యెహోవా మీ కోసం ఇప్పటికే చేసినవాటి గురించి ఆలోచిస్తూ ఉండండి
యెహోవా మీ కోసం ఇప్పటికే చేసినవాటి గురించి ఆలోచిస్తూ ఉండండి
యేసు పునరుత్థానం చేయబడిన కొంత సమయానికి, ఆయన శిష్యుల్లో ఇద్దరు యెరూషలేము నుండి ఎమ్మాయుకు నడిచి వెళ్తుండగా జరిగినదాని గురించి లూకా సువార్త చెబుతోంది. అక్కడ ఇలా ఉంది: “వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకువచ్చి వారితో కూడ నడిచెను; అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను.” అప్పుడు యేసు వారితో, “మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి.” అసలు వారెందుకు దుఃఖంలో ఉన్నారు? ఆ సమయంలోనే యేసు అన్యజనుల చేతుల్లో నుండి ఇశ్రాయేలీయులను విడుదల చేస్తాడని శిష్యులు అనుకున్నారు. అలా జరగలేదు కానీ యేసు చంపబడ్డాడు. అందుకే, వారు దుఃఖంలో ఉన్నారు.—లూకా 24:15-21; అపొ. 1:6.
యేసు ఆ ఇద్దరు శిష్యులతో తర్కించడం మొదలుపెట్టి, “మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.” నిజానికి, విశ్వాసాన్ని బలపర్చే ప్రత్యేకమైన సంఘటనలెన్నో యేసు పరిచర్య చేసిన కాలంలో జరిగాయి. అయితే, యేసు ఇస్తున్న వివరణను విన్నప్పుడు వారు దుఃఖపడడం మానేసి సంతోషించారు. ఆ తర్వాత, అదే రోజు సాయంత్రం వారు ఇలా మాట్లాడుకున్నారు: “ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా?” (లూకా 24:27, 32) ఆ శిష్యుల ప్రతిస్పందన నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
మనం అనుకున్నట్లు జరగకపోతే ఎలా స్పందిస్తాం?
తాము అనుకున్నట్లు జరగలేదు కాబట్టి, ఎమ్మాయుకు వెళ్తున్న ఆ ఇద్దరు శిష్యులు దుఃఖంలో మునిగిపోయారు. “కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును” అని సామెతలు 13:12లో ఉన్న మాటలు వారి విషయంలో నిజమయ్యాయి. ఎన్నో దశాబ్దాలుగా యెహోవాను నమ్మకంగా సేవిస్తున్న కొందరు, ‘మహాశ్రమలు’ ఎప్పుడో రావాల్సిందని అనుకున్నారు. (మత్త. 24:21; ప్రక. 7:14) అనుకున్నట్లు జరగకపోతే దుఃఖం కలగడం సహజమే.
అంతకుముందూ అలాగే తమ కాలంలోనూ నెరవేరిన ప్రవచనాల గురించి యేసు వారిని ఆలోచింపజేసినప్పుడు, ఆ ఇద్దరు శిష్యులు సంతోషాన్ని తిరిగి పొందారు. మనం కూడా నిరాశ చెందినప్పుడు యెహోవా ఇప్పటికే చేసిన వాటి గురించి ఆలోచిస్తే ఆ నిరాశను
అధిగమించి అంతరంగ సంతోషాన్ని కాపాడుకుంటాం. మైఖెల్ అనే ఓ అనుభవంగల సంఘ పెద్ద ఇలా అన్నాడు: “యెహోవా ఇంకా చేయనివాటి గురించి ఆలోచించే బదులు ఇప్పటికే ఆయన చేసినవాటి గురించి ఆలోచిస్తూ ఉండండి.” అది ఎంత చక్కని సలహా!యెహోవా ఇప్పటికే చేసినవి
యెహోవా ఇప్పటికే చేసిన కొన్ని గొప్ప కార్యాల గురించి ఆలోచించండి. యేసు ఇలా అన్నాడు: “నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయును.” (యోహా. 14:12) క్రైస్తవ చరిత్రలో మునుపెన్నడూ జరగని గొప్ప కార్యాలను నేడు దేవుని సేవకులు చేస్తున్నారు. 70 లక్షలకన్నా ఎక్కువమంది మహాశ్రమలను దాటే రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాల్లో ఇంతమంది నమ్మకమైన యెహోవా సేవకులు మునుపెన్నడూ క్రియాశీలంగా లేరు. తన శిష్యులు తాను చేసిన “వాటికంటె మరి గొప్పవి” చేస్తారని యేసు ప్రవచించిన దాన్ని యెహోవా నిజం చేశాడు.
యెహోవా మనకోసం ఇంకా ఏమి చేశాడు? అలంకారార్థంగా చెప్పాలంటే, యథార్థ హృదయులు ఈ దుష్టలోకం నుండి బయటికి వచ్చి తాను సృష్టించిన ఆధ్యాత్మిక పరదైసులోకి ప్రవేశించే ఏర్పాటును యెహోవా చేశాడు. (2 కొరిం. 12:1-4) సమయం తీసుకొని, ఆ పరదైసుకు సంబంధించి మనకు అందుబాటులో ఉన్న కొన్ని అంశాల గురించి ధ్యానించండి. ఉదాహరణకు, మీ ఇంట్లో లేదా రాజ్యమందిరంలోవున్న లైబ్రరీని ఒకసారి చూడండి. వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ (ఆంగ్లం) తెరిచి చూడండి లేదా మీ కంప్యూటర్లో వాచ్‌టవర్ లైబ్రరీని (ఆంగ్లం) చూడండి. రికార్డు చేయబడిన బైబిలు నాటకాన్ని వినండి. ఇటీవల జరిగిన సమావేశంలో విన్నవాటిని, చూసినవాటిని మళ్లీ వింటున్నట్లు, చూస్తున్నట్లు ఊహించుకోండి. అంతేకాక, మన క్రైస్తవ సహోదర సహోదరీలతో ఆనందించే చక్కటి సహవాసం గురించి కూడా ఆలోచించండి. ఆధ్యాత్మిక పరదైసులో భాగంగా, సమృద్ధికరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని, ప్రేమగల సహోదరత్వాన్ని ఇచ్చే విషయంలో యెహోవా ఎంత ఉదార స్వభావాన్ని చూపించాడు!
కీర్తనకర్తయైన దావీదు ఇలా రాశాడు: “యెహోవా, నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు.” (కీర్త. 40:5) అవును, యెహోవా ఇప్పటికే మనకోసం చేసిన అద్భుత కార్యాల గురించి, మనపట్ల ఆయనకున్న ప్రేమ గురించి ధ్యానిస్తే మనం నూతన బలాన్ని పొందుతాం. అలా, మన పరలోక తండ్రియైన యెహోవాకు పూర్ణహృదయంతో, నమ్మకంగా సేవచేస్తూ ఉండగలుగుతాం.—మత్త. 24:13.
[31వ పేజీలోని చిత్రం]
యెహోవా అప్పటికే వారికోసం చేసినవాటి గురించి ఆలోచిస్తూ ఉండేలా యేసు తన శిష్యులకు సహాయం చేశాడు
[32వ పేజీలోని చిత్రాలు]
ఇటీవల జరిగిన సమావేశంలో విన్నవాటిని, చూసినవాటిని మళ్లీ వింటున్నట్లు, చూస్తున్నట్లు ఊహించుకోండి