కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు నిశ్చయంగా సంతోషించవచ్చు

మీరు నిశ్చయంగా సంతోషించవచ్చు

మీరు నిశ్చయంగా సంతోషించవచ్చు

అత్యంత సూక్ష్మమైన జీవకణం నుండి పెద్దపెద్ద గుంపులుగా ఉన్న భారీ నక్షత్రవీధుల వరకు సృష్టి అంతటిలో చక్కని వ్యవస్థీకరణ ఉందంటే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే, సృష్టికర్త “అల్లరికి” లేదా క్రమరాహిత్యానికి “కర్త కాడు.” (1 కొరిం. 14:33) యెహోవా తనను ఆరాధించేందుకు ప్రజలను వ్యవస్థీకరించిన విధానం కూడా మనల్ని ముగ్ధులను చేస్తుంది. యెహోవా ఏమి చేశాడో చూడండి. స్వేచ్ఛాచిత్తం గల కోటానుకోట్ల తెలివైన ప్రాణులను అంటే మానవులను, దేవదూతలను యెహోవా ఒక విశ్వవ్యాప్త సంస్థగా ఏర్పాటు చేశాడు. వారంతా స్వచ్ఛారాధనలో ఐక్యమయ్యారు. అది ఎంత అద్భుతమైన ఏర్పాటు!

ప్రాచీన ఇశ్రాయేలులో యెహోవా ఆలయం, ఆయన నియమించిన రాజు ఉండే యెరూషలేము పట్టణం యెహోవా భూసంబంధ సంస్థకు ప్రతీకగా ఉండేది. బబులోను చెరలో ఉన్న ఒక ఇశ్రాయేలీయుడు ఆ పరిశుద్ధ పట్టణం గురించి ఇలా అన్నాడు: “నేను నిన్ను జ్ఞాపకము చేసికొననియెడల, నా ముఖ్య సంతోషముకంటె నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచనియెడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక.”—కీర్త. 137:6.

నేటి దేవుని సంస్థ గురించి మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? మీరు దాని విషయంలో అన్నిటికన్నా ఎక్కువగా సంతోషిస్తున్నారా? దేవుని భూసంస్థ చరిత్ర గురించి, దాని పనితీరు గురించి మీ పిల్లలకు తెలుసా? తాము యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త సహోదరత్వంలో భాగంగా ఉన్నామని గ్రహించి, వారు దాన్ని విలువైనదిగా ఎంచుతున్నారా? (1 పేతు. 2:17) మీ కుటుంబ సభ్యులకు యెహోవా సంస్థ గురించి మరింతగా వివరించేందుకు, దానిపట్ల వారి కృతజ్ఞతను పెంచేందుకు కుటుంబ ఆరాధనలో ఈ కింది సలహాలను పాటించగలరేమో చూడండి.

“పూర్వకాలము” గురించి వివరించండి

ప్రతీ సంవత్సరం ఇశ్రాయేలీయుల కుటుంబాలు పస్కా పండుగ జరుపుకోవడానికి సమకూడేవి. మొదటిసారి ఆ పండుగ ప్రారంభమైనప్పుడు, ప్రజలకు మోషే ఇలా చెప్పాడు: ‘నీ కుమారుడు—ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి—బాహుబలముచేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటికి రప్పించెనని చెప్పవలెను.’ (నిర్గ. 13:14, 15) తమతో యెహోవా ఎలా వ్యవహరించాడో ఇశ్రాయేలీయులు మరచిపోకూడదు. ఇశ్రాయేలులోని చాలామంది తండ్రులు మోషే నిర్దేశాన్ని తప్పక పాటించివుంటారు. కొన్ని తరాల తర్వాత ఒక ఇశ్రాయేలీయుడు ఇలా ప్రార్థించాడు: “దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనినిగూర్చి మేము చెవులార వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి.”—కీర్త. 44:1.

నేటి యౌవనస్థులకు, దాదాపు 100 కన్నా ఎక్కువ సంవత్సరాల యెహోవాసాక్షుల చరిత్ర కూడా ‘పూర్వకాలంలా’ అనిపించవచ్చు. అది మీ పిల్లలకు మరింత వాస్తవమైనదిగా ఉండేందుకు మీరేమి చేయవచ్చు? కొంతమంది తల్లిదండ్రులు, యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని, వార్షిక పుస్తకమును (ఆంగ్లం), మన పత్రికల్లో ప్రచురించబడిన జీవిత కథలను, ఆధునిక కాలంలోని దేవుని సేవకుల గురించి తెలిపే కొత్త డీవీడీతోపాటు దైవపరిపాలన చరిత్రకు సంబంధించిన ఇతర నివేదికలను ఉపయోగిస్తారు. ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లో, నాజీ జర్మనీలో సహోదరులు ఎదుర్కొన్న హింస గురించి తెలియజేసే వీడియోలను చూడడం వల్ల కుటుంబ సభ్యులు శ్రమలు వచ్చినప్పుడు యెహోవాపై ఎలా ఆధారపడవచ్చో నేర్చుకుంటారు. కాబట్టి, అలాంటి వాటిని మీ కుటుంబ ఆరాధనలో ఉపయోగించండి. వాటివల్ల, యథార్థతకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేలా మీ పిల్లల విశ్వాసం బలపడుతుంది.

చరిత్ర గురించి ఉపన్యాసమిస్తే యౌవనస్థులకు త్వరగా బోరు కొట్టవచ్చు. కాబట్టి, మీ పిల్లలు చర్చలో పాల్గొనేలా చేయండి. ఉదాహరణకు, తమకు నచ్చిన ఒక దేశాన్ని ఎంచుకొని ఆ దేశపు దైవపరిపాలనా చరిత్రను పరిశోధించి, తాము నేర్చుకున్నదాన్ని కుటుంబ సభ్యులకు వివరించమని మీ పిల్లలను అడగవచ్చు. మీ సంఘంలో, చాలా కాలంగా నమ్మకంగా సేవచేస్తున్న క్రైస్తవులుంటే, అప్పుడప్పుడు మీతోపాటు కుటుంబ ఆరాధనలో పాల్గొనడానికి వారిని ఆహ్వానించవచ్చు. ఆ సమయంలో మీ పిల్లలు వారి అనుభవాలను అడిగి తెలుసుకోవచ్చు. అంతేగాక కొన్నిసార్లు బ్రాంచి నిర్మాణం, అంతర్జాతీయ సమావేశం, ఇంటింటి సేవలో ఫోనోగ్రాఫ్‌ వాడకం వంటి ముఖ్యమైన వాటికి సంబంధించిన చిత్రాలను గీయమని మీ పిల్లలకు చెప్పవచ్చు.

‘ప్రతి అవయవం తన తన పని’ ఎలా చేస్తుందో తెలుసుకోండి

అపొస్తలుడైన పౌలు క్రైస్తవ సంఘాన్ని శరీరంతో పోలుస్తూ ఇలా అన్నాడు: “సర్వశరీరము చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది.” (ఎఫె. 4:16) మానవ శరీరం ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే, సృష్టికర్త పట్ల మనకుండే గౌరవ ప్రశంసలు పెరుగుతాయి. అదేవిధంగా, ప్రపంచవ్యాప్త సంఘం ఎలా పనిచేస్తుందో పరిశీలిస్తే మనం దేవుని ‘నానావిధమైన జ్ఞానాన్ని’ బట్టి ఆశ్చర్యపోతాం.—ఎఫె. 3:8-11.

పరలోక భాగంతో సహా తన సంస్థ అంతా ఎలా పనిచేస్తుందో యెహోవా వివరిస్తున్నాడు. ఉదాహరణకు, జరగబోయే వాటిని మొదట యేసుక్రీస్తుకు తాను చూపించానని, యేసు ‘తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడని,’ ఆ తర్వాత యోహాను వాటి గురించి ‘సాక్ష్యమిచ్చాడని’ యెహోవా చెబుతున్నాడు. (ప్రక. 1:1, 2) తన సంస్థలోని అదృశ్యమైన భాగం ఎలా పనిచేస్తుందో బయలుపరుస్తున్న దేవుడు భూమిపై ‘ప్రతి భాగం తన తన పని’ ఎలా చేస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలని కోరుకోడా?

ఉదాహరణకు, మీ సంఘాన్ని ప్రాంతీయ పర్యవేక్షకుడు త్వరలో సందర్శించబోతుంటే, సాధారణంగా ప్రయాణ పర్యవేక్షకులు చేసే పనుల గురించి, వారు పొందే ఆశీర్వాదాల గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చించవచ్చు. మనలో ప్రతి ఒక్కరికి వారెలా సహాయం చేస్తారో వివరించవచ్చు. అలాగే మీరు ఈ ప్రశ్నల గురించి కూడా చర్చించవచ్చు: క్షేత్ర సేవను ఎందుకు రిపోర్టు చేయాలి? దేవుని సంస్థకు ఆర్థిక మద్దతు ఎలా లభిస్తుంది? పరిపాలక సభ ఎలా వ్యవస్థీకరించబడింది? అది ఎలా ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తుంది?

యెహోవా ప్రజలు ఎలా సంస్థీకరించబడ్డారో అర్థంచేసుకుంటే మనం కనీసం మూడు విధాలుగా ప్రయోజనం పొందుతాం. మొదటిగా, మనకోసం కష్టపడి పనిచేస్తున్న వారిపట్ల మన మెప్పుదల అధికమౌతుంది. (1 థెస్స. 5:12, 13) రెండవదిగా, దైవపరిపాలనా ఏర్పాట్లకు మద్దతు ఇచ్చేలా పురికొల్పబడతాం. (అపొ. 16:4, 5) మూడవదిగా, మనల్ని నడిపిస్తున్నవారు తీసుకునే నిర్ణయాలు, చేసే ఏర్పాట్లు లేఖనానుసారమైనవని గమనించేకొద్దీ వారిపై మన నమ్మకం బలపడుతుంది.—హెబ్రీ. 13:7.

“దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి”

“ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సీయోనుచుట్టు తిరుగుచు దానిచుట్టు సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి.” (కీర్త. 48:12, 13) ఆ వచనాల్లో, యెరూషలేమును పరిశీలించి చూడమని కీర్తనకర్త ఇశ్రాయేలీయులను కోరాడు. వార్షిక పండుగలను జరుపుకోవడం కోసం పరిశుద్ధ పట్టణానికి వెళ్లి అక్కడున్న మహిమాన్విత ఆలయాన్ని చూసిన ఇశ్రాయేలీయుల కుటుంబ సభ్యులు ఎలాంటి అమూల్యమైన జ్ఞాపకాలను తీసుకెళ్లివుంటారో మీరు ఊహించగలరా? “రాబోవు తరములకు దాని వివరము” చెప్పాలని వారికి తప్పక అనిపించి ఉంటుంది.

సొలొమోను శ్రేష్ఠమైన పరిపాలన గురించి, ఆయన అపారమైన జ్ఞానం గురించి విన్నప్పుడు షేబ దేశపు రాణి మొదట్లో సందేహించింది. తాను విన్న సంగతులన్నీ వాస్తవాలేనని ఆమెకు ఎలా నమ్మకం కుదిరింది? ఆమె ఇలా అంది: “నేను వచ్చి దాని కన్నులార చూచువరకు వారి మాటలను నమ్మకయుంటిని.” (2 దిన. 9:5, 6) అవును, ‘కళ్లతో’ చూసేది మనపై బలమైన ప్రభావం చూపిస్తుంది.

యెహోవా సంస్థలోని అద్భుతమైన విషయాలను స్వయంగా తమ ‘కళ్లతో’ చూడడానికి మీ పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు? మీ ఇంటి దగ్గర్లో యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం ఉంటే, దాన్ని సందర్శించడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, మన్‌డీ బెతనీల విషయమే తీసుకోండి. వారు తమ దేశంలో ఉన్న బెతెల్‌ గృహానికి దాదాపు 1500 కి.మీ. దూరంలో నివసించేవారు. అయినప్పటికీ, ఈ అమ్మాయిలిద్దరూ పెరిగి పెద్దవారౌతుండగా తమ తల్లిదండ్రులు వారిని తరచుగా బెతెల్‌ను సందర్శించడానికి తీసుకెళ్తుండేవారు. వారు ఇలా చెబుతున్నారు: “బెతెల్‌ను సందర్శించకముందు, అక్కడ గంభీరమైన వ్యక్తులు, వృద్ధులు మాత్రమే ఉంటారని అనుకున్నాం. కానీ యెహోవా కోసం కష్టపడి పనిచేస్తూ ఎంతో సంతోషంగా ఉన్న యౌవనస్థులను అక్కడ చూశాం! యెహోవా సంస్థ మేము నివసించే చిన్న ప్రాంతంకన్నా ఎంతో పెద్దదని గ్రహించాం. దాన్ని సందర్శించిన ప్రతీసారి మేము యెహోవాకు మరింత సన్నిహితమయ్యాం, ఆయన సేవచేయడానికి మరింతగా పురికొల్పబడ్డాం.” దేవుని సంస్థను పరిశీలనగా చూడడం వల్ల మన్‌డీ బెతనీలు పయినీరు సేవ ప్రారంభించడానికి పురికొల్పబడ్డారు. అంతేగాక, బెతెల్‌లో తాత్కాలిక స్వచ్ఛంద సేవకులుగా సేవచేయడానికి ఆహ్వానించబడ్డారు.

ప్రాచీన ఇశ్రాయేలీయులకు వీలుకాని మరోవిధంగా కూడా మనం యెహోవా సంస్థను ‘చూడవచ్చు.’ గడిచిన కొన్ని సంవత్సరాల్లో, దేవుని సంస్థ గురించి వివరంగా తెలియజేసే దైవిక బోధ ద్వారా ఐక్యమయ్యారు, భూదిగంతముల వరకు, యెహోవాసాక్షులు—సువార్త ప్రకటించడానికి సంస్థీకరించబడ్డారు, విశ్వవ్యాప్తంగా ఉన్న మన సౌభ్రాతృత్వం వంటి డీవీడీలు, వీడియోలు దేవుని ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. a బెతెల్‌ సభ్యులు, విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలు అందించే సేవకులు, మిషనరీలు, సమావేశాలను ఏర్పాటు చేసి వాటిని వ్యవస్థీకరించే సహోదరులు కష్టపడి పనిచేయడాన్ని మీ కుటుంబమంతా చూసినప్పుడు మన ప్రపంచవ్యాప్త సహోదరత్వం పట్ల మీకున్న కృతజ్ఞత తప్పకుండా పెరుగుతుంది.

దేవుని ప్రజల సంఘాలన్నీ స్థానికంగా సువార్త ప్రకటించడంలో, స్థానిక క్రైస్తవులకు మద్దతునివ్వడంలో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. అయినా, మీ కుటుంబమంతా కలిసి “లోకమందున్న మీ సహోదరుల[ను]” గుర్తుచేసుకోవడానికి సమయం తీసుకోండి. అలా చేయడం వల్ల మీరు నిశ్చయంగా సంతోషించవచ్చని గ్రహిస్తారు. అంతేగాక మీరు, మీ పిల్లలు “విశ్వాసమందు స్థిరులై” ఉండగలుగుతారు.—1 పేతు. 5:9.

[అధస్సూచి]

a ఇవి తెలుగులో లేవు.

[18వ పేజీలోని బాక్సు/చిత్రం]

దేవుని సంస్థ అధ్యయనానికి తగిన అంశం

యెహోవా సంస్థ చరిత్ర గురించి, అది పనిచేసే తీరు గురించి మరింత నేర్చుకోవడానికి సహాయం చేసేందుకు ఎన్నో ఏర్పాట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ప్రశ్నలతో మొదలుపెట్టవచ్చు:

ఆధునిక కాలంలో ప్రయాణ పర్యవేక్షకుల పని ఎలా మొదలైంది?కావలికోట, నవంబరు 15, 1996 సంచికలోని 10-15 పేజీలు.

1941లో జరిగిన దైవపరిపాలనా సమావేశంలోని ‘పిల్లల రోజుకు’ ఎలాంటి ప్రత్యేకత ఉంది?కావలికోట, జూలై 15, 2001 సంచికలోని 8వ పేజీ.

పరిపాలక సభ ఎలా నిర్ణయాలు తీసుకుంటుంది?దేవుని రాజ్యం గురించి ‘సమగ్ర సాక్ష్యమివ్వండి’ (ఆంగ్లం) పుస్తకంలోని 108-114 పేజీలు చూడండి.