కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అందరికీ ఆహ్వానం!

అందరికీ ఆహ్వానం!

అందరికీ ఆహ్వానం!

దేని కోసం అందరు ఆహ్వానించబడుతున్నారు? యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాల్లో ఒకదాన్ని చూడడానికి అందరూ ఆహ్వానించబడుతున్నారు. దాన్ని సాధారణంగా బెతెల్‌ అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యాలయాలు 118 ఉన్నాయి. బెతెల్‌లో జరుగుతున్న పనిని చూసి సందర్శకులు మనస్ఫూర్తిగా మెచ్చుకుంటుంటారు.

మెక్సికో బ్రాంచి కార్యాలయంలో సంతోషంగా ఎంతో కష్టపడి యెహోవా సేవచేస్తున్న వారిని చూసి ఒక బైబిలు విద్యార్థి ఎంతో ముగ్ధుడై, “ఇక్కడ పని చేయాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగాడు. అప్పుడు ఆయనకు ఇలా చెప్పారు: “మొదట నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. ఆ తర్వాత పయినీరుగా అంటే పూర్తికాల రాజ్య ప్రచారకునిగా సేవ చేస్తే మంచిది.” ఆ యువకుడు వారు చెప్పినట్లే చేశాడు. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు మెక్సికో బెతెల్‌లో సేవచేయడానికి ఆహ్వానం అందింది. ఇప్పుడు ఆయన గత 20 ఏళ్లుగా అక్కడే సేవచేస్తున్నాడు.

బెతెల్‌ అంటే ఏమిటి?

హెబ్రీ భాషలో “బేతేలు” అంటే “దేవుని మందిరము” లేదా దేవుని గృహము అని అర్థం. (ఆది. 28:19, అధస్సూచి) ప్రపంచవ్యాప్తంగా 1,00,000 కన్నా ఎక్కువగా ఉన్న యెహోవాసాక్షుల సంఘాలకు ఆధ్యాత్మికంగా సహాయం చేయడానికి బైబిళ్లను, బైబిలు సాహిత్యాలను ముద్రించి, పంచి పెట్టేందుకు వివిధ బ్రాంచి కార్యాలయాల్లోని సదుపాయాలను ఉపయోగిస్తున్నారు. వివిధ సామాజిక, సాంస్కృతిక నేపథ్యాల నుండి వచ్చిన దాదాపు 20,000 మంది స్త్రీపురుషులు బెతెల్‌ సభ్యులుగా సేవచేస్తున్నారు. వారు తమ పూర్తి సమయాన్ని నిస్వార్థంగా యెహోవా కోసం, తమ ఆధ్యాత్మిక సహోదర సహోదరీల కోసం వెచ్చిస్తున్నారు. ఈ క్రైస్తవ పనిలో అనేక సంవత్సరాలుగా సేవ చేస్తున్నవారు సహితం కొత్తగా వచ్చిన చురుకైన యౌవనస్థులతో కలిసి పనిచేస్తున్నారు. బెతెల్‌ కుటుంబ సభ్యులు సాయంకాలాల్లో, వారాంతాల్లో దగ్గర్లోని యెహోవాసాక్షుల సంఘ కూటాలకు హాజరౌతారు, క్రైస్తవ పరిచర్యలో పాల్గొంటారు. అంతేకాక వారు ఖాళీ సమయంలో బైబిలు అధ్యయనం చేస్తారు, వినోదాన్ని ఆస్వాదిస్తారు, ఇతర వ్యక్తిగత పనులు చూసుకుంటారు.

బెతెల్‌ కుటుంబ సభ్యులకు ప్రతీ నెల చేతి ఖర్చుల కోసం కొంత డబ్బు ఇస్తారు. వారు రుచికరమైన, పోషక విలువలుగల ఆహారాన్ని ఆస్వాదిస్తారు. వారికి పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వసతి ఉంటుంది. బెతెల్‌ గృహాలు విలాసవంతంగా ఉండేందుకు రూపొందించబడలేదు కానీ, స్థానిక పరిస్థితులకు తగ్గట్లు రూపొందించబడ్డాయి. భవనాలూ మైదానాలూ శుచిగా, శుభ్రంగా ఉండడాన్ని, ఒక క్రమపద్ధతిలో పని జరుగుతుండడాన్ని చూసి సందర్శకులు అబ్బురపడతారు. వాటిని బట్టే కాక బెతెల్‌లో సాధారణంగా కనిపించే దయాస్వభావాన్ని, సహకార స్ఫూర్తిని చూసి కూడా వారు ముగ్ధులౌతారు. ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేస్తారు. అయినా, ఇతరులను పలకరించలేనంత బిజీగా ఎవ్వరూ ఉండరు. బెతెల్‌లో పెద్దా చిన్నా అనే భేదాలు ఉండవు లేదా తాము చేసే పనిని బట్టి తాము గొప్ప అని ఎవరూ అనుకోరు. అక్కడ ప్రతీ పని అంటే శుభ్రం చేయడం, తోట పని, వంట పని, ముద్రణా పని, ఆఫీసులో పనిచేయడం వంటివన్నీ ప్రాముఖ్యమైనవే. బెతెల్‌లో పనిచేసేవారిని బెతెల్‌ సేవకులు (బెతెలైట్స్‌) అంటారు. యెహోవాసాక్షుల పరిచర్యకు మద్దతునివ్వడానికి వారు ఒక జట్టుగా పనిచేస్తారు.—కొలొ. 3:23.

కొంతమంది బెతెల్‌ సేవకులను పరిచయం చేసుకుందాం

ఈ అంతర్జాతీయ కుటుంబంలో ఉన్నవారి గురించి మనం మరింత తెలుసుకుందాం. వారు ఎందుకు బెతెల్‌లో సేవచేయాలనుకున్నారు? మార్యో ఉదాహరణ తీసుకోండి. యెహోవాసాక్షి అయ్యే సరికి మార్యో, పేరుగాంచిన ఓ జర్మన్‌ ఆటోమోటివ్‌ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తుండేవాడు. జీవితంలో పైకి ఎదగడానికి కూడా అవకాశముండేది. బాప్తిస్మం తీసుకున్న కొంతకాలానికి ఆయన తన దేశంలోని బెతెల్‌ కార్యాలయంలో ఒక వారం పనిచేయడానికి వెళ్లాడు. ముద్రణా పనిలో సహాయం చేసేందుకు ఆయనను నియమించారు. బయట ఉన్న తన తోటి ఉద్యోగస్థులకూ బెతెల్‌ సభ్యులకూ మధ్యవున్న తేడాను ఆయన స్పష్టంగా చూడగలిగాడు. కాబట్టి, ఆయన పూర్తికాల బెతెల్‌ సేవ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. చాలామంది బంధువులు, తోటి ఉద్యోగస్థులు ఆయన ఎందుకు అలా నిర్ణయించుకున్నాడో అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఆయన మాత్రం ఇప్పుడు సంతోషంగా జర్మనీ బెతెల్‌లో సేవచేస్తున్నాడు.

ఎలాంటి ప్రత్యేక విద్య లేదా నైపుణ్యం లేకపోయినా చాలామంది బెతెల్‌ సేవను చేపడతారు. గత 15 ఏళ్లుగా మెక్సికో బెతెల్‌లో సేవచేస్తున్న ఆబెల్‌ విషయంలో కూడా ఇది నిజం. ఆయన ఇలా అంటున్నాడు: “బెతెల్‌ నాకు ఒక పాఠశాల లాంటిది అని చెప్పవచ్చు. ఇక్కడ నేను పెద్దపెద్ద ముద్రణా యంత్రాలను నడపడం నేర్చుకున్నాను. ఈ అనుభవంతో నేను బెతెల్‌ బయట ఎంతో డబ్బు సంపాదించవచ్చని నాకు తెలుసు. కానీ, ఇక్కడ పొందే ప్రశాంతతను, సంతృప్తిని బయటి ఉద్యోగ స్థలాల్లో పొందలేను. అక్కడ సమస్యలు, పోటీతత్వమే కనిపిస్తాయి. అతి శ్రేష్ఠమైన విద్యను పొందానని నాకు అనిపిస్తుంది. దానివల్ల నా జ్ఞానం పెరిగింది, దేవునితో నా సంబంధం బలపడింది. ఉత్తమమైన విశ్వవిద్యాలయంలో కూడా నేను అలాంటి ప్రయోజనాలు పొందలేను.”

సందర్శించడం వల్ల ప్రోత్సాహం పొందుతాం

బెతెల్‌ను సందర్శించడంవల్ల ఒక వ్యక్తి ఆధ్యాత్మికత పెరిగే అవకాశముంది. మెక్సికోకు చెందిన ఒమార్‌ విషయంలో అది నిజమైంది. వాళ్ల అమ్మ ఆయనకు చిన్నప్పటి నుండి బైబిలు సత్యాలను బోధించింది. కానీ ఆయనకు 17 ఏళ్లు ఉన్నప్పుడు, కూటాలకు హాజరవడం, పరిచర్యలో పాల్గొనడం మానేశాడు. మెల్లమెల్లగా ఆయన చెడు అలవాట్లకు బానిసై, డబ్బు సంపాదనలో పడ్డాడు. కొంతకాలం తర్వాత ఆయన కమ్యూనికేషన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు తన పనిలో భాగంగా కొంతమంది ప్రతినిధులతో కలిసి ఒక పరికరాన్ని ప్రదర్శించడానికి మెక్సికో బెతెల్‌కు వెళ్లాడు. ఒమార్‌ ఇలా అన్నాడు: “మేము పరికరాన్ని ప్రదర్శించిన తర్వాత, అక్కడి సహోదరులు మాకు బెతెల్‌ను చూపించారు. వారి దయగల ప్రవర్తన, క్రమపద్ధతిలో పని జరుగుతున్న తీరు నన్నెంతగా కదిలించాయంటే అవి, నేను దేవునికి దూరమై గడుపుతున్న జీవితం గురించి ఆలోచించేలా చేశాయి. వెంటనే నేను కూటాలకు మళ్లీ హాజరవడాన్ని, బైబిలు అధ్యయనం చేయడాన్ని మొదలుపెట్టాను. బెతెల్‌ను సందర్శించిన ఆరునెలల తర్వాత, నేను బాప్తిస్మం తీసుకున్నాను. బెతెల్‌ సందర్శన రూపంలో యెహోవా నాకు ప్రేరణ ఇచ్చినందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.”

జపాన్‌కు చెందిన మాసాహీకో కూడా సాక్షుల కుటుంబంలో పెరిగాడు. అయితే ఆయన, క్రైస్తవ జీవితం చాలా కట్టుబాట్లతో కూడినదని అనుకోవడం మొదలుపెట్టాడు. ఆయన పాఠశాల కార్యకలాపాల్లో మునిగిపోయి, కూటాలకు హాజరవడం, పరిచర్యలో పాల్గొనడం మానేశాడు. మాసాహీకో ఇలా గుర్తుచేసుకున్నాడు: “ఒకరోజు, మా కుటుంబ సభ్యులు, కొంతమంది క్రైస్తవ స్నేహితులు కలిసి బెతెల్‌ను సందర్శించాలనుకున్నారు. మావాళ్లు నన్ను బలవంతం చేయడంతో నేను వారితో వెళ్లాను. బెతెల్‌ను సందర్శించిన తర్వాత గతంలో ఎప్పుడూ లేనంత ప్రోత్సాహాన్ని పొందాను. ప్రయాణంలో ఇతర సహోదరసహోదరీలతో సహవాసం చేయడంవల్ల పొందిన ఆనందాన్ని సాక్షులుకాని నా స్నేహితులతో ఎన్నడూ పొందలేదు. దానివల్ల క్రైస్తవునిగా జీవించాలన్న కోరిక నాలో పెరిగి, బైబిలు అధ్యయనం కోసం అడగాలని నిర్ణయించుకున్నాను.” మాసాహీకో ఇప్పుడు తాను ఉంటున్న సంఘంలో పూర్తికాల సేవకునిగా పనిచేస్తున్నాడు.

ఉద్యోగం నిమిత్తం ఓ సహోదరి ఫ్రాన్స్‌ నుండి మాస్కోకు వెళ్లింది. అక్కడ ఆమె యెహోవా ప్రజలతో సహవాసాన్ని కోల్పోవడంవల్ల, ఆధ్యాత్మికంగా బలహీనపడింది. ఆమె తప్పు చేసింది, చివరకు సాక్షికాని ఓ వ్యక్తిని పెళ్లిచేసుకుంది. ఆ తర్వాత ఫ్రాన్స్‌ నుండి ఓ సహోదరి ఈమెను చూడడానికి వచ్చింది. ఇద్దరూ కలిసి, రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో ఉన్న బెతెల్‌ గృహాన్ని చూడడానికి వెళ్లారు. బెతెల్‌ సందర్శన గురించి ఆమె ఇలా రాసింది: “బెతెల్‌లోని సహోదరసహోదరీలు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. అది నా హృదయాన్ని తాకింది. అక్కడ ఎంత సమాధానంగా ఉందంటే యెహోవా ఆత్మ పనిచేస్తున్నట్లు నాకు అనిపించింది. యెహోవా సంస్థ నుండి దూరం కావడమనే తప్పును నేనెలా చేయగలిగానని నాకు అనిపించింది. బెతెల్‌ను సందర్శించిన తర్వాత నేను యెహోవా సహాయం కోసం ప్రార్థించి, ఓ కొత్త కృతనిశ్చయంతో నా పిల్లలకు బైబిలు బోధించడం మొదలుపెట్టాను.” ఆధ్యాత్మికంగా బలహీనపడిపోయిన ఈ సహోదరికి మళ్లీ ఆధ్యాత్మికంగా బలపడేందుకు వేరే సహాయం కూడా లభించివుంటుంది కానీ బెతెల్‌ సందర్శించడం వల్ల ఆమె చాలా ప్రోత్సాహాన్ని పొందింది. ఆ తర్వాత మంచి ప్రగతి సాధించింది.

సాక్షుల గురించి తెలియనివారి విషయమేమిటి? బెతెల్‌ సందర్శనం వారిపై ఎలాంటి ముద్రవేస్తుంది? రాజకీయాల్లో కూరుకుపోయిన ఆల్బర్టూ అనే వ్యక్తి 1988లో బ్రెజిల్‌లోని బెతెల్‌ను సందర్శించాడు. అక్కడున్న పరిశుభ్రతను, క్రమపద్ధతిని, బాహాటంగా వారు చేసే పనిని చూసి ఆయన ఎంతో ముగ్ధుడయ్యాడు. బెతెల్‌ను సందర్శించడానికి కొద్ది రోజుల ముందు ఆయన ఓ సెమినరీ చూడడానికి వెళ్లాడు. అక్కడ తన బావమరిది పాదిరీగా పనిచేస్తున్నాడు. బెతెల్‌కూ దానికీ మధ్య ఉన్న తేడాను ఆయన గమనించాడు. “సెమినరీలో ప్రతీది రహస్యంగా చేస్తారు” అని ఆయన అంటున్నాడు. బెతెల్‌ను సందర్శించిన కొద్దికాలం తర్వాత ఆయన బైబిలు అధ్యయనాన్ని అంగీకరించి, రాజకీయాలను విడిచిపెట్టాడు. ప్రస్తుతం ఆయన సంఘ పెద్దగా సేవచేస్తున్నాడు.

బెతెల్‌ను సందర్శించడానికి రండి!

చాలామంది తమ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సందర్శించడానికి ఎంతో ప్రయాసపడ్డారు. ఉదాహరణకు, పౌలూ, ఔజెన్యలు తమ దేశంలోని బెతెల్‌ను సందర్శించాలంటే రెండు రోజులపాటు బస్సులో 3,000 కి.మీ. ప్రయాణం చేయాలి. దాని కోసం వారు నాలుగు సంవత్సరాలు డబ్బు ఆదాచేశారు. బెతెల్‌ను సందర్శించిన తర్వాత వారు ఇలా అంటున్నారు: “మా ప్రయాసకు తగిన ఫలితం దక్కింది. యెహోవా సంస్థ గురించి మా అవగాహన పెరిగింది. బెతెల్‌లో జరిగే పని గురించి మా బైబిలు విద్యార్థులకు వివరిస్తున్నప్పుడు కొన్నిసార్లు వారు, ‘మీరెప్పుడైనా అక్కడికి వెళ్లారా?’ అని అడిగేవారు. మేము వెళ్లామని ఇప్పుడు చెప్పగలం.”

మీ దేశంలో గానీ పొరుగు దేశంలో గానీ బ్రాంచి కార్యాలయం, బెతెల్‌ గృహం ఉన్నాయా? వాటిని సందర్శించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అక్కడి సహోదరులు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తారు, యెహోవాను సేవిస్తూ ఉండడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని మీరు తప్పక పొందుతారు.

[18వ పేజీలోని చిత్రం]

మార్యో

[18వ పేజీలోని చిత్రం]

ఆబెల్‌

[18వ పేజీలోని చిత్రం]

జర్మనీ

[18వ పేజీలోని చిత్రం]

జపాన్‌

[18వ పేజీలోని చిత్రం]

బ్రెజిల్‌