కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేడు మన చురుకైన నాయకుడు

నేడు మన చురుకైన నాయకుడు

నేడు మన చురుకైన నాయకుడు

“అతడు జయించుచు, జయించుటకు బయలువెళ్లెను.”—ప్రక. 6:2.

1, 2. (ఎ) 1914 నుండి క్రీస్తు చేసిన రాజరిక పనుల గురించి బైబిలు ఎలా వర్ణిస్తోంది? (బి) క్రీస్తు సింహాసనాసీనుడైనప్పటి నుండి ఏమేమి పనులు చేశాడు?

 యెహోవా దేవుని మెస్సీయ రాజ్యానికి రాజుగా క్రీస్తు 1914లో సింహాసనాసీనుడయ్యాడు. ప్రస్తుతం ఆయన ఎలా ఉన్నాడని మీరనుకుంటున్నారు? తన సింహాసనం మీద కూర్చొని అప్పుడప్పుడు ఈ భూమివైపు చూస్తూ తన సంఘం ఎలా ఉందోనని ఆలోచించే రాజుగా మాత్రమే ఉన్నాడని మీరనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపడినట్లే. గుర్రంపై స్వారీచేస్తూ “జయించుచు, జయించుటకు బయలువె[ళ్లి]” చివరకు పూర్తి విజయం సాధించే శక్తివంతమైన రాజని క్రీస్తు గురించి కీర్తనల గ్రంథం, ప్రకటన గ్రంథం వర్ణిస్తున్నాయి.—ప్రక. 6:2; కీర్త. 2:6-9; 45:1-4.

2 సింహాసనాసీనుడైన తర్వాత రాజుగా క్రీస్తు మొదట ‘ఘటసర్పముపై, దాని దూతలపై’ విజయం సాధించాడు. ప్రధానదూతయైన మిఖాయేలుగా క్రీస్తు, తన దూతలతో కలిసి సాతానును, అతని దయ్యాలను పరిశుద్ధ స్థలమైన పరలోకం నుండి పడద్రోసి వారిని భూమికే పరిమితం చేశాడు. (ప్రక. 12:7-9) ఆ తర్వాత, యెహోవా “నిబంధన దూత[గా]” యేసు తన తండ్రితోపాటు ఆధ్యాత్మిక ఆలయాన్ని పరీక్షించేందుకు వచ్చాడు. (మలా. 3:1) ‘మహాబబులోనులో’ అత్యంత హేయమైన భాగంగావున్న క్రైస్తవమత సామ్రాజ్యం రక్తపాతాన్ని సృష్టించినందుకు, ప్రపంచ రాజకీయ వ్యవస్థతో ఆధ్యాత్మిక వ్యభిచారం చేసినందుకు దానికి ఆయన తీర్పు తీర్చాడు.—ప్రక. 18:2, 3, 24.

క్రీస్తు భూమ్మీదున్న తన దాసుణ్ణి శుద్ధిచేశాడు

3, 4. (ఎ) యెహోవా ‘దూతగా’ క్రీస్తు ఏ పని నెరవేర్చాడు? (బి) ఆలయాన్ని పరీక్షించడం వల్ల ఏమి కనుగొనబడింది? సంఘానికి శిరస్సుగా యేసు ఏ నియామకాన్ని చేశాడు?

3 యెహోవా, ఆయన “దూత” కలిసి పరీక్షించడానికి వచ్చినప్పుడు ఆధ్యాత్మిక ఆలయంలోని భూసంబంధమైన ఆవరణలో అబద్ధ క్రైస్తవ చర్చీలతో ఎలాంటి సంబంధాలు లేని నిజక్రైస్తవుల గుంపును కనుగొన్నారు. అయితే, ఈ అభిషిక్త క్రైస్తవులు లేదా “లేవీయులు” కూడా శుద్ధిచేయబడాలి. ఇది ప్రవక్తయైన మలాకీ ప్రవచించిన దానికి అనుగుణంగా ఉంది: “వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన [యెహోవా] వారిని నిర్మలులను చేయును.” (మలా. 3:3) యెహోవా ఈ ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులను శుద్ధిచేయడానికి తన ‘నిబంధన దూతయైన’ క్రీస్తుయేసును ఉపయోగించాడు.

4 అంతేకాక, ఈ నమ్మకమైన అభిషిక్త క్రైస్తవులే విశ్వాసులకు తగినవేళ ఆధ్యాత్మిక ఆహారం పెట్టడానికి శాయశక్తులా కృషిచేస్తున్నారని కూడా క్రీస్తు గమనించాడు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా వారు దేవుని రాజ్యానికి సంబంధించిన బైబిలు సత్యాలను 1879వ సంవత్సరం నుండి కావలికోట పత్రికలో ప్రచురిస్తూ వస్తున్నారు. “యుగసమాప్తి” కాలంలో తన ఇంటివారిని పరీక్షించడానికి “వచ్చినప్పుడు” ఆ ఇంటివారికి “తగినవేళ అన్నము” పెట్టే ఓ దాసుణ్ణి కనుగొంటానని యేసు ప్రవచించాడు. ఆ దాసుణ్ణి ధన్యుడు అని మెచ్చుకుంటూ ఈ భూమ్మీదున్న “తన యావదాస్తిమీద” అతనిని నియమించాడు. (మత్త. 24:3, 45-47) క్రైస్తవ సంఘానికి శిరస్సుగా క్రీస్తు భూమ్మీదున్న తన రాజ్యాసక్తులను చూసుకునేందుకు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ణ్ణి]” ఉపయోగిస్తున్నాడు. తన ‘ఇంటివారైన’ అభిషిక్తులకు, వారి సహచరులైన ‘వేరేగొర్రెలకు’ పరిపాలక సభ ద్వారా నడిపింపునిస్తున్నాడు.—యోహా. 10:16.

భూమ్మీద కోత పని

5. అపొస్తలుడైన యోహాను ఒక దర్శనంలో రాజు ఏ పనిని చేయడం చూశాడు?

5 మెస్సీయ రాజ్యానికి రాజు, 1914లో సింహాసనాసీనుడైన తర్వాత ‘ప్రభువు దినంలో’ వేరే పని కూడా చేస్తాడని అపొస్తలుడైన యోహాను ఓ దర్శనంలో చూశాడు. ఆయనిలా రాశాడు: “నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘముమీద ఆసీనుడైయుండెను ఆయన శిరస్సుమీద సువర్ణకిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను.” (ప్రక. 1:10; 14:14) యెహోవా దగ్గర నుండి వచ్చిన ఒక దేవదూత, “భూమి పైరుపండి యున్నది” కాబట్టి కొడవలిపెట్టి కోయమని కోతకోసే వ్యక్తితో చెప్పడాన్ని యోహాను విన్నాడు.—ప్రక. 14:15, 16.

6. సమయం గడిచేకొద్దీ ఏమి చోటుచేసుకుంటుందని యేసు చెప్పాడు?

6 “భూమి పైరు” అనే మాట యేసు చెప్పిన గోధుమలు, గురుగుల ఉపమానాన్ని గుర్తుచేస్తుంది. మంచి గోధుమ పంటను కోద్దామనే ఉద్దేశంతో తన పొలములో గోధుమ విత్తనాలను విత్తిన మనుష్యునిగా యేసు తనను తాను పోల్చుకున్నాడు. ఈ గోధుమలు ‘రాజ్య సంబంధులను’ అంటే తన రాజ్యంలో తనతోపాటు పరిపాలించబోయే అభిషిక్తులైన నిజ క్రైస్తవులను సూచిస్తున్నాయి. కానీ శత్రువైన “అపవాది” రాత్రివేళ వచ్చి గోధుమల మధ్య గురుగులను అంటే ‘దుష్టుని సంబంధులను’ విత్తాడు. విత్తనం విత్తిన వ్యక్తి తన దాసులతో, కోతకాలం వరకు అంటే “యుగసమాప్తి” కాలం వరకు గోధుమలను, గురుగులను కలిసి పెరగనివ్వమని చెప్పాడు. “యుగసమాప్తి” కాలంలో గోధుమల నుండి గురుగులను వేరుచేయడానికి ఆయన తన దూతలను పంపిస్తాడు.—మత్త. 13:24-30, 36-41.

7. క్రీస్తు ఎలా ‘భూమి పైరును’ కోస్తున్నాడు?

7 యోహానుకు ఇచ్చిన దర్శన నెరవేర్పుగా యేసు ప్రపంచవ్యాప్త కోత పనిని చేస్తున్నాడు. 1,44,000 మంది ‘రాజ్య సంబంధుల్లోని’ అంటే యేసు ఉపమానంలో ‘గోధుమల్లోని’ మిగిలిన వ్యక్తులను సమకూర్చడంతో “భూమి పైరు” కోయడం ఆరంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నిజ క్రైస్తవులకు, అబద్ధ క్రైస్తవులకు మధ్య కనిపించిన స్పష్టమైన తేడా ‘భూమి పైరులోని’ రెండవ భాగమైన వేరేగొర్రెలను సమకూర్చడానికి దోహదపడింది. వేరేగొర్రెలు “రాజ్య సంబంధులు” లేదా రాజ్య కుమారులు కాదుగానీ ఆ రాజ్యానికి ఇష్టపూర్వకంగా లోబడే “గొప్పసమూహము[నకు]” చెందినవారు. వారు ‘సకల జనులలో నుండి, రాష్ట్రములలో నుండి, ఆయా భాషలు మాటలాడువారిలో నుండి’ కోయబడ్డారు. క్రీస్తుయేసూ, 1,44,000 మంది “పరిశుద్ధు[లూ]” ఉన్న పరలోక ప్రభుత్వానికి అంటే మెస్సీయ రాజ్యానికి వారు లోబడి ఉంటారు.—ప్రక. 7:9, 10; దాని. 7:13, 14, 18.

సంఘాలపై నాయకత్వం

8, 9. (ఎ) ఓ గుంపుగా ప్రతీ సంఘాన్ని పరీశీలించడమే కాక సంఘంలోని ప్రతీ వ్యక్తి ప్రవర్తనను క్రీస్తు గమనిస్తున్నాడని మనకు ఎలా తెలుసు? (బి) 26వ పేజీలోని చిత్రం ఆధారంగా “సాతానుయొక్క” ఏ “గూఢమైన సంగతులను” మనం తిరస్కరించాలి?

8 సా.శ. మొదటి శతాబ్దంలో ప్రతీ సంఘంలోవున్న ఆధ్యాత్మిక పరిస్థితిని యేసు ఎంత నిశితంగా పరిశీలించాడో ముందటి ఆర్టికల్‌లో మనం చూశాం. మనకాలంలో పరిపాలిస్తున్న రాజుగా “పరలోకమందును భూమిమీదను . . . సర్వాధికారము” ఇవ్వబడిన మన నాయకుడైన క్రీస్తు ప్రపంచవ్యాప్త సంఘాలపైన, వాటి పైవిచారణకర్తలపైన తన శిరస్సత్వాన్ని చురుగ్గా నిర్వర్తిస్తున్నాడు. (మత్త. 28:18; కొలొ. 1:18) యెహోవా “సమస్తముపైని ఆయనను” అభిషిక్తుల “సంఘమునకు శిరస్సుగా నియమించెను.” (ఎఫె. 1:22) సంఘానికి శిరస్సుగా క్రీస్తు 1,00,000 కన్నా ఎక్కువగా ఉన్న యెహోవాసాక్షుల సంఘాల్లో జరుగుతున్న ప్రతీ పనిని చూస్తున్నాడు.

9 ప్రాచీన తుయతైర సంఘానికి యేసు ఈ సందేశాన్ని పంపాడు: ‘అగ్నిజ్వాలవంటి కన్నులుగల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా —నీ క్రియలను నేనెరుగుదును.’ (ప్రక. 2:18, 19) అనైతికమైన, స్వార్థపూరితమైన జీవితాన్ని గడిపినందుకు ఆ సంఘంలోని వారిని ఈ మాటలతో గద్దించాడు: “అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే . . . మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.” (ప్రక. 2:23) ఓ గుంపుగా ప్రతీ సంఘాన్ని పరీశీలించడమే కాక సంఘంలోని ప్రతీ వ్యక్తి ప్రవర్తనను క్రీస్తు గమనిస్తున్నాడని ఈ మాటల ద్వారా తెలుస్తుంది. “సాతానుయొక్క గూఢమైన సంగతులను ఎరుగ[నందుకు]” యేసు తుయతైర క్రైస్తవులను మెచ్చుకున్నాడు. (ప్రక. 2:24) నేడు కూడా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఇంటర్‌నెట్‌, హింసాత్మక వీడియో గేములు లేదా యథేచ్ఛమైన మానవ తర్కాలను పరిశోధించడం వంటి వాటి రూపంలోవున్న “సాతానుయొక్క గూఢమైన సంగతులను ఎరుగని” వారినందరినీ యేసు అంగీకరిస్తాడు. తమ జీవితాల్లో తన నాయకత్వానికి లోబడడానికి శాయశక్తులా కృషిచేసే చాలామంది క్రైస్తవుల ప్రయత్నాలను, త్యాగాలను చూసి యేసు ఎంతో సంతోషిస్తున్నాడు.

10. క్రీస్తు నడిపింపు కిందవున్న సంఘ పెద్దలు ఎలా వర్ణించబడ్డారు, కానీ వారు ఏ ఏర్పాటును గుర్తించాలి?

10 నియమిత పెద్దల ద్వారా భూమ్మీదున్న తన సంఘాలకు క్రీస్తు ప్రేమపూర్వక నడిపింపునిస్తున్నాడు. (ఎఫె. 4:8, 11, 12) మొదటి శతాబ్దంలో ఉన్న పైవిచారణకర్తలందరూ ఆత్మాభిషిక్తులే. ప్రకటన గ్రంథంలో వారు క్రీస్తు కుడిచేతిలో ఉన్న నక్షత్రాలుగా వర్ణించబడ్డారు. (ప్రక. 1:16, 20) ఇప్పుడు సంఘ పెద్దల్లో చాలామంది వేరేగొర్రెలకు చెందినవారు. ప్రార్థనాపూర్వకంగా, పరిశుద్ధాత్మ నిర్దేశంతో నియమించబడతారు కాబట్టి వారు కూడా క్రీస్తు అధీనంలో లేదా ఆయన నిర్దేశం క్రింద ఉన్నారని పరిగణించవచ్చు. (అపొ. 20:28) అయితే ఈ భూమ్మీదున్న తన శిష్యులను నిర్దేశించడానికి, నడిపించడానికి అభిషిక్త పురుషుల చిన్న గుంపు ఉన్న పరిపాలక సభను క్రీస్తు ఉపయోగించుకుంటున్నాడని వారు గుర్తిస్తారు.—అపొస్తలుల కార్యములు 15:6, 28-30 చదవండి.

“ప్రభువైన యేసూ, రమ్ము”

11. మన నాయకుడు త్వరలో రావాలని ఎందుకు ఆశతో ఎదురుచూస్తున్నాం?

11 అపొస్తలుడైన యోహానుకు ఇచ్చిన దర్శనంలో యేసు తాను త్వరగా వస్తున్నానని చాలాసార్లు చెప్పాడు. (ప్రక. 2:16; 3:11; 22:7, 20) మహాబబులోను మీదికి, సాతాను అధీనంలోవున్న మిగతా దుష్ట వ్యవస్థ మీదికి న్యాయతీర్పులను అమలుచేయడానికే వస్తున్నానని యేసు సూచించాడు. (2 థెస్స. 1:6-8) ప్రవచించబడిన అద్భుతమైన సంఘటనల నెరవేర్పు చూడడానికి ఎంతో ఆశగా ఎదురుచూస్తూ వృద్ధ అపొస్తలుడైన యోహాను ఇలా అన్నాడు: “ఆమేన్‌; ప్రభువైన యేసూ, రమ్ము.” రాజైన మన నాయకుడు తన తండ్రి నామాన్ని పరిశుద్ధపరచడానికి, ఆయన సర్వాధిపత్యాన్ని నిరూపించడానికి రాజ్యాధికారంతో రావాలని ఈ దుష్టవిధానపు చివరి రోజుల్లో జీవిస్తున్న మనం కూడా ఆశతో ఎదురుచూస్తున్నాం.

12. నాశనకరమైన వాయువులు విడిచిపెట్టబడకముందు క్రీస్తు ఏ పనిని పూర్తి చేస్తాడు?

12 సాతాను దృశ్య సంస్థను నాశనం చేయడానికి యేసు వచ్చే ముందు ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులైన 1,44,000 మందిలోని ఆఖరి వ్యక్తి చివరిగా ముద్రించబడాలి. 1,44,000 మంది ముద్రించబడడం పూర్తయ్యేంతవరకు సాతాను విధానంపై నాశనకరమైన వాయువులు విడిచిపెట్టబడవని బైబిలు స్పష్టంగా చెబుతోంది.—ప్రక. 7:1-4.

13. ‘మహాశ్రమల’ మొదటి ఘట్టంలో క్రీస్తు తన ప్రత్యక్షతను ఎలా రుజువు చేసుకుంటాడు?

13 క్రీస్తు ప్రత్యక్షత 1914లో మొదలైనప్పటి నుండి భూమ్మీదున్న చాలామంది దాన్ని పట్టించుకోలేదు. (2 పేతు. 3:3, 4) అయితే, త్వరలో సాతాను వ్యవస్థలోని వివిధ భాగాలపై యెహోవా దేవుని తీర్పులను అమలుచేయడం ద్వారా క్రీస్తు తన ప్రత్యక్షతను రుజువుచేస్తాడు. అబద్ధ క్రైస్తవమత నాయకులకు సూచనగావున్న ‘పాపపురుషుణ్ణి’ నాశనం చేయడం ద్వారా క్రీస్తు తన ‘ఆగమనాన్ని’ రుజువుచేసుకుంటాడు. (2 థెస్సలొనీకయులు 2:3, 8 చదవండి.) యెహోవా దేవుని నియమిత న్యాయాధిపతిగా క్రీస్తు పనిచేస్తున్నాడని అది నిరూపిస్తుంది. (2 తిమోతి 4:1 చదవండి.) మహాబబులోనులోని హేయ భాగమైన క్రైస్తవమత సామ్రాజ్యపు నాశనం, ఆ దుష్ట ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం పూర్తిగా నాశనం చేయబడుతుందనేందుకు ముంగుర్తుగా ఉంటుంది. ఆధ్యాత్మిక వేశ్యను నాశనం చేయడానికి రాజకీయ నాయకుల మనసులో యెహోవా బుద్ధి పుట్టిస్తాడు. (ప్రక. 17:15-18) ‘మహాశ్రమల్లోని’ మొదటి ఘట్టం అదే.—మత్త. 24:21.

14. (ఎ) మహాశ్రమల మొదటి ఘట్టపు కాలం ఎందుకు తగ్గించబడుతుంది? (బి) “మనుష్యకుమారుని సూచన” కనిపించడమనేది యెహోవా ప్రజలకు ఏ అర్థాన్నిస్తుంది?

14 మహాశ్రమల కాలం “ఏర్పరచబడినవారి నిమిత్తము” అంటే భూమ్మీద మిగిలివున్న అభిషిక్త క్రైస్తవుల కోసం తగ్గించబడుతుందని యేసు చెప్పాడు. (మత్త. 24:22) అబద్ధమతంపై జరిగే నాశనకరమైన దాడిలో అభిషిక్తులు, వారి సహచరులైన వేరేగొర్రెలు తుడిచిపెట్టబడేందుకు యెహోవా అనుమతించడు. “ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే” సూర్యునిలో, చంద్రునిలో, నక్షత్రాల్లో సూచనలు కనిపిస్తాయని, “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును” అని యేసు చెప్పాడు. ఈ సూచన కనిపించినప్పుడు భూమ్మీదున్న జనాంగాలు ఏడుస్తూ ‘రొమ్ము కొట్టుకుంటారు.’ కానీ, పరలోక నిరీక్షణగల అభిషిక్తుల విషయంలో, భూనిరీక్షణగల గొప్ప సమూహం విషయంలో అలా జరగదు. వారు ‘తమ విడుదల సమీపించిందని ధైర్యము తెచ్చుకొని, తమ తలలెత్తుకుంటారు.’—మత్త. 24:29, 30; లూకా 21:25-28.

15. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏ పని చేస్తాడు?

15 మనుష్యకుమారుడు పూర్తి విజయం సాధించకముందు మరో విధంగా కూడా ప్రత్యక్షమౌతాడు. ఆయనిలా ప్రవచించాడు: “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతోకూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.” (మత్త. 25:31-33) ‘సమస్త జనములకు’ చెందిన ప్రజలను రెండు గుంపులుగా వేరు చేసేందుకు క్రీస్తు న్యాయాధిపతిగా వస్తాడని ఈ లేఖనం సూచిస్తోంది. తన ఆధ్యాత్మిక సహోదరులకు (భూమ్మీది అభిషిక్త క్రైస్తవులకు) చురుగ్గా మద్దతిచ్చిన వారిని ‘గొర్రెలుగా,’ “ప్రభువైన యేసు సువార్తకు లోబడని” వారిని ‘మేకలుగా’ తీర్పుతీరుస్తాడు. (2 థెస్స. 1:6-8) ‘నీతిమంతులుగా’ వర్ణించబడిన గొర్రెలు భూమ్మీద “నిత్యజీవము” పొందుతారు. కానీ, మేకలు “నిత్యశిక్షకు” లేదా నిత్య నాశనానికి పోతారు.—మత్త. 25:34, 40, 41, 45, 46.

క్రీస్తు చివరకు పూర్తి విజయం సాధిస్తాడు

16. క్రీస్తు చివరకు ఎలా పూర్తి విజయం సాధిస్తాడు?

16 తనతో పాటు రాజులుగా, యాజకులుగా సేవచేసేవారిని పూర్తిగా ముద్రించి, వేరేగొర్రెలను గుర్తించి రక్షణ కోసం వారిని తన కుడివైపు నిలబెట్టిన తర్వాత క్రీస్తు చివరకు పూర్తి విజయం సాధించేందుకు ‘బయలువెళ్తాడు.’ (ప్రక. 5:9, 10; 6:2) శక్తివంతమైన దేవదూతల సైన్యానికి, పునరుత్థానం చేయబడిన తన సహోదరులకు నాయకునిగా క్రీస్తు ఈ భూమ్మీదున్న సాతాను రాజకీయ, సైనిక, వ్యాపార వ్యవస్థనంతటినీ నాశనం చేస్తాడు. (ప్రక. 2:26, 27; 19:11-21) క్రీస్తు చివరకు, సాతాను దుష్ట వ్యవస్థను నాశనం చేసినప్పుడు పూర్తి విజయం సాధిస్తాడు. ఆ తర్వాత సాతానును, అతని దయ్యాలను వెయ్యి సంవత్సరాలపాటు అగాధంలో బంధిస్తాడు.—ప్రక. 20:1-3.

17. వెయ్యేళ్ల పరిపాలనలో క్రీస్తు తన వేరేగొర్రెలను ఎక్కడికి నడిపిస్తాడు? మన కృతనిశ్చయం ఏమై ఉండాలి?

17 మహాశ్రమలను దాటివచ్చిన వేరే గొర్రెలకు చెందిన “గొప్పసమూహము” గురించి మాట్లాడుతూ అపొస్తలుడైన యోహాను ఇలా ప్రవచించాడు: “సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకును వారిని నడిపించును.” (ప్రక. 7:9, 17) అవును, తన వెయ్యేళ్ల పరిపాలనంతటిలో క్రీస్తు తన స్వరం వినే వేరేగొర్రెలను నిర్దేశిస్తూ వారిని నిత్యజీవానికి నడిపిస్తాడు. (యోహాను 10:16, 26-28 చదవండి.) ఇప్పుడూ, దేవుడు వాగ్దానం చేసిన నూతన లోకంలోనూ మన రాజుగా, నాయకునిగా ఉండే క్రీస్తును నమ్మకంగా అనుకరిద్దాం.

పునఃసమీక్ష

• సింహాసనాసీనుడైన తర్వాత క్రీస్తు ఏ చర్య తీసుకున్నాడు?

• సంఘాలను నడిపించేందుకు క్రీస్తు ఎవరెవర్ని ఉపయోగిస్తున్నాడు?

• మన నాయకుడైన క్రీస్తు ఇంకా ఏ విధాలుగా ప్రత్యక్షమౌతాడు?

• నూతన లోకంలో క్రీస్తు మనల్ని ఎలా నడిపిస్తూనే ఉంటాడు?

[అధ్యయన ప్రశ్నలు]

[29వ పేజీలోని చిత్రం]

సాతాను దుష్ట వ్యవస్థ నాశనమైనప్పుడు క్రీస్తు ప్రత్యక్షత రుజువౌతుంది