కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని ఆమోదాన్ని సంపాదించుకుంటే నిత్యజీవాన్ని పొందుతాం

దేవుని ఆమోదాన్ని సంపాదించుకుంటే నిత్యజీవాన్ని పొందుతాం

దేవుని ఆమోదాన్ని సంపాదించుకుంటే నిత్యజీవాన్ని పొందుతాం

“యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో [‘ఆమోదంతో,’ NW] కప్పెదవు.”—కీర్త. 5:12.

1, 2. సారెపతులోని ఓ విధవరాలిని ఏలీయా ఏమి అడిగాడు? ఆమెకు ఏ అభయాన్ని ఇచ్చాడు?

 సారెపతులోని ఓ విధవరాలు, ఆమె కుమారుడు ఆకలితో ఉన్నారు. అంతేకాక, దేవుని ప్రవక్త కూడా ఆకలితో ఉన్నాడు. పొయ్యి అంటించడానికి ఆమె సిద్ధపడుతుండగా ప్రవక్తయైన ఏలీయా నీళ్లు, రొట్టె ఇవ్వమని ఆమెను అడిగాడు. ఆమె ఆయనకు తాగడానికి ఏదో ఒకటి ఇవ్వాలనుకుంది. అయితే, ఆమె దగ్గర ‘తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె’ మాత్రమే ఉన్నాయి. ప్రవక్తకు ఇవ్వడానికి తన దగ్గరున్నది సరిపోదనుకొని ఆమె ఆ విషయాన్ని ఆయనకు చెప్పింది.—1 రాజు. 17:8-12.

2 ఆమె అలా చెప్పిన తర్వాత కూడా ఏలీయా ఇలా అన్నాడు: “అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము . . . ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి యున్నాడు.”—1 రాజు. 17:13-15.

3. మన ముందు ఏ ప్రాముఖ్యమైన ప్రశ్న ఉంది?

3 ఆ విధవరాలు, తన దగ్గరున్న కొంచెం ఆహారాన్ని పంచుకోవాలా వద్దా అనేదాని కన్నా మరింత ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తనను, తన కుమారుణ్ణి యెహోవా కాపాడతాడని నమ్ముతుందా? లేక దేవుని ఆమోదాన్ని, స్నేహాన్ని సంపాదించుకోవడం కన్నా తన భౌతిక అవసరాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుందా? మన ముందు కూడా అలాంటి ప్రశ్నే ఉంది. మనం, వస్తుపరమైన భద్రత కన్నా యెహోవా ఆమోదాన్ని సంపాదించుకోవడం గురించే ఎక్కువగా ఆలోచిస్తామా? యెహోవాను నమ్మడానికి, సేవించడానికి ఎన్నో కారణాలున్నాయి. ఆయన ఆమోదం కోసం ప్రయత్నించి, దాన్ని సంపాదించుకోవాలంటే మనం కొన్ని చర్యలు తీసుకోవాలి.

‘నీవు ఆరాధనను పొందడానికి అర్హుడవు’

4. యెహోవా మన ఆరాధనను పొందడానికి ఎందుకు అర్హుడు?

4 తాను ఇష్టపడే విధంగా మానవులు తనను సేవించాలని ఆశించే హక్కు యెహోవాకు ఉంది. పరలోకంలోవున్న ఆయన సేవకులంతా ఆ నిజాన్ని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. వారు ఇలా అన్నారు: “[యెహోవా], మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు.” (ప్రక. 4:10, 11) సమస్తాన్ని సృష్టించింది యెహోవాయే కాబట్టి మన ఆరాధనను పొందడానికి ఆయన అర్హుడు.

5. దేవుడు మనపై చూపిస్తున్న ప్రేమనుబట్టి ఆయనను సేవించేలా మనమెందుకు పురికొల్పబడతాం?

5 యెహోవా మనపట్ల సాటిలేని ప్రేమను చూపిస్తున్నందుకు కూడా మనం ఆయనను సేవిస్తాం. బైబిలు ఇలా చెబుతోంది: “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.” (ఆది. 1:27) మానవునికి స్వేచ్ఛాచిత్తం ఉంది. దేవుడు మానవునికి ఆలోచించే, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఇచ్చాడు. జీవాన్ని ఇవ్వడం ద్వారా యెహోవా మనకు తండ్రి అయ్యాడు. (లూకా 3:38) ఓ మంచి తండ్రిలా యెహోవా తన కుమారులు, కుమార్తెలు జీవితాన్ని ఆనందించడానికి అవసరమైనవన్నీ ఇచ్చాడు. అందమైన పరిసరాల్లో భూమి సమృద్ధిగా మనకు ఆహారాన్ని ఇచ్చేలా యెహోవా ‘తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు.’—మత్త. 5:45.

6, 7. (ఎ) ఆదాము తన సంతానమంతటికీ ఏ హాని చేశాడు? (బి) దేవుని ఆమోదం కోసం ప్రయత్నించే వారికి క్రీస్తు బలి ఏమి చేస్తుంది?

6 అంతేకాక, పాపం వల్ల వచ్చిన భయంకరమైన పరిణామాల నుండి యెహోవా మనల్ని కాపాడాడు. పాపం చేసి యెహోవాకు ఎదురు తిరగడం ద్వారా ఆదాము, జూదమాడేందుకు ఇంట్లోని డబ్బుల్ని దొంగిలించే జూదగాడిలా తన పిల్లల శాశ్వత సంతోషాన్ని దొంగిలించాడు. అతని స్వార్థం వల్ల మానవులు అపరిపూర్ణత అనే క్రూరమైన యజమానికి దాసులయ్యారు. అందుకే మానవులు అనారోగ్యం పాలౌతున్నారు, దుఃఖాన్ని అనుభవిస్తున్నారు, చివరకు చనిపోతున్నారు. ఓ దాసుణ్ణి విడిపించడానికి మూల్యం చెల్లించినట్లే, ఆ భయంకరమైన పరిణామాల నుండి మనల్ని విడిపించడానికి యెహోవా మూల్యాన్ని చెల్లించాడు. (రోమీయులు 5:21 చదవండి.) యేసుక్రీస్తు తన తండ్రి చిత్త ప్రకారం నడుచుకుంటూ, “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును” ఇచ్చాడు. (మత్త. 20:28) దేవుని ఆమోదాన్ని సంపాదించుకున్నవారు విమోచన క్రయధనం ద్వారా వచ్చే ప్రయోజనాలన్నిటినీ త్వరలోనే పొందుతారు.

7 మన జీవితంలో ఓ ఉద్దేశాన్ని కలిగివుండి సంతోషాన్ని అనుభవించేందుకు, సృష్టికర్తయైన యెహోవా ఎవ్వరూ చేయనంతగా మనకోసం చేశాడు. యెహోవా ఆమోదం మనమీద ఉంటే, మానవజాతికి కలిగిన నష్టాన్నంతటినీ ఆయన ఎలా పూరిస్తాడో మనం చూడగలుగుతాం. తాను ఏవిధంగా ‘తనను వెదికేవారికి ఫలము దయచేసే వ్యక్తి’ అవుతాడో యెహోవా మనకు తెలియజేస్తాడు.—హెబ్రీ. 11:6.

“నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు”

8. దేవుణ్ణి సేవించడం గురించి యెషయా అనుభవం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

8 దేవుని ఆమోదాన్ని సంపాదించుకోవాలంటే మన స్వేచ్ఛా చిత్తాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే తనను సేవించమని యెహోవా ఎవ్వరినీ బలవంతపెట్టడు. యెషయా కాలంలో, “నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవును?” అని యెహోవా అడిగాడు. నిర్ణయం తీసుకునే విషయంలో యెషయా ప్రవక్తకున్న హక్కును పరిగణలోకి తీసుకోవడం ద్వారా యెహోవా ఆయనను గౌరవించాడు. “నేనున్నాను నన్ను పంపుము” అని జవాబిచ్చినప్పుడు యెషయా ఎంత సంతృప్తి చెందివుంటాడో ఊహించండి!—యెష. 6:8.

9, 10. (ఎ) మనం ఎలాంటి దృక్పథంతో దేవుణ్ణి ఆరాధించాలి? (బి) యెహోవాను పూర్ణాత్మతో సేవించడం మనకెందుకు తగినది?

9 దేవుణ్ణి సేవించాలో వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ మానవులకు ఉంది. మనం తనను ఇష్టపూర్వకంగా సేవించాలని యెహోవా కోరుతున్నాడు. (యెహోషువ 24:15 చదవండి.) యెహోవాను అయిష్టంగా ఆరాధించేవారు ఆయనను సంతోషపెట్టలేరు. తోటివారిని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో తనను ఆరాధించేవారి భక్తిని కూడా యెహోవా అంగీకరించడు. (కొలొ. 3:22) యెహోవాను “పూర్ణహృదయముతో” ఆరాధించకుండా చేసేలా లోకసంబంధమైన విషయాలను అనుమతిస్తే మనం ఆయన ఆమోదాన్ని పొందలేము. (కీర్త. 119:2) తనను పూర్ణాత్మతో సేవించడం మనకు మంచిదని యెహోవాకు తెలుసు. “దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును” కోరుకోమని మోషే ఇశ్రాయేలీయులను ప్రోత్సహించాడు.—ద్వితీ. 30:19, 20.

10 ప్రాచీన ఇశ్రాయేలీయుల రాజైన దావీదు యెహోవాకు ఇలా పాడాడు: “యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలె అరుణోదయ గర్భములోనుండి నీ యొద్దకు వచ్చెదరు.” (కీర్త. 110:3) నేడు చాలామంది ఆర్థిక భద్రత కోసం, సరదాగా గడపడం కోసం జీవిస్తున్నారు. కానీ, యెహోవాను ప్రేమించేవారు మాత్రం పరిశుద్ధ సేవకే అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. సువార్తను ప్రకటించేందుకు వారు చూపించే ఉత్సాహాన్ని చూస్తే వారు వేటికి ప్రాధాన్యతను ఇస్తున్నారో తెలుస్తుంది. తమ అనుదిన అవసరాలను దయచేసే విషయంలో యెహోవాకున్న సామర్థ్యంపై వారికి పూర్తి నమ్మకం ఉంది.—మత్త. 6:33, 34.

దేవుడు ఆమోదించే అర్పణలు

11. యెహోవాకు బలులు అర్పించడం ద్వారా ఇశ్రాయేలీయులు ఏ ప్రయోజనాన్ని పొందుతామని ఆశించారు?

11 ధర్మశాస్త్ర నిబంధన ప్రకారం, యెహోవా ప్రజలు ఆయన ఆమోదాన్ని సంపాదించుకోవడానికి ఆయన అంగీకరించే బలులు అర్పించేవారు. “మీరు యెహోవాకు సమాధానబలి అర్పించునప్పుడు అది అంగీకరింపబడునట్లుగా అర్పింపవలెను” అని లేవీయకాండము 19:5 చెబుతోంది. అదే పుస్తకంలో ఇంకా ఇలా ఉంది: “మీరు కృతజ్ఞతాబలియగు పశువును వధించినప్పుడు అది మీకొరకు అంగీకరింపబడునట్లుగా దానిని అర్పింపవలెను.” (లేవీ. 22:29) ఇశ్రాయేలీయులు యెహోవా బలిపీఠంపై సరైన జంతు బలులను అర్పించినప్పుడు ఆకాశంవైపు వెళ్లిన పొగ సత్యదేవునికి “ఇంపైన సువాసన[గా]” ఉండేది. (లేవీ. 1:9, 13) తన ప్రజలు ప్రేమతో ఇచ్చిన అర్పణలను బట్టి యెహోవా సంతోషించాడు, వాటిని అంగీకరించాడు. (ఆది. 8:21) ధర్మశాస్త్రంలోని ఆ అంశాల్లో మన కాలానికి ఉపయోగపడే ఓ సూత్రం ఉంది. యెహోవా అంగీకరించే బలులను అర్పించేవారు మాత్రమే ఆయన ఆమోదాన్ని పొందుతారు. అసలు ఆయన ఎలాంటి బలులను అంగీకరిస్తాడు? జీవితంలోని రెండు రంగాల గురించి అంటే మన ప్రవర్తన, మన మాటల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

12. మన ‘శరీరాన్ని యాగముగా సమర్పించుకుంటున్నప్పుడు,’ ఎలాంటి ప్రవర్తననుబట్టి ఆ యాగాన్ని యెహోవా అసహ్యించుకుంటాడు?

12 రోమీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి . . . ఇట్టి సేవ మీకు యుక్తమైనది.” (రోమా. 12:1) ఒక వ్యక్తి దేవుని ఆమోదాన్ని పొందాలంటే తన శరీరాన్ని దేవుడు అంగీకరించే విధంగా ఉంచుకోవాలి. ఒకవేళ ఆయన పొగాకు, వక్క, చట్టవిరుద్ధమైన మత్తు పదార్థాలు వంటివి ఉపయోగించడం, మద్యాన్ని అతిగా సేవించడం ద్వారా తనను తాను అపవిత్రపర్చుకుంటే ఆ అర్పణకు అసలు విలువే ఉండదు. (2 కొరిం. 7:1) అంతేకాక, “జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.” కాబట్టి, ఓ వ్యక్తి ఎలాంటి అనైతికతకు పాల్పడినా అతని అర్పణను యెహోవా అసహ్యించుకుంటాడు. (1 కొరిం. 6:18) యెహోవాను సంతోషపెట్టాలంటే మనం “సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధు[లమై]” ఉండాలి.—1 పేతు. 1:14-16.

13. మనం యెహోవాను స్తుతించడం ఎందుకు తగినది?

13 యెహోవాను సంతోషపెట్టే మరో అర్పణ ఏమిటంటే, మన మాటలు. యెహోవాను ప్రేమించేవారు పదిమందిలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఆయన గురించి మంచిగా మాట్లాడారు. (కీర్తన 34:1-3 చదవండి.) కీర్తనల గ్రంథంలోని 148 నుండి 150 అధ్యాయాలు చదివి, యెహోవాను స్తుతించమని అవి మనల్ని ఎన్నిసార్లు ప్రోత్సహిస్తున్నాయో గమనించండి. నిజంగా, “స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము [‘తగినది,’ NW].” (కీర్త. 33:1) మన మాదిరికర్తయైన యేసుక్రీస్తు, సువార్త ప్రకటించడం ద్వారా దేవుణ్ణి స్తుతించడం ఎంత ప్రాముఖ్యమో నొక్కిచెప్పాడు.—లూకా 4:18, 43, 44.

14, 15. ఎలాంటి బలులను అర్పించమని హోషేయ ఇశ్రాయేలీయులను ప్రోత్సహించాడు? యెహోవా ఎలా స్పందించాడు?

14 మనం ఉత్సాహంగా సువార్త ప్రకటిస్తే, యెహోవాను ప్రేమిస్తున్నామనీ ఆయన ఆమోదాన్ని పొందాలనుకుంటున్నామనీ చూపిస్తాం. ఉదాహరణకు, అబద్ధ ఆరాధన చేయడం ద్వారా దేవుని ఆమోదాన్ని కోల్పోయిన ఇశ్రాయేలీయులను హోషేయ ప్రవక్త ఎలా ప్రోత్సహించాడో గమనించండి. (హోషే. 13:1-3) ఆయన వారిని ఇలా వేడుకోమన్నాడు: “మా పాపములన్నిటిని పరిహరింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము. నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.”—హోషే. 14:1, 2.

15 ‘పెదవులను అర్పించడం’ అంటే నిజాయితీగా, బాగా ఆలోచించి మాట్లాడే మాటలతో సత్యదేవుణ్ణి స్తుతించడమని అర్థం. అలాంటి బలులు అర్పించినవారి విషయంలో యెహోవా ఎలా స్పందించాడు? “మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును” అని ఆయన అన్నాడు. (హోషే. 14:4) అలాంటి స్తుతియాగాలను అర్పించినవారి తప్పులను యెహోవా క్షమించాడు, వారిని ఆమోదించాడు, వారితో స్నేహం చేశాడు.

16, 17. ఓ వ్యక్తి దేవుని మీద విశ్వాసంతో సువార్త ప్రకటించడానికి పురికొల్పబడినప్పుడు, ఆయన స్తుతిని యెహోవా ఎలా అందుకుంటాడు?

16 యెహోవాను బహిరంగంగా స్తుతించడమనేది సత్యారాధనలో ఎప్పుడూ ఓ ప్రాముఖ్యమైన భాగంగా ఉంది. సత్యదేవుణ్ణి మహిమపర్చడానికి కీర్తనకర్త ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు కాబట్టే, “యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము” అని వేడుకున్నాడు. (కీర్త. 119:108) మరి నేటి విషయమేమిటి? మనకాలంలోని ఓ పెద్దగుంపు గురించి మాట్లాడుతూ యెషయా ఇలా ప్రవచించాడు: “వారందరు . . . యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు . . . అవి [వారి బహుమానాలు] నా [దేవుని] బలిపీఠముమీద అంగీకారములగును.” (యెష. 60:6, 7) ఆ ప్రవచన నెరవేర్పుగా లక్షలాదిమంది యెహోవాకు ‘స్తుతియాగము చేస్తున్నారు’ అంటే ‘ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పిస్తున్నారు.’—హెబ్రీ. 13:15.

17 మీ విషయమేమిటి? దేవుడు అంగీకరించే బలులను మీరు అర్పిస్తున్నారా? లేనట్లయితే, కావాల్సిన మార్పులు చేసుకొని యెహోవాను బహిరంగంగా స్తుతించడం మొదలుపెడతారా? సువార్త ప్రకటించడం ఆరంభించేలా మీ విశ్వాసం మిమ్మల్ని పురికొల్పితే, మీ అర్పణ యెహోవాకు ‘ఎద్దుకంటే ప్రీతికరంగా’ ఉంటుంది. (కీర్తన 69:30, 31 చదవండి.) మీ స్తుతియాగపు “పరిమళధూపము” యెహోవా దగ్గరికి చేరుతుందని, ఆయన మిమ్మల్ని ఆమోదిస్తాడని నమ్మకం కలిగివుండండి. (యెహె. 20:41) అప్పుడు మీకు కలిగే సంతోషాన్ని దేనితోనూ పోల్చలేం.

‘యెహోవా నీతిమంతులను ఆశీర్వదిస్తాడు’

18, 19. (ఎ) దేవుణ్ణి సేవించే విషయంలో నేడు చాలామందికి ఎలాంటి అభిప్రాయం ఉంది? (బి) దేవుని ఆమోదాన్ని కోల్పోతే ఏమి జరుగుతుంది?

18 నేడు కూడా చాలామంది, మలాకీ కాలంలోని కొందరిలా ఆలోచిస్తారు. అప్పటివాళ్లు ‘దేవుణ్ణి సేవించడం నిష్ఫలము, ఆయన ఆజ్ఞలను గైకొనడం వల్ల ప్రయోజనమేముంది?’ అని అనుకున్నారు. (మలా. 3:14) నేటి ప్రజలు వస్తుసంపదలపై మోజుతో దేవుని సంకల్పం నెరవేరడం అసాధ్యమని, ఆయన నియమాలు ఇక పనికిరావని అనుకుంటున్నారు. సువార్తను ప్రకటించడమంటే సమయాన్ని వృథా చేసుకోవడమేనని, అది చికాకు తెప్పిస్తుందని అనుకుంటున్నారు.

19 అలాంటి ఆలోచనా తీరు ఏదెను తోటలోనే మొదలైంది. యెహోవా ఇచ్చిన అద్భుతమైన జీవితం ఎంత విలువైనదో పట్టించుకోకుండా, ఆయన ఆమోదాన్ని లెక్కచేయకుండా ఉండేలా సాతానే హవ్వను మోసగించాడు. దేవుని చిత్తాన్ని చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదని ప్రజలు నమ్మేలా చేయడానికి సాతాను ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే, దేవుని ఆమోదాన్ని కోల్పోవడమంటే ప్రాణాలను పోగొట్టుకోవడమేనని హవ్వ, ఆమె భర్త తర్వాత గుర్తించారు. ఇప్పుడు వారి చెడ్డ మాదిరిని అనుసరిస్తున్నవారు కూడా త్వరలోనే ఆ చేదు నిజాన్ని రుచి చూస్తారు.—ఆది. 3:1-7, 17-19.

20, 21. (ఎ) సారెపతులోని విధవరాలు ఏమి చేసింది? దానివల్ల ఆమె ఎలాంటి ఫలితం పొందింది? (బి) మనం ఆమెను ఎలా అనుకరించవచ్చు? ఎందుకు?

20 ఆదాముహవ్వలు పొందిన బాధాకరమైన ఫలితానికి, మొదట్లో ప్రస్తావించబడిన ఏలీయాకూ సారెపతులోని ఓ విధవరాలికీ సంబంధించిన సంఘటనల ఫలితానికి మధ్యవున్న తేడాను గమనించండి. ఏలీయా చెప్పిన ప్రోత్సాహకరమైన మాటలను విన్న తర్వాత, ఆ విధవరాలు వంట చేసి తన దగ్గరున్న కొంచెం ఆహారంలో నుండి ముందు ప్రవక్తకు పెట్టింది. అప్పుడు యెహోవా ఏలీయా ద్వారా చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: “అతడును ఆమెయు ఆమె యింటివారును అనేకదినములు భోజనముచేయుచు వచ్చిరి. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.”—1 రాజు. 17:15, 16.

21 నేడు కోట్లాదిమందిలో కొంతమంది మాత్రమే చేయడానికి ఇష్టపడుతున్నదాన్ని అప్పట్లో సారెపతులోని ఆ విధవరాలు చేసింది. ఆమె రక్షణకర్తయైన దేవునిపై పూర్తి నమ్మకాన్ని ఉంచింది, దేవుడు కూడా ఆమెకు సహాయం చేశాడు. దీనితోపాటు బైబిలులోని ఇతర వృత్తాంతాలు యెహోవా మన నమ్మకానికి అర్హుడని బలంగా రుజువు చేస్తున్నాయి. (యెహోషువ 21:43-45; 23:14 చదవండి.) అంతేకాక, ఆధునికకాల యెహోవాసాక్షుల జీవితాలను చూస్తే, తన ఆమోదం ఉన్న సేవకులను యెహోవా ఎన్నడూ విడిచిపెట్టడని రుజువౌతుంది.—కీర్త. 34:6, 7, 17-19. a

22. మనం ఆలస్యం చేయకుండా ఇప్పుడే దేవుని ఆమోదం కోసం ప్రయత్నించడం ఎందుకు అత్యవసరం?

22 దేవుని తీర్పు దినం, “భూమియందంతట నివసించు వారందరిమీదికి” త్వరలో రాబోతుంది. (లూకా 21:34, 35) దాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ దినం వచ్చినప్పుడు, దేవుడు నియమించిన న్యాయాధిపతి, “నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి . . . మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి” అని చెప్పడాన్ని వినడం కన్నా విలువైన సంపదలు లేదా భౌతిక సౌకర్యాలు ఏవీ లేవు. (మత్త. 25:34) అవును, ‘యెహోవా నీతిమంతులను ఆశీర్వదిస్తాడు, కేడెముతో కప్పినట్లు ఆయన వారిని దయతో [“ఆమోదంతో,” NW] కప్పుతాడు.’ (కీర్త. 5:12) కాబట్టి, మనం దేవుని ఆమోదం సంపాదించుకోవడానికి ప్రయత్నించవద్దా?

[అధస్సూచి]

a కావలికోట, మార్చి 15, 2005 సంచికలోని 13వ పేజీలోవున్న 15వ పేరాను, అలాగే ఆగస్టు 1, 1997 సంచికలోని 20-25 పేజీలను చూడండి.

మీకు గుర్తున్నాయా?

• మన హృదయపూర్వకమైన ఆరాధనకు యెహోవా ఎందుకు అర్హుడు?

• యెహోవా నేడు ఏ అర్పణలను అంగీకరిస్తున్నాడు?

• ‘పెదవులను అర్పించడం’ అంటే అర్థమేమిటి? మనం వాటిని యెహోవాకు ఎందుకు అర్పించాలి?

• యెహోవా ఆమోదాన్ని సంపాదించుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నించాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[13వ పేజీలోని చిత్రం]

దేవుని ప్రవక్త ఆకలితోవున్న బీద తల్లిని ఏ విషయంలో నిర్ణయం తీసుకోమని సూచించాడు?

[15వ పేజీలోని చిత్రం]

మనం యెహోవాకు స్తుతియాగాన్ని అర్పిస్తే ఏ ప్రయోజనాన్ని పొందుతాం?

[17వ పేజీలోని చిత్రం]

మీరు పూర్ణహృదయంతో యెహోవాపై నమ్మకం ఉంచితే ఎన్నడూ నిరాశచెందరు