కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిల్లో చెప్పబడిన పరదైసు ఎక్కడ ఉంటుంది?

బైబిల్లో చెప్పబడిన పరదైసు ఎక్కడ ఉంటుంది?

మా పాఠకుల ప్రశ్న

బైబిల్లో చెప్పబడిన పరదైసు ఎక్కడ ఉంటుంది?

▪ ధైర్యంగా తన మీద విశ్వాసం చూపించిన ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు యేసు ఆయనకిలా మాటిచ్చాడు: “నీవు నాతోకూడ పరదైసులో ఉందువు.” (లూకా 23:43) ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు? పరదైసు ఎక్కడ ఉంటుంది? పరలోకంలోనా, భూమ్మీదనా లేక మానవులు తీర్పు కోసం ఎదురుచూసే వేరొక స్థలంలోనా?

మన పూర్వీకులు ఒకప్పుడు పరదైసులో జీవించారు. బైబిలు మనకిలా చెబుతోంది: “దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను . . . మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.” (ఆది. 2:8, 15) ఆ మాటలను గ్రీకు భాషలోకి అనువదించినప్పుడు “తోట” అనే పదానికి “పరదైసు” అని వాడారు.

ఎక్కువమంది పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు తమ ఇంటిని అందరికి సరిపోయేలా పెద్దదిగా చేసుకున్నట్లే, మానవ కుటుంబం పెద్దదౌతున్నప్పుడు మన మొదటి తల్లిదండ్రులు తాము ఉంటున్న ఆ పరదైసు సరిహద్దులను విస్తరింపజేయాల్సి ఉంది. “భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి” అని దేవుడు వారికి చెప్పాడు.—ఆది. 1:28.

మానవులు భూపరదైసులో జీవిస్తూ పిల్లల్ని కనాలనేది మన సృష్టికర్త సంకల్పం అని ఆ మాటలను బట్టి తెలుస్తోంది. నిజానికి, చనిపోకుండా ఆ అందమైన తోటలో శాశ్వతంగా జీవించే అవకాశం వారి ముందుంది. సృష్టికర్త సంకల్పం ప్రకారం భూమి మానవులందరికీ శాశ్వత గృహంగా ఉండాలి. కాబట్టే భూమ్మీదున్న ప్రకృతి అందాలు మనకెంతో ఆనందాన్నిస్తాయి. మనం అందమైన భూమ్మీద జీవించడానికే సృష్టించబడ్డాం.

దేవుని సంకల్పం మారిందా? లేదు. ఎందుకంటే యెహోవా ఇలా అభయమిచ్చాడు: “నా నోటనుండి వచ్చు వచనము . . . నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును.” (యెష. 55:10, 11) మానవుడు సృష్టించబడిన 3000 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత, ‘భూమిని కలుగజేసి దాని సిద్ధపరచిన’ దేవుని గురించి బైబిలు ఇలా చెప్పింది: “నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింపలేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను.” (యెష. 45:18) దేవుని సంకల్పం మారలేదు. భూమి మళ్లీ పరదైసుగా మారుతుంది.

ఆసక్తికరంగా, పరదైసు గురించిన బైబిలు వృత్తాంతాలు ఎక్కువగా భూమ్మీద ఉండే జీవితం గురించే చెబుతున్నాయి. ఉదాహరణకు, యెషయా ప్రవచనం ఇలా చెబుతోంది: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు.” (యెష. 65:21) ఇళ్లు ఎక్కడ కడతారు? ద్రాక్షతోటలు ఎక్కడ నాటతారు? పండ్లు ఎక్కడ తింటారు? భూమ్మీదే కదా. కీర్తన 37:29 స్పష్టంగా ఇలా చెబుతోంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు.”

యేసు కూడా భూపరదైసు గురించి మాట్లాడాడు. నిజమే, ఆయన పరలోక సంబంధమైన పరదైసు గురించి కూడా వాగ్దానం చేశాడు, అయితే ఎన్నుకోబడిన కొంతమంది మాత్రమే దానిలో ఉంటారు. (లూకా 12:32) చనిపోయిన తర్వాత వీరు పరలోకానికి పునరుత్థానం చేయబడి క్రీస్తుతోపాటు భూపరదైసును పరిపాలిస్తారు. (ప్రక. 5:9, 10; 14:1-3) పరలోకంలో ఉండే ఈ సహపరిపాలకులు భూపరదైసును సరిగ్గా పరిపాలిస్తూ, ప్రజలందరూ దేవుని ప్రమాణాలను పాటించేలా చూస్తారు.

భూమిపట్ల దేవుని సంకల్పం ఏమిటో యేసుకు తెలుసు. అంతేకాక, ఏదేను తోట సృష్టించబడినప్పుడు ఆయన తన తండ్రితోపాటే ఉన్నాడు. ఇప్పుడు విశ్వాసం చూపించే ప్రజలందరూ రాబోయే భూపరదైసులో జీవించే అవకాశం ఉంది. (యోహా. 3:16) అలాంటి వారికి యేసు ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “నీవు నాతోకూడ పరదైసులో ఉందువు.”—లూకా 23:43. (w10-E 12/01)

[7వ పేజీలోని చిత్రసౌజన్యం]

© FORGET Patrick/SAGAPHOTO.COM/Alamy