కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఐక్యతనుబట్టి సత్యారాధనను గుర్తించవచ్చు

ఐక్యతనుబట్టి సత్యారాధనను గుర్తించవచ్చు

ఐక్యతనుబట్టి సత్యారాధనను గుర్తించవచ్చు

‘దొడ్డిలోని గొర్రెల్లా నేను వారిని ఐక్యపరుస్తాను.’—మీకా 2:12, NW.

1. సృష్టిలో దేవుని జ్ఞానం ఎలా వెల్లడౌతోంది?

 ఒక కీర్తనకర్త తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇలా అన్నాడు: “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.” (కీర్త. 104:24) ఈ భూమ్మీద లక్షల రకాల మొక్కలు, పురుగులు, జంతువులు, సూక్ష్మజీవుల వంటి జీవరాసులతో కూడిన సంక్లిష్టమైన, అద్భుతమైన జీవన వల కనిపిస్తుంది. ఆ వలలో ప్రతీది ఒకదానిపై ఒకటి ఆధారపడివుండడాన్ని చూస్తే దేవుడు ఎంత జ్ఞానవంతుడో తెలుస్తుంది. మీ శరీరంలోని పెద్ద అవయవాల్లోనే కాక మీ కణాల్లో ఉండే సూక్ష్మ భాగాల్లో కూడా కొన్ని వేల ప్రక్రియలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఆ ప్రక్రియలు సమన్వయంతో జరిగితేనే మీ శరీర వ్యవస్థలు సంపూర్ణంగా ఉంటాయి, మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు.

2. పదమూడవ పేజీలోని చిత్రాన్నిబట్టి, క్రైస్తవుల ఐక్యత నిజంగా ఓ అద్భుతమని ఎందుకు అనిపించి ఉండవచ్చు?

2 మానవులు ఒకరిపై ఒకరు ఆధారపడుతూ జీవించేలా యెహోవా వారిని సృష్టించాడు. వారి రూపాలు, వ్యక్తిత్వాలు, నైపుణ్యాలు వేర్వేరుగా ఉంటాయి. ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరిపై ఒకరు ఆధారపడుతూ జీవించేలా మొదటి మానవులకు యెహోవా తనకున్నటువంటి లక్షణాలను అనుగ్రహించాడు. (ఆది. 1:27; 2:18) కానీ, మానవ సమాజం దేవునికి దూరమైపోయినందువల్ల, ఎన్నడూ ఐక్యంగా ఉండలేకపోయింది. (1 యోహా. 5:19) కాబట్టి, మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘం ఐక్యంగా ఉండడాన్ని చూసినప్పుడు అది నిజంగా ఓ అద్భుతమని ఇతరులకు అనిపించివుండవచ్చు. ఎందుకంటే అప్పటి సంఘంలో దాసులు, గ్రీసు దేశానికి చెందిన ప్రముఖ స్త్రీలు, విద్యావంతులైన యూదా పురుషులు, ఒకప్పటి విగ్రహారాధకులు అందరూ కలిసిమెలిసి ఐక్యంగా ఉండేవారు.—అపొ. 13:1; 17:4; 1 థెస్స. 1:9; 1 తిమో. 6:1.

3. క్రైస్తవుల ఐక్యతను బైబిలు ఎలా వర్ణిస్తోంది? మనం ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

3 సత్యారాధన వల్ల ప్రజలు శరీరంలోని అవయవాల్లా ఒకరితో ఒకరు సహకరించుకుంటూ సామరస్యంగా పనిచేయగలుగుతారు. (1 కొరింథీయులు 12:12, 13 చదవండి.) మనం ఇప్పుడు ఈ ప్రశ్నల్ని పరిశీలిస్తాం: సత్యారాధన ప్రజల్ని ఎలా ఐక్యపరుస్తుంది? అన్ని దేశాలకు చెందిన లక్షలాదిమందిని యెహోవా మాత్రమే ఎందుకు ఐక్యపరచగలడు? ఐక్యతకు ఆటంకం కలిగించే వేటిని అధిగమించడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడు? ఐక్యత విషయంలో నామకార్థ క్రైస్తవులకు, నిజ క్రైస్తవులకు మధ్యవున్న తేడా ఏమిటి?

సత్యారాధన ప్రజల్ని ఎలా ఐక్యపరుస్తుంది?

4. సత్యారాధన ప్రజల్ని ఎలా ఐక్యపరుస్తుంది?

4 యెహోవాయే సమస్తాన్ని సృష్టించాడు కాబట్టి, ఆయనే విశ్వ సర్వాధిపతి అని సత్యారాధకులు గుర్తిస్తారు. (ప్రక. 4:10, 11) నిజక్రైస్తవులు వేర్వేరు సమాజాల్లో, వేర్వేరు పరిస్థితుల్లో జీవిస్తున్నప్పటికీ, వారందరూ దేవుడు తమకిచ్చిన ఒకే రకమైన నియమాలను, ఒకే రకమైన బైబిలు సూత్రాలను పాటిస్తారు. కాబట్టి, సరైన కారణంతోనే వారు యెహోవాను “తండ్రీ” అని పిలుస్తారు. (యెష. 64:8; మత్త. 6:9) అలా వారు ఆధ్యాత్మిక సహోదరులుగా ఉంటూ కీర్తనకర్త వర్ణించిన మనోహరమైన ఐక్యతను అనుభవిస్తారు: “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!”—కీర్త. 133:1.

5. సత్యారాధకులు ఏ లక్షణం వల్ల ఐక్యంగా ఉండగలుగుతున్నారు?

5 నిజక్రైస్తవులు అపరిపూర్ణులే అయినా, ఐక్యంగా యెహోవాను ఆరాధిస్తారు. ఎందుకంటే, వారు ఒకరినొకరు ప్రేమించడం నేర్చుకున్నారు. ప్రేమ గురించి మరెవ్వరూ బోధించని విధంగా యెహోవా వారికి బోధిస్తున్నాడు. (1 యోహాను 4:7, 8 చదవండి.) ఆయన వాక్యం ఇలా చెబుతోంది: “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.” (కొలొ. 3:12-14) పరిపూర్ణతకు అనుబంధమైన ఈ ప్రేమను బట్టే ప్రాథమికంగా నిజక్రైస్తవులు గుర్తించబడతారు. ఈ ఐక్యతే సత్యారాధనను అబద్ధ ఆరాధన నుండి వేరు చేస్తుందని మీరు మీ సొంత అనుభవం నుండి తెలుసుకునే ఉంటారు.—యోహా. 13:35.

6. దేవుని రాజ్య నిరీక్షణ వల్ల మనం ఎలా ఐక్యంగా ఉండగలుగుతాం?

6 అంతేకాక, దేవుని రాజ్యమే మానవ సమస్యలకు ఏకైక పరిష్కారమని నిజక్రైస్తవులు నమ్ముతారు కాబట్టి వారు ఐక్యంగా ఉంటారు. త్వరలోనే మానవ ప్రభుత్వాల స్థానంలో దేవుని రాజ్యం నెలకొల్పబడుతుందని, విధేయులైన మానవులకు అదే నిజమైన, శాశ్వతమైన శాంతిని తెస్తుందని వారికి తెలుసు. (యెష. 11:3-9; దాని. 2:44) అందుకే, “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు” అని యేసు తన అనుచరుల గురించి చెప్పిన మాటల్ని వారు పాటిస్తారు. (యోహా. 17:16) ఈ లోక పోరాటాల్లో నిజ క్రైస్తవులు పాల్గొనరు కాబట్టి, తమ చుట్టూవున్న ప్రజలు యుద్ధంలో పాల్గొంటున్నా వారు మాత్రం ఐక్యంగా ఉండగలుగుతున్నారు.

ఒకే మూలం నుండి ఆధ్యాత్మిక నిర్దేశం పొందుతున్నారు

7, 8. బైబిలు ఉపదేశం వల్ల మనం ఎలా ఐక్యంగా ఉండగలుగుతున్నాం?

7 మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఒకే మూలం నుండి ప్రోత్సాహం పొందారు కాబట్టి అందరూ ఐక్యంగా ఉండగలిగారు. అపొస్తలులు, యెరూషలేములోని పెద్దలతో కూడిన పరిపాలక సభ ద్వారా యేసుక్రీస్తు సంఘానికి బోధిస్తూ, దాన్ని నిర్దేశిస్తున్నాడని ఆ క్రైస్తవులు గుర్తించారు. పరిపాలక సభలోని అంకితభావంగల ఈ పురుషులు దేవుని వాక్య ప్రకారంగా నిర్ణయాలు తీసుకుని, ఆ నిర్ణయాలను ప్రయాణ పైవిచారణకర్తల ద్వారా వేర్వేరు దేశాల్లోవున్న సంఘాలకు చేరవేసేవారు. అలాంటి కొంతమంది పైవిచారణకర్తల గురించి బైబిలు ఇలా చెబుతోంది: “వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్లుచు, యెరూషలేములోనున్న అపొస్తలులును పెద్దలును నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి.”—అపొ. 15:6, 19-22; 16:4.

8 నేడు కూడా, ఆత్మాభిషిక్త క్రైస్తవులతో కూడిన పరిపాలక సభ ప్రపంచవ్యాప్తంగావున్న క్రైస్తవ సంఘాల ఐక్యతకు తోడ్పడుతోంది. ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్నిచ్చే సాహిత్యాన్ని పరిపాలక సభ అనేక భాషల్లో ప్రచురిస్తోంది. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొనే, వారు ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తున్నారు. కాబట్టి, మనకు బోధించేది మానవులు కాదుగానీ యెహోవాయే.—యెష. 54:13.

9. దేవుడు మనకిచ్చిన పనివల్ల మనం ఎలా ఐక్యంగా ఉండగలుగుతున్నాం?

9 ప్రకటనా పనిలో నాయకత్వం వహించడం ద్వారా క్రైస్తవ పైవిచారణకర్తలు కూడా ఐక్యతకు దోహదపడతారు. మామూలుగా పార్టీల కోసం కలుసుకునేవారి కన్నా దేవుని సేవకులు ఎంతో సన్నిహితంగా ఉంటారు. క్రైస్తవ సంఘం ఏదో సరదా కోసం కలుసుకునేందుకు స్థాపించబడలేదు. కానీ, యెహోవాను ఘనపరిచి ఓ ప్రాముఖ్యమైన పనిని అంటే రాజ్య సువార్త ప్రకటించి, శిష్యులను చేస్తూ సహోదర సహోదరీలను బలపరిచే పనిని నెరవేర్చేందుకే స్థాపించబడింది. (రోమా. 1:11, 12; 1 థెస్స. 5:11; హెబ్రీ. 10:24, 25) అందుకే, క్రైస్తవుల గురించి అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పగలిగాడు: “సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారు.”—ఫిలి. 1:27.

10. దేవుని ప్రజలముగా మనం ఏయే విధాలుగా ఐక్యపరచబడ్డాం?

10 యెహోవా ప్రజలముగా మనం ఆయన సర్వాధిపత్యాన్ని అంగీకరిస్తాం, మన సహోదరులను ప్రేమిస్తాం, దేవుని రాజ్యం మీద మన నిరీక్షణను ఉంచుతాం, మన మధ్య నాయకత్వం వహించేందుకు దేవుడు ఉపయోగిస్తున్న వారిని గౌరవిస్తాం కాబట్టే మనం ఐక్యంగా ఉంటున్నాం. మన అపరిపూర్ణత కారణంగా మనకుండే కొన్ని వైఖరులు మన ఐక్యతను పాడుచేయగలవు కాబట్టి వాటిని అధిగమించేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు.—రోమా. 12:2.

గర్వాన్ని, ఈర్ష్యను ఎలా అధిగమించవచ్చు?

11. గర్వం ప్రజల మధ్య విభజనలు సృష్టిస్తుందని ఎలా చెప్పవచ్చు? మనం దాన్ని జయించేందుకు యెహోవా ఎలా సహాయం చేస్తున్నాడు?

11 గర్వం, ప్రజల మధ్య విభజనలు సృష్టిస్తుంది. గర్వంగల వ్యక్తి తాను ఇతరుల కన్నా గొప్పవాడినని అనుకునేందుకు ఇష్టపడతాడు, తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ సంతోషిస్తాడు. అయితే, ఇలాంటి ప్రవర్తన సాధారణంగా ఐక్యతకు ఆటంకంగా నిలుస్తుంది, అవతలి వ్యక్తిలో ఈర్ష్యను పుట్టిస్తుంది. అలాంటి “అతిశయమంతయు చెడ్డది” అని శిష్యుడైన యాకోబు నిర్మొహమాటంగా చెప్పాడు. (యాకో. 4:16) ప్రేమ ఉంటే మనం ఇతరులను చిన్నచూపు చూడము. ఆసక్తికరమైన విషయమేమిటంటే, యెహోవా మనలాంటి అపరిపూర్ణులతో వ్యవహరిస్తాడు కాబట్టి వినయం చూపించే విషయంలో ఆయన మంచి మాదిరి. దావీదు ఇలా రాశాడు: “నీ సాత్వికము నన్ను గొప్ప చేయును.” (2 సమూ. 22:36) మన గురించి మనం సరైన విధంగా ఆలోచించుకోవడాన్ని నేర్పించడం ద్వారా దేవుని వాక్యం గర్వాన్ని జయించేందుకు మనకు సహాయం చేస్తుంది. పౌలు ఇలా అడిగేందుకు ప్రేరేపించబడ్డాడు: “నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?”—1 కొరిం. 4:7.

12, 13. (ఎ) మనం ఎందుకు సులభంగా ఈర్ష్యపడే అవకాశముంది? (బి) ఇతరులను యెహోవా పరిగణించినట్లే మనం పరిగణించడంవల్ల వచ్చే ఫలితమేమిటి?

12 ఐక్యతకు ఆటంకంగా నిలిచే మరో లక్షణం ఈర్ష్య. మనకు వారసత్వంగా వచ్చిన పాపంవల్ల మనమందరం ‘మత్సరపడేందుకు’ లేక ఈర్ష్య పడేందుకు మొగ్గుచూపుతాం. ఎంతోకాలంగా క్రైస్తవులుగా ఉన్నవాళ్లు సహితం అప్పుడప్పుడు ఇతరుల పరిస్థితులను, ఆస్తిపాస్తులను, సేవాధిక్యతలను, సామర్థ్యాలను చూసి ఈర్ష్యపడే అవకాశముంది. (యాకో. 4:5) ఉదాహరణకు, భార్యాపిల్లలు గల ఓ సహోదరుడు, పూర్తికాల సేవలోవున్న మరో సహోదరుని సేవాధిక్యతలను చూసి ఈర్ష్యపడవచ్చు. కానీ, ఆ పూర్తికాల సేవకుడు కూడా భార్యాపిల్లలు గల ఇతణ్ణి చూసి కొంత ఈర్ష్యపడే అవకాశముందని ఇతడు గ్రహించకపోవచ్చు. అలాంటి ఈర్ష్య వల్ల మన ఐక్యత పాడవ్వకూడదంటే మనమేమి చేయాలి?

13 క్రైస్తవ సంఘంలోని అభిషిక్తులను బైబిలు శరీరంలోని భాగాలతో పోలుస్తోందన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే మనం ఈర్ష్యపడకుండా ఉండగలుగుతాం. (1 కొరింథీయులు 12:14-18 చదవండి.) ఉదాహరణకు, హృదయం మనకు బయటికి కనిపించదు గానీ, కన్ను బయటికి కనిపిస్తుంది. కానీ, ఆ రెండు అవయవాలు మనకు విలువైనవి కావంటారా? అలాగే, సంఘంలో కూడా కొందరు కొంతకాలంపాటు ప్రముఖులుగా కనిపించినా సంఘంలోని ప్రతీ ఒక్కరినీ యెహోవా విలువైనవారిగా ఎంచుతాడు. కాబట్టి, మన సహోదరులను యెహోవా పరిగణించినట్లే మనమూ పరిగణిద్దాం. ఇతరులపై ఈర్ష్యపడే బదులు వారిపట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపించవచ్చు. అలా చేయడం ద్వారా, నిజక్రైస్తవులకూ నామకార్థ క్రైస్తవులకూ మధ్యవున్న తేడాను చూపించగలుగుతాం.

నామకార్థ క్రైస్తవత్వంలో అనైక్యత నెలకొనివుంది

14, 15. మతభ్రష్టత్వం వల్ల నామకార్థ క్రైస్తవత్వం ఎలా ముక్కలైపోయింది?

14 ఒకవైపు నిజక్రైస్తవుల మధ్య ఐక్యత నెలకొనివుంటే, మరోవైపు నామకార్థ క్రైస్తవ చర్చీల్లో కొట్లాటలే కనిపిస్తాయి. నాలుగవ శతాబ్దానికల్లా క్రైస్తవ మతభ్రష్టత్వం ఎంతగా వ్యాపించిందంటే అన్యుడైన రోమా చక్రవర్తి క్రైస్తవమతాన్ని తన అధీనంలోకి తీసుకొని నామకార్థ క్రైస్తవత్వాన్ని పెంచిపోషించాడు. ఆ తర్వాత విభజనలు ఏర్పడడంతో అనేక రాజ్యాలు రోము నుండి వేరుపడి తమ సొంత జాతీయ చర్చీలను ఏర్పాటు చేసుకున్నాయి.

15 వాటిలో అనేక రాజ్యాలు ఎన్నో శతాబ్దాలపాటు ఒకదానితో మరొకటి యుద్ధాలు చేశాయి. 17, 18 శతాబ్దాల్లో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, అమెరికా దేశాలు దేశభక్తిని ప్రోత్సహించాయి. దానివల్ల జాతీయతా భావం ఒక మతంలా తయారైపోయింది. 19, 20 శతాబ్దాల్లో చాలామంది జాతీయతా భావాన్ని పెంచుకున్నారు. అలా మెల్లమెల్లగా, నామకార్థ క్రైస్తవ చర్చీలు ముక్కలై ఎన్నో శాఖలుగా ఏర్పడ్డాయి. అవన్నీ జాతీయతా భావాన్ని చూసీచూడనట్లు వదిలేశాయి. చర్చీలకు వెళ్లే ప్రజలు వేరే దేశాల్లోని తమ తోటి విశ్వాసులతో యుద్ధం చేశారు. మన కాలం విషయానికొస్తే, వివిధ శాఖలను బట్టి, జాతీయతా భావాన్ని బట్టి నామకార్థ క్రైస్తవత్వం ముక్కలైపోయింది.

16. ఏ విషయాల్లో నామకార్థ క్రైస్తవుల మధ్య భేదాభిప్రాయాలున్నాయి?

16 ఇరవయ్యవ శతాబ్దంలో, నామకార్థ క్రైస్తవత్వంలోని వందలాది శాఖల్లో కొన్ని ఐక్యమవ్వాలనే ఉద్యమాన్ని మొదలుపెట్టాయి. ఎన్నో దశాబ్దాలపాటు ప్రయత్నించిన తర్వాత, కొన్ని చర్చీలు కలిసిపోయాయి. కానీ పరిణామ సిద్ధాంతం, గర్భస్రావం, స్వలింగ సంయోగం, స్త్రీలను మతాచార్యులుగా నియమించడం వంటి విషయాల్లో చర్చీ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని క్రైస్తవ దేశాల్లోని చర్చీలు, వేర్వేరు శాఖలకు చెందిన సభ్యులను ఐక్యం చేయడానికి అంతకుముందు వారిమధ్య భేదాభిప్రాయాలకు కారణమైన సిద్ధాంతాలను పక్కనబెట్టడం మొదలుపెట్టాయి. అలా చేయడం వల్ల ప్రజల విశ్వాసం బలహీనపడుతుందే తప్ప ఆ శాఖలు ఎప్పటికీ ఐక్యంకాలేవు.

సత్యారాధకులు జాతీయతా భావాన్ని కలిగివుండరు

17. “అంత్యదినములలో” సత్యారాధన వల్ల ప్రజలు ఐక్యమౌతారని ఎలా ప్రవచించబడింది?

17 లోకంలోని ప్రజలు క్రితమెన్నడూ లేని విధంగా అనైక్యంగా ఉన్నారు. దానికి భిన్నంగా సత్యారాధకులు మాత్రం ఐక్యంగా ఉన్నారు. దేవుని ప్రవక్తయైన మీకా ఇలా ప్రవచించాడు: ‘దొడ్డిలోని గొర్రెల్లా నేను వారిని ఐక్యపరుస్తాను.’ (మీకా 2:12, NW) అబద్ధ దేవుళ్ల ఆరాధన, దేశ ఆరాధన వంటి వాటికన్నా సత్యారాధన హెచ్చించబడుతుందని మీకా ప్రవచించాడు. ఆయనిలా రాశాడు: “అంత్యదినములలో యెహోవా మందిరపర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.”—మీకా 4:1, 5.

18. సత్యారాధన వల్ల మనం ఏయే మార్పులు చేసుకోగలిగాం?

18 గతంలో శత్రువులుగా ఉన్నవారు సహితం సత్యారాధన వల్ల ఎలా ఐక్యమౌతారో మీకా ప్రవచించాడు. “ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి—యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు . . . వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగకొట్టుదురు, జనముమీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు.” (మీకా 4:2, 3) మానవులు సృష్టించిన దేవుళ్ల ఆరాధనను లేదా దేశ ఆరాధనను విడిచిపెట్టి యెహోవాను ఆరాధించాలనే ఉద్దేశంతో వచ్చినవారు ప్రపంచవ్యాప్త ఐక్యతను అనుభవిస్తారు. ఇతరులపట్ల ఏయే విధాలుగా ప్రేమ చూపించాలో దేవుడు వారికి నేర్పిస్తాడు.

19. లక్షలాదిమంది సత్యారాధనలో ఐక్యపరచబడడం దేనికి స్పష్టమైన రుజువు?

19 నిజక్రైస్తవుల మధ్యవుండే ఐక్యత ప్రత్యేకమైనది. యెహోవా తన ఆత్మ ద్వారా వారిని నడిపిస్తున్నాడనే దానికి ఇది స్పష్టమైన రుజువు. చరిత్రలో ఎన్నడూ లేనంత గొప్ప స్థాయిలో అన్ని జనాంగాల ప్రజలు ఐక్యమౌతున్నారు. అలా, ప్రకటన 7: 9, 14లో సూచించబడిన విషయం అద్భుతరీతిలో నెరవేరుతోంది. త్వరలోనే దేవదూతలు ప్రస్తుత దుష్ట విధానాన్ని నాశనం చేసే “వాయువులను” విడిచిపెడతారని కూడా అది సూచిస్తోంది. (ప్రకటన 7: 1-4, 9, 10, 14 చదవండి.) ప్రపంచవ్యాప్త సహోదరత్వంతో ఐక్యంగా ఉండడం మనకు లభించిన గొప్ప అవకాశం కాదా? అయితే, ఆ ఐక్యతకు మనం ఎలా దోహదపడవచ్చు? దీని గురించి మనం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

మీరెలా జవాబిస్తారు?

• సత్యారాధన వల్ల ప్రజలు ఎలా ఐక్యమౌతున్నారు?

• ఐక్యతను దెబ్బతీసే ఈర్ష్యను కలిగివుండకూడదంటే మనమేమి చేయాలి?

• సత్యారాధకులను జాతీయతా భావం ఎందుకు వేరు చేయలేదు?

[అధ్యయన ప్రశ్నలు]

[13వ పేజీలోని చిత్రం]

మొదటి శతాబ్దపు క్రైస్తవులు అనేక నేపథ్యాల నుండి వచ్చారు

[15వ పేజీలోని చిత్రాలు]

రాజ్యమందిర నిర్మాణ పనిలో పాల్గొనడంవల్ల మీరెలా ఐక్యతకు దోహదపడవచ్చు?