కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా సంస్థకు సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యాను

యెహోవా సంస్థకు సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యాను

యెహోవా సంస్థకు సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యాను

వర్నన్‌ జూబ్కో చెప్పినది

నేను కెనడాలోని సస్కత్‌చెవాన్‌ మండలంలో, స్టెనన్‌ అనే ఊరు దగ్గరున్న ఓ వ్యవసాయ క్షేత్రంలో పెరిగాను. మా అమ్మ పేరు అడెల్లా, నాన్న పేరు ఫ్రెడ్‌. నాకు అరెల్యా అనే అక్క, అలెగ్రా అనే చెల్లి, ఆల్వన్‌, డారల్‌ అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. మా అందరి ఆధ్యాత్మిక, భౌతిక అవసరాలను తీర్చడం కోసం మా అమ్మానాన్నలు ఎంతో కష్టపడ్డారు. మాకు సత్యాన్ని నేర్పించినందుకు వారికి మేము ఇప్పటికీ ఋణపడి ఉన్నాం.

అభిషిక్త క్రైస్తవుడైన మా నాన్న ఎంతో ధైర్యంగా సువార్త ప్రకటించేవాడు. ఆయన జీవనోపాధి కోసం కష్టపడేవాడు. అయితే, తాను ఒక సాక్షి అని అందరూ తెలుసుకునేలా చేశాడు. ఆయన ఎప్పుడూ సత్యం గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన చూపించిన ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. “యెహోవా సంస్థకు సంబంధించిన పనుల్లో నిమగ్నమైవుంటే ఎన్నో సమస్యలను తప్పించుకుంటావు” అని ఆయన నాతో ఎప్పుడూ అనేవాడు.

మేము తరచూ స్టెనన్‌లో, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో వీధి సాక్ష్యమిస్తుండేవాళ్లం. అలా చేయడం నాకు అన్నిసార్లూ సులభంగా లేదు. ప్రతీ ప్రాంతంలో అల్లరిమూకలు ఉండేవి. వారు చిన్నవాళ్లమైన మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎగతాళి చేసేవారు. నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు ఒకసారి కావలికోట, తేజరిల్లు! పత్రికలను పట్టుకొని నేను ఒక వీధి మూలన నిలబడ్డాను. అప్పుడు కొంతమంది పిల్లలు నా దగ్గరకు వచ్చి నన్ను చుట్టుముట్టారు. వాళ్లు నా తలపైనున్న కొత్త టోపీని లాక్కొని, నా పక్కనే ఉన్న ఒక స్తంభంపై పెట్టారు. సంతోషకరంగా, దగ్గర్లోనే ఉండి నన్ను గమనిస్తున్న ఒక వృద్ధ సహోదరుడు అక్కడ జరుగుతున్న దాన్నంతటినీ చూశాడు. ఆయన నా దగ్గరకు వచ్చి, “వర్న్‌, ఏదైనా సమస్య ఉందా?” అని అడిగాడు. వెంటనే ఆ పిల్లలు అక్కడనుండి పారిపోయారు. ఆ అనుభవం వల్ల నేను కొద్దిగా నిరాశ చెందినప్పటికీ, వీధి సాక్ష్యమిస్తున్నప్పుడు స్తంభంలా ఒకే చోట ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉండాలని నేర్చుకున్నాను. నేను ఎదుగుతుండగా నేర్చుకున్న అలాంటి విషయాలు, ఇంటింటి పరిచర్య చేయడానికి కావాల్సిన ధైర్యాన్ని కూడా నాకు ఇచ్చాయి.

నేను, మా తమ్ముడు ఆల్వన్‌ 1951వ సంవత్సరం మే నెలలో బాప్తిస్మం తీసుకున్నాం. నాకప్పుడు 13 ఏళ్లు. యెహోవా గురించి మాట్లాడకుండా ఒక్క నెల కూడా ఉండొద్దని అప్పుడు బాప్తిస్మ ప్రసంగాన్ని ఇచ్చిన సహోదరుడు జాక్‌ నేథన్‌ మమ్మల్ని ప్రోత్సహించడం నాకింకా గుర్తుంది. a మా కుటుంబ సభ్యులు పయినీరు సేవ చేయడమే జీవితంలో అత్యుత్తమ లక్ష్యమని ఎప్పుడూ ఎంచేవారు. కాబట్టి, 1958లో పాఠశాల చదువు పూర్తైన తర్వాత, పయినీరు సేవ చేయడానికి నేను మానిటోబాలోని విన్నిపెగ్‌కు వెళ్లాను. మా కుటుంబ వ్యాపారమైన కలపకు మెరుగుపెట్టే పనిలో తనతో కలిసి నేను పనిచేయడాన్ని నాన్న ఇష్టపడేవాడు. అయినా, అమ్మానాన్నలిద్దరూ పూర్తికాల సేవ చేయడానికే నన్ను ప్రోత్సహించి, పయినీరు సేవ కోసం నన్ను అక్కడికి వెళ్లనిచ్చారు.

కొత్త ఇల్లు, కొత్త భాగస్వామి

సువార్త ప్రచారకుల అవసరం క్విబెక్‌లో ఎక్కువగా ఉంది కాబట్టి, వెళ్లగలిగేవారిని అక్కడికి వెళ్లమని 1959లో బ్రాంచి కార్యాలయం పిలుపునిచ్చింది. నేను మాంట్రీయల్‌లో పయినీరు సేవచేయడానికి వెళ్లాను. అక్కడ ఫ్రెంచ్‌ భాష నేర్చుకుంటూ, వేరే సంస్కృతికి అలవాటుపడడం నాకు పూర్తిగా కొత్త అనుభవం. మా ప్రాంతీయ పైవిచారణకర్త, “‘ఇంటి దగ్గర మేము ఇలాగే చేసేవాళ్లం’ అని ఎప్పుడూ అనకు” అని నాతో చెప్పాడు. అది మంచి సలహా.—1 కొరిం. 9:22, 23.

నేను క్విబెక్‌కు వెళ్లినప్పుడు నాతోపాటు పయినీరు సేవ చేయడానికి ఎవరూ లేరు. అయితే, అంతకుముందు విన్నిపెగ్‌లో కలుసుకున్న షర్లీ టర్కాట్‌ అనే యువ సహోదరిని 1961 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న తర్వాత తానే పయినీరు సేవలో నా శాశ్వత భాగస్వామి అయింది. తాను కూడా యెహోవాను ప్రేమించే కుటుంబం నుండి వచ్చింది. రానున్న సంవత్సరాల్లో ఆమె నాకు ఎంతో ప్రోత్సాహాన్ని, బలాన్ని ఇస్తుందని నేను అప్పుడు అనుకోలేదు.

ప్రకటనా పని కోసం గాస్పేకు వెళ్లాం

మా పెళ్లైన రెండు సంవత్సరాలకు, మేము క్విబెక్‌లోని రిమోస్కీలో ప్రత్యేక పయినీర్లుగా సేవ చేయడానికి నియమించబడ్డాం. ఆ తర్వాతి వసంతకాలంలో, కెనడా తూర్పు తీరాన ఉన్న గాస్పే ద్వీపకల్పమంతటా ప్రకటించమని బ్రాంచి కార్యాలయం మమ్మల్ని కోరింది. సాధ్యమైనన్ని సత్య విత్తనాలు నాటడమే మా నియామకం. (ప్రసం. 11:6) మేము మా కారులో 1,000 కన్నా ఎక్కువ పత్రికలు, దాదాపు 400 పుస్తకాలు, వస్త్రాలు, కొన్ని ఆహారపదార్థాలు పెట్టుకొని అక్కడ ఒక నెల పాటు ప్రకటనా పని చేయడానికి బయల్దేరాం. మేము ఓ క్రమ పద్ధతిలో, గాస్పేలోని చిన్నచిన్న గ్రామాలన్నిటిలో ప్రకటించాం. సాక్షులు ప్రజల దగ్గరికి వస్తున్నారనీ, వారిచ్చే ప్రచురణలను తీసుకోవద్దనీ స్థానిక రేడియో స్టేషన్‌ హెచ్చరిక చేసింది. కానీ, చాలామంది ఆ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారు. రేడియో ప్రకటనలో, మేమిచ్చే ప్రచురణలను తీసుకోమన్నారనుకొని వారు మా దగ్గర సాహిత్యాలు తీసుకున్నారు.

ఆ రోజుల్లో, ప్రకటించే స్వాతంత్ర్యం ఉందన్న విషయం క్విబెక్‌లోని కొన్ని ప్రాంతాల ప్రజలకు అంతగా తెలియదు. అందుకే, మా ప్రకటనా పనిని పోలీసులు తరచూ ఆపుతుండేవారు. మేము ఓ పట్టణంలోని ప్రతీ ఇంట్లో సాహిత్యాలు ఇస్తున్నప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఓ పోలీసు అధికారి మమ్మల్ని పోలీస్‌ స్టేషన్‌కు రమ్మన్నాడు. అప్పుడు మేము ఆయనతో పాటు వెళ్లాం. ప్రకటనా పనిని ఆపేయాలంటూ ఆ పట్టణ న్యాయవాది నోటీసు జారీ చేశాడని అప్పుడు నాకు తెలిసింది. అయితే, పోలీసుల పైఅధికారి ఆ రోజు అందుబాటులో లేకపోవడంవల్ల నేను టోరెంటో బ్రాంచి కార్యాలయం నుండి అధికారిక పత్రాలతో వచ్చిన ఉత్తరాన్ని ఆ న్యాయవాదికి చూపించాను. ప్రకటించేందుకు మనకున్న హక్కు గురించి వివరించే ఆ ఉత్తరాన్ని చదివి, వెంటనే ఆ న్యాయవాది ఇలా అన్నాడు: “చూడు, నాకు ఏ సమస్యల్లో చిక్కుకోవాలని లేదు. గ్రామ చర్చి ప్రీస్టే మీ పనిని ఆపుచేయించమని నాకు చెప్పాడు.” మేము చట్టవిరుద్ధమైన పనేమీ చేయడం లేదని అక్కడి ప్రజలకు చూపించడానికి, పోలీసు మా పనిని ఆపిన ప్రాంతానికే మళ్లీ వెళ్లి ప్రకటించడం మొదలుపెట్టాం.

తర్వాతి రోజు ఉదయాన్నే, మేము పోలీసుల పైఅధికారిని కలవడానికి వెళ్లాం. మా పనిని ఆపుచేశారని విని ఆయన ఎంతో బాధపడ్డాడు. ఆ తర్వాత ఆ అధికారి న్యాయవాదికి ఫోన్‌ చేసి ఆయనతో ఎంత కోపంగా మాట్లాడాడో మీరు వినుండాల్సింది! మాకు మళ్లీ ఏదైనా సమస్య వస్తే తనకు ఫోను చేస్తే చాలు, తానే చూసుకుంటానని ఆ అధికారి మాకు చెప్పాడు. మేము అపరిచితులమైనా, మా ఫ్రెంచ్‌ భాష అంతంత మాత్రంగానేవున్నా, ప్రజలు మాపట్ల దయ చూపించి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించేవారు. కానీ, ‘వారు ఎప్పటికైనా సత్యం తెలుసుకుంటారా?’ అని మేము అనుకున్నాం. కొన్నేళ్ల తర్వాత మేము గాస్పే అంతటా రాజ్యమందిరాలు నిర్మించడానికి మళ్ళీ వెళ్లినప్పుడు మా ప్రశ్నకు జవాబు దొరికింది. మేము గతంలో ప్రకటించిన చాలామంది మన సహోదరులయ్యారని తెలుసుకున్నాం. నిజానికి, యెహోవాయే వృద్ధి కలుగజేస్తాడు.—1 కొరిం. 3:6, 7.

మేము ఓ స్వాస్థ్యాన్ని పొందాం

1970లో మాకు లీస పుట్టింది. యెహోవా మాకిచ్చిన ఈ బహుమానం వల్ల మా సంతోషం రెట్టింపయ్యింది. నా భార్య షర్లీ, నా కూతురు లీస ఎన్నో రాజ్యమందిరాలను కట్టడంలో నాతో కలిసి పనిచేశారు. పాఠశాల విద్య ముగించుకున్న తర్వాత లీస, “నావల్ల మీరు కొంతకాలం పూర్తికాల సేవను ఆపేయాల్సి వచ్చింది, కాబట్టి దాన్ని బర్తీ చేయడానికి నేను పయినీరును అవుతాను” అని మాతో అంది. 20 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం లీస పయినీరు సేవ మొదలుపెట్టింది. ఇప్పటికీ తన భర్త సీల్వన్‌తో కలిసి ఆ సేవలో కొనసాగుతోంది. ఎన్నో అంతర్జాతీయ నిర్మాణ పనుల్లో పనిచేసే గొప్ప అవకాశం వారికి దొరికింది. మా జీవితాల్ని నిరాడంబరంగా ఉంచుకొని యెహోవా సేవ చేయడానికి అందుబాటులో ఉండాలన్నదే కుటుంబంగా మా ధ్యేయం. లీస పయినీరు సేవను మొదలుపెట్టినప్పుడు చెప్పిన మాటల్ని నేను ఎప్పుడూ మరచిపోలేదు. నిజానికి ఆమె వల్లే నేను 2001లో మళ్లీ పూర్తికాల సేవను మొదలుపెట్టి, ఇప్పటికీ ఆ సేవలో కొనసాగుతున్నాను. పయినీరు సేవ వల్ల నేను చేసే ప్రతీ పనిలో యెహోవాపై నమ్మకం ఉంచడాన్ని, నిరాడంబరంగానే అయినా సంతృప్తికరమైన, సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించడాన్ని నేర్చుకుంటున్నాను.

నిర్మాణ పని చేయడానికి ప్రేమ, నమ్మకత్వం అవసరం

మనం అందుబాటులో ఉంటూ, యెహోవా మనకిచ్చే ఏ నియామకాన్నైనా అంగీకరిస్తే, మనం ఎన్నో ఆశీర్వాదాలను పొందుతామని యెహోవా నాకు నేర్పించాడు. రీజనల్‌ బిల్డింగ్‌ కమిటీ సభ్యునిగా సేవచేయడాన్ని, క్విబెక్‌లో, మరితర ప్రాంతాల్లో సహోదర సహోదరీలతో కలిసి నిర్మాణ పనుల్లో పాల్గొనడాన్ని నాకు దొరికిన అమూల్యమైన అవకాశాలుగా ఎంచుతున్నాను.

కొంతమంది స్వచ్ఛంద సేవకులు వేదిక పైనుండి గొప్పగొప్ప ప్రసంగాలు ఇవ్వకపోయినా, రాజ్యమందిర నిర్మాణ పనుల్లో మాత్రం తమ ప్రతిభను గొప్పగా చాటుతారు. వారు మనసుపెట్టి ఆ పనిచేస్తారు కాబట్టి వారి సామర్థ్యాలు కూడా బయటికి వస్తాయి. దాని ఫలితంగా, యెహోవాను ఆరాధించేందుకు ఓ అందమైన భవనం తయారౌతుంది.

“రాజ్యమందిర నిర్మాణ పనుల్లో పనిచేయడానికి ముఖ్యంగా ఏ లక్షణాలు అవసరం?” అని సహోదరులు నన్ను అడిగేవారు. నా అనుభవం నుండి నేను తెలుసుకున్నదేమిటంటే, ఒక వ్యక్తికి ముఖ్యంగా యెహోవాపై, ఆయన కుమారునిపై, మన సహోదర సహోదరీలపై ప్రేమ ఉండాలి. (1 కొరిం. 16:14) అంతేకాక, నమ్మకత్వం కూడా ఉండాలి. ఓ వ్యక్తి నమ్మకస్థుడైతేనే, తనకు నచ్చిన విధంగా పనులు జరగకపోయినా, దైవపరిపాలనా ఏర్పాట్లకు మద్దతిస్తూ భవిష్యత్తులో జరిగే నిర్మాణ పనుల్లో కూడా పాల్గొంటాడు.

యెహోవాకు రుణపడివున్నాను

1985లో మా నాన్న చనిపోయారు. కానీ, యెహోవా సంస్థకు సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉండమని ఆయన నాకిచ్చిన సలహాను నేను ఇప్పటికీ మరచిపోలేదు. యెహోవా పరలోక సంస్థలో నియామకాన్ని అందుకున్న ఇతరుల్లాగే ఆయన కూడా నిస్సందేహంగా యెహోవా సేవలో నిమగ్నమైవుంటాడు. (ప్రక. 14:13) మా అమ్మకు ఇప్పుడు 97 ఏళ్లు. తనకు పక్షవాతం వచ్చినందువల్ల మునుపటిలా ఇప్పుడు మాట్లాడలేకపోతోంది. అయినా, ఇప్పటికీ తన బైబిలు ఏదో తనకు తెలుసు. తాను మాకు రాసే ఉత్తరాల్లో లేఖనాలను చేర్చి, యెహోవాను నమ్మకంగా సేవిస్తూ ఉండమని మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. అంత ప్రేమగల తల్లిదండ్రులను బట్టి మేము ఎంతో రుణపడివున్నాం.

నా నమ్మకమైన భార్య షర్లీని బట్టి కూడా యెహోవాకు రుణపడివున్నాను. వాళ్లమ్మ ఇచ్చిన సలహాను ఆమె ఇప్పటికీ గుర్తుంచుకుంది. “వర్న్‌ సత్యానికి సంబంధించిన పనుల్లో ఎంతగానో నిమగ్నమైపోతాడు. ఇతరుల కోసం ఆయనను త్యాగం చేయడాన్ని నువ్వు నేర్చుకోవాల్సి ఉంటుంది” అని వాళ్లమ్మ ఆమెకు చెప్పింది. 49 ఏళ్ల క్రితం మాకు పెళ్లైనప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేమిటంటే, మేమిద్దరం కలిసి యెహోవాను సేవిస్తూనే వృద్ధులమవ్వాలని, మేము ఒకవేళ ఈ విధానాంతాన్ని తప్పించుకుంటే మేమిద్దరం కలిసి మళ్లీ యౌవనులుగా మారి యెహోవాను నిత్యం సేవిస్తూనే ఉండాలని అనుకున్నాం. మేము ఇప్పటివరకు “ప్రభువు కార్యాభివృద్ధియందు” ఎంతో చేయగలిగాం. (1 కొరిం. 15:58) యెహోవా మాపై ఎంతో శ్రద్ధ తీసుకొని మాకు మేలైనదేదీ తక్కువ కాకుండా చూసుకున్నాడు.

[అధస్సూచి]

a జాక్‌ హాలిడే నేథన్‌ జీవిత కథ కోసం కావలికోట (ఆంగ్లం) సెప్టెంబరు 1, 1990, 10-14 పేజీలు చూడండి.

[31వ పేజీలోని చిత్రం]

“మా జీవితాల్ని నిరాడంబరంగా ఉంచుకొని యెహోవా సేవ చేయడానికి అందుబాటులో ఉండాలన్నదే కుటుంబంగా మా ధ్యేయం”