కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

అహరోను కుమారులైన నాదాబు అబీహులు చనిపోయిన తర్వాత వారి సహోదరులైన ఎలియాజరు, ఈతామారులపై మోషే ఎందుకు కోపగించుకున్నాడు? ఆయన కోపం ఎలా చల్లారింది?—లేవీ. 10:16-20.

యాజకత్వం ఏర్పాటు చేయబడిన కొంతకాలానికి, తాను ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తన సన్నిధికి తెచ్చినందువల్ల అహరోను కుమారులైన నాదాబు అబీహులకు యెహోవా మరణశిక్ష విధించాడు. (లేవీ. 10:1, 2) చనిపోయిన తమ సహోదరుల గురించి ఏడ్వవద్దని అహరోను మిగతా కుమారులకు మోషే ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత కొద్దికాలానికే, పాపపరిహారార్థమై అర్పించబడిన మేకపిల్లను తిననందుకు ఎలియాజరు, ఈతామారులపై మోషే కోపగించుకున్నాడు. (లేవీ. 9:3) ఎందుకు?

పాపపరిహారార్థ బలిని అర్పించిన యాజకుడు, దానిలో కొంత భాగాన్ని ప్రత్యక్ష గుడారపు ఆవరణములో తినాలని మోషేకు తానిచ్చిన నియమాల్లో యెహోవా స్పష్టంగా చెప్పాడు. అలా చేయడం ద్వారా ఆ యాజకుడు, బలిని అర్పించేవారి దోష శిక్షను తాను భరిస్తున్నట్లు చూపించేవాడు. అయితే, బలిగా తేబడిన జంతువు రక్తంలో కొంచెమైనా మందిరపు మొదటి విభాగమైన పరిశుద్ధ స్థలంలోనికి తీసుకువెళ్తే ఆ బలిని తినకూడదు కానీ కాల్చివేయాలి.—లేవీ. 6:24-26, 30.

అలాంటి విషాదకర సంఘటనలు జరిగిన తర్వాత, యెహోవా ఆజ్ఞలన్నీ ఖచ్చితంగా పాటించబడేలా చూడాలని మోషే గుర్తించినట్లు కనిపిస్తోంది. ఎలియాజరు ఈతామారులు పాపపరిహారార్థ బలిగా అర్పించబడిన మేకను కాల్చేశారని తెలుసుకొని, పరిశుద్ధ స్థలంలో యెహోవా సన్నిధికి దాని రక్తాన్ని తీసుకువెళ్లలేదు కాబట్టి, నిర్దేశించబడినట్లు వారు దాన్నెందుకు తినలేదని మోషే వారిని కోపంతో అడిగాడు.—లేవీ. 10:17, 18.

ఆ యాజకులు అహరోను అనుమతితోనే అలా చేశారు కాబట్టి, మోషేకు ఆయనే సమాధానం చెప్పాడు. తన ఇద్దరు కుమారులు చనిపోవడాన్ని బట్టి అహరోను, ఏ యాజకుడూ మంచి మనస్సాక్షితో ఆ రోజు పాపపరిహారార్థ బలిని తినలేడని అనుకొనివుండవచ్చు. నాదాబు అబీహులు చేసిన తప్పుతో వీరికి నేరుగా ఎలాంటి సంబంధం లేకపోయినా దానిని తినడాన్ని యెహోవా ఇష్టపడడని అహరోను అనుకొనివుండవచ్చు.—లేవీ. 10:19.

ప్రాముఖ్యంగా, తన కుటుంబ సభ్యులు మొదటిసారి తమ యాజకత్వ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు వారు చిన్నచిన్న విషయాల్లో కూడా యెహోవాను సంతోషపెట్టడానికి చాలా జాగ్రత్తపడి ఉండాల్సిందని అహరోను చెప్పివుంటాడు. ఏదేమైనా, నాదాబు అబీహుల వల్ల యెహోవా నామము అపవిత్రపరచబడింది కాబట్టి యెహోవా కోపం వారిపైకి వచ్చింది. అందుకే, అలాంటి తప్పు జరిగిన యాజక కుటుంబంలోని సభ్యులు పరిశుద్ధ అర్పణను తినకూడదని అహరోను అనుకొనివుండవచ్చు.

తన అన్న చెప్పిన సమాధానాన్ని మోషే అంగీకరించినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, ఆ వృత్తాంతం ఈ మాటలతో ముగుస్తుంది: “మోషే ఆ మాట విని ఒప్పుకొనెను.” (లేవీ. 10:20) అహరోను చెప్పినదాన్ని యెహోవా కూడా అంగీకరించాడని తెలుస్తోంది.