కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవ కూటాలు క్షేమాభివృద్ధికరంగా ఉండేందుకు మీరు తోడ్పడుతున్నారా?

క్రైస్తవ కూటాలు క్షేమాభివృద్ధికరంగా ఉండేందుకు మీరు తోడ్పడుతున్నారా?

క్రైస్తవ కూటాలు క్షేమాభివృద్ధికరంగా ఉండేందుకు మీరు తోడ్పడుతున్నారా?

“మీరు కూడి వచ్చునప్పుడు . . . సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి.” —1 కొరిం. 14:26.

1. మొదటి కొరింథీయులు 14వ అధ్యాయం ప్రకారం, క్రైస్తవ కూటాలు ముఖ్యంగా దేనికోసం నిర్వహించబడతాయి?

 ‘ఆ కూటం నాకు ఎంత ప్రోత్సాహాన్నిచ్చిందో!’ రాజ్యమందిరంలో జరిగే ఒకానొక కూటానికి హాజరైన తర్వాత మీరు ఎప్పుడైనా అలా అన్నారా? ఖచ్చితంగా అనేవుంటారు. సంఘ కూటాలు నిజంగా మనకు ప్రోత్సాహాన్ని ఇస్తాయనడంలో ఆశ్చర్యం లేదు. మొదటి శతాబ్దంలోని క్రైస్తవ కూటాల్లాగే ఇప్పటి కూటాలు కూడా ముఖ్యంగా మనకు ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్ని ఇవ్వడానికే నిర్వహించబడతాయి. ఈ విషయాన్ని, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఎలా నొక్కి చెప్పాడో గమనించండి. ఆ పత్రికలోని 14వ అధ్యాయం అంతటిలో పౌలు, కూటాల్లోని ప్రతీ భాగం ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్ని ఇవ్వడానికే నిర్వహించబడాలని పదేపదే చెప్పాడు. ప్రతీ కూటం, ‘సంఘ క్షేమాభివృద్ధి’ కోసమే జరుగుతుంది.—1 కొరింథీయులు 14:3, 12, 26 చదవండి. a

2. (ఎ) దేని వల్ల కూటాలు ప్రోత్సాహకరమైన లేదా ప్రయోజనకరమైన విధంగా జరుగుతాయి? (బి) మనం ఏ ప్రశ్నను పరిశీలిస్తాం?

2 దేవుని ఆత్మ నడిపింపు వల్లే కూటాలు ప్రోత్సాహకరమైన లేదా ప్రయోజనకరమైన విధంగా జరుగుతాయని మనం గుర్తిస్తాం. కాబట్టి, ప్రతీ సంఘ కూటాన్ని ఆరంభించే ముందు తన పరిశుద్ధాత్మను ఇచ్చి మన కూటాన్ని ఆశీర్వదించమని యెహోవాకు హృదయపూర్వకంగా ప్రార్థిస్తాం. అయితే, కూటంలో జరిగే ప్రతీ కార్యక్రమం సాధ్యమైనంత ఎక్కువ ప్రోత్సాహకరంగా ఉండేందుకు సంఘంలోని ప్రతీ ఒక్కరూ తోడ్పడవచ్చని మనకు తెలుసు. కాబట్టి, ప్రతీవారం రాజ్యమందిరంలో జరిగే కూటాలన్నీ ఆధ్యాత్మిక సేదదీర్పును, ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉండాలంటే వ్యక్తిగతంగా మనం ఏమి చేయవచ్చు?

3. క్రైస్తవ కూటాలు ఎంత ప్రాముఖ్యమైనవి?

3 ఆ ప్రశ్నకు జవాబు కోసం ముందుగా, కూటాలను నిర్వహించేవారు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలను చూద్దాం. కూటాలకు వచ్చినవారందరూ ప్రోత్సాహం పొందేందుకు సంఘమంతా ఏమి చేయవచ్చనే దాన్ని కూడా చూస్తాం. మన కూటాలు పవిత్రమైనవి కాబట్టి మనం ఈ విషయంలో ఎంతో ఆసక్తి చూపిస్తాం. కూటాలకు వెళ్లడం, వాటిలో పాల్గొనడం యెహోవాకు మనం చేసే ఆరాధనలో ప్రాముఖ్యమైన అంశాలు.—కీర్త. 26:12; 111:1; యెష. 66:22, 23.

బైబిలు అధ్యయనం చేయడానికి రూపొందించబడిన కూటం

4, 5. కావలికోట అధ్యయనం ముఖ్యంగా ఎందుకు జరుగుతుంది?

4 ప్రతీ వారం జరిగే కావలికోట అధ్యయనం నుండి మనమందరం పూర్తి ప్రయోజనం పొందాలనుకుంటాం. కాబట్టి, ఆ కూటం అసలు ఎందుకు జరుగుతుందో స్పష్టంగా తెలుసుకోవడానికి కావలికోట పత్రికకు, అందులోని అధ్యయన ఆర్టికల్స్‌కు వచ్చిన కొన్ని మార్పులను పరిశీలిద్దాం.

5 జనవరి 15, 2008 సంచికతో ఆరంభమైన కావలికోట అధ్యయన ప్రతి ముఖ పేజీలో ఓ ప్రత్యేకమైన చిత్రం కనిపిస్తుంది. దాన్ని మీరు గమనించారా? ఇప్పుడు మీ చేతిలోవున్న పత్రిక ముఖ పేజీని ఒకసారి బాగా చూడండి. కోట అడుగు భాగాన తెరిచివున్న బైబిలు కనిపిస్తుంది. కావలికోట అధ్యయనం ముఖ్యంగా ఎందుకు ఏర్పాటు చేయబడిందో అది నొక్కి చెబుతోంది. ఈ పత్రిక సహాయంతో బైబిలు చదవడమే దాని ముఖ్య ఉద్దేశం. నెహెమ్యా కాలంలోలాగే, నేడు ప్రతీవారం జరిగే కావలికోట అధ్యయనంలో దేవుని వాక్యాన్ని “బాగుగా గ్రహించునట్లు” దానికి “అర్థము” చెప్పబడుతుంది.—నెహె. 8:8; యెష. 54:13.

6. (ఎ) కావలికోట అధ్యయనంలో ఏ మార్పు చేయబడింది? (బి) “చదవండి” అని ఉన్న లేఖనాలకు సంబంధించి ఏమి గుర్తుంచుకోవాలి?

6 మనం ముఖ్యంగా చదవాల్సింది బైబిలే కాబట్టి, కావలికోట అధ్యయనంలో ఓ మార్పు చేయబడింది. అధ్యయన ఆర్టికల్స్‌లో చాలా లేఖనాలకు, “చదవండి” అని ఉంటుంది. కూటంలో ఆ లేఖనాలు చదవబడుతున్నప్పుడు మన సొంత బైబిళ్లను తెరిచి చూడాలని మనం ప్రోత్సహించబడుతున్నాం. (అపొ. 17:11) ఎందుకంటే, మన సొంత బైబిల్లో దేవుడిచ్చే ఉపదేశాన్ని చూసినప్పుడు అది మన మనసులో చెరగని ముద్రవేస్తుంది. (హెబ్రీ. 4:12) కాబట్టి, ఆ లేఖనాలు బిగ్గరగా చదవబడడానికి ముందు అధ్యయనాన్ని నిర్వహించే సహోదరుడు, అందరూ తమ బైబిళ్లను తెరిచి చూసేందుకు వీలుగా తగినంత సమయమివ్వాలి.

మన విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది

7. కావలికోట అధ్యయనం జరుగుతున్నప్పుడు మనకు ఏ అవకాశం దొరుకుతుంది?

7 కావలికోట అధ్యయన ఆర్టికల్స్‌లో మరో మార్పు కూడా వచ్చింది. అదేమిటంటే, ఇటీవలి కాలాల్లో ఆర్టికల్స్‌ ముందున్నంత పెద్దగా ఉండడం లేదు. దానివల్ల, అధ్యయనం జరుగుతున్నప్పుడు పేరాలు చదవడానికి తక్కువ సమయం పడుతుంది, వ్యాఖ్యానించేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది. ఇప్పుడు చాలామంది వ్యాఖ్యానించేందుకు అవకాశాలున్నాయి. అక్కడ ఇవ్వబడిన ప్రశ్నకు సూటైన జవాబు చెప్పవచ్చు, లేఖనాన్ని అన్వయిస్తూ జవాబు చెప్పవచ్చు, బైబిలు సూత్రాలను పాటించడం ఎంత మంచిదో చూపించే ఓ చిన్న అనుభవాన్ని చెప్పవచ్చు లేదా మరితర విధాలుగా కూడా జవాబు చెప్పవచ్చు. ఆర్టికల్‌లో ఇవ్వబడిన చిత్రాల గురించి చర్చించేందుకు కూడా కొంత సమయాన్ని వెచ్చించాలి.—కీర్తన 22:22; 35:18; 40:9 చదవండి.

8, 9. కావలికోట అధ్యయన నిర్వాహకుని పాత్ర ఏమిటి?

8 అయితే, ప్రేక్షకులు వివిధ వ్యాఖ్యానాలు చేసేందుకు అవకాశం దొరకాలంటే, వ్యాఖ్యానిస్తున్నవారు క్లుప్తంగా జవాబు చెప్పాలి. కావలికోట అధ్యయనాన్ని నిర్వహిస్తున్న సహోదరుడు కూడా ఎక్కువ వ్యాఖ్యానాలు చేయకుండా చూసుకోవాలి. కూటం అందరికీ ప్రోత్సాహకరంగా ఉండాలంటే అధ్యయనాన్ని నిర్వహిస్తున్న సహోదరుడు తన వ్యాఖ్యానాలను, ప్రేక్షకులు చేసే వ్యాఖ్యానాలతో ఎలా సమన్వయపర్చవచ్చు?

9 దీనికి జవాబుగా ఓ ఉదాహరణను పరిశీలించండి. చక్కగా నిర్వహించబడే కావలికోట అధ్యయనం, చూడడానికి అందంగా కనిపించే పూల బొకే (పూల గుచ్ఛం) లాంటిది. పెద్ద బొకేలో వివిధ రకాల పూలు ఉన్నట్లే, కావలికోట అధ్యయనంలో కూడా వేర్వేరు వ్యాఖ్యానాలు చేయబడతాయి. అన్ని పూలు ఒకే సైజులో, ఒకే రంగులో ఉండనట్లే, అధ్యయనం జరుగుతున్నప్పుడు ప్రతీ ఒక్కరూ వ్యాఖ్యానించే సమయం, దాన్ని చెప్పే తీరు ఒకేలా ఉండవు. మరి అధ్యయనం నిర్వహించే సహోదరుని పాత్ర ఏమిటి? ఆయన మధ్యమధ్యలో చేసే వ్యాఖ్యానాలు బొకేలో అక్కడక్కడ పెట్టే పచ్చని రెమ్మల వంటివి. ఈ రెమ్మలు బొకేలో ఎక్కువగా ఉండవు కానీ, అది అందంగా కనిపించేలా దానికి ఓ ఆకారాన్నిస్తాయి. అదే విధంగా, అధ్యయనాన్ని నిర్వహిస్తున్న సహోదరుడు చేసే వ్యాఖ్యానాలు, సంఘ సభ్యులు దేవుణ్ణి మహిమపర్చడానికి చేస్తున్న వ్యాఖ్యానాలను ఒకటి చేసేలా ఉండాలే కానీ అవే ఎక్కువ ఉండకూడదు. అలా, సంఘ సభ్యులు చేసే వివిధ వ్యాఖ్యానాలను, అధ్యయన నిర్వాహకుడు అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యానాలను నేర్పుగా ఒకచోటకు చేరిస్తే, అది ప్రేక్షకులను ఆహ్లాదపరిచే అందమైన బొకేలా తయారౌతుంది.

‘మనం ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగాలు చేద్దాం’

10. తొలి క్రైస్తవులు కూటాల గురించి ఎలా భావించేవారు?

10 ఒకటవ కొరింథీయులు 14:26-33 లో క్రైస్తవ కూటాల గురించి పౌలు చెప్పిన మాటలను గమనిస్తే, మొదటి శతాబ్దంలో కూటాలు ఎలా జరిగేవో తెలుస్తుంది. ఈ లేఖనాలపై వ్యాఖ్యానిస్తూ ఓ బైబిలు పండితుడు ఇలా రాశాడు: “మొదటి శతాబ్దపు క్రైస్తవ చర్చిలో ఆసక్తికరమైన ఓ విషయమేమిటంటే, ఆ కూటాన్ని విజయవంతం చేసే ఆధిక్యత, బాధ్యత తమకున్నాయని దాదాపు అక్కడికి వచ్చే ప్రతీ ఒక్కరూ భావించేవారు. అందుకే వారంతా వినేందుకు మాత్రమే అక్కడికి వచ్చేవారు కాదు. కూటం నుండి ఏదో పొందాలనే కాక, ఇవ్వాలని కూడా చూసేవారు.” నిజానికి, తొలి క్రైస్తవులు సంఘ కూటాలను తమ విశ్వాసాన్ని వ్యక్తపర్చేందుకు అవకాశాలుగా భావించేవారు.—రోమా. 10:10.

11. (ఎ) క్రైస్తవ కూటాలు క్షేమాభివృద్ధికరంగా ఉండేందుకు ఏది దోహదపడుతుంది? ఎందుకు? (బి) కూటాల్లో మనం చేసే వ్యాఖ్యానాలను మెరుగుపర్చుకోవాలంటే ఏ సలహాలను పాటించాలి? (అధస్సూచి చూడండి.)

11 కూటాల్లో మన విశ్వాసాన్ని వ్యక్తపర్చడం ద్వారా ‘సంఘ క్షేమాభివృద్ధికి’ ఎంతగానో తోడ్పడవచ్చు. ఎంతోకాలంగా కూటాలకు వెళ్తున్నప్పటికీ, మన సహోదరసహోదరీలు ఇచ్చే వ్యాఖ్యానాలను వినడానికి ఇప్పుడు కూడా మనం ఇష్టపడతామని మీరు ఒప్పుకుంటారు. ఓ వృద్ధ సహోదరుడు మనస్ఫూర్తిగా జవాబు చెప్పినప్పుడు మనం చలించిపోతాం, ఓ సంఘ పెద్ద ఎంతో ఆలోచించి జవాబు చెప్పినప్పుడు మనం ప్రోత్సాహాన్ని పొందుతాం, చిన్నపిల్లలు యెహోవాపై తమకున్న ప్రేమను చూపించే విధంగా అప్పటికప్పుడు జవాబు చెప్పడాన్ని చూసి మనం సంతోషిస్తాం. వ్యాఖ్యానాలు చేయడం ద్వారా, క్రైస్తవ కూటాలు క్షేమాభివృద్ధికరంగా ఉండేందుకు మనమందరం తోడ్పడతాం. b

12. (ఎ) మోషే, యిర్మీయా ఉదాహరణల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (బి) వ్యాఖ్యానించే విషయంలో ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది?

12 అయితే, బిడియం కారణంగా కొంతమందికి వ్యాఖ్యానాలు చేయడం చాలా కష్టం. మీరు బిడియస్థులైతే, మీకు మాత్రమే ఆ సమస్య ఉందనుకోకండి. నిజానికి మోషే, యిర్మీయా వంటి నమ్మకమైన దేవుని సేవకులు కూడా పదిమందిలో మాట్లాడే సామర్థ్యం తమకు లేదని అనుకున్నారు. (నిర్గ. 4:10; యిర్మీ. 1:6) కానీ, బహిరంగంగా తనను స్తుతించడానికి యెహోవా దేవుడు వారికి సహాయం చేశాడు. స్తుతియాగాలు చేసేందుకు ఆయన మీకు కూడా సహాయం చేస్తాడు. (హెబ్రీయులు 13:15, చదవండి.) అయితే, వ్యాఖ్యానించే విషయంలో మీ భయాన్ని పోగొట్టుకునేందుకు యెహోవా సహాయాన్ని మీరెలా పొందవచ్చు? మొదటిగా, కూటానికి బాగా సిద్ధపడండి. ఆ తర్వాత, రాజ్యమందిరానికి వెళ్లేముందు, కూటంలో వ్యాఖ్యానించేందుకు ధైర్యమివ్వమని యెహోవాకు ప్రార్థించండి. (ఫిలి. 4:6) మీరు “ఆయన చిత్తానుసారముగా” అడుగుతున్నారు కాబట్టి, యెహోవా మీకు సహాయం చేస్తాడనే నమ్మకాన్ని కలిగివుండండి.—1 యోహా. 5:14; సామె. 15:29.

క్షేమాభివృద్ధిని, ప్రోత్సాహాన్ని, ఆదరణను ఇచ్చే కూటాలు

13. (ఎ) కూటాలకు వచ్చినవారికి అవి ఎలా అనిపించాలి? (బి) క్రైస్తవ పెద్దలు ప్రత్యేకంగా ఏ ప్రాముఖ్యమైన ప్రశ్న గురించి ఆలోచించాలి?

13 క్షేమాభివృద్ధిని, ప్రోత్సాహాన్ని, ఆదరణను ఇవ్వడమే కూటాల ముఖ్య ఉద్దేశమని పౌలు చెప్పాడు. c (1 కొరిం. 14:3) తాము నిర్వహించే భాగాలు, సహోదరసహోదరీలను ప్రోత్సహించి వారికి ఆదరణను ఇచ్చేలా ఉండాలంటే క్రైస్తవ పెద్దలు ఏమి చేయవచ్చు? జవాబు కోసం, పునరుత్థానం చేయబడిన తర్వాత యేసు తన శిష్యులతో జరిపిన ఓ కూటాన్ని పరిశీలిద్దాం.

14. (ఎ) యేసు తన శిష్యులతో కూటం జరపడానికి ముందు ఏమి జరిగింది? (బి) “యేసు వారియొద్దకు వచ్చి” మాట్లాడినప్పుడు అపొస్తలులు ఎందుకు ఆదరణను పొందివుంటారు?

14 యేసు తన శిష్యులతో ఆ కూటం జరపడానికి ముందు ఏమి జరిగిందో చూడండి. యేసు చనిపోవడానికి కొన్ని గంటల ముందు, అపొస్తలులు ‘ఆయనను విడిచి పారిపోయారు.’ తాను ముందే చెప్పినట్లు, వారందరూ ‘ఎవరి ఇంటికి వారు చెదరిపోయారు.’ (మార్కు 14:50; యోహా. 16:32) అయితే, పునరుత్థానం చేయబడిన తర్వాత యేసు దిగులుతోవున్న తన అపొస్తలులను ఓ ప్రత్యేకమైన కూటానికి ఆహ్వానించాడు. d ఆ ఆహ్వానాన్ని స్వీకరించి, ‘పదకొండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లారు.’ అప్పుడు, “యేసు వారియొద్దకు వచ్చి” వారితో మాట్లాడాడు. (మత్త. 28:10, 16, 18) తమతో మాట్లాడేందుకు యేసే స్వయంగా ముందుకు రావడాన్ని చూసిన ఆ అపొస్తలులు ఎంత ఆదరణ పొందివుంటారో ఊహించండి! ఇంతకీ యేసు వారితో ఏమి మాట్లాడాడు?

15. (ఎ) యేసు ఆ కూటంలో ఏ విషయాలు మాట్లాడాడు? ఏ విషయాల గురించి మాట్లాడలేదు? (బి) ఆ కూటం అపొస్తలులపై ఎలాంటి ప్రభావం చూపించింది?

15 “నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది” అని చెబుతూ యేసు ఆ కూటాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత వారికి ఓ నియామకాన్నిస్తూ, ‘మీరు వెళ్లి శిష్యులను చేయండి’ అని అన్నాడు. చివరిగా, వారికి ఆదరణనిచ్చే ఈ అభయాన్నిచ్చాడు: ‘నేను సదాకాలము మీతో కూడ ఉన్నాను.’ (మత్త. 28:18-20) అయితే, ఆ సందర్భంలో యేసు ఏమి చేయలేదో గమనించారా? ఆయన తన అపొస్తలుల మీద కోపగించుకోలేదు. వారి ఉద్దేశాలను ప్రశ్నించేందుకు ఆ కూటాన్ని ఓ అవకాశంగా తీసుకోలేదు లేదా తాత్కాలికంగా విశ్వాసంలో బలహీనపడినందుకు అపరాధ భావాలతో వారు కృంగిపోయేలా చేయలేదు. కానీ తాను, తన తండ్రి వారిని ప్రేమిస్తున్నారని అభయమిస్తూ యేసు వారికి ఓ పెద్ద బాధ్యతను అప్పగించాడు. యేసు తమతో వ్యవహరించిన తీరు అపొస్తలులపై ఎలాంటి ప్రభావం చూపించింది? వారు ఎంతగా క్షేమాభివృద్ధిని, ప్రోత్సాహాన్ని, ఆదరణను పొందారంటే, ఆ కూటం జరిగిన కొన్ని రోజులకే వారు మళ్లీ సువార్తను ‘ప్రకటించడం, బోధించడం’ మొదలుపెట్టారు.—అపొ. 5:42.

16. యేసు మాదిరిని అనుకరిస్తూ సంఘ పెద్దలు కూటాలను సేదదీర్పునిచ్చే విధంగా ఎలా నిర్వహిస్తారు?

16 యేసులాగే నేటి క్రైస్తవ పెద్దలు కూడా కూటాలను, యెహోవా తన ప్రజలను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడని తోటి విశ్వాసులకు అభయమిచ్చేందుకు అవకాశాలుగా ఎంచుతారు. (రోమా. 8:38, 39) కాబట్టి, పెద్దలు కూటంలో ఏదైనా భాగం నిర్వహిస్తున్నప్పుడు తమ సహోదరుల బలహీనతలపై కాదుగానీ, వారిలోని మంచిపై దృష్టి నిలుపుతారు. వారు తమ సహోదరుల ఉద్దేశాలను ప్రశ్నించరు. బదులుగా, తోటి విశ్వాసులు యెహోవాను ప్రేమించే వ్యక్తులనీ, సరైనది చేయాలనే ఉద్దేశం వారికుందనీ చూపించే విధంగా మాట్లాడతారు. (1 థెస్స. 4:1, 9-12) అయితే, కొన్నిసార్లు పెద్దలు మొత్తం సంఘానికి ఏదైనా ఉపదేశం ఇవ్వాల్సిరావచ్చు. కానీ, ఒకవేళ అలాంటి ఉపదేశం కొంతమంది వ్యక్తులను సరిదిద్దడం కోసమే అయితే వారికి వ్యక్తిగతంగా ఇవ్వడమే మంచిది. (గల. 6:1; 2 తిమో. 2:24-26) పెద్దలు మొత్తం సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, సాధ్యమైనంతవరకు మెచ్చుకోవడానికే చూస్తారు. (యెష. 32:2) కూటానికి వచ్చిన వారందరూ అది ముగిసే సమయానికి తాము సేదదీర్పును, బలాన్ని పొందామని భావించే విధంగా మాట్లాడడానికి పెద్దలు ప్రయత్నిస్తారు.—మత్త. 11:28; అపొ. 15:32.

ఓ సురక్షితమైన చోటు

17. (ఎ) మన కూటాలు సురక్షితమైన చోటుగా ఉండడం ఇప్పుడు ఎందుకు మరింత ప్రాముఖ్యం? (బి) కూటాలు క్షేమాభివృద్ధికరంగా ఉండేందుకు వ్యక్తిగతంగా మీరేమి చేయవచ్చు? (“మీకు, ఇతరులకు కూటాలు క్షేమాభివృద్ధికరంగా ఉండడానికి సహాయం చేసే పది మార్గాలు” అనే బాక్సు చూడండి.)

17 సాతాను లోకం రోజురోజుకీ మనల్ని అణచివేసేదిగా తయారౌతోంది కాబట్టి, మన కూటాలను ఓ సురక్షితమైన చోటుగా అంటే ఆదరణను ఇచ్చే చోటుగా ఉండేలా చూడాలి. (1 థెస్స. 5:11) కొన్ని సంవత్సరాల క్రితం తన భర్తతోపాటు ఓ తీవ్రమైన పరీక్షను ఎదుర్కొన్న ఓ సహోదరి ఇలా గుర్తుచేసుకుంటోంది: “రాజ్యమందిరంలో ఉన్నంతసేపు ప్రేమగల యెహోవా కాపుదలలో ఉన్నట్లు మాకు అనిపించేది. క్రైస్తవ సహోదర సహోదరీల మధ్యవున్న ఆ కొన్ని గంటలు మేము మా భారాన్ని యెహోవా మీద మోపగలుగుతున్నామని అనిపించేది. అంతేకాక కొంత మనశ్శాంతిని కూడా పొందాం.” (కీర్త. 55:22) మన కూటాలకు వచ్చే ప్రతీ ఒక్కరూ అలాంటి ప్రోత్సాహాన్ని, ఆదరణను పొందుదురు గాక! అలా జరగాలంటే, క్రైస్తవ కూటాలు క్షేమాభివృద్ధికరంగా ఉండేందుకు మనమందరం మన వంతు కృషి చేస్తూనే ఉందాం.

[అధస్సూచీలు]

a మొదటి శతాబ్దపు సంఘ కూటాల్లో జరిగిన కొన్ని విషయాలు తర్వాతి కాలంలో జరగవని ముందే చెప్పబడింది. ఉదాహరణకు, మనం అద్భుతరీతిలో ‘భాషలు’ మాట్లాడము, లేదా ‘ప్రవచించము.’ (1 కొరిం. 13:8; 14:5) అయినా పౌలు ఇచ్చిన ఉపదేశాలను బట్టి, నేడు క్రైస్తవ కూటాలు ఎలా నిర్వహించబడాలనే విషయాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు.

b కూటాల్లో మనం చేసే వ్యాఖ్యానాలను మెరుగుపర్చుకోవడానికి సహాయం చేసే సలహాల కోసం, కావలికోట సెప్టెంబరు 1, 2003 సంచికలోని 19-22 పేజీలు చూడండి.

c ప్రోత్సాహానికి, ‘ఆదరణకు’ మధ్య ఉండే తేడా గురించి వివరిస్తూ, “ఆదరణ” అని అనువదించబడిన గ్రీకు పదం ప్రోత్సాహం కన్నా “ఎక్కువ మృదువైన దాన్ని” సూచిస్తోందని వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ ఓల్డ్‌ అండ్‌ న్యూ టెస్టమెంట్‌ వర్డ్స్‌ చెప్పింది.—యోహాను 11:19 పోల్చండి.

d యేసు “ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు . . . కనబడెను” అని అపొస్తలుడైన పౌలు అన్నప్పుడు బహుశా ఈ సందర్భాన్నే సూచించి ఉంటాడు.—1 కొరిం. 15:6.

మీరెలా జవాబిస్తారు?

• క్రైస్తవ కూటాలు ఎంత ప్రాముఖ్యమైనవి?

• కూటాల్లో ఇవ్వబడే వ్యాఖ్యానాలు ‘సంఘ క్షేమాభివృద్ధికి’ తోడ్పడతాయని ఎందుకు చెప్పవచ్చు?

• తన శిష్యులతో యేసు జరిపిన కూటం నుండి ఏమి నేర్చుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[22, 23వ పేజీలోని బాక్సు/ చిత్రాలు]

మీకు, ఇతరులకు కూటాలు క్షేమాభివృద్ధికరంగా ఉండడానికి సహాయం చేసే పది మార్గాలు

ముందుగా సిద్ధపడండి. రాజ్యమందిరంలో చర్చించబోయే విషయాలను ముందుగానే అధ్యయనం చేయడం వల్ల మీరు కూటంలో ఏకాగ్రతతో వింటారు, విన్న విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు.

క్రమంగా వెళ్లండి. కూటాలకు ఎక్కువ మంది వెళ్తే అందరికీ ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా అక్కడ ఉండడం చాలా అవసరం.

సమయానికి వెళ్లండి. కార్యక్రమం మొదలవడానికి ముందే మీరు మీ సీట్లలో కూర్చున్నట్లైతే యెహోవాకు మనం చేసే ఆరాధనలో భాగమైన ఆరంభ పాటకు, ప్రార్థనకు మీరు ఉండగలుగుతారు.

అన్నీ తీసుకువెళ్లండి. మీ బైబిలును, కూటంలో ఉపయోగించే ఇతర ప్రచురణలను తీసుకువెళ్లండి. అలా చేస్తే, చర్చించబడుతున్న విషయాలను మీరు కూడా మీ పుస్తకాల్లో చూడగలుగుతారు, విషయాలను బాగా అర్థం చేసుకోగలుగుతారు.

ఆటంకాలను నివారించండి. ఉదాహరణకు, సెల్‌ఫోనుకు వచ్చే మెసేజ్‌లను కూటం జరుగుతున్నప్పుడు చదవకుండా, కూటం అయిపోయిన తర్వాత చదవండి. అలా, మీ వ్యక్తిగత విషయాలను వాటివాటి స్థానంలో ఉంచగలుగుతారు.

మీరూ పాల్గొనండి. ఎక్కువమంది వ్యాఖ్యానిస్తే, వివిధ మాటల్లో విశ్వాసం వ్యక్తమౌతుంది కాబట్టి చాలామంది ప్రోత్సాహాన్ని, బలాన్ని పొందుతారు.

క్లుప్తంగా వ్యాఖ్యానించండి. ఇలా చేస్తే ఎక్కువమంది వ్యాఖ్యానించేందుకు అవకాశం దొరుకుతుంది.

మీ నియామకాల్ని నెరవేర్చండి. దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో లేదా సేవాకూటంలో నియామకం దొరికితే బాగా సిద్ధపడండి, ముందే ప్రాక్టీసు చేయండి, సాధ్యమైనంతవరకు మీ నియామకాన్ని రద్దు చేసుకోకుండా చూసుకోండి.

కార్యక్రమంలో పాల్గొన్నవారిని మెచ్చుకోండి. ఎవరైనా కూటంలో ఒక నియామకం నెరవేరిస్తే లేదా వ్యాఖ్యానాలు చేస్తే వారి ప్రయత్నాలను మీరెంత మెచ్చుకుంటున్నారో చూపించండి.

ఇతరులతో సహవసించండి. కూటానికి ముందు, తర్వాత ఇతరులను ప్రేమతో పలకరించి వారితో ప్రోత్సాహకరంగా మాట్లాడితే, కూటానికి వెళ్లడంవల్ల కలిగే సంతోషం, ప్రయోజనం రెట్టింపు అవుతాయి.