కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘క్రీస్తు ఒక్కడే మీ నాయకుడు’

‘క్రీస్తు ఒక్కడే మీ నాయకుడు’

‘క్రీస్తు ఒక్కడే మీ నాయకుడు’

‘మీరు నాయకులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ నాయకుడు.’—మత్త. 23:10, NW.

1. యెహోవాసాక్షులు తమ నాయకునిగా ఎవరిని గుర్తిస్తారు, ఎందుకు?

 నా మకార్థ క్రైస్తవ చర్చీల్లో మానవ నాయకులు ఉన్నారు. రోమ్‌లో పోప్‌, తూర్పు ఆర్థడాక్స్‌ చర్చీల్లో బిషప్పులూ వారిపైని ఆర్చ్‌ బిషప్పులూ, ఇతర మతాల్లో మత పెద్దలు ఉన్నారు. అయితే, యెహోవాసాక్షుల విషయానికొస్తే, వారికి ఏ మానవ నాయకుడు లేడు. వారు ఏ మానవునికీ శిష్యులుగా లేదా అనుచరులుగా ఉండరు. ఇది, తన కుమారుని విషయంలో యెహోవా చెప్పిన ప్రవచనానికి అనుగుణంగా ఉంది. ఆయన ఇలా ప్రవచించాడు: “ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని. జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించితిని.” (యెష. 55:4) ప్రపంచవ్యాప్త అభిషిక్త క్రైస్తవుల సంఘం, వారి సహచరులైన ‘వేరేగొర్రెలు’ యెహోవా తమకిచ్చిన నాయకుణ్ణి తప్ప వేరే ఎవర్నీ తమ నాయకునిగా కోరుకోరు. (యోహా. 10:16) ‘క్రీస్తు ఒక్కడే మీ నాయకుడు’ అని యేసు చెప్పిన మాటలకు వారు సమ్మతిస్తారు.—మత్త. 23:10, NW.

ఇశ్రాయేలీయుల అధిపతిగా యెహోవా దూత

2, 3. ఇశ్రాయేలీయుల కాలంలో దేవుని కుమారుడు ఎలాంటి చురుకైన పాత్రను పోషించాడు?

2 క్రైస్తవ సంఘం స్థాపించబడడానికి ఎన్నో శతాబ్దాల క్రితం యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులపై ఓ దూతను నాయకునిగా ఉంచాడు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన తర్వాత యెహోవా వారితో ఇలా అన్నాడు: “ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది.” (నిర్గ. 23:20, 21) ‘యెహోవా నామము కలిగివున్న’ ఈ దేవదూత మరెవరో కాదు దేవుని మొదటి కుమారుడేనని తెలుస్తోంది.

3 మానవునిగా ఈ భూమ్మీదకు రాకముందు దేవుని కుమారుని నామం మిఖాయేలు అని అనుకోవడానికి సరైన కారణాలే ఉన్నాయి. దానియేలు పుస్తకంలో మిఖాయేలు ఇశ్రాయేలీయుల “అధిపతి” అని పిలువబడ్డాడు. (దాని. 10:21) దానియేలు కాలంకన్నా ఎంతో కాలం ముందు అంటే ఇశ్రాయేలీయుల వ్యవహారాల్లో కూడా మిఖాయేలు పాత్ర ఉందని శిష్యుడైన యూదా సూచించాడు. మోషే చనిపోయిన తర్వాత, ఆయన శరీరాన్ని ఉపయోగించి సాతాను ఏదో విధంగా తన సొంత ఉద్దేశాలను నెరవేర్చుకునేలా అంటే విగ్రహారాధన చేసేలా ఇశ్రాయేలీయులను ప్రలోభపెట్టాలని అతడు నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. అప్పుడు మిఖాయేలు జోక్యం చేసుకొని అలా జరగకుండా చూశాడు. యూదా ఇలా రాశాడు: “అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపక—[యెహోవా] నిన్ను గద్దించును గాక అనెను.” (యూదా 9) కొద్దికాలం తర్వాత అంటే యెరికో పట్టణం ముట్టడిచేయబడడానికి ముందు నిస్సందేహంగా మిఖాయేలే “యెహోవా సేనాధిపతిగా” యెహోషువకు కనిపించి అతనికి దేవుని మద్దతు ఉందని అభయమిచ్చాడు. (యెహోషువ 5:13-15 చదవండి.) ప్రవక్తయైన దానియేలుకు ఓ ప్రాముఖ్యమైన సందేశాన్ని అందివ్వకుండా దేవదూతను అడ్డగించడానికి ఒక శక్తివంతమైన దుష్ట దూత ప్రయత్నించినప్పుడు ఆ దేవదూతకు సహాయం చేయడానికి ప్రధానదూతయైన మిఖాయేలు వచ్చాడు.—దాని. 10:5-7, 12-14.

ప్రవచించబడిన నాయకుడు వచ్చాడు

4. మెస్సీయ రావడం గురించి ఏమని ప్రవచించబడింది?

4 ముందు పేరా చివర్లో ప్రస్తావించబడిన సంఘటన జరగడానికి ముందు, “అభిషిక్తుడగు అధిపతి” వస్తాడని చెప్పడానికి యెహోవా గబ్రియేలు దూతను దానియేలు దగ్గరకు పంపించాడు. (దాని. 9:21-25) a సరిగ్గా సమయానికే అంటే సా.శ. 29 శరదృతువులో యేసు యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నాడు. యేసుపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడడంతో, ఆయన అభిషిక్తుడు అంటే మెస్సీయ లేక క్రీస్తు అయ్యాడు. (మత్త. 3:13-17; యోహా. 1:29-34; గల. 4:4) అలా ఆయన సాటిలేని నాయకుడు అయ్యాడు.

5. తన భూపరిచర్యలో యేసు నాయకునిగా ఎలా వ్యవహరించాడు?

5 భూపరిచర్య ప్రారంభించినప్పటి నుండి తాను ‘అభిషిక్తుడగు అధిపతినని’ లేక నాయకుడినని యేసు నిరూపించుకున్నాడు. కొన్ని రోజులకే శిష్యులను సమకూర్చడం ప్రారంభించాడు, తన మొదటి అద్భుతాన్ని చేశాడు. (యోహా. 1:35–2:11) యేసుతో పాటు తన శిష్యులు కూడా రాజ్య సువార్తను ప్రకటిస్తూ దేశమంతటా తిరిగారు. (లూకా 8:1) ఆయన ప్రకటనా పనిలో వారికి తర్ఫీదునిచ్చాడు. ప్రకటనా పనిలో, బోధనా పనిలో నాయకత్వం వహిస్తూ మంచి మాదిరినుంచాడు. (లూకా 9:1-6) ఈ విషయంలో నేటి క్రైస్తవ పెద్దలు కూడా ఆయనను అనుకరించాలి.

6. తాను కాపరినని, నాయకుణ్ణని క్రీస్తు ఎలా నిరూపించుకున్నాడు?

6 తననుతాను ప్రేమగల కాపరితో పోల్చుకోవడం ద్వారా యేసు నాయకునిగా తనకున్న మరో పాత్ర గురించి చెప్పాడు. ప్రాచ్య దేశాల్లో కాపరులు అక్షరార్థంగా ముందుండి తమ మందను నడిపించేవారు. ద లాండ్‌ అండ్‌ ద బుక్‌ అనే పుస్తకంలో డబ్ల్యూ. ఎమ్‌. టామ్సన్‌ ఇలా రాశాడు: “దారి చూపించడానికి మాత్రమే కాదుగానీ, మంద నడవడానికి ఆ దారి సురక్షితమైనదో కాదో చూడడానికి కాపరి మంద ముందు నడుస్తాడు . . . [తన] దుడ్డుకర్రతో మందను అదుపుచేస్తూ పచ్చికబయళ్ల దగ్గరకు నడిపిస్తాడు, శత్రువుల నుండి వాటిని రక్షిస్తాడు.” తాను నిజమైన కాపరినని, నాయకుణ్ణని చూపిస్తూ యేసు ఇలా అన్నాడు: “నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును. నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.” (యోహా. 10:11, 27) యేసు తన గొర్రెల కోసం ప్రాణాన్ని అర్పించడం ద్వారా తన మాటను నిలబెట్టుకున్నాడు. అయితే, యేసును యెహోవా పునరుత్థానం చేసి ‘అధిపతిగా, రక్షకునిగా హెచ్చించాడు.’—అపొ. 5:31; హెబ్రీ. 13:20.

క్రైస్తవ సంఘానికి పైవిచారణకర్త

7. క్రైస్తవ సంఘాన్ని యేసు ఎలా పర్యవేక్షిస్తున్నాడు?

7 యేసు పునరుత్థానం చేయబడిన తర్వాత పరలోకానికి వెళ్లబోయే ముందు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.” (మత్త. 28:18) క్రైస్తవ విశ్వాసంలో ఎదిగేలా తన శిష్యులను బలపరచడానికి యెహోవా యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. (యోహా. 15:26) యేసు సా.శ. 33 పెంతెకొస్తు రోజున తొలి క్రైస్తవులపై ఈ పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. (అపొ. 2:33) అప్పుడే క్రైస్తవ సంఘం స్థాపించబడింది. భూమ్మీదున్న ప్రపంచవ్యాప్త సంఘంపై నాయకత్వం వహించేందుకు యెహోవా యేసును పరలోకంలో నియమించాడు. (ఎఫెసీయులు 1:22; కొలొస్సయులు 1:13, 18 చదవండి.) యెహోవా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా యేసు క్రైస్తవ సంఘాన్ని నడిపిస్తున్నాడు. అంతేకాక, తన ‘అధికారం క్రిందవుండి’ తనకు పరిచారం చేస్తున్న దేవదూతలను కూడా ఆయన ఉపయోగిస్తున్నాడు.—1 పేతు. 3:22.

8. మొదటి శతాబ్దంలో తన శిష్యులకు నడిపింపును ఇవ్వడానికి క్రీస్తు ఈ భూమ్మీద ఎవరిని ఉపయోగించుకున్నాడు? నేడు ఎవరిని ఉపయోగించుకుంటున్నాడు?

8 అంతేకాక, పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు “మనుష్యులకు ఈవులను” అనుగ్రహించాడు, కొందరిని సంఘంలో “కాపరులనుగాను ఉపదేశకులనుగాను” నియమించాడు. (ఎఫె. 4:8, 13) అపొస్తలుడైన పౌలు క్రైస్తవ పైవిచారణకర్తలను ఇలా ప్రోత్సహించాడు: “[దేవుని] సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.” (అపొ. 20:28) క్రైస్తవ సంఘం ప్రారంభమైనప్పుడు ఈ పైవిచారణకర్తలందరూ ఆత్మాభిషిక్త పురుషులే. అపొస్తలులు, యెరూషలేము సంఘంలోని పెద్దలు కలిసి పరిపాలక సభగా పనిచేశారు. భూమ్మీదున్న అభిషిక్త ‘సహోదరుల’ గుంపును నడిపించేందుకు క్రీస్తు ఈ పరిపాలక సభను ఉపయోగించుకున్నాడు. (హెబ్రీ. 2:11; అపొ. 16:4, 5) ఈ అంత్యదినాల్లో, క్రీస్తు తన ‘యావదాస్తిని’ అంటే భూమ్మీదున్న తన రాజ్యాసక్తులన్నిటినీ ‘నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడైన దాసునికి,’ దానికి ప్రాతినిధ్యం వహించే పరిపాలక సభకు అప్పగించాడు. ఈ పరిపాలక సభలో ఆత్మాభిషిక్త పురుషులున్నారు. (మత్త. 24:45-47) ఆధునిక కాల పరిపాలక సభ నడిపింపుకు లోబడడం ద్వారా నిజానికి, తమ నాయకుడైన క్రీస్తుకు లోబడుతున్నామని అభిషిక్తులు, వారి సహచరులైన వేరే గొర్రెలు గుర్తించారు.

క్రీస్తు ప్రకటనాపనిని ప్రారంభించాడు

9, 10. రాజ్య సువార్త వ్యాప్తి చెందడానికి క్రీస్తు పరిస్థితుల్ని ఎలా నిర్దేశించాడు?

9 మొదటి నుంచి యేసే స్వయంగా ప్రపంచవ్యాప్త ప్రకటనాపనిని, బోధనా పనిని నిర్దేశిస్తున్నాడు. భూవ్యాప్తంగావున్న ప్రజలకు ఏ క్రమంలో రాజ్య సువార్త ప్రకటించాలో యేసు చెప్పాడు. తన పరిచర్య కాలంలో, ఆయన తన అపొస్తలులకు ఈ ఉపదేశాన్నిచ్చాడు: “మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకే వెళ్లుడి. వెళ్లుచు—పరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి.” (మత్త. 10:5-7) యూదులకు, యూదామత ప్రవిష్టులకు ఉత్సాహంగా ప్రకటించడం ద్వారా వారు యేసు చెప్పిన దాన్ని ఉత్సాహంగా నెరవేర్చారు. ముఖ్యంగా సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత వారు అలా చేశారు.—అపొ. 2:4, 5, 10, 11; 5:42; 6:7.

10 ఆ తర్వాత, పరిశుద్ధాత్మ ద్వారా యేసు సమరయులకు, యూదులుకాని ఇతరులకు రాజ్య సువార్త ప్రకటించమని నిర్దేశించాడు. (అపొ. 8:5, 6, 14-17; 10:19-22, 44, 45) అన్యజనాంగాలకు కూడా సువార్త ప్రకటించబడాలనే ఉద్దేశంతో, తార్సువాడైన సౌలు క్రైస్తవునిగా మారేలా యేసే స్వయంగా చర్య తీసుకున్నాడు. యేసు తన శిష్యుడైన అననీయకు ఇలా చెప్పాడు: “నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము . . . అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు.” (అపొ. 9:3-6, 10, 11, 15) “ఇతడు” ఎవరో కాదు అపొస్తలుడైన పౌలే.—1 తిమో. 2:7.

11. యేసు పరిశుద్ధాత్మను ఉపయోగించి ప్రకటనా పనిని ఎలా వ్యాప్తి చేయించాడు?

11 యూదులుకాని జనాంగాలకు సువార్త ప్రకటించబడాల్సిన సమయం వచ్చినప్పుడు ఆసియా మైనరులో, ఐరోపాలో మిషనరీ యాత్రలు చేయమని పరిశుద్ధాత్మ పౌలును నిర్దేశించింది. అపొస్తలుల కార్యముల పుస్తకంలో లూకా ఇలా రాశాడు: “[సిరియాలోని అంతియొకయ] వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ—నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి.” (అపొ. 13:2, 3) జనాంగాల ఎదుట తన నామాన్ని భరించేలా తాను ‘ఏర్పర్చుకున్న సాధనంగా’ ఉండమని యేసే స్వయంగా తార్సువాడైన సౌలును పిలిచాడు. అలా, సంఘానికి నాయకుడైన క్రీస్తు నుండే ప్రకటన పనికి సంబంధించిన కొత్త ప్రేరణ లభించింది. ప్రకటనా పనిని నిర్దేశించడానికి యేసు పరిశుద్ధాత్మను ఉపయోగిస్తున్నాడని పౌలు చేసిన రెండవ మిషనరీ యాత్రలో స్పష్టంగా కనిపిస్తుంది. మిషనరీ యాత్రలో ఎప్పుడు, ఎక్కడికి వెళ్లాలో పౌలును, అతని ప్రయాణ సహచరులను “యేసుయొక్క ఆత్మ” నిర్దేశించిందని అంటే పరిశుద్ధాత్మ ద్వారా యేసు నిర్దేశించాడని లూకా వృత్తాంతం చూపిస్తోంది. ఆ తర్వాత ఒకానొక దర్శనంలో వారు, ఐరోపాకు వెళ్లమనే నిర్దేశాన్ని పొందారు.—అపొస్తలుల కార్యములు 16:6-10 చదవండి.

తన సంఘంపై యేసు నాయకత్వం వహిస్తున్నాడు

12, 13. ప్రతీ సంఘంలో ఏమి జరుగుతుందనేదాన్ని యేసు నిశితంగా పరిశీలించాడని ప్రకటన గ్రంథం ఎలా చూపిస్తోంది?

12 సా.శ. మొదటి శతాబ్దంలో తన అభిషిక్త అనుచరుల సంఘాల్లోవున్న పరిస్థితులను యేసు నిశితంగా పరిశీలించాడు. ప్రతీ సంఘపు ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో ఆయనకు స్పష్టంగా తెలుసు. ప్రకటన 2, 3 అధ్యాయాలను చదివితే మనం దీనిగురించి తెలుసుకోగలుగుతాం. ఆయన ఆసియా మైనరులోవున్న ఏడు సంఘాల పేర్లను ప్రస్తావించాడు. (ప్రక. 1:10, 11) ఆ ఏడు సంఘాల ఆధ్యాత్మిక స్థితి గురించే కాక ఆ కాలంలో భూమ్మీదున్న ఇతర సంఘాల ఆధ్యాత్మిక స్థితి గురించి కూడా ఆయనకు పూర్తిగా తెలుసని అర్థమౌతోంది.—ప్రకటన 2:23 చదవండి.

13 సహనం చూపించినందుకు, పరీక్షలు ఎదురైనా నమ్మకంగా ఉన్నందుకు, తన వాక్యానికి విధేయత చూపించినందుకు, మతభ్రష్టులను తిరస్కరించినందుకు కొన్ని సంఘాలను యేసు మెచ్చుకున్నాడు. (ప్రక. 2:2, 9, 13, 19; 3:8) మరోవైపున, తనమీదున్న ప్రేమ చల్లారిపోయినందుకు మరియు విగ్రహారాధనను, జారత్వాన్ని, విభజనలను సహించినందుకు యేసు చాలా సంఘాలను గద్దించాడు. (ప్రక. 2:4, 14, 15, 20; 3:15, 16) ప్రేమగల ఆధ్యాత్మిక పైవిచారణకర్తగా యేసు తాను గద్దించిన వారితో సహా అందరికీ ఇలా చెప్పాడు: “నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.” (ప్రక. 3:19) పరలోకంలో ఉన్నప్పటికీ యేసు పరిశుద్ధాత్మ ద్వారా భూమ్మీదున్న తన శిష్యుల సంఘాలను నడిపించాడు. ఆ సంఘాలకు సందేశాలిస్తూ యేసు చివర్లో ఇలా అన్నాడు: “సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.”—ప్రక. 3:22.

14-16. (ఎ) భూమ్మీదున్న యెహోవా ప్రజలకు తాను ధైర్యంగల నాయకుణ్ణని యేసు ఎలా నిరూపించుకున్నాడు? (బి) యేసు “యుగసమాప్తి వరకు సదాకాలము” తన శిష్యులతో ఉండడంవల్ల ఏ ఫలితం వచ్చింది? (సి) మనం తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

14 మిఖాయేలు (యేసు) ఇశ్రాయేలీయులను నడిపించడానికి యెహోవా నియమించిన శక్తివంతమైన దూత అని చూశాం. తర్వాత, మొదటి శతాబ్దపు శిష్యుల విషయంలో ఆయన ధైర్యంగల నాయకునిగా, ప్రేమగల కాపరిగా వ్యవహరించాడు. తన భూపరిచర్య కాలంలో యేసు ప్రకటనా పనికి నాయకత్వం వహించాడు. పునరుత్థానం చేయబడిన తర్వాత రాజ్య సువార్త వ్యాప్తిచెందేలా తానే స్వయంగా దాన్ని పర్యవేక్షించాడు.

15 సాక్ష్యమిచ్చే పని, చివరకు భూదిగంతముల వరకు జరిగేలా యేసు పరిశుద్ధాత్మను ఉపయోగిస్తాడు. యేసు పరలోకానికి ఆరోహణమై వెళ్లేముందు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.” (అపొ. 1:8; 1 పేతురు 1:12 చదవండి.) మొదటి శతాబ్దంలో క్రీస్తు నాయకత్వం కింద గొప్ప సాక్ష్యమివ్వబడింది.—కొలొ. 1:23.

16 అయితే, అంతం వరకు ప్రకటనాపని కొనసాగుతుందని యేసే స్వయంగా సూచించాడు. అన్ని జనాంగాల ప్రజలకు ప్రకటించి, వారిని శిష్యులుగా తయారు చేయమనే ఆజ్ఞను ఇచ్చిన తర్వాత యేసు తన శిష్యులకు ఇలా వాగ్దానం చేశాడు: “నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.” (మత్త. 28:19, 20) క్రీస్తు 1914లో రాజ్యాధికారం చేపట్టినప్పటి నుండి మునుపెన్నడూ లేనంతగా తన శిష్యులతో ఉంటున్నాడు, చురుకైన నాయకుడిగా పనిచేస్తున్నాడు. 1914 నుండి ఆయన ఎంత చురుగ్గా పనిచేస్తున్నాడో మనం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

[అధస్సూచి]

a ఈ ప్రవచనం గురించిన వివరణ కోసం బైబిలు బోధిస్తోంది అనే పుస్తకంలో 198-9 పేజీలు చూడండి.

పునఃసమీక్ష

• ఇశ్రాయేలీయుల చురుకైన నాయకుణ్ణని దేవుని కుమారుడు ఎలా నిరూపించుకున్నాడు?

• భూమ్మీదున్న సంఘాన్ని క్రీస్తు ఎలా నడిపిస్తున్నాడు?

• సువార్త వ్యాప్తిచెందేలా క్రీస్తు దాన్ని ఎలా నిర్దేశించాడు?

• ప్రతీ సంఘపు ఆధ్యాత్మిక స్థితిని యేసు నిశితంగా పరిశీలిస్తున్నాడని మనకెలా తెలుసు?

[అధ్యయన ప్రశ్నలు]

[21వ పేజీలోని చిత్రం]

“ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను”

[23వ పేజీలోని చిత్రం]

గతంలోలాగే, మందను కాయడానికి క్రీస్తు ‘మనుషుల్లో ఈవులను’ ఉపయోగిస్తున్నాడు