“దానివల్ల ప్రజల హృదయాలను చేరుకోగలుగుతున్నాను”
“దానివల్ల ప్రజల హృదయాలను చేరుకోగలుగుతున్నాను”
దక్షిణ బ్రెజిల్‌లోని పోర్టో అలెగ్రె పట్టణంలో కొంతకాలం క్రితం, సామాజిక అంశాలపై చర్చించడం కోసం ఒక అంతర్జాతీయ సమావేశం జరిగింది. దానికి 135 దేశాల నుండి వేలాదిమంది ప్రజలు హాజరయ్యారు. ఆ ప్రాంతంలోవున్న ఒక సంఘంలోని కొంతమంది సాక్షులు, సమావేశ విరామ సమయాల్లో చాలామంది ప్రతినిధులను కలిసి వారితో బైబిల్లో ఉన్న రాజ్య సందేశాన్ని పంచుకున్నారు. దాన్ని వారెలా చేశారు?
“అన్ని దేశాల ప్రజలకు సువార్త అనే చిన్న పుస్తకాన్ని మేము ఉపయోగించాము” అని పయినీరు సహోదరి ఎలీసాబెట్ చెబుతోంది. ఆమె ఇంకా ఇలా అంటోంది: “చాలామంది ప్రతినిధులు రాజ్యసువార్తను ఇంతకుముందెన్నడూ వినకపోయినప్పటికీ మేము చెప్పిన సందేశానికి అనుకూలంగా స్పందించారు. మేము బొలీవియా, చైనా, ఫ్రాన్స్, ఇండియా, ఇస్రాయిల్, నైజీరియా నుండి వచ్చిన ప్రజలతో మాట్లాడాం. కొంతమంది ప్రతినిధులకు వారి సొంత భాషలో బైబిలు సాహిత్యాన్ని ఇచ్చినప్పుడు వారు సంతోషంగా తీసుకున్నారు.”
మెక్సికోలో ఉండే రావూల్ అనే పయినీరు కూడా ఈ చిన్న పుస్తకాన్ని ఉపయోగించి మంచి ఫలితాలను పొందాడు. కొంతకాలం క్రితం ఆయన, ఆ మధ్యే తన భార్యను పోగొట్టుకున్న ఓ 80 ఏళ్ల అరబ్బీయుణ్ణి కలిశాడు. ఆయన ఈ చిన్న పుస్తకం నుండి అరబిక్ భాషలోవున్న రాజ్య సందేశాన్ని చదివినప్పుడు ఆనందబాష్పాలు రాల్చాడు. ఎందుకంటే, మరణం ఇక ఉండదని ప్రకటన 21:3, 4లో దేవుడు చేసిన వాగ్దానాన్ని తన సొంత భాషలో చదవడం ఆయనను ఎంతగానో కదిలించింది. మరో సందర్భంలో రావూల్ అనియత సాక్ష్యమిస్తున్నప్పుడు పోర్చుగీస్ మాట్లాడే వ్యక్తిని కలిశాడు. ఆయన కూడా తన కుమారుణ్ణి మరణంలో కోల్పోయాడు. రావూల్ ఆ చిన్న పుస్తకంలోని పోర్చుగీస్ భాషా పేజీ చూపించి ఆయనను చదవమన్నాడు. దాన్ని చదివిన తర్వాత ఆ వ్యక్తి తనకు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుందని చెప్పి బైబిలు అధ్యయనానికి అంగీకరించాడు.
రావూల్ అన్ని దేశాల ప్రజలకు సువార్త అనే చిన్న పుస్తకాన్ని ఉపయోగించి అర్మేనియన్, చైనీస్, ఆంగ్లం, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, కొరియన్, మీకె, పర్షియన్, రష్యన్, సాపొటెక్ భాషలు మాట్లాడే ప్రజలకు సాక్ష్యమిచ్చాడు. ఆయనిలా అంటున్నాడు: “పరిచర్యలో ఈ చిన్న పుస్తకాన్ని ఉపయోగించడం ఎంత ప్రాముఖ్యమో నేను చూశాను. నేను ప్రజలతో వారి భాషలో మాట్లాడలేకపోయినా దానివల్ల వారి హృదయాలను చేరుకోగలుగుతున్నాను.”
నేడు చాలామంది విదేశాలకు ప్రయాణిస్తున్నారు, విదేశాల్లో స్థిరపడుతున్నారు కాబట్టి, వేరే భాష మాట్లాడే వారిని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని దేశాల ప్రజలకు సువార్త అనే చిన్న పుస్తకాన్ని ఉపయోగించి మనం వారితో రాజ్య సందేశాన్ని పంచుకోవచ్చు. మరి మీరు దాన్ని ప్రతీసారి తీసుకెళ్తున్నారా?
[32వ పేజీలోని చిత్రాలు]
ప్రజల హృదయాలను చేరుకునేందుకు తనకు సహాయం చేసే చిన్న పుస్తకంతో రావూల్