కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎల్లప్పుడూ ‘ప్రేమపూర్వక దయతో’ మాట్లాడండి

ఎల్లప్పుడూ ‘ప్రేమపూర్వక దయతో’ మాట్లాడండి

ఎల్లప్పుడూ ‘ప్రేమపూర్వక దయతో’ మాట్లాడండి

“జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల [‘ప్రేమపూర్వక దయగల,’ NW] ఉపదేశము ఆమె బోధించును.”—సామె. 31:26.

1, 2. (ఎ) ఏ లక్షణాన్ని పెంపొందించుకోవాల్సిందిగా యెహోవా సేవకులు ప్రోత్సహించబడుతున్నారు? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏమి చర్చిస్తాం?

 ప్రాచీన కాలంలో లెమూయేలు రాజుకు వాళ్ల అమ్మ ఓ ప్రాముఖ్యమైన సందేశాన్ని ఇచ్చింది. ఆ సందేశంలో ఓ మంచి భార్యకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం గురించి ఆమె వివరించింది. “జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల [‘ప్రేమపూర్వక దయగల,’ NW] ఉపదేశము ఆమె బోధించును” అని వాళ్ల అమ్మ చెప్పింది. (సామె. 31:1, 10, 26) జ్ఞానంగల స్త్రీకి, యెహోవా దేవుణ్ణి సంతోషపెట్టాలని అనుకునేవారందరికి ఈ లక్షణం ఉండాలి. (సామెతలు 19:22 చదవండి.) సత్యారాధకులందరూ ప్రేమపూర్వక దయతో మాట్లాడాలి. a

2 ప్రేమపూర్వక దయ అంటే ఏమిటి? మనం ఎవరిపట్ల దాన్ని చూపించాలి? మనం ‘ప్రేమపూర్వక దయతో’ మాట్లాడాలంటే ఏమి చేయాలి? మనకు ఆ లక్షణం ఉంటే కుటుంబ సభ్యులతో, తోటి క్రైస్తవులతో మనం ఎలా మాట్లాడతాం?

ప్రేమపూర్వక దయ అంటే ఏమిటి?

3, 4. (ఎ) ప్రేమపూర్వక దయ అంటే ఏమిటి? (బి) ప్రేమపూర్వక దయకూ మామూలు దయకూ మధ్య ఎలాంటి తేడా ఉంది?

3 ప్రేమపూర్వక దయలో ప్రేమ, దయ అనే రెండు లక్షణాలు ఉన్నాయి. ప్రేమపూర్వక దయ చూపించడంలో భాగంగా మనం ఇతరులతో దయగా వ్యవహరించాలి, అంటే ఇతరులపట్ల వ్యక్తిగత శ్రద్ధ కనబరచాలి. అంతేకాక, వారికి కావాల్సిన సహాయం చేయడం ద్వారా, బాగా ఆలోచించి మాట్లాడడం ద్వారా ఆ శ్రద్ధ చూపించాలి. ప్రేమపూర్వక దయ చూపించడంలో భాగంగా మనం ప్రేమ కూడా చూపించాలి కాబట్టి, ఇతరులపట్ల ప్రేమతో వారి బాగోగుల విషయంలో శ్రద్ధ వహించాలి. అయితే, మూలభాషలో ప్రేమపూర్వక దయను వర్ణించేందుకు ఉపయోగించబడిన పదం, ప్రేమతో పుట్టుకొచ్చే దయను మాత్రమే సూచించడంలేదు. దయను చూపించడానికిగల ఉద్దేశం నెరవేరేంతవరకు ఒక వ్యక్తి పట్ల ఇష్టపూర్వకంగా, యథార్థంగా దయ చూపించడమే ప్రేమపూర్వక దయ.

4 ప్రేమపూర్వక దయకూ, మామూలు దయకూ మరో తేడా కూడా ఉంది. ప్రజలు తమకు తెలియనివారిపట్ల కూడా మామూలు దయ చూపిస్తారు లేక మానవత్వంతో దయ చూపిస్తారు. ఓడ బద్ధలైనప్పుడు అపొస్తలుడైన పౌలు పట్ల, 275 మంది ఇతరులపట్ల మెలితే ద్వీపవాసులు అలాంటి దయనే చూపించారు. వారిని మునుపెన్నడూ కలుసుకోకపోయినా ఆ ద్వీపవాసులు దయ చూపించారు. (అపొ. 27:37–28:2) మరోవైపున, ప్రేమపూర్వక దయ అనేది అప్పటికే ఒక బంధాన్ని ఏర్పరచుకున్నవారి మధ్య ఉండే యథార్థతకు సంబంధించినది. b “ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు” కేనీయులు వారిపట్ల ఆ లక్షణాన్నే చూపించారు.—1 సమూ. 15:6.

ధ్యానించడం, ప్రార్థించడం చాలా అవసరం

5. మన నాలుకను ఎలా సాధుచేసుకోవచ్చు?

5 ప్రేమపూర్వక దయతో మాట్లాడడం మనకు కష్టమనిపించవచ్చు. మన నాలుక గురించి చెబుతూ శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు: “యే నరుడును నాలుకను సాధుచేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.” (యాకో. 3:8) అదుపులో ఉంచుకోవడం చాలా కష్టమనిపించే ఈ అవయవాన్ని ఎలా సాధుచేసుకోవచ్చు? మతనాయకులతో యేసు చెప్పిన మాటలను పరిశీలిస్తే మనం దాన్ని ఎలా సాధుచేసుకోవచ్చో తెలుసుకోగలుగుతాం. ఆయన ఇలా చెప్పాడు: “హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును.” (మత్త. 12:34) మనం ప్రేమపూర్వక దయతో మాట్లాడాలంటే ఆ లక్షణాన్ని మన హృదయంలో అంటే మన అంతరంగంలో నాటుకోవాలి. ధ్యానించడం, ప్రార్థించడం వల్ల మనం దాన్ని ఎలా చేయగలమో ఇప్పుడు చూద్దాం.

6. ప్రేమపూర్వక దయతో యెహోవా చేసిన కార్యాలను మనం ఎందుకు కృతజ్ఞతతో ధ్యానించాలి?

6 యెహోవా ‘విస్తారమైన కృపగల దేవుడు’ అని బైబిలు చెబుతోంది. (నిర్గ. 34:6) “యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది” అని కీర్తనకర్త పాడాడు. (కీర్త. 119:64) యెహోవా తన ఆరాధకులపట్ల ఎలా ప్రేమపూర్వక దయ చూపించాడో తెలియజేసే లేఖనాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. సమయం తీసుకొని, ‘యెహోవా కార్యాల’ గురించి కృతజ్ఞతతో ధ్యానిస్తే ఈ దైవిక లక్షణాన్ని అలవర్చుకోవాలనే కోరికను పెంచుకోగలుగుతాం.కీర్తన 77:12 చదవండి.

7, 8. (ఎ) లోతు, ఆయన కుటుంబంపట్ల ప్రేమపూర్వక దయతో యెహోవా ఏమి చేశాడు? (బి) దేవుడు తనపట్ల ప్రేమపూర్వక దయ చూపించినందుకు దావీదుకు ఎలా అనిపించింది?

7 ఉదాహరణకు, అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు నివసించిన సొదొమ పట్టణాన్ని నాశనం చేసినప్పుడు యెహోవా ఆయనను, ఆయన కుటుంబాన్ని ఎలా కాపాడాడో ఆలోచించండి. సమయం దగ్గర పడుతున్నప్పుడు లోతు దగ్గరికి వచ్చిన దేవదూతలు తన కుటుంబాన్ని తీసుకొని ఆ పట్టణాన్ని వెంటనే విడిచివెళ్లమని ఆయనను తొందరపెట్టారు. “అతడు తడవు చేసెను. అప్పుడు అతనిమీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు [ఆ దేవదూతలు] అతనిచేతిని అతని భార్యచేతిని అతని యిద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చి ఆ ఊరి బయటనుంచిరి.” దేవుడు వారిని ఏ విధంగా రక్షించాడో ఆలోచించినప్పుడు మన హృదయం చలించడంలేదా? దేవుడు ప్రేమపూర్వక దయతోనే వారిని అలా రక్షించాడని మనకు అనిపించడంలేదా?—ఆది. 19:16, 19.

8 ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు ఉదాహరణను కూడా చూద్దాం. ఆయన ఇలా పాడాడు: “ఆయన [యెహోవా] నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.” బత్షెబతో చేసిన పాపాన్ని యెహోవా క్షమించినందుకు దావీదు ఎంతో కృతజ్ఞత కనబరిచివుంటాడు. అందుకే, ఆయన యెహోవాను ఇలా స్తుతించాడు: “భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది.” (కీర్త. 103:3, 11) వీటితోపాటు ఇతర లేఖన వృత్తాంతాల గురించి ధ్యానిస్తే మన హృదయం దేవుడు చూపించిన ప్రేమపూర్వక దయపట్ల కృతజ్ఞతతో నిండిపోతుంది. దానివల్ల యెహోవాను స్తుతించాలనే, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలనే ప్రేరణ మనలో కలుగుతుంది. మనకు ఎంత ఎక్కువ కృతజ్ఞతవుంటే అంతెక్కువగా సత్యదేవుణ్ణి అనుకరించాలనుకుంటాం.—ఎఫె. 5:1.

9. ఏ బలమైన కారణాన్నిబట్టి యెహోవా ఆరాధకులు తమ జీవితంలో ప్రేమపూర్వక దయను చూపించాలి?

9 ఇప్పటికే తనతో చక్కని సంబంధం కలిగివున్న వారిపట్ల యెహోవా ప్రేమపూర్వక దయను అంటే యథార్థమైన ప్రేమను చూపిస్తాడని లేఖన ఉదాహరణలను బట్టి తెలుస్తోంది. సజీవుడైన దేవునితో అలాంటి సంబంధంలేనివారి విషయమేమిటి? యెహోవా వారి విషయంలో కఠినంగా లేదా నిర్దయగా వ్యవహరిస్తాడా? కానేకాదు. “[దేవుడు] కృతజ్ఞత లేనివారియెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు” లేదా దయ చూపిస్తున్నాడు అని లూకా 6:35 చెబుతోంది. “ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” (మత్త. 5:45) మనం సత్యం తెలుసుకొని దాన్ని పాటించక ముందు, దేవుడు సాధారణంగా మానవులందరిపట్ల చూపించే దయనే మనపట్ల కూడా చూపించాడు. అయితే, ఇప్పుడు మనం ఆయన ఆరాధకులము కాబట్టి దేవుడు మనపట్ల యథార్థమైన ప్రేమను అంటే విడువక ప్రేమపూర్వక దయను చూపిస్తున్నాడు. (యెషయా 54:10 చదవండి.) కాబట్టి, దానికి మనం ఎంత రుణపడివున్నాం! మనం మన మాటల్లో, మన జీవితంలోని ఇతర రంగాల్లో ప్రేమపూర్వక దయను చూపించడానికి అది ఎంత బలమైన కారణం!

10. ప్రేమపూర్వక దయ మన వ్యక్తిత్వంలో భాగంగా ఉండాలంటే ప్రార్థించడం ఎందుకు అవసరం?

10 ప్రేమపూర్వక దయను పెంపొందించుకునేందుకు ప్రార్థన మనకు ఎంతో సహాయం చేస్తుంది. ఎందుకంటే, ప్రేమపూర్వక దయలోని ప్రేమ, దయ అనే రెండు లక్షణాలు యెహోవా ఆత్మ ఫలంలో ఉన్నాయి. (గల. 5:22) మన జీవితాల్లో దేవుని పరిశుద్ధాత్మ నిర్దేశానికి లోబడడం ద్వారా ప్రేమపూర్వక దయను మన హృదయాల్లో నాటుకోవచ్చు. ప్రార్థనలో పరిశుద్ధాత్మ కోసం కోరితే మనం దాన్ని పొందుతాం. (లూకా 11:13) కాబట్టి, మనం దేవుని ఆత్మ కోసం పదేపదే ప్రార్థించి, దాని నిర్దేశానికి లోబడాలి. మనం ప్రేమపూర్వక దయతో మాట్లాడాలంటే ధ్యానించడం, ప్రార్థించడం చాలా అవసరం.

వివాహిత దంపతులు ఎలా ప్రేమపూర్వక దయ చూపించవచ్చు?

11. (ఎ) భర్తలు తమ భార్యల పట్ల ప్రేమపూర్వక దయ చూపించాలని యెహోవా కోరుతున్నాడన్న విషయం మనకెలా తెలుసు? (బి) భర్త తన నోటిని కాపాడుకోవడానికి ప్రేమపూర్వక దయ ఎలా సహాయం చేస్తుంది?

11 అపొస్తలుడైన పౌలు భర్తలను ఇలా ప్రోత్సహించాడు: “మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి . . . దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.” (ఎఫె. 5:25) యెహోవా ఆదాముహవ్వలకు చెప్పిన విషయాన్ని కూడా పౌలు వారికి గుర్తుచేశాడు. ఆయన ఇలా చెప్పాడు: “పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.” (ఎఫె. 5:31) భర్తలు తమ భార్యలకు యథార్థంగా ఉంటూ అన్ని సమయాల్లో ప్రేమపూర్వక దయ చూపించాలని యెహోవా కోరుతున్నాడన్న విషయం దీన్నిబట్టి స్పష్టమౌతోంది. యథార్థమైన ప్రేమతో మాట్లాడే భర్త అందరిముందు తన భార్య పొరపాట్లను ఎత్తిచూపడు లేదా కించపరిచే విధంగా మాట్లాడడు. ఆమెను సంతోషంగా పొగడుతాడు. (సామె. 31:28, 29) భర్తకు ప్రేమపూర్వక దయ ఉంటే ఏదో కారణాన్నిబట్టి తమ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు తన భార్యను అవమానపరిచే విధంగా మాట్లాడడు.

12. ఓ భార్య ప్రేమపూర్వక దయతో మాట్లాడుతున్నానని ఎలా చూపించవచ్చు?

12 భార్య కూడా ఎల్లప్పుడూ ప్రేమపూర్వక దయతో మాట్లాడాలి. మాటల్లో ఆమె ఈ లోకం తీరును అనుసరించకూడదు. ‘భర్త పట్ల ప్రగాఢమైన గౌరవంతో’ ఆమె అందరిముందు ఆయన గురించి మంచిగా మాట్లాడుతూ, ఆయనపట్ల ఇతరులకున్న గౌరవాన్ని పెంచుతుంది. (ఎఫె. 5:33, NW) తండ్రిపట్ల పిల్లలకున్న గౌరవాన్ని తగ్గించకూడదనే ఉద్దేశంతో ఆమె పిల్లల ముందు ఆయనతో విభేదించదు లేదా ఆయన అభిప్రాయాల్ని ప్రశ్నించదు. అలాంటి విషయాలను ఎవరు లేనప్పుడు తన భర్తతో మాట్లాడి పరిష్కరించుకుంటుంది. “జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును” అని బైబిలు చెబుతోంది. (సామె. 14:1) ఆమె తన ఇంట్లో ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది.

13. ప్రేమపూర్వక దయను ముఖ్యంగా ఎక్కడ చూపించాలి? అలా చూపించాలంటే ఏమి చేయాలి?

13 ఏకాంతంలో కూడా భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు గౌరవపూర్వకంగా మాట్లాడుకోవాలి. “కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి” అని పౌలు రాశాడు. అంతేకాక, ఆయన ఇలా అన్నాడు: “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును . . . పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.” (కొలొ. 3:8, 12-14) తమ తల్లిదండ్రులు అన్ని సమయాల్లో ప్రేమగా, దయగా మాట్లాడుకోవడాన్ని వినే పిల్లలు వర్ధిల్లడమేకాక, మాట్లాడే విషయంలో మరింత ఎక్కువగా తమ తల్లిదండ్రులను అనుకరించే అవకాశం ఉంటుంది.

14. కుటుంబ శిరస్సులు తమ కాపుదలలో ఉన్నవారితో ఎలా ఓదార్పుకరంగా మాట్లాడవచ్చు?

14 యెహోవా గురించి కీర్తనకర్త ఇలా రాశాడు: “నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక.” (కీర్త. 119:76) యెహోవా ముఖ్యంగా ప్రోత్సాహాన్ని, నిర్దేశాన్ని ఇవ్వడం ద్వారా తన ప్రజలను ఆదరిస్తాడు లేదా ఓదారుస్తాడు. (కీర్త. 119:105) మన పరలోక తండ్రి మాదిరిని అనుకరిస్తూ కుటుంబ శిరస్సులు తమ కాపుదలలో ఉన్నవారితో ఎలా ఓదార్పుకరంగా మాట్లాడవచ్చు? అవసరమైన నిర్దేశం, ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా వారు ఆ విధంగా చేయవచ్చు. ఆధ్యాత్మిక సంపదలను వెలికితీసేందుకు కుటుంబ ఆరాధనా సాయంత్రం మనకు ఎంత చక్కని అవకాశమిస్తుంది!—సామె. 24:4.

తోటి విశ్వాసులపట్ల యథార్థమైన ప్రేమ చూపించండి

15. సంఘంలోనివారిని కాపాడడానికి పెద్దలు, పరిణతి సాధించిన ఇతరులు ఎలా మాట్లాడవచ్చు?

15 “నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక” అని దావీదు రాజు ప్రార్థించాడు. (కీర్త. 40:11) ప్రేమపూర్వక దయ చూపించే విషయంలో క్రైస్తవ పెద్దలు, సంఘంలో ఆధ్యాత్మికంగా పరిణతి సాధించిన ఇతరులు యెహోవాను ఎలా అనుకరించవచ్చు? లేఖనాలవైపు అవధానం మళ్లేలా మాట్లాడడం ద్వారా నిజంగా ఆ లక్షణాన్ని కనబరచవచ్చు.—సామె. 17:17.

16, 17. మనం ప్రేమపూర్వక దయతో మాట్లాడుతున్నామని ఏయే విధాలుగా చూపించవచ్చు?

16 ఓ క్రైస్తవుడు బైబిలు ప్రమాణాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని మనం గమనిస్తే ఏమి చేయాలి? మనకు ప్రేమపూర్వక దయ ఉంటే ఆయనను సరిదిద్దడానికి మన నాలుకను ఉపయోగిస్తాం కదా? (కీర్త. 141:5) తోటి విశ్వాసి గంభీరమైన తప్పు చేశాడని మనకు తెలిసిందనుకుందాం. మనకు యథార్థమైన ప్రేమ ఉంటే “సంఘపు పెద్దలను పిలిపింపవలెను” అని తప్పిదస్థుణ్ణి ప్రోత్సహిస్తాం. అప్పుడు పెద్దలు వచ్చి యెహోవా “నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన” చేస్తారు. (యాకో. 5:14) కొన్నిసార్లు ఆ తప్పిదస్థుడు తన తప్పు గురించి పెద్దలకు చెప్పకపోవచ్చు. అలాంటప్పుడు మనం చొరవ తీసుకొని పెద్దలకు దానిగురించి చెప్పకపోతే ఆయనపట్ల ప్రేమగానీ దయగానీ చూపించినట్లు కాదు. మనలో కొందరు నిరుత్సాహపడి ఉండవచ్చు, ఒంటరితనాన్ని అనుభవిస్తుండవచ్చు, తాము దేనికీ పనికిరానివారమని అనుకుంటుండవచ్చు లేదా నిరాశానిస్పృహల్లో మునిగిపోయుండవచ్చు. “ధైర్యము చెడిన” అలాంటివారిని మనం ‘ధైర్యపరచాలి.’ ప్రేమపూర్వక దయతో మాట్లాడుతున్నామని చూపించేందుకు అదొక చక్కని మార్గం.—1 థెస్స. 5:14.

17 దేవుని శత్రువులు మన తోటి విశ్వాసుల గురించి పుకార్లు వ్యాప్తి చేస్తే మనం ఎలా స్పందించాలి? మన సహోదరుల యథార్థతను ప్రశ్నించే బదులు, ఏమీ మాట్లాడకుండా అలాంటి మాటలను తిరస్కరించాలి లేదా ఆ మాటలు ఎంతవరకు సముచితమని, చెబుతున్నదానికి నిజంగా ఆధారముందా అని వాళ్లను అడగాలి. హాని చేయాలనే ఉద్దేశంతో దేవుని శత్రువులు కొన్నిసార్లు మన క్రైస్తవ సహోదరులకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తారు. మనకు యథార్థమైన ప్రేమ ఉంటే, మనం ఆ సమాచారాన్ని వారికి ఇవ్వము.—సామె. 18:24.

ప్రేమపూర్వక దయగలవాడు ‘జీవాన్ని పొందుతాడు’

18, 19. అన్ని సందర్భాల్లో మనం తోటి ఆరాధకులతో ఎందుకు ప్రేమపూర్వక దయతో మాట్లాడాలి?

18 అన్ని సందర్భాల్లో మనం మన తోటి ఆరాధకులందరిపట్ల యథార్థమైన ప్రేమతో వ్యవహరించాలి. కష్టపరిస్థితుల్లో కూడా మనం వారితో ప్రేమపూర్వక దయతోనే మాట్లాడాలి. ఇశ్రాయేలీయుల ప్రేమపూర్వక దయ ‘ప్రాతఃకాలమున పడు మంచులా ఆరిపోతున్నప్పుడు’ యెహోవా దాన్ని ఇష్టపడలేదు. (హోషే. 6:4, 6) అయితే, ఎల్లప్పుడూ ప్రేమపూర్వక దయ చూపిస్తే యెహోవా సంతోషిస్తాడు. అలా చూపించేవారిని ఆయన ఎలా ఆశీర్వదిస్తాడో చూద్దాం.

19 సామెతలు 21:21 ఇలా చెబుతోంది: “నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును.” అలాంటి వ్యక్తి ఎన్నో ఆశీర్వాదాలతోపాటు జీవాన్ని కూడా పొందుతాడు. అంటే ఏదో కొద్దిరోజుల జీవితాన్ని కాదుగానీ నిరంతర జీవితాన్ని పొందుతాడు. ‘వాస్తవమైన జీవమును సంపాదించుకునేందుకు’ యెహోవా ఆయనకు సహాయం చేస్తాడు. (1 తిమో. 6:12, 18, 19) కాబట్టి, మనం ‘ఒకరిపట్ల ఒకరం’ ప్రేమపూర్వక దయను ‘కనబరుద్దాం.’—జెక. 7:9.

[అధస్సూచీలు]

a “ప్రేమపూర్వక దయ” అని అర్థంవచ్చే మూలపదాన్ని తెలుగు బైబిలు కృప, కరుణ, కరుణావాత్సల్యం, దయ అని అనువదించింది. కాబట్టి ఈ ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన లేఖనాల్లో ఈ పదాలు ఉపయోగించబడినప్పటికీ అవి నిజానికి “ప్రేమపూర్వక దయను” సూచిస్తున్నాయి.

b యథార్థత, ప్రేమ, దయ వంటి లక్షణాలకూ ప్రేమపూర్వక దయకూ మధ్యవున్న తేడా గురించి మరింత తెలుసుకునేందుకు మే 15, 2002, కావలికోట, 12-13 పేజీల్లోని 18, 19 పేరాలు చూడండి.

మీరు వివరించగలరా?

• ప్రేమపూర్వక దయ అంటే ఏమిటి?

• మనం ప్రేమపూర్వక దయతో మాట్లాడాలంటే ఏమి చేయాలి?

• భార్యాభర్తలు యథార్థమైన ప్రేమతో ఎలా మాట్లాడుకోవచ్చు?

• మనం మన తోటి ఆరాధకులపట్ల ప్రేమపూర్వక దయతో మాట్లాడుతున్నామని ఎలా చూపించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[23వ పేజీలోని చిత్రం]

యెహోవా ప్రేమపూర్వక దయను దావీదు స్తుతించాడు

[24వ పేజీలోని చిత్రం]

మీరు క్రమంగా కుటుంబ ఆరాధనను జరుపుకుంటున్నారా?