కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు దుర్నీతిని ద్వేషిస్తున్నారా?

మీరు దుర్నీతిని ద్వేషిస్తున్నారా?

మీరు దుర్నీతిని ద్వేషిస్తున్నారా?

“నీవు [యేసు] . . . దుర్నీతిని ద్వేషించితివి.”—హెబ్రీ. 1:9.

1. ప్రేమ గురించి యేసు ఏమి బోధించాడు?

 ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో చెప్పడానికి యేసుక్రీస్తు తన శిష్యులతో ఇలా అన్నాడు: “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” (యోహా. 13:34, 35) ఒకరిపట్ల ఒకరు స్వయంత్యాగపూరిత ప్రేమను చూపించుకోవాలని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఆ ప్రేమ వారికి గుర్తింపు చిహ్నంగా ఉంటుంది. “మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి” అని కూడా యేసు వారికి చెప్పాడు.—మత్త. 5:44.

2. క్రీస్తు శిష్యులు దేన్ని ద్వేషించాలి?

2 యేసు తన శిష్యులకు, ప్రేమ చూపించమని చెప్పడంతోపాటు వారు దేన్ని ద్వేషించాలో కూడా నేర్పించాడు. యేసు గురించి ఇలా చెప్పబడింది: “నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని [భక్తిహీనతను] ద్వేషించితివి.” (హెబ్రీ. 1:9; కీర్త. 45:7) మనం కేవలం నీతిని ప్రేమించడమే కాక దుర్నీతిని లేదా పాపాన్ని ద్వేషించాలని ఇది చూపిస్తోంది. “పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము” అని అపొస్తలుడైన యోహాను సూటిగా చెప్పాడు.—1 యోహా. 3:4.

3. దుర్నీతిని ద్వేషించే విషయానికి సంబంధించి ఈ ఆర్టికల్‌లో ఏ అంశాల గురించి పరిశీలిస్తాం?

3 క్రైస్తవులముగా మనం, ‘నేను దుర్నీతిని ద్వేషిస్తున్నానా?’ అని ప్రశ్నించుకోవాలి. ఈ నాలుగు రంగాల్లో మనం చెడును ద్వేషిస్తున్నామని ఎలా చూపించవచ్చో పరిశీలిద్దాం: (1) మద్యపాన దుర్వినియోగం విషయంలో మన వైఖరి, (2)  భూతప్రేత వ్యవహారాలకు సంబంధించి మన దృక్పథం, (3) అనైతికతకు మనం స్పందించే తీరు, (4) దుర్నీతిని ప్రేమించేవారి విషయంలో మన దృక్పథం.

మద్యపానానికి బానిసలు కాకండి

4. అతిగా తాగడం గురించి యేసు ఎందుకు ధైర్యంగా హెచ్చరించగలిగాడు?

4 యేసు అప్పుడప్పుడు ద్రాక్షారసం తాగేవాడు, అది దేవుడిచ్చిన బహుమానం అని ఆయనకు తెలుసు. (కీర్త. 104:14, 15) ఆ బహుమానాన్ని దుర్వినియోగం చేసేలా ఆయన ఎన్నడూ అతిగా తాగలేదు. (సామె. 23:29-33) కాబట్టే, ఆయన దాని గురించి ధైర్యంగా హెచ్చరించగలిగాడు. (లూకా 21:34 చదవండి.) మద్యపాన దుర్వినియోగం ఇతర పాపాలకు దారితీయవచ్చు. అందుకే అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి.” (ఎఫె. 5:18) అంతేగాక, “మిగుల మద్యపానాసక్తులు[గా]” ఉండవద్దని సంఘంలోని వృద్ధ స్త్రీలకు కూడా ఆయన ఉపదేశించాడు.—తీతు 2:3.

5. మద్యపానీయాలు తాగాలని నిర్ణయించుకునేవారు ఏ ప్రశ్నలు వేసుకోవచ్చు?

5 మద్యపానీయాలు తాగాలని మీరు నిర్ణయించుకుంటే, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోవాలి: ‘అతిగా తాగే విషయంలో యేసుకున్న అభిప్రాయమే నాకూ ఉందా? ఈ విషయంలో ఎవరికైనా నేను ఉపదేశం ఇవ్వాల్సివస్తే ధైర్యంగా ఇవ్వగలనా? నేను బాధలను మర్చిపోవడానికి లేదా ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి తాగుతానా? ఒక వారంలో నేను ఎంత తాగుతాను? అతిగా తాగుతున్నావేమో చూసుకోమని నాకు ఎవరైనా చెబితే నేనెలా స్పందిస్తాను? నన్ను నేను సమర్థించుకుంటానా, ఆఖరికి వారిపై కోపగించుకుంటానా?’ మనం మద్యానికి బానిసలైతే సరిగా ఆలోచించలేం, సరైన నిర్ణయాలు తీసుకోలేం. క్రీస్తు అనుచరులు తమ ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు.—సామె. 3:21, 22.

భూతప్రేత వ్యవహారాలకు దూరంగా ఉండండి

6, 7. (ఎ) సాతానుతో, దయ్యాలతో యేసు ఎలా వ్యవహరించాడు? (బి) నేడు భూతప్రేత వ్యవహారాలు ఎందుకు ఇంతగా పెరిగిపోతున్నాయి?

6 యేసు భూమ్మీద ఉన్నప్పుడు సాతానును, అతడి దయ్యాలను ధీటుగా ఎదిరించాడు. తన యథార్థతపై సాతాను నేరుగా చేసిన దాడులను ఆయన తిప్పికొట్టాడు. (లూకా 4:1-13) తన ఆలోచనలను, పనులను ప్రభావితం చేయడానికి సాతాను కుయుక్తితో చేసిన ప్రయత్నాలను పసిగట్టి, వాటిని ఎదిరించాడు. (మత్త. 16:21-23) క్రూరంగా పీడించే దయ్యాల నుండి యోగ్యులైన ప్రజలను యేసు విడుదల చేశాడు.—మార్కు 5:2, 8, 12-15; 9:20, 25-27.

7 యేసు 1914లో రాజైన తర్వాత సాతాను, అతడి దయ్యాల చెడు ప్రభావం నుండి పరలోకాన్ని పరిశుభ్రం చేశాడు. ఫలితంగా, సాతాను ఎప్పుడూ లేనంత ఎక్కువగా ‘సర్వలోకాన్ని మోసం చేయాలని’ నిర్ణయించుకున్నాడు. (ప్రక. 12:9, 10) కాబట్టి, నేడు భూతప్రేత వ్యవహారాలపై ప్రజలు ఇంతగా ఆసక్తి చూపిస్తున్నారంటే అందులో ఆశ్చర్యం లేదు. అయితే మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు?

8. వినోదాన్ని ఎంచుకునేటప్పుడు మనం ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి?

8 భూతప్రేత వ్యవహారాలకు సంబంధించిన ప్రమాదాల గురించి బైబిలు స్పష్టమైన హెచ్చరికలను ఇస్తోంది. (ద్వితీయోపదేశకాండము 18:10-12 చదవండి.) దయ్యాలకు సంబంధించిన వ్యవహారాలను ప్రోత్సహించే సినిమాలు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్‌ గేమ్‌ల వంటివాటి ద్వారా సాతాను, అతడి దయ్యాలు నేడు ప్రజల ఆలోచనను ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి వినోదాన్ని ఎంచుకునేటప్పుడు మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘గత కొన్ని నెలల్లో నేను వినోదం కోసం మంత్రతంత్రాలకు సంబంధించిన సినిమాలను, టీవీ కార్యక్రమాలను, ఎలక్ట్రానిక్‌ గేమ్‌లను, పుస్తకాలను, హాస్య పుస్తకాలను ఎంచుకున్నానా? భూతప్రేత వ్యవహారాలను తిరస్కరించడం ఎందుకు ప్రాముఖ్యమో నేను గ్రహిస్తున్నానా? లేదా ఆ ప్రమాదాలను తక్కువ అంచనా వేస్తున్నానా? నేను ఎంచుకునే వినోదం గురించి యెహోవా ఏమనుకుంటాడో అని కూడా నేను ఆలోచిస్తున్నానా? నేను ఇలాంటి సాతాను సంబంధిత ప్రభావాలకు లోనైనప్పుడు యెహోవా మీద, ఆయన నీతియుక్త ప్రమాణాల మీద ప్రేమతో వాటిని తిరస్కరిస్తానా?’—అపొ. 19:19, 20.

అనైతికత విషయంలో యేసు ఇచ్చిన హెచ్చరికను పాటించండి

9. ఒక వ్యక్తి ఎలా దుర్నీతిని ప్రేమించే ప్రమాదం ఉంది?

9 లైంగిక సంబంధాల విషయంలో యెహోవా ఏర్పరచిన ప్రమాణాన్ని యేసు సమర్థించాడు. ఆయన ఇలా అన్నాడు: “సృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు —ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.” (మత్త. 19:4-6) కళ్లతో చూసేది హృదయాన్ని ప్రభావితం చేస్తుందని యేసుకు తెలుసు. అందుకే కొండమీది ప్రసంగంలో ఆయన ఇలా చెప్పాడు: “వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పునదేమనగా—ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” (మత్త. 5:27, 28) యేసు హెచ్చరికను పట్టించుకోనివాళ్లు నిజానికి దుర్నీతిని ప్రేమిస్తున్నట్లే!

10. ఒక వ్యక్తి అశ్లీల చిత్రాలను చూసే అలవాటును మానుకోవడం సాధ్యమే అని చూపించే అనుభవాన్ని చెప్పండి.

10 అశ్లీలత రూపంలో సాతాను లైంగిక అనైతికతను ప్రోత్సహిస్తున్నాడు. లోకమంతా దానితోనే నిండిపోయింది. అశ్లీల చిత్రాలను చూసేవారికి తమ మనసుల్లో నుండి వాటిని తొలగించుకోవడం చాలా కష్టమౌతుంది. అంతేగాక వారు వాటికి బానిసలైపోయే ప్రమాదం ఉంది. ఒక సహోదరునికి ఏమి జరిగిందో చూడండి. ఆయన ఇలా చెప్పాడు: “నేను రహస్యంగా అశ్లీల చిత్రాలను చూసేవాణ్ణి. నేను ఒక ఊహాలోకాన్ని సృష్టించుకున్నాను, యెహోవాను సేవించే లోకంతో దానికి ఎలాంటి సంబంధం లేదని నాకనిపించింది. ఈ అలవాటు తప్పని తెలిసినా, దేవుడు నా సేవను అంగీకరిస్తాడని నన్ను నేను సమర్థించుకున్నాను.” ఈయన ఆలోచన ఎలా మారింది? “సంఘ పెద్దలకు చెప్పడం ఎంతో కష్టమనిపించినా, నా సమస్య గురించి వారికి చెప్పాలని నిర్ణయించుకున్నాను” అని ఆయన అన్నాడు. చివరకు ఈ సహోదరుడు ఆ అసహ్యకరమైన అలవాటును మానేశాడు. ఆయనిలా ఒప్పుకున్నాడు: “ఈ పాపాన్ని కడిగేసుకున్న తర్వాత, నా మనస్సాక్షి చాలా పరిశుభ్రంగా ఉందని నాకనిపించింది.” దుర్నీతిని ద్వేషించేవారు అశ్లీలతను కూడా ద్వేషించడం నేర్చుకోవాలి.

11, 12. సంగీతాన్ని ఎంచుకునేటప్పుడు దుర్నీతిని ద్వేషిస్తున్నామని మనం ఎలా చూపించవచ్చు?

11 సంగీతం, దానికి సంబంధించిన పదాలు మన భావావేశాలను, అలంకారిక హృదయాన్ని బలంగా ప్రభావితం చేయవచ్చు. నిజానికి సంగీతం యెహోవా ఇచ్చిన బహుమానం, అది ఎంతో కాలంగా సత్యారాధనలో ఉపయోగించబడుతోంది. (నిర్గ. 15:20, 21; ఎఫె. 5:19) కానీ సాతాను దుష్టలోకం అనైతికతను ఘనపర్చే సంగీతాన్ని ప్రోత్సహిస్తోంది. (1 యోహా. 5:19) మీరు వినే సంగీతం మిమ్మల్ని కలుషితం చేస్తుందా లేదా అనేది మీరెలా తెలుసుకోవచ్చు?

12 మొదటిగా, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘నేను వినే పాటలు హత్యను, వ్యభిచారాన్ని, జారత్వాన్ని, దూషణను ఘనపరుస్తున్నాయా? ఫలానా పాటలోని పదాలను నేను ఎవరికైనా చదివి వినిపిస్తే, నేను దుర్నీతిని ద్వేషిస్తున్నానని వారు అనుకుంటారా లేక నా హృదయం కలుషితమైపోయిందని అనుకుంటారా?’ దుర్నీతిని ఘనపర్చే సంగీతాన్ని వింటూనే దాన్ని ద్వేషిస్తున్నామని మనం చెప్పుకోలేం. యేసు ఇలా అన్నాడు: “నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవి . . . దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును.”—మత్త. 15:18, 19; యాకోబు 3:10, 11 పోల్చండి.

దుర్నీతిని ప్రేమించేవారి పట్ల యేసుకున్న అభిప్రాయాన్ని అలవర్చుకోండి

13. పాపపు పనుల వల్ల మనస్సాక్షి మొద్దుబారిపోయిన వారిపట్ల యేసు అభిప్రాయం ఏమిటి?

13 పాపులను లేదా దుర్నీతిపరులను మారుమనస్సు పొందమని చెప్పేందుకు తాను వచ్చానని యేసు అన్నాడు. (లూకా 5:30-32) పాపపు పనుల వల్ల మనస్సాక్షి మొద్దుబారిపోయిన వారిపట్ల యేసుకు ఎలాంటి అభిప్రాయం ఉండేది? అలాంటివారి ప్రభావానికి లోనుకాకూడదని యేసు గట్టి హెచ్చరికలు చేశాడు. (మత్త. 23:15, 23-26) ఆయన స్పష్టంగా ఇలా చెప్పాడు: “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు [దేవుడు తీర్పు తీరుస్తున్నప్పుడు] అనేకులు నన్ను చూచి—ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.” కానీ మారుమనస్సు పొందకుండా దుర్నీతికి పాల్పడేవారితో ఆయన, “నా యొద్దనుండి పొండి” అని చెప్పి వారిని తిరస్కరిస్తాడు. (మత్త. 7:21-23) వారెందుకు అలాంటి తీర్పు పొందుతారు? ఎందుకంటే వారు తమ దుర్నీతికరమైన పనులతో దేవుణ్ణి అగౌరవపరుస్తారు, ఇతరులకు హాని చేస్తారు.

14. పశ్చాత్తాపపడని పాపులను సంఘం నుండి ఎందుకు బహిష్కరించాలి?

14 పశ్చాత్తాపపడని పాపులను సంఘం నుండి బహిష్కరించాలని దేవుని వాక్యం ఆజ్ఞాపిస్తోంది. (1 కొరింథీయులు 5:9-13 చదవండి.) కనీసం మూడు కారణాలను బట్టి అంటే, (1) యెహోవా నామంపై నింద పడకుండా ఉండేందుకు, (2) సంఘం కలుషితం కాకుండా కాపాడేందుకు, (3) సాధ్యమైతే పశ్చాత్తాపపడేలా పాపికి సహాయం చేసేందుకు అలా చేయడం అవసరం.

15. మనం యెహోవాకు యథార్థంగా ఉండాలనుకుంటే ఏ ప్రాముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలి?

15 మానకుండా దుర్నీతికి పాల్పడుతున్న వారిపట్ల యేసుకున్న అభిప్రాయమే మనకూ ఉందా? ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం మంచిది: ‘క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించబడిన లేదా సంఘంతో సహవాసాన్ని మానేసిన వ్యక్తితో నేను క్రమంగా సహవసిస్తానా? ఆ వ్యక్తి ఒకవేళ దగ్గరి బంధువైతే ఏమి చేస్తాను?’ అలాంటి పరిస్థితి నీతిపట్ల మనకున్న ప్రేమకు, దేవుని పట్ల మనకున్న యథార్థతకు నిజంగా ఒక పరీక్షే.

16, 17. ఒక క్రైస్తవ తల్లికి ఎలాంటి బాధాకరమైన పరిస్థితి ఎదురైంది? బహిష్కరణ ఏర్పాటుకు లోబడడానికి ఆమెకు ఏది సహాయం చేసింది?

16 ఎదిగిన కుమారుడున్న ఒక సహోదరి అనుభవాన్ని పరిశీలించండి. ఆ అబ్బాయి ఒకప్పుడు యెహోవాను ప్రేమించేవాడు కానీ తర్వాత, ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా దుర్నీతికి పాల్పడుతూ వచ్చాడు. కాబట్టి, అతను సంఘం నుండి బహిష్కరించబడ్డాడు. అయితే మన సహోదరికి యెహోవాపై ప్రేమ ఉంది, తన కుమారునిపై కూడా ప్రేమ ఉంది. అందుకే, అతనితో సహవసించకూడదనే లేఖనాధారిత ఆజ్ఞను పాటించడం ఆమెకు చాలా కష్టమనిపించింది.

17 మీరు ఆ సహోదరికి ఏ సలహా ఇచ్చి ఉండేవారు? ఆమె బాధను యెహోవా అర్థం చేసుకుంటాడని గ్రహించేందుకు ఒక పెద్ద ఆమెకు సహాయం చేశాడు. తన ఆత్మ కుమారుల్లో కొందరు తనపై తిరుగుబాటు చేసినప్పుడు యెహోవా ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించమని ఆయన ఆమెకు చెప్పాడు. ఇలాంటి పరిస్థితి ఎంత బాధాకరంగా ఉంటుందో యెహోవాకు తెలిసినప్పటికీ, పశ్చాత్తాపపడని పాపులు బహిష్కరించబడాలని ఆయన కోరుతున్నాడనే విషయాన్ని ఆ పెద్ద ఆమెకు వివరించాడు. విషయాన్ని అర్థంచేసుకొని ఆమె యెహోవా చేసిన బహిష్కరణ ఏర్పాటుకు యథార్థంగా లోబడింది. a అలా యథార్థత చూపించడం యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తుంది.—సామె. 27:11.

18, 19. (ఎ) పశ్చాత్తాపపడకుండా దుర్నీతికి పాల్పడుతున్న వ్యక్తితో సంబంధాలను తెంచుకోవడం ద్వారా మనం దేన్ని ద్వేషిస్తున్నామని చూపిస్తాం? (బి) దేవుని పట్ల, ఆయన చేసిన ఏర్పాటు పట్ల యథార్థత చూపిస్తే ఎలాంటి ఫలితం రావచ్చు?

18 మీరు కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంటే, యెహోవా మనల్ని అర్థం చేసుకుంటాడని దయచేసి గుర్తుంచుకోండి. బహిష్కరించబడిన లేదా సహవాసం మానుకున్న వ్యక్తితో సంబంధాలను తెంచుకోవడం ద్వారా తప్పు చేయడానికి ఆ వ్యక్తిని నడిపించిన ఆలోచనలను, పనులను మీరు ద్వేషిస్తున్నారని చూపిస్తారు. అంతేగాక ఆ వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారని, వారికి మంచి చేయాలనుకుంటున్నారని చూపిస్తారు. మీరు యెహోవాకు యథార్థంగా ఉండడం వల్ల, క్రమశిక్షణ ఇవ్వబడుతున్న వ్యక్తి పశ్చాత్తాపం చూపించి యెహోవా దగ్గరకు తిరిగివచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

19 బహిష్కరించబడి, ఆ తర్వాత తిరిగి చేర్చుకోబడిన ఒక సహోదరి ఇలా రాసింది: “యెహోవా తన ప్రజలను ప్రేమిస్తున్నాడు కాబట్టే తన సంస్థను పరిశుభ్రంగా ఉంచుతున్నాడని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. లోకస్థులకు కఠినంగా అనిపించవచ్చు కానీ మనకది చాలా ప్రాముఖ్యమైనది, ప్రేమపూర్వకమైనది కూడా.” ఒక్కసారి ఆలోచించండి, ఆమె బహిష్కరించబడిన తర్వాత సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు ఆమెతో ఎప్పటిలాగే కలిసివుంటే ఆమె అలాంటి అభిప్రాయానికి వచ్చేందుకు సహాయం దొరికివుండేదా? బహిష్కరణకు సంబంధించిన లేఖనాధార ఏర్పాటును సమర్థించడం ద్వారా మనం నీతిని ప్రేమిస్తున్నామనీ, మన ప్రవర్తన విషయంలో ప్రమాణాలను విధించే హక్కు యెహోవాకు ఉందనే విషయాన్ని గుర్తిస్తున్నామనీ చూపిస్తాం.

“చెడుతనమును అసహ్యించుకొనుడి”

20, 21. దుర్నీతిని ద్వేషించడాన్ని నేర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

20 “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి” అని అపొస్తలుడైన పేతురు హెచ్చరించాడు. ఎందుకు? ఎందుకంటే, “మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.” (1 పేతు. 5:8) సాతాను తర్వాత మింగబోయేది మిమ్మల్నేనా? ఈ ప్రశ్నకు జవాబు, దుర్నీతిని ద్వేషించడాన్ని మీరు ఎంత బాగా నేర్చుకుంటున్నారనే దానిపైనే ఆధారపడివుంది.

21 చెడుపట్ల అసహ్యాన్ని పెంచుకోవడం అంత సులభం కాదు. మనం పాపంలో పుట్టాం, శరీరాశలకు లొంగిపొమ్మని ప్రోత్సహించే లోకంలో జీవిస్తున్నాం. (1 యోహా. 2:15-17) యేసుక్రీస్తును అనుకరించడం ద్వారా, యెహోవా దేవుని మీద ప్రగాఢమైన ప్రేమను పెంపొందించుకోవడం ద్వారా దుర్నీతి పట్ల ద్వేషాన్ని అలవర్చుకోవచ్చు. యెహోవా ‘తన భక్తుల ప్రాణాలను కాపాడతాడనే, భక్తిహీనుల చేతిలోనుండి వారిని విడిపిస్తాడనే’ దృఢనమ్మకంతో ‘చెడుతనాన్ని అసహ్యించుకోవాలని’ మనం తీర్మానించుకుందాం.—కీర్త. 97:10.

[అధస్సూచి]

a కావలికోట జనవరి 15, 2007 సంచికలోని 17-20 పేజీలను చూడండి.

మీరెలా జవాబిస్తారు?

• మద్యపానీయాల పట్ల మన దృక్పథాన్ని ఎలా పరిశీలించుకోవచ్చు?

• భూతప్రేత వ్యవహారాలకు దూరంగా ఉండాలంటే మనమెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

• అశ్లీలత ఎందుకు ప్రమాదకరమైనది?

• మనం ప్రేమించే వ్యక్తి బహిష్కరించబడినప్పుడు, దుర్నీతిని ద్వేషిస్తున్నామని మనమెలా చూపించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[29వ పేజీలోని చిత్రం]

మద్యపానీయాలను తాగాలని నిర్ణయించుకుంటే మీరు దేని గురించి ఆలోచించాలి?

[30వ పేజీలోని చిత్రం]

వినోదం విషయంలో సాతాను ప్రభావానికి లోనవకుండా చూసుకోండి

[31వ పేజీలోని చిత్రం]

అశ్లీల చిత్రాలను చూసే వ్యక్తి దేనిపట్ల ప్రేమను పెంచుకుంటాడు?