కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా “నీతిని” మొదట వెదుకుతూ ఉండండి

యెహోవా “నీతిని” మొదట వెదుకుతూ ఉండండి

యెహోవా “నీతిని” మొదట వెదుకుతూ ఉండండి

“కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” —మత్త. 6:33.

1, 2. దేవుని నీతి అంటే ఏమిటి? దేవుడు దేని ఆధారంగా తన నీతిని కనబరుస్తాడు?

 “ఆయన రాజ్యమును . . . మొదట వెదకుడి.” (మత్త. 6:33) కొండమీది ప్రసంగంలో యేసు ఇచ్చిన ఈ ఉపదేశం నేటి యెహోవాసాక్షులకు చాలా బాగా తెలుసు. మన జీవితంలోని ప్రతీ రంగంలో ఆ రాజ్య ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నామని, దానికి లోబడాలనుకుంటున్నామని చూపించేందుకు ప్రయత్నిస్తాం. యేసుక్రీస్తు ఇచ్చిన ఆ ఉపదేశంలోని రెండవ భాగాన్ని అంటే ఆయన “నీతిని” అనే మాటను కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే, దేవుని నీతి అంటే ఏమిటి? దాన్ని మొదట వెదకడం అంటే అర్థమేమిటి?

2 “నీతి” అని అనువదించబడిన మూల భాషా పదాల్ని “న్యాయం” లేదా “నిజాయితీ” అని కూడా అనువదించవచ్చు. కాబట్టి, దేవుని నీతి అంటే ఆయన సొంత ప్రమాణాల, విలువల ప్రకారం ఆయన చూపించే న్యాయం. మంచిచెడులను, తప్పొప్పులను నిర్ణయించే హక్కు సృష్టికర్తగా యెహోవాకు ఉంది. (ప్రక. 4:10, 11) అయితే, దేవుని నీతి అనేది కఠినమైన నియమాల, కట్టడల పెద్ద చిట్టా కాదు. అది ఆయన వ్యక్తిత్వంపై, ఆయన విశేష లక్షణమైన న్యాయంపై ఆధారపడివుంటుంది. ఈ న్యాయాన్ని దేవుడు తన ఇతర విశేష లక్షణాలైన ప్రేమ, జ్ఞానం, శక్తితో కలిపి చూపిస్తాడు. కాబట్టి దేవుని నీతి ఆయన చిత్తంతో, ఉద్దేశంతో ముడిపడివుంది. అంతేకాక, తన నీతిని బట్టే ఆయన తనను సేవించాలనుకునేవారి నుండి ఏదైనా ఆశిస్తాడు.

3. (ఎ) దేవుని నీతిని మొదట వెదకడం అంటే అర్థమేమిటి? (బి) మనం దేవుని నీతియుక్త ప్రమాణాల ప్రకారం ఎందుకు జీవిస్తాం?

3 దేవుని నీతిని మొదట వెదకడం అంటే అర్థమేమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుణ్ణి సంతోషపెట్టేందుకు ఆయన చిత్తం చేయడమే. అలా చేయాలంటే మనం మన సొంత ప్రమాణాల ప్రకారం కాదుగానీ దేవుని పరిపూర్ణమైన ప్రమాణాల, విలువల ప్రకారం జీవించాలి. (రోమీయులు 12:2 చదవండి.) యెహోవాతో మనకు వ్యక్తిగత సంబంధం ఉంటేనే అది సాధ్యమౌతుంది. యెహోవా శిక్షిస్తాడనే భయంతో మనం ఆయన నియమాలకు లోబడము కానీ, ఆయన మీదున్న ప్రేమతో ఆయనను సంతోషపెట్టాలనుకుంటాం. అందుకే మన సొంత ప్రమాణాలను ఏర్పరచుకోకుండా ఆయన ప్రమాణాల ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తాం. మనం ఆయన ప్రమాణాల ప్రకారం జీవించడానికే రూపొందించబడ్డాం కాబట్టి అలా చేయడమే సరైనదని మనం గుర్తిస్తాం. దేవుని రాజ్యానికి రాజైన యేసుక్రీస్తులా మనం కూడా నీతిని ప్రేమించాలి.—హెబ్రీ. 1:7-9.

4. దేవుని నీతిని వెదకడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?

4 యెహోవా నీతిని వెదకడం ఎంత ప్రాముఖ్యమైనది? ఈ వాస్తవం గురించి ఆలోచించండి: మంచి చెడులను నిర్ణయించే విషయంలో యెహోవాకున్న హక్కును ఆదాముహవ్వలు అంగీకరిస్తారా లేదా అన్నదే ఏదెను తోటలో వారి ముందున్న అసలు పరీక్ష. (ఆది. 2:17; 3:5) ఆ పరీక్షలో వారు విఫలమైనందువల్లే వారి పిల్లలమైన మనకు కష్టాలు, మరణం ప్రాప్తించాయి. (రోమా. 5:12) అయితే, దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును.” (సామె. 21:21) యెహోవా నీతిని మొదట వెదకడం వల్ల ఆయనతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకుంటాం, చివరకు రక్షణ పొందుతాం.—రోమా. 3:23, 24.

స్వనీతిపరులుగా మారే ప్రమాదం ఉంది

5. మనం ఏ ప్రమాదానికి దూరంగా ఉండాలి?

5 దేవుని నీతిని మొదట వెదకడంలో సఫలులం కావాలంటే ఓ ప్రమాదానికి దూరంగా ఉండాలని రోములోని క్రైస్తవులకు పౌలు రాశాడు. తోటి యూదుల గురించి ఆయన ఇలా అన్నాడు: “వారు దేవుని యందు ఆసక్తిగలవారని వారినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడ లేదు.” (రోమా. 10:2, 3) వారు తమ స్వనీతిని స్థాపించడం కోసం ఎక్కువగా ప్రయత్నించారు కాబట్టి దేవుని నీతిని అర్థం చేసుకోలేదని పౌలు అన్నాడు. a

6. మనం ఎలాంటి స్వభావానికి దూరంగా ఉండాలి? ఎందుకు?

6 మనం చేసే సేవను ఇతరులు చేసే సేవతో పోల్చుకుంటూ పోటీతత్వాన్ని చూపిస్తే మనం స్వనీతిపరులమయ్యే ప్రమాదముంది. పోటీతత్వం వల్ల మన సామర్థ్యాల విషయంలో మనకు మితిమీరిన ఆత్మ విశ్వాసం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ మనం ఇలాంటి స్వభావం చూపిస్తే మనం యెహోవా నీతిని మరచిపోతాం. (గల. 6:3, 4) అయితే, యెహోవా మీద ప్రేమ ఉంటేనే మనం సరైనది చేస్తాం. స్వనీతిని నిరూపించుకోవడానికి మనం ప్రయత్నిస్తే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకోవడంలో అర్థముండదు.—లూకా 16:15 చదవండి.

7. స్వనీతి గురించి యేసు ఎలా వివరించాడు?

7 “తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు” వారి విషయంలో యేసు విచారాన్ని వ్యక్తం చేశాడు. స్వనీతి గురించి వివరించేందుకు ఆయన ఈ ఉపమానాన్ని చెప్పాడు: “ప్రార్థన చేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి—దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవవంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచు—దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.” యేసు ఈ మాటలతో ఉపమానాన్ని ముగించాడు: “అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను.”—లూకా 18:9-14.

‘అతి నీతిమంతులుగా’ మారే ప్రమాదం కూడా ఉంది

8, 9. ‘అతి నీతిమంతులుగా’ ఉండడమంటే ఏమిటి? అలావుంటే మనం ఏమి చేసే ప్రమాదం ఉంది?

8 మనం దూరంగా ఉండాల్సిన మరో ప్రమాదం గురించి ప్రసంగి 7:16లో వివరించబడింది. అక్కడిలా ఉంది: “అధికముగా నీతిమంతుడవై యుండకుము; అధికముగా జ్ఞానివికాకుము; నిన్ను నీవేల నాశనము చేసికొందువు?” ఆ తర్వాత 20వ వచనంలో ఆ రచయిత, మనం ఎందుకు అలా ఉండకూడదో చెబుతూ ఇలా అన్నాడు: “పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు.” ‘అతి నీతిమంతునిగా’ మారే వ్యక్తి మంచి చెడుల విషయంలో సొంత ప్రమాణాల్ని ఏర్పరచుకొని వాటి ఆధారంగా ఇతరులను తీర్పుతీరుస్తాడు. కానీ, అలా చేయడం ద్వారా దేవుని ప్రమాణాలకన్నా తన సొంత ప్రమాణాలు ఉన్నతమైనవిగా చేసుకుంటున్నాడని ఆ వ్యక్తి గ్రహించడు. అంతేకాక, అలా చేయడం ద్వారా అతను దేవుని ముందు అనీతిమంతుడౌతాడు.

9 ‘అతి నీతిమంతులుగా’ ఉండడంవల్ల మనం యెహోవా దేవుని కార్యాలను తప్పుబట్టే ప్రమాదం ఉంది. యెహోవా నిర్ణయాలు సరైనవేనా అని ప్రశ్నించే స్థితికి వచ్చామంటే ఆయనకన్నా మనమే నీతిమంతులమని అనుకోవడం ఆరంభించినట్లే. ఓ విధంగా చెప్పాలంటే, యెహోవాను కోర్టు బోనులో నిలబెట్టి తప్పొప్పుల విషయంలో మన సొంత ప్రమాణాల ఆధారంగా ఆయనకు తీర్పుతీర్చినట్లే. నిజానికి నీతి విషయంలో ప్రమాణాల్ని ఏర్పరచే హక్కు యెహోవాకే ఉంది, మనకు కాదు.—రోమా. 14:10.

10. యోబు ఉదాహరణ చూపిస్తున్నట్లు మనం దేవునికి తీర్పుతీర్చే పరిస్థితి ఎలా తలెత్తవచ్చు?

10 దేవునికి తీర్పు తీర్చాలని మనలో ఎవ్వరమూ కోరుకోము. అయినా, మన అపరిపూర్ణతను బట్టి అలా చేసే అవకాశం ఉంది. ఫలానిది అన్యాయమని మనకు అనిపించినప్పుడు లేదా మనం కష్టాల్ని అనుభవిస్తున్నప్పుడు అలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. నమ్మకస్థుడైన యోబు కూడా ఆ తప్పు చేశాడు. మొదట్లో ఆయన గురించి ఇలా చెప్పబడింది: “అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు.” (యోబు 1:1) కానీ ఆ తర్వాత ఆయన ఎన్నో విపత్తుల్ని ఎదుర్కోవడాన్ని బట్టి తనకు అన్యాయం జరిగిందని అనుకున్నాడు. దానివల్ల, ఆయన ‘దేవునికంటే తానే నీతిమంతుడినని చెప్పుకున్నాడు.’ (యోబు 32:1, 2) ఆయన తన అభిప్రాయాన్ని సరిదిద్దుకోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు యోబుకు ఎదురైన పరిస్థితి మనకు కూడా ఎదురైతే మనం ఆశ్చర్యపోకూడదు. ఒకవేళ యోబులాగే మనమూ అనుకున్నట్లైతే, మనం మన అభిప్రాయాన్ని ఎలా సరిదిద్దుకోవచ్చు?

ప్రతీ సందర్భంలో మనకు వాస్తవాలు పూర్తిగా తెలియవు

11, 12. (ఎ) ఫలాని విషయంలో అన్యాయం జరిగిందని అనిపించినప్పుడు మనం ఏమి గుర్తుంచుకోవాలి? (బి) యేసు ఉపమానంలోని యజమాని అన్యాయం చేశాడని కొంతమంది ఎందుకు అనుకుంటారు?

11 మొదటిగా, ప్రతీ సందర్భంలో మనకు వాస్తవాలు పూర్తిగా తెలియవు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. యోబు విషయంలో అదే జరిగింది. పరలోకంలో దేవుని ఆత్మ కుమారుల సమావేశాలు జరిగాయని ఆయనకు తెలియదు. ఆ సమావేశాల్లోనే సాతాను ఆయనను నిందించాడు. (యోబు 1:7-12; 2:1-6) నిజానికి, సాతాను వల్లే తనకు కష్టాలు వచ్చాయని యోబుకు తెలియదు. అసలు సాతాను ఎవరనే విషయం యోబుకు తెలుసని కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి, దేవుని వల్లే తనకు కష్టాలు వస్తున్నాయని యోబు తప్పుగా అనుకున్నాడు. అవును, మనకు ఒక విషయం గురించి వాస్తవాలన్నీ తెలియనప్పుడు తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం.

12 ఉదాహరణకు ద్రాక్షతోట యజమానికి, పనివారికి సంబంధించి యేసు చెప్పిన ఉపమానం గురించి ఆలోచించండి. (మత్తయి 20:8-16 చదవండి.) ఈ ఉపమానంలో, ఎన్ని గంటలు పనిచేశారనే దానితో సంబంధం లేకుండా పనివారందరికీ ఒకే జీతమిచ్చిన యజమాని గురించి యేసు చెప్పాడు. యజమాని గురించి మీకేమనిపిస్తుంది? ఆయన న్యాయం చేశాడంటారా? ఆ ఉపమానం గురించి చదివిన వెంటనే, బహుశా రోజంతా ఎండలో పనిచేసిన పనివారి గురించి మీరు బాధపడతారు. వారికి ఎక్కువ చెల్లించి ఉండాల్సిందని మీరు అనుకోవచ్చు. దానివల్ల యజమాని కఠినుడు, అన్యాయస్థుడు అనే నిర్ణయానికి మీరు రావచ్చు. పనివారికి ఆయనిచ్చిన జవాబును బట్టి కూడా ఆయన తనకు ఇష్టమొచ్చినట్లు తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని మీకనిపించవచ్చు. కానీ, వాస్తవాలన్నీ మనకు తెలుసా?

13. ద్రాక్షతోటలోని పనివారి గురించి యేసు చెప్పిన ఉపమానాన్ని మరో కోణంలో ఎలా పరిశీలించవచ్చు?

13 ఈ ఉపమానాన్ని మనం మరో కోణంలో పరిశీలిద్దాం. ఆ పనివారందరూ తమ కుటుంబాలను పోషించాలన్న విషయాన్ని ఉపమానంలోని యజమాని గ్రహించాడని అర్థమౌతోంది. యేసు కాలంలో, పొలంలో పనిచేసేవారికి ఏ రోజు జీతం ఆ రోజు ఇచ్చేవాళ్లు. ఆ రోజు వచ్చే జీతంతోనే ఇల్లు గడిచేది. దీన్ని మనసులో ఉంచుకొని, ఆలస్యంగా పని దొరికి ఒకే గంట పనిచేసిన పనివారి పరిస్థితి గురించి ఆలోచించండి. బహుశా ఆ ఒక గంటకు వారికి వచ్చే జీతంతో వారు ఆ రోజు తమ కుటుంబాల్ని పోషించగలిగేవారు కాదు. అంతేకాక, వారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, పని దొరుకుతుందేమోనని రోజంతా వేచి చూశారు. (మత్త. 20:1-7) రోజంతా పని దొరకకపోవడం వారి తప్పు కాదు. వారు పని దొంగల్లా ప్రవర్తించారని చెప్పడానికి ఏ ఆధారాలు లేవు. ఆ రోజు మీరు సంపాదించే దానిపైనే ఇతరులు ఆధారపడి ఉన్నారన్నది మనసులో ఉంచుకొని, పనికోసం రోజంతా వేచి చూడడం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఏదో ఒక పని దొరికితే మీరెంత కృతజ్ఞులై ఉంటారు! అదీగాక, మీ కుటుంబాన్ని ఆ రోజు పోషించడానికి కావాల్సిన జీతం దొరికితే మీరెంత ఆశ్చర్యపోతారో ఊహించండి!

14. ద్రాక్ష తోటకు సంబంధించిన ఉపమానం నుండి మనం ఏ విలువైన పాఠం నేర్చుకోవచ్చు?

14 ఇప్పుడు యజమాని చేసిన పని గురించి ఆలోచిద్దాం. ఆయన ఎవ్వరికీ తక్కువ జీతం ఇవ్వలేదు. తమను, తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి డబ్బు సంపాదించే హక్కు వారిలో ప్రతీ ఒక్కరికి ఉందని ఆయన అనుకున్నాడు. ఎక్కువమంది పనివారు ఉన్నారు కదా అని తక్కువ జీతానికి కుదుర్చుకునే అవకాశం ఉన్నా ఆయన అలా చేయలేదు. పనివారందరూ తమ కుటుంబాలను పోషించుకోవడానికి సరిపోయే జీతంతో ఇళ్లకు తిరిగి వెళ్లారు. ఇలాంటి అదనపు వివరాల గురించి ఆలోచిస్తే ఆ యజమాని గురించి మనం మన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. ఆయన ప్రేమతోనే ఆ నిర్ణయం తీసుకున్నాడు కానీ తనకు ఇష్టమొచ్చినట్లు అధికార దుర్వినియోగం చేయలేదు. దీని నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? ఫలాని విషయం గురించి మనకు కొన్ని వాస్తవాలు మాత్రమే తెలిసినప్పుడు వెంటనే తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం. నిజానికి, ఈ ఉపమానం యెహోవా దేవుని నీతి ఎంత ఉన్నతమైనదో నొక్కి చెబుతోంది. ఆయన నీతి కేవలం కొన్ని న్యాయపరమైన నియమాలపై, మానవులు దానికి అర్హులా కాదా అన్నదానిపై ఆధారపడివుండదు.

మన ఆలోచన తప్పు కావచ్చు లేదా పరిమితమైనది కావచ్చు

15. న్యాయాన్యాయాల విషయంలో మన ఆలోచన ఎందుకు తప్పు కావచ్చు లేదా పరిమితమైనది కావచ్చు?

15 రెండవదిగా, మనకు ఏదైనా అన్యాయం జరిగిందని అనిపించినప్పుడు, మన ఆలోచన తప్పు కావచ్చు లేదా పరిమితమైనది కావచ్చు అని గుర్తుంచుకోవాలి. అపరిపూర్ణత, నేపథ్యం వంటివాటిని బట్టి లేదా పక్షపాతాన్ని బట్టి మనం తప్పుగా ఆలోచిస్తుండవచ్చు. అంతేకాక, ప్రజల హృదయాల్లో ఎలాంటి ఆలోచనలు మెదులుతున్నాయో మనకు తెలీదు కాబట్టి మన ఆలోచన పరిమితమైనది. కానీ యెహోవాకు, యేసుకు అలాంటి పరిమితులేమీ లేవు.—సామె. 24:12; మత్త. 9:4; లూకా 5:22.

16, 17. బత్షెబతో దావీదు వ్యభిచారం చేసినప్పుడు, యెహోవా తానిచ్చిన శాసనాన్ని తానే అమలుచేయక పోవడానికి కారణం ఏమైవుండవచ్చు?

16 బత్షెబతో దావీదు చేసిన వ్యభిచారం గురించి చెప్పే వృత్తాంతాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. (2 సమూ. 11:2-5) మోషే ధర్మశాస్త్రం ప్రకారం వారికి మరణ శిక్ష విధించబడాలి. (లేవీ. 20:10; ద్వితీ. 22:22) యెహోవా వారిని శిక్షించినా వారి విషయంలో తన సొంత శాసనాన్ని తానే అమలు చేయలేదు. ఈ సందర్భంలో యెహోవా అన్యాయంగా వ్యవహరించాడా? దావీదు పట్ల పక్షపాతం చూపిస్తూ యెహోవా తన సొంత నీతియుక్త ప్రమాణాల్ని తానే ఉల్లంఘించాడా? బైబిలు చదివే కొంతమంది అలానే అనుకున్నారు.

17 అయితే, యెహోవా తన ధర్మశాస్త్రంలో వ్యభిచారానికి సంబంధించిన ఆ శాసనాన్ని, హృదయాలను చదవలేని అపరిపూర్ణ న్యాయాధిపతుల కోసం ఇచ్చాడు. తమకు పరిమితులున్నా న్యాయాధిపతులు ఆ శాసనం వల్ల ప్రజలకు ఒకే విధమైన తీర్పును తీర్చగలిగేవారు. అయితే, యెహోవా మాత్రం హృదయాల్ని చదవగలడు. (ఆది. 18:25; 1 దిన. 29:17) కాబట్టి, అపరిపూర్ణ న్యాయాధిపతుల కోసం ఇచ్చిన ఆ శాసనాన్ని పాటించాల్సిన అవసరం యెహోవాకు లేదు. ఒకవేళ యెహోవా దాన్ని పాటించాల్సి ఉంటే అది, దృష్టి లోపమున్నవారికి చక్కగా కనిపించేలా చేసే కళ్లద్దాలను, మంచి కనుదృష్టి ఉన్నవారికి బలవంతంగా పెట్టినట్లే అవుతుంది. అయితే, యెహోవా ఆ సందర్భంలో దావీదు, బత్షెబల హృదయాలను చదవగలిగాడు, వారి నిజమైన పశ్చాత్తాపాన్ని గమనించగలిగాడు. కాబట్టి దాని ఆధారంగా ఆయన ప్రేమతో, కనికరంతో వారికి తీర్పుతీర్చాడు.

యెహోవా నీతిని వెదుకుతూ ఉండండి

18, 19. నీతి విషయంలో మన సొంత ప్రమాణాల ఆధారంగా యెహోవాకు తీర్పుతీర్చకుండా ఎలా ఉండవచ్చు?

18 ఒక బైబిలు వృత్తాంతంలో లేదా మనకు ఎదురైన ఓ పరిస్థితిలో యెహోవా అన్యాయం చేశాడని మనకనిపిస్తే, నీతి విషయంలో మన సొంత ప్రమాణాల ఆధారంగా ఆయనకు ఎన్నడూ తీర్పుతీర్చకుండా ఉందాం. ప్రతీ సందర్భంలో మనకు వాస్తవాలు పూర్తిగా తెలియవనీ మన ఆలోచన తప్పు కావచ్చనీ లేదా పరిమితమైనది కావచ్చనీ ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం. “నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు” అనే విషయాన్ని ఎన్నడూ మరచిపోకుండా ఉందాం. (యాకో. 1:19, 20) అలా చేస్తే, మనం ఎన్నడూ ‘హృదయంలో యెహోవాను కోపగించుకోకుండా’ ఉండగలుగుతాం.—సామె. 19:3.

19 ఏది మంచిదో, ఏది నీతియుక్తమైనదో నిర్ణయించే హక్కు కేవలం యెహోవాకు మాత్రమే ఉందని యేసు గుర్తించినట్లే మనమూ గుర్తిద్దాం. (మార్కు 10:17, 18) యెహోవా ప్రమాణాల గురించిన ఖచ్చితమైన ‘జ్ఞానాన్ని’ సంపాదించుకోవడానికి కృషి చేద్దాం. (రోమా. 10:2; 2 తిమో. 3:6, 7) ఆయన ప్రమాణాల్ని అంగీకరించి, ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించడం ద్వారా మనం ఆయన “నీతిని” మొదట వెదుకుతున్నామని చూపిస్తాం.—మత్త. 6:33.

[అధస్సూచి]

a ఒక విద్వాంసుని ప్రకారం, ‘స్థాపించు’ అని అనువదించబడిన మూల భాషా పదానికి ‘స్మారక చిహ్నాన్ని నిర్మించు’ అనే అర్థం కూడా ఉంది. మరో మాటలో చెప్పాలంటే, ఆ యూదులు దేవుని మహిమ కోసం కాక తమ సొంత మహిమ కోసం ఓ సూచనార్థకమైన స్మారక చిహ్నాన్ని నిర్మించుకుంటున్నారు.

మీకు జ్ఞాపకమున్నాయా?

• యెహోవా నీతిని వెదకడం ఎందుకు ప్రాముఖ్యం?

• మనం ఏ రెండు ప్రమాదాలకు దూరంగా ఉండాలి?

• మనం ఎలా దేవుని నీతిని మొదట వెదకవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[9వ పేజీలోని చిత్రం]

ఆలయంలో ప్రార్థన చేసిన ఇద్దరు వ్యక్తుల గురించి యేసు చెప్పిన ఉపమానంలో మనకు ఏ పాఠం ఉంది?

[10వ పేజీలోని చిత్రం]

ఐదు గంటలకు వచ్చిన పనివారికీ రోజంతా పనిచేసిన పనివారికీ ఒకే జీతం ఇవ్వడం తప్పా?