విమోచన క్రయధనం మనల్ని ఎలా రక్షిస్తుంది?
విమోచన క్రయధనం మనల్ని ఎలా రక్షిస్తుంది?
“కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.”—యోహా. 3:36.
1, 2. ప్రారంభంలో, జాయన్స్ వాచ్‌టవర్‌ను ప్రచురించడానికిగల ఒక కారణం ఏమిటి?
“బై బిలును జాగ్రత్తగా అధ్యయనం చేసే వ్యక్తి క్రీస్తు మరణానికి ఇవ్వబడిన ప్రాముఖ్యతను బట్టి తప్పక ముగ్ధుడౌతాడు” అని అక్టోబరు, 1879లో వచ్చిన ఈ పత్రిక నాలుగవ సంచిక చెప్పింది. ఆ ఆర్టికల్ ముగింపులో మనమెంతో అవధానమివ్వాల్సిన ఈ మాటలున్నాయి: “క్రీస్తు మరణం బలి అర్పణ కాదనీ, అది పాపాన్ని తీసివేయడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడలేదనీ సూచించే వేటి విషయంలోనైనా జాగ్రత్తగా ఉందాం.”—1 యోహాను 2:1, 2 చదవండి.
2 జాయన్స్ వాచ్‌టవర్ మొదటి సంచిక జూలై 1879లో ప్రచురించబడింది. దాన్ని ప్రచురించడానికి ఎన్నో కారణాలున్నాయి. వాటిలో, విమోచన క్రయధన బలికి సంబంధించిన బైబిలు బోధను సమర్థించడం ఒకటి. 19వ శతాబ్దపు చివరి భాగంలో క్రైస్తవులమని చెప్పుకునే చాలామంది యేసు మరణం మన పాపాలకు ఎలా విమోచన క్రయధనంగా పనిచేస్తుందని ప్రశ్నించడం మొదలుపెట్టారు. కాబట్టి, ఆ సంచికలోని సమాచారం “తగినవేళ అన్నము” అనే చెప్పవచ్చు. (మత్త. 24:45) ఆ సమయంలో చాలామంది పరిణామ సిద్ధాంతాన్ని నమ్మడం మొదలుపెట్టారు. ఆ సిద్ధాంతం, మానవుడు పరిపూర్ణతను కోల్పోయాడనే వాస్తవానికి విరుద్ధమైనది. మానవులు సహజమైన రీతిలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నారనీ, వారికి విమోచన క్రయధనం అక్కర్లేదనీ పరిణామవాదులు బోధిస్తారు. అందుకే, అపొస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చిన ఈ ఉపదేశం ఎంతో సముచితమైనది: “నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి.”—1 తిమో. 6:20, 21.
3. మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?
3 నిస్సందేహంగా, మీరు ‘విశ్వాసం నుండి తప్పిపోకూడదనే’ కృతనిశ్చయంతో ఉండివుంటారు. అందుకే, మీరు ఈ ప్రశ్నలు వేసుకోవడం మంచిది: నాకు విమోచన క్రయధనం ఎందుకు అవసరం? విమోచన క్రయధనం కోసం యెహోవా, యేసు ఎంత మూల్యం చెల్లించాల్సివచ్చింది? దేవుని కోపం నుండి కాపాడగల ఈ అమూల్యమైన ఏర్పాటు నుండి నేను ఎలా ప్రయోజనం పొందవచ్చు?
దేవుని కోపం నుండి కాపాడబడ్డాం
4, 5. ప్రస్తుత దుష్ట విధానంపై యెహోవా కోపం నిలిచివుందని ఏది చూపిస్తోంది?
4 ఆదాము పాపం చేసినప్పటినుండి దేవుని కోపం మానవులపై ‘నిలిచి ఉందని’ బైబిలు, మానవ చరిత్ర చూపిస్తున్నాయి. (యోహా. 3:36) ఇప్పటివరకు ఏ మానవుడూ చావును తప్పించుకోలేకపోతున్నాడనే విషయాన్ని బట్టి అది స్పష్టమౌతోంది. ఎప్పటి నుండో సంభవిస్తూ వస్తున్న విపత్తుల నుండి మానవులను రక్షించడంలో దేవుని ప్రత్యర్థియైన సాతాను పరిపాలన పూర్తిగా విఫలమైంది. ఏ మానవ ప్రభుత్వమూ దాని పౌరుల కనీస అవసరాలను తీర్చలేకపోయింది. (1 యోహా. 5:19) అందుకే యుద్ధాలు, నేరాలు, పేదరికం వంటివి మానవుల్ని పట్టిపీడిస్తూనే ఉన్నాయి.
5 వీటన్నిటినిబట్టి ప్రస్తుత దుష్ట విధానంపై యెహోవా ఆశీర్వాదం లేదని స్పష్టమౌతోంది. “సమస్త భక్తిహీనతమీద . . . దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది” అని పౌలు చెప్పాడు. (రోమా. 1:18-20) కాబట్టి, పశ్చాత్తాపపడకుండా భక్తిహీన జీవితాన్ని జీవించే వారు తమ ప్రవర్తనవల్ల కలిగే పర్యవసానాలను తప్పించుకోలేరు. నేడు, సాతాను లోకంపై తెగుళ్లలా కుమ్మరించబడుతున్న తీర్పు సందేశాల్లో దేవుని కోపం వెల్లడౌతోంది. అలాంటి సందేశం మన బైబిలు ప్రచురణల్లో ప్రచురించబడుతోంది.—ప్రక. 16:1.
6, 7. అభిషిక్త క్రైస్తవులు ఏ పనికి నాయకత్వం వహిస్తున్నారు? సాతాను లోకంలో భాగంగా ఉన్నవారికి ఇంకా ఏ అవకాశం అందుబాటులో ఉంది?
6 సాతాను బంధకాల నుండి విడిపించుకొని దేవునితో సమాధానపడడానికి ఇక అవకాశమే లేదని దానర్థమా? కాదు, ఎందుకంటే యెహోవాతో సమాధానపడడానికి అవకాశాలు ఇంకా అందుబాటులో ఉన్నాయి. ‘క్రీస్తుకు రాయబారులైన’ అభిషిక్తులు పరిచర్యకు నాయకత్వం వహిస్తున్నారు. ఆ పరిచర్య ద్వారా అన్ని జనాంగాల ప్రజలకు, “దేవునితో సమాధానపడుడి” అనే ఆహ్వానం ఇవ్వబడుతోంది.—2 కొరిం. 5:20, 21.
7 ‘రాబోయే ఉగ్రతనుండి’ యేసు ‘మనల్ని తప్పిస్తాడని’ అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (1 థెస్స. 1:9, 10) పశ్చాత్తాపపడని పాపుల మీద యెహోవా చివరిసారి తన కోపాన్ని వెళ్లగ్రక్కినప్పుడు వారు నిత్య నాశనాన్ని పొందుతారు. (2 థెస్స. 1:6-9) మరి ఆ ఉగ్రతను ఎవరు తప్పించుకుంటారు? బైబిలు ఇలా చెబుతోంది: “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.” (యోహా. 3:36) ఈ విధానం నాశనమయ్యే సమయానికి సజీవంగా ఉండి యేసుపట్ల, ఆయన అర్పించిన విమోచన క్రయధనం పట్ల విశ్వాసాన్ని కనబరచినవారు దేవుని ఉగ్రత దినాన్ని తప్పించుకుంటారు.
విమోచన క్రయధనం ఎలా పనిచేస్తుంది?
8. (ఎ) ప్రారంభంలో ఆదాముహవ్వలకు ఏ గొప్ప అవకాశం ఇవ్వబడింది? (బి) తాను పరిపూర్ణ న్యాయంగల దేవుణ్ణని యెహోవా ఎలా నిరూపించుకున్నాడు?
8 దేవుడు ఆదాముహవ్వలను పరిపూర్ణులుగా సృష్టించాడు. వారు దేవునికి విధేయులై ఉండివుంటే, వారు తమ పిల్లలతో కలిసి పరదైసు భూమ్మీద సంతోషంగా జీవించివుండేవారు. కానీ విచారకరంగా, మన మొదటి తల్లిదండ్రులు దేవుని ఆజ్ఞను ఉద్దేశపూర్వకంగా అతిక్రమించారు. దానివల్ల వారికి శాశ్వత మరణమనే శిక్ష విధించబడింది, వారు మొదటి పరదైసు నుండి గెంటివేయబడ్డారు. వారికి పిల్లలు కలిగే సమయానికల్లా పాపం మానవులకు చుట్టుకుంది. చివరకు ఆదాముహవ్వలు వృద్ధులై మరణించారు. యెహోవా తన మాటకు కట్టుబడివుంటాడని ఇది నిరూపిస్తోంది. అంతేకాక, ఆయన పరిపూర్ణ న్యాయంగల దేవుడు. తాను తినొద్దని చెప్పిన పండును తింటే మరణిస్తాడని యెహోవా ఆదామును హెచ్చరించాడు. ఆయన హెచ్చరించినట్లే జరిగింది.
9, 10. (ఎ) ఆదాము సంతతివారు ఎందుకు మరణిస్తున్నారు? (బి) మనం శాశ్వత మరణాన్ని ఎలా తప్పించుకోవచ్చు?
9 ఆదాము వారసులముగా మనం పాపం, దానితోపాటు మరణం సంక్రమించే అపరిపూర్ణ శరీరాలను పొందాం. అలంకారార్థంగా చెప్పాలంటే, ఆదాము పాపం చేసినప్పుడు మనం ఆయన గర్భవాసంలో ఉన్నామని చెప్పవచ్చు. కాబట్టి ఆ మరణదండన మనకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ విమోచన క్రయధనం చెల్లించబడకుండా యెహోవా ముసలితనాన్ని, మరణాన్ని తీసివేసివుంటే ఆయన మాట తప్పినట్లయ్యేది. అందుకే పౌలు మనందరినీ ఉద్దేశించి ఇలా చెప్పాడు: “ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?”—రోమా. 7:14, 24.
10 సరైన రీతిలో మన పాపాన్ని క్షమించి శాశ్వత మరణం నుండి విడిపించేలా న్యాయబద్ధమైన ఏర్పాటును యెహోవా మాత్రమే చేయగలడు. తన ప్రియకుమారుడు పరిపూర్ణ మానవుడిగా పుట్టేలా పరలోకం నుండి ఆయనను పంపించడం ద్వారా యెహోవా ఆ ఏర్పాటు చేశాడు. ఆయన కుమారుడు మన కోసం తన జీవాన్ని విమోచన క్రయధనంగా ఇవ్వగలడు. ఆదాములా కాకుండా యేసు పరిపూర్ణుడిగానే ఉన్నాడు. నిజానికి, “ఆయన పాపము చేయలేదు.” (1 పేతు. 2:22) కాబట్టి, పరిపూర్ణ మానవ వంశానికి తండ్రి అయ్యే సామర్థ్యం ఆయనకు ఉంది. కానీ ఆయన పాపభరితులైన ఆదాము సంతానాన్ని దత్తత తీసుకునేందుకు, తనపట్ల విశ్వాసముంచేవారు నిత్యజీవాన్ని పొందే అవకాశాన్ని ఇచ్చేందుకు ఆయన తన శత్రువుల చేతుల్లో చనిపోవడానికి సిద్ధపడ్డాడు. లేఖనాలు ఇలా చెబుతున్నాయి: “దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను.”—1 తిమో. 2:5, 6.
11. (ఎ) విమోచన క్రయధనం వల్ల వచ్చే ప్రయోజనాలను వివరించేందుకు ఓ ఉదాహరణ చెప్పండి. (బి) విమోచన క్రయధనం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంత గొప్పగా ఉంటాయి?
11 విమోచన క్రయధనం ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ఓ ఉదాహరణ చూద్దాం. కొంతమంది తమ ధనాన్నంతా ఓ బ్యాంకులో దాచిపెడుతూ వచ్చారనుకుందాం. మోసపూరితమైన ఆ బ్యాంకు తమ డబ్బునంతా కాజేయడంతో వారు అప్పులపాలయ్యారు. న్యాయంగానే ఆ బ్యాంకు యజమానులకు అనేక సంవత్సరాల జైలు శిక్షను విధిస్తారు. అయితే, ఆ బ్యాంకులో డబ్బులు దాచిపెడుతూ వచ్చిన అమాయకుల విషయమేమిటి? పేదరికానికి నెట్టివేయబడిన ఆ బాధితుల పరిస్థితి మెరుగుపడాలంటే దయగల ధనికుడు ఆ బ్యాంకు లావాదేవీలను తన చేతుల్లోకి తీసుకొని, వారికి డబ్బును తిరిగి ఇవ్వడం ద్వారా ప్రజలను అప్పుల బారినుండి విడిపించాలి. అదే విధంగా, యెహోవా దేవుడు, ఆయన ప్రియ కుమారుడు, ఆదాము సంతానాన్ని కొని యేసు చిందించిన రక్తం ఆధారంగా వారి పాపమనే రుణాన్ని రద్దుచేశారు. అందుకే బాప్తిస్మమిచ్చు యోహాను, “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల” అని యేసు గురించి చెప్పగలిగాడు. (యోహా. 1:29) ఈ లోకపాపాలను అంటే సజీవుల పాపాలనే కాక మృతుల పాపాలను కూడా యేసు మోసుకెళ్తాడు.
విమోచన క్రయధనం కోసం ఎంత మూల్యం చెల్లించాల్సివచ్చింది?
12, 13. ఇస్సాకును అర్పించడానికి అబ్రాహాము సంసిద్ధతను చూపించడం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
12 విమోచన క్రయధనం చెల్లించడానికి మన పరలోక తండ్రి, ఆయన ప్రియ కుమారుడు ఎంత త్యాగం చేయాల్సి వచ్చిందో మనం పూర్తిగా అర్థం చేసుకోలేం. అయితే, ఈ విషయం గురించి ధ్యానించేందుకు సహాయం చేసే ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. ఉదాహరణకు, “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుము” అని దేవుడు అబ్రాహాముకు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞకు లోబడి బలి అర్పించేందుకు మోరీయా పర్వతానికి వెళ్లడానికి చేసిన మూడురోజుల ప్రయాణంలో అబ్రాహాముకు ఎలా అనిపించివుంటుందో ఊహించండి.—ఆది. 22:2-4.
13 అబ్రాహాము చివరకు యెహోవా చెప్పిన స్థలానికి చేరుకున్నాడు. ఇస్సాకు చేతులను, కాళ్లను బంధించి, తాను కట్టిన బలిపీఠంమీద ఆయనను పడుకోబెడుతున్నప్పుడు అబ్రాహాము ఎంత వేదనను అనుభవించివుంటాడో ఆలోచించండి. తన కుమారుణ్ణి చంపేందుకు తాను తీసుకొచ్చిన కత్తిని ఎత్తడానికి ఆయన ఎంత మానసిక వ్యథను అనుభవించివుంటాడు! పదునైనది శరీరంలోకి దిగుతున్నప్పుడు కలిగే తీవ్రమైన బాధకు, చివరకు మరణానికి సిద్ధపడుతూ బలిపీఠం మీద పడుకుంటున్నప్పుడు ఇస్సాకుకు కూడా ఎలా అనిపించివుంటుందో ఒకసారి ఊహించండి. సరిగ్గా సమయానికి యెహోవా దూత అబ్రాహామును ఆపేశాడు. ఆ సందర్భంలో అబ్రాహాము, ఇస్సాకు చేసిన పనుల గురించి ధ్యానిస్తే, తన కుమారుణ్ణి హత్య చేసేందుకు సాతాను ప్రతినిధులను అనుమతించడానికి యెహోవా ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలుగుతాం. ఇస్సాకు అబ్రాహాముకు సహకరించినట్లే యేసు కూడా మన కోసం బాధలు అనుభవించి, మరణించడానికి సంసిద్ధత చూపించాడు.—హెబ్రీ. 11:17-19.
14. విమోచన క్రయధనానికి ఎంత మూల్యం చెల్లించాల్సివచ్చిందో అర్థం చేసుకోవడానికి యాకోబు జీవితంలోని ఏ సంఘటన సహాయం చేస్తుంది?
14 అంతేకాక, యాకోబు జీవితంలో జరిగిన సంఘటనను పరిశీలిస్తే కూడా విమోచన క్రయధనానికి ఎంత మూల్యం చెల్లించాల్సివచ్చిందో తెలుసుకోవచ్చు. యాకోబు తన కుమారులందరిలో యోసేపునే ఎక్కువగా ఇష్టపడ్డాడు. విచారకరంగా, యోసేపు సహోదరులు ఈర్ష్యతో ఆయనను అసహ్యించుకున్నారు. అయినా, తన సహోదరులు ఎలా ఉన్నారో చూసి రమ్మని తండ్రి చెప్పినప్పుడు యోసేపు వెళ్లడానికి ఇష్టపడ్డాడు. ఆయన సహోదరులు అప్పుడు హెబ్రోనులోని తమ ఇంటికి ఉత్తరాన దాదాపు 100 కి.మీ దూరంలో యాకోబు మందను కాస్తున్నారు. ఆ తర్వాత రక్తసిక్తమైన యోసేపు వస్త్రంతో తన కుమారులు వెనక్కి వచ్చినప్పుడు యాకోబుకు ఎలా అనిపించివుంటుందో ఊహించండి! “ఈ అంగీ నా కుమారునిదే; దుష్టమృగము వానిని తినివేసెను; యోసేపు నిశ్చయముగా చీల్చబడెను” అని యాకోబు అన్నాడు. ఇదంతా యాకోబు మీద ఎంతో ప్రభావం చూపించింది. ఆయన ఎన్నో రోజులు యోసేపు విషయంలో ఏడ్చాడు. (ఆది. 37:33, 34) అపరిపూర్ణ మానవులు స్పందించినట్లు యెహోవా స్పందించడు. అయినా, యాకోబు జీవితంలో జరిగిన ఈ సంఘటన గురించి ధ్యానిస్తే తన ప్రియకుమారుడు మానవునిగా భూమ్మీద హింసించబడుతున్నప్పుడు, క్రూరంగా చంపబడుతున్నప్పుడు దేవునికి ఎలా అనిపించివుంటుందో కొంతవరకు అర్థం చేసుకోగలుగుతాం.
విమోచన క్రయధనం నుండి మనం ఎలా ప్రయోజనం పొందుతాం?
15, 16. (ఎ) విమోచన క్రయధనాన్ని అంగీకరిస్తున్నానని యెహోవా ఎలా చూపించాడు? (బి) మీరు విమోచన క్రయధనం నుండి ఎలా ప్రయోజనం పొందారు?
15 యెహోవా దేవుడు తన నమ్మకమైన కుమారుణ్ణి మహిమాన్వితమైన ఆత్మ శరీరంతో పునరుత్థానం చేశాడు. (1 పేతు. 3:18) పునరుత్థానం చేయబడిన యేసు 40 దినాల వరకు తన శిష్యులకు కనిపించి, వారి విశ్వాసాన్ని బలపర్చి, వారు ఆ తర్వాత చేయబోయే గొప్ప సువార్త పని కోసం వారిని సిద్ధపరిచాడు. ఆ తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమై, తన విమోచన క్రయధన బలిపట్ల విశ్వాసముంచే తన నిజ అనుచరులకు అన్వయించబడేలా తాను చిందించిన రక్తపు విలువను దేవునికి అర్పించాడు. సా.శ. 33 పెంతెకొస్తునాడు యెరూషలేములో సమకూడిన తన శిష్యులమీద పరిశుద్ధాత్మ కుమ్మరించడానికి యేసును నియమించడం ద్వారా యెహోవా దేవుడు క్రీస్తు విమోచన క్రయధనాన్ని అంగీకరిస్తున్నానని చూపించాడు.—అపొ. 2:33.
16 అలా పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన వెంటనే క్రీస్తుకు చెందిన ఈ అభిషిక్త అనుచరులు, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకొని దేవుని కోపాన్ని తప్పించుకోండని తోటి మానవులను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. (అపొస్తలుల కార్యములు 2:38-40 చదవండి.) చారిత్రాత్మకమైన ఆ రోజు నుండి ఇప్పటివరకు అన్ని జనాంగాలకు చెందిన లక్షలాదిమంది యేసు విమోచన క్రయధన బలిమీద విశ్వాసముంచడం ద్వారా దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. (యోహా. 6:44) ఇప్పటిదాకా చర్చించిన విషయాలేకాక, మనం మరో రెండు విషయాలు కూడా చర్చించాలి: మనం చేసిన మంచి పనులనుబట్టి మనకు నిత్యజీవమనే నిరీక్షణ ఇవ్వబడిందా? ఈ అద్భుతమైన నిరీక్షణను మనం ఒకసారి పొందిన తర్వాత దాన్ని మళ్ళీ కోల్పోయే అవకాశముందా?
17. దేవుని స్నేహితునిగా ఉండే అద్భుతమైన ఆశీర్వాదాన్ని మీరెలా పరిగణించాలి?
17 విమోచన క్రయధనం మన కోసం అర్పించబడడానికి మనం అసలు అర్హులమే కాదు. అయితే, నేడు లక్షలాదిమంది దానిపట్ల విశ్వాసముంచడం ద్వారా దేవుని స్నేహితులయ్యారు. పరదైసు భూమ్మీద నిరంతరం జీవించే అవకాశం వారికి ఉంది. అయితే, యెహోవా స్నేహితులైనంత మాత్రాన ఆయనతో మన సంబంధం అలాగే ఉంటుందని ఏమీ లేదు. భవిష్యత్తులో రాబోయే దేవుని ఉగ్రత దినాన్ని మనం తప్పించుకోవాలంటే, ‘క్రీస్తుయేసు చెల్లించిన విమోచనం’ పట్ల మనం ఎంతో కృతజ్ఞతను కనబరుస్తూ ఉండాలి.—రోమా. 3:24; ఫిలిప్పీయులు 2:12 చదవండి.
విమోచన క్రయధనంపట్ల విశ్వాసాన్ని కనబరుస్తూ ఉండండి
18. విమోచన క్రయధనం పట్ల విశ్వాసముంచాలంటే ఏమి చేయాలి?
18 మన ప్రభువైన యేసుక్రీస్తు పట్ల విశ్వాసం ఉంచాలంటే మనం ఆయనకు విధేయత కూడా చూపించాలని ఈ ఆర్టికల్ ముఖ్యవచనమైన యోహాను 3:36 చూపిస్తోంది. విమోచన క్రయధనం పట్ల కృతజ్ఞత ఉంటే మనం యేసు బోధలను, నైతికత గురించి ఆయన చెప్పిన విషయాలను మన జీవితంలో పాటించడానికి ప్రేరణ పొందుతాం. (మార్కు 7:21-23) ఏ పశ్చాత్తాపం చూపించకుండా జారత్వం, సరసోక్తులు, ‘అన్నిరకాల అపవిత్రత’ వంటి కార్యాలను చేసేవారిమీద ‘దేవుని ఉగ్రత’ రాబోతుంది. ఆ ‘అపవిత్ర’ కార్యాల్లో అదేపనిగా అశ్లీల చిత్రాలను చూడడం కూడా ఉంది.—ఎఫె. 5:3-6.
19. ఏ మంచి కార్యాలు చేయడం ద్వారా మనం విమోచన క్రయధనం పట్ల విశ్వాసాన్ని చూపించవచ్చు?
19 విమోచన క్రయధనం పట్ల మనకు కృతజ్ఞత ఉంటే ‘పరిశుద్ధమైన ప్రవర్తనతోకూడిన క్రియల్లో’ చురుగ్గా పాల్గొంటాం. (2 పేతు. 3:11, NW) క్రమం తప్పకుండా మనస్ఫూర్తిగా ప్రార్థించడానికి, వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేయడానికి, కూటాలకు హాజరుకావడానికి, కుటుంబ ఆరాధన చేయడానికి, రాజ్య ప్రకటనా పనిలో ఉత్సాహంగా పాల్గొనడానికి తగినంత సమయాన్ని కేటాయించాలి. మనం ‘ఉపకారము, ధర్మము చేయడాన్ని మరచిపోకుండా’ ఉందాం. ఎందుకంటే, “అట్టి యాగములు దేవునికిష్టమైనవి.”—హెబ్రీ. 13:15, 16.
20. విమోచన క్రయధనం పట్ల విశ్వాసాన్ని కనబరుస్తూ ఉండేవారు భవిష్యత్తులో ఎలాంటి ఆశీర్వాదం కోసం ఎదురుచూడవచ్చు?
20 ఈ దుష్ట విధానంపై యెహోవా తన ఉగ్రతను వెళ్లగ్రక్కే సమయానికల్లా మనం విమోచన క్రయధనం పట్ల విశ్వాసాన్ని ఉంచి, సదా దానిపట్ల మన కృతజ్ఞతను చూపించి ఉంటాం కాబట్టి ఎంత సంతోషిస్తాం! దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకంలో, మనల్ని ఆయన ఉగ్రత నుండి తప్పించిన ఈ అద్భుతమైన ఏర్పాటుపట్ల మనం నిత్యమూ కృతజ్ఞతను కనబరుస్తూ ఉంటాం.—యోహాను 3:16; ప్రకటన 7:9, 10, 13, 14 చదవండి.
మీరెలా జవాబిస్తారు?
• మనకు విమోచన క్రయధనం ఎందుకు అవసరం?
• విమోచన క్రయధనం కోసం ఎంత మూల్యం చెల్లించాల్సివచ్చింది?
• విమోచన క్రయధనం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి?
• యేసు విమోచన క్రయధన బలిపట్ల మనం ఎలా విశ్వాసాన్ని కనబరుస్తాం?
[అధ్యయన ప్రశ్నలు]
[13వ పేజీలోని చిత్రం]
యెహోవాతో సమాధానపడడానికి అవకాశాలు ఇంకా అందుబాటులో ఉన్నాయి
[15వ పేజీలోని చిత్రాలు]
అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాల్లో జరిగిన ఈ సంఘటనలను ధ్యానిస్తే విమోచన క్రయధనం కోసం ఎంత గొప్ప మూల్యం చెల్లించబడిందో అర్థం చేసుకొని కృతజ్ఞత కనబర్చగలుగుతాం