కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంజాయిషీలను యెహోవా ఎలా ఎంచుతాడు?

సంజాయిషీలను యెహోవా ఎలా ఎంచుతాడు?

సంజాయిషీలను యెహోవా ఎలా ఎంచుతాడు?

“నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిని” అని ఆదాము చెప్పాడు. “సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని” అని హవ్వ చెప్పింది. మొదటి తల్లిదండ్రులైన ఆదాముహవ్వలు దేవునికి చెప్పిన ఆ మాటలతోనే సంజాయిషీ ఇచ్చుకోవడం అనేది మొదలైంది.—ఆది. 3:12, 13.

ఆదాముహవ్వలు తెలిసి కూడా యెహోవా మాటకు అవిధేయులవ్వడం వల్ల ఆయన వారికి తీర్పుతీర్చాడు. ఆ తీర్పును బట్టి, వారు ఇచ్చిన సంజాయిషీని దేవుడు అంగీకరించలేదని స్పష్టమౌతోంది. (ఆది. 3:16-19) అయితే, యెహోవా అన్ని రకాల సంజాయిషీలను అంగీకరించడా? ఆయన అంగీకరించే సంజాయిషీలు ఏమైనా ఉన్నాయా? యెహోవా ఎలాంటి సంజాయిషీలను అంగీకరిస్తాడు, ఎలాంటి వాటిని అంగీకరించడు అనేది మనమెలా తెలుసుకోవచ్చు? వీటికి జవాబు తెలుసుకునేముందు, సంజాయిషీ అంటే ఏమిటో చూద్దాం.

ఫలానిది ఎందుకు చేశామో, ఎందుకు చేయలేదో లేదా ఎందుకు చేయమో చెప్పడానికి ఇచ్చే వివరణే సంజాయిషీ. అది, ఫలానా తప్పు ఎందుకు జరిగిందో తెలియజేసే సరైన వివరణ అయ్యుండవచ్చు. అంతేకాక, తప్పు చేసిన వ్యక్తి పట్ల దయ చూపించడానికి లేదా అతణ్ణి క్షమించడానికి ఆధారాన్నిచ్చేలా అతడు నిజంగా తప్పును ఒప్పుకోవడం కూడా అందులో ఉండవచ్చు. అయితే, ఆదాముహవ్వల విషయంలో జరిగినట్లే అది, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇచ్చే అబద్ధ కారణం కూడా అయ్యుండవచ్చు. సాధారణంగా సంజాయిషీలు అలా ఉంటాయి కాబట్టే ఇతరులు వాటిని త్వరగా నమ్మరు.

సంజాయిషీ ఇచ్చేటప్పుడు, ముఖ్యంగా దేవుని సేవకు సంబంధించి అలా చేసేటప్పుడు తప్పుడు వివరణలతో ‘మనల్ని మనం మోసగించుకోకుండా చూసుకోవాలి.’ (యాకో. 1:22) కాబట్టి, “ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు” ఉండేందుకు మనకు సహాయం చేసే కొన్ని బైబిలు ఉదాహరణలను, సూత్రాలను పరిశీలిద్దాం.—ఎఫె. 5:10.

మనం ఏమి చేయాలని దేవుడు కోరుతున్నాడు?

యెహోవా ప్రజలముగా మనం పాటించాల్సిన ఖచ్చితమైన ఆజ్ఞలు కొన్ని ఆయన వాక్యంలో ఉన్నాయి. ఉదాహరణకు, “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను ఆయన నిజ అనుచరులందరూ నేడు కూడా పాటించాలి. (మత్త. 28:19, 20) ఆ ఆజ్ఞను పాటించడం ఎంత ప్రాముఖ్యమో అపొస్తలుడైన పౌలు మాటలను గమనిస్తే తెలుస్తుంది. ఆయన ఇలా అన్నాడు: “నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.”—1 కొరిం. 9:16.

కొందరు ఎంతోకాలంగా మనతో బైబిలు అధ్యయనం చేస్తున్నా దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి ఇంకా వెనకాడుతుంటారు. (మత్త. 24:14) ఒకప్పుడు ప్రకటనా పని చేసిన మరి కొందరు ఇప్పుడు మానేశారు. అలాంటివారు కొన్నిసార్లు ఏ కారణాలు చెబుతారు? గతంలో, తానిచ్చిన ఖచ్చితమైన ఆజ్ఞలను పాటించడానికి వెనకాడిన కొంతమంది విషయంలో యెహోవా ఎలా స్పందించాడు?

దేవుడు అంగీకరించని సంజాయిషీలు

“అది చాలా కష్టం.” ముఖ్యంగా, బిడియస్థులైన వారికి ప్రకటనాపనిలో పాల్గొనడం చాలా కష్టమనిపించవచ్చు. అయితే, యోనా ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చో చూద్దాం. నీనెవె పట్టణం మీదికి రాబోయే నాశనం గురించి ప్రకటించమని యెహోవా యోనాకు చెప్పాడు. అది యోనాకు ఎంతో కష్టమనిపించింది. యెహోవా ఇచ్చిన పనిని చేయడానికి యోనా ఎందుకు భయపడ్డాడో మనం అర్థం చేసుకోవచ్చు. నీనెవె పట్టణం అష్షూరు దేశానికి రాజధాని. అష్షూరీయులు ఎంతో క్రూరమైన ప్రజలుగా పేరుగాంచారు. ‘అలాంటి ప్రజల మధ్యకు వెళ్లి ఎలా ప్రకటిస్తాను? వాళ్లు నన్ను ఏమి చేస్తారో?’ అని యోనా అనుకొని ఉండవచ్చు. నియామకం అందిన కొన్నిరోజులకే యోనా పారిపోయాడు. కానీ యెహోవా యోనా సంజాయిషీని అంగీకరించకుండా మళ్లీ నీనెవె ప్రజలకు ప్రకటించమని యోనాకు చెప్పాడు. ఈసారి యోనా ధైర్యంతో యెహోవా చెప్పిన పనిని చేశాడు, మంచి ఫలితం వచ్చేలా యెహోవా ఆశీర్వదించాడు.—యోనా 1:1-3; 3:3, 4, 10.

సువార్త ప్రకటించడం చాలా కష్టమని మీకు అనిపిస్తే, “దేవునికి సమస్తమును సాధ్యమే” అని గుర్తుంచుకోండి. (మార్కు 10:27) సహాయం చేయమని యెహోవాను అడుగుతూ ఉన్నట్లైతే ఆయన మనకు కావాల్సిన బలాన్ని తప్పక ఇస్తాడనీ పరిచర్య చేయడానికి మనం ధైర్యాన్ని కూడగట్టుకుంటే మనల్ని ఆశీర్వదిస్తాడనీ నమ్మవచ్చు.—లూకా 11:9-13.

“నాకు చేయాలని లేదు.” క్రైస్తవ పరిచర్య చేయాలన్న హృదయపూర్వక కోరిక మీకు లేకపోతే అప్పుడేమిటి? యెహోవా మీలో కార్యసిద్ధి కలుగజేసి, మీలో కోరిక కలిగేలా చేయగలడనే విషయాన్ని మరచిపోవద్దు. పౌలు ఇలా అన్నాడు: “మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.” (ఫిలి. 2:13) కాబట్టి, ఆయన చిత్తం చేసే కోరికను మీలో పుట్టించమని యెహోవాను అడగవచ్చు. దావీదు రాజు అదే చేశాడు. ‘నన్ను నీ సత్యము అనుసరించేలా చేయుము’ అని ఆయన యెహోవాను వేడుకున్నాడు. (కీర్త. 25:4, 5) తనకు ఇష్టమైనది చేసే కోరికను మీలో పుట్టించమని దావీదులాగే మీరూ యెహోవాను పట్టుదలతో వేడుకోవచ్చు.

మనం అలసిపోయినప్పుడు లేదా నిరుత్సాహపడినప్పుడు, రాజ్యమందిరంలో జరిగే కూటానికి లేదా పరిచర్యకు కొన్నిసార్లు బలవంతంగా వెళ్లాల్సివుంటుందనేది నిజమే. అలా జరిగితే, యెహోవాను మనం నిజంగా ప్రేమించడం లేదని అనుకోవాలా? అవసరంలేదు. గతంలో కూడా నమ్మకమైన దేవుని సేవకులు ఆయన చిత్తం చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఉదాహరణకు, దేవుని ఆజ్ఞలను పాటించడానికి పౌలు తన “శరీరమును నలగగొట్టు[కున్నాడు].” (1 కొరిం. 9:26, 27) కొన్నిసార్లు బలవంతంగా ప్రకటనాపని చేయాల్సి వచ్చినప్పటికీ యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. ఎందుకు? బలవంతంగా చేసినా సరైన కారణాన్నిబట్టే అంటే యెహోవా పట్ల ఉన్న ప్రేమనుబట్టే మనం దేవుని చిత్తం చేస్తాం. అలా చేయడం ద్వారా, పరీక్షలు ఎదురైనప్పుడు దేవుని సేవకులు యెహోవాను విడిచిపెడతారని సాతాను వేసిన నిందకు మనం జవాబు చెబుతాం.—యోబు 2:4.

“నాకు అస్సలు సమయం లేదు.” సమయం లేదని అనుకుంటూ మీరు పరిచర్యలో పాల్గొనకపోతుంటే, మీరు వేటికి ప్రాముఖ్యతనిస్తున్నారో మళ్లీ ఒకసారి పరిశీలించుకోవడం చాలా ప్రాముఖ్యం. ‘రాజ్యాన్ని మొదట’ వెదుకుతూ ఉండమని యేసు చెప్పాడు. (మత్త. 6:33) ఆ సూత్రాన్ని మీరు పాటించాలంటే, మీ జీవితాన్ని నిరాడంబరం చేసుకోవాల్సి రావచ్చు. లేదా పరిచర్యలో పాల్గొనేలా వినోదానికిచ్చే సమయాన్ని తగ్గించుకోవాల్సి రావచ్చు. వినోదం, ఇతర వ్యక్తిగత పనులు చూసుకోవడం అవసరమేకానీ, పరిచర్యను నిర్లక్ష్యం చేయడానికి అవి సరైన కారణాలు కావు. దేవుని సేవకులు తమ జీవితాల్లో రాజ్యానికే మొదటి స్థానం ఇస్తారు.

“నాకు సామర్థ్యం లేదు.” సువార్త ప్రకటించేందుకు మీకు సామర్థ్యం లేదని మీరు అనుకోవచ్చు. యెహోవా అప్పగించిన పనులు చేసే సామర్థ్యం తమకు లేదని గతంలో కూడా కొంతమంది నమ్మకమైన యెహోవా సేవకులు అనుకున్నారు. మోషే ఉదాహరణను తీసుకోండి. యెహోవా తనకు ఓ పని అప్పగించినప్పుడు మోషే ఆయనతో, “[యెహోవా,] ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడినప్పటినుండియైనను, నేను మాట నేర్పరినికాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడిని” అని అన్నాడు. యెహోవా తనకు అభయమిచ్చినప్పటికీ మోషే “అయ్యో ప్రభువా [యెహోవా], నీవు పంప తలంచిన వానినే పంపుము” అని బదులిచ్చాడు. (నిర్గ. 4:10-13) దానికి యెహోవా ఎలా స్పందించాడు?

ఆ పని నుండి యెహోవా మోషేను తప్పించలేదు. కానీ, మోషేకు సహాయం చేసేందుకు యెహోవా అహరోనును నియమించాడు. (నిర్గ. 4:14-17) అంతేకాక, యెహోవా ఆ తర్వాతి సంవత్సరాల్లో మోషేకు తోడుగా ఉంటూ తాను అప్పగించిన పనులను పూర్తి చేసేందుకు కావాల్సిన సహాయాన్ని చేశాడు. పరిచర్యలో పాల్గొనేలా మీకు కూడా కావాల్సిన సహాయం చేసేందుకు యెహోవా, అనుభవంగల తోటి విశ్వాసులను ప్రేరేపిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా, తాను అప్పగించిన పనిని పూర్తి చేసేందుకు యెహోవా మనల్ని సమర్థులనుగా చేస్తాడని దేవుని వాక్యం అభయమిస్తోంది.—2 కొరిం. 3:5;  “నా జీవితంలో అత్యంత సంతోషకరమైన సంవత్సరాలు” అనే బాక్సు చూడండి.

“నన్ను బాధపెట్టారు.” ఎవరో తమను బాధ పెట్టారని చెప్పి కొందరు కూటాలకు వెళ్లడం లేదా ప్రకటనా పనిలో పాల్గొనడం ఆపేస్తారు. ఆ సంజాయిషీని యెహోవా తప్పక అంగీకరిస్తాడని వారనుకుంటారు. ఎవరైనా మనల్ని బాధపెడితే మనం ఎంతగానో నొచ్చుకుంటామనేది అర్థం చేసుకోదగిన విషయమే కానీ క్రైస్తవ కార్యకలాపాల్లో పాల్గొనకపోవడానికి అది సరైన కారణమేనా? తమలో “తీవ్రమైన వాదము” కలిగేందుకు కారణమైన ఒక అభిప్రాయభేదం ఏర్పడిన తర్వాత పౌలు, అతని తోటి విశ్వాసియైన బర్నబా ఎంతో బాధపడి ఉండవచ్చు. (అపొ. 15:39) దానివల్ల పౌలు గానీ బర్నబా గానీ ప్రకటనా పని చేయడం మానేశారా? అస్సలు మానేయలేదు!

అలాగే, తోటి విశ్వాసి మీకు బాధ కలిగించినప్పుడు, మీ శత్రువు అపరిపూర్ణ క్రైస్తవ సహోదరుడు కాదుగానీ మిమ్మల్ని మ్రింగేయాలని చూస్తున్న సాతానేనని గుర్తుంచుకోండి. అయితే, మీరు “విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరి[స్తే]” అపవాది విజయం సాధించలేడు. (1 పేతు. 5:8, 9; గల. 5:15) అలాంటి విశ్వాసం ఉంటే మీరు ఏమాత్రం ‘సిగ్గుపరచబడరు’ లేదా నిరాశచెందరు.—రోమా. 9:33.

మన పరిస్థితులనుబట్టి ఎక్కువ చేయలేకపోతుంటే అప్పుడేమిటి?

సంజాయిషీ ఇచ్చుకోవడానికి సంబంధించి ఇప్పటి వరకు మనం పరిశీలించిన ఉదాహరణలను బట్టి చూస్తే, సువార్తను ప్రకటించమనే ఆజ్ఞతో సహా యెహోవా ఇచ్చిన ముఖ్యమైన ఆజ్ఞలన్నిటినీ పాటించకపోవడానికి లేఖనాధారంగా సరైన కారణాలేవీ లేవని తెలుస్తోంది. అయితే, పరిచర్యలో ఎక్కువ చేయలేకపోవడానికి మనకు సరైన కారణాలు ఉండవచ్చు. ఇతర లేఖనాధారిత బాధ్యతల వల్ల మనం పరిచర్య కోసం ఇంతకుముందు కేటాయించినంత సమయాన్ని ఇప్పుడు కేటాయించలేకపోవచ్చు. అంతేకాక, కొన్నిసార్లు బాగా అలసిపోవడం వల్ల లేదా తీవ్రమైన అనారోగ్యం వల్ల యెహోవా సేవలో మనం చేయాలనుకున్నంత చేయలేకపోవచ్చు. అయితే, మన హృదయ కోరిక ఏమిటో యెహోవాకు తెలుసనీ ఆయన మన పరిస్థితులను అర్థం చేసుకుంటాడనీ బైబిలు మనకు అభయమిస్తోంది.—కీర్త. 103:14; 2 కొరిం. 8:12.

కాబట్టి, ఇలాంటి విషయాల్లో మనకు మనం గానీ ఇతరులకు గానీ కఠినంగా తీర్పు తీర్చకుండా జాగ్రత్తపడాలి. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే.” (రోమా. 14:4) మన పరిస్థితిని ఇతరుల పరిస్థితితో పోల్చుకునే బదులు, “మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను” అని గుర్తుంచుకోవాలి. (రోమా. 14:11, 12; గల. 6:4, 5) ప్రార్థనలో మన సంజాయిషీలను యెహోవాకు చెప్పుకుంటున్నప్పుడు మనలో ప్రతీ ఒక్కరం ‘మంచి మనస్సాక్షితో’ అలా చేయాలనుకుంటాం.—హెబ్రీ. 13:18.

యెహోవాను సేవించడం మనకు ఎందుకు సంతోషాన్నిస్తుంది?

మన పరిస్థితులు ఏవైనా మనమందరం యెహోవాను పూర్ణ సంతోషంతో సేవించవచ్చు. ఎందుకంటే, ఆయన మనం చేయగలిగేవి, చేరుకోగలిగేవి మాత్రమే కోరతాడు. అలా అని ఎందుకు చెప్పవచ్చు?

దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.” (సామె. 3:27) యెహోవా మన నుండి కోరే వాటి విషయంలో ఈ సామెత ఏమి చెబుతోంది? మీ సహోదరుడు చేసినంత మీరు చేయాలని యెహోవా ఆజ్ఞాపించడం లేదు కానీ ఆయన సేవలో ‘మీకు చేతనైనంత’ మాత్రమే చేయమని చెబుతున్నాడు. మనలో ప్రతీ ఒక్కరం మనకు చేతనైనంత చేస్తూ యెహోవాను పూర్ణ హృదయంతో సేవించడం సాధ్యమే.—లూకా 10:27; కొలొ. 3:23.

[14వ పేజీలోని బాక్సు/చిత్రం]

 “నా జీవితంలో అత్యంత సంతోషకరమైన సంవత్సరాలు”

మనకు తీవ్రమైన శారీరక లేదా మానసిక పరిమితులు ఉండవచ్చు. అయితే వీటివల్ల పరిచర్యలో పూర్తిగా పాల్గొనలేకపోతున్నామని అనుకోవద్దు. ఉదాహరణకు, కెనడాలోని అర్నస్ట్‌ అనే క్రైస్తవ సహోదరుని అనుభవాన్నే తీసుకోండి.

అర్నస్ట్‌ నత్తివాడు, చాలా బిడియస్థుడు. ఆయన నిర్మాణ పని చేస్తుండేవాడు. అయితే వెన్నుకు ఓ తీవ్రమైన దెబ్బ తగిలినందువల్ల ఆయన పని చేయడం ఆపేయాల్సి వచ్చింది. ఆరోగ్య పరిస్థితి అలావున్నా కొత్త పరిస్థితులవల్ల పరిచర్యలో ఆయన ఎక్కువ సమయం గడపగలిగాడు. సహాయ పయినీరు సేవ గురించి సంఘ కూటాల్లో ప్రోత్సాహం ఇవ్వబడినప్పుడు, ఆ సేవ చేయాలనే బలమైన కోరిక తనలో కలిగింది. కానీ, తన పరిస్థితులను బట్టి సహాయ పయినీరుగా సేవ చేయలేనని ఆయన అనుకున్నాడు.

సహాయ పయినీరు సేవ చేయడం తనకు సాధ్యంకాదని తనకు తాను నిరూపించుకోవడానికి అర్నస్ట్‌ ఒక నెల ఆ సేవ చేసేందుకు దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆశ్చర్యకరంగా, ఆయన ఆ సేవను విజయవంతంగా పూర్తి చేయగలిగాడు. తర్వాత ఆయన, ‘మళ్లీ ఎన్నడూ ఆ సేవ చేయలేను’ అని అనుకున్నాడు. దాన్ని నిరూపించుకోవడానికి మరో నెల దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈసారి కూడా దాన్ని పూర్తి చేశాడు.

అర్నస్ట్‌ సహాయ పయినీరుగా ఒక సంవత్సరంపాటు సేవచేశాడు. అయితే ఈసారి ఆయన, “నేను ఎప్పటికీ క్రమ పయినీరును కాలేనని నాకు తెలుసు” అని అనుకున్నాడు. మళ్లీ, దాన్ని నిరూపించుకోవడం కోసం క్రమ పయినీరు సేవకు దరఖాస్తు పెట్టుకున్నాడు. మొదటి సంవత్సరం తాను ఆ సేవను పూర్తి చేయగలగడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ సేవను అలాగే కొనసాగించాలనుకుని ఆ తర్వాతి సంవత్సరం కూడా చేశాడు. అలా రెండేళ్లు పయినీరుగా సేవ చేసిన తర్వాత వెన్నుకు తగిలిన ఆ దెబ్బ వల్ల చనిపోయాడు. అయితే చనిపోవడానికి ముందు, తనను చూసేందుకు వచ్చినవారికి కంటతడితో ఇలా చెబుతుండేవాడు: “పయినీరుగా యెహోవాకు సేవ చేసిన ఆ సంవత్సరాలు నా జీవితంలో అత్యంత సంతోషకరమైనవి.”

[13వ పేజీలోని చిత్రం]

పరిచర్యలో పాల్గొనకుండా చేసే ఎలాంటి అడ్డంకులనైనా మనం అధిగమించవచ్చు

[15వ పేజీలోని చిత్రం]

మన పరిస్థితులు అనుమతించినంతలో చేయగలిగినదంతా చేస్తూ యెహోవాను పూర్ణాత్మతో సేవిస్తే ఆయన సంతోషిస్తాడు