేదని గమనించండి. భవిష్యత్తులో జరగబోయేదాన్ని దయతో మనకు ‘ముందుగా తెలియజేయడం’ ద్వారా ఆయన మనల్ని ఘనపరిచాడు.
15 విచారకరంగా, మెలకువగా ఉండాలనే విషయం గుర్తుచేయబడినప్పుడు కొందరు దాన్ని పట్టించుకోలేదు లేదా నమ్మలేదు. ‘ఈ విషయాన్ని మేము ఎన్నో సంవత్సరాలుగా వింటూ వస్తున్నాం’ అని వారు అనవచ్చు. అయితే వారలా అనడం ద్వారా, కేవలం నమ్మకమైన దాసుని తరగతిని మాత్రమే కాదుగానీ యెహోవాను, ఆయన కుమారుణ్ణి కూడా ప్రశ్నిస్తున్నారని మరచిపోకూడదు. “దానికొరకు కనిపెట్టుము” అని యెహోవా చెప్పాడు. (హబ. 2:3) అంతేకాక యేసు ఇలా చెప్పాడు: “ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.” (మత్త. 24:42) పేతురు కూడా ఇలా రాశాడు: “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.” (2 పేతు. 3:11, 12) మనస్ఫూర్తిగా చెప్పబడిన ఆ మాటలను నమ్మకమైన దాసుని తరగతివారు, దాని పరిపాలక సభ సభ్యులు ఎన్నడూ తేలిగ్గా తీసుకోరు!
16. మనం ఎలాంటి వైఖరికి దూరంగా ఉండాలి? ఎందుకు?
16 నిజానికి, తన యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని ‘దుష్ట దాసుడే’ అనుకుంటాడు. (మత్త. 24:48) ఆ దాసుడు, 2 పేతురు 3:3, 4లో చెప్పబడిన గుంపులో భాగంగా ఉన్నాడు. “అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు” వస్తారని, “తమ స్వకీయ దురాశలచొప్పున” నడుచుకుంటారని పేతురు చెప్పాడు. ఆ అపహాసకులు, నమ్మకంగా యెహోవా దినం కోసం కనిపెట్టుకొనివున్న ప్రజల్ని అపహసిస్తారు. వారు రాజ్య సంబంధమైన విషయాలకు ప్రాముఖ్యతనిచ్చే బదులు తమ సొంత కోరికలకే ప్రాముఖ్యతనిస్తారు. మనం అలాంటి అవిధేయతను, ప్రమాదకరమైన వైఖరిని పెంపొందించుకోకుండా ఉందాం! యెహోవా దేవునికి మాత్రమే తెలిసిన ఆ దినం ఎప్పుడు వస్తుందా అని అతిగా ఆందోళన చెందకుండా ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో చురుగ్గా పాల్గొనడం ద్వారా “మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని” పరిగణిద్దాం.—2 పేతు. 3:15; అపొస్తలుల కార్యములు 1:6, 7 చదవండి.
రక్షణకర్తయైన దేవునిపై నమ్మకముంచండి
17. యెరూషలేమును విడిచి పారిపొమ్మని యేసు ఇచ్చిన ఉపదేశానికి నమ్మకమైన క్రైస్తవులు ఎలా స్పందించారు? ఎందుకు?
17 యెరూషలేము దండ్ల చేత చుట్టబడినప్పుడు వెంటనే స్పందించాల్సిందిగా యేసు తన శిష్యులకు ఉపదేశించాడు. సా.శ. 66లో రోమా సైన్యాలు యూదయను చుట్టుముట్టినప్పుడు, నమ్మకమైన క్రైస్తవులు ఆయన ఉపదేశాన్ని పాటించి పారిపోయారు. (లూకా 21:20-23) అయితే, వెంటనే వారు ఎందుకు అంత ఖచ్చితమైన చర్య తీసుకున్నారు? ఎందుకంటే, వారు యేసు హెచ్చరికను గుర్తుపెట్టుకున్నారు. క్రీస్తు ముందుగానే హెచ్చరించినట్లు తమ నిర్ణయం వల్ల కష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చని వారు గ్రహించారు. అదే సమయంలో, యెహోవా తన యథార్థ సేవకుల్ని ఎన్నడూ విడిచిపెట్టడని కూడా వారికి తెలుసు.—కీర్త. 55:22.
18. లూకా 21:25-28 లోని యేసు మాటలను చదివిన తర్వాత, రాబోయే మహాశ్రమల విషయంలో మీకేమనిపిస్తుంది?
18 చరిత్రలో ఎన్నడూ లేనంత తీవ్రమైన మహాశ్రమల్ని ఈ ప్రస్తుత విధానం ఎదుర్కొన్నప్పుడు మనం కూడా మనల్ని రక్షించగల ఏకైక వ్యక్తియైన యెహోవాపై పూర్తి నమ్మకముంచాలి. మహాశ్రమలు ప్రారంభమయ్యాక ఓ సమయంలో ప్రజలు “లోకము మీదికి రాబోవుచున్న వాటివిషయమై భయము కలిగి . . . ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు.” అయితే, ఇదంతా యెహోవా మిగతా ప్రపంచానికి తీర్పు తీర్చకముందే జరుగుతుంది. ఈ సమయంలో దేవుని శత్రువులు భయంతో వణికిపోతారు కానీ, యెహోవా నమ్మకమైన సేవకులు మాత్రం నిర్భయంగా ఉంటారు. తమ విడుదల సమీపించిందని వారికి తెలుసు కాబట్టి వారు ఎంతో సంతోషిస్తారు.—లూకా 21:25-28 చదవండి.
19. మనం తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?
19 ఈ లోకానికి, దాని ‘పంచభూతములకు’ దూరంగా ఉండేవారికి ఎంత అద్భుతమైన భవిష్యత్తు వేచివుంది! అయితే తర్వాతి ఆర్టికల్ చూపిస్తున్నట్లుగా, జీవాన్ని పొందాలంటే మనం చెడు చేయకుండా ఉంటే సరిపోదు. యెహోవా ఇష్టపడే లక్షణాల్ని పెంపొందించుకొని ఆయనకు ఇష్టమైన పనులు కూడా చేయాలి.—2 పేతు. 3:11.
మీరు వివరించగలరా?
• ఈ కింది విషయాలు వేటిని సూచిస్తున్నాయి?
ప్రస్తుత ‘ఆకాశాలు, భూమి’
“పంచభూతములు”
‘కొత్త ఆకాశములు, కొత్త భూమి’
• మనం ఎందుకు దేవునిపై పూర్తి నమ్మకం ఉంచుతాం?
[అధ్యయన ప్రశ్నలు]
[5వ పేజీలోని చిత్రం]
మీరు మీ ‘హృదయాన్ని భద్రంగా కాపాడుకొని’ లోకానికి వేరుగా ఎలా ఉండవచ్చు?
[6వ పేజీలోని చిత్రం]
మనం ‘మన ప్రభువు దీర్ఘశాంతమును రక్షణార్థమైనదిగా’ పరిగణిస్తున్నామని ఎలా చూపించవచ్చు?