“ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము”
“ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము”
“ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.”—2 కొరిం. 6:2.
1. ఫలాని సమయంలో ఏ పని చేయాలో గ్రహించడం ఎందుకు అవసరం?
“ప్ర తిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.” (ప్రసం. 3:1) వ్యవసాయం, ప్రయాణం, వ్యాపారం లేదా సంభాషించడం వంటి ప్రయోజనకరమైన పనులు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయమేదో తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో సొలొమోను ఆ మాటల ద్వారా తెలియజేశాడు. అయితే, ఫలాని సమయంలో ఏ పని చాలా ప్రాముఖ్యమైనదో కూడా గ్రహించాలి. మరో మాటలో చెప్పాలంటే, మనకు సరైన ప్రాధాన్యతలు ఉండాలి.
2. యేసు భూమ్మీదున్నప్పుడు, తాను ఎలాంటి సమయంలో జీవిస్తున్నాడో తనకు బాగా తెలుసని మనమెలా చెప్పవచ్చు?
2 భూమ్మీదున్నప్పుడు తనకు ఎంత తక్కువ సమయం ఉందో, తాను చేయాల్సిన పనులేమిటో యేసుకు బాగా తెలుసు. తాను ప్రాముఖ్యతనివ్వాల్సిన విషయాలను మనసులో ఉంచుకున్నాడు కాబట్టి, ఎంతోకాలంగా ప్రజలు ఎదురుచూస్తూ వచ్చిన మెస్సీయ సంబంధిత ప్రవచనాల నెరవేర్పుకు సమయం వచ్చిందని ఆయన గ్రహించాడు. (1 పేతు. 1:10, 11; ప్రక. 19:10) వాగ్దానం చేయబడిన మెస్సీయ తానేనని యేసు ప్రజలకు వెల్లడి చేయాలి. ఆయన, రాజ్య సత్యం గురించి సమగ్రంగా సాక్ష్యమివ్వాలి, భవిష్యత్తులో తనతోపాటు రాజ్యవారసులయ్యేవారిని సమకూర్చాలి. అంతేకాక ఆయన, భూవ్యాప్తంగా సువార్త ప్రకటించి శిష్యులను చేసే పనిని కొనసాగించే క్రైస్తవ సంఘానికి పునాది వేయాలి.—మార్కు 1:15.
3. తనకు ఎంత తక్కువ సమయం ఉందో తెలిసి ఉండడం వల్ల యేసు ఏమి చేశాడు?
3 తనకు ఎంత తక్కువ సమయం ఉందో తెలిసి ఉండడం వల్ల యేసు ఆసక్తితో తన తండ్రి చిత్తం చేశాడు. ఆయన తన శిష్యులకు ఇలా చెప్పాడు: “కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి.” (లూకా 10:2; మలా. 4:5, 6) యేసు తన అనుచరుల్లో నుండి ముందుగా 12 మందిని, ఆ తర్వాత 70 మందిని ఎంచుకొని, వారికి కొన్ని స్పష్టమైన నిర్దేశాలను ఇచ్చి, “పరలోకరాజ్యము సమీపించి యున్నద[నే]” ఉత్తేజకరమైన సందేశాన్ని ప్రకటించేందుకు వారిని పంపించాడు. అంతేకాదు, యేసు గురించి మనమిలా చదువుతాం: “యేసు తన పండ్రెండుమంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడనుండి వెళ్లిపోయెను.”—మత్త. 10:5-7; 11:1; లూకా 10:1.
4. పౌలు ఏ విధంగా క్రీస్తును అనుకరించాడు?
4 ఆసక్తి విషయంలో, దైవభక్తి విషయంలో యేసు తన అనుచరులందరికీ పరిపూర్ణ మాదిరిని ఉంచాడు. “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి” అని పౌలు తన తోటి విశ్వాసులకు రాసినప్పుడు ఆ విషయాన్నే ప్రస్తావించాడు. (1 కొరిం. 11:1) పౌలు ఏ విధంగా క్రీస్తును అనుకరించాడు? ముఖ్యంగా, సువార్త ప్రకటనా పనిలో తాను చేయగలిగినదంతా చేయడం ద్వారా ఆయన క్రీస్తును అనుకరించాడు. సంఘాలకు పౌలు రాసిన పత్రికల్లో ‘ఆసక్తి విషయములో మాంద్యులు కాకండి,’ ‘యెహోవాను సేవించుడి,’ “ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి,” ‘మీరేమి చేసినను అది యెహోవా నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి’ వంటి మాటలు కనిపిస్తాయి. (రోమా. 12:11, NW; 1 కొరిం. 15:58; కొలొ. 3:23, NW) దమస్కుకు వెళ్లే మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తు తనతో మాట్లాడిన సందర్భాన్ని పౌలు ఎన్నడూ మరచిపోలేదు. అంతేకాక, బహుశా శిష్యుడైన అననీయ తనకు చెప్పిన యేసు మాటల్ని కూడా ఆయన మరచిపోలేదు. పౌలు గురించి అననీయతో యేసు ఇలా చెప్పాడు: “అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు.”—అపొ. 9:15; రోమా. 1:1-7; గల. 1:15, 16.
“మిక్కిలి అనుకూలమైన సమయము”
5. పౌలు తన పరిచర్యను ఎందుకు ఆసక్తితో నెరవేర్చాడు?
5 అపొస్తలుల కార్యములు పుస్తకం చదువుతున్నప్పుడు, పరిచర్యలో పౌలు చూపించిన ధైర్యం, ఆసక్తి స్పష్టంగా కనిపిస్తాయి. (అపొ. 13:9, 10; 17:16, 17; 18:5) పౌలు తాను జీవిస్తున్న సమయం ఎంత ప్రాముఖ్యమైనదో గుర్తించాడు. ఆయనిలా అన్నాడు: “ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.” (2 కొరిం. 6:2) పూర్వం బబులోనులో బానిసలుగా ఉన్నవారు తమ స్వదేశానికి తిరిగి వెళ్లడానికి సా.శ.పూ. 537వ సంవత్సరం అనుకూలమైన సమయం. (యెష. 49:8, 9) కానీ, పౌలు దేని గురించి ప్రస్తావించాడు? పౌలు ఆ మాటలు రాసిన సందర్భాన్ని పరిశీలిస్తే ఆయన మనసులో ఏముందో తెలుసుకోవచ్చు.
6, 7. నేటి అభిషిక్త క్రైస్తవులకు ఏ ఘనత ఇవ్వబడింది? నేడు ఎవరు వారితో కలిసి పనిచేస్తున్నారు?
6 పౌలు అదే పత్రికలో ముందు రాసిన మాటలను చూస్తే, ఆయన తనకు, తన తోటి అభిషిక్త క్రైస్తవులకు ఇవ్వబడిన గొప్ప ఘనత గురించి మాట్లాడాడు. (2 కొరింథీయులు 5:18-20 చదవండి.) ఓ ప్రత్యేకమైన పని కోసం అంటే “సమాధానపరచు పరిచర్యను” నెరవేర్చడానికి, “దేవునితో సమాధానపడుడని” ప్రజల్ని బ్రతిమాలడానికి తమను దేవుడు పిలిచాడని పౌలు వివరించాడు. దేవునితో సమాధానపడడమంటే, దేవునితో స్నేహాన్ని పునరుద్ధరించుకోవడమని అర్థం.
7 ఏదెనులో తిరుగుబాటు జరిగినప్పటి నుండి మానవులు యెహోవాకు దూరమైపోయారు. (రోమా. 3:10, 11, 23) కాబట్టి, వారు యెహోవా గురించి, ఆయన సంకల్పాల గురించి తెలుసుకోలేకపోయారు, చివరకు బాధకు, మరణానికి గురయ్యారు. “సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నదని యెరుగుదుము” అని పౌలు రాశాడు. (రోమా. 8:22) అయితే, ప్రజలు తన దగ్గరకు తిరిగి రావాలని లేక తనతో సమాధానపడాలని ‘బ్రతిమాలడానికి’ దేవుడు చర్యలు తీసుకున్నాడు. అప్పట్లో దాని గురించి ప్రకటించే బాధ్యత పౌలుకు, ఆయన తోటి అభిషిక్తులకు అప్పగించబడింది. వారు ప్రకటించే ఆ ‘అనుకూలమైన సమయమే’ యేసుపై విశ్వాసం ఉంచేవారికి “రక్షణ దినము[గా]” ఉండగలదు. నేటి అభిషిక్త క్రైస్తవులు, వారితో కలిసి పనిచేస్తున్న ‘వేరే గొర్రెలు’ “అనుకూలమైన సమయము” నుండి ప్రయోజనం పొందమని ప్రజల్ని ఆహ్వానించడంలో కొనసాగుతున్నారు.—యోహా. 10:16.
8. దేవునితో సమాధానపడమనే పిలుపు ఎందుకు ప్రత్యేకమైనది?
8 దేవునితో సమాధానపడమనే పిలుపు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, మానవులు ఏదెనులో తిరుగుబాటు చేసి దేవునితో తమకున్న సంబంధాన్ని పాడుచేసుకున్నా, వారు తనతో సమాధానపడేందుకు స్వయంగా దేవుడే చొరవ తీసుకున్నాడు. (1 యోహా. 4:10, 19) ఇంతకీ దేవుడు ఏమి చేశాడు? పౌలు దానికిలా జవాబిచ్చాడు: “దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.”—2 కొరిం. 5:19; యెష. 55:6.
9. దేవుని కనికరం పట్ల తనకున్న కృతజ్ఞతను పౌలు ఎలా చూపించాడు?
9 విమోచన క్రయధన బలిని ఏర్పాటు చేయడం ద్వారా యెహోవా ఆ బలిపై విశ్వాసముంచే ప్రజల పాపాలు క్షమించబడేలా, వారు తనతో స్నేహాన్ని పునరుద్ధరించుకునేలా చేశాడు. అంతేకాక, అవకాశం ఉన్నప్పుడే తనతో సమాధానపడమని మానవులందరినీ బ్రతిమాలడానికి యెహోవా తన ప్రతినిధులను పంపించాడు. (1 తిమోతి 2:3-6 చదవండి.) దేవుని చిత్తమేమిటో, తాను జీవిస్తున్న సమయం ఎంత ప్రాముఖ్యమైనదో గ్రహించి పౌలు “సమాధానపరచు పరిచర్య[లో]” అవిశ్రాంతంగా కృషి చేశాడు. యెహోవా చిత్తం మారలేదు. ఆయనతో సమాధానపడడానికి ద్వారము ఇంకా తెరిచే ఉంది. “ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము,” “ఇదే రక్షణ దినము” అని పౌలు చెప్పిన మాటలు మనకాలానికి కూడా వర్తిస్తాయి. యెహోవా ఎంత కనికరంగల దేవుడు!—నిర్గ. 34:6, 7.
‘దాని ఉద్దేశాన్ని వ్యర్థం చేయకండి’
10. గతంలోని అభిషిక్తుల విషయంలో, నేటి అభిషిక్తుల విషయంలో “రక్షణ దినము” ఏ భావాన్ని కలిగివుంది?
10 “క్రీస్తునందున్న” వారే దేవుని కృప నుండి ముందుగా ప్రయోజనం పొందుతారు. (2 కొరిం. 5:17, 18) వారికి సా.శ. 33 పెంతెకొస్తుతో “రక్షణ దినము” మొదలైంది. అప్పటినుండి వారికి “సమాధాన వాక్యమును” ప్రకటించే బాధ్యత అప్పగించబడింది. నేడు మిగిలివున్న అభిషిక్త క్రైస్తవులు ఆ “సమాధానపరచు పరిచర్యను” కొనసాగిస్తున్నారు. అపొస్తలుడైన యోహాను ఓ ప్రవచనాత్మక దర్శనంలో చూసిన నలుగురు దేవదూతలు, “భూమి మీద . . . వీచకుండునట్లు భూమియొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని” ఉన్నారని అభిషిక్తులు అర్థం చేసుకున్నారు. కాబట్టి, మనం ఇప్పటికీ ‘మిక్కిలి అనుకూలమైన సమయములో, రక్షణ దినములో’ ఉన్నాం. (ప్రక. 7:1-3) అందుకే, భూమ్మీద మిగిలివున్న అభిషిక్తులు 20వ శతాబ్దం ప్రారంభం నుండి భూవ్యాప్తంగా “సమాధానపరచు పరిచర్యను” ఆసక్తిగా నెరవేరుస్తున్నారు.
11, 12. ఇరవయ్యో శతాబ్దపు ఆరంభంలో, తాము జీవిస్తున్న సమయం ఎంత ప్రాముఖ్యమైనదో గ్రహించారని అభిషిక్త క్రైస్తవులు ఎలా చూపించారు? (15వ పేజీలోని చిత్రం చూడండి.)
11 ఉదాహరణకు, యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) పుస్తకంలో చెప్పబడినట్లు, 19వ శతాబ్దం చివర్లో, “సి. టి. రస్సెల్, ఆయన సహవాసులు తాము కోతకాలంలో జీవిస్తున్నామని, స్వాతంత్ర్యాన్నిచ్చే సత్యాన్ని ప్రజలు వినాల్సివుందని బలంగా నమ్మారు.” మరి వారేమి చేశారు? వారు ‘మిక్కిలి అనుకూల సమయమైన’ కోతకాలంలో ఉన్నారని గుర్తించి, ప్రజలను కేవలం ఓ మతపరమైన సేవ కోసం ఆహ్వానిస్తే సరిపోదని అనుకున్నారు. ఎందుకంటే, నామకార్థ క్రైస్తవ మతనాయకులు ఎంతోకాలంగా అదే చేస్తూ వచ్చారు. కానీ వారికి భిన్నంగా, ఆ అభిషిక్త క్రైస్తవులు రాజ్య సువార్తను వ్యాప్తి చేయడానికి ఇతర మార్గాలను వెదికారు. దానికోసం వారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించారు.
12 రాజ్య సువార్తను వ్యాప్తి చేసేందుకు ఆ ఆసక్తిగల ప్రచారకులు కరపత్రాలను, పత్రికలను, పెద్దాచిన్నా పుస్తకాలను ఉపయోగించారు. అంతేకాదు, వారు ప్రసంగాలను, శీర్షికలను రాసి వేలాది వార్తాపత్రికల్లో ముద్రించబడేలా చూశారు. జాతీయ, అంతర్జాతీయ రేడియో నెట్వర్క్లలో లేఖనాధారిత కార్యక్రమాలను ప్రసారం చేశారు. చిత్ర పరిశ్రమ సౌండ్ చేర్చిన చలనచిత్రాలను విడుదల చేయడానికి ముందే ఆ ప్రచారకులు, కదిలే చిత్రాలను సౌండ్ రికార్డింగులతో అనుసంధానం చేసి వాటిని ఉపయోగించారు. అత్యంత ఆసక్తితో వారు చేసిన పనివల్ల ఎలాంటి ఫలితం వచ్చింది? నేడు, దాదాపు 70 లక్షలమంది, “దేవునితో సమాధానపడుడి” అనే వార్తకు స్పందించి, దాన్ని ఇతరులకు ప్రకటిస్తున్నారు. అప్పట్లో అంత అనుభవం లేకపోయినా యెహోవా సేవచేసిన ఆ కొంతమంది అభిషిక్తులు ఆసక్తి విషయంలో నిజంగా మంచి మాదిరినుంచారు.
13. యెహోవాకున్న ఏ ఉద్దేశాన్ని మనం గంభీరంగా తీసుకోవాలి?
13 “ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము” అని పౌలు చెప్పిన మాటలు మన కాలానికి కూడా వర్తిస్తాయి. యెహోవా కృపను రుచి చూసిన మనం, తనతో సమాధానపడమనే సువార్తను విని, దాన్ని అంగీకరించే అవకాశాన్ని మనకిచ్చినందుకు ఆయనకు ఎంతో రుణపడివున్నాం. దేవుని కృప మనకు దొరికిందని తృప్తిపడే బదులు, పౌలు ఆ తర్వాత చెప్పిన ఈ మాటల్ని మనం గంభీరంగా తీసుకుంటాం: “దేవుని కృపను, [‘దాని ఉద్దేశాన్ని,’ NW] వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము.” (2 కొరిం. 6:1) క్రీస్తు ద్వారా ‘లోకము తనతో సమాధానపడాలన్నదే’ యెహోవా కృప ఉద్దేశం.—2 కొరిం. 5:19.
14. చాలా దేశాల్లోని ప్రజల స్పందనలో ఇప్పుడు ఎలాంటి మార్పు వచ్చింది?
14 చాలామందికి సాతాను గుడ్డితనం కలుగజేశాడు కాబట్టి, వారు ఇంకా దేవునికి దూరంగానే ఉన్నారు, ఆయన కృప ఉద్దేశాన్ని తెలుసుకోలేదు. (2 కొరిం. 4:3, 4; 1 యోహా. 5:19) అయితే, అంతకంతకూ దిగజారుతున్న లోక పరిస్థితులను చూసిన చాలామంది, దేవునికి దూరమైనందువల్లే మానవులు దుష్టత్వాన్ని, బాధలను అనుభవిస్తున్నారని చూపించబడినప్పుడు సానుకూలంగా స్పందించారు. మన ప్రకటనా పనిని అంతగా పట్టించుకోని దేశాల్లో సహితం, ఇప్పుడు చాలామంది సువార్తను అంగీకరించి దేవునితో సమాధానపడేందుకు చర్య తీసుకుంటున్నారు. “దేవునితో సమాధానపడుడని” మరింత ఆసక్తిగా ప్రకటించేందుకు ఇదే సరైన సమయమని మనం అర్థం చేసుకున్నామా?
15. ప్రజలకు వినసొంపుగా ఉండేదాన్ని కాక ఏ వార్తను మనం ప్రకటిస్తాం?
15 ప్రజలు దేవునివైపు తిరిగితే సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆయన సహాయం చేస్తాడనీ వారికి మంచి జరుగుతుందనీ చెప్పడం మన పని కాదు. అలాంటివి వినడానికే చాలామంది నేడు చర్చీలకు వెళ్తున్నారు, చర్చీలు కూడా ఆ కోరికను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాయి. (2 తిమో. 4:3, 4) కానీ, మన పరిచర్య ఉద్దేశం అది కాదు. యెహోవా మన మీదున్న ప్రేమతో క్రీస్తు ద్వారా మన పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడనే సువార్తను మనం ప్రకటిస్తాం. దేవుని నుండి దూరమైపోయిన ప్రజలు ఆ సువార్తను అంగీకరిస్తే తిరిగి ఆయనతో సమాధానపడగలుగుతారు. (రోమా. 5:10; 8:32) అయితే, “మిక్కిలి అనుకూలమైన సమయము” అతి త్వరలోనే ముగుస్తుంది.
“ఆత్మయందు తీవ్రతగలవారై” ఉండండి
16. పౌలు ధైర్యాన్ని, ఆసక్తిని ఎలా చూపించగలిగాడు?
16 సత్యారాధన విషయంలో మనం ఆసక్తిని పెంచుకొని దాన్ని ఎలా కాపాడుకోగలుగుతాం? కొంతమంది బిడియస్థులుగా ఉండవచ్చు లేదా ఎక్కువగా మాట్లాడకపోవచ్చు. దానివల్ల వారు తమ భావాలను బయటికి చెప్పలేకపోవచ్చు లేదా ఇతరులతో స్నేహపూర్వకంగా మెలగలేకపోవచ్చు. అయితే, ఆసక్తి అనేది కేవలం భావావేశాన్ని బయటకు చూపించడం కాదు. అంతేకాక, అది ఒకరి వ్యక్తిత్వంపై ఆధారపడి ఉండదు. ఆసక్తిని పెంచుకొని దాన్ని కాపాడుకోవడానికి సహాయం చేసే ఓ ప్రాముఖ్యమైన విషయం గురించి చెబుతూ, “ఆత్మయందు తీవ్రతగలవారై” ఉండమని పౌలు తన తోటి క్రైస్తవులను ప్రోత్సహించాడు. (రోమా. 12:11) అపొస్తలులు ప్రకటనా పనిలో ధైర్యం, సహనం చూపించడానికి యెహోవా దేవుని ఆత్మ ఎంతగానో సహాయం చేసింది. యేసు తనను పిలిచినప్పటినుండి తాను రోములో చివరిసారిగా చెరసాలలో ఉండి మరణించేంతవరకూ అంటే, 30కన్నా ఎక్కువ సంవత్సరాలపాటు పౌలు ఆసక్తి కొంచెం కూడా తగ్గలేదు. ఆయన సహాయం కోసం ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడ్డాడు. దేవుడు తన ఆత్మ ద్వారా ఆయనకు కావాల్సిన శక్తినిచ్చాడు. పౌలు ఇలా అన్నాడు: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.” (ఫిలి. 4:13) ఆయన మాదిరి నుండి నేర్చుకొని మనం ఎంతో ప్రయోజనాన్ని పొందవచ్చు.
17. మనం ఎలా ‘ఆత్మయందు తీవ్రతగలవారమై’ ఉండవచ్చు?
17 “తీవ్రత” అని అనువదించబడిన మాటకు అక్షరార్థంగా “మరగడం” అని అర్థం. (కింగ్డమ్ ఇంటర్లీనియర్) గిన్నెలో నీళ్లను మరిగించాలంటే, ఆ గిన్నెకు తగినంత వేడి అందుతూ ఉండాలి. అలాగే, మనం ‘ఆత్మయందు తీవ్రతగలవారమై’ ఉండాలంటే మనపై దేవుని ఆత్మ పనిచేస్తూ ఉండాలి. అలా జరగాలంటే, మనల్ని ఆధ్యాత్మికంగా బలపర్చడానికి యెహోవా చేసే ఏర్పాట్లన్నిటినీ పూర్తిగా ఉపయోగించుకోవాలి. అంటే, క్రమమైన వ్యక్తిగత అధ్యయనాన్ని, కుటుంబ ఆరాధనను, ప్రార్థనను, సంఘ కూటాలను, తోటి క్రైస్తవుల సహవాసాన్ని మనం ప్రాముఖ్యమైనవిగా ఎంచాలి. అలా చేస్తే ‘మరిగించడానికి’ కావాల్సిన ‘వేడిని’ పొంది, ‘ఆత్మయందు తీవ్రతగలవారమై’ ఉంటాం.—అపొస్తలుల కార్యములు 4:20; 18:25 చదవండి.
18. సమర్పిత క్రైస్తవులముగా మనల్ని మనం దేనికి అంకితం చేసుకోవాలి?
18 ఫలాని పని చేయడానికి తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్న వ్యక్తి సులభంగా పక్కదారి పట్టడు లేదా ఆ పనిని పూర్తి చేయకుండా మధ్యలో విడిచిపెట్టడు. సమర్పిత క్రైస్తవులముగా, మనం యేసులాగే యెహోవా చిత్తం చేయడానికి మనల్ని మనం అంకితం చేసుకున్నాం. (హెబ్రీ. 10:7) నేడు, సాధ్యమైనంత ఎక్కువమంది తనతో సమాధానపడాలన్నదే యెహోవా చిత్తం. కాబట్టి యేసును, పౌలును అనుకరిస్తూ ప్రజలు నేడు యెహోవాతో సమాధానపడడానికి సహాయం చేసే అత్యవసరమైన, ప్రాముఖ్యమైన పనిలో ఆసక్తిగా పాల్గొందాం.
మీకు జ్ఞాపకమున్నాయా?
• పౌలుకు, ఇతర అభిషిక్త క్రైస్తవులకు అప్పగించబడిన “సమాధానపరచు పరిచర్య” ఏమిటి?
• ‘మిక్కిలి అనుకూలమైన సమయాన్ని’ భూమ్మీద మిగిలివున్న అభిషిక్త క్రైస్తవులు ఎలా సద్వినియోగం చేసుకున్నారు?
• క్రైస్తవ పరిచారకులు ఎలా “ఆత్మయందు తీవ్రతగలవారై” ఉండవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
[12వ పేజీలోని చిత్రం]
ప్రభువైన యేసుక్రీస్తు తనతో మాట్లాడిన సందర్భాన్ని పౌలు ఎన్నడూ మరచిపోలేదు