కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒంటరి జీవితాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోండి

ఒంటరి జీవితాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోండి

ఒంటరి జీవితాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోండి

“(ఈ మాటను) అంగీకరింపగలవాడు అంగీకరించును గాక.”—మత్త. 19:12.

1, 2. (ఎ) ఒంటరితనం గురించి యేసు, పౌలు, మరితరులు ఎలా భావించారు? (బి) ఒంటరి జీవితాన్ని కొంతమంది ఎందుకు ఓ ఆశీర్వాదంగా భావించకపోవచ్చు?

 దేవుడు మానవులకు ఇచ్చిన అత్యంత విలువైన బహుమానాల్లో వివాహం ఒకటి. (సామె. 19:14) అయితే, చాలామంది అవివాహిత క్రైస్తవులు కూడా ఆసక్తికరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తారు. అవివాహిత సహోదరుడైన 95 ఏళ్ల హారల్డ్‌ ఇలా అన్నాడు: “ఇతరులతో సమయం గడపడం, ఆతిథ్యం ఇవ్వడమంటే నాకు ఇష్టం. అయినా, నేను ఒక్కడినే ఉన్న సమయాల్లో ఎన్నడూ ఒంటరితనంతో బాధపడలేదు. అవివాహితునిగా ఉండడం ఖచ్చితంగా ఓ ఆశీర్వాదం అని నేను చెప్పగలను.”

2 నిజానికి వివాహంలాగే, ఒంటరితనం కూడా దేవుని అనుగ్రహం లేదా ఆశీర్వాదం అని యేసుక్రీస్తు, అపొస్తలుడైన పౌలు చెప్పారు. (మత్తయి 19:11, 12; 1 కొరింథీయులు 7:6, 7 చదవండి.) అయితే, ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరూ అలా ఉండాలని కోరుకోలేదనే విషయం మనకు తెలిసిందే. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి సరైన వ్యక్తి దొరకకపోవచ్చు. లేదా కొంతమంది ఎన్నో ఏళ్లు వివాహ జీవితాన్ని గడిపిన తర్వాత విడాకులవల్లనో తమ భాగస్వామి చనిపోవడంవల్లనో ఉన్నట్టుండి ఒంటరివాళ్లైపోతారు. అయితే, ఒంటరితనం ఎలా ఓ ఆశీర్వాదంగా ఉండగలదు? ఒంటరి క్రైస్తవులు తమ జీవితాన్ని ఎలా జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవచ్చు?

ఓ ప్రత్యేకమైన ఆశీర్వాదం

3. ఒంటరి క్రైస్తవులకు ఎలాంటి చక్కటి అవకాశాలు ఉన్నాయి?

3 పెళ్లైన వ్యక్తి కన్నా పెళ్లికాని వ్యక్తికే ఎక్కువ సమయం, స్వేచ్ఛ ఉంటాయి. (1 కొరిం. 7:32-35) వాటివల్ల ఆయన/ఆమె పరిచర్యలో ఎక్కువ సమయాన్ని వెచ్చించవచ్చు, ఇతరులపై ప్రేమ చూపించే విషయంలో తన హృదయాన్ని విశాలపరచుకోవచ్చు, యెహోవాకు మరింత దగ్గరకావచ్చు. అవివాహితులుగా ఉండడంవల్ల వచ్చే ప్రయోజనాలను గుర్తించి వాటిని విలువైనవిగా ఎంచిన చాలామంది కనీసం కొంతకాలమైనా అలా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇతరులు, మొదట్లో తాము ఒంటరిగా ఉండాలని అనుకోకపోయినా, పరిస్థితులు మారినప్పుడు తమ ప్రస్తుత స్థితి గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి యెహోవా సహాయంతో అలా కొనసాగగలమని గుర్తించారు. ఆ విధంగా వారు మారిన పరిస్థితులను అంగీకరించి ఒంటరిగానే ఉండిపోవాలని తీర్మానించుకున్నారు.—1 కొరిం. 7:37, 38.

4. ఒంటరి క్రైస్తవులు దేవుని సేవలో ఎందుకు పూర్తి సంతృప్తిని పొందవచ్చు?

4 యెహోవా గానీ, ఆయన సంస్థ గానీ తమను విలువైనవారిగా ఎంచాలంటే వారు వివాహితులుగా ఉండాల్సిన అవసరం లేదని ఒంటరి క్రైస్తవులకు తెలుసు. యెహోవా మనలో ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తాడు. (మత్త. 10:29-31) దేవుని ప్రేమ నుండి మనల్ని ఏదీ దూరం చేయలేదు. (రోమా. 8:38, 39) వివాహితులమైనా ఒంటరివాళ్లమైనా మనం దేవుని సేవలో పూర్తి సంతృప్తిని పొందవచ్చు.

5. ఒంటరి జీవితమనే ఆశీర్వాదాన్ని చక్కగా ఉపయోగించుకోవడానికి ఏమి అవసరం?

5 సంగీతం, క్రీడలు వంటివాటిలో ప్రతిభ ఉండడం ఓ వరం. అయితే ఆ ప్రతిభను మెరుగుపర్చుకోవడానికి కృషి అవసరమైనట్లే, ఒంటరి జీవితమనే ఆశీర్వాదాన్ని చక్కగా ఉపయోగించుకోవడానికి కూడా కృషి అవసరం. కాబట్టి, నేటి ఒంటరి క్రైస్తవులు అంటే సహోదరులైనా సహోదరీలైనా, యౌవనస్థులైనా పెద్దవారైనా, ఒంటరి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నవారైనా పరిస్థితులనుబట్టి ఒంటరివారైనా తమ జీవితాన్ని జ్ఞానయుక్తంగా ఎలా ఉపయోగించుకోవచ్చు? మొదటి శతాబ్దానికి చెందిన కొంతమంది క్రైస్తవుల ప్రోత్సాహకరమైన అనుభవాలను పరిశీలించి, వారి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చో చూద్దాం.

యౌవనస్థులుగా ఉన్నప్పుడు . . .

6, 7. (ఎ) కన్యకలుగా ఉన్న ఫిలిప్పు కుమార్తెలు దేవుని సేవలో ఎలాంటి గొప్ప అవకాశాన్ని పొందారు? (బి) అవివాహితునిగా ఉన్న సంవత్సరాలను తిమోతి ఎలా ఉపయోగించుకున్నాడు? (సి) యౌవనంలో సేవచేయడానికి ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చినందుకు తిమోతి ఎలా ఆశీర్వదించబడ్డాడు?

6 సువార్తికుడైన ఫిలిప్పుకు కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు ఉండేవారు. వారు ఆయనలాగే సువార్త పనిలో ఉత్సాహంగా పనిచేశారు. (అపొ. 21:8, 9) పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడిన అద్భుత వరాల్లో ప్రవచించడం ఒకటి. యోవేలు 2:28, 29లోని మాటల నెరవేర్పుగా, ఆ నలుగురు యౌవన స్త్రీలు ఆ వరాన్ని ఉపయోగించారు.

7 యౌవనస్థుడైన తిమోతి కూడా తన అవివాహ స్థితిని చక్కగా ఉపయోగించుకున్నాడు. తాను బాలుడిగా ఉన్నప్పుడు అమ్మ యునీకే, అమ్మమ్మ లోయి తనకు “పరిశుద్ధలేఖనములను” బోధించారు. (2 తిమో. 1:3-5; 3:14, 15) దాదాపు సా.శ. 47లో పౌలు వారి స్వస్థలమైన లుస్త్రను మొదటిసారి సందర్శించినప్పుడు బహుశా వారు క్రైస్తవులయ్యుంటారు. అయితే రెండేళ్ల తర్వాత పౌలు రెండోసారి లుస్త్రను సందర్శించినప్పుడు తిమోతికి దాదాపు 20 ఏళ్లు ఉండివుంటాయి. అప్పటికి తిమోతి సత్యంలోకి వచ్చి కొంతకాలమే అయింది, వయసులో కూడా చిన్నవాడు. అయినా లుస్త్ర, ఈకొనియ ప్రాంతాల్లోని సంఘ పెద్దల దగ్గర “మంచిపేరు” సంపాదించుకున్నాడు. (అపొ. 16:1, 2) కాబట్టి, పౌలు తనతోపాటు ప్రయాణ సేవలో పనిచేసేందుకు తిమోతిని ఆహ్వానించాడు. (1 తిమో. 1:18; 4:14) తిమోతి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడా లేదా అన్నది మనకు తెలియదు. కానీ, ఆయన యౌవనస్థునిగా ఉన్నప్పుడు పౌలు ఇచ్చిన ఆహ్వానాన్ని ఇష్టపూర్వకంగా అంగీకరించి, ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలపాటు అవివాహితునిగా మిషనరీ సేవ చేయడంలో, పర్యవేక్షకుడిగా సేవ చేయడంలో సంతోషించాడని మాత్రం మనకు తెలుసు.—ఫిలి. 2:20-22.

8. మార్కు ఎలా ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పరచుకోగలిగాడు? వాటిని చేరుకోవడం వల్ల ఆయన ఏ ఆశీర్వాదాలు పొందాడు?

8 మార్కు అనే మారుపేరుగల యోహాను కూడా అవివాహితునిగా ఉన్న సంవత్సరాలను చక్కగా ఉపయోగించుకున్నాడు. యౌవనస్థుడైన మార్కు, ఆయన తల్లి మరియ, వారి దగ్గరి బంధువైన బర్నబా యెరూషలేము సంఘంలోని తొలి సభ్యుల్లో ఉండేవారు. పట్టణంలో వారికి సొంత ఇల్లు, రొదే అనే ఓ పనిపిల్ల ఉండేదంటే వారి కుటుంబం సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించి ఉండవచ్చని తెలుస్తోంది. (అపొ. 12:12, 13) a యౌవనస్థుడిగా ఉన్నా, అలాంటి సౌకర్యాల మధ్య జీవించినా మార్కు తనకు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ ఓ స్వార్థపరునిగా ఉండలేదు. లేదా ఒకే ఊరిలో స్థిరపడి సౌకర్యవంతమైన కుటుంబ జీవితాన్ని గడపాలని అనుకోలేదు. మొదట్లో అపొస్తలులతో సహవసించడం వల్ల ఆయనకు మిషనరీ సేవ చేయాలనే కోరిక కలిగింది. కాబట్టి, పౌలు బర్నబాలు మొదటి మిషనరీ యాత్ర చేసినప్పుడు ఆయన అత్యంత ఆసక్తిగా వారితో పాటు వెళ్లి వారికి ఉపచారం చేశాడు. (అపొ. 13:5) తర్వాత, ఆయన బర్నబాతో కలిసి ప్రయాణ సేవ చేశాడు. అంతేకాక, కొంతకాలానికి పేతురుతో కలిసి బబులోనులో సేవచేశాడు. (అపొ. 15:39; 1 పేతు. 5:13) మార్కు ఎంతకాలం అవివాహితునిగా ఉన్నాడో మనకు తెలియదు. కానీ, ఇతరులకు ఉపచారం చేయడానికి, మరింత ఎక్కువగా దేవుని సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తిగా ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు.

9, 10. పరిచర్యను విస్తృతపరచుకోవడానికి అవివాహితులైన యౌవనస్థులకు నేడు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఓ ఉదాహరణ చెప్పండి.

9 నేడు కూడా సంఘాల్లోని చాలామంది యౌవనస్థులు అవివాహితులుగా ఉన్న సంవత్సరాల్లో ఇష్టపూర్వకంగా దేవుని సేవలో మరింత ఎక్కువగా పాల్గొంటారు. మార్కు తిమోతిల్లాగే, అవివాహితులుగా ఉన్న సంవత్సరాల్లో ఇతర విషయాల గురించి చింతించకుండా “ప్రభువు సన్నిధానవర్తనులై” ఉండగలుగుతామని వారు గుర్తిస్తారు. (1 కొరిం. 7:35) ఆ సమయంలో పయినీరు సేవ చేయడం, రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న చోట సేవ చేయడం, వేరే భాష నేర్చుకోవడం, రాజ్యమందిరాల లేదా బ్రాంచి కార్యాలయాల నిర్మాణ పనుల్లో పాల్గొనడం, పరిచర్య శిక్షణా పాఠశాలకు హాజరుకావడం, బెతెల్‌ సేవ చేయడం వంటి ఎన్నో అవకాశాలు వారి ముందుంటాయి. మీరు అవివాహితులైన యౌవనస్థులైతే, మీకు అందుబాటులో ఉన్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారా?

10 మార్క్‌ అనే సహోదరుడు టీనేజీలో ఉన్నప్పుడే పయినీరు సేవ ఆరంభించాడు. ఆ తర్వాత పరిచర్య శిక్షణా పాఠశాలకు హాజరయ్యాడు, ప్రపంచవ్యాప్తంగా వివిధ నియామకాల్లో సేవ చేశాడు. ఆయన గత 25 ఏళ్లుగా పూర్తికాల సేవలో ఉన్నాడు. ఆ సమయం గురించి ఆయనిలా అన్నాడు: “పరిచర్యలో సహోదర సహోదరీలతో కలిసి పనిచేయడం ద్వారా, కాపరి సందర్శనాలు చేయడం ద్వారా, మా ఇంటికి సహోదరులను భోజనానికి పిలవడం ద్వారా, సంఘ సభ్యులు క్షేమాభివృద్ధి పొందగలిగేలా పార్టీలను ఏర్పాటు చేయడం ద్వారా నేను ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించడానికి ప్రయత్నించాను. ఇలా చేయడం వల్ల నేను ఎంతో సంతోషించాను.” ఇవ్వడం వల్లే అత్యంత సంతోషం కలుగుతుందనీ జీవిత కాలమంతా పరిశుద్ధ సేవలో గడిపితే ఇతరులకు ఇచ్చేందుకు ఎన్నో అవకాశాలు దొరుకుతాయనీ మార్క్‌ మాటలను బట్టి తెలుస్తోంది. (అపొ. 20:35) యౌవనస్థులైన మీకు దేనిపై ఆసక్తి ఉన్నా, మీ నైపుణ్యాలు ఏవైనా, మీకు ఎంత అనుభవం ఉన్నా దేవుని సేవలో చేయాల్సింది ఎంతో ఉంది.—1 కొరిం. 15:58.

11. పెళ్లి చేసుకోవడానికి తొందరపడకుండా ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి?

11 చాలామంది యౌవనస్థులు కొంతకాలానికి పెళ్లి చేసుకోవాలని కోరుకున్నా, ఈ విషయంలో తొందరపడకుండా ఉండడం మంచిది. కనీసం లైంగిక కోరికలు బలంగా ఉండే “ఈడు” దాటిపోయేంతవరకైనా వేచివుండమని పౌలు యౌవనస్థులను ప్రోత్సహించాడు. (1 కొరిం. 7:36) మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి, తగిన వ్యక్తిని ఎంచుకునేందుకు కావాల్సిన అనుభవం సంపాదించుకోవడానికి కొంత సమయం పడుతుంది. పెళ్లి ప్రమాణాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలి కాబట్టి దాన్ని చులకనగా తీసుకోకూడదు.—ప్రసం. 5:2-5.

యౌవన కాలం తర్వాత . . .

12. (ఎ) తన పరిస్థితులు మారినప్పుడు విధవరాలైన అన్న ఏమి చేసింది? (బి) ఆమె ఎలాంటి గొప్ప అవకాశాన్ని పొందింది?

12 లూకా సువార్తలో, అన్న అనే స్త్రీ గురించి ప్రస్తావించబడింది. పెళ్లైన ఏడేళ్లకే తన భర్త అకస్మాత్తుగా చనిపోయాడు. దానివల్ల ఆమె ఎంతో వేదనను అనుభవించివుంటుంది. ఆమెకు పిల్లలు ఉన్నారో లేదో, ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుందో లేదో మనకు తెలియదు. కానీ, 84 ఏళ్ల వయసులో తాను ఇంకా విధవరాలిగా ఉందని బైబిలు చెబుతోంది. పరిస్థితులు మారినప్పుడు యెహోవాకు మరింత దగ్గరవడానికి ప్రయత్నించిందని దాన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె “దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను.” (లూకా 2:36, 37) ఆమె తన జీవితంలో దేవుణ్ణి ఆరాధించడానికే ప్రాముఖ్యతనిచ్చింది. అందుకోసం కృతనిశ్చయంతో తీవ్రంగా కృషి చేసింది, దానివల్ల గొప్పగా ఆశీర్వదించబడింది. పసివాడైన యేసును చూసే గొప్ప అవకాశాన్ని పొందింది, మెస్సీయ ద్వారా కలుగబోయే విడుదల గురించి ఇతరులకు సాక్ష్యమిచ్చింది.—లూకా 2:38.

13. (ఎ) సంఘంలో దొర్కా చురుకైన సభ్యురాలిగా ఉండేదని దేన్నిబట్టి తెలుస్తోంది? (బి) మంచితనాన్ని, దయను చూపించడం వల్ల దొర్కా ఎలా ఆశీర్వదించబడింది?

13 యెరూషలేముకు వాయవ్య దిశలో ఉన్న యొప్పే అనే ప్రాచీన ఓడరేవు పట్టణంలో దొర్కా లేదా తబితా అనే స్త్రీ ఉండేది. ఆమె భర్త గురించి బైబిలు ప్రస్తావించడం లేదు కాబట్టి ఆమె ఆ సమయంలో అవివాహితురాలై ఉండవచ్చు. “ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను.” అవసరంలో ఉన్న విధవరాళ్లకు, ఇతరులకు ఆమె చాలా బట్టలు కుట్టి ఇచ్చిందని తెలుస్తోంది. దానివల్ల ఇతరులు ఆమెను ఎంతగానో ప్రేమించారు. అయితే, ఆమె ఉన్నట్టుండి అనారోగ్యం పాలై చనిపోయింది. తమ ప్రియమైన సహోదరిని తిరిగి బ్రతికించమని వేడుకోవడానికి సంఘ సభ్యులందరు కలిసి ఇద్దరు మనుష్యులను పేతురు దగ్గరికి పంపించారు. ఆమె పునరుత్థానం చేయబడిందన్న వార్త యొప్పే అంతటా వ్యాపించినప్పుడు చాలామంది విశ్వాసులయ్యారు. (అపొ. 9:36-42) వారిలో కొంతమందికి దొర్కాయే తన అసాధారణమైన దయతో సహాయం చేసివుంటుంది.

14. ఒంటరి క్రైస్తవులు ఎందుకు యెహోవాకు మరింత దగ్గరవ్వగలుగుతారు?

14 అన్న, దొర్కాల్లాగే నేడు చాలామంది యౌవన కాలం దాటిన తర్వాత కూడా ఒంటరిగానే ఉండవచ్చు లేదా పరిస్థితులు మారినందువల్ల ఒంటరివాళ్లైపోవచ్చు. పెళ్లి చేసుకోవడానికి సరైన వ్యక్తి దొరకనందువల్ల లేదా విడాకులవల్ల లేదా భర్త/భార్య చనిపోవడంవల్ల ఒంటరివాళ్లుగా ఉండవచ్చు. సుఖదుఃఖాలు పంచుకోవడానికి తోడు లేకపోవడంవల్ల ఒంటరి క్రైస్తవులు యెహోవా మీదే ఎక్కువగా ఆధారపడడాన్ని నేర్చుకుంటారు. (సామె. 16:3) 38కన్నా ఎక్కువ సంవత్సరాలపాటు బెతెల్‌లో సేవ చేసిన సిల్వీయా అనే ఒంటరి సహోదరి తన ఒంటరితనాన్ని ఓ ఆశీర్వాదంగా ఎంచుతోంది. ఆమె ఇలా ఒప్పుకుంది: “కొన్నిసార్లు నేను నిరుత్సాహానికి గురౌతుంటాను. అప్పుడు ‘నన్ను ఎవరు ప్రోత్సహిస్తారు?’ అని నేను అనుకుంటాను. కానీ, నాకు ఏమి అవసరమో నాకన్నా యెహోవాకే బాగా తెలుసనే నమ్మకం వల్ల నేను ఆయనకు మరింత దగ్గరవ్వగలుగుతున్నాను. ఎల్లప్పుడూ నాకు ప్రోత్సాహం దొరుకుతుంది, కొన్నిసార్లు అది నేను అస్సలు ఊహించని రీతుల్లో వస్తుంది.” మనం యెహోవాకు దగ్గరైతే ఆయన మనల్ని ఎల్లప్పుడూ ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ, మనకు ధైర్యాన్నిస్తాడు.

15. అవివాహిత క్రైస్తవులు ప్రేమ చూపించే విషయంలో ఎలా తమ హృదయాన్ని ‘విశాలపరచుకోవచ్చు’?

15 ఒంటరిగా ఉండడం వల్ల ఓ వ్యక్తి, ప్రేమ చూపించే విషయంలో తన హృదయాన్ని ‘విశాలపరచుకోగలుగుతాడు.’ (2 కొరింథీయులు 6:11-13 చదవండి.) గత 34 సంవత్సరాలుగా పూర్తికాల సేవలోవున్న జోలీన్‌ అనే ఒంటరి సహోదరి ఇలా అంది: “నా తోటి వయసువారితోనే కాక అందరితో సన్నిహిత స్నేహాన్ని పెంచుకోవడానికి తీవ్రంగా కృషి చేశాను. ఒంటరిగా ఉండడంవల్ల యెహోవాకు, మీ కుటుంబానికి, సహోదర సహోదరీలకు, మీ పొరుగువారికి మీ సమయాన్ని, శక్తిని, ఇతర వనరులను ఇచ్చేందుకు నిజంగా చక్కని అవకాశాలు దొరుకుతాయి. నా వయసు పెరుగుతున్న కొద్దీ నేను ఒంటరిగా ఉన్నందుకు మరింత సంతోషిస్తున్నాను.” సంఘంలోవున్న వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఒంటరి తల్లిదండ్రులు, యౌవనస్థులు, మరితరులు తమకు ఒంటరివాళ్లు నిస్వార్థంగా చేసే సహాయాన్ని ఎంతో విలువైనవిగా ఎంచుతారు. నిజానికి, ఇతరులపై ప్రేమ చూపించిన ప్రతీసారి మనకు మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఇతరులపై ప్రేమ చూపించే విషయంలో మీ హృదయాన్ని ‘విశాలపరచుకోగలరా?’

జీవితాంతం అవివాహితులుగా ఉండడం

16. (ఎ) యేసు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? (బి) పౌలు తన ఒంటరితనాన్ని జ్ఞానయుక్తంగా ఎలా ఉపయోగించుకున్నాడు?

16 యేసు పెళ్లి చేసుకోలేదు. తనకు నియమించబడిన పరిచర్య కోసం సిద్ధపడి దాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఆయన ఎన్నో దూరాలు ప్రయాణించేవాడు, తెల్లవారుజామునే తన సేవను ఆరంభించి మధ్య రాత్రి వరకు దాన్ని కొనసాగించేవాడు, చివరకు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. ఆయన పెళ్లి చేసుకోకుండా ఉండడంవల్ల తన పనిని పూర్తి చేయగలిగాడు. అపొస్తలుడైన పౌలు కూడా ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించాడు, పరిచర్యలో తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నాడు. (2 కొరిం. 11:23-27) పౌలుకు అంతకుముందు పెళ్లై ఉండవచ్చేమో కానీ, అపొస్తలుడిగా నియమించబడిన తర్వాత మాత్రం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండాలనుకున్నాడు. (1 కొరిం. 7:6, 7; 9:5) పరిచర్య కోసం వీలైతే తమ మాదిరిని అనుకరించమని యేసు, పౌలు ఇతరులను ప్రోత్సహించారు. అయితే, పరిచర్య చేసేవారు పెళ్లి చేసుకోకూడదనే నియమాన్ని వారు పెట్టలేదు.—1 తిమో. 4:1-3.

17. యేసు పౌలుల మాదిరిని కొంతమంది ఎలా అనుకరించారు? అలాంటి త్యాగాలు చేసేవారిని యెహోవా విలువైనవారిగా ఎంచుతాడని మనం ఎందుకు నమ్మవచ్చు?

17 నేడు కూడా కొంతమంది పరిచర్యను మరింత బాగా చేయడానికి అవివాహితులుగానే ఉండిపోవాలని తీర్మానించుకున్నారు. పైన ప్రస్తావించబడిన హారల్డ్‌ 56కన్నా ఎక్కువ సంవత్సరాలు బెతెల్‌ సేవ చేశాడు. ఆయన ఇలా అన్నాడు: “నేను బెతెల్‌ సేవలో 10 సంవత్సరాలు పూర్తిచేసుకునేటప్పటికి, చాలామంది దంపతులు అనారోగ్యం వల్ల లేదా వయసు పైబడుతున్న తల్లిదండ్రులను చూసుకోవాల్సిరావడం వల్ల బెతెల్‌ వదిలి వెళ్లిపోయారు. మా అమ్మానాన్నలు ఈ మధ్యే చనిపోయారు. అయితే, బెతెల్‌ సేవ నాకెంత ఇష్టమంటే, నేను పెళ్లి చేసుకొని ఆ సేవను వదులుకునే పరిస్థితి తెచ్చుకోవద్దనుకున్నాను.” అదేవిధంగా, కొన్ని సంవత్సరాల క్రితం మార్గరెట్‌ అనే దీర్ఘకాల పయినీరు ఇలా అంది: “నాకు పెళ్లి చేసుకునే అవకాశాలు వచ్చాయి కానీ, నేను చేసుకోలేదు. అవివాహితురాలిగా, నాకు మరింత స్వేచ్ఛ ఉండడం వల్ల నేను పరిచర్యలో ఎక్కువ చేయగలుగుతున్నాను. దీనివల్ల ఎంతో సంతోషిస్తున్నాను.” సత్యారాధన కోసం నిస్వార్థంగా చేసే అలాంటి త్యాగాలను యెహోవా ఎన్నడూ మరచిపోడు.—యెషయా 56:4, 5 చదవండి.

మీ పరిస్థితులను జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోండి

18. ఒంటరి క్రైస్తవులకు ఇతరులు ప్రోత్సాహాన్ని, మద్దతును ఎలా ఇవ్వవచ్చు?

18 యెహోవా సేవలో తాము చేయగలిగినదంతా చేస్తున్న అవివాహిత క్రైస్తవులందరినీ మనం మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం ద్వారా వారిని ప్రోత్సహించాలి. మనం వారిని ప్రేమిస్తాం, సంఘం కోసం వారు చేస్తున్న పనులను బట్టి కృతజ్ఞత చూపిస్తాం. మనం వారికి నిజమైన ఆధ్యాత్మిక ‘అన్నదమ్ములుగా, అక్కచెల్లెండ్రుగా, తల్లులుగా, పిల్లలుగా’ ఉన్నట్లయితే, తాము ఒంటరివాళ్లమని వారు ఎన్నడూ బాధపడాల్సిన అవసరం ఉండదు.—మార్కు 10:28-30 చదవండి.

19. ఒంటరి జీవితాన్ని మీరు జ్ఞానయుక్తంగా ఎలా ఉపయోగించుకోవచ్చు?

19 మీరు అవివాహితులుగా ఉండాలని తీర్మానించుకున్నా లేదా పరిస్థితులను బట్టి ఒంటరివాళ్లైనా సంతోషకరమైన, ఫలవంతమైన జీవితాన్ని మీరు అనుభవించవచ్చని ఈ లేఖన ఉదాహరణలు, ఆధునిక ఉదాహరణలు అభయాన్నిస్తున్నాయి. కొన్ని ఆశీర్వాదాల కోసం మనం ఆశగా ఎదురుచూస్తాం, మరికొన్నిటిని అసలు ఊహించనే ఊహించం. కొన్ని ఆశీర్వాదాలు ఎంత విలువైనవో మనం వెంటనే గుర్తిస్తాం, మరికొన్నిటి విలువను కొంతకాలం గడిచిన తర్వాతే గుర్తిస్తాం. అయితే, మనం వాటిని ఎలా ఎంచుతామనేది చాలామట్టుకు మన ఆలోచనా తీరుపైనే ఆధారపడివుంటుంది. ఒంటరి జీవితాన్ని మీరు జ్ఞానయుక్తంగా ఎలా ఉపయోగించుకోవచ్చు? యెహోవాకు మరింత సన్నిహితమవ్వండి, ఆయన సేవలో నిమగ్నమై ఉండండి, ఇతరులపై ప్రేమ చూపించే విషయంలో మీ హృదయాన్ని విశాలపరచుకోండి. వివాహంలాగే, ఒంటరితనం అనే ఆశీర్వాదాన్ని కూడా యెహోవా దృక్కోణం నుండి చూస్తూ దాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకుంటే ఎన్నో మంచి ఫలితాలొస్తాయి.

[అధస్సూచి]

a గ్రీకు మూల భాష రాతలను బట్టి రొదే ఒక పనిపిల్ల అని తెలుస్తోంది.

మీకు గుర్తున్నాయా?

• ఒంటరితనం ఓ ఆశీర్వాదమని ఎందుకు చెప్పవచ్చు?

• యౌవనస్థులుగా ఉన్నప్పుడు ఒంటరితనం ఎలా ఓ ఆశీర్వాదంగా ఉండగలదు?

• యెహోవాకు మరింత సన్నిహితమవ్వడానికి, ఇతరులపై ప్రేమ చూపించే విషయంలో తమ హృదయాన్ని విశాలపరచుకోవడానికి ఒంటరి క్రైస్తవులకు ఎలాంటి అవకాశాలున్నాయి?

[అధ్యయన ప్రశ్నలు]

[18వ పేజీలోని చిత్రాలు]

దేవుని సేవ కోసం మీకు అందుబాటులో ఉన్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారా?