కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యిర్మీయాలాగే మెలకువగా ఉండండి

యిర్మీయాలాగే మెలకువగా ఉండండి

యిర్మీయాలాగే మెలకువగా ఉండండి

‘ [యెహోవానగు] నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు మెలకువగా ఉన్నాను.’—యిర్మీ. 1:12, NW.

1, 2. యెహోవా ‘మెలకువగా ఉన్నాడని’ వివరించడానికి బాదం చెట్టు ఉదాహరణ ఎందుకు ఇవ్వబడింది?

 లెబానోను, ఇశ్రాయేలు కొండల మీద ముందుగా పూలు పూసే చెట్లలో బాదం చెట్టు ఒకటి. గులాబి లేదా తెలుపు రంగులో చూడముచ్చటగా ఉండే దాని పూలు చాలా త్వరగా అంటే, జనవరి నెల చివరికల్లా లేదా ఫిబ్రవరి నెల ప్రారంభంకల్లా పూస్తాయి. హెబ్రీ భాషలో బాదం చెట్టుకు ఉపయోగించబడిన పదానికి అక్షరార్థంగా “మేల్కొల్పేది” అని అర్థం.

2 అందుకే యెహోవా యిర్మీయాను తన ప్రవక్తగా నియమించినప్పుడు బాదం చెట్టుకున్న ఈ లక్షణాన్ని ఉదాహరిస్తూ ఓ ప్రాముఖ్యమైన వాస్తవాన్ని చెప్పాడు. యిర్మీయా తన పరిచర్యను ప్రారంభించినప్పుడు యెహోవా ఆయనకు దర్శనంలో ఓ బాదం చెట్టు చువ్వను (రెమ్మను) చూపించాడు. దానర్థం ఏమిటి? యెహోవా ఇలా వివరించాడు: ‘నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు మెలకువగా ఉన్నాను.’ (యిర్మీ. 1:11, 12, NW) మరో మాటలో చెప్పాలంటే, బాదం చెట్టు త్వరగా ‘మేల్కొన్నట్లే,’ అవిధేయత వల్ల కలిగే పర్యవసానాలను గురించి తన ప్రజలను హెచ్చరించడానికి యెహోవా “పెందలకడ లేచి” తన ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు. (యిర్మీ. 7:25) యెహోవా తన ప్రవచన వాక్యం నెరవేరేంతవరకు విశ్రాంతి తీసుకోకుండా ‘మెలకువగా ఉంటాడు.’ అందుకే సరిగ్గా తాను అనుకున్న సమయంలో అంటే, సా.శ.పూ. 607లో మతభ్రష్ట యూదా జనాంగం మీద యెహోవా తన తీర్పును అమలుచేశాడు.

3. యెహోవా విషయంలో మనం ఏమి నమ్మవచ్చు?

3 నేడు కూడా యెహోవా తన చిత్తాన్ని నెరవేర్చడానికి కనిపెట్టుకొని ఉంటూ మెలకువగా ఉన్నాడు. తన వాక్య నెరవేర్పును ఆయన ఎన్నడూ నిర్లక్ష్యం చేయడు. యెహోవా కనిపెట్టుకొని ఉండడం చూసినప్పుడు మీకేమి అనిపిస్తుంది? ఈ 2011వ సంవత్సరంలో కూడా, తన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో యెహోవా ‘మెలకువగా’ ఉన్నాడని మీకు అనిపిస్తోందా? ఒకవేళ, నమ్మదగిన యెహోవా వాగ్దానాల విషయంలో మనకేవైనా సందేహాలుంటే, వాటివల్ల ఆధ్యాత్మికంగా నిద్రమత్తులోకి జారుకోకుండా మెలకువగా ఉండడానికి ఇదే సమయం. (రోమా. 13:11) యెహోవా ప్రవక్తగా యిర్మీయా ఎల్లప్పుడూ మెలకువగా ఉన్నాడు. యెహోవా తనకిచ్చిన నియామకం విషయంలో యిర్మీయా ఏవిధంగా మెలకువగా ఉన్నాడో, ఎందుకు అలా ఉన్నాడో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. దానివల్ల దేవుడు మనకిచ్చిన పనిలో పట్టుదలతో ఎలా కొనసాగవచ్చో తెలుసుకోగలుగుతాం.

ఒక అత్యవసర సందేశం

4. ప్రకటించే విషయంలో యిర్మీయా ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? ఆయన ప్రకటించిన సందేశం ఎందుకు అత్యవసరమైనది?

4 యెహోవా యిర్మీయాను కావలివానిగా నియమించినప్పుడు ఆయనకు దాదాపు 25 ఏళ్లు ఉండివుండవచ్చు. (యిర్మీ. 1:1, 2) కానీ రాజ్యంలోని పెద్దలతో, వయసులో పెద్దవారితో, ఉన్నతాధికారులతో మాట్లాడేందుకు తనకు అస్సలు అర్హత లేదనీ తాను బాలుణ్ణనీ యిర్మీయా అనుకున్నాడు. (యిర్మీ. 1:6) ఎందుకంటే ఆయన ముఖ్యంగా యాజకులకు, అబద్ధ ప్రవక్తలకు, పాలకులకు, ‘తమకు ఇష్టమైన మార్గాన్ని’ అనుసరిస్తున్న వారికి, ‘నిత్యం ద్రోహం చేస్తున్న’ వారికి యెహోవా తరఫున తీవ్రమైన నేరారోపణలను చేస్తూ భయంకరమైన తీర్పులను ప్రకటించాలి. (యిర్మీ. 6:13; 8:5, 6) దాదాపు 400 సంవత్సరాలపాటు సత్యారాధనకు కేంద్రంగా ఉన్న, సొలొమోను కట్టించిన మహిమాన్విత ఆలయం నాశనం చేయబడుతుందని, యూదా యెరూషలేములు నిర్జనంగా మారతాయని, వాటి ప్రజలు చెరగా తీసుకొనిపోబడతారని ఆయన ప్రకటించాలి. నిజంగా యిర్మీయా ఎంత అత్యవసరమైన సందేశాన్ని ప్రకటించాల్సివుంది!

5, 6. (ఎ) నేడు యిర్మీయా తరగతిని యెహోవా ఎలా ఉపయోగిస్తున్నాడు? (బి) మనం ఇప్పుడు వేటి గురించి చర్చిస్తాం?

5 నేడు ఈ లోకంపై తన తీర్పులను గురించి హెచ్చరించడానికి యెహోవా ప్రేమతో అభిషిక్త క్రైస్తవుల గుంపును ఏర్పాటు చేశాడు. ఒకవిధంగా వారు కావలివారిలా పని చేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ యిర్మీయా తరగతివారు మన కాలాల ప్రాముఖ్యతను గుర్తించమని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. (యిర్మీ. 6:17) యెహోవా ఆలస్యం చేయడని బైబిలు పదేపదే చెబుతోంది. యెహోవా దినం సరిగ్గా సమయానికి వస్తుంది, అది ఎవ్వరూ ఊహించని సమయంలో వస్తుంది.—జెఫ. 3:8; మార్కు 13:33; 2 పేతు. 3:9, 10.

6 యెహోవా త్వరలోనే నూతనలోకాన్ని తీసుకొస్తాడని, ప్రకటించడానికి ఎక్కువ సమయం లేదని దేవుని ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడే రాజ్య సందేశాన్ని ప్రజలందరికీ ప్రకటించడం చాలా ప్రాముఖ్యం. అది తెలుసుకున్నాక మీకేమి చేయాలనిపిస్తోంది? సాధ్యమైనంత ఎక్కువగా పరిచర్యలో పాల్గొనాలని మీకు అనిపించడం లేదా? అలాచేస్తే యేసు చెప్పినట్లు యెహోవాను సేవించాలో వద్దో నిర్ణయించుకునే అవకాశం వినే ప్రతి ఒక్కరికీ దొరుకుతుంది. తన నియామకం విషయంలో మెలకువగా ఉండేందుకు ఏ మూడు లక్షణాలు యిర్మీయాకు సహాయం చేశాయో, అవి మనకూ ఎలా సహాయం చేయగలవో ఇప్పుడు చూద్దాం.

ప్రజలపట్ల ప్రేమ

7. సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రకటించేందుకు ప్రజలపట్ల ప్రేమ యిర్మీయాను ఎలా పురికొల్పిందో వివరించండి.

7 సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రకటించేందుకు యిర్మీయాను ఏది పురికొల్పింది? ప్రజలపట్ల ప్రేమే. అబద్ధ కాపరుల వల్లే ప్రజలు ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నారని యిర్మీయా గుర్తించాడు. (యిర్మీ. 23:1, 2) దానివల్ల ఆయన తన పనిని ప్రేమతో, కనికరంతో చేయగలిగాడు. తన దేశంలోని ప్రజలు దేవుని వాక్యాన్ని విని సజీవంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆయన వారి గురించి ఎంతగా చింతించాడంటే, వారిపై రాబోయే విపత్తునుబట్టి విలపించాడు. (యిర్మీయా 8:21; 9:1 చదవండి.) విలాపవాక్యముల పుస్తకం చదివితే యెహోవా నామంపట్ల, ప్రజలపట్ల యిర్మీయాకు ఎంత ప్రగాఢమైన ప్రేమ, శ్రద్ధ ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుంది. (విలా. 4:6, 9) నేడు ప్రజలు “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరి” ఉండడాన్ని చూసినప్పుడు, ఓదార్పునిచ్చే దేవుని రాజ్య సందేశాన్ని వారికి తెలియజేయాలని మీకు అనిపించడం లేదా?—మత్త. 9:36.

8. తనను బాధ పెట్టిన వారిమీద యిర్మీయా కోపం పెంచుకోలేదని మనకెలా తెలుసు?

8 యిర్మీయా ఎవరికైతే సహాయం చేయాలనుకున్నాడో వారే ఆయనకు బాధ కలిగించారు. అయినా యిర్మీయా వారికి హాని చేయలేదు, వారిమీద కోపం పెంచుకోలేదు. చివరకు, చెడ్డ రాజైన సిద్కియా పట్ల కూడా ఆయన దీర్ఘశాంతాన్ని, దయను చూపించాడు. యిర్మీయాను చంపేందుకు సిద్కియా అనుమతించినప్పటికీ యెహోవా మాట వినమని యిర్మీయా అతణ్ణి బతిమాలాడు. (యిర్మీ. 38:3-5, 19, 20) ప్రజలపట్ల యిర్మీయాకు ఉన్నంత ప్రేమ మనకూ ఉందా?

దేవుడు ఇచ్చిన ధైర్యం

9. యిర్మీయాకు దేవుడే ధైర్యాన్నిచ్చాడని మనకెలా తెలుసు?

9 ప్రవక్తగా తాను చేయాల్సిన పని గురించి యెహోవా మొదటిసారి తనతో మాట్లాడినప్పుడు యిర్మీయా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీన్నిబట్టి, యిర్మీయా ఆ తర్వాత కనబరచిన ధైర్యం, కృతనిశ్చయం ఆయనకు స్వతహాగా లేవని మనకు తెలుస్తోంది. యిర్మీయా యెహోవాపై పూర్తిగా ఆధారపడ్డాడు కాబట్టే ప్రవక్తగా సేవ చేస్తున్నప్పుడు అసాధారణమైన ధైర్యాన్ని కనబరచగలిగాడు. యెహోవా యిర్మీయాకు సహాయం చేస్తూ తన నియామకాన్ని నెరవేర్చేలా ఆయనను బలపర్చాడు. ఆ విధంగా యెహోవా “పరాక్రమముగల శూరునివలె” ఆయనకు తోడుగా నిలిచాడు. (యిర్మీ. 20:11) యిర్మీయా ఎంతటి ధైర్యసాహసాలు కనబరిచాడంటే, యేసు భూమ్మీద పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనను చూసిన కొంతమంది యిర్మీయా తిరిగి బ్రతికాడని అనుకున్నారు.—మత్త. 16:13, 14.

10. అభిషిక్త శేషం “జనములమీదను రాజ్యములమీదను” నియమించబడ్డారని ఎందుకు చెప్పవచ్చు?

10 జనములకు, రాజ్యములకు తీర్పు సందేశాన్ని ప్రకటించమని ‘జనములకు రాజైన’ యెహోవా యిర్మీయాతో చెప్పాడు. (యిర్మీ. 10:6, 7) అయితే, ఏ భావంలో అభిషిక్త శేషం ‘జనముల మీద, రాజ్యముల మీద’ నియమించబడ్డారు? (యిర్మీ. 1:10) యిర్మీయా ప్రవక్తలాగే యిర్మీయా తరగతివారు కూడా విశ్వ సర్వాధిపతియైన యెహోవా నుండి నియామకాన్ని పొందారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జనములకు, రాజ్యములకు యెహోవా తీర్పులు ప్రకటించే అధికారం ఆయన అభిషిక్త సేవకులకు ఉంది. సర్వోన్నతుడైన దేవుని నుండి అధికారాన్ని పొందిన వీరు, ఆయన ప్రేరేపిత వాక్యంలోని స్పష్టమైన సత్యాలను ఉపయోగిస్తూ తన నియమిత సమయంలో, తాను అనుకున్న విధంగా నేడున్న జనములను, రాజ్యములను దేవుడు కూకటి వేళ్లతో సహా తొలగించి, నాశనం చేస్తాడని ప్రకటిస్తున్నారు. (యిర్మీ. 18:7-10; ప్రక. 11:18) భూవ్యాప్తంగా తన తీర్పు సందేశాలను ప్రకటించమని యెహోవా ఇచ్చిన నియామకాన్ని నెరవేర్చడానికి నిర్విరామంగా కృషిచేయాలనే కృతనిశ్చయంతో యిర్మీయా తరగతివారున్నారు.

11. అననుకూల పరిస్థితులు ఎదురైనా నిర్విరామంగా ప్రకటిస్తూ ఉండడానికి మనమేమి చేయాలి?

11 ప్రజలు మన సందేశాన్ని పట్టించుకోనప్పుడు, వ్యతిరేకత లేదా అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు సహజంగానే మనం కొన్నిసార్లు నిరుత్సాహపడతాం. (2 కొరిం. 1:8) కానీ, మనం కృంగిపోకుండా యిర్మీయాలాగే మన పనిని కొనసాగించాలి. మనం దేవునికి ప్రార్థిస్తూ, ఆయనమీద ఆధారపడుతూ, సహాయం కోసం ఆయనవైపు చూడడం ద్వారా ‘ధైర్యం తెచ్చుకుందాం.’ (1 థెస్స. 2:2) సత్యారాధకులముగా దేవుడు మనకిచ్చిన బాధ్యతల విషయంలో ఎల్లప్పుడూ మనం మెలకువగా ఉండాలి. భక్తిహీన యెరూషలేముతో పోల్చబడిన క్రైస్తవ మతాల నాశనం గురించి మనం నిర్విరామంగా ప్రకటిస్తూ ఉండాలనే కృతనిశ్చయంతో ఉండాలి. యిర్మీయా తరగతివారు “యెహోవా హితవత్సరమును” మాత్రమే కాక ఆయన “ప్రతిదండన దినమును” కూడా ప్రకటిస్తారు.—యెష. 61:1, 2; 2 కొరిం. 6:2.

హృదయపూర్వక ఆనందం

12. యిర్మీయా తన ఆనందాన్ని కాపాడుకున్నాడని ఎందుకు చెప్పవచ్చు? దాన్ని ఆయనెలా కాపాడుకోగలిగాడు?

12 యిర్మీయా తన పనిలో ఆనందించాడు. ఆయన యెహోవాతో ఇలా అన్నాడు: ‘నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను. యెహోవా, నీ పేరు నాకు పెట్టబడింది కాబట్టి నీ మాటలు నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఆనందాన్ని కలుగజేస్తున్నాయి.’ (యిర్మీ. 15:16) సత్య దేవునికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన వాక్యాన్ని ప్రకటించడాన్ని యిర్మీయా తనకు దొరికిన గొప్ప గౌరవంగా భావించాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రజలు చేసే ఎగతాళి గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు యిర్మీయా తన ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. అయితే, తాను ప్రకటించే సందేశం ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత రమ్యమైనదో ఆలోచించినప్పుడు ఆయన తిరిగి తన ఆనందాన్ని పొందాడు.—యిర్మీ. 20:8, 9.

13. మన ఆనందాన్ని కాపాడుకోవడానికి లోతైన ఆధ్యాత్మిక సత్యాలను అధ్యయనం చేయడం ఎందుకు చాలా అవసరం?

13 నేడు, ప్రకటించే పనిలో మన ఆనందాన్ని కాపాడుకోవాలంటే దేవుని వాక్యంలోని లోతైన సత్యాలు అనే ‘బలమైన ఆహారాన్ని’ మనం భుజించాలి. (హెబ్రీ. 5:14) లోతుగా అధ్యయనం చేస్తే మన విశ్వాసం బలపడుతుంది. (కొలొ. 2:6, 7) అంతేగాక మనం ఏమి చేస్తే యెహోవా సంతోషిస్తాడో, ఏమి చేస్తే ఆయన దుఃఖిస్తాడో గుర్తిస్తాం. బైబిలు చదవడానికి, అధ్యయనం చేయడానికి సమయాన్ని కేటాయించడం కష్టంగా ఉన్నట్లయితే మనం రోజూ చేసే పనులను ఒకసారి పరిశీలించుకోవాలి. ప్రతీరోజు కేవలం కొద్ది నిమిషాలపాటు అధ్యయనం చేయడం వల్ల, ధ్యానించడం వల్ల యెహోవాకు మరింత దగ్గరవుతాం, యిర్మీయాలాగే ‘సంతోషాన్ని, హృదయానందాన్ని’ పొందుతాం.

14, 15. (ఎ) యిర్మీయా తనకు అప్పగించబడిన పనిలో నమ్మకంగా కొనసాగడం వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి? (బి) ప్రకటనా పనికి సంబంధించిన ఏ విషయం నేడు దేవుని ప్రజలకు సంతోషాన్నిస్తుంది?

14 యెహోవా హెచ్చరికలను, తీర్పు సందేశాన్ని యిర్మీయా నిర్విరామంగా ప్రకటించినప్పటికీ, యెహోవా తనకిచ్చిన ‘కట్టడం, నాటడం’ అనే పనిని ఆయన మరచిపోలేదు. (యిర్మీ. 1:10) ఆ పనిలో ఆయన మంచి ఫలితాలు సాధించాడు. సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనం చేయబడినప్పుడు కొంతమంది యూదులు, ఇశ్రాయేలీయులుకానివారు దానిని తప్పించుకున్నారు. వారిలో రేకాబీయులు, ఎబెద్మెలెకు, బారూకు ఉన్నారని మనకు తెలుసు. (యిర్మీ. 35:19; 39:15-18; 43:5-7) యథార్థత, దైవభయంగల యిర్మీయా స్నేహితులైన వీరిని, నేడు యిర్మీయా తరగతితో స్నేహం చేస్తున్న భూనిరీక్షణ గలవారితో పోల్చవచ్చు. ఈ ‘గొప్పసమూహపువారి’ విశ్వాసాన్ని బలపరచడం ద్వారా యిర్మీయా తరగతి ఎంతో సంతోషాన్ని పొందుతోంది. (ప్రక. 7:9) అలాగే, వారి నమ్మకమైన సహచరులు కూడా యథార్థ హృదయులకు సత్యాన్ని నేర్పించడం ద్వారా ఎంతో సంతృప్తిని పొందుతున్నారు.

15 సువార్త ప్రకటనా పని కేవలం వినేవారికి చేసే ప్రజా సేవ మాత్రమే కాదుగాని అది యెహోవాకు చేసే ఆరాధన అని కూడా ఆయన ప్రజలకు తెలుసు. మనం చెప్పేది ప్రజలు విన్నా వినకపోయినా, ప్రకటించడం ద్వారా యెహోవాకు పవిత్ర సేవ చేస్తున్నామనే విషయం మనకెంతో సంతోషాన్నిస్తుంది.—కీర్త. 71:23; రోమీయులు 1:9 చదవండి.

మీ నియామకం విషయంలో ‘మెలకువగా ఉండండి’

16, 17. మన కాలాల ప్రాముఖ్యతను ప్రకటన 17:10, హబక్కూకు 2:3 ఎలా చూపిస్తున్నాయి?

16 ప్రకటన 17:10లోని ప్రవచనాన్ని పరిశీలించినప్పుడు మన కాలాల ప్రాముఖ్యతను గుర్తిస్తాం. ఏడవ రాజైన ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం ఉనికిలోకి వచ్చింది. దాని గురించి మనమిలా చదువుతాం: ‘అతడు [ఏడవ ప్రపంచాధిపత్యం] వచ్చినప్పుడు కొంచెం కాలం ఉండాలి.’ (ప్రక. 17:10) ఇప్పటికి ఆ ‘కొంచెం కాలం’ దాదాపు ముగింపుకు వచ్చివుంటుంది. హబక్కూకు ప్రవక్త దుష్టవిధానాంతం గురించి ఈ అభయాన్నిచ్చాడు: “ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును . . . దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.”—హబ. 2:3.

17 మీరిలా ప్రశ్నించుకోండి: ‘మన కాలాల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నట్లు నేను జీవిస్తున్నానా? అంతం త్వరలో రాబోతుందన్నట్లు నేను జీవిస్తున్నానా? నా నిర్ణయాలు, జీవిత ప్రాధాన్యతలు అంతం ఇప్పట్లో రాదని లేదా అసలు వస్తుందో రాదో తెలియదని నేను అనుకుంటున్నట్లు చూపిస్తున్నాయా?’

18, 19. రాజ్య పనిని తగ్గించడానికి ఇది ఎందుకు సమయం కాదు?

18 కావలివాని తరగతి చేసేపని ఇంకా పూర్తికాలేదు. (యిర్మీయా 1:17-19 చదవండి.) అభిషిక్త శేషం ‘ప్రాకారముగల పట్టణంలా, ఇనుప స్తంభంలా’ స్థిరంగా ఉండడం మనకెంత సంతోషాన్నిస్తుందో కదా! తమకు అప్పగించబడిన పనిని పూర్తిగా నెరవేర్చేంతవరకు దేవుని వాక్యం చేత తమను తాము బలపర్చుకోవడం ద్వారా వారు తమ “నడుమునకు సత్యమను దట్టి” కట్టుకున్నారు. (ఎఫె. 6:14) గొప్పసమూహపువారు కూడా అలాంటి కృతనిశ్చయంతోనే దేవుడు అప్పగించిన పనిని కొనసాగించేందుకు యిర్మీయా తరగతికి చురుకుగా మద్దతిస్తున్నారు.

19 రాజ్య పనిని తగ్గించడానికి ఇది సమయం కాదు. బదులుగా మనం యిర్మీయా 12:5లోని మాటల ప్రాముఖ్యతను గుర్తించాలి. (చదవండి.) మనందరం శ్రమలను సహించాలి. ఈ విశ్వాస పరీక్షలను సహించడాన్ని మనం “పాదచారులతో” కలిసి పరుగెత్తడంతో పోల్చవచ్చు. అయితే, “మహా శ్రమ” సమీపిస్తున్నకొద్దీ కష్టాలు మరింత ఎక్కువ అవుతాయి. (మత్త. 24:20, 21) రాబోయే పెద్దపెద్ద కష్టాలతో పోరాడడాన్ని “రౌతులతో [‘గుర్రాలతో,’ NW]” కలిసి పరుగెత్తడంతో పోల్చవచ్చు. దౌడుతీసే గుర్రాలతో సమానంగా పరుగెత్తాలంటే మానవులకు ఎంతో ఓపిక అవసరం. కాబట్టి, ఇప్పుడు ఎదురయ్యే శ్రమలను సహిస్తే మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే, దానివల్ల మనం భవిష్యత్తులో ఎదురయ్యే వాటిని సహించడానికి సిద్ధంగా ఉండగలుగుతాం.

20. మీరు ఏ కృతనిశ్చయంతో ఉన్నారు?

20 యిర్మీయాను అనుకరిస్తే మనందరం ప్రకటనా పనిని సమర్థంగా నెరవేర్చగలుగుతాం. ప్రేమ, ధైర్యం, ఆనందం వంటి లక్షణాలను కనబరచడం వల్ల యిర్మీయా తన పరిచర్యను 67 ఏళ్లపాటు నమ్మకంగా కొనసాగించగలిగాడు. చూడముచ్చటగా ఉండే బాదం పూలను చూస్తే యెహోవా తన వాక్యాన్ని నెరవేర్చడానికి ఎల్లప్పుడూ ‘మెలకువగా’ ఉంటాడనే విషయం గుర్తొస్తుంది. కాబట్టి మనం కూడా మెలకువగా ఉండాలి. యిర్మీయాలాగే మనం కూడా ఎల్లప్పుడూ ‘మెలకువగా’ ఉందాం.

మీకు జ్ఞాపకమున్నాయా?

• తన నియామకం విషయంలో ‘మెలకువగా’ ఉండేందుకు యిర్మీయాను ప్రేమ ఎలా పురికొల్పింది?

• దేవుడు ఇచ్చే ధైర్యం మనకెందుకు అవసరం?

• యిర్మీయా తన ఆనందాన్ని ఎలా కాపాడుకోగలిగాడు?

• మీరు ఎల్లప్పుడూ ‘మెలకువగా ఉండాలని’ ఎందుకు అనుకుంటున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

[31వ పేజీలోని చిత్రాలు]

వ్యతిరేకత ఎదురైనా మీరు ప్రకటనా పనిలో కొనసాగుతారా?