మీరు చేసే కృషి వృథా కాదు!
మీరు చేసే కృషి వృథా కాదు!
పిల్లలను “ప్రభువు [‘యెహోవా,’ NW] యొక్క శిక్షలోను బోధలోను” పెంచాలంటే కుటుంబ ఆరాధన చాలా అవసరం. (ఎఫె. 6:4) మీకు చిన్నపిల్లలుంటే, వాళ్లు దేనిమీదా ఎక్కువసేపు ధ్యాస నిలపలేరని మీకు తెలుసు. వాళ్లు ఆసక్తిని త్వరగా కోల్పోకుండా ఉండాలంటే మీరేమి చేయవచ్చు? కొంతమంది తల్లిదండ్రులు ఏమి చేశారో ఇప్పుడు చూద్దాం.
అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్న జార్జ్ ఇలా అన్నాడు: “మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కుటుంబ బైబిలు అధ్యయనం ప్రతీవారం కొత్తగా ఉండేలా చేయడానికి నేను, నా భార్య ప్రయత్నించేవాళ్లం. కొన్నిసార్లు నా బైబిలు కథల పుస్తకములో ఏదైనా ఓ పాఠాన్ని చదివి, మేమందరం అందులోని వ్యక్తుల్లా తయారై దాన్ని నటించేవాళ్లం. వాళ్లు ఉపయోగించిన కత్తులు, రాజ దండములు, బుట్టలు వంటి వస్తువులను కూడా మేము తయారుచేసుకునేవాళ్లం. ‘నేనెవరో చెప్పుకోండి’ వంటి బైబిలుకు సంబంధించిన ఆటలు ఆడేవాళ్లం. కొన్ని కష్టమైన, కొన్ని సులువైన బైబిలు ప్రశ్నలను బోర్డుమీద రాసి ఆటలను రూపొందించేవాళ్లం. అంతేకాక ‘నోవహు ఓడ,’ ‘బైబిల్లో ఏ సంఘటన ఎప్పుడు జరిగింది’ వంటివాటి గురించి ఎక్కువగా తెలుసుకుని వాటి నమూనాలు, పట్టికలు తయారుచేసేవాళ్లం. కొన్నిసార్లు మేము బైబిల్లోని వ్యక్తులను, సంఘటనలను చూపించే చిత్రాల్ని గీసేవాళ్లం. ప్రస్తుతం మేము ఎఫెస్సీయులు 6:11-17లో ఉన్న ఆధ్యాత్మిక కవచాన్ని గీసి, మాలో ఒక్కొక్కరు దానిలోని ఒక్కో భాగం గురించి వివరించేలా ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. ఇలా చేయడం వల్ల మా కుటుంబ అధ్యయనం సరదాగా సాగుతోంది.”
అమెరికాలోని మిచిగన్‌లో నివసిస్తున్న డెబీ ఇలా చెప్పింది: “మా అమ్మాయికి మూడేళ్లున్నప్పుడు ఆమె ఆసక్తి నిలిపేలా చేయడానికి నేను, నా భర్త ఎంతో కష్టపడేవాళ్లం. ఒకరోజు, నా బైబిలు కథల పుస్తకములోని ఇస్సాకు రిబ్కాల కథను మా అమ్మాయికి బిగ్గరగా చదివి వినిపిస్తున్నప్పుడు రెండు బొమ్మలను తీసుకుని వాటిని వారిద్దరిలా నటింపజేశాను. అప్పుడు, చదివిన ప్రతీ మాటను మా అమ్మాయి ఎంతో జాగ్రత్తగా విన్నది. తర్వాతి నెలల్లో ఆ రెండు బొమ్మలు బైబిల్లోని వేర్వేరు వ్యక్తుల్లా నటించాయి. మేము ఏదైనా పాఠాన్ని చదివి వినిపించిన తర్వాత, దాన్ని నటింపజేయడానికి కావాల్సిన బొమ్మలు, ఇతర వస్తువుల కోసం మా అమ్మాయి ఇల్లంతా గాలిస్తూ ఏదో నిధిని వెదుకుతున్నట్లు వెదికేది. చెప్పుల పెట్టె, ఎర్రని రిబ్బన్ ఉపయోగించి ఎర్రని దారం కట్టివున్న రాహాబు ఇంటిని తయారుచేశాం. సంఖ్యాకాండము 21:4-9లో ఉన్న ఇత్తడి సర్పాన్ని చూపించడానికి, ఐదు అడుగుల పొడవున్న బొమ్మ పామును చీపురుకట్టకు చుట్టాము. ఆ కథకు అది సరిగ్గా సరిపోయింది. అలా ఉపయోగించిన వస్తువులను ఓ పెద్ద సంచిలో పెట్టాం. తను తరచూ హాల్లో కూర్చొని ఆ ‘బైబిలు కథల సంచిలో’ ఉన్నవాటిని వెదకడం చూస్తే మాకెంతో సంతోషమనిపిస్తుంది. తను సొంతగా ఆలోచించి ఆ బొమ్మలతో ముద్దుగా నటింపజేస్తుంటే, ఎంతో ముచ్చటేస్తుంది.”
పిల్లలను పెంచడం అంత సులభమేమీ కాదు. యెహోవాను సేవించాలని వాళ్లు కోరుకునేలా చేయాలంటే, వారానికి ఒకసారి కొంత సమయం వెచ్చించడం మాత్రమే సరిపోదు. అయితే, ఇతర సమయాల్లో ఇచ్చే ఆధ్యాత్మిక ఉపదేశానికి కుటుంబ ఆరాధన ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి, ఈ విషయంలో మీరు చేసే కృషి వృథా కాదు!