కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

యేసుక్రీస్తు తన 12 మంది అపొస్తలులను ప్రకటించడానికి పంపినప్పుడు చేతికర్రను, చెప్పులను తీసుకెళ్లమని చెప్పాడా?

యేసు తన అపొస్తలులను పంపించడం గురించి మూడు సువార్తల్లో ఉన్న వృత్తాంతాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయని కొంతమంది వాదిస్తారు. కానీ, ఈ వృత్తాంతాలను పోల్చి చూస్తే మనకు ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. మొదట మార్కు, లూకా ఏమి రాశారో చూద్దాం. మార్కు సువార్తలో ఇలా ఉంది: “ప్రయాణముకొరకు చేతికఱ్ఱను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసికొనక చెప్పులు తొడగుకొనుడనియు, రెండంగీలు వేసికొనవద్దనియు [యేసు] వారికాజ్ఞాపించెను.” (మార్కు 6:7-9) లూకా ఇలా రాశాడు: “మీరు ప్రయాణము కొరకు చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొని పోవద్దు; రెండు అంగీలు ఉంచుకొనవద్దు.” (లూకా 9:1-3) ఇవి రెండూ ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. యేసు ఒక చేతికర్రను తీసుకెళ్లమన్నాడని, చెప్పులను తొడుక్కొని వెళ్లమన్నాడని మార్కు సువార్త చెబుతుంటే, అసలేమీ తీసుకెళ్లవద్దన్నాడని చివరకు చేతికర్ర కూడా తీసుకెళ్లవద్దన్నాడని లూకా సువార్త చెబుతుంది. చెప్పుల గురించి మార్కు ప్రస్తావించాడు కానీ లూకా ప్రస్తావించలేదు.

ఈ సందర్భంలో యేసు ఏమి చెప్పాలనుకున్నాడో తెలుసుకోవడానికి, మూడు సువార్తల్లోనూ కనిపించే ఒక విషయాన్ని గమనించండి. పైన పేర్కొనబడిన వృత్తాంతాల్లో, అలాగే మత్తయి 10:5-10లో “రెండు అంగీలు” వేసుకోవద్దని లేదా తీసుకెళ్లవద్దని యేసు అపొస్తలులకు చెప్పినట్లు చూస్తాం. బహుశా వారిలో ప్రతి ఒక్కరూ ఒక అంగీని ధరించివుంటారు కాబట్టి, వారు తమ ప్రయాణం కోసం ఇంకొకటి తీసుకెళ్లకూడదు. అదేవిధంగా వారు చెప్పులు కూడా వేసుకొనివుంటారు. నూతనలోక అనువాదము (ఆంగ్లం) ప్రకారం, అప్పటికే తాము తొడుక్కున్న చెప్పులను ‘కట్టుకోవడం’ గురించి మార్కు నొక్కి చెప్పాడు. మరి చేతికర్రల విషయమేమిటి? ద జ్యూయిష్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “ప్రాచీన హెబ్రీయులకు తమతోపాటు ఒక చేతికర్రను తీసుకెళ్లే అలవాటు ఉండేదనిపిస్తోంది.” (ఆది. 32:10) అప్పటికే వారి దగ్గరున్న చేతికర్రను తప్ప “ప్రయాణముకొరకు” ఇంకేమీ తీసుకెళ్లవద్దని యేసు తన అపొస్తలులకు ఆజ్ఞాపించడం గురించి మార్కు ప్రస్తావించాడు. కాబట్టి, ఇతర వస్తువులు సమకూర్చుకుంటూ తమ ప్రయాణాన్ని ఆలస్యం చేయవద్దనే యేసు ఉపదేశాన్ని సువార్త రచయితలు నొక్కి చెప్పారు.

ఆ సందర్భంలో యేసు ఇచ్చిన ఆజ్ఞను విని, దాన్ని రాసిన మత్తయి కూడా అదే విషయాన్ని బలపరిచాడు. “మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి; పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా?” అని యేసు అన్నాడు. (మత్త. 10:9, 10) అపొస్తలులు తొడుక్కున్న చెప్పులు, వారి చేతుల్లో ఉన్న కర్రల విషయమేమిటి? ఉన్నవాటిని పడేయమని యేసు చెప్పలేదు కానీ అదనంగా సమకూర్చుకోవద్దని చెప్పాడు. ఆయన అలాంటి ఆజ్ఞను ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే “పనివాడు తన ఆహారమునకు పాత్రుడు.” యేసు ఆజ్ఞలోని ముఖ్యాంశం అదే. ఆయన కొండమీద ఇచ్చిన ప్రసంగంలో కూడా ఆ అంశం కనిపిస్తుంది. ఏమి తింటామో, తాగుతామో, ధరిస్తామో అని చింతించవద్దని ఆయన ఆ ప్రసంగంలో చెప్పాడు.—మత్త. 6:25-32.

సువార్త వృత్తాంతాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నట్లు మొదట్లో అనిపించినా, అవన్నీ ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. అపొస్తలులు ఎలా ఉన్నారో అలాగే వెళ్లాలి. కానీ, తమ అవధానం పక్కకు మళ్లేలా వేటినీ సమకూర్చుకోకూడదు. ఎందుకంటే, వారికి కావాల్సినవాటిని యెహోవాయే దయచేస్తాడు.