కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాపాత్మురాలిగా పేరుపొందిన స్త్రీతో, “నీ పాపములు క్షమింపబడియున్నవి” అని యేసు ఎలా చెప్పగలిగాడు?—లూకా 7:37, 48.

సీమోను అనే పరిసయ్యుని ఇంట్లో యేసు భోజనానికి కూర్చున్నప్పుడు ఓ స్త్రీ వచ్చి ‘వెనుకతట్టు యేసు పాదాల దగ్గర నిలబడింది.’ తన కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి, తన తలవెంట్రుకలతో వాటిని తుడిచింది. ఆ తర్వాత ఆమె ఆయన పాదాలను ముద్దుపెట్టుకొని, అత్తరు పూసింది. ఆమె ‘ఆ ఊరిలో పాపాత్మురాలిగా’ పేరుపొందిందని సువార్త వృత్తాంతం చూపిస్తోంది. అపరిపూర్ణ మానవులంతా పాపులే అయినా ఘోరమైన పాపాలు చేసినవారిని లేదా పాపాలు చేస్తున్నవారిగా పేరుపొందినవారిని వర్ణించేందుకు లేఖనాలు సాధారణంగా పాపాత్ముడు/పాపాత్మురాలు అనే పదాలను ఉపయోగిస్తున్నాయి. బహుశా, ఆ స్త్రీ వేశ్య అయ్యుండొచ్చు. అలాంటి స్త్రీతో యేసు, “నీ పాపములు క్షమింపబడియున్నవి” అని అన్నాడు. (లూకా 7:36-38, 48) యేసు మాటలకున్న అర్థమేమిటి? విమోచన క్రయధన బలి అప్పటికింకా అర్పించబడలేదు కదా, అలాంటప్పుడు ఆమె ఎలా క్షమించబడగలదు?

ఆమె పాపములు క్షమించబడ్డాయని చెప్పకముందు యేసు తన అతిథేయి అయిన సీమోనుకు ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని వివరించడానికి ఒక ఉపమానం చెప్పాడు. పాపాన్ని తిరిగి చెల్లించలేనంత రుణంతో పోలుస్తూ యేసు సీమోనుతో, “అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థులుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములును అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను—అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన—నీవు సరిగా యోచించితివి” అని అన్నాడు. (లూకా 7:41-43) విధేయత విషయంలో మనమందరం దేవునికి అచ్చివున్నాం కాబట్టి, మనం అవిధేయులమై పాపం చేసినప్పుడు ఆయనకు చెల్లించాల్సింది చెల్లించలేకపోతాం. అలా మనం అప్పును పెంచుకుంటూపోతాం. అయితే యెహోవా రుణాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిలా ఉన్నాడు. అందుకే ప్రార్థనలో దేవుణ్ణి ఇలా వేడుకోమని యేసు తన అనుచరులను ప్రోత్సహించాడు: “మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.” (మత్త. 6:12) మన పాపాలే ఈ రుణాలని లూకా 11:4 చెబుతోంది.

గతంలో, ఏ షరతుల మీద దేవుడు పాపాలను క్షమించాడు? ఆయన పరిపూర్ణ న్యాయం ప్రకారం పాపానికి శిక్ష మరణం. అందుకే ఆదాము తన పాపానికి ప్రాణాన్ని మూల్యంగా చెల్లించుకున్నాడు. అయితే, ఇశ్రాయేలు జనాంగానికి యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం, పాపం చేసిన వ్యక్తి యెహోవాకు జంతు బలిని అర్పిస్తే ఆయన పాపాలు క్షమించబడేవి. ‘ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులు రక్తముచేత శుద్ధిచేయబడునని, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు’ అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (హెబ్రీ. 9:22) దేవుని నుండి పాపక్షమాపణ పొందడానికి వేరే ఏ మార్గమూ లేదని యూదులకు తెలుసు. అందుకే యేసు ఆ స్త్రీతో అన్న మాటలు విని, అక్కడున్నవారు అభ్యంతరపడడంలో ఆశ్చర్యంలేదు. యేసుతోపాటు భోజన పంక్తిలో కూర్చున్నవారు, ‘పాపములు క్షమించుచున్న ఇతడెవడు?’ అని తమలో తాము అనుకున్నారు. (లూకా 7:49) అయితే, ఘోరమైన పాపాలు చేసిన ఈ స్త్రీ దేని ఆధారంగా క్షమించబడుతుంది?

మొదటి మానవులు తిరుగుబాటు చేసిన తర్వాత యెహోవా సంకల్పాన్ని తెలియజేసే మొట్టమొదటి ప్రవచనం చెప్పబడింది. ఓ ‘సంతానం’ వస్తాడనీ, ఆ సంతానం మడిమె మీద సాతాను అతని ‘సంతానం’ కొడతారనీ ప్రవచించబడింది. (ఆది. 3:15) దేవుని శత్రువులు యేసును చంపడం ద్వారా ఆయనను మడిమె మీద కొట్టారు. (గల. 3:13, 16) మానవజాతిని పాప మరణాల నుండి విడిపించడానికి క్రీస్తు చిందించిన రక్తం విమోచన క్రయధనముగా పనిచేస్తుంది. తాను సంకల్పించినదాన్ని నెరవేర్చకుండా యెహోవాను ఏదీ ఆపలేదు కాబట్టి ఆదికాండము 3:15 లోని మాటలు చెప్పబడిన వెంటనే ఆ విమోచన క్రయధనం చెల్లించబడినట్లు యెహోవా పరిగణించాడు. ఆ కారణంగా తన వాగ్దానాల మీద నమ్మకముంచినవారిని ఆయన క్షమించగలిగాడు.

ప్రాచీనకాలంలో యెహోవా అనేకమందిని నీతిమంతులుగా ఎంచాడు. వారిలో హనోకు, నోవహు, అబ్రాహాము, రాహాబు, యోబు వంటివారు ఉన్నారు. వారు యెహోవా వాగ్దానాల నెరవేర్పు కోసం విశ్వాసంతో ఎదురుచూశారు. “అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను” అని శిష్యుడైన యాకోబు రాశాడు. అలాగే రాహాబు గురించి రాస్తూ, “అటువలెనే రాహాబను వేశ్యకూడ . . . క్రియలమూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా?” అని అన్నాడు.—యాకో. 2:21-25.

గతంలో ఇశ్రాయేలు రాజైన దావీదు ఎన్నో ఘోరమైన పాపాలు చేశాడు, కానీ ఆయన సత్యదేవుని పట్ల బలమైన విశ్వాసాన్ని చూపించాడు. అంతేకాదు పాపం చేసిన ప్రతీసారి నిజమైన పశ్చాత్తాపం చూపించాడు. లేఖనాలు ఇంకా ఇలా చెబుతున్నాయి: “పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.” (రోమా. 3:25, 26) యెహోవా తన న్యాయ ప్రమాణాల విషయంలో రాజీపడకుండా యేసు చెల్లించబోయే విమోచన క్రయధన బలి ఆధారంగానే దావీదు చేసిన పాపాలను క్షమించగలిగాడు.

యేసు పాదాలను కడిగిన స్త్రీ పరిస్థితి కూడా అదేనని స్పష్టమౌతుంది. ఆమె అనైతిక జీవితాన్ని గడిపినప్పటికీ పశ్చాత్తాపం చూపించింది. తన పాపానికి ప్రాయశ్చిత్తం అవసరమని ఆమె గుర్తించింది. అంతేకాదు, తన క్రియల ద్వారా విమోచన క్రయధనం కోసం యెహోవా ఏర్పాటు చేసిన వ్యక్తి పట్ల నిజమైన కృతజ్ఞతను చూపించింది. విమోచన క్రయధనం అప్పటికింకా అర్పించబడకపోయినా ఆ బలి ఎంత వాస్తవమైనదంటే దాని విలువ ఆమెలాంటి వ్యక్తులకు అన్వయించడం సాధ్యమైంది. అందుకే యేసు, “నీ పాపములు క్షమింపబడియున్నవి” అని ఆమెతో చెప్పాడు.

ఈ వృత్తాంతం చూపిస్తున్నట్లుగా యేసు పాపులను దూరంగా ఉంచలేదు కానీ వారికి మేలు చేశాడు. అంతేకాదు పశ్చాత్తాపం చూపించిన పాపులను క్షమించడానికి యెహోవా సిద్ధంగా ఉన్నాడు. అపరిపూర్ణ మానవులమైన మనకు ఆ అభయం ఎంతో అద్భుతమైనది, ప్రోత్సాహకరమైనది.

[7వ పేజీలోని చిత్రం]

అది వారికి నీతిగా ఎంచబడెను