కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఆయన క్రియలు ఆయన వెంట వెళ్లాయి’

‘ఆయన క్రియలు ఆయన వెంట వెళ్లాయి’

‘ఆయన క్రియలు ఆయన వెంట వెళ్లాయి’

యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన థియోడోర్‌ జారస్‌ 2010, జూన్‌ 9, బుధవారం ఉదయం తన భూజీవితాన్ని ముగించాడు. చనిపోయేనాటికి ఆయన వయసు 84 ఏళ్లు. ఆయన తన భార్య మలీటతో కలిసి 53 ఏళ్ల వివాహ జీవితాన్ని గడిపాడు. ఇప్పుడు ఆయన భార్య, ఆయన అక్క, ఓ మేనల్లుడు, ఇద్దరు మేనకోడళ్లు ఉన్నారు.

సహోదరుడు జారస్‌ 1925 సెప్టెంబరు 28న అమెరికాలోని కెంటకీలోవున్న పైక్‌ కౌంటీలో జన్మించాడు. ఆయన 1941, ఆగస్టు 10న పదిహేనేళ్ల వయసులో తాను యెహోవాకు చేసుకున్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకున్నాడు. రెండేళ్ల తర్వాత అంటే, తనకు 17 ఏళ్లున్నప్పుడు క్రమ పయినీరు సేవను ఆరంభించి, దాదాపు 67 ఏళ్ల పాటు పూర్తికాల సేవ చేశాడు.

ఆయనకు 20 ఏళ్లున్నప్పుడు 1946లో వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 7వ తరగతికి హాజరయ్యాడు. పట్టభద్రుడైన తర్వాత, అమెరికాలోని ఓహియోలోవున్న క్లీవ్‌లాండ్‌లో ప్రయాణ పైవిచారణకర్తగా సేవచేసేందుకు నియమించబడ్డాడు. ఆ తర్వాత 1951లో, ఆస్ట్రేలియా బ్రాంచి కార్యాలయంలో జరిగే పనిని పర్యవేక్షించే నియామకాన్ని ఆయన పొందాడు. “దైవపరిపాలనా క్రమాన్ని అనుసరించే విషయంలో ఉత్సాహాన్ని కనబర్చడం ద్వారా, క్షేత్రంలో చక్కని నాయకత్వం వహించడం ద్వారా దేశమంతటా ఉన్న సహోదరులను ఎంతో ప్రోత్సహించాడు” అని ఆయన గురించి 1983 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకములో (ఆంగ్లం) నివేదించబడింది.

సహోదరుడు జారస్‌ అమెరికాకు తిరిగి వెళ్లిన తర్వాత 1956, డిసెంబరు 10న మలీట లాస్కోను పెళ్లి చేసుకున్నాడు. వారు తమ వివాహ జీవితాన్ని ప్రయాణ సేవతో ఆరంభించి, అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఉత్సాహంగా ప్రాంతీయ సేవ, జిల్లా సేవ చేశారు. 1974 చివరి భాగంలో, యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యునిగా సేవచేసేందుకు ఆయన ఆహ్వానించబడ్డాడు.

యెహోవా సమర్పిత సేవకునిగా, పూర్ణ హృదయంతో దైవపరిపాలన కార్యకలాపాలకే ప్రాముఖ్యతనిచ్చిన నమ్మకస్థుడైన క్రైస్తవునిగా సహోదరుడు జారస్‌ మనకు చిరకాలం గుర్తుంటాడు. ఆయన ప్రేమగల, శ్రద్ధగల భర్త. అంతేకాక, తన స్వప్రయోజనాన్ని చూసుకోకుండా ఇతరులకు ప్రాధాన్యతనిచ్చిన ఆధ్యాత్మిక వ్యక్తి. (1 కొరిం. 13:4, 5) అందరినీ సమానంగా చూడాలి, అందరిపై దయ చూపించాలి అనే తన ఆలోచనను బట్టి ఇతరులపై ఆయనకు ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తుంది. అంతేకాక, పరిచర్యలో తాను చూపించిన ఉత్సాహాన్ని బట్టి ప్రజలపై ఆయనకు ఎంత ప్రగాఢమైన ప్రేమ, శ్రద్ధ ఉన్నాయో తెలుస్తుంది.

కష్టపడి పనిచేసిన వ్యక్తిగా, బెతెల్‌లో, ప్రపంచవ్యాప్త సహోదరత్వంలో ప్రియమైన సభ్యునిగా ఉన్న సహోదరుడు జారస్‌ను కోల్పోవడం మనకు దుఃఖకరంగానేవున్నా, అనేక దశాబ్దాల పాటు ఆయన యెహోవాకు నమ్మకంగా సేవచేసినందుకు మనం ఎంతో సంతోషిస్తున్నాం. ఆయన ‘మరణమువరకు నమ్మకముగా ఉండి జీవకిరీటాన్ని పొందాడని’ బలంగా నమ్ముతున్నాం. (ప్రక. 2:10) అంతేకాక, ‘ఆయన క్రియలు ఆయన వెంట వెళ్లాయి’ అనే నిశ్చయతను కలిగివున్నాం.—ప్రక. 14:13.