కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పూర్ణహృదయంతో నీతిని ప్రేమించండి

పూర్ణహృదయంతో నీతిని ప్రేమించండి

పూర్ణహృదయంతో నీతిని ప్రేమించండి

‘నీవు నీతిని ప్రేమించావు.’—కీర్త. 45:7.

1. “నీతిమార్గములలో” నడవాలంటే మనం ఏమి చేయాలి?

 యెహోవా తన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రజలను “నీతిమార్గములలో” నడిపిస్తున్నాడు. (కీర్త. 23:3) మనం అపరిపూర్ణులం కాబట్టి, ఆ మార్గం నుండి తప్పిపోతుంటాం. మళ్లీ సరైన మార్గంలోకి రావాలంటే స్థిరనిశ్చయంతో కూడిన ప్రయత్నం అవసరం. ఈ విషయంలో మనకు ఏది సహాయం చేస్తుంది? యేసులా, మనం సరైనదాన్ని ప్రేమించాలి.కీర్తన 45:7 చదవండి.

2. “నీతిమార్గములు” అంటే ఏమిటి?

2 “నీతిమార్గములు” అంటే ఏమిటి? ఇవి యెహోవా నీతి ప్రమాణం ఆధారంగా నిర్ణయించబడే “మార్గములు.” హీబ్రూ, గ్రీకు భాషల్లో “నీతి” అనేది నైతిక ప్రమాణాలకు నిక్కచ్చిగా కట్టుబడి ఉండడాన్ని సూచిస్తుంది. యెహోవా, నీతికి లేదా “న్యాయమునకు నివాసము” కాబట్టి, ఆయన ఆరాధకులు తాము నడవాల్సిన నీతి మార్గాన్ని నిర్ణయించుకోవడానికి ఆయనపై ఆధారపడతారు.—యిర్మీ. 50:7.

3. దేవుని నీతి గురించి మనం మరింతెక్కువ ఎలా నేర్చుకోవచ్చు?

3 దేవుని నీతి ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికి మనం హృదయపూర్వకంగా ప్రయత్నిస్తేనే ఆయన ఇష్టపడే ప్రజలముగా ఉంటాం. (ద్వితీ. 32:4) అలా చేయాలంటే మొదటిగా, తన వాక్యమైన బైబిలు నుండి యెహోవా గురించి నేర్చుకోగలిగినదంతా నేర్చుకోవాలి. రోజురోజుకీ మనం ఆయనకు మరింత దగ్గరౌతూ ఆయన గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువగా ఆయన నీతిని ప్రేమిస్తాం. (యాకో. 4:8) అంతేకాకుండా, జీవితంలో ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు దేవుని ప్రేరేపిత వాక్యంలోని నిర్దేశాన్ని మనం అంగీకరించాలి.

దేవుని నీతిని వెదకండి

4. దేవుని నీతిని వెదకాలంటే ఏమి చేయాలి?

4 మత్తయి 6:33 చదవండి. మనం దేవుని నీతిని వెదకాలంటే, రాజ్య సువార్తను ప్రకటించడానికి సమయం వెచ్చించడం మాత్రమే సరిపోదు. మనం చేసే పరిశుద్ధ సేవను యెహోవా అంగీకరించాలంటే మన అనుదిన ప్రవర్తన ఆయన ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. యెహోవా నీతిని వెదికేవాళ్ళంతా ఏమి చేయాలి? “నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును” ధరించుకోవాలి.—ఎఫె. 4:24.

5. మనం నిరుత్సాహాన్ని ఎలా అధిగమించవచ్చు?

5 దేవుని నీతి ప్రమాణాల ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తుండగా కొన్నిసార్లు బలహీనతల వల్ల మనం నిరుత్సాహపడే అవకాశం ఉంది. మనల్ని కృంగదీసే నిరుత్సాహాన్ని ఎలా అధిగమించవచ్చు? అంతేకాక, నీతిని ప్రేమించి దాన్ని క్రియల్లో చూపించడాన్ని నేర్చుకునేందుకు మనం ఏమి చేయాలి? (సామె. 24:10) మనం, “విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో” యెహోవాకు క్రమంగా ప్రార్థించాలి. (హెబ్రీ. 10:19-22) అభిషిక్తులమైనా, భూనిరీక్షణగల వాళ్లమైనా యేసుక్రీస్తు విమోచన క్రయధన బలిపై, మన గొప్ప ప్రధానయాజకునిగా ఆయన చేసే సేవలపై మనం విశ్వాసముంచాలి. (రోమా. 5:8; హెబ్రీ. 4:14-16) అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: “యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.” (1 యోహా. 1:6, 7) మన “పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమమువలె తెల్లబడును” అని బైబిలు చెబుతోంది. యెహోవా తన ప్రియకుమారుని విమోచన క్రయధన బలి ద్వారా మనకోసం ఎంతటి అద్భుతమైన ఏర్పాటు చేశాడు!—యెష. 1:18.

మీ ఆధ్యాత్మిక సర్వాంగ కవచం ఎలా ఉందో చూసుకోండి

6. మన ఆధ్యాత్మిక సర్వాంగ కవచం ఎలా ఉందో చూసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

6 మనం ఎల్లప్పుడూ “నీతియను మైమరువు” ధరించుకొని ఉండాలి. ఎందుకంటే, దేవుడిచ్చిన ఆధ్యాత్మిక సర్వాంగ కవచంలో అది చాలా ప్రాముఖ్యమైన భాగం. (ఎఫె. 6:11, 14) మనం ఈ మధ్యే యెహోవాకు సమర్పించుకున్నా లేదా దశాబ్దాలుగా ఆయన సేవ చేస్తున్నా మన ఆధ్యాత్మిక సర్వాంగ కవచం ఎలా ఉందో ప్రతీరోజు చూసుకోవడం ప్రాముఖ్యం. ఎందుకంటే అపవాది, అతడి దయ్యాలు భూమ్మీదికి పడద్రోయబడ్డారు. (ప్రక. 12:7-12) సాతాను ఎంతో కోపంతో ఉన్నాడు, అంతేకాక తనకు సమయం కొంచెమే ఉందని అతడికి తెలుసు. అందుకే, అతడు దేవుని ప్రజలపై మరింత ఎక్కువగా దాడి చేస్తున్నాడు. కాబట్టి, “నీతియను మైమరువు” ధరించుకొని ఉండడం ఎంత ప్రాముఖ్యమో గుర్తిస్తున్నామా?

7. “నీతియను మైమరువు” ఎంత అవసరమో గుర్తిస్తే మనం ఎలా ప్రవర్తిస్తాం?

7 మైమరువు అక్షరార్థ హృదయాన్ని కాపాడుతుంది. అపరిపూర్ణత వల్ల మన అలంకారిక హృదయం మోసకరంగా, ఘోరమైన వ్యాధిగలదిగా ఉండే ప్రమాదం ఉంది. (యిర్మీ. 17:9) మన హృదయం తప్పు చేయడానికే మొగ్గు చూపుతుంది కాబట్టి దానికి శిక్షణనివ్వడం, దాన్ని క్రమశిక్షణలో పెట్టడం ప్రాముఖ్యం. (ఆది. 8:21) “నీతియను మైమరువు” ఎంత అవసరమో గుర్తిస్తే, మనం దేవుడు ద్వేషించే వినోదాన్ని ఎంచుకోవడం ద్వారా దాన్ని తాత్కాలికంగా తీసి పక్కనబెట్టం లేదా తప్పుడు పనులు చేయడం గురించి పగటి కలలు కనం. గంటల తరబడి టీవీ చూస్తూ మన విలువైన సమయాన్ని వృథా చేసుకోం. బదులుగా, యెహోవాకు ఇష్టమైన పనులు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాం. ఒకవేళ మనం చెడుగా ఆలోచించడం వల్ల తడబడినా యెహోవా సహాయంతో తిరిగి లేస్తాం.—సామెతలు 24:16 చదవండి.

8. మనకు “విశ్వాసమను డాలు” ఎందుకు అవసరం?

8 మన ఆధ్యాత్మిక సర్వాంగ కవచంలో “విశ్వాసమను డాలు” కూడా ఉంది. అది “దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు” మనలను సమర్థులను చేస్తుంది. (ఎఫె. 6:16) అంతేకాక, యెహోవా మీద విశ్వాసం, హృదయపూర్వకమైన ప్రేమ ఉంటే మనం నీతిని అనుసరిస్తూ నిత్యజీవ మార్గంలో కొనసాగుతాం. యెహోవాను ప్రేమించడాన్ని మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే ఆయన నీతికి అంత ఎక్కువ విలువిస్తాం. అయితే, మన మనస్సాక్షి విషయమేమిటి? నీతిని ప్రేమించడానికి ప్రయత్నిస్తుండగా అది మనకెలా సహాయం చేస్తుంది?

మంచి మనస్సాక్షిని కాపాడుకోండి

9. మంచి మనస్సాక్షిని కాపాడుకోవడం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందుతాం?

9 “నిర్మలమైన మనస్సాక్షిని” ఇవ్వమని మన బాప్తిస్మమప్పుడు యెహోవాను అడిగాం. (1 పేతు. 3:21) విమోచన క్రయధనంపై విశ్వాసం ఉంచుతాం కాబట్టి, యేసు రక్తం మన పాపాలను కప్పివేస్తుంది, ఫలితంగా మనం దేవుని ముందు నిర్దోషులముగా ఉండగలుగుతాం. అయితే, మనమలా కొనసాగాలంటే మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలి. అప్పుడప్పుడు మన మనస్సాక్షి మనల్ని నిందిస్తూ ప్రమాద హెచ్చరికలు చేస్తే, అది బాగా పనిచేస్తుందని మనం సంతోషించాలి. అలాంటి ప్రమాద హెచ్చరికలు, యెహోవా నీతి మార్గాల విషయంలో మన మనస్సాక్షి మొద్దుబారిపోలేదని సూచిస్తాయి. (1 తిమో. 4:1, 2) నీతిని ప్రేమించాలనుకునేవారి విషయంలో మనస్సాక్షి మరోవిధంగా కూడా పనిచేస్తుంది.

10, 11. (ఎ) బైబిలు శిక్షిత మనస్సాక్షి చెప్పేది ఎందుకు వినాలో చూపించే ఒక అనుభవం చెప్పండి. (బి) నీతిని ప్రేమించడం వల్ల మనం ఎందుకు చాలా సంతోషాన్ని పొందుతాం?

10 మనం తప్పు చేసినప్పుడు మన మనస్సాక్షి మనల్ని నిందించవచ్చు లేదా వేధించవచ్చు. ‘నీతి మార్గాల’ నుండి తప్పిపోయిన ఒక యౌవనస్థుని అనుభవమే తీసుకోండి. ఆయన అశ్లీల చిత్రాలకు బానిసయ్యాడు, గంజాయి సేవించడం మొదలుపెట్టాడు. అందుకే, ఆయన కూటాలకు వెళ్లినప్పుడు అపరాధ భావాలకు లోనయ్యాడు, ప్రకటనా పనిలో పాల్గొంటున్నప్పుడు తాను క్రైస్తవునిగా నటిస్తున్నట్లు భావించాడు. కాబట్టి, ఆ క్రైస్తవ కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని పూర్తిగా ఆపేశాడు. “కానీ, నేను చేసే పనులకు నా మనస్సాక్షి నన్ను నిందిస్తుందని అప్పుడు నాకు అనిపించలేదు. నేను దాదాపు నాలుగు సంవత్సరాలపాటు మూర్ఖంగా ప్రవర్తించాను” అని ఆయన అంటున్నాడు. ఆ తర్వాత తాను సత్యంలోకి తిరిగి రావడం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. యెహోవా తన ప్రార్థన వినడని అనుకున్నప్పటికీ, చివరికి ఒకరోజు యెహోవాకు ప్రార్థించి క్షమాపణ కోరాడు. ఆ తర్వాత పది నిమిషాలైనా గడవకముందే వాళ్ల అమ్మ వచ్చి మళ్లీ కూటాలకు రమ్మని ఆయన్ను ప్రోత్సహించింది. ఆయన రాజ్యమందిరానికి వెళ్లి తనతో అధ్యయనం చేయమని ఒక పెద్దను అడిగాడు. కొంతకాలానికి, ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. తన ప్రాణాన్ని కాపాడినందుకు తాను యెహోవాకు రుణపడివున్నట్లు భావిస్తున్నాడు.

11 సరైనది చేయడంవల్ల ఎంతో సంతోషాన్ని పొందవచ్చని మనం తెలుసుకున్నాం. నీతిని ప్రేమించడం నేర్చుకొని దాని ప్రకారం జీవించడం వల్ల మన పరలోక తండ్రికి ఇష్టమైనవి చేయడంలో ఎంతో సంతోషాన్ని పొందుతాం. ఒక్కసారి ఆలోచించండి! మానవులంతా మనస్సాక్షి నుండి సంతోషకరమైన సంకేతాలను మాత్రమే వినే రోజు రాబోతుంది. అప్పుడు మానవులు సంపూర్ణంగా దేవుణ్ణి ప్రతిబింబిస్తారు. కాబట్టి, మన హృదయలోతుల్లో నీతిపై ప్రేమను పెంపొందించుకొని యెహోవాను సంతోషపెడదాం.—సామె. 23:15, 16.

12, 13. మన మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వవచ్చు?

12 మన మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వవచ్చు? లేఖనాలను, బైబిలు ఆధారిత ప్రచురణలను చదువుతున్నప్పుడు “నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును [‘ధ్యానించును,’ NW]” అని మనం గుర్తుంచుకోవాలి. (సామె. 15:28) ఫలాని ఉద్యోగం చేయవచ్చా అనే సందేహం వచ్చినప్పుడు అది ఎంతగా ఉపయోగపడుతుందో ఆలోచించండి. ఒకవేళ ఏదైనా ఒక పని లేఖన విరుద్ధమైనదైతే, వెంటనే మనలో చాలామందిమి నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఇచ్చే నిర్దేశాన్ని పాటిస్తాం. ఫలానా పని లేఖన విరుద్ధమైనదో కాదో స్పష్టంగా తెలియనప్పుడు, దానికి సంబంధించిన బైబిలు సూత్రాలను కనుగొని, వాటి గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించాలి. a ఇతరుల మనస్సాక్షిని అభ్యంతరపరచకూడదు అనే సూత్రంతోపాటు ఇతర సూత్రాల విషయంలో కూడా అలాగే చేయాలి. (1 కొరిం. 10:31-33) ముఖ్యంగా, దేవునితో మనకున్న సంబంధాన్ని ప్రభావితం చేయగల సూత్రాల గురించి మనం ఆలోచించాలి. యెహోవా నిజమైన వ్యక్తి అని మనం భావిస్తుంటే ముందుగా, ‘నేను చేసే ఈ పని యెహోవాకు బాధ కలిగించి, ఆయన్ను నొప్పిస్తుందా?’ అని ఆలోచిస్తాం.—కీర్త. 78:40, 41.

13 కావలికోట అధ్యయనానికి లేదా సంఘ బైబిలు అధ్యయనానికి సిద్ధపడుతున్నప్పుడు ధ్యానించడం అవసరమని మనం గుర్తుంచుకోవాలి. మనం ఎప్పుడూ హడావిడిగా జవాబులకు గీతలు పెట్టుకొని తర్వాతి పేరాలోకి వెళ్లిపోతామా? అలా చేస్తే నీతిపై ప్రేమను, ప్రమాదాల గురించి హెచ్చరించే మనస్సాక్షిని పెంపొందించుకోలేము. మనం నీతిని ప్రేమించేవారిగా తయారవ్వాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివి, చదివినదాన్ని ధ్యానించాలి. హృదయపూర్వకంగా నీతిని ప్రేమించడాన్ని నేర్చుకునేందుకు ఎలాంటి అడ్డదారులు లేవు.

నీతికోసం ఆకలిదప్పులు

14. మన పరిశుద్ధ సేవ విషయంలో మనం ఎలా భావించాలని యెహోవా దేవుడు, యేసుక్రీస్తు కోరుకుంటున్నారు?

14 మనం పరిశుద్ధ సేవ చేస్తూ ఆనందంగా ఉండాలని యెహోవా దేవుడు, యేసుక్రీస్తు కోరుకుంటున్నారు. మనం ఆనందంగా ఉండాలంటే ఏమి చేయాలి? నీతిని ప్రేమించాలి. కొండమీది ప్రసంగంలో యేసు ఇలా చెప్పాడు: “నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.” (మత్త. 5:6) నీతిని ప్రేమించాలని కోరుకునేవారికి ఈ మాటలు ఎలాంటి ప్రాముఖ్యతను కలిగివున్నాయి?

15, 16. ఆధ్యాత్మిక ఆకలిదప్పులు గలవారు ఎలా తృప్తిపరచబడతారు?

15 మనం జీవిస్తున్న ఈ లోకం దుష్టుని చేతుల్లో ఉంది. (1 యోహా. 5:19) ఏ దేశంలోని వార్తాపత్రిక చదివినా కనీవినీ ఎరుగనంత క్రూరత్వం, హింస గురించిన వార్తలే ఉంటున్నాయి. ఒకరు మరొకరిపై జరిగిస్తున్న క్రూరత్వం గురించి కనీసం ఆలోచించడం కూడా నీతిమంతునికి కష్టంగానే ఉంటుంది. (ప్రసం. 8:9) నీతిని నేర్చుకోవాలని కోరుకునేవారి ఆధ్యాత్మిక ఆకలిదప్పులను యెహోవా మాత్రమే తీర్చగలడని ఆయనను ప్రేమిస్తున్న మనకు తెలుసు. దుష్టులు త్వరలోనే నిర్మూలమౌతారు. అక్రమాలు చేసేవారి వల్ల కలిగే బాధను అనుభవించాల్సిన అవసరం నీతిని ప్రేమించే ప్రజలకు ఇక ఉండదు. (2 పేతు. 2:7, 8) అది ఎంతటి ఉపశమనం!

16 నీతి కోసం ఆకలిదప్పులు గలవారు ‘తృప్తిపరచబడతారు’ అని యెహోవా సేవకులముగా, యేసుక్రీస్తు అనుచరులముగా మనకు తెలుసు. దేవుడు ఏర్పాటు చేసిన కొత్త ఆకాశాలు, కొత్త భూమి ద్వారా మనకు పూర్తి సంతృప్తి దొరుకుతుంది. ఎందుకంటే, వాటిలో ‘నీతి నివసిస్తుంది.’ (2 పేతు. 3:13) నేటి సాతాను ప్రపంచంలో అణచివేత, హింస నీతిని హరించివేయడాన్ని బట్టి మనం నిరుత్సాహపడనక్కర్లేదు, ఆశ్చర్యపోనక్కర్లేదు. (ప్రసం. 5:8) సర్వోన్నతుడైన యెహోవాకు ప్రస్తుతం జరుగుతున్నది తెలుసు, నీతిని ప్రేమించేవారికి ఆయన త్వరలోనే విడుదలను అనుగ్రహిస్తాడు.

నీతిని ప్రేమించి ప్రయోజనం పొందండి

17. నీతిని ప్రేమించడం వల్ల వచ్చే కొన్ని ప్రయోజనాలు ఏమిటి?

17 నీతి మార్గంలో నడవడం వల్ల వచ్చే ప్రత్యేకమైన ప్రయోజనం గురించి కీర్తన 146:8 నొక్కి చెబుతోంది. అందులో, “యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు” అని కీర్తనకర్త పాడాడు. ఒక్కసారి ఊహించండి, మనం నీతిని ప్రేమిస్తే స్వయంగా విశ్వసర్వాధిపతే మనల్ని ప్రేమిస్తాడు! ఆయనకు మనపై ప్రేమ ఉంది కాబట్టి, రాజ్యాసక్తులకు మనం మొదటి స్థానమిస్తే ఆయన మనకు కావాల్సిన వాటిని అనుగ్రహిస్తాడని మనం నమ్మవచ్చు. (కీర్తన 37:25; సామెతలు 10:3 చదవండి.) చివరకు ఈ భూమి నీతిని ప్రేమించేవారి సొంతమౌతుంది. (సామె. 13:22) నీతిని అనుసరించి జీవించినందుకు దేవుని ప్రజల్లో చాలామంది చెప్పలేనంత సంతోషాన్ని, అందమైన భూపరదైసులో నిత్యజీవాన్ని బహుమానంగా పొందుతారు. దేవుని నీతిని ప్రేమించేవారు ఇప్పుడు కూడా మనశ్శాంతిని పొందుతున్నారు. దానివల్ల వారి కుటుంబాలు, సంఘాలు ఐక్యంగా ఉంటున్నాయి.—ఫిలి. 4:6, 7.

18. యెహోవా దినం కోసం వేచి చూస్తుండగా మనం ఏమి చేయడంలో కొనసాగాలి?

18 యెహోవా మహాదినం కోసం వేచి చూస్తుండగా మనం ఆయన నీతిని అనుసరించడంలో కొనసాగాలి. (జెఫ. 2:2, 3) కాబట్టి, మన హృదయాన్ని కాపాడే “నీతియను మైమరువు” ధరించుకొని, యెహోవా దేవుని నీతి మార్గాలను మనస్ఫూర్తిగా ప్రేమిద్దాం. అంతేకాక మనకు, మన దేవునికి సంతోషాన్ని తీసుకొచ్చే మంచి మనస్సాక్షిని కాపాడుకుందాం.—సామె. 27:11.

19. మనకు ఏ కృతనిశ్చయం ఉండాలి? తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

19 “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.” (2 దిన. 16:9) సమస్యలతో నిండిన ఈ లోకంలో పరిస్థితులు ఎంతో అస్తవ్యస్తంగా ఉన్నాయి, హింస మరియు దుష్టత్వం ఎక్కువౌతున్నాయి. అయినా మనం సరైనది చేయడానికి ప్రయత్నిస్తుండగా ఆ లేఖనంలోని మాటలు మనకు ఎంతో ఓదార్పును ఇస్తాయి. నిజమే, దేవునికి దూరమైపోయిన మానవులు మనం అనుసరించే నీతి మార్గాలను చూసి నివ్వెరపోవచ్చు. కానీ, యెహోవా నీతికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటే మనకు మేలు జరుగుతుంది. (యెష. 48:17; 1 పేతు. 4:4) కాబట్టి పూర్ణహృదయంతో నీతిని ప్రేమిస్తూ, దాని ప్రకారం జీవిస్తూ ఉండాలనే కృతనిశ్చయంతో ఉందాం. అప్పుడు మనం సంతోషాన్ని పొందుతాం. పూర్ణహృదయంతో నీతిని ప్రేమించాలంటే దుర్నీతిని ద్వేషించాలి. దాని అర్థమేమిటో తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం.

[అధస్సూచి]

a ఉద్యోగానికి సంబంధించిన బైబిలు సూత్రాల చర్చ కోసం, కావలికోట ఏప్రిల్‌ 15, 1999, 28-30 పేజీలు చూడండి.

మీరెలా జవాబిస్తారు?

• నీతిని ప్రేమించాలంటే విమోచన క్రయధన బలి విలువను గుర్తించడం ఎందుకు అవసరం?

• “నీతియను మైమరువు” ధరించుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

• మన మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[26వ పేజీలోని చిత్రం]

బైబిలు శిక్షిత మనస్సాక్షి ఉంటే ఉద్యోగానికి సంబంధించిన సందేహాలను తీర్చుకోగలుగుతాం