కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సృష్టిని చేయడానికి పరిశుద్ధాత్మ ఉపయోగించబడింది

సృష్టిని చేయడానికి పరిశుద్ధాత్మ ఉపయోగించబడింది

సృష్టిని చేయడానికి పరిశుద్ధాత్మ ఉపయోగించబడింది

“యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను; ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను.” —కీర్త. 33:6.

1, 2. (ఎ) కాలం గడిచేకొద్దీ విశ్వం గురించి, భూమి గురించి మనిషికున్న జ్ఞానం ఎలా పెరిగింది? (బి) మనం ఏ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి?

 ఆల్బర్ట్‌ ఐన్‌స్టయిన్‌ 1905లో విశేషసాపేక్షతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అప్పట్లో, ఆయనతోపాటు చాలామంది శాస్త్రవేత్తలు, విశ్వమంతటిలో మన పాలపుంత నక్షత్రవీధి ఒక్కటే ఉందని అనుకున్నారు. విశ్వాన్ని వారు ఎంత తక్కువ అంచనా వేశారు! విశ్వంలో పదివేల కోట్లకన్నా ఎక్కువ నక్షత్రవీధులు ఉన్నాయని, కొన్ని నక్షత్రవీధుల్లో వందల కోట్ల నక్షత్రాలు ఉండవచ్చని ఇప్పుడు తెలుసుకున్నారు. మరింత ఎక్కువ దూరాలను చూడగలిగే దుర్భిణులను (టెలిస్కోపులను) భూమ్మీద నుండి చూసేలా లేదా భూమి చుట్టూ తిరిగేలా ఏర్పాటు చేసే కొద్దీ ఎప్పటికప్పుడు మరిన్ని నక్షత్రవీధుల్ని కనుగొంటూనే ఉన్నారు.

2 ఐన్‌స్టయిన్‌ కాలంలో, నక్షత్రవీధుల గురించి ఎక్కువ తెలియనట్లే భూమి గురించి కూడా ఎక్కువ తెలీదు. అయితే, ఆ కాలంలో జీవించిన ప్రజలకు వారి పూర్వీకుల కంటే ఎక్కువ తెలుసనే విషయాన్ని కాదనలేం. అలాగే, భూమ్మీదున్న జీవుల గురించి, వాటిలో ఉన్న సౌందర్యం సంశ్లిష్టతల గురించి, అవి జీవించేలా చేస్తున్న వ్యవస్థల గురించి అప్పటికన్నా ఇప్పుడు చాలా ఎక్కువ తెలుసుకోగలిగాం. రానున్న సంవత్సరాల్లో భూమి గురించి, విశ్వం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటామని ఖచ్చితంగా చెప్పగలం. అయితే, ‘అసలు ఇవన్నీ ఎలా వచ్చాయి?’ అనేది తెలుసుకోవడం ప్రాముఖ్యం. ఆ విషయాన్ని సృష్టికర్త తన పరిశుద్ధ లేఖనాల్లో వివరించాడు కాబట్టే దాని గురించి మనం తెలుసుకోవడం సాధ్యమౌతుంది.

అద్భుతమైన సృష్టి

3, 4. దేవుడు విశ్వాన్ని ఎలా సృష్టించాడు? ఆయన చేతి పనులు ఆయనను ఎలా మహిమపరుస్తున్నాయి?

3 విశ్వం ఎలా వచ్చిందో బైబిల్లోని మొదటి వాక్యం వివరిస్తుంది. అక్కడ ఇలా ఉంది: “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.” (ఆది. 1:1) అంతకుముందు ఎలాంటి పదార్థం లేకపోయినా యెహోవా శక్తివంతమైన తన పరిశుద్ధాత్మను ఉపయోగించి ఆకాశాన్ని, భూమిని, విశ్వంలోవున్న ప్రతీదాన్ని సృష్టించాడు. ఒక కళాకారుడు వస్తువులు తయారుచేయడానికి తన చేతులను, పనిముట్లను ఉపయోగిస్తాడు. కానీ దేవుడైతే తాను అనుకున్న గొప్ప కార్యాలు సాధించడానికి తన పరిశుద్ధాత్మను ఉపయోగిస్తాడు.

4 బైబిలు, పరిశుద్ధాత్మను దేవుని “వ్రేలు” అని కూడా పిలుస్తుంది. (లూకా 11:20; మత్త. 12:28) తన పరిశుద్ధాత్మను ఉపయోగించి సృష్టించిన ‘తన చేతి పనులు’ యెహోవాను మహిమపరుస్తున్నాయి. “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది” అని కీర్తనకర్తయైన దావీదు పాడాడు. (కీర్త. 19:1) దేవుని పరిశుద్ధాత్మకు ఎంత అపారమైన శక్తి ఉందో సృష్టిని చూస్తే తెలుస్తుంది. (రోమా. 1:20) ఎలా?

దేవుని శక్తికి అవధుల్లేవు

5. సృష్టిని చేయడంలో పరిశుద్ధాత్మ శక్తిని యెహోవా ఎలా ఉపయోగించాడో వివరించండి.

5 ఈ విశ్వం మన ఊహకందనంత పెద్దదనే విషయం గురించి ఆలోచిస్తే యెహోవాకు అంతులేని శక్తి, బలం ఉన్నాయని అర్థమౌతుంది. (యెషయా 40:26 చదవండి.) ఇప్పుడున్న విజ్ఞానశాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి, పదార్థాన్ని శక్తిగానూ శక్తిని పదార్థంగానూ మార్చవచ్చనేది సాధారణంగా తెలిసిన విషయం. నక్షత్రాల్లో ఒకటైన సూర్యునిలో కూడా ప్రతీ సెకనుకు 40 లక్షల టన్నుల పదార్థం సూర్యరశ్మిగా, ఇతర రకాల శక్తిగా వెలువడుతోంది. ఆ శక్తిలో చిన్న మొత్తమే భూమిని చేరుకుంటుంది, అయినా జీవులు మనుగడ సాగించడానికి అది సరిపోతుంది. కాబట్టి సూర్యుణ్ణి, వేల కోట్ల నక్షత్రాలను సృష్టించడానికి ఎంతో శక్తి, బలం అవసరమని తెలుస్తోంది. అందుకు అవసరమైన దానికన్నా ఎంతో ఎక్కువ శక్తి యెహోవాకు ఉంది.

6, 7. (ఎ) దేవుడు తన పరిశుద్ధాత్మను క్రమపద్ధతిలో ఉపయోగించాడని ఎందుకు చెప్పవచ్చు? (బి) విశ్వం దానంతటదే రాలేదని ఎందుకు చెప్పవచ్చు?

6 సృష్టిని చేయడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని ఎంతో క్రమపద్ధతిలో ఉపయోగించాడని మన చుట్టూ ఉన్నవాటిని చూస్తే తెలుస్తుంది. ఉదాహరణకు, మీ దగ్గర కొన్ని వేర్వేరు రంగుల బంతులు ఉన్నాయనుకోండి. వాటిని ఓ పెట్టెలో వేసి బాగా కుదిపారు. ఆ తర్వాత వాటన్నిటిని ఒకేసారి నేలమీద పడేశారు. అప్పుడు ఒకే రంగు బంతులన్నీ అంటే నీలం రంగు బంతులన్నీ ఒక గుంపుగా, పసుపు రంగు బంతులన్నీ మరో గుంపుగా ఏర్పడతాయని అనుకుంటారా? అలా ఎప్పటికీ అనుకోరు! నియంత్రణలేని ఏ పనివల్లైనా దాదాపుగా క్రమంలేనివే ఏర్పడతాయి. ఈ వాస్తవాన్ని అందరూ ఒప్పుకుంటారు.

7 మనం దుర్భిణిలో నుండి ఆకాశంలోకి చూసినప్పుడు ఏమి కనిపిస్తుంది? ఎంతో క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయబడిన పెద్దపెద్ద నక్షత్రవీధులు, నక్షత్రాలు, గ్రహాలు కనిపిస్తాయి. అవన్నీ ఎంతో ఖచ్చితత్వంతో కదులుతుంటాయి. ఎలాంటి ప్రణాళిక, నియంత్రణ లేకుండా వాటంతటవే జరిగిన సంఘటనల వల్ల ఇది సాధ్యం కాదు. ఇదంతా చూసినప్పుడు, ‘ఇంత క్రమంగావున్న విశ్వాన్ని తయారుచేయడానికి అసలు ఏ శక్తి ఉపయోగించబడింది?’ అనే ప్రశ్న మనకు వస్తుంది. ఆ శక్తి ఏమిటో తెలుసుకోవడానికి మనుష్యులు చేసే విజ్ఞానశాస్త్ర పరిశోధనలు, ప్రయోగాలు సరిపోవు. అయితే బైబిలు, ఆ శక్తి దేవుని పరిశుద్ధాత్మ అని చెబుతోంది. అది ఈ విశ్వంలోనే అన్నిటికన్నా బలమైన శక్తి! “యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను; ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను” అని కీర్తనకర్త పాడాడు. (కీర్త. 33:6) మనం రాత్రిళ్లు ఆకాశంవైపు చూస్తే ఆ నక్షత్రాల ‘సమూహంలో’ కేవలం కొన్నిటినే చూడగలుగుతాం!

భూమిని సృష్టించడానికి పరిశుద్ధాత్మ ఉపయోగించబడింది

8. యెహోవా కార్యాల గురించి మనకు నిజంగా ఎంత తెలుసు?

8 సృష్టి గురించి ఇంకా తెలుసుకోవాల్సిన దానితో పోలిస్తే మనం ఇప్పటివరకు తెలుసుకున్నది సముద్రంలో నీటిబొట్టంత! దేవుడు సృష్టించిన వాటి గురించి మనకు ఎంత తక్కువ తెలుసో నమ్మకస్థుడైన యోబు మాటలు చూపిస్తున్నాయి. ఆయన ఇలా అన్నాడు: “ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా.” (యోబు 26:14) కొన్ని వందల సంవత్సరాల తర్వాత సొలొమోను రాజు యెహోవా సృష్టించిన వాటిని ఎంతో జాగ్రత్తగా పరిశీలించి ఇలా అన్నాడు: “దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన [దేవుడు] నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.”—ప్రసం. 3:11; 8:17.

9, 10. భూమిని చేసినప్పుడు దేవుడు ఏ శక్తిని ఉపయోగించాడు? మొదటి మూడు సృష్టి దినాల్లో ఏమి జరిగింది?

9 యెహోవా తాను చేసిన వాటి గురించి మనకు అవసరమైన వివరాలు ఇచ్చాడు. ఉదాహరణకు, దేవుని ఆత్మ ఎన్నో యుగాల క్రితం భూమ్మీద పనిచేసిందని లేఖనాలు చెబుతున్నాయి. (ఆదికాండము 1:2 చదవండి.) ఆ సమయంలో భూమ్మీద పొడినేలగానీ వెలుతురుగానీ లేవు. అంతేకాక, బహుశా జీవులు పీల్చుకోదగిన గాలి కూడా లేదు.

10 దేవుడు ఒక్కో సృష్టి దినంలో ఏమి చేశాడో బైబిలు వివరిస్తుంది. ఒక్కో సృష్టి దినం 24 గంటలను కాదుగానీ సుదీర్ఘమైన కాలాన్ని సూచిస్తుంది. మొదటి సృష్టి దినంలో, యెహోవా భూమ్మీదకు వెలుగు ప్రసరించడం మొదలయ్యేలా ఏర్పాటు చేశాడు. సూర్యచంద్రులు భూమ్మీద నుండి స్పష్టంగా కనబడడంతో ఆ ఏర్పాటు పూర్తయింది. (ఆది. 1:3, 14) రెండవ రోజు, భూమి చుట్టూ వేర్వేరు వాయువులతో కూడిన వాతావరణం ఏర్పడడం మొదలైంది. (ఆది. 1:6) అప్పటికి భూమ్మీద నీరు, వెలుగు, గాలి ఉన్నాయి కానీ ఎక్కడా ఆరిన నేల మాత్రం లేదు. మూడవ సృష్టిదినం ఆరంభంలో యెహోవా ఆరిన నేలను చేశాడు. అప్పటివరకు భూమంతటా సముద్రమే ఉండేది. అయితే, యెహోవా తన పరిశుద్ధాత్మను ఉపయోగించి సముద్రం నుండి నేల పైకివచ్చి ఖండాలు ఏర్పడేలా చేశాడు. (ఆది. 1:9) మూడవ సృష్టి దినంలో, ఆ తర్వాతి సృష్టి దినాల్లో దేవుడు అబ్బురపరిచే మిగతా సృష్టిని చేశాడు.

ప్రాణులను చేయడానికి పరిశుద్ధాత్మ ఉపయోగించబడింది

11. జీవుల్లోవున్న సంశ్లిష్టత, సౌందర్యం, వాటి శరీర భాగాల అమరికలోని క్రమాన్ని బట్టి ఏమి తెలుస్తుంది?

11 దేవుడు తన ఆత్మను ఉపయోగించి చక్కగా వ్యవస్థీకరించబడిన జీవులను కూడా తయారుచేశాడు. మూడవ సృష్టి దినం నుండి ఆరవ సృష్టి దినం వరకూ దేవుడు ఆ శక్తితోనే ఆశ్చర్యంగొలిపే ఎన్నో రకాల మొక్కలను, జంతువులను చేశాడు. (ఆది. 1:11, 20-25) జీవుల్లో సంశ్లిష్టత, సౌందర్యం, వాటి శరీర భాగాల అమరికలో క్రమం ఉన్నాయని చూపించే ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. అవన్నీ తమను ఎవరో చాలా చక్కగా రూపొందించారని చెప్పకనే చెబుతున్నాయి.

12. (ఎ) జీవుల్లో DNA ఎలా పనిచేస్తుంది? (బి) ఇంతకాలంగా DNA సరిగ్గా పనిచేస్తుండడాన్ని బట్టి మనం ఏమి తెలుసుకోవచ్చు?

12 జీవుల్లోని లక్షణాలు ఒక తరం నుండి మరో తరానికి సంక్రమించేలా చేసే DNA (డిఆక్సిరైబో న్యూక్లిక్‌ ఆమ్లం) అనే రసాయన వ్యవస్థ గురించి చూద్దాం. సూక్ష్మక్రిములు మొదలుకొని గడ్డి, ఏనుగులు, నీలి తిమింగళాలు, మనుష్యుల వరకు భూమ్మీదున్న జీవులన్నిటిలో DNA వల్లనే ప్రత్యుత్పత్తి జరుగుతుంది. భూమ్మీద ఎన్నో రకాల జీవులున్నా, వాటివాటి జాతి లక్షణాలను నియంత్రించే జన్యుసంకేతాల్లో ఎలాంటి మార్పు ఉండదు. అందువల్లే ఇంతకాలంగా ఆయా జీవుల మధ్య తేడాలను చూపించే ప్రాముఖ్యమైన లక్షణాలు అలాగే తర్వాతి తరాలకు వస్తున్నాయి. యెహోవా దేవుడు చేసిన ఏర్పాటు ప్రకారం భూమ్మీదున్న వేర్వేరు రకాల జీవులు సంశ్లిష్ట జీవ వలయంలో వాటివాటి పనులను చేస్తున్నాయి. (కీర్త. 139:16) ఎంతో చక్కగా పనిచేసే ఈ క్రమమైన ఏర్పాటు కూడా దేవుడు సృష్టిని చేస్తున్నప్పుడు తన ‘వ్రేలును’ లేదా పరిశుద్ధాత్మను ఉపయోగించాడని రుజువుచేస్తుంది.

భూమ్మీద సృష్టించబడిన వాటిలో అన్నిటికన్నా అద్భుతమైనది

13. దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు?

13 కొన్ని యుగాలు గడిచేసరికి దేవుడు సజీవమైనవాటిని, నిర్జీవమైనవాటిని ఎన్నిటినో చేశాడు. కాబట్టి అప్పటినుండి భూమి ‘నిరాకారముగా, శూన్యముగా’ లేదు. అయితే సృష్టిని చేయడానికి యెహోవా తన ఆత్మను ఉపయోగించడం అక్కడితో పూర్తికాలేదు. ఎందుకంటే, దేవుడు భూమ్మీద సృష్టించిన వాటిలో అన్నిటికన్నా అద్భుతమైనదాన్ని అప్పటికింకా చేయలేదు. ఆరవ సృష్టిదినం చివర్లో యెహోవా తన పరిశుద్ధాత్మను, భూమిలోని మూలకాలను ఉపయోగించి మనిషిని సృష్టించాడు.—ఆది. 2:7.

14. మనుష్యులకు, జంతువులకు మధ్యవున్న ప్రాముఖ్యమైన తేడా ఏమిటి?

14 “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను” అని ఆదికాండము 1:27 చెబుతోంది. యెహోవా తన స్వరూపంలో మనల్ని చేశాడని అంటే ప్రేమ చూపించే, ఎంపిక చేసుకునే, మన సృష్టికర్తతో చక్కని సంబంధాన్ని ఏర్పరచుకునే సామర్థ్యాలతో చేశాడని అర్థం. అందుకే మన మెదడుకు, జంతువుల మెదడుకు ఎంతో తేడా ఉంది. తన గురించి, తాను చేసినవాటి గురించి ఎల్లకాలం తెలుసుకుంటూ సంతోషించేలా యెహోవా మన మెదడును ప్రత్యేకంగా రూపొందించాడు.

15. ఆదాముహవ్వల ముందు ఏ అవకాశం ఉంచబడింది?

15 దేవుడు ఆదామును, ఆయన భార్య హవ్వను సృష్టించిన తర్వాత వారు భూమి గురించి, దానిలోవున్న అద్భుతాలన్నిటి గురించి తెలుసుకుంటూ ఆనందంగా గడిపే ఏర్పాటు చేశాడు. (ఆది. 1:28) తినడానికి కావాల్సినంత ఆహారాన్ని, ఉండడానికి చక్కని తోటను యెహోవా వారికిచ్చాడు. నిరంతరం జీవించడంతోపాటు, కోటానుకోట్ల పరిపూర్ణ పిల్లలకు ప్రేమగల తల్లిదండ్రులయ్యే అవకాశం వారికి ఉండేది. కానీ అలా జరగలేదు.

పరిశుద్ధాత్మను గుర్తిస్తున్నట్లు ఎలా చూపించగలం?

16. ఆదాముహవ్వలు తిరుగుబాటు చేసినప్పటికీ మనకెలాంటి మంచి భవిష్యత్తు వేచివుంది?

16 ఆదాముహవ్వలు సృష్టికర్తకు కృతజ్ఞత చూపిస్తూ విధేయులై ఉండాల్సింది కానీ, స్వార్థంతో దేవునికి ఎదురుతిరిగారు. వారు చేసిన పనివల్ల, వారి వారసులైన అపరిపూర్ణ మానవులందరూ బాధలను అనుభవిస్తున్నారు. అయితే, మన మొదటి తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల జరిగిన నష్టాన్నంతటినీ దేవుడు ఎలా పూరిస్తాడో బైబిలు వివరిస్తుంది. యెహోవా తన ఆది సంకల్పాన్ని తప్పక నెరవేరుస్తాడని కూడా లేఖనాలు చెబుతున్నాయి. భూమంతా పరదైసులా మారుతుంది. అప్పుడు మనుష్యులు సంతోషంగా, ఆరోగ్యంగా, నిరంతరం జీవిస్తారు. (ఆది. 3:15) అలాంటి సంతోషకరమైన పరిస్థితి వస్తుందనే నమ్మకాన్ని కాపాడుకోవడానికి మనకు దేవుని పరిశుద్ధాత్మ సహాయం అవసరం.

17. ఎలాంటి తప్పుడు ఆలోచనకు మనం దూరంగా ఉండాలి?

17 మనం పరిశుద్ధాత్మ కోసం యెహోవాకు ప్రార్థించాలి. (లూకా 11:13) అలాచేస్తే, సృష్టి దేవుని చేతిపని అనే మన నమ్మకం బలపడుతుంది. నాస్తికులు, పరిణామ సిద్ధాంతవాదులు ఆధారాల్లేని, లోపాలతో నిండిన తమ వాదనలను మునుపెన్నడూ లేనంత విపరీతంగా నేడు ప్రచారం చేస్తున్నారు. అలాంటి తప్పుడు ప్రచారం వల్ల మనం అయోమయానికి, ఆందోళనకు గురికాకుండా చూసుకోవాలి. ఆ హానికరమైన దాడికి తోడు ఈ విషయంలో తోటివారి నుండి ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకోవడానికి క్రైస్తవులంతా సిద్ధపడాలి.—కొలొస్సయులు 2:8 చదవండి.

18. విశ్వం ఎలా వచ్చిందో, మానవులు ఎలా వచ్చారో పరిశీలిస్తున్నప్పుడు జ్ఞానవంతుడైన సృష్టికర్తలేడని వాదించడం ఎందుకు తెలివైన పని కాదు?

18 ఈ సృష్టిని దేవుడు చేశాడని చూపించే రుజువులను నిజాయితీగా పరిశీలిస్తే బైబిలు మీదేకాక, దేవుని మీద కూడా మనకున్న విశ్వాసం ఖచ్ఛితంగా పెరుగుతుంది. విశ్వాన్ని, మానవులను తయారుచేయడానికి విజ్ఞానశాస్త్రంతో నిరూపించలేని ఒక శక్తి పనిచేసిందని నమ్మడం అర్థంలేని విషయమని చాలామంది అభిప్రాయపడతారు. మనం అదే ఆలోచనతో ఈ విశ్వం గురించి చర్చిస్తే మాత్రం ఆధారాలన్నిటినీ నిష్పక్షపాతంగా పరిశీలించలేం. అంతేకాక, సృష్టిలోని ప్రతీది ఒక పద్ధతి ప్రకారం, ఒక ఉద్దేశంతో చేయబడ్డాయని చూపించే “లెక్కలేనన్ని” రుజువులను పరిగణలోకి తీసుకోలేం. (యోబు 9:10; కీర్త. 104:25) కాబట్టి సృష్టిని చేయడానికి ఉపయోగించిన చురుకైన శక్తి పరిశుద్ధాత్మేనని క్రైస్తవులమైన మనకు తెలుసు. ఆ శక్తిని యెహోవా దేవుడు జ్ఞానవంతంగా ఉపయోగించాడు.

పరిశుద్ధాత్మ వల్ల దేవునిపై మన విశ్వాసం బలపడుతుంది

19. దేవుడు ఉన్నాడని, ఆయన పరిశుద్ధాత్మ పనిచేస్తుందని చెప్పడానికి మన జీవితాల్లో ఎలాంటి రుజువులను చూస్తాం?

19 దేవుని మీద విశ్వాసం ఉంచడానికి, ఆయనను ప్రేమించడానికి, ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించడానికి సృష్టి గురించి మనకు పూర్తిగా తెలియాల్సిన అవసరం లేదు. తోటి మనుష్యులతో స్నేహం చేయడానికి వారి గురించిన వాస్తవాలు మాత్రమే తెలుసుకుంటే సరిపోదు, అలాగే దేవుని మీద విశ్వాసం ఉంచే విషయంలో కూడా అంతే. ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటున్న కొద్దీ ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం పెరిగినట్లే దేవుని గురించి మనం ఎక్కువ తెలుసుకునే కొద్దీ ఆయన మీద మన విశ్వాసం పెరుగుతుంది. దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చినప్పుడు, ఆయనిచ్చిన సూత్రాలను పాటించడం వల్ల ప్రయోజనం పొందినప్పుడు ఆయన ఉన్నాడనే నిజం మన మనసుల్లో నాటుకుపోతుంది. యెహోవా మనల్ని నడిపిస్తున్నాడని, కాపాడుతున్నాడని, ఆయన సేవచేయడానికి మనం చేసే ప్రయత్నాలను ఆశీర్వదిస్తున్నాడని, మనకు అవసరమైన వాటిని ఇస్తున్నాడని చూపించే రుజువులను గమనించే కొద్దీ ఆయనకు మనం మరింతగా దగ్గరౌతాం. అవన్నీ దేవుడు ఉన్నాడని, ఆయన పరిశుద్ధాత్మ పనిచేస్తుందని ఖచ్చితంగా రుజువు చేస్తున్నాయి.

20. (ఎ) దేవుడు ఈ విశ్వాన్ని, మనుష్యులను ఎందుకు సృష్టించాడు? (బి) మనం దేవుని ఆత్మతో నడిపించబడుతూ ఉంటే ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?

20 దేవుడు తన చురుకైన శక్తిని ఉపయోగించాడని చెప్పడానికి బైబిలు గొప్ప ఉదాహరణ. ఎందుకంటే, దాన్ని రాసినవారు “పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.” (2 పేతు. 1:21) లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేసినప్పుడు అన్నిటినీ సృష్టించిన దేవుని మీద మనకున్న విశ్వాసం పెరుగుతుంది. (ప్రక. 4:10, 11) తన చక్కని లక్షణమైన ప్రేమ వల్లే యెహోవా ఈ సృష్టి అంతటినీ చేశాడు. (1 యోహా. 4:8) కాబట్టి, మన స్నేహితుడైన ప్రేమగల పరలోక తండ్రి గురించి ఇతరులకు నేర్పించడానికి మనం చేయగలిగినదంతా చేద్దాం. అంతేకాదు, మనం దేవుని ఆత్మతో నడిపించబడుతూ ఉంటే ఆయన గురించి ఎల్లప్పుడూ నేర్చుకునే గొప్ప అవకాశం లభిస్తుంది. (గల. 5:16, 25) మనం యెహోవా గురించి, ఆయన చేసిన గొప్ప పనుల గురించి తెలుసుకుంటూ ఉందాం. అంతేకాక విశ్వాన్ని, భూమిని, మనుష్యులను చేయడానికి పరిశుద్ధాత్మను ఉపయోగించినప్పుడు ఆయన చూపించిన మెండైన ప్రేమను మన జీవితాల్లో చూపిద్దాం.

మీరు వివరించగలరా?

• దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని ఉపయోగించిన విధానం గురించి భూమ్యాకాశాలు ఏమి తెలియజేస్తున్నాయి?

• దేవుని స్వరూపంలో సృష్టించబడడం వల్ల మనకు ఎలాంటి అవకాశాలున్నాయి?

• సృష్టి చేయబడిందని చూపించే రుజువులను మనం ఎందుకు పరిశీలించాలి?

• యెహోవాతో మనకున్న సంబంధాన్ని బలపర్చుకోవడానికి ఏమి చేయవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[7వ పేజీలోని చిత్రం]

విశ్వంలోవున్న క్రమాన్ని చూసినప్పుడు సృష్టి గురించి మనకేమి తెలుస్తుంది?

[క్రెడిట్‌ లైను]

నక్షత్రాలు: Anglo-Australian Observatory/David Malin Images

[8వ పేజీలోని చిత్రాలు]

వీటన్నిటిలో DNA ఒకే విధంగా ఎలా పనిచేస్తుంది?

[10వ పేజీలోని చిత్రం]

మీ నమ్మకాలు సరైనవని రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నారా?