కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు పొందిన ఆశీర్వాదాల పట్ల నిజంగా కృతజ్ఞత చూపిస్తున్నారా?

మీరు పొందిన ఆశీర్వాదాల పట్ల నిజంగా కృతజ్ఞత చూపిస్తున్నారా?

మీరు పొందిన ఆశీర్వాదాల పట్ల నిజంగా కృతజ్ఞత చూపిస్తున్నారా?

ఐగుప్తు దాసత్వం నుండి అద్భుతంగా విడిపించబడినప్పుడు యెహోవాను ఆరాధించడానికి స్వేచ్ఛ దొరికిందని ఇశ్రాయేలీయులు సంతోషించారు. (నిర్గ. 14:29–15:1, 20, 21) అయితే, కొంతకాలానికే వారి ఆలోచనా విధానం మారిపోయింది, తమ పరిస్థితుల గురించి సణగడం మొదలుపెట్టారు. ఎందుకు? యెహోవా వారి కోసం చేసినవాటి గురించి కాక అరణ్యంలో ఎదురైన ఇబ్బందుల గురించే ఎక్కువ ఆలోచించడం మొదలుపెట్టారు. వారు మోషేతో, “ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము [మన్నా] మాకు అసహ్యమైనదనిరి.”—సంఖ్యా. 21:5.

శతాబ్దాల తర్వాత, ఇశ్రాయేలీయులను పరిపాలించిన దావీదు ఇలా పాడాడు: “నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను. నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది, యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించెదను.” (కీర్త. 13:5, 6) యెహోవా తనపట్ల చూపించిన కృపను దావీదు మరచిపోలేదు. ఆయన దాని గురించి తరచూ ధ్యానిస్తుండేవాడు. (కీర్త. 103:2) యెహోవా మనపట్ల కూడా ఎన్నో విధాలుగా కృప చూపించాడు. దాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఉంటే మంచిది. కాబట్టి, మనం అనుభవిస్తున్న దేవుని ఆశీర్వాదాల్లో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.

‘యెహోవాకు సన్నిహితులౌతారు’

‘యెహోవాయందు భయభక్తులు గలవారు ఆయనకు సన్నిహితులౌతారు’ అని కీర్తనకర్త పాడాడు. (కీర్త. 25:14, NW) యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని కలిగివుండడం అపరిపూర్ణ మానవులకు దొరికిన గొప్ప గౌరవం! అయితే, మనం రోజువారీ పనుల్లో తలమునకలవడం వల్ల ప్రార్థన కోసం తక్కువ సమయాన్ని వెచ్చిస్తుంటే అప్పుడేమిటి? అలా జరిగితే, యెహోవాతో మనకున్న మంచి సంబంధానికి ఏమౌతుందో ఆలోచించండి. మన స్నేహితునిగా యెహోవా, తనమీద నమ్మకముంచాలనీ మన భయాలను, కోరికలను, చింతలను ప్రార్థనలో ఆయనతో మనస్ఫూర్తిగా చెప్పుకోవాలనీ కోరుతున్నాడు. (సామె. 3:5, 6; ఫిలి. 4:6, 7) కాబట్టి, మన ప్రార్థనలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం లేదంటారా?

ప్రవీణ్‌ అనే ఓ యౌవన సాక్షి తన ప్రార్థనల గురించి ఆలోచించినప్పుడు వాటిని మెరుగుపర్చుకోవాల్సిన అవసరముందని గుర్తించాడు. a ఆయనిలా అన్నాడు: “నేను యెహోవాకు ఎప్పుడూ ఒకేలా ప్రార్థించడం అలవాటైపోయింది.” వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌లో (ఆంగ్లం) ఆ అంశం గురించి పరిశీలించినప్పుడు బైబిల్లో దాదాపు 180 ప్రార్థనలు ఉన్నాయని ఆయన గమనించాడు. ఈ ప్రార్థనల్లో యెహోవా సేవకులు తమ అంతరంగ భావాలను తెలియజేశారు. ప్రవీణ్‌ ఇలా అన్నాడు: “ఈ ఉదాహరణలను ధ్యానించడం వల్ల ఏదైనా ఒక విషయం గురించి నిర్దిష్టంగా ప్రార్థించడం నేర్చుకున్నాను. ఫలితంగా, యెహోవాకు మనస్ఫూర్తిగా ప్రార్థించగలుగుతున్నాను. ఇప్పుడు ప్రార్థనలో ఆయనకు సన్నిహితమౌతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను.”

“తగినవేళ” ఆహారము

మనకు అందుతున్న ఎన్నో లేఖన సత్యాలు కూడా యెహోవా ఇచ్చే ఆశీర్వాదమే. మనం ఆధ్యాత్మిక ఆహారం మెండుగా తీసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా “హృదయానందముచేత కేకలు” వేస్తాం. (యెష. 65:13, 14) అయితే, చెడు ప్రభావాలు సత్యంపట్ల మనకున్న ఉత్సాహాన్ని తగ్గించకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు, మనం మతభ్రష్ట ప్రచారం మీద ఆసక్తి చూపించడం మొదలుపెడితే అది మన ఆలోచనలను ప్రభావితం చేసి, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా యెహోవా “తగినవేళ” అందిస్తున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని విలువైనదిగా ఎంచకుండా చేస్తుంది.—మత్త. 24:45-47.

ఎన్నో ఏళ్లు యెహోవాను సేవించిన అరుణ్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది. మతభ్రష్ట ఆలోచనలవల్ల ఆయన సత్యం నుండి పక్కకు మళ్లాడు. మతభ్రష్ట వెబ్‌సైట్‌లను కొద్దిసేపు చూడడంలో పెద్ద ప్రమాదమేమీలేదని ఆయన అనుకున్నాడు. ఆయన ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “మొదట్లో, మతభ్రష్టులు ‘సత్యం’ అని చెప్పే విషయాల పట్ల నేను ఆసక్తి చూపించాను. వారు చెప్పేది పరిశీలించినకొద్దీ యెహోవా సంస్థను విడిచిపెట్టడం తప్పుకాదని మరింతగా అనిపించేది. కానీ ఆ తర్వాత, యెహోవాసాక్షుల మీద మతభ్రష్టులు చేసే ఆరోపణల గురించి కొంత పరిశీలించినప్పుడు అబద్ధ బోధకుల పన్నాగాలను తెలుసుకున్నాను. మన ప్రచురణల్లోని సందర్భాన్ని పట్టించుకోకుండా తీసుకున్న సమాచారాన్ని, ‘బలమైన ఆధారాలుగా’ చూపిస్తూ మనది తప్పని చెబుతారు. అందుకే మళ్లీ మన ప్రచురణలను చదవడం, కూటాలకు హాజరవడం మొదలుపెట్టాను. నేను ఏమి పోగొట్టుకున్నానో కొంతకాలానికే గ్రహించాను.” సంతోషకరమైన విషయమేమిటంటే అరుణ్‌ సంఘంలోకి తిరిగి వచ్చాడు.

లోకమంతటా ఉన్న “సహోదరులు”

ఒకరిపట్ల ఒకరు ప్రేమ చూపిస్తూ ఐక్యంగా ఉండే మన సహోదరత్వం యెహోవా ఇచ్చిన ఆశీర్వాదం. (కీర్త. 133:1) అందుకే అపొస్తలుడైన పేతురు, లోకమంతటా ఉన్న “సహోదరులను ప్రేమించుడి” అని రాశాడు. (1 పేతు. 2:17) ఆ క్రైస్తవ సహోదరత్వంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక తల్లిదండ్రుల, సహోదరసహోదరీల ప్రేమను, మద్దతును పొందుతున్నాం.—మార్కు 10:29, 30.

అయితే, వివిధ పరిస్థితుల వల్ల కొన్నిసార్లు సహోదర సహోదరీలతో మనకున్న సంబంధం దెబ్బతినవచ్చు. ఉదాహరణకు, మన తోటివారి అపరిపూర్ణతలను చూసి విసుక్కొని, వారు చేసే ప్రతిదానిలో తప్పులుపట్టాలని చూస్తాం. మన విషయంలో అలా జరుగుతుంటే, తన సేవకుల్లో అపరిపూర్ణతలున్నా యెహోవా వారిని ప్రేమిస్తున్నాడని గుర్తుచేసుకోవడం మంచిది. అంతేగాక, “మనము పాపము లేని వారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు.” (1 యోహా. 1:8) “ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించ[డానికి]” మనం ప్రయాసపడాలి.—కొలొ. 3:13.

అనిత అనే యౌవనస్థురాలికి కష్టాలు పడిన తర్వాతే క్రైస్తవ సహవాసం విలువేమిటో అర్థమైంది. ఆమె, యేసు చెప్పిన ఉపమానంలోని తప్పిపోయిన కుమారునిలా ప్రవర్తించి క్రైస్తవ సంఘానికి దూరమైంది. తర్వాత, తన తప్పు తెలుసుకొని, తిరిగి సత్యంలోకి వచ్చింది. (లూకా 15:11-24) దాని నుండి అనిత ఏమి నేర్చుకుంది? ఆమె ఇలా చెబుతోంది: “నేను యెహోవా సంస్థలోకి తిరిగి వచ్చిన తర్వాత, సహోదర సహోదరీల్లో అపరిపూర్ణతలున్నా వారినందరినీ విలువైనవారిగా ఎంచుతున్నాను. గతంలో నేనెప్పుడూ తప్పులుపట్టాలని చూసేదాన్ని. ఇప్పుడైతే, తోటి విశ్వాసులతో ఉండడంవల్ల కలిగే చక్కని ఆశీర్వాదాలను ఏ కారణాన్ని బట్టి కూడా పోగొట్టుకోకూడదని తీర్మానించుకున్నాను. లోకంలో ఉన్నదేదీ దేవుడు మనకిచ్చిన అద్భుతమైన సహోదరత్వాన్ని వదులుకునేంత విలువైనది కాదు.”

మీరు పొందిన ఆశీర్వాదాల పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగివుండండి

మానవ సమస్యలన్నిటినీ దేవుని రాజ్యమే పరిష్కరిస్తుందనే మన నిరీక్షణ ఎంతో విలువైనది. మొదట్లో ఈ నిరీక్షణ గురించి తెలిసినప్పుడు కృతజ్ఞతతో మన హృదయాలు ఉప్పొంగిపోయాయి. యేసు ఉపమానంలో “అమూల్యమైన యొక ముత్యమును” కొనడం కోసం “తనకు కలిగినదంతయు అమ్మి[న]” వర్తకునికి అనిపించినట్లే మనకూ అనిపించింది. (మత్త. 13:45, 46) వర్తకుడు ఆ తర్వాత ముత్యం పట్ల తనకున్న ప్రశంసను కోల్పోయాడని యేసు చెప్పలేదు. అలాగే మన అద్భుతమైన నిరీక్షణ పట్ల మనకున్న ప్రశంసను ఎప్పటికీ కోల్పోకుండా ఉందాం.—1 థెస్స. 5:8; హెబ్రీ. 6:19.

అరవైకన్నా ఎక్కువ సంవత్సరాల నుండి యెహోవాను సేవిస్తున్న ఝాన్సీ ఉదాహరణ చూడండి. ఆమె ఇలా చెబుతోంది: “దేవుని రాజ్యం గురించి ఇతరులతో మాట్లాడడం వల్ల దానిని ఎప్పుడూ మనసులో ఉంచుకోగలిగాను. రాజ్యాన్ని గురించి తెలుసుకున్నప్పుడు వారి కళ్లల్లో కనిపించే ఆనందం నన్నెంతో ప్రోత్సహిస్తుంది. రాజ్య సత్యం బైబిలు విద్యార్థిలో తీసుకొచ్చే మార్పులను చూసినప్పుడు, ‘ఇతరులకు తెలియజేయడానికి నా దగ్గర ఎంత అద్భుతమైన సత్యాలు ఉన్నాయి!’ అని అనుకుంటుంటాను.”

యెహోవా మనకోసం చేసిన ఆధ్యాత్మిక ఏర్పాట్లన్నిటి గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా ఆయనకు కృతజ్ఞత చూపించాలనుకుంటాం. వ్యతిరేకత, అనారోగ్యం, వృద్ధాప్యం, కృంగుదల, ప్రియమైనవారిని కోల్పోవడం, ఆర్థిక ఇబ్బందులు వంటివి మనల్ని చుట్టుముట్టినా అవి ఎల్లకాలం ఉండవని మనకు తెలుసు. దేవుని రాజ్యంలో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతోపాటు భౌతిక ఆశీర్వాదాలను కూడా పొందుతాం. మనం ఇప్పుడు అనుభవించే ఎలాంటి శ్రమలైనా నూతన లోకంలో పూర్తిగా తీసివేయబడతాయి.—ప్రక. 21:4.

అయితే ఈ లోపు, మనం అనుభవిస్తున్న ఆధ్యాత్మిక ఆశీర్వాదాల పట్ల కృతజ్ఞత కలిగివుంటూ కీర్తనకర్తలా ప్రశంసతో ఇలా పాడదాం: “యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైనవాడొకడును లేడు.”—కీర్త. 40:5.

[అధస్సూచి]

a అసలు పేర్లు కావు.

[18వ పేజీలోని చిత్రం]

శ్రమలు వచ్చినప్పుడు ఆధ్యాత్మిక మద్దతు ఉంటుంది