గొప్ప అభివృద్ధి జరుగుతున్న కాలంలో సేవచేశాం
గొప్ప అభివృద్ధి జరుగుతున్న కాలంలో సేవచేశాం
హ్యార్లీ హ్యారిస్ చెప్పినది
అది సెప్టెంబరు 2, 1950వ సంవత్సరం. మేము అమెరికాలోవున్న మిస్సోరిలోని కెన్నట్‌లో జరిగే ప్రాంతీయ సమావేశానికి హాజరయ్యాం. సమావేశ హాలును ఓ అల్లరిమూక చుట్టుముట్టింది. వారి నుండి మమ్మల్ని కాపాడడానికి నగర మేయరు జాతీయ భద్రతా దళాన్ని రప్పించాడు. ఆ సైనికులు కత్తులున్న తుపాకులను ఎత్తిపట్టుకొని వీధి పొడుగునా నిలబడ్డారు. ఆ తర్వాత మేము అల్లరిమూక చేస్తున్న హేళనల మధ్య మా కార్ల దగ్గరికెళ్లి ప్రాంతీయ సమావేశపు మిగతా కార్యక్రమం కోసం మిస్సోరిలోని కేప్ గరార్డోకు వెళ్లిపోయాం. అక్కడే నేను బాప్తిస్మం తీసుకున్నాను. అప్పుడు నాకు 14 ఏళ్లు. ఇలాంటి అల్లకల్లోల పరిస్థితుల్లో నేను యెహోవాను సేవించాలని ఎలా నిర్ణయించుకున్నానో చెప్పనివ్వండి.
మా తాతామామ్మలు, వారి 8 మంది పిల్లలు 1930ల తొలి సంవత్సరాల్లో సహోదరుడు రూథర్‌ఫర్డ్ ప్రసంగాల రికార్డింగులను కొన్నింటిని విన్నప్పుడు అదే సత్యమని బలంగా నమ్మారు. మా నాన్న బే హ్యారిస్, అమ్మ మిల్డ్రెడ్ హ్యారిస్‌లు 1935వ సంవత్సరం వాషింగ్టన్ డి.సి.లో జరిగిన సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నారు. ఆ సమావేశంలోనే “గొప్పసమూహము” గుర్తించబడింది. ఆ గొప్పసమూహంలో ఒకరిగా ఉండడం వారికి ఎంత సంతోషాన్నిచ్చిందో!—ప్రక. 7:9, 14.
ఆ తర్వాతి సంవత్సరంలోనే నేను పుట్టాను. మరుసటి సంవత్సరం మిసిసిపిలోని ఒక మారుమూల ప్రాంతానికి మేము వెళ్లిపోయాం. మేము ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రయాణ పైవిచారణకర్త సందర్శనం ఒక్కసారి కూడా జరగలేదు. మా కుటుంబం బెతెల్‌ను సంప్రదించి సమావేశాలకు హాజరయ్యేది, చాలాకాలంపాటు సహోదరులతో మాకున్న సహవాసం అది మాత్రమే.
హింసలను సహించాం
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యెహోవాసాక్షులు యుద్ధాల్లో పాల్గొనడానికి నిరాకరించినందువల్ల తీవ్ర హింసలను ఎదుర్కొన్నారు. మేము కొండ ప్రాంతమైన అర్కన్‌సాస్‌కు వెళ్లాం. ఒకరోజు నేను, మా నాన్న వీధి సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తి మా నాన్న దగ్గర నుండి పత్రికలను లాక్కొని వాటిని అక్కడికక్కడే కాల్చేశాడు. యుద్ధంలో పాల్గొననందుకు మమ్మల్ని పిరికివాళ్లని అన్నాడు. అప్పుడు నా వయసు ఐదేళ్లే కాబట్టి ఏడవడం మొదలుపెట్టాను. మా నాన్న ప్రశాంతంగా ఏమీ మాట్లాడకుండా ఆ వ్యక్తి అక్కడనుండి వెళ్లిపోయేంతవరకూ ఆయనను చూస్తూ ఉండిపోయాడు.
అయితే, మాకు సహాయం చేసిన మంచివాళ్లు కూడా ఉన్నారు. ఒకసారి మేము కారులో ఉన్నప్పుడు అల్లరిమూక చుట్టుముట్టింది. ఒక స్థానిక న్యాయవాది దాన్ని గమనించి, “ఇక్కడ ఏం జరుగుతోంది?” అని అడిగాడు. అందుకు ఒక వ్యక్తి ఇలా జవాబిచ్చాడు: “ఈ యెహోవాసాక్షులు తమ దేశం కోసం పోరాడరు!” దానితో న్యాయవాది మా కారు ఫుట్‌బోర్డు మీదికి ఎక్కి, “నేను మొదటి ప్రపంచ యుద్ధంలో అపొ. 27:3.
పోరాడాను, రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా పోరాడతాను. వీళ్లను పోనివ్వండి, వీళ్లు ఎవరికీ హాని చేయడం లేదు!” అని అరిచాడు. అప్పుడు ఆ అల్లరిమూక మారుమాట్లాడకుండా అక్కడినుండి వెళ్లిపోయింది. మానవత్వంతో మామీద దయ చూపించినందుకు న్యాయవాది లాంటి మంచి ప్రజలకు మేమెంతో కృతజ్ఞులం.—సమావేశాలు మమ్మల్ని బలపరిచాయి
1941లో మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన సమావేశం మా కోసమే జరిగిందనిపించింది. ఆ సమావేశానికి 1,15,000 కన్నా ఎక్కువమంది హాజరయ్యారని ఒక అంచనాను బట్టి తెలుస్తోంది. అయితే, ఆ సమావేశంలో 3,903 మంది బాప్తిస్మం తీసుకున్నారు! “రాజుకు చెందిన పిల్లలు” అనే అంశం మీద సహోదరుడు రూథర్‌ఫర్డ్ ఇచ్చిన ప్రసంగం నాకింకా గుర్తుంది. పిల్లలమైన మా కోసమే ఆయన ఆ ప్రసంగమిచ్చాడు, తర్వాత మేమంతా నీలి రంగు అట్టతోవున్న చిల్డ్రన్ అనే అందమైన పుస్తకాన్ని పొందాం. ఆ సమావేశంలో పొందిన ప్రోత్సాహం వల్ల నేను తర్వాతి సంవత్సరంలో అంటే ప్రాథమిక పాఠశాలకు వెళ్ళడం మొదలు పెట్టిన సంవత్సరంలో ఎదురైన పరీక్షలను సహించగలిగాను. జెండా వందనం చేయనందుకు నన్ను, మా దగ్గరి బంధువుల పిల్లలను స్కూలు నుండి తీసేశారు. స్కూలు యాజమాన్యం తమ మనసు మార్చుకుని మమ్మల్ని తిరిగి చేర్చుకుంటారేమోనని మేము ప్రతీరోజూ ఉదయం అడవి గుండా నడుచుకుంటూ స్కూలుకు వెళ్లేవాళ్లం. కానీ వాళ్లు మమ్మల్ని ఇంటికి పంపించేసేవాళ్లు. అయితే మేము దేవుని రాజ్యానికి నమ్మకంగా ఉంటున్నామని చూపించేందుకు అదొక అవకాశమని అనుకున్నాను.
కొంతకాలానికే, జెండా వందనం తప్పనిసరేమీకాదని అమెరికాలోని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆఖరికి మమ్మల్ని స్కూల్లో తిరిగి చేర్చుకున్నారు. మా టీచరు చాలా దయగా వ్యవహరించి మేము హాజరుకాని రోజుల్లో అయిపోయిన పాఠాలను పూర్తి చేయించాడు. మా తోటి విద్యార్థులు కూడా చిన్నచూపు చూడకుండా మాతో మంచిగా వ్యవహరించారు.
1942వ సంవత్సరం ఓహాయోలోని క్లీవ్‌లాండ్‌లో జరిగిన సమావేశం కూడా నాకు గుర్తుంది. ఆ సమావేశంలో “శాంతి–అది నిలుస్తుందా?” అనే అంశంపై సహోదరుడు నేథన్ హెచ్. నార్ ప్రసంగించాడు. ఆ ప్రసంగంలో ఆయన ప్రకటన 17వ అధ్యాయాన్ని వివరిస్తూ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొంతమట్టుకు శాంతి ఉంటుందని చెప్పాడు. అందుకే యెహోవా ప్రజలు మరింత అభివృద్ధి జరుగుతుందని ఎదురుచూశారు. ఆ అభివృద్ధికి దోహదపడేలా 1943లో గిలియడ్ పాఠశాల ప్రారంభించబడింది. గిలియడ్ పాఠశాల వల్ల నా జీవితం ఎలా మలుపు తిరుగుతుందనే విషయాన్ని నేను అప్పట్లో ఊహించలేదు. యుద్ధం తర్వాత నిజంగానే కొంతమట్టుకు శాంతి నెలకొంది, హింసలు ఆగిపోయాయి. అయితే, 1950లో కొరియా యుద్ధం మొదలైనందువల్ల, ఆర్టికల్ ప్రారంభంలో చెప్పబడినట్లుగానే మళ్లీ ప్రకటనా పనికి వ్యతిరేకత వచ్చింది.
అభివృద్ధిలో పూర్తిగా పాల్గొన్నాను
నేను 1954లో ఉన్నత పాఠశాల విద్యను ముగించుకుని ఒక నెల తర్వాత పయినీరు సేవ చేపట్టాను. మిస్సోరిలోని కెన్నట్‌లో అంటే ముందు చెప్పినట్లు 1950లో అల్లరిమూక మమ్మల్ని చుట్టుముట్టిన ప్రాంతంలో సేవ చేసిన తర్వాత 1955 మార్చిలో బెతెల్ సేవ కోసం ఆహ్వానాన్ని అందుకున్నాను. నేను న్యూయార్క్ పట్టణంలోవున్న ఒక సంఘానికి నియమించబడ్డాను. ఆ పట్టణపు నడిబొడ్డులోవున్న టైమ్ స్క్వేర్ కూడా మా క్షేత్రంలో భాగంగా ఉంది. నేను ముందు నివసించిన ప్రాంతానికీ దీనికీ ఎంత తేడా! న్యూయార్క్ ప్రజలు ఎప్పుడూ బిజీగా ఉండేవారు. అలాంటి వారికి ప్రకటించేందుకు ఆసక్తిని రేకెత్తించే ఆర్టికల్ ఉన్న పేజీవైపు పత్రికను తెరిచి, “మీరు ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా?” అని అడిగేవాణ్ణి. చాలామంది పత్రికలను తీసుకునేవారు.
బెతెల్‌లో ఉన్నప్పుడు నాకిష్టమైన వాటిల్లో సహోదరుడు నార్ నిర్వహించే మార్నింగ్ వర్షిప్ (ఉదయకాల ఆరాధన) కార్యక్రమం ఒకటి. బైబిలు లేఖనాల వివరణకు జీవంపోస్తూ, వాటిని మన జీవితాల్లో ఎలా పాటించవచ్చనే దాని గురించి చక్కగా వివరించేవాడు. ఒక తండ్రి తన పిల్లలతో మాట్లాడినట్లు ఆయన పెళ్లికాని యువ సహోదరులతో మాట్లాడేవాడు. ఆడవాళ్లతో ఎలా ప్రవర్తించాలనే దాని గురించి కూడా తరచూ మాకు మంచి సలహా ఇస్తుండేవాడు. అయితే 1960లో, నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.
కాబట్టి, 30 రోజుల్లో నేను బెతెల్ సేవను వదిలేస్తానని రాసిచ్చాను, కానీ వారి నుండి ఎలాంటి జవాబు రాలేదు. అయితే 30 రోజులు గడిచాక నాకు భయంగా అనిపించినప్పటికీ, నేను రాసిచ్చిన దాని గురించి అడగడానికి ధైర్యం కూడగట్టుకొని ఫోన్ చేశాను. సహోదరుడు రాబర్ట్ వాలన్ ఫోన్‌లో నాతో మాట్లాడిన తర్వాత నేను పనిచేసే చోటకు వచ్చాడు. ప్రత్యేక పయినీరు సేవ గురించి, ప్రాంతీయ సేవ గురించి ఏమైనా ఆలోచించావా అని అడిగాడు. “కానీ రాబర్ట్ నాకు ఇప్పుడు 24 ఏళ్లే. అదీగాక నాకు అంత అనుభవం కూడా లేదు” అని జవాబిచ్చాను.
ప్రాంతీయ సేవ
అదే రోజు రాత్రి నేను గదికి వెళ్లేసరికి నా టేబుల్ మీద ఓ పెద్ద కవరు ఉంది. అందులో ప్రత్యేక పయినీరు సేవ, ప్రాంతీయ సేవ కోసం దరఖాస్తులు ఉన్నాయి. అది చూసే సరికి నా కళ్లను నేనే నమ్మలేకపోయాను! మిస్సోరిలోని నైరుతి ప్రాంతంలో, కెన్సాస్‌లోని తూర్పు ప్రాంతంలో ప్రాంతీయ పైవిచారణకర్తగా సహోదరులకు సేవచేసే గొప్ప అవకాశం లభించింది. అయితే బెతెల్‌ను విడిచిపెట్టే ముందు ప్రయాణ పైవిచారణకర్తల కోసం ఏర్పాటు చేయబడిన కూటానికి హాజరయ్యాను. ఆ కూటంలో సహోదరుడు నార్ ఈ మాటలతో తన ప్రసంగాన్ని ముగించాడు: “ప్రాంతీయ, జిల్లా పైవిచారణకర్తలుగా ఉన్నంత మాత్రాన మీకు స్థానిక సహోదరులకన్నా ఎక్కువ తెలుసని కాదు. కొంతమంది సహోదరులకు మీకన్నా ఎక్కువ అనుభవం ఉంది కానీ ఈ ప్రత్యేకమైన సేవ చేసేందుకు వారి పరిస్థితులు అనుకూలంగా లేవు. మీరు వారి నుండి ఎంతో నేర్చుకోవచ్చు.”
ఆ మాటలు ఎంత నిజం! కెన్సాస్‌లోని పార్సన్జ్ పట్టణానికి చెందిన సహోదరుడు ఫ్రెడ్ మాలహ్యాన్, అతని భార్య, అతని అన్న అయిన చార్లీ అందుకు మంచి ఉదాహరణలు. 1900ల తొలి సంవత్సరాల్లో వారు సత్యం నేర్చుకున్నారు. నేను పుట్టకముందు జరిగిననాటి అనుభవాలను తెలుసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. మరో సహోదరుడు మిస్సోరిలోని జోప్లిన్‌కు చెందిన జాన్ రిస్టన్. ఆయన చాలా దశాబ్దాలుగా పయినీరు సేవ చేసిన మృదుస్వభావంగల వృద్ధ సహోదరుడు. ఈ ప్రియమైన సహోదరులకు దైవిక ఏర్పాట్ల పట్ల ఎంతో గౌరవం ఉండేది. నేను యువకుణ్ణే అయినా వారి ప్రాంతీయ పైవిచారణకర్తగా నా సేవను వారు విలువైనదిగా ఎంచారు.
నేను 1962లో క్లారిస్ నోకీ అనే పయినీరు సహోదరిని పెళ్లి చేసుకున్నాను. తను ఎర్రని జుట్టుతో చూడచక్కగా ఉండేది. ఆమెతో కలిసి ప్రాంతీయ సేవలో కొనసాగాను. మేము సహోదరుల ఇళ్లల్లో ఉండడం వల్ల వారి గురించి ఎక్కువ తెలుసుకోగలిగాం. పూర్తికాల సేవను ప్రారంభించేలా మేము యౌవనస్థులకు సహాయం చేయగలిగాం. ఆ ప్రాంతంలో ఉన్న జే కోసిన్స్కి, జోయన్ క్రెస్‌మన్ అనే యౌవనస్థులు సరిగ్గా అలాంటి ప్రోత్సాహం కోసమే ఎదురుచూస్తున్నారు. వారితో సేవలో పాల్గొని, స్వయంత్యాగపూరిత జీవితాన్ని గడిపితే వచ్చే ఆనందాన్ని వారితో మేము పంచుకోవడం వల్ల వారు కొన్ని లక్ష్యాలు పెట్టుకోగలిగారు. జోయన్ ప్రత్యేక పయినీరు అయ్యింది, జే కోసిన్స్కి బెతెల్ సభ్యుడయ్యాడు. తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకుని దాదాపు 30 సంవత్సరాలుగా ప్రాంతీయ సేవలో ఉన్నారు.
మిషనరీ సేవ
‘వేరే దేశానికి వెళ్లి సేవచేయాలనుకుంటున్నారా?’ అని సహోదరుడు నార్ 1966లో మమ్మల్ని అడిగాడు. “మేము ప్రస్తుతం ఉన్న చోట సంతోషంగా ఉన్నాం. అయినా వేరే చోట అవసరం ఉందంటే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం” అని జవాబిచ్చాం. ఒక వారం తర్వాత, గిలియడ్ పాఠశాలకు ఆహ్వానించబడ్డాం. ఆ పాఠశాల కోసం మళ్లీ బెతెల్‌కు వెళ్లడం, అక్కడ నేను ప్రేమించి, గౌరవించిన వ్యక్తులను కలుసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అంతేకాదు తోటి విద్యార్థులతో స్నేహాలు ఏర్పడ్డాయి. వాళ్లంతా ఇప్పటికీ నమ్మకంగా సేవచేస్తున్నారు.
క్లారిస్‌ను, నన్ను దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌కు పంపించారు. మాతో పాటు డెన్నస్, ఎడ్విన క్రిస్ట్, ఆనా రాడ్రిగస్, డేల్యా సాన్చెస్‌లు అదే దేశానికి పంపించబడ్డారు. డెన్నస్, ఎడ్విన క్రిస్టులు ఆ దేశ రాజధాని అయిన క్విటోలో సేవ చేయడానికి నియమించబడ్డారు. ఆనా, డేల్యాలను కూడా మాలాగే, ఈక్వెడార్‌లోని మూడవ పెద్ద నగరమైన క్వెన్కాలో సేవ చేయడానికి నియమించారు. మా క్షేత్రంలో రెండు సామ్రాజ్యాలు ఉండేవి. క్వెన్కాలో మొదటి సంఘం మా ఇంట్లోనే ప్రారంభమైంది. అప్పట్లో మా నలుగురితోపాటు, మరో ఇద్దరు మాత్రమే కూటాలకు హాజరయ్యేవాళ్లు. అసలు ఇక్కడ ప్రకటనా పని ఎలా జరుగుతుందా అని మేము ఆందోళనపడ్డాం.
క్వెన్కాలో చాలా చర్చీలు ఉండేవి. దానికి తోడు పవిత్ర దినాలని చెప్పబడే రోజుల్లో ఆ ప్రాంతం మతాచారాలతో నిండిపోయేది. అయితే, అక్కడి ప్రజలకు చాలా ప్రశ్నలుండేవి. ఉదాహరణకు సైకిల్ పోటీలో విజేత అయిన మార్యో పోలో అనే వ్యక్తిని నేను మొదటిసారి కలిసినప్పుడు, ఆశ్చర్యకరంగా ఆయన, “ప్రకటనా గ్రంథంలో ప్రస్తావించబడిన వేశ్య ఎవరు?” అని అడిగాడు.
మరో సందర్భంలో, ఒక రాత్రి మార్యో చాలా దిగులుతో మా ఇంటికి వచ్చాడు. ఒక పాస్టరు తనకు కొన్ని సాహిత్యాలు ఇచ్చాడనీ వాటిలో యెహోవాసాక్షులమీద తీవ్ర నిందలు మోపబడ్డాయనీ చెప్పాడు. అయితే నిందలు మోపబడిన వ్యక్తికి తననుతాను సమర్థించుకునేందుకు ఒక అవకాశం ఇవ్వబడాలని నేను మార్యోతో చెప్పాను. దానికోసం తర్వాతి రోజే మార్యో నన్ను, పాస్టరును తన ఇంటికి పిలిపించాడు. ముందుగా త్రిత్వం గురించి చర్చిద్దామని నేను అన్నాను. పాస్టరు యోహాను 1:1 చదివినప్పుడు స్వయంగా మార్యోనే దానికున్న అసలైన అర్థాన్ని వివరించాడు. అలా ప్రస్తావించబడిన ప్రతీ లేఖనంపై చర్చ కొనసాగింది. చివరికి, త్రిత్వ సిద్ధాంతాన్ని నిరూపించకుండానే పాస్టరు అక్కడ నుండి వెళ్లిపోయాడు. దానితో మేము బోధించేదే సత్యమని మార్యోకు, అతని భార్యకు నమ్మకం కుదిరింది. అప్పటి నుండి వారు బైబిలు బోధలను చక్కగా సమర్థించే వ్యక్తులయ్యారు. క్వెన్కాలో సంఘాల సంఖ్య క్రమంగా 33కు, ఆ తర్వాత 63కు చేరుకోవడాన్ని చూస్తే ఎంతో సంతోషమనిపిస్తుంది. మా మొదటి నియామక ప్రాంతమైన ఆ పెద్ద క్షేత్రంలో నిజంగానే గొప్ప అభివృద్ధి జరిగింది.
బ్రాంచి కార్యాలయం నుండి అభివృద్ధి చూశాను
1970లో, ఎల్ షూలో అనే సహోదరునితో పాటు గ్వాయాక్విల్ బ్రాంచి కార్యాలయానికి వెళ్లి సేవ చేసే నియామకాన్ని అందుకున్నాం. మేమిద్దరం బ్రాంచిలో జరిగే పనిని చూసుకునేవాళ్లం. సహోదరుడు జో సెకరక్ ఆ దేశంలోవున్న 46 సంఘాల కోసం సాహిత్యాలను ప్యాకింగ్ చేసేందుకు బ్రాంచిలో పార్ట్‌టైమ్ పనిచేసేవాడు. ఒకవైపు నేను బెతెల్‌లో సేవచేస్తుంటే మరోవైపు క్లారిస్ బయట ప్రకటనా పని చేసేది. కొంతకాలంపాటు క్లారిస్ అలానే కొనసాగింది. 55 మంది బాప్తిస్మం తీసుకునేలా ఆమె సహాయం చేయగలిగింది, తరచూ సమావేశాల్లో బాప్తిస్మం తీసుకునేవారిలో ముగ్గురి నుండి ఐదుగురు ఆమె బైబిలు విద్యార్థులే ఉండేవారు.
ఉదాహరణకు, లూక్రెస్యా అనే స్త్రీతో క్లారిస్ బైబిలు అధ్యయనం చేసేది. ఆమె భర్త దాన్ని వ్యతిరేకించేవాడు. అయినా లూక్రెస్యా చివరకు బాప్తిస్మం తీసుకుని క్రమ పయినీరుగా సేవచేయడం ఆరంభించింది. ఆమె తన పిల్లలకు యెహోవా మార్గాల గురించి నేర్పించింది. ఆమె ఇద్దరు కుమారులు ఇప్పుడు సంఘ పెద్దలుగా ఉన్నారు, ఒకరు ప్రత్యేక పయినీరుగా సేవచేస్తున్నారు. కూతురేమో పయినీరుగా సేవచేస్తోంది. మనుమరాలు మంచి సహోదరుణ్ణి పెళ్లి చేసుకుని ఆయనతో కలిసి ప్రత్యేక పయినీరుగా సేవచేస్తోంది. సత్యం తెలుసుకునేలా ఈ కుటుంబం చాలామందికి సహాయం చేసింది.
1980 నాటికి ఈక్వెడార్‌లో దాదాపు 5,000 మంది ప్రచారకులు ఉండేవారు. సభ్యులు క్రమంగా పెరగడంతో మా చిన్న కార్యాలయం సరిపోయేది కాదు. ఒక సహోదరుడు గ్వాయాక్విల్ ఊరు బయట ఉన్న దాదాపు 80 ఎకరాల స్థలాన్ని ఇచ్చాడు. ఆ స్థలంలో మేము 1984లో కొత్త బ్రాంచి కార్యాలయాన్ని, సమావేశ హాలును కట్టడం మొదలుపెట్టి చివరకు 1987లో ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని జరుపుకున్నాం.
అభివృద్ధికి ఎంతోమంది ఇష్టపూర్వకంగా దోహదపడ్డారు
ఇన్ని సంవత్సరాల్లో, ప్రచారకుల అవసరం ఎక్కువగావున్న ప్రాంతాల్లో సేవచేయడానికి వేరే దేశాల నుండి ఈక్వెడార్‌కు వచ్చిన చాలామంది ప్రచారకులను, పయినీర్లను చూసినప్పుడు ఎంతో సంతోషమనిపిస్తుంది. కెనడాలో స్కూలు టీచరుగా పదవీ విరమణ అయిపోయి 1985లో సేవ చేయడానికి ఈక్వెడార్‌కు వచ్చిన సహోదరుని ఉదాహరణే నాకు గుర్తుకొస్తుంది. ఆయన పేరు ఏన్డీ కిడ్. ఆయన 70 ఏళ్ల వయసులో ఈక్వెడార్‌కు వచ్చాడు, 2008లో తాను మరణించేంత వరకూ నమ్మకంగా సేవచేశాడు. ఆయన 93 ఏళ్ల వయసులో చనిపోయాడు. మొదటిసారి నేను ఆయనను చూసినప్పుడు ఒక చిన్న సంఘంలో తాను ఒక్కడే పైవిచారణకర్తగా ఉన్నాడు. స్పానిష్ భాషతో కుస్తీపడుతూ ఆయన ఒక బహిరంగ ప్రసంగాన్నిచ్చి, ఆ తర్వాత కావలికోట అధ్యయనాన్ని నిర్వహించాడు. ఆయనే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను నడిపించి, సేవాకూటంలోని చాలా భాగాలను నిర్వర్తించేవాడు. ఆ ప్రాంతంలో ఇప్పుడు రెండు అభివృద్ధి చెందుతున్న సంఘాలున్నాయి. దానిలో దాదాపు 200 మంది ప్రచారకులు, ఎంతోమంది స్థానిక సంఘ పెద్దలు ఉన్నారు.
మరో సహోదరుడు ఎర్నెస్టో డయస్ తన కుటుంబంతో పాటు అమెరికా నుండి ఈక్వెడార్‌కు వచ్చాడు. ఈక్వెడార్‌లో ఎనిమిది నెలలున్న తర్వాత ఎర్నెస్టో డయస్ ఏమన్నాడో గమనించండి. “మా ముగ్గురు పిల్లలు స్థానిక భాష నేర్చుకుని ఎంతో మంచి బోధకులయ్యారు. ఈ లోకంలో సాధ్యంకాదనిపించిన లక్ష్యాన్ని ఒక తండ్రిగా నేను చేరుకోగలిగాను, అంటే క్రమ పయినీరుగావుంటూ, నా కుటుంబంతో పాటు
పూర్తికాల సేవ చేయగలుగుతున్నాను. మేమంతా కలిసి 25 బైబిలు అధ్యయనాలను చేస్తున్నాం. దీనివల్ల మా కుటుంబమంతా మునుపటికన్నా మరింత ఐక్యంగా ఉంది, అంతకంటే ప్రాముఖ్యంగా, ముందెప్పుడూ లేనంతగా నేను యెహోవాకు సన్నిహితమయ్యాను” అని ఆయన అన్నాడు. ఇలాంటి ప్రియమైన సహోదర సహోదరీలకు మేమెంతో కృతజ్ఞులమై ఉన్నాం.మరింత అభివృద్ధి జరిగి, 1994లో బ్రాంచి కార్యాలయ వసతి సౌకర్యాలు ముందుకన్నా రెండింతలు పెరిగాయి. 2005లో ప్రచారకుల సంఖ్య 50,000కు చేరింది కాబట్టి బ్రాంచి కార్యాలయ వసతులను పెంచాల్సిన అవసరం మళ్లీ ఏర్పడింది. దాంతో మరింత పెద్ద సమావేశ హాలును, బెతెల్ సభ్యుల కోసం ఒక కొత్త నివాస భవనాన్ని, అనువాద కార్యాలయాలను నిర్మించారు. ఈ కొత్త భవనాల ప్రతిష్ఠాపన అక్టోబరు 31, 2009లో జరిగింది.
1942లో నన్ను స్కూలు నుండి తీసేసినప్పుడు అమెరికాలో దాదాపు 60,000 మంది సాక్షులు ఉండేవారు. కానీ ఇప్పుడు పది లక్షలకన్నా ఎక్కువమంది ఉన్నారు. మేము 1966లో ఈక్వెడార్‌కు వచ్చినప్పుడు దాదాపు 1,400 మంది రాజ్య ప్రచారకులు ఉండేవారు. కానీ ఇప్పుడు 68,000 కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా ఈ దేశంలో 1,20,000 బైబిలు అధ్యయనాలు నిర్వహించబడుతున్నాయి, అంతేకాదు 2009వ సంవత్సరంలో 2,32,000 కన్నా ఎక్కువ మంది క్రీస్తు మరణ దిన జ్ఞాపకార్థానికి హాజరయ్యారు కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారనే నమ్మకం ఉంది. నిజంగా, మేము ఊహించని రీతిలో యెహోవా తన ప్రజల్ని ఆశీర్వదించాడు. గొప్ప అభివృద్ధి జరుగుతున్న కాలంలో, ప్రాంతంలో జీవించడం ఎంతో సంతోషానిస్తోంది! a
[అధస్సూచి]
a ఈ ఆర్టికల్ ప్రచురణకు సిద్ధమౌతుండగా హ్యార్లీ హ్యారిస్ నమ్మకమైన యెహోవా సేవకునిగా చనిపోయాడు.
[5వ పేజీలోని చిత్రాలు]
1981లో సమావేశం జరిగినప్పుడు అదొక ఖాళీ స్థలం. అదే స్థలంలో 2009 కల్లా గ్వాయాక్విల్ సమావేశ హాలు నిర్మించబడింది