కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా సంస్థతో సుపరిచితులయ్యేలా పిల్లలకు సహాయం చేయండి

యెహోవా సంస్థతో సుపరిచితులయ్యేలా పిల్లలకు సహాయం చేయండి

యెహోవా సంస్థతో సుపరిచితులయ్యేలా పిల్లలకు సహాయం చేయండి

పిల్లలు ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటారు. మొదటిసారి పస్కా పండుగ జరుపుకున్నప్పుడు, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు పిల్లలకు, ‘ఈ గొర్రెపిల్లను ఎందుకు చంపుతున్నారు?’ ‘రక్తాన్ని నాన్న ఎందుకు గుమ్మానికి పూస్తున్నాడు?’ ‘మనం ఎక్కడికి వెళ్తున్నాం?’ వంటి ప్రశ్నలు వచ్చివుండవచ్చు. ఇశ్రాయేలులోని తండ్రులకు యెహోవా ఆ తర్వాత ఇచ్చిన ఆజ్ఞను బట్టి దేవుడు అలాంటి ప్రశ్నలను ఇష్టపడ్డాడని తెలుస్తోంది. భవిష్యత్తులో జరుపుకునే పస్కా పండుగల గురించి ఆయన వారికిలా చెప్పాడు: “మీ కుమారులు—మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు మీరు—ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెను.” (నిర్గ. 12:24-27) ఆ తర్వాత, యెహోవా ఆజ్ఞాపించిన “కట్టడలు, విధుల” గురించి పిల్లలు అడిగినప్పుడు జవాబు చెప్పడం ఎంత ప్రాముఖ్యమో యెహోవా ఇశ్రాయేలులోని తల్లిదండ్రులకు గుర్తుచేశాడు.—ద్వితీ. 6:20-25.

సత్యారాధన విషయంలో తాము అడిగే ప్రశ్నలకు పిల్లలు సంతృప్తికరమైన జవాబులు పొందాలని యెహోవా కోరుకున్నాడు. ఎందుకంటే తాము పొందే ఆ జవాబుల వల్ల వారు యెహోవాను తమ దేవునిగా, రక్షకునిగా గుర్తించి ఆయనను ప్రేమించగలిగేవారు. యెహోవా నేడు కూడా పిల్లల విషయంలో అదే కోరుకుంటున్నాడు. యెహోవా సంస్థతో సుపరిచితులయ్యేందుకు, ఆ సంస్థ చేసిన ఏర్పాట్ల వల్ల తాము ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారో అర్థంచేసుకునేందుకు పిల్లలకు సహాయం చేసినప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల్లో దేవునిపట్ల, ఆయన ప్రజలపట్ల ప్రగాఢమైన ప్రేమను నాటవచ్చు. దేవుని సంస్థ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేలా పిల్లలకు ఏయే విధాలుగా సహాయం చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.

స్థానిక సంఘం

మీ కుటుంబం సహవసిస్తున్న సంఘంతో మీ పిల్లలు పరిచయం ఏర్పరచుకోవాలి. దానికోసం, తల్లిదండ్రులుగా మీరు క్రైస్తవ కూటాలకు మీ పిల్లలను మీతోపాటు తీసుకువెళ్లాలి. మీరు అలా చేస్తే, యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్పినదాన్ని పాటించినవారౌతారు. యెహోవా వారికిలా ఆజ్ఞాపించాడు: ‘మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను. ఆలాగు నేర్చుకొనినయెడల దాని నెరుగని వారి సంతతివారు దానిని విని, మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు.’—ద్వితీ. 31:12, 13.

బాల్యం నుండే పిల్లలు యెహోవా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టవచ్చు. “పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు” అని అపొస్తలుడైన పౌలు తిమోతితో అన్నాడు. (2 తిమో. 3:14) చాలా చిన్నపిల్లలు కూడా రాజ్యమందిరంలోని కూటాల్లో చర్చించబడే వాటిని అర్థం చేసుకోగలుగుతారు, రాజ్య గీతాలను నేర్చుకోగలుగుతారు. అక్కడే వారు బైబిలును, బైబిలు సాహిత్యాలను ఉపయోగించడం, గౌరవించడం నేర్చుకుంటారు. అంతేగాక, కూటాల్లో ఉన్నప్పుడు, క్రీస్తు నిజ అనుచరులను గుర్తించే ఒక లక్షణాన్ని అంటే నిజమైన ప్రేమను చవిచూస్తారు. యేసు ఇలా అన్నాడు: “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” (యోహా. 13:34, 35) రాజ్యమందిరంలో ఉండే ప్రేమ, నిజమైన భద్రత పిల్లలకు చాలా నచ్చుతాయి కాబట్టి జీవితాంతం కూటాలకు హాజరవడాన్ని వారు అలవాటు చేసుకుంటారు.

ప్రతీ కూటానికి ముందుగా హాజరవడాన్ని, కూటం అయిన తర్వాత కొంత సమయం అక్కడ గడపడాన్ని అలవాటు చేసుకుంటే మీ పిల్లలు ఇతరులతో స్నేహం చేయగలుగుతారు. వారు ఇతర పిల్లలతో మాత్రమే కాకుండా అన్ని వయసుల సహోదర సహోదరీలతో స్నేహం చేసేలా చూడండి. పెద్దవారితో స్నేహం చేస్తే వారికి ఎన్నో చక్కని అనుభవాలు, ఎంతో జ్ఞానం ఉన్నాయని పిల్లలు తెలుసుకుంటారు. పూర్వం జెకర్యా, సత్యదేవుడైన ‘యెహోవా పట్ల భక్తివిశ్వాసాలను ఎలా కలిగివుండాలో’ నేర్పించేవాడు. ఆయన యూదా రాజైన యువ ఉజ్జియాపై చక్కని ప్రభావాన్ని చూపించాడు. అలాగే నేడు కూడా ఎన్నో ఏళ్లుగా యెహోవాకు నమ్మకంగా సేవ చేసినవారు పిల్లలపై చక్కని ప్రభావాన్ని చూపిస్తారు. (2 దిన. 26:1, 4, 5 ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) రాజ్యమందిరంలో ఉన్నప్పుడు లైబ్రరీ గురించి, నోటీసు బోర్డు లేదా ఇతర విషయాల గురించి వారికి వివరించవచ్చు.

ప్రపంచవ్యాప్త సంస్థ

1,00,000 కన్నా ఎక్కువ సంఘాలున్న ప్రపంచవ్యాప్త సంస్థలో స్థానిక సంఘం ఒక భాగమని పిల్లలు అర్థంచేసుకోవాలి. ఈ సంస్థలో ఉన్న ఆసక్తికరమైన విషయాలను, అది పనిచేసే విధానాన్ని, దానికి మద్దతివ్వడానికి పిల్లలు చేయగల పనులను వివరించండి. ప్రాంతీయ సమావేశాలు, జిల్లా సమావేశాలు, ప్రాంతీయ పైవిచారణకర్త చేసే సందర్శనాల కోసం మీరెందుకు ఆశగా ఎదురుచూస్తారో చెప్పండి.—28వ పేజీలో ఉన్న  “కుటుంబ ఆరాధనలో చర్చించుకోగల విషయాలు” అనే బాక్సు చూడండి.

మీకు అవకాశం దొరికినప్పుడు ప్రాంతీయ పైవిచారణకర్తలను, మిషనరీలను, బెతెల్‌ కుటుంబ సభ్యులను, ఇతర పూర్తికాల సేవకులను మీ ఇంటికి భోజనానికి పిలవొచ్చు. పిల్లలతో గడిపేంత సమయం వారికి లేదనుకోకండి. పిల్లలను తన దగ్గరకు తీసుకొని వారితో సమయాన్ని గడిపిన యేసు మాదిరిని అనుకరించడానికి ఈ పూర్తికాల సేవకులు కృషి చేస్తున్నారు. (మార్కు 10:13-16) వారి అనుభవాల గురించి విన్నప్పుడు, పవిత్ర సేవలో వారు పొందే ఆనందాన్ని చూసినప్పుడు మీ పిల్లలు కూడా పూర్తికాల సేవను వారి లక్ష్యంగా చేసుకోవచ్చు.

యెహోవా సంస్థతో మీ పిల్లలు మరింత సుపరిచితులయ్యేందుకు ఓ కుటుంబంగా ఇంకేమి చేయవచ్చు? ఇక్కడ కొన్ని సలహాలున్నాయి: యెహోవాసాక్షులు—వారు ఎవరు? వారి నమ్మకాలేమిటి? అనే బ్రోషురును, కావలికోట, తేజరిల్లు! (ఆంగ్లం) పత్రికల్లో వచ్చే జీవిత కథలను కుటుంబంగా చర్చించవచ్చు. యెహోవా సేవకులు చూపించిన భక్తిని, వినయాన్ని, యథార్థతను నొక్కి చెప్పండి. భూవ్యాప్తంగా సువార్త ప్రకటించడం కోసం యెహోవా వారిని ఎలా ఉపయోగించుకున్నాడో చెప్పండి. యెహోవా సంస్థ తయారుచేసిన వీడియోలను ఉపయోగిస్తూ గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న వాటి నుండి ప్రాముఖ్యమైన పాఠాలు నేర్పించండి. మీకు వీలైతే మీ దేశంలోని లేదా ఇతర దేశాల్లోని బ్రాంచి కార్యాలయాన్ని, బెతెల్‌ గృహాన్ని సందర్శించండి. మొదటి శతాబ్దంలో జరిగినట్లే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరులకు ఆధ్యాత్మిక ఆహారాన్ని పంచిపెట్టడం కోసం, వారికి కావాల్సిన నిర్దేశం ఇవ్వడం కోసం నమ్మకమైన దాసుని తరగతి ఆధ్వర్యంలో ఈ భూమ్మీదున్న దేవుని సంస్థ ఎలా పనిచేస్తుందో చూసినప్పుడు మీ పిల్లల మనసుల్లో ఆ సందర్శనాలు చెరగని ముద్ర వేస్తాయి.—మత్త. 24:45-47; అపొ. 15:22-31.

మీ పిల్లలు అర్థం చేసుకునేంత సమాచారాన్నే చెప్పండి

మీ పిల్లలకు బోధించేటప్పుడు యేసు తన అపొస్తలులకు నేర్పించిన విధానాన్ని మనసులో ఉంచుకోండి. ఒకసారి ఆయన వారితో ఇలా అన్నాడు: “నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు.” (యోహా. 16:12) యేసు ఒకేసారి చాలా విషయాలు చెప్పి వారిని అయోమయంలో పడేయలేదు. కానీ ప్రాముఖ్యమైన సత్యాలను సరిగ్గా గ్రహించేలా వారికి క్రమ క్రమంగా బోధించాడు. మీరు కూడా మీ పిల్లలకు ఒకేసారి చాలా విషయాలు చెప్పి అయోమయంలో పడేయవద్దు. యెహోవా సంస్థ గురించి క్రమంగా ఒక్కో విషయం గురించి చెప్పినప్పుడు మీరు వారి ఆసక్తిని పెంచడమేకాక క్రైస్తవ సంఘం గురించి నేర్చుకోవడం సంతోషాన్నిస్తుందని వారు తెలుసుకునేలా చేస్తారు. మీ పిల్లలు ఎదుగుతుండగా వారి అవసరాలు మారతాయి కాబట్టి, గతంలో మీరు వారికి చెప్పిన విషయానికే మరిన్ని వివరాలు చేర్చి మళ్లీ చెప్పవచ్చు.

దేవునితో మన సంబంధాన్ని బలపర్చుకోవడానికి క్రైస్తవ సంఘం ఎంతగానో సహాయం చేస్తుంది. సంఘ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే పిల్లలు సాతాను లోకం నుండి వచ్చే ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి మరింత సమర్థులుగా ఉంటారు. (రోమా. 12:2) యెహోవా సంస్థతో సుపరిచితులయ్యేలా మీ పిల్లలకు సహాయం చేయడంలో మీరు ఎంతో ఆనందం పొందుతారని మేము నమ్ముతున్నాం. మనం సేవించే ప్రేమగల దేవుని ఆశీర్వాదంతో మీ పిల్లలు ఆయనకు, ఆయన సంస్థకు నమ్మకంగా ఉందురు గాక!

[28వ పేజీలోని బాక్సు/ చిత్రం]

 కుటుంబ ఆరాధనలో చర్చించుకోగల విషయాలు

కుటుంబ ఆరాధనా సాయంకాలమప్పుడు యెహోవా సంస్థ గురించి చర్చించుకోగల కొన్ని విషయాలు కింద ఇవ్వబడ్డాయి.

▪ స్థానిక సంఘ చరిత్ర గురించి చెప్పండి. అది ఎప్పుడు, ఎలా మొదలైంది? సంఘం ఏయే రాజ్యమందిరాలను ఉపయోగించింది? మీ పిల్లలు అడిగే ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పడానికి, ఎంతోకాలం నుండి మీ సంఘంతో సహవసిస్తున్న సహోదరుణ్ణి/సహోదరిని మీ ఇంటికి ఆహ్వానించవచ్చేమో ఆలోచించండి.

▪ సంఘ కూటాలు, సమావేశాలు ఎందుకు జరుగుతాయో, వాటినుండి మీ పిల్లలు ఎలా ప్రయోజనం పొందవచ్చో వివరించండి.

▪ యెహోవా సంస్థ వివిధ పాఠశాలల్ని ఎందుకు ఏర్పాటు చేసిందో చెప్పండి. అలాంటి పాఠశాలల నుండి పట్టభద్రులైన వారు ఎలాంటి మంచి ఫలితాలు సాధిస్తున్నారో చూపించే కొన్ని అనుభవాలను కూడా చెప్పండి.

▪ సువార్తను క్రమంగా ప్రకటించే ప్రచారకులుగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యమో తెలుసుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి. ఫిబ్రవరి మన రాజ్య పరిచర్యలో వచ్చే ప్రపంచవ్యాప్త నివేదికలో తాము కూడా ఎలా వంతు కలిగివుండవచ్చో చూపించండి.

▪ యెహోవా సంస్థలో పూర్తికాల సేవ చేయడానికి పిల్లలకు ఎలాంటి అవకాశాలున్నాయో చెప్పండి. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం అనే పుస్తకంలోని 10వ అధ్యాయంలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలున్నాయి.

▪ సంఘంలోని పనులు ఫలాని పద్ధతిలో ఎందుకు జరుగుతాయో అర్థం చేసుకునేందుకు పిల్లలకు సహాయం చేయండి. చిన్నచిన్న విషయాల్లో కూడా యెహోవా సంస్థ చెప్పే దానికి ఎందుకు లోబడివుండాలో వివరించండి. సంఘ పెద్దలు ఇచ్చే నిర్దేశాలను పాటించడం ద్వారా ప్రతీది ఓ క్రమ పద్ధతిలో జరిగేందుకు పిల్లలు కూడా ఎలా సహాయం చేయవచ్చో చూపించండి.

[చిత్రం]

చాలాకాలంగా సేవచేస్తున్నవారితో స్నేహం చేయడం వల్ల మీ పిల్లలు ప్రయోజనం పొందుతారు

[26వ పేజీలోని చిత్రాలు]

ప్రాచీన ఇశ్రాయేలులోని తల్లిదండ్రుల్లాగే, నేటి తల్లిదండ్రులు కూడా యెహోవా సంస్థ గురించి తమ పిల్లలు ప్రశ్నలు అడిగినప్పుడు వారికి సంతృప్తికరమైన జవాబులివ్వడానికి కృషిచేస్తారు