కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆదాము ఏ విధంగా దేవుని పోలికలో సృష్టించబడ్డాడు?

ఆదాము ఏ విధంగా దేవుని పోలికలో సృష్టించబడ్డాడు?

ఆదాము ఏ విధంగా దేవుని పోలికలో సృష్టించబడ్డాడు?

“మన స్వరూపమందు . . . నరులను చేయుదము” అని దేవుడు అన్నాడు. (ఆది. 1:26) చరిత్రలో నిలిచిపోయిన మాటలు అవి! ఈ భూమ్మీద, మొదటి మానవునిగా ‘దేవుని కుమారుడైన’ ఆదాముకు ఎవ్వరికీ లేని స్థానం ఉంది. (లూకా 3:38) యెహోవా దేవుడు ఈ భూమ్మీద సృష్టించిన వాటన్నిటిలో ఆదాము సృష్టే అత్యుత్తమమైనది. ఆదాము ఆరవ సృష్టిదినం ముగింపులో సృష్టించబడినందువల్ల మాత్రమే కాదుగానీ, ఆయన “దేవుని స్వరూపమందు” చేయబడ్డాడనే ముఖ్యమైన వాస్తవాన్ని బట్టి అలా చెప్పవచ్చు. (ఆది. 1:27) ఆదాము దేవుని స్వరూపంలో లేక పోలికలో సృష్టించబడ్డాడంటే దాని అర్థమేమిటి?

ఈ భూమ్మీదున్న వేరే ఏ ప్రాణికీ లేని ఆలోచనా శక్తి, ఇతర సామర్థ్యాలు ఆదాము సంతానమైన అపరిపూర్ణ మానవులకున్నాయి. కానీ, ఆ సామర్థ్యాలు ఆదాముకు ఇంకా అత్యుత్తమ స్థాయిలో ఉండేవి. గొప్ప సృష్టికర్త పోలికలో ఆదాము సృష్టించబడ్డాడంటే ప్రేమ, జ్ఞానం, న్యాయం, శక్తి అనే దైవిక లక్షణాలు ఆయనకున్నాయని అర్థం. అప్పటివరకు ఈ భూమ్మీద ఏ జీవికీ లేని సామర్థ్యం అంటే మంచిచెడులను వివేచించే మనస్సాక్షి ఆయనకు ఇవ్వబడింది. దేవుని స్వరూపంలో ఉన్న ఆదాము ఈ భూమిని ఏలుతూ సముద్రంలో ఉన్నవాటిని, భూమ్మీద ప్రాకు ప్రతీ జీవిని, ఆకాశ పక్షులను లోపరచుకొని ఉండేవాడు.

ఆదాము, దేవునికి ఉన్నటువంటి లక్షణాలను కలిగి ఉండేందుకు పూర్తిగా గానీ లేదా కొంచెంగా గానీ ఆత్మ ప్రాణిగా ఉండాల్సిన అవసరంలేదు. యెహోవా దేవుడు నేల మంటితో మనిషిని తయారుచేసి ఆయనలో జీవశక్తిని ఉంచాడు కాబట్టి ఆయన జీవించే ప్రాణి అయ్యాడు. తన సృష్టికర్త స్వరూపాన్ని, పోలికను ప్రతిబింబించే సామర్థ్యాన్ని యెహోవా ఆయనకు ఇచ్చాడు. “మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు.” “ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెను.” (ఆది. 2:7; 1 కొరిం. 15:45, 47) ఆత్మప్రాణి కాకపోయినా, మట్టితో తయారుచేయబడినా మానవుడు యెహోవా దేవుని అద్భుతమైన లక్షణాలను, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించి, తనకివ్వబడిన సాటిలేని సామర్థ్యాలను ఉపయోగిస్తూ తన సృష్టికర్తకు మహిమతేవాలని యెహోవా దేవుడు ఉద్దేశించాడు.