కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తోటి విశ్వాసులను ఘనపర్చడంలో మీరు ముందుంటున్నారా?

తోటి విశ్వాసులను ఘనపర్చడంలో మీరు ముందుంటున్నారా?

తోటి విశ్వాసులను ఘనపర్చడంలో మీరు ముందుంటున్నారా?

“సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.”—రోమా. 12:10.

1, 2. (ఎ) పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఏమి చెప్పాడు? (బి) మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

 క్రైస్తవులముగా మనం సంఘంలోని ఇతరులపట్ల ఎందుకు ప్రేమ చూపించాలో అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో నొక్కిచెప్పాడు. మన “ప్రేమ నిష్కపటమైనదై” ఉండాలని ఆయన మనకు గుర్తుచేశాడు. “సహోదర ప్రేమ” గురించి కూడా మాట్లాడుతూ, ఆ ప్రేమ ‘అనురాగంతో’ కూడినదై ఉండాలని ఆయన చెప్పాడు.—రోమా. 12:9, 10ఎ.

2 సహోదర ప్రేమ చూపించడమంటే ఇతరుల పట్ల స్నేహ భావాలు కలిగివుండడం మాత్రమే కాదు. అలాంటి భావాలు క్రియల్లో కూడా కనబడాలి. మనకు ఇతరుల పట్ల ప్రేమాభిమానాలు ఉన్నాయని క్రియల్లో చూపిస్తే తప్ప తెలియదు. అందుకే, పౌలు ఆ తర్వాత, “ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి” లేదా ముందుండండి అని రాశాడు. (రోమా. 12:10బి) ఇతరులను ఘనపర్చడం అంటే ఏమిటి? తోటి విశ్వాసులను ఘనపర్చడంలో ముందుండడం ఎందుకు ప్రాముఖ్యం? మనం దీన్ని ఎలా చేయవచ్చు?

గౌరవం, ఘనత

3. “ఘనత” అనే పదానికి బైబిలు మూల భాషల్లో ఏయే అర్థాలున్నాయి?

3 “ఘనత” అని అనువదించబడిన హెబ్రీ మూలపదానికి అక్షరార్థంగా ‘బరువుగా ఉండడం’ అని అర్థం. ఒక వ్యక్తికి ఘనత ఇవ్వబడిందంటే, ఆయన ప్రాముఖ్యమైనవాడని అర్థం. బైబిల్లో “ఘనత” అని అనువదించబడిన గ్రీకు పదానికి గొప్పగా, విలువైనదిగా, అమూల్యమైనదిగా ఎంచడం అనే అర్థాలున్నాయి. (లూకా 14:10) కాబట్టి, మనం ఎవరిని ఘనపరుస్తామో వారిని అమూల్యమైన వ్యక్తులుగా ఎంచుతాం.

4, 5. ఘనతను ఇవ్వడానికి, గౌరవం కలిగివుండడానికి మధ్యవున్న సంబంధమేమిటి? ఉదాహరించండి.

4 ఇతరులను ఘనపర్చడం అంటే ఏమిటి? ఘనపర్చడం అనేది గౌరవంతో మొదలౌతుంది. “ఘనత,” “గౌరవం” అనే రెండు పదాల మధ్య చాలా దగ్గరి సంబంధముంది. కాబట్టి, చాలా సందర్భాల్లో ఆ రెండిటినీ కలిపి ఉపయోగిస్తారు. ఘనపర్చడం అంటే గౌరవాన్ని క్రియల్లో చూపించడమే. మరో మాటలో చెప్పాలంటే, గౌరవమనేది మన సహోదరుని పట్ల మనకు మనసులో ఉండే ఓ భావన, ఘనపర్చడమేమో మన సహోదరునితో వ్యవహరించే తీరు.

5 ఓ క్రైస్తవుని హృదయంలో తోటి విశ్వాసుల పట్ల గౌరవం లేకుంటే ఆయన వారిని ఎలా ఘనపర్చగలుగుతాడు? (3 యోహా. 9, 10) ఓ మొక్క మంచి నేలలో వేళ్లూనుకున్నప్పుడే అది ఏపుగా పెరుగుతుంది, చాలా కాలం బ్రతుకుతుంది. అలాగే, హృదయంలో గౌరవం వేళ్లూనుకున్నప్పుడే నిజమైన ఘనత ఇవ్వబడుతుంది, అది చాలా కాలం నిలుస్తుంది. ఓ వ్యక్తి పట్ల నిజమైన గౌరవం లేకుండా ఇచ్చేది నిజమైన ఘనత కాదు, అది ఎంతోకాలం నిలవదు. అందుకే, పౌలు ఇతరులను ఘనపర్చమని చెప్పే ముందు, “మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను” అని ఉపదేశించాడంటే మనం ఆశ్చర్యపోనవసరం లేదు.—రోమా. 12:9; 1 పేతురు 1:22 చదవండి.

“దేవుని పోలికెగా” సృష్టించబడిన వారిని ఘనపర్చండి

6, 7. మనం ఇతరులను ఎందుకు గౌరవించాలి?

6 హృదయంలో గౌరవం ఉంటేనే ఒక వ్యక్తిని ఘనపరుస్తాం కాబట్టి, మన సహోదరులందరినీ గౌరవించడానికిగల లేఖనాధారిత కారణాలను మనం ఎన్నడూ మరచిపోకూడదు. అయితే, ఇప్పుడు మనం రెండు కారణాలను పరిశీలిద్దాం.

7 భూమ్మీదున్న ప్రాణులన్నిటిలో మానవులు మాత్రమే “దేవుని పోలికెగా” సృష్టించబడ్డారు. (యాకో. 3:9) అందుకే మనకు ప్రేమ, జ్ఞానం, న్యాయం వంటి దైవిక లక్షణాలు ఉన్నాయి. సృష్టికర్త నుండి మనం ఇంకా ఏమి పొందామో గమనించండి. కీర్తనకర్త ఇలా రాశాడు: “యెహోవా . . . ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా . . . వానిని [మానవుణ్ణి] . . . చేసియున్నావు మహిమా ప్రభావములతో [‘ఘనతలతో,’ ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌] వానికి కిరీటము ధరింపజేసియున్నావు.” (కీర్త. 8:1, 4, 5; 104:1) a మానవులందరికీ దేవుడు కొంతమేర గౌరవాన్ని, ఘనతను అనుగ్రహించాడు. కాబట్టి, ఇతరులను ఘనపర్చినప్పుడు నిజానికి, మనం ఘనతకు మూలమైన యెహోవాను ఘనపరుస్తాం. యెహోవా గురించి తెలియని వారిని గౌరవించేందుకే సరైన కారణాలున్నాయంటే, తోటి విశ్వాసులను మనం ఇంకెంతగా గౌరవించాలో ఆలోచించండి.—యోహా. 3:16; గల. 6:10.

ఒకే కుటుంబ సభ్యులు

8, 9. తోటి విశ్వాసులను గౌరవించడానికిగల ఏ కారణాన్ని పౌలు ప్రస్తావించాడు?

8 సంఘంలో ఒకరినొకరు గౌరవించుకోవడానికిగల మరో కారణాన్ని పౌలు తెలియజేశాడు. ఇతరులను ఘనపర్చాలనే విషయాన్ని చెప్పే ముందు, “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై” ఉండమని ఆయన అన్నాడు. “అనురాగము” అని అనువదించబడిన గ్రీకు పదం, కుటుంబ సభ్యులు ప్రేమతో ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా వారిని ఐక్యపర్చే గట్టి అనుబంధాన్ని సూచిస్తోంది. కాబట్టి, ఆ పదాన్ని ఉపయోగించడం ద్వారా, క్రైస్తవ సంఘ సభ్యులు, గట్టి ప్రేమానుబంధాల చేత ఐక్యపర్చబడిన కుటుంబ సభ్యుల్లా ఉండాలని పౌలు నొక్కి చెప్పాడు. (రోమా. 12:4, 5) అయితే, పౌలు ఆ మాటలను అభిషిక్త క్రైస్తవులకు రాశాడు. వారంతా ఒకే తండ్రియైన యెహోవా చేత పిల్లలుగా దత్తత తీసుకోబడ్డారు. కాబట్టి, ఓ ప్రత్యేకమైన రీతిలో వారు సన్నిహిత కుటుంబ సభ్యులుగా ఉన్నారు. పౌలు కాలంలోని అభిషిక్త క్రైస్తవులకు ఒకరినొకరు గౌరవించుకోవడానికి బలమైన కారణమే ఉంది. నేటి అభిషిక్త క్రైస్తవుల విషయంలో కూడా అంతే.

9 మరి ‘వేరే గొర్రెల’ విషయమేమిటి? (యోహా. 10:16) వారు దేవుని పిల్లలుగా దత్తత తీసుకోబడకపోయినా వారంతా ప్రపంచవ్యాప్త క్రైస్తవ కుటుంబంగా ఐక్యపరచబడ్డారు కాబట్టి ఒకరినొకరు సహోదర సహోదరీలని పిలుచుకోవచ్చు. (1 పేతు. 2:17; 5:9) వేరే గొర్రెలుగా ఉన్నవారు తాము ప్రపంచవ్యాప్త క్రైస్తవ కుటుంబంగా ఐక్యపరచబడ్డామనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే, తోటి విశ్వాసుల పట్ల మనస్ఫూర్తిగా గౌరవం చూపిస్తారు.—1 పేతురు 3:8 చదవండి.

ఇతరులను ఘనపర్చడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?

10, 11. ఇతరులను గౌరవించి, ఘనపర్చడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?

10 ఇతరులను గౌరవించి, ఘనపర్చడం ఎందుకు చాలా ప్రాముఖ్యం? ఎందుకంటే, మన సహోదర సహోదరీలను ఘనపర్చడం ద్వారా సంఘమంతా క్షేమంగా, ఐక్యంగా ఉండేందుకు మనం ఎంతగానో తోడ్పడతాం.

11 అయితే, క్రైస్తవులమైన మనకు బలాన్నిచ్చేవాటిలో యెహోవాతో దగ్గరి సంబంధాన్ని కలిగివుండడం, ఆయన పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందడం అనేవి అత్యంత శక్తివంతమైనవని మనకు తెలుసు. (కీర్త. 36:7; యోహా. 14:26) అంతేకాక, తోటి విశ్వాసులు మనల్ని అమూల్యమైనవారిగా ఎంచుతున్నారని తమ మాటల్లో చూపించినప్పుడు మనం ప్రోత్సాహాన్ని పొందుతాం. (సామె. 25:11) వారు మనల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకొని, మనల్ని గౌరవించినప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. దానివల్ల, మనం సంతోషంతో, కృతనిశ్చయంతో జీవమార్గంలో ముందుకు సాగడానికి కావాల్సిన రెట్టింపు బలాన్ని పొందుతాం. మీరిప్పటికే అలాంటి అనుభవాన్ని రుచి చూసివుంటారు.

12. సంఘంలో ప్రేమపూర్వకమైన వాతావరణానికి ప్రతీ ఒక్కరం ఎలా తోడ్పడవచ్చు?

12 ఇతరులు మనల్ని గౌరవించాలని మనం కోరుకుంటామనే విషయం యెహోవాకు తెలుసు కాబట్టే, ‘ఒకరినొకరు గౌరవించుకోవడానికి త్వరపడండి’ అని ఆయన తన వాక్యం ద్వారా చెబుతున్నాడు. (రోమా. 12:10, క్యాతలిక్‌ అనువాదము; మత్తయి 7:12 చదవండి.) ఎల్లప్పుడూ ఉపయోగపడే ఆ సలహాను పాటించే క్రైస్తవులు, సహోదర సహోదరీల మధ్య ప్రేమపూర్వకమైన వాతావరణానికి తోడ్పడతారు. అందుకే, మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘సంఘంలోవున్న సహోదరుని పట్ల లేక సహోదరి పట్ల నాకున్న గౌరవాన్ని మాటల్లో, చేతల్లో నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూపించాను?’—రోమా. 13:8.

ఇతరులను ఘనపర్చే విషయంలో మనమందరం ముందుండాలి

13. (ఎ) ఇతరులను ఘనపర్చే విషయంలో ఎవరు ముందుండాలి? (బి) రోమీయులు 1:1-7 లోని పౌలు మాటలను బట్టి మనకు ఏమి అర్థమౌతోంది?

13 ఇతరులను ఘనపర్చే విషయంలో ఎవరు ముందుండాలి? హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు క్రైస్తవ పెద్దల గురించి చెబుతూ, వారు “మీపైని నాయకులు” అని అన్నాడు. (హెబ్రీ. 13:17) సంఘ పెద్దలు ఎన్నో విషయాల్లో నాయకత్వం వహిస్తారు. అయితే మంద కాపరులుగా వారు, తోటి పెద్దలతో సహా తోటి విశ్వాసులందరినీ ఘనపర్చే విషయంలో తప్పక ముందుండాలి. ఉదాహరణకు, సంఘ ఆధ్యాత్మిక అవసరాల గురించి చర్చించడానికి వారు కలుసుకున్నప్పుడు తోటి పెద్దలు చెప్పేది ఓపిగ్గా వినడం ద్వారా ఒకరినొకరు ఘనపర్చుకుంటారు. అలాగే, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు వారు పెద్దలందరి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా కూడా ఒకరినొకరు ఘనపర్చుకుంటారు. (అపొ. 15:6-15) అయితే, పౌలు రోమీయులకు పత్రిక రాసినప్పుడు కేవలం పెద్దలను ఉద్దేశించే కాక, సంఘంలోని ‘వారందరిని’ ఉద్దేశించి రాశాడని మనం గుర్తుంచుకోవాలి. (రోమా. 1:1-7) కాబట్టి, ఒకరినొకరు ఘనపర్చుకునే విషయంలో ముందుండాలని పౌలు ఇచ్చిన ఉపదేశం నేడు కూడా, సంఘ పెద్దలతో సహా సంఘంలోని వారందరికీ వర్తిస్తుంది.

14. (ఎ) ఇతరులను ఘనపర్చడానికీ, ఘనపర్చడంలో ముందుండడానికీ మధ్యవున్న తేడా ఏమిటో ఉదాహరణతో చెప్పండి. (బి) మనం ఏ ప్రశ్న వేసుకోవచ్చు?

14 పౌలు ఇచ్చిన ఉపదేశంలోని మరో విషయాన్ని గమనించండి. ఆయన రోములోని తోటి విశ్వాసులతో ఇతరులను ఘనపర్చమని మాత్రమే చెప్పలేదు కానీ, ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలని అంటే ముందుండాలని చెప్పాడు. అయితే, ఇతరులను ఘనపర్చడానికీ, ఘనపర్చడంలో ముందుండడానికీ మధ్యవున్న తేడా ఏమిటి? ఈ ఉదాహరణను పరిశీలించండి. చదవడం, రాయడం వచ్చిన విద్యార్థులకు చదవడం నేర్చుకోమని టీచరు చెబుతుందా? చెప్పదు, ఎందుకంటే వారికి అప్పటికే చదవడం తెలుసు. కాబట్టి, ఇంకా మెరుగ్గా చదివేందుకు టీచరు వారికి సహాయం చేయాలనుకుంటుందే కానీ చదవడం నేర్పించాలనుకోదు. ఇతరులను ఘనపర్చేందుకు తోడ్పడే ‘ప్రేమను’ మనమందరం చూపిస్తాం. ఎందుకంటే అదే క్రైస్తవుల గుర్తింపు చిహ్నం. (యోహా. 13:35) అయితే, అప్పటికే చదవడం, రాయడం వచ్చిన విద్యార్థులు ఇంకా మెరుగ్గా చదివేలా ప్రగతి సాధించే అవకాశం ఉన్నట్లే, మనం కూడా ఇతరులను ఘనపర్చే విషయంలో ముందుండేలా ప్రగతి సాధించే అవకాశం ఉంది. (1 థెస్స. 4:9, 10) ఇతరులను ఘనపర్చే విషయంలో ముందుండాల్సిన బాధ్యత సంఘంలో ప్రతీ ఒక్కరి మీద ఉంది. ‘నేను అలా చేస్తున్నానా?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు.

“బీదలను” ఘనపర్చండి

15, 16. (ఎ) ఘనపర్చే విషయంలో మనం ఎవరిని చిన్నచూపు చూడకూడదు? ఎందుకు? (బి) ఇతరులపట్ల మన హృదయంలో ఎంత గౌరవం ఉందనేది ఎలా తెలుస్తుంది?

15 ఘనపర్చే విషయంలో మనం సంఘంలో ఉన్న ఎవరిని చిన్నచూపు చూడకూడదు? దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.” (సామె. 19:17) ఇతరులను ఘనపర్చేందుకు ప్రయత్నిస్తుండగా ఈ లేఖన సూత్రం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

16 చాలామంది తమకన్నా పై స్థానంలో ఉన్నవారిని ఘనపరుస్తారు కానీ, తమకన్నా తక్కువ స్థానంలో ఉన్నవారిని చిన్నచూపు చూస్తారు లేదా అసలు పట్టించుకోరు అనే విషయం మీకు తెలుసు. అయితే, యెహోవా అలాంటి వ్యక్తి కాడు. “నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును” అని ఆయన చెబుతున్నాడు. (1 సమూ. 2:30; కీర్త. 113:5-8) యెహోవా తనను సేవించే, ఘనపర్చే వారందరినీ ఘనపరుస్తాడు. ఆయన ‘బీదలను’ చిన్నచూపు చూడడు. (యోబు 34:19 చదవండి; 2 దిన. 16:9) ఈ విషయంలో మనం యెహోవాను అనుకరించాలనుకుంటాం. మనం ఇతరులను నిజంగా ఘనపరుస్తున్నామో లేదో తెలుసుకోవాలంటే మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘సంఘంలో ప్రాముఖ్యమైన లేదా బాధ్యతగల స్థానంలో లేని వారితో నేను ఎలా వ్యవహరిస్తాను?’ (యోహా. 13:14, 15) ఆ ప్రశ్నకు మనమిచ్చే జవాబును బట్టి ఇతరులపట్ల మన హృదయంలో ఎంత గౌరవం ఉందనేది తెలుస్తుంది.—ఫిలిప్పీయులు 2:3, 4 చదవండి.

ఇతరులకు సమయమివ్వడం ద్వారా వారిని ఘనపర్చండి

17. సంఘంలోని వారందరినీ ఘనపర్చే విషయంలో ముందుండాలంటే మనం ముఖ్యంగా ఏమి చేయాలి? అలాగని ఎందుకు చెప్పవచ్చు?

17 సంఘంలోని వారందరినీ ఘనపర్చే విషయంలో ముందుండాలంటే మనం ముఖ్యంగా ఏమి చేయాలి? వారికి మన సమయాన్నివ్వాలి. అలాగని ఎందుకు చెప్పవచ్చు? క్రైస్తవులముగా మనం ఎన్నో ప్రాముఖ్యమైన సంఘ కార్యకలాపాలకు సమయాన్ని వెచ్చించడం వల్ల ఎంతో బిజీగా ఉంటాం. మనకు సమయం ఎంతో విలువైనది కాబట్టి, మన సహోదర సహోదరీల నుండి ఎక్కువ సమయాన్ని ఆశించకూడదని గుర్తిస్తాం. అలా మన నుండి కూడా ఎక్కువ సమయాన్ని ఆశించకూడదని ఇతరులు అర్థం చేసుకున్నప్పుడు మనం సంతోషిస్తాం.

18. పద్దెనిమిదవ పేజీలోని చిత్రం చూపిస్తున్నట్లుగా, తోటి విశ్వాసులకు సమయమివ్వడానికి మనం ఇష్టపడుతున్నామని ఎలా చూపించవచ్చు?

18 తోటి విశ్వాసులకు సమయమివ్వడం కోసం ఇష్టపూర్వకంగా మనం (ముఖ్యంగా సంఘ పెద్దలుగా సేవచేస్తున్న మనం) మన పనులను పక్కనబెట్టినప్పుడు వారిని గౌరవిస్తున్నామని చూపిస్తాం. అలా ఇతరులకు సమయం ఇచ్చినప్పుడు, వారితో మీరు చెప్పకనే ఇలా చెబుతారు: ‘మీరు నాకు ఎంత అమూల్యమైనవారంటే, నా పనులు చేయడం కన్నా మీతో సమయం గడపడమే నాకు ముఖ్యం.’ (మార్కు 6:30-34) ఒకవేళ మనం అలా చేయడానికి ఇష్టపడకపోతే, తామంటే మనకు లెక్కలేదని వారు అనుకునేలా చేస్తాం. అయితే, కొన్ని అత్యవసరమైన పనులను పక్కనబెట్టలేమనుకోండి. అయినా, సహోదర సహోదరీలకు సమయమివ్వడానికి ఇష్టపడడం లేదా ఇష్టపడకపోవడం అనేవి వారిపట్ల మన హృదయంలో ఎంత గౌరవం ఉందనేది చూపిస్తాయి.—1 కొరిం. 10:24.

ఘనపర్చే విషయంలో ముందుండాలని తీర్మానించుకోండి

19. తోటి విశ్వాసులను ఘనపర్చాలంటే మనం మన సమయంతోపాటు ఇంకా ఏమి ఇవ్వాలి?

19 మనం వేరే విధాలుగా కూడా తోటి విశ్వాసులను ఘనపర్చవచ్చు. ఉదాహరణకు, మనం వారికి సమయంతోపాటు మన అవధానాన్ని కూడా ఇవ్వాలి. ఈ విషయంలో కూడా యెహోవాయే మనకు మాదిరి. కీర్తనకర్తయైన దావీదు ఇలా రాశాడు: “యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.” (కీర్త. 34:15) మన సహోదరులకు, ముఖ్యంగా సహాయం కోసం మన దగ్గరికి వచ్చినవారికి మన పూర్తి అవధానాన్ని ఇవ్వడం ద్వారా అంటే వాళ్లను చూస్తూ, వారు చెప్పేది వినడం ద్వారా మనం యెహోవాను అనుకరించగలుగుతాం. అలా, మన సహోదరులను ఘనపరుస్తాం.

20. ఇతరులను ఘనపర్చే విషయంలో మనం ఏ విషయాల్ని గుర్తుంచుకోవాలి?

20 మనం ఇప్పటిదాకా చర్చించినట్లు, తోటి విశ్వాసుల పట్ల మనకు హృదయంలో గౌరవం ఎందుకు ఉండాలో స్పష్టంగా గుర్తుంచుకుంటాం. అంతేకాక, బీదవారితో సహా సంఘంలోని వారందరినీ ఘనపర్చడంలో ముందుండేందుకు అవకాశాల కోసం ఎదురుచూస్తాం. అలా చేస్తే, సంఘంలో ఉండే సహోదర ప్రేమను, ఐక్యతను మరింత బలపర్చగలుగుతాం. కాబట్టి, మనమందరం ఎల్లప్పుడూ ఇతరులను ఘనపర్చడమే కాదు అలా చేయడంలో ముందుందాం. మీరు అలా చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారా?

[అధస్సూచి]

a 8వ కీర్తనలో దావీదు రాసిన మాటలు ప్రవచనాత్మకంగా పరిపూర్ణ మానవుడైన యేసుక్రీస్తుకు కూడా వర్తిస్తాయి.—హెబ్రీ. 2:6-9.

మీకు గుర్తున్నాయా?

• గౌరవానికి, ఘనతకు మధ్యవున్న సంబంధమేమిటి?

• తోటి విశ్వాసులను ఘనపర్చడానికి ఏ కారణాలున్నాయి?

• ఒకరినొకరం ఘనపర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

• తోటి విశ్వాసులను ఘనపరుస్తున్నామని మనం ఏయే విధాలుగా చూపించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[18వ పేజీలోని చిత్రం]

మనం మన తోటి విశ్వాసులను ఎలా ఘనపర్చవచ్చు?