వివాహం దేవుడిచ్చిన ఆశీర్వాదమని ఎంచి దానిని గౌరవించండి
వివాహం దేవుడిచ్చిన ఆశీర్వాదమని ఎంచి దానిని గౌరవించండి
“కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.”—ఆది. 2:24.
1. యెహోవా మన గౌరవాన్ని పొందడానికి ఎందుకు అర్హుడు?
వివాహాన్ని ఏర్పాటు చేసిన యెహోవా మన గౌరవాన్ని పొందడానికి అర్హుడు. మన సృష్టికర్తగా, సర్వాధిపతిగా, పరలోకపు తండ్రిగా ఆయన ‘శ్రేష్ఠమైన ప్రతి ఈవిని, సంపూర్ణమైన ప్రతి వరమును’ ఇచ్చేవాడని సరిగ్గానే పిలువబడ్డాడు. (యాకో. 1:17; ప్రక. 4:10, 11) ఇది ఆయన గొప్ప ప్రేమకు నిదర్శనం. (1 యోహా. 4:8) ఆయన మనకు నేర్పించిన, మన నుండి కోరిన, మనకు ఇచ్చిన ప్రతీది మన మంచి కోసమే.—యెష. 48:17.
2. మొదటి దంపతులకు యెహోవా ఏ నిర్దేశాలను ఇచ్చాడు?
2 యెహోవా ఇచ్చిన “శ్రేష్ఠమైన” బహుమానాల్లో వివాహం ఒకటని బైబిలు చెబుతోంది. (రూతు 1:9; 2:12) మొట్టమొదటి వివాహాన్ని చేసినప్పుడు, దంపతులైన ఆదాముహవ్వల వివాహ జీవితం సఫలమయ్యేందుకు యెహోవా వారికి స్పష్టమైన నిర్దేశాలను ఇచ్చాడు. (మత్తయి 19:4-6 చదవండి.) ఆ నిర్దేశాల్ని వారు పాటించివుంటే నిరంతరం సంతోషంగా ఉండేవారు. అయితే, మూర్ఖంగా దేవుని ఆజ్ఞను పాటించనందువల్ల వారు ఘోరమైన ఫలితాలను చవిచూశారు.—ఆది. 3:6-13, 16-19, 23.
3, 4. (ఎ) నేడు చాలామంది వివాహాన్ని, యెహోవా దేవుణ్ణి ఎలా అగౌరవపరుస్తున్నారు? (బి) ఇప్పుడు మనం ఏమి పరిశీలిస్తాం?
3 ఆ మొదటి దంపతుల్లాగే నేడు కూడా చాలామంది, తమ వివాహ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుని నిర్దేశాన్ని కొంతమేరకే పాటిస్తారు లేదా అసలు పాటించరు. కొంతమంది వివాహం చేసుకోకుండానే ఒకరు లేదా అంతకన్నా ఎక్కువమందితో కలిసి జీవిస్తారు. మరికొంతమంది తమ సొంత కోరికల కోసం వివాహాన్ని తమకిష్టమొచ్చినట్లు మలచుకుంటారు లేదా సలింగ వివాహాలు చేసుకుంటారు. (రోమా. 1:24-32; 2 తిమో. 3:1-5) వివాహం దేవుడిచ్చిన ఆశీర్వాదమనే విషయాన్ని వారు మర్చిపోయి వివాహాన్ని, దాన్నిచ్చిన యెహోవా దేవుణ్ణి అగౌరవపరుస్తారు.
4 అప్పుడప్పుడు కొంతమంది దేవుని ప్రజలు కూడా వివాహం పట్ల దేవునికున్న అభిప్రాయాన్ని మరచిపోతారు. కొంతమంది క్రైస్తవ దంపతులు విడిపోవాలని నిర్ణయించుకుంటారు లేదా లేఖనాధారం లేకుండా విడాకులు తీసుకుంటారు. అయితే, ఆ పరిస్థితి రాకుండా ఎలా చూసుకోవచ్చు? క్రైస్తవ దంపతులు తమ వివాహాన్ని బలపరచుకోవడానికి ఆదికాండము 2:24లో దేవుడిచ్చిన నిర్దేశం ఎలా సహాయం చేస్తుంది? వివాహం చేసుకోవాలనుకుంటున్నవారు దానికోసం ఎలా సిద్ధపడవచ్చు? వివాహం జీవితాంతం నిలిచివుండాలంటే యెహోవాపై గౌరవం ఉండడం ఎందుకు ప్రాముఖ్యమో అర్థంచేసుకునేందుకు బైబిలు కాలాల్లోని మూడు విజయవంతమైన వివాహాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
యథార్థతను వృద్ధిచేసుకొని దాన్ని కాపాడుకోండి
5, 6. జెకర్యా ఎలీసబెతులు ఏ పరీక్షను ఎదుర్కొన్నారు? యథార్థంగా ఉన్నందుకు వారెలా ఆశీర్వదించబడ్డారు?
5 దంపతులైన జెకర్యా ఎలీసబెతులు చక్కటి నిర్ణయాలు తీసుకున్నారు, యథార్థంగా నడుచుకున్నారు. ఇద్దరూ ఆధ్యాత్మిక వ్యక్తులనే వివాహం చేసుకున్నారు. జెకర్యా తన యాజకత్వ బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చాడు. అయితే, ఇద్దరూ దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించేందుకు తాము చేయగలిగినదంతా చేశారు. యెహోవాకు కృతజ్ఞత చూపించేందుకు వారికి ఎన్నో కారణాలున్నాయి. కానీ, ఒకవేళ మీరు వాళ్ల ఇంటికి వెళ్లివుంటే, వాళ్లకు ఒకటి కొదువ ఉన్నట్లు మీరు గమనించి ఉండేవారు. ఎలీసబెతు గొడ్రాలు కాబట్టి వారికి పిల్లలు లేరు, అంతేకాక వారిద్దరూ చాలా వృద్ధులు.—లూకా 1:5-7.
6 ప్రాచీన ఇశ్రాయేలులో పిల్లలను కనడాన్ని ఎంతో గౌరవంగా ఎంచేవారు, అంతేకాక కుటుంబాలు తరచూ చాలా పెద్దగా ఉండేవి. (1 సమూ. 1:2, 6, 10; కీర్త. 128:) పూర్వం ఓ ఇశ్రాయేలీయుడు తన భార్యకు పిల్లలు పుట్టకపోతే అన్యాయంగా ఆమెకు విడాకులు ఇచ్చే అవకాశం ఉండేది. కానీ జెకర్యా అలా చేయకుండా ఎలీసబెతు పట్ల నమ్మకంగా ఉన్నాడు. ఆయన గానీ, ఆయన భార్య గానీ విడాకులు తీసుకోవడానికి కుంటి సాకులు వెదకలేదు. పిల్లలు లేకపోవడం వారికి దుఃఖాన్ని మిగిల్చినా, వారిద్దరు కలిసి యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగారు. అయితే సంవత్సరాలు గడిచాక, వృద్ధాప్యంలో వారికి అద్భుతరీతిగా ఒక కుమారుణ్ణి అనుగ్రహించడం ద్వారా యెహోవా వారిని ఆశీర్వదించాడు.— 3, 4లూకా 1:8-13, 17.
7. ఇంకా ఏ విషయంలో ఎలీసబెతు తన భర్త పట్ల యథార్థతను చూపించింది?
7 ఎలీసబెతు మరో విషయంలో కూడా మెచ్చుకోదగిన యథార్థతను చూపించింది. తమకు కుమారుడు పుట్టినప్పుడు జెకర్యా మూగవాడిగా ఉన్నాడు. అంతకుముందు దేవదూత తనకు చెప్పిన మాటలను జెకర్యా నమ్మలేదు కాబట్టి ఆయనకు ఆ శిక్ష విధించబడింది. అయితే, తమ కుమారునికి “యోహాను” అనే పేరు పెట్టమని యెహోవా దూత తనకు చెప్పాడని జెకర్యా తన భార్యకు ఏదోవిధంగా తెలియజేసివుంటాడు. వారి పొరుగువారు, బంధువులు ఆ పిల్లవానికి తండ్రి పేరే పెట్టాలని అన్నారు. అయితే, ఎలీసబెతు తన భర్త ఇచ్చిన నిర్దేశాన్ని నమ్మకంగా పాటించింది. ఆమె ఇలా చెప్పింది: “ఆలాగువద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెను.”—లూకా 1:59-63.
8, 9. (ఎ) యథార్థత వివాహాన్ని ఎలా బలపరుస్తుంది? (బి) భార్యాభర్తలు ఏయే విధాలుగా ఒకరిపట్ల ఒకరు యథార్థత చూపించుకోవచ్చు?
8 జెకర్యా ఎలీసబెతుల్లాగే నేటి వివాహ దంపతులు కూడా నిరుత్సాహాన్ని, ఇతర సవాళ్లను ఎదుర్కొంటుంటారు. దంపతులు ఒకరిపట్ల ఒకరు నమ్మకంగా లేకపోతే వివాహ జీవితం వర్ధిల్లదు. అశ్లీలత, వ్యభిచారం, ఇతరులతో సరసాలాడడం వంటివి దంపతుల్లో ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయేలా చేస్తాయి. అలా జరిగితే, మెల్లమెల్లగా దంపతుల మధ్యవున్న ప్రేమ చల్లారిపోతుంది. ఎవరుపడితేవాళ్లు రాకుండా, ప్రమాదాలు జరగకుండా ఇంటిని కాపాడే గోడలా యథార్థత కుటుంబ సభ్యులను కాపాడుతుంది. భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు యథార్థంగా ఉంటే వారు సురక్షితంగా ఉండవచ్చు, ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. అలాచేస్తే వారి మధ్యవున్న ప్రేమ పెరుగుతుంది. కాబట్టి వివాహంలో యథార్థత చాలా ప్రాముఖ్యం.
9 యెహోవా ఆదాముతో ఇలా అన్నాడు: “పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును.” (ఆది. 2:24) దాని అర్థమేమిటి? దంపతులు తమ పాత స్నేహాలను, బంధాలను సవరించుకోవాల్సి ఉంటుంది. దంపతులు తమ సమయాన్ని, శ్రద్ధను ముందుగా తమ జతకే ఇవ్వాలి. కొత్త కుటుంబాన్ని అశ్రద్ధ చేసే పరిస్థితి వచ్చేలా స్నేహితులు, బంధువులు మునుపటిలా ప్రాధాన్యతను కోరుకోకూడదు. అంతేకాక, దంపతులు కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, తమ మధ్య అభిప్రాయ భేదాలను పరిష్కరించుకునేటప్పుడు తల్లిదండ్రులను జోక్యం చేసుకోనివ్వకూడదు. దంపతులు ఒకరినొకరు హత్తుకొని జీవించాలనేదే దేవుని నిర్దేశం.
10. వివాహ దంపతులు ఎలా యథార్థతను వృద్ధిచేసుకొని కాపాడుకోవచ్చు?
10 భార్య లేదా భర్త అవిశ్వాసి అయినప్పుడు కూడా యథార్థత మంచి ఫలితాలను తీసుకొస్తుంది. అవిశ్వాసియైన భర్త గల ఓ సహోదరి ఇలా అంది: “నా భర్తకు ఎలా లోబడివుండాలో, ఆయనపట్ల ప్రగాఢ గౌరవం ఎలా చూపించాలో నాకు నేర్పించినందుకు నేను యెహోవాకు ఎంతో కృతజ్ఞురాలిని. యథార్థంగా ఉండడంవల్ల 47 సంవత్సరాలుగా మా వివాహంలో ప్రేమా గౌరవాలను కాపాడుకోగలిగాం.” (1 కొరిం. 7:10, 11; 1 పేతు. 3:1, 2) కాబట్టి, మీ వివాహ జత సురక్షితంగా ఉన్నట్లు భావించేలా చేయడానికి బాగా కష్టపడండి. భూమ్మీదున్న వారందరికన్నా మీ భర్తే/భార్యే మీకు అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి అని మీ మాటల ద్వారా, చేతల ద్వారా మీ జతకు చూపించేందుకు ప్రయత్నించండి. సాధ్యమైనంతవరకు మీకూ మీ జతకూ మధ్య ఎవరినీ లేదా దేనినీ రానివ్వకండి. (సామెతలు 5:15-20 చదవండి.) 35కన్నా ఎక్కువ సంవత్సరాలు వివాహ జీవితాన్ని గడిపిన రాన్, జనెట్ అనే దంపతులు ఇలా చెబుతున్నారు: “మేము యెహోవా కోరేవాటిని నమ్మకంగా చేస్తున్నాం కాబట్టే సంతోషకరమైన, విజయవంతమైన వివాహ జీవితాన్ని గడుపుతున్నాం.”
ఐక్యత వివాహాన్ని బలపరుస్తుంది
11, 12. అకుల ప్రిస్కిల్లలు (ఎ) ఇంట్లో, (బి) పనిలో, (సి) క్రైస్తవ పరిచర్యలో ఒకరికొకరు ఎలా సహకరించుకున్నారు?
11 అపొస్తలుడైన పౌలు తన సన్నిహిత స్నేహితులైన అకుల ప్రిస్కిల్లల గురించి మాట్లాడిన ప్రతీసారి వారిద్దరి పేర్లను పక్కపక్కనే ప్రస్తావించాడు. ఎప్పుడూ ఐక్యంగా ఉండే ఈ జంట, భార్యాభర్తలు “ఏక శరీరమైయుందురు” అని దేవుడు చెప్పిన దానికి ఒక మంచి ఉదాహరణ. (ఆది. 2:24) ఇంట్లో, పనిలో, క్రైస్తవ పరిచర్యలో వారెప్పుడూ కలిసి పని చేసేవారు. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు మొదటిసారి కొరింథుకు వచ్చినప్పుడు అకుల ప్రిస్కిల్లలు ఆయనను దయతో తమ ఇంట్లో చేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన బహుశా అక్కడ నుండే కొంతకాలంపాటు తన కార్యకలాపాలను జరిగించివుంటాడు. తర్వాత అకుల ప్రిస్కిల్లలు ఎఫెసులో ఉన్నప్పుడు సంఘ కూటాల కోసం తమ ఇంటిని ఉపయోగించారు, సత్యాన్ని పూర్తిగా గ్రహించేలా అపొల్లో వంటి కొత్తవారికి సహాయం చేశారు. (అపొ. 18:1, 2, 18-26) ఆ తర్వాత, ఉత్సాహంగల ఈ జంట రోముకు వెళ్లారు. అక్కడ కూడా వారు సంఘ కూటాల కోసం తమ ఇంటిని ఉపయోగించారు. అక్కడి సహోదరులను బలపరచి కొంతకాలానికి వారు ఎఫెసుకు తిరిగి వచ్చారు.—రోమా. 16:3, 4.
12 అకుల ప్రిస్కిల్లలు కొంతకాలం పాటు పౌలుతో కలిసి డేరాలు కుట్టే పని చేశారు. ఇక్కడ కూడా వారిద్దరూ కలిసి ఉండడాన్ని, ఎలాంటి పోటీతత్వం, కలహాలు లేకుండా ఒకరికొకరు సహకరించుకోవడాన్ని చూస్తాం. (అపొ. 18:3) అయితే, వారిద్దరు కలిసి క్రైస్తవ కార్యకలాపాల్లో సమయాన్ని వెచ్చించడం ద్వారా యెహోవా సేవకే ప్రాముఖ్యతనిచ్చారు. అలా వారు తమ వివాహాన్ని సంతోషంగా, బలంగా ఉంచుకోగలిగారు. కొరింథు, ఎఫెసు, రోము అలా వారెక్కడికెళ్లినా ‘క్రీస్తు యేసునందు జతపనివారిగా’ పేరుగాంచారు. (రోమా. 16:3) రాజ్యసువార్తను వ్యాప్తి చేయడానికి వారు ఒక జట్టుగా పని చేశారు.
13, 14. (ఎ) ఎలాంటి పరిస్థితుల వల్ల దంపతుల మధ్య ఐక్యత దెబ్బతినవచ్చు? (బి) ‘ఏక శరీరంగా’ తమ వివాహ బంధాన్ని బలపరచుకోవడానికి భార్యాభర్తలు ఏమేమి చేయవచ్చు?
13 భార్యాభర్తలు ఒకేలాంటి లక్ష్యాలు పెట్టుకొని, కలిసి పని చేస్తే వివాహం బలంగా ఉంటుంది. (ప్రసం. 4:9, 10) విచారకరంగా, నేడు చాలామంది దంపతులు కొంచెం సమయం మాత్రమే కలిసి గడుపుతున్నారు. వారు వేర్వేరు ఉద్యోగాల్లో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. కొంతమందైతే తమ పనిని బట్టి ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నారు లేదా తమ ఇంటికి డబ్బులు పంపించడానికి విదేశాలకు వెళ్ళి పనిచేస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది దంపతులు టీవీ చూడడానికి, ఆటలకు, వీడియోగేములకు, ఇంటర్నెట్‌కు మరితర హాబీలకు ఎక్కువ సమయాన్ని వెచ్చించడం వల్ల ఒంటరివాళ్లలా ఉంటున్నారు. మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతోందా? అలాగైతే, మీరు ఎక్కువ సమయం కలిసి గడపగలిగేలా ఏమైనా సర్దుబాట్లు చేసుకోగలరా? వంట చేయడం, అంట్లు కడగడం, తోటపని చేయడం లాంటి రోజువారీ పనుల్లో భాగం వహించే విషయమేమిటి? మీ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవడం లేదా వృద్ధులౌతున్న మీ తల్లిదండ్రులకు సహాయం చేయడం వంటి విషయాల్లో మీరు కలిసి పని చేయగలరా?
14 యెహోవా ఆరాధనకు సంబంధించిన కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి క్రమంగా సమయాన్ని వెచ్చించడం చాలా ప్రాముఖ్యం. దినవచనాన్ని కలిసి చర్చించుకోవడం ద్వారా, కుటుంబ ఆరాధనలో పాల్గొనడం ద్వారా కుటుంబ సభ్యులు తమ ఆలోచనలను, లక్ష్యాలను ఒకేలా ఉంచుకోవచ్చు. అంతేగాక, పరిచర్యలో కలిసి పాల్గొనండి. వీలైతే, కలిసి పయినీరు సేవ చేయండి. మీ పరిస్థితులను బట్టి, కేవలం ఒక నెలైనా సరే లేదా ఒక సంవత్సరమైనా సరే అలా చేయడానికి ప్రయత్నించండి. (1 కొరింథీయులు 15:58 చదవండి.) తన భర్తతో కలిసి పయినీరు సేవ చేసిన ఒక సహోదరి ఇలా చెబుతోంది: “మేము కలిసి సమయం గడిపేందుకు, మాట్లాడుకునేందుకు పరిచర్య ఒక మంచి అవకాశాన్నిచ్చింది. ఇతరులకు ఆధ్యాత్మిక సహాయం చేయాలనే ఒకే లక్ష్యం మా ఇద్దరికీ ఉండేది కాబట్టి, మేము ఒక మంచి జట్టు అని నాకనిపించింది. నేను ఆయనకు ఎంతగా దగ్గరయ్యానంటే ఆయన నాకు భర్త మాత్రమే కాదు, ఒక మంచి స్నేహితుడని కూడా అనిపించింది.” ప్రయోజనకరమైన పనులను కలిసి చేస్తే మీ ఇద్దరి ఇష్టాలు, అలవాట్లు, ప్రాధాన్యతలు ఏకమై అకుల ప్రిస్కిల్లల్లాగే మీరు కూడా క్రమక్రమంగా ‘ఒకే శరీరంలా’ ఆలోచిస్తారు, భావిస్తారు, పనిచేస్తారు.
ఆధ్యాత్మికత మిమ్మల్ని నిర్దేశించనివ్వండి
15. వివాహం విజయవంతమవ్వాలంటే ఏది ప్రాముఖ్యం? వివరించండి.
15 వివాహ జీవితంలో దేవునికి మొదటి స్థానమివ్వడం ఎంత ప్రాముఖ్యమో యేసుకు తెలుసు. ఎందుకంటే, యెహోవా మొట్టమొదటి వివాహాన్ని జరిపించడం ఆయన చూశాడు. ఆదాముహవ్వలు దేవుని నిర్దేశాన్ని పాటించినంత కాలం ఎంత సంతోషంగా ఉన్నారో, ఆ తర్వాత దాన్ని పాటించకపోవడం వల్ల ఎలాంటి కష్టాలు వచ్చాయో ఆయన చూశాడు. అందుకే యేసు ఇతరులకు బోధించినప్పుడు ఆదికాండము 2:24లో తన తండ్రి ఇచ్చిన ఉపదేశాన్ని ఎత్తి చెప్పాడు. అంతేగాక, దానికి ఈ మాటల్ని జతచేశాడు: “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.” (మత్త. 19:6) కాబట్టి, నేడు కూడా వివాహ జీవితం సంతోషంగా ఉండాలన్నా, అది విజయవంతమవ్వాలన్నా యెహోవా పట్ల ప్రగాఢ గౌరవం ఉండడం ప్రాముఖ్యం. యేసు భూమ్మీదున్నప్పుడు ఆయనకు తల్లిదండ్రులుగా ఉన్న యోసేపు మరియలు ఈ విషయంలో చక్కని మాదిరి ఉంచారు.
16. తమ వివాహ జీవితంలో యోసేపు మరియలు ఆధ్యాత్మికతను ఎలా కనబరిచారు?
16 మరియపట్ల యోసేపు దయను, గౌరవాన్ని చూపించాడు. మరియ గర్భవతి అని తెలిసినప్పుడు, ఆమెకు ఏమి జరిగిందో దేవదూత ఆయనకు వివరించకముందే యోసేపు ఆమెతో దయగా వ్యవహరించాలనుకున్నాడు. (మత్త. 1:18-20) దంపతులుగా వారు కైసరు ఆజ్ఞలకు లోబడ్డారు, మోషే ధర్మశాస్త్రాన్ని తూ.చా. తప్పకుండా పాటించారు. (లూకా 2:1-5, 21, 22) యెరూషలేములో జరిగే ముఖ్యమైన మతసంబంధ పండుగలకు మగవాళ్లు మాత్రమే తప్పక హాజరుకావాల్సివున్నా యోసేపు మరియలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రతీ సంవత్సరం వాటికి హాజరయ్యేవారు. (ద్వితీ. 16:16; లూకా 2:41) అంతేకాక, దైవభక్తిగల ఈ దంపతులు మరితర విధాలుగా కూడా యెహోవాను సంతోషపెట్టేందుకు, ఆధ్యాత్మిక విషయాలపట్ల ప్రగాఢ గౌరవాన్ని చూపించేందుకు కృషిచేశారు. కాబట్టే యెహోవా, తన కుమారుడు భూమిపై జీవించిన తొలి సంవత్సరాల్లో ఆయనను చూసుకునేందుకు వారిని ఎంపిక చేశాడు.
17, 18. (ఎ) దంపతులు ఏయే విధాలుగా తమ కుటుంబంలో ఆధ్యాత్మికతకు మొదటి స్థానమివ్వవచ్చు? (బి) అలా చేస్తే వారెలా ప్రయోజనం పొందుతారు?
17 మీ కుటుంబ జీవితాన్ని కూడా ఆధ్యాత్మికత నిర్దేశిస్తోందా? ఉదాహరణకు, ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ముందుగా బైబిలు సూత్రాలను పరిశీలించి, ఆ విషయం గురించి ప్రార్థించి, తర్వాత సలహా కోసం పరిణతి చెందిన క్రైస్తవులను అడుగుతారా? లేదా మీరు మీ సొంత అభిప్రాయాలను బట్టి, కుటుంబ సభ్యుల లేదా స్నేహితుల అభిప్రాయాలను బట్టి సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారా? వివాహానికి, కుటుంబ జీవితానికి సంబంధించి నమ్మకమైన దాసుడు ప్రచురిస్తున్న ఆచరణాత్మకమైన సలహాలను పాటించేందుకు మీరు కృషిచేస్తారా? లేదా గుడ్డిగా స్థానిక పద్ధతులను, ప్రజాదరణ పొందిన ఇతర సలహాలను మీరు పాటిస్తారా? మీరిద్దరూ కలిసి క్రమంగా ప్రార్థిస్తూ, అధ్యయనం చేస్తూ, ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకుంటూ మీ కుటుంబ ప్రాధాన్యతలేమిటో చర్చించుకుంటారా?
18 తమ 50 ఏళ్ల సంతోషకరమైన వివాహ జీవితం గురించి రేమండ్ ఇలా అంటున్నాడు: “మా ‘మూడు పేటల త్రాడులో’ యెహోవాను భాగంగా చేసుకున్నాం కాబట్టి మాకు ఎలాంటి సమస్య ఎదురైనా దాన్ని మేము పరిష్కరించుకోగలిగాం.” (ప్రసంగి 4:12 చదవండి.) డాన్నీ, ట్రీనలు కూడా వారితో ఏకీభవిస్తున్నారు. వారు ఇలా అంటున్నారు: “మేమిద్దరం కలిసి దేవుణ్ణి సేవించడం వల్ల మా వివాహం మరింతగా బలపడింది.” వారు 34కన్నా ఎక్కువ సంవత్సరాలుగా వివాహ జీవితాన్ని ఆనందిస్తున్నారు. మీరెల్లప్పుడూ యెహోవాకు మొదటి స్థానమిస్తే, మీ వివాహ జీవితం విజయవంతమయ్యేలా ఆయన మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని మెండుగా ఆశీర్వదిస్తాడు.—కీర్త. 127:1.
దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని గౌరవిస్తూ ఉండండి
19. యెహోవా వివాహమనే ఆశీర్వాదాన్ని ఎందుకు ఇచ్చాడు?
19 నేడు చాలామంది తమ వ్యక్తిగత సంతోషం కోసమే ప్రాకులాడుతారు. కానీ యెహోవా సేవకులు అలా చేయరు. వివాహమనేది, తన సంకల్పాన్ని నెరవేర్చేందుకు దేవుడిచ్చిన ఓ ఆశీర్వాదమని వారికి తెలుసు. (ఆది. 1:26-28) ఆదాముహవ్వలు ఆ ఆశీర్వాదాన్ని గౌరవించివుంటే, ఈ భూమంతా పరదైసుగా తయారై సంతోషభరితమైన, నీతిమంతులైన దేవుని సేవకులతో నిండివుండేది.
20, 21. (ఎ) వివాహాన్ని మనం ఎందుకు పవిత్రమైనదిగా పరిగణించాలి? (బి) తర్వాతి వారంలో ఏ ఆశీర్వాదం గురించి పరిశీలిస్తాం?
20 అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యెహోవా సేవకులు ఆయనను మహిమపరిచేందుకు వివాహాన్ని ఓ అవకాశంగా పరిగణిస్తారు. (1 కొరింథీయులు 10:31 చదవండి.) మనం చూసినట్లుగా యథార్థత, ఐక్యత, ఆధ్యాత్మికత వంటి దైవిక లక్షణాలు వివాహాన్ని బలపరుస్తాయి. కాబట్టి మనం వివాహానికి సిద్ధపడుతున్నా, దాన్ని బలపరుచుకోవాలనుకుంటున్నా లేదా కాపాడుకోవాలనుకుంటున్నా ముందుగా, వివాహమనేది దేవుడు చేసిన పవిత్రమైన ఏర్పాటని గుర్తించాలి. ఈ వాస్తవాన్ని గుర్తుపెట్టుకుంటే, వివాహానికి సంబంధించిన నిర్ణయాలను దేవుని వాక్యం ఆధారంగా తీసుకోవడానికి వీలైనంతగా కృషిచేస్తాం. అలా మనం వివాహమనే ఆశీర్వాదాన్ని, దాన్నిచ్చిన యెహోవా దేవుణ్ణి గౌరవిస్తాం.
21 అయితే, దేవుడిచ్చిన ఆశీర్వాదాల్లో కేవలం వివాహం ఒక్కటే లేదు. లేదా జీవితం సంతోషంగా ఉండాలంటే అదొక్కటే మార్గం కాదు. తర్వాతి ఆర్టికల్‌లో, దేవుడు మనకిచ్చిన మరో ఆశీర్వాదమైన ఒంటరితనం గురించి పరిశీలిస్తాం.
మీరెలా జవాబిస్తారు?
• యథార్థత ఉంటే వివాహిత క్రైస్తవులు ఎలా నడుచుకుంటారు?
• ఐక్యంగా కలిసి పనిచేయడం వల్ల వివాహ జీవితం ఎలా బలపడుతుంది?
• ఆధ్యాత్మికత తమను నిర్దేశిస్తోందని దంపతులు ఏయే విధాలుగా చూపించవచ్చు?
• వివాహాన్ని ఏర్పాటు చేసిన యెహోవాపట్ల మనమెలా గౌరవాన్ని చూపించవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
[15వ పేజీలోని చిత్రాలు]
కలిసి పనిచేయడం వల్ల దంపతులు ఐక్యంగా ఉండగలుగుతారు