శోధనను ఎదిరించడానికి, నిరుత్సాహాన్ని అధిగమించడానికి శక్తిని పొందాం
శోధనను ఎదిరించడానికి, నిరుత్సాహాన్ని అధిగమించడానికి శక్తిని పొందాం
“పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు.”—అపొ. 1:8.
1, 2. తన శిష్యులకు దేని సహాయం ఉంటుందని యేసు వాగ్దానం చేశాడు? అది వారికి ఎందుకు అవసరం?
తన శిష్యులు సొంత శక్తితో తాను ఆజ్ఞాపించినవాటన్నిటినీ నెరవేర్చలేరని యేసుకు తెలుసు. ప్రకటనా పనితో చేరాల్సిన దూరాలను, వ్యతిరేకుల బలాన్ని, మానవ బలహీనతలను బట్టి చూస్తే వారికి మానవాతీత శక్తి అవసరమని స్పష్టమైంది. యేసు పరలోకానికి వెళ్లిపోయే ముందు తన శిష్యులకు ఈ అభయాన్నిచ్చాడు: “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.”—అపొ. 1:8.
2 యెరూషలేమును సువార్తతో నింపేలా సా.శ. 33 పెంతెకొస్తు రోజున యేసు శిష్యులపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు ఆ వాగ్దానం నెరవేరడం మొదలైంది. వ్యతిరేకతలేవీ వారి పనిని ఆపలేకపోయాయి. (అపొ. 4:20) మనతో సహా యేసు నమ్మకమైన అనుచరులందరికీ దేవుడిచ్చే శక్తి “యుగసమాప్తి వరకు సదాకాలము” ఎంతో అవసరం.—మత్త. 28:20.
3. యెహోవా ఇచ్చే శక్తితో మనం ఏమి చేయగలుగుతాం?
3 ‘పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారు శక్తి పొందుతారని’ యేసు తన శిష్యులకు వాగ్దానం చేశాడు. యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చే శక్తితో మన క్రైస్తవ సమర్పణకు తగినట్లు జీవించగలుగుతాం. అంతేకాక, మనమీదికి అప్పుడప్పుడు వచ్చే ప్రతికూల ప్రభావాల్ని సహితం ఎదిరించగలుగుతాం.—మీకా 3:8; కొలొస్సయులు 1:29 చదవండి.
4. మనం ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం? ఎందుకు?
4 పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే శక్తి ఎలా పనిచేస్తుంది? పరిశుద్ధాత్మ నిర్దేశం వల్ల వివిధ పరిస్థితుల్లో ఎలాంటి ఫలితాలు రావచ్చు? యెహోవాను నమ్మకంగా సేవించడానికి మనం ప్రయత్నిస్తుండగా సాతాను వల్ల, అతడి లోకం వల్ల లేదా సొంత అపరిపూర్ణ శరీరం వల్ల ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటాం. క్రైస్తవులముగా కొనసాగేందుకు, పరిచర్యలో క్రమంగా పాల్గొనేందుకు, యెహోవాతో మనకున్న మంచి సంబంధాన్ని కాపాడుకునేందుకు మనం అలాంటి అడ్డంకులను అధిగమించడం ఎంతో అవసరం. అయితే శోధనను ఎదిరించడానికి, అలసటనూ నిరుత్సాహాన్నీ అధిగమించడానికి పరిశుద్ధాత్మ మనకు ఎలా సహాయం చేస్తుందో ఇప్పుడు చూద్దాం.
శోధనను ఎదిరించడం
5. ప్రార్థన వల్ల మనం శక్తిని ఎలా పొందుతాం?
5 ఇలా ప్రార్థించమని యేసు తన శిష్యులకు నేర్పించాడు: “మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.” (మత్త. 6:13) అలా ప్రార్థించే నమ్మకమైన సేవకులను యెహోవా విడిచిపెట్టడు. యేసు మరో సందర్భంలో ఇలా అన్నాడు: “పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును.” (లూకా 11:13) సరైనది చేయడానికి సహాయం చేసే ఈ శక్తిని ఇస్తానని యెహోవా చేసిన వాగ్దానం మనకు ఎంత ధైర్యాన్నిస్తుంది! అలాగని, యెహోవా మనకు శోధనలు రాకుండా ఆపుతాడని కాదు. (1 కొరిం. 10:13) అయితే, మనకు ప్రత్యేకంగా శోధనలు ఎదురైనప్పుడు మరింత తీవ్రంగా ప్రార్థించాలి.—మత్త. 26:42.
6. సాతాను తనను శోధించినప్పుడు యేసు దేని ఆధారంగా జవాబిచ్చాడు?
6 సాతాను తనను శోధించినప్పుడు యేసు లేఖనాలను ఉపయోగిస్తూ జవాబిచ్చాడు. “వ్రాయబడియున్నది . . . మరియొకచోట వ్రాయబడియున్నది . . . సాతానా, పొమ్ము—ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నది” అని అన్నప్పుడు దేవుని వాక్యం స్పష్టంగా ఆయన మనసులో ఉంది. యెహోవాపై, ఆయన వాక్యంపై ఉన్న ప్రేమ వల్లే తన ముందు సాతాను ఉంచిన శోధనలను యేసు తిరస్కరించగలిగాడు. (మత్త. 4:1-10) పదేపదే శోధించినా యేసు లొంగకపోవడంతో సాతాను ఆయనను విడిచి వెళ్లిపోయాడు.
7. శోధనలను ఎదిరించడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుంది?
7 అపవాది శోధనలను ఎదిరించడానికి యేసు లేఖనాలపై ఆధారపడ్డాడంటే, మనం ఇంకెంత ఎక్కువగా అలా చేయాలి! అపవాదిని ఎదిరించాలంటే, ముందుగా దేవుని ప్రమాణాలేమిటో తెలుసుకోవాలనే, వాటిని పూర్తిగా పాటించాలనే కృతనిశ్చయం మనకు ఉండాలి. లేఖనాలను అధ్యయనం చేయడం వల్ల, దేవుని జ్ఞానాన్ని, ఆయన నీతిని అర్థం చేసుకున్నందువల్ల చాలామంది బైబిలు ప్రమాణాల ప్రకారం జీవించాలని నిర్ణయించుకున్నారు. ‘దేవుని వాక్యానికి హృదయ తలంపులను, ఆలోచనలను’ శోధించే శక్తి ఉంది. (హెబ్రీ. 4:12) ఒక వ్యక్తి ఎంతెక్కువగా లేఖనాలను చదివి, ధ్యానిస్తే అంతెక్కువగా ‘యెహోవా సత్యాన్ని’ గురించిన లోతైన జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాడు. (దాని. 9:13) అందుకే, మనం మన బలహీనతలకు సంబంధించిన లేఖనాలను ధ్యానించాలి.
8. మనం వేటి ద్వారా పరిశుద్ధాత్మను పొందవచ్చు?
8 యేసుకు లేఖనాల గురించి తెలిసి ఉండడమేకాక, తాను “పరిశుద్ధాత్మ పూర్ణుడై” ఉన్నాడు కాబట్టే శోధనను ఎదిరించగలిగాడు. (లూకా 4:1) మనం కూడా అలాంటి శక్తిని, సామర్థ్యాన్ని కలిగివుండాలంటే యెహోవాకు దగ్గరవ్వాలి. దానికోసం మనలో తన పరిశుద్ధాత్మను నింపడానికి ఆయన చేసిన ఏర్పాట్లను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. (యాకో. 4:7, 8) ఆ ఏర్పాట్లలో బైబిలు అధ్యయనం, ప్రార్థన, తోటి విశ్వాసులతో సహవాసం వంటివి ఉన్నాయి. క్షేమాభివృద్ధికరమైన ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి నిలిపేలా చేసే క్రైస్తవ కార్యకలాపాల్లో నిమగ్నం కావడంవల్ల ప్రయోజనం చేకూరుతుందని కూడా చాలామంది అర్థం చేసుకున్నారు.
9, 10. (ఎ)క్రైస్తవులకు ఎలాంటి శోధనలు ఎదురౌతుంటాయి? (బి)ధ్యానించడం, ప్రార్థించడం ద్వారా, అలసిపోయినప్పుడు కూడా శోధనను ఎదిరించడానికి కావాల్సిన శక్తిని మీరెలా పొందవచ్చు?
9 మీరు ఎలాంటి శోధనలను ఎదిరించాల్సిరావచ్చు? మీ వివాహ జతకాని వ్యక్తితో సరసాలాడేలా మీరు ఎప్పుడైనా శోధించబడ్డారా? మీరు అవివాహితులైతే, ఓ అవిశ్వాసితో డేటింగ్ చేయాలనే బలమైన శోధన ఎప్పుడైనా ఎదురైందా? టీవీ చూస్తున్నప్పుడు లేదా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నప్పుడు, అపవిత్రమైనవాటిని చూడాలన్న శోధన అకస్మాత్తుగా క్రైస్తవులకు ఎదురుకావచ్చు. అలాంటి పరిస్థితి మీకు ఎదురైందా? అప్పుడు మీరేమి చేశారు? ఒక తప్పు మరో తప్పుకు దారితీసి చివరకు గంభీరమైన పాపానికి ఎలా నడిపిస్తుందో ధ్యానించడం తెలివైన పని. (యాకో. 1:14, 15) ఒకవేళ మీరు ఏదైనా గంభీరమైన పాపం చేస్తే యెహోవాను, సంఘాన్ని, మీ కుటుంబాన్ని ఎంత దుఃఖపెడతారో ఒక్కసారి ఆలోచించండి. అదే, మీరు దైవిక సూత్రాలను నమ్మకంగా పాటిస్తే మంచి మనస్సాక్షిని కలిగివుంటారు. (కీర్తన 119:37; సామెతలు 22:3 చదవండి.) మీకు అలాంటి శోధనలు వచ్చిన ప్రతీసారి వాటిని ఎదిరించడానికి కావాల్సిన బలం కోసం ప్రార్థించండి.
10 అయితే, సాతాను శోధనల గురించి మనం గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. అరణ్యంలో యేసు 40 రోజులపాటు ఉపవాసమున్న తర్వాత సాతాను ఆయన దగ్గరికి వచ్చాడు. యేసు యథార్థతను పరీక్షించడానికి అదే “తగిన సమయము” అని సాతాను ఖచ్చితంగా అనుకొనివుంటాడు. (లూకా 4:13, క్యాతలిక్ అనువాదము) మన యథార్థతను పరీక్షించడానికి కూడా సాతాను తగిన సమయం కోసం వేచి చూస్తాడు. కాబట్టి, మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉండడం ఎంతో ప్రాముఖ్యం. తరచూ మనం అత్యంత బలహీనంగా ఉన్నామని గ్రహించినప్పుడే సాతాను మనపై దాడి చేస్తాడు. కాబట్టి, మనం అలసిపోయినప్పుడు లేదా నిరుత్సాహానికి గురైనప్పుడు మనల్ని కాపాడమని, తన పరిశుద్ధాత్మను ఇవ్వమని మరెక్కువగా యెహోవాను వేడుకోవాలి.—2 కొరిం. 12:8-10.
అలసట, నిరుత్సాహం
11, 12. (ఎ)నేడు చాలామంది ఎందుకు నిరుత్సాహానికి గురౌతున్నారు? (బి) నిరుత్సాహాన్ని అధిగమించడానికి కావాల్సిన శక్తిని మనమెలా పొందవచ్చు?
11 మనం అపరిపూర్ణులం కాబట్టి, అప్పుడప్పుడు నిరుత్సాహానికి గురౌతుంటాం. అంతేకాక, మనం ఎంతో ఒత్తిడిని కలుగజేసే కాలాల్లో జీవిస్తున్నాం కాబట్టి అలా జరిగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంది. మానవులు మునుపెన్నటికన్నా అత్యంత కష్టభరితమైన కాలాల్లో ఇప్పుడు జీవిస్తున్నారని చెప్పవచ్చు. (2 తిమో. 3:1-5) హార్‌మెగిద్దోను సమీపిస్తుండగా ఆర్థిక, భావోద్వేగ, మరితర ఒత్తిళ్లు అంతకంతకూ ఎక్కువౌతున్నాయి. అందుకే, కొంతమందికి తమ కుటుంబాలను సంరక్షించే, పోషించే బాధ్యతను నిర్వర్తించడం అంతకంతకూ కష్టమైపోతోందంటే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. తాము నీరసించి, కృంగి, కృశించిపోయినట్లు వారు భావిస్తున్నారు. ఒకవేళ మీకు కూడా అలాంటి ఒత్తిడే ఎదురైతే దాన్ని మీరెలా అధిగమించవచ్చు?
12 దేవుని పరిశుద్ధాత్మను సహాయంగా ఇస్తానని యేసు తన శిష్యులకు అభయమిచ్చాడనే విషయాన్ని గుర్తుంచుకోండి. (యోహాను 14:16, 17 చదవండి.) దేవుని పరిశుద్ధాత్మ విశ్వంలోనే అత్యంత బలమైన శక్తి. ఆ శక్తిని ఉపయోగించి యెహోవా మనమెలాంటి పరీక్షలనైనా సహించడానికి కావాల్సిన బలాన్ని “అత్యధికముగా” ఇస్తాడు. (ఎఫె. 3:20) మనం అన్నివైపుల నుండి “శ్రమపడుచున్నను” ఆ శక్తిపై ఆధారపడితే, ‘బలాధిక్యాన్ని’ పొందుతామని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (2 కొరిం. 4:7, 8) మనకు వచ్చే ఒత్తిడిని తీసేస్తానని యెహోవా మాటివ్వడం లేదు కానీ, తన ఆత్మ ద్వారా మనం ఆ ఒత్తిడిని అధిగమించడానికి కావాల్సిన బలాన్నిస్తానని అభయమిస్తున్నాడు.—ఫిలి. 4:13.
13. (ఎ)ఓ కష్టతరమైన పరిస్థితిని అధిగమించడానికి కావాల్సిన శక్తిని ఒక యౌవనస్థురాలు ఎలా పొందింది? (బి) అలాంటి అనుభవాలేమైనా మీకు తెలుసా?
13 క్రమ పయినీరుగా సేవచేస్తున్న స్టెఫనీ అనే 19 ఏళ్ల సహోదరి ఉదాహరణనే తీసుకోండి. 12 ఏళ్ల వయసులో తనకు పక్షవాతం వచ్చినప్పుడు, తన మెదడులో కంతి ఉందని తేలింది. ఆ తర్వాత ఆమెకు రెండు ఆపరేషన్లు అయ్యాయి, రేడియేషన్ చికిత్స జరిగింది. అంతేకాక, మళ్లీ రెండుసార్లు పక్షవాతం రావడంతో ఆమె శరీరంలోని ఎడమ భాగం కొంతవరకు చచ్చుబడిపోయింది, చూపు కూడా మందగించింది. తనకు అత్యంత ప్రాముఖ్యమని అనిపించిన విషయాల కోసం అంటే క్రైస్తవ కూటాలు, క్షేత్ర సేవ వంటివాటి కోసం తన బలాన్ని కాపాడుకోవాలి. అయినా, ఎన్నో విధాలుగా సహించడానికి కావాల్సిన శక్తిని, యెహోవా తన ఆత్మ ద్వారా ఇస్తున్నాడని ఆమె భావిస్తోంది. తాను కృంగిపోయిన సందర్భాల్లో, బైబిలు ఆధారిత ప్రచురణల్లో ఉండే తోటి క్రైస్తవుల అనుభవాలు ఆమెకు బలాన్నిచ్చాయి. సహోదర సహోదరీలు ఆమెకు ఉత్తరాలు రాయడం ద్వారా, కూటాలకు ముందూ తర్వాతా తనతో ప్రోత్సాహకరంగా మాట్లాడడం ద్వారా ఆమెను బలపర్చారు. బైబిలు అధ్యయనం కోసం ఆసక్తిగలవారు తన ఇంటికే రావడం ద్వారా ఆమె బోధిస్తున్న దానిపట్ల కృతజ్ఞత చూపించారు. వీటన్నిటినిబట్టి తాను యెహోవాకు ఎంతో రుణపడివున్నానని ఆమె భావిస్తోంది. కీర్తన 41:3 తనకు చాలా ఇష్టమైన లేఖనం. ఆ లేఖనం తన విషయంలో నెరవేరిందని ఆమె నమ్ముతోంది.
14. నిరుత్సాహానికి గురైనప్పుడు మనం ఏమి చేయకూడదు? ఎందుకు?
14 అలసిపోయినప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు, కొన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉంటే దాన్ని అధిగమించవచ్చని అనుకోవడం తెలివైన పని కాదు. ఎందుకంటే వ్యక్తిగత అధ్యయనం, కుటుంబ బైబిలు అధ్యయనం, క్షేత్ర సేవ, కూటాలు వంటివాటి ద్వారానే మనం నూతనోత్తేజాన్నిచ్చే పరిశుద్ధాత్మను పొందుతాం. క్రైస్తవ కార్యకలాపాలు ఎప్పుడూ విశ్రాంతినిచ్చే విధంగా ఉంటాయి. (మత్తయి 11:28, 29 చదవండి.) చాలాసార్లు సహోదర సహోదరీలు కూటాలకు అలసిపోయి వస్తారు. కానీ కూటం ముగిసే సమయానికల్లా వారు కొత్త బలాన్ని పొందుతారు.
15. (ఎ) క్రైస్తవులుగా ఉండడాన్ని సులభతరం చేస్తానని యెహోవా మాటిస్తున్నాడా? లేఖనాలతో వివరించండి. (బి) దేవుడు మనకు ఏ వాగ్దానం చేశాడు? మనకు ఏ ప్రశ్న రావచ్చు?
15 క్రీస్తు శిష్యులుగా ఉండడం తేలికైన విషయమని దానర్థం కాదు. నమ్మకమైన క్రైస్తవులుగా ఉండాలంటే ఎంతో కృషి చేయాల్సివుంటుంది. (మత్త. 16:24-26; లూకా 13:24) అయితే, అలసిపోయినవారికి యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా బలాన్ని ఇవ్వగలడు. “యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు” అని యెషయా ప్రవక్త రాశాడు. (యెష. 40:29-31) మరైతే, క్రైస్తవ కార్యకలాపాలు అలసట కలిగిస్తున్నాయని మనకెందుకు అనిపించవచ్చు?
16. అలసటకు లేదా నిరుత్సాహానికి దారితీసే కార్యకలాపాలను మనం ఎలా తగ్గించుకోవచ్చు?
16 “శ్రేష్ఠమైన కార్యములను వివేచిం[చమని]” యెహోవా వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. (ఫిలి. 1:9, 10) క్రైస్తవ జీవితాన్ని సుదీర్ఘమైన పరుగు పందెంతో పోలుస్తూ అపొస్తలుడైన పౌలు దేవుని ప్రేరేపణతో ఇలా రాశాడు: “మనముకూడ ప్రతిభారమును . . . విడిచిపెట్టి . . . మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.” (హెబ్రీ. 12:1) మనకు అలసట కలిగించే అనవసరమైన విషయాలకు, భారాలకు దూరంగా ఉండాలని ఆయన ఆ మాటల ద్వారా సూచించాడు. అప్పటికే తమకు ఎన్నో పనులున్నా కొందరు అనవసరంగా మరిన్ని పనులు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. తరచూ అలసిపోయినట్లు, ఒత్తిడికి లోనైనట్లు మీకనిపిస్తుంటే, మీరు మీ ఉద్యోగం కోసం ఎంత శక్తిని ఉపయోగిస్తున్నారో, వినోదం కోసం మీరు ఎన్నిసార్లు ప్రయాణాలు చేస్తున్నారో, ఆటల కోసం లేదా ఖాళీ సమయంలో చేసే ఇతర పనుల కోసం మీరెంత తీవ్రంగా కృషి చేస్తున్నారో పరిశీలించుకుంటే మీరు ప్రయోజనం పొందుతారు. మనకు సహేతుకత, అణకువ ఉన్నట్లయితే మన పరిమితులేమిటో గ్రహించి అనవసరమైన కార్యకలాపాలను తగ్గించుకుంటాం.
17. కొందరు ఎందుకు నిరుత్సాహపడవచ్చు? ఈ విషయంలో యెహోవా ఏమని అభయమిస్తున్నాడు?
17 మనలో కొందరు, ఈ విధానాంతం తాము అనుకున్నంత త్వరగా రాలేదని కొంత నిరుత్సాహపడవచ్చు. (సామె. 13:12) అయితే, అలాంటివారు హబక్కూకు 2:3 నుండి ప్రోత్సాహాన్ని పొందవచ్చు. అక్కడ ఇలా ఉంది: “ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.” తాను నిర్ణయించిన సమయానికి ఖచ్చితంగా అంతం వస్తుందని యెహోవా మనకు అభయమిస్తున్నాడు.
18. (ఎ)ఏ వాగ్దానాలు మీకు బలాన్నిస్తున్నాయి? (బి) తర్వాతి ఆర్టికల్ నుండి మనమెలా ప్రయోజనం పొందుతాం?
18 అలసట, నిరుత్సాహం ఉండని రోజు కోసం, భూమ్మీద జీవించే వారంతా తమ ‘యౌవన బలాన్ని’ కలిగి ఉండే రోజు కోసం నమ్మకమైన యెహోవా సేవకులందరూ ఎదురుచూస్తున్నారు. (యోబు 33:25, NW) అయితే, మనకు నూతనోత్తేజాన్నిచ్చే ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటుండగా, పరిశుద్ధాత్మ ద్వారా మనం ఇప్పుడు కూడా అంతరంగ బలాన్ని పొందవచ్చు. (2 కొరిం. 4:16; ఎఫె. 3:15, 16) అలసట కారణంగా నిత్యాశీర్వాదాలను కోల్పోయే పరిస్థితి రాకుండా చూసుకోండి. శోధన వల్ల, అలసట వల్ల, నిరుత్సాహం వల్ల వచ్చిన ఎలాంటి పరీక్షలైనా గతించిపోతాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా దేవుని రాజ్యంలో గతించిపోతాయి. తోటివారి నుండి వచ్చే హానికరమైన ఒత్తిడిని ఎదిరించేందుకు, హింసను, ఇతర కష్టాలను సహించేందుకు క్రైస్తవులకు పరిశుద్ధాత్మ ఎలా శక్తినిస్తుందో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
మీరెలా జవాబిస్తారు?
•బైబిలు అధ్యయనం వల్ల ఎలా శక్తిని పొందుతాం?
•ప్రార్థించడం వల్ల, ధ్యానించడం వల్ల ఎలా శక్తిని పొందుతాం?
•నిరుత్సాహానికి దారితీసే కార్యకలాపాలను మనం ఎలా తగ్గించుకోవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
[ర్తి పేజీ చిత్రం 24]
క్రైస్తవ కూటాలు మనల్ని ఆధ్యాత్మికంగా బలపర్చగలవు