కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లౌకికాత్మను కాక దేవుని ఆత్మను పొందండి

లౌకికాత్మను కాక దేవుని ఆత్మను పొందండి

లౌకికాత్మను కాక దేవుని ఆత్మను పొందండి

“దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.”—1 కొరిం. 2:12.

1, 2. (ఎ) నిజ క్రైస్తవులమైన మనం ఎలాంటి యుద్ధంలో పాల్గొంటున్నాం? (బి) ఇప్పుడు ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

 నిజక్రైస్తవులమైన మనం ఒక యుద్ధంలో ఉన్నాం. మన శత్రువు బలవంతుడు, కుయుక్తిపరుడు, యుద్ధంలో రాటుదేలినవాడు. ఇప్పటికే మానవుల్లో ఎక్కువశాతం మంది అతని చేతిలోవున్న శక్తివంతమైన ఆయుధం దెబ్బకు పడిపోయారు. అంతమాత్రాన మనం బలహీనులమని, ఓడిపోవడం ఖాయమని అనుకోనవసరం లేదు. (యెష. 41:9, 10) మనమెలాంటి దాడినైనా తట్టుకొని నిలబడేలా చేసే సహాయకం మన దగ్గర ఉంది.

2 అయితే, మనం చేసే యుద్ధం ఈ దుష్ట లోకంలోని ప్రజలు చేసే యుద్ధంలాంటిది కాదు. అదొక ఆధ్యాత్మిక యుద్ధం. అపవాదియైన సాతానే మన శత్రువు. అతడు ముఖ్యంగా “లౌకికాత్మ” అనే ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాడు. (1 కొరిం. 2:12) అతడు చేస్తున్న దాడులను తట్టుకొని నిలబడేలా ప్రాముఖ్యంగా దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది. ఈ యుద్ధంలో గెలుపొందాలన్నా, దేవునితో సన్నిహిత సంబంధం కలిగివుండాలన్నా మనం దేవుని ఆత్మ కోసం ప్రార్థించాలి, దాని ఫలాన్ని మన జీవితాల్లో ఫలించాలి. (గల. 5:22, 23) ఇంతకీ, లౌకికాత్మ అంటే ఏమిటి? అది ఎందుకు ఇంత ప్రబలంగా ఉంది? మనం దాని ప్రభావానికి లోనౌతున్నామో లేదో ఎలా తెలుసుకోవచ్చు? దేవుని ఆత్మను పొంది, లౌకికాత్మను ఎదిరించే విషయంలో యేసు నుండి ఏమి నేర్చుకోవచ్చు?

లౌకికాత్మ ఎందుకు ఇంత ప్రబలంగా ఉంది?

3. లౌకికాత్మ అంటే ఏమిటి?

3 లౌకికాత్మ ఈ ‘లోకాధికారియైన’ సాతాను నుండి పుట్టింది. లౌకికాత్మ దేవుని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. (యోహా. 12:31; 14:30; 1 యోహా. 5:19) అది చాలామంది ప్రజల స్వభావంలో కనిపిస్తోంది, వారంతా దానిచేతనే నిర్దేశించబడుతున్నారు. ఈ శక్తి, మానవులు దేవుని ఇష్టానికి, సంకల్పానికి విరుద్ధంగా ప్రవర్తించేలా చేస్తోంది.

4, 5. సాతాను పెంచిపోషిస్తున్న లౌకికాత్మ ఎలా ఇంతగా వ్యాపించింది?

4 సాతాను పెంచిపోషిస్తున్న లౌకికాత్మ ఎలా ఇంతగా వ్యాపించింది? మొట్టమొదట, సాతాను ఏదెను తోటలో హవ్వను మోసగించాడు. దేవుని నుండి స్వతంత్రంగా ఉంటే జీవితం మెరుగౌతుందని అతడు హవ్వను నమ్మించాడు. (ఆది. 3:13) అతడు ఎంతటి అబద్ధికుడు! (యోహా. 8:44) అతడు ఆ తర్వాత హవ్వను ఉపయోగించి ఆదాము యెహోవాకు అవిధేయుడయ్యేలా చేశాడు. ఆదాము చేసిన పనివల్ల మానవులు పాపానికి అమ్మివేయబడ్డారు. ఆ విధంగా, మానవులు సాతానులా అవిధేయతను కనబరచడానికి మొగ్గుచూపే స్వభావాన్ని వారసత్వంగా పొందారు.—ఎఫెసీయులు 2:1-3 చదవండి.

5 సాతాను కొంతమంది దేవదూతలను కూడా ప్రభావితం చేశాడు. వారే ఆ తర్వాత దయ్యాలుగా మారారు. (ప్రక. 12:3, 4) నోవహు జలప్రళయం రావడానికి కొంతకాలం ముందు ఆ దూతలు దేవుణ్ణి విడిచిపెట్టారు. పరలోకంలో తమకు నియమించబడిన స్థానాలను వదులుకొని, భూమ్మీదికి వచ్చి అసహజమైన కోరికలను వెంబడిస్తే తాము మరింత ప్రయోజనం పొందుతామని వారు నమ్మారు. (యూదా 6) ఒకప్పుడు మానవ శరీరాల్ని దాల్చినా ఇప్పుడు మళ్లీ ఆత్మ ప్రాణులుగా ఉన్న ఆ దయ్యాల సహాయంతో సాతాను ‘సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు.’ (ప్రక. 12:9) విచారకరమైన విషయమేమిటంటే, నేడు చాలామందికి ఆ దయ్యాల ప్రభావం గురించి తెలియదు.—2 కొరిం. 4:4.

లౌకికాత్మ మిమ్మల్ని ప్రభావితం చేస్తోందా?

6. ఎప్పుడు మాత్రమే లౌకికాత్మ మనపై ప్రభావం చూపిస్తుంది?

6 మానవులపై సాతాను చూపిస్తున్న ప్రభావం గురించి చాలామందికి తెలియదు. కానీ, క్రైస్తవులకు మాత్రం అతడి పన్నాగాల గురించి తెలుసు. (2 కొరిం. 2:11) నిజానికి, మనం అనుమతిస్తేనే లౌకికాత్మ మనపై ప్రభావం చూపిస్తుంది. మనల్ని దేవుని ఆత్మ ప్రభావితం చేస్తోందా లేక లౌకికాత్మ ప్రభావితం చేస్తోందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు మనమిప్పుడు నాలుగు ప్రశ్నల్ని పరిశీలిద్దాం.

7. యెహోవా నుండి మనల్ని దూరం చేయడానికి సాతాను ఉపయోగించే ఓ పద్ధతి ఏమిటి?

7 నేను ఎంచుకునే వినోదాన్ని బట్టి నేను ఎలాంటి వ్యక్తినని తెలుస్తోంది? (యాకోబు 3:14-18 చదవండి.) మనం హింసను ప్రేమించేలా చేయడం ద్వారా సాతాను మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. హింసను ప్రేమించేవారిని యెహోవా ద్వేషిస్తాడని అపవాదికి తెలుసు. (కీర్త. 11:5) అందుకే సాహిత్యాన్ని, సినిమాలను, సంగీతాన్ని, వీడియో గేములను ఉపయోగించి మన శరీర కోరికలను రేపడానికి సాతాను ప్రయత్నిస్తాడు. కొన్ని వీడియో గేముల విషయానికొస్తే, వాటిని ఆడుతున్నవారు ఘోరమైన అనైతికతకు, హింసాత్మక ప్రవర్తనకు పాల్పడుతున్నట్లు భావించేలా అవి చేస్తాయి. మనం సాతాను పెంచిపోషిస్తున్న చెడును ఎంతో కొంత ప్రేమిస్తున్నంతవరకు మనం సరైనదాన్ని ప్రేమించినా అతడు అంతగా పట్టించుకోడు.—కీర్త. 97:10.

8, 9. వినోదం విషయంలో మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

8 మనం పవిత్రులుగా, సమాధానపరులుగా, అత్యంత కనికరంగలవారిగా ఉండేందుకు దేవుని ఆత్మ తోడ్పడుతుంది. కాబట్టి, ‘నేను ఎంచుకునే వినోదం నాలో మంచి లక్షణాలను పెంపొందిస్తోందా?’ అని మనం ప్రశ్నించుకోవాలి. పైనుండి వచ్చే జ్ఞానం ‘వేషధారణ లేనిది.’ దేవుని ఆత్మచేత ప్రభావితులైనవారు ఒకవైపు పవిత్రత, సమాధానం గురించి ప్రకటించి మరొకవైపు, తాము ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు హింసాత్మకమైన, అనైతికమైన వినోదాన్ని ఆస్వాదించరు.

9 యెహోవా సంపూర్ణ భక్తిని కోరతాడు. కానీ, సాతానుకు సంపూర్ణ భక్తి అవసరం లేదు, తనను ఆరాధిస్తున్నట్లు చూపించే ఒక్క క్రియ చాలు. (లూకా 4:7, 8) కాబట్టి మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను ఎంచుకునే వినోదం వల్ల యెహోవా పట్ల సంపూర్ణ భక్తిని చూపించడం సాధ్యమౌతోందా? ఆ వినోదం వల్ల నేను లౌకికాత్మను ఎదిరించడం సులభమౌతోందా లేదా కష్టమౌతోందా? వినోదాన్ని ఎంచుకునే విషయంలో నేనేమైనా మార్పులు చేసుకోవాలా?’

10, 11. (ఎ) లౌకికాత్మ వస్తుసంపదల విషయంలో ఎలాంటి ఆలోచనను పెంపొందిస్తోంది? (బి) దేవుని ఆత్మ ప్రేరేపణతో రాయబడిన బైబిలు ఏమి ప్రోత్సహిస్తోంది?

10 వస్తుసంపదల విషయంలో నా ఆలోచన ఎలా ఉంది? (లూకా 18:24-30 చదవండి.) లౌకికాత్మ దురాశను, వస్తుసంపదలపై మోజును పురికొల్పడం ద్వారా ‘నేత్రాశను’ పెంపొందిస్తోంది. (1 యోహా. 2:16) అది చాలామందిలో ధనవంతులవ్వాలనే కోరికను నాటింది. (1 తిమో. 6:9, 10) అంతేకాక అది, వస్తుసంపదలను కూడబెట్టుకుంటే ఎప్పటికీ సురక్షితంగా ఉండవచ్చని మనం నమ్మేలా చేస్తుంది. (సామె. 18:11) నిజానికి, మనం దేవుని కన్నా డబ్బును ఎక్కువగా ప్రేమిస్తే సాతాను మనపై విజయం సాధించినట్లే. కాబట్టి, ‘నేను వస్తుపరమైన సౌకర్యాల కోసం, సుఖభోగాల కోసం ప్రాకులాడుతున్నానా?’ అని మనం ప్రశ్నించుకోవాలి.

11 అయితే, డబ్బు విషయంలో మనం సరైన ఆలోచన కలిగివుండాలని, మన కుటుంబానికి అవసరమైనవాటిని సమకూర్చడానికి కష్టపడి పనిచేయాలని దేవుని ఆత్మ ప్రేరేపణతో రాయబడిన బైబిలు ప్రోత్సహిస్తోంది. (1 తిమో. 5:8) యెహోవా ఆత్మను పొందినవారు ఆయన ఉదార స్వభావాన్ని అనుకరించగలుగుతారు. వారు వస్తువులకన్నా మనుష్యులను విలువైనవారిగా ఎంచుతూ తమ దగ్గరున్నవాటిని వీలైనప్పుడల్లా సంతోషంగా ఇతరులతో పంచుకుంటారు. (సామె. 3:27, 28) అంతేగానీ వారు దేవుని సేవను పక్కనబెట్టి డబ్బును సంపాదించడానికి ప్రాకులాడరు.

12, 13. లౌకికాత్మకు భిన్నంగా దేవుని ఆత్మ మనకు ఎలా మేలు చేస్తుంది?

12 నేను ఏ ఆత్మ నిర్దేశానికి లోబడుతున్నానని నా వ్యక్తిత్వం చూపిస్తోంది? (కొలొస్సయులు 3:8-10, 13 చదవండి.) లౌకికాత్మ శరీర కార్యాలను వృద్ధి చేస్తుంది. (గల. 5:19-21) పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాదుగానీ అనుకూలంగా లేనప్పుడు అంటే, ఓ సహోదరుడు/సహోదరి మనల్ని పట్టించుకోనప్పుడు, మనల్ని బాధపెట్టినప్పుడు లేదా మనపట్ల పాపం చేసినప్పుడు మనం ఏ ఆత్మ నిర్దేశానికి లోబడుతున్నామో తెలుస్తుంది. అలాగే, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేసే పనులను బట్టి పరిశుద్ధాత్మ నిర్దేశానికి లోబడుతున్నామా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి, మనల్ని మనం పరిశీలించుకోవడం అవసరం. ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘గత ఆరు నెలల్లో నా వ్యక్తిత్వం మరింతగా క్రీస్తులా మారిందా? లేక నా మాటలు, చేతలు చెడుగా మారాయా?’

13 “ప్రాచీనస్వభావమును దాని క్రియలతో” సహా తీసేసుకొని, “నవీనస్వభావమును” ధరించుకోవడానికి దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది. అలా మనం మరింత ప్రేమ, దయ గలవారిగా తయారౌతాం. కాబట్టి, ఇతరులు మనకు నిజంగా హాని చేశారని అనిపించినా వారిని మనస్ఫూర్తిగా క్షమించగలుగుతాం. అంతేకాక మనకు అన్యాయం జరిగిందని అనిపించినప్పుడు ‘ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణలతో’ ప్రతిస్పందించము కానీ, ‘కరుణాహృదయులుగా’ ఉండడానికి కృషిచేస్తాం.—ఎఫె. 4:31, 32.

14. ప్రపంచంలో చాలామంది దేవుని వాక్యాన్ని ఎలా దృష్టిస్తున్నారు?

14 నేను బైబిల్లోని నైతిక ప్రమాణాలను గౌరవిస్తూ వాటిని ప్రేమిస్తానా? (సామెతలు 3:5, 6 చదవండి.) లౌకికాత్మ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించేలా చేస్తుంది. లౌకికాత్మ చేత ప్రభావితులైనవారు బైబిల్లో తమకు ఇబ్బందికరంగావున్న నిర్దేశాలను పక్కనబెట్టి మనుష్యుల ఆచారాలకు, తత్వజ్ఞానానికి ప్రాముఖ్యతనిస్తారు. (2 తిమో. 4:3, 4) కొంతమందైతే దేవుని వాక్యమంతటినీ నిర్లక్ష్యం చేస్తారు. అలాంటివారు తాము జ్ఞానులమని అనుకుంటూ బైబిలు మన కాలానికి పనికిరాదని, అది నమ్మదగినదికాదని అంటారు. వారు వ్యభిచారం, సలింగ సంయోగం, విడాకులు వంటివాటికి సంబంధించి బైబిల్లోవున్న స్వచ్ఛమైన ప్రమాణాలను నీరుగారుస్తారు. వారు ‘కీడు మేలని, మేలు కీడని’ బోధిస్తారు. (యెష. 5:20) మనం కూడా అలాగే ఆలోచిస్తున్నామా? సమస్యలు వచ్చినప్పుడు సొంత ఆలోచనలపై, మానవ జ్ఞానంపై ఆధారపడతామా? లేక బైబిలు సలహాలను పాటించడానికి కృషి చేస్తామా?

15. మనం సొంత జ్ఞానంపై ఆధారపడే బదులు ఏమి చేయాలి?

15 దేవుని ఆత్మ మనలో బైబిలు పట్ల గౌరవాన్ని కలుగజేస్తుంది. కీర్తనకర్తలాగే మనం కూడా దేవుని వాక్యాన్ని మన పాదాలకు దీపంగా, మన త్రోవకు వెలుగుగా పరిగణిస్తాం. (కీర్త. 119:105) కాబట్టి, ఏది సరైనదో ఏది కాదో తెలుసుకోవడానికి సొంత జ్ఞానంపై కాక పూర్తి నమ్మకంతో దేవుని వాక్యంపై ఆధారపడతాం. మనం బైబిలును గౌరవించడమే కాక దేవుని నియమాలను ప్రేమించడం కూడా నేర్చుకుంటాం.—కీర్త. 119:97.

యేసు మాదిరి నుండి నేర్చుకోండి

16. ‘క్రీస్తు మనస్సును’ కలిగివుండడమంటే ఏమిటి?

16 మనం దేవుని ఆత్మను పొందాలంటే “క్రీస్తు మనస్సు[ను]” పెంపొందించుకోవాలి. (1 కొరిం. 2:16) అందుకోసం మనం ఆయన ఎలా ఆలోచించాడో, ఎలా ప్రవర్తించాడో తెలుసుకోవాలి, ఆయనను అనుకరించాలి. (1 పేతు. 2:21) దీన్ని మనమెలా చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.

17, 18. (ఎ) ప్రార్థన విషయంలో యేసు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (బి) మనం ఎందుకు పదేపదే ‘అడగాలి’?

17 దేవుని ఆత్మ కోసం ప్రార్థించండి. శ్రమల్ని ఎదుర్కొనే ముందు దేవుని ఆత్మ సహాయం కోసం యేసు ప్రార్థించాడు. (లూకా 22:40, 41) మనం కూడా దేవుని పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించాలి. తనను విశ్వాసంతో అడిగేవారందరికీ తన పరిశుద్ధాత్మను యెహోవా ధారాళంగా ఇస్తాడు. (లూకా 11:13) యేసు ఇలా చెప్పాడు: “అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును.”—మత్త. 7:7, 8.

18 యెహోవా ఆత్మ కోసం, సహాయం కోసం ప్రార్థిస్తున్నప్పుడు జవాబు వెంటనే రావడం లేదని అడగడం మానేయకండి. బహుశా మనం పట్టుదలతో పదేపదే ప్రార్థించాల్సి రావచ్చు. కొన్నిసార్లు, ఫలానిది కావాలని మనమెంత బలంగా కోరుకుంటున్నామో, మన విశ్వాసం ఎంత యథార్థమైనదో తనకు చూపించేందుకు యెహోవా కొంత సమయాన్ని అనుమతిస్తాడు. a

19. యేసు ప్రతీ సందర్భంలో ఏమి చేశాడు? మనం ఆయనను ఎందుకు అనుకరించాలి?

19 యెహోవాకు పూర్తిగా లోబడండి. యేసు ఎప్పుడూ తన తండ్రికి ఇష్టమైన పనులే చేశాడు. కానీ ఒకానొక సందర్భంలో, తనకు ఎదురైన పరిస్థితితో వ్యవహరించే విషయంలో యేసు తన తండ్రిలా ఆలోచించలేదు. అయినా, పూర్తి నమ్మకంతో తన తండ్రితో ఇలా అన్నాడు: “నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక.” (లూకా 22:42) కాబట్టి, ‘నేను దేవునికి లోబడడం కష్టంగా ఉన్నప్పుడు కూడా ఆయనకు లోబడతానా?’ అని ప్రశ్నించుకోండి. మనం దేవునికి లోబడితేనే జీవాన్ని పొందుతాం. సృష్టికర్తగా, జీవదాతగా, పోషకుడిగా యెహోవా మన సంపూర్ణ విధేయతకు అర్హుడు. (కీర్త. 95:6, 7) దేవునికి లోబడకుండా మనం ఏమి చేసినా ఆయన ఆమోదాన్ని సంపాదించుకోలేం.

20. తన జీవితమంతా యేసు దేనిమీద దృష్టి నిలిపాడు? మనం ఆయనను ఎలా అనుకరించవచ్చు?

20 లేఖనాలను బాగా తెలుసుకోండి. తన విశ్వాసం మీద సాతాను నేరుగా చేసిన దాడిని ఎదిరించేటప్పుడు యేసు లేఖనాలను ఎత్తి చెప్పాడు. (లూకా 4:1-13) తనను వ్యతిరేకించిన మత నాయకులను ఎదుర్కొనేటప్పుడు కూడా ఆయన దేవుని వాక్యం ఆధారంగానే మాట్లాడాడు. (మత్త. 15:3-6) తాను జీవించినంత కాలం ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవడం మీద, దాన్ని నెరవేర్చడం మీద దృష్టి నిలిపాడు. (మత్త. 5:17) మనం కూడా విశ్వాసాన్ని బలపరిచే దేవుని వాక్యంతో మన మనసులను నింపుకుంటూ ఉండాలని కోరుకుంటాం. (ఫిలి. 4:8, 9) మనలో కొంతమందికి వ్యక్తిగత అధ్యయనం కోసం, కుటుంబ అధ్యయనం కోసం సమయం దొరకకపోతుండవచ్చు. కాబట్టి, సమయం ఉన్నప్పుడు చేద్దామని అనుకోకుండా వాటికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలి.ఎఫె. 5:15-17.

21. దేవుని వాక్యాన్ని మరింత బాగా తెలుసుకోవడానికి, పాటించడానికి మనం ఏ ఏర్పాటును ఉపయోగించుకోవచ్చు?

21 మనం వ్యక్తిగత అధ్యయనం, కుటుంబ అధ్యయనం చేయడానికి సమయం కేటాయించగలిగేలా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ప్రతీవారం కుటుంబ ఆరాధనా సాయంత్రాన్ని ఏర్పాటు చేశాడు. (మత్త. 24:45) మీరు ఈ ఏర్పాటును సరిగ్గా ఉపయోగించుకుంటున్నారా? క్రీస్తు మనసును సంపాదించుకోవాలంటే, మీకు ఆసక్తికరంగా ఉన్న ఓ విషయం గురించి ఆయన ఏమి బోధించాడో క్రమపద్ధతిలో తెలుసుకోవాలి. అలా చేయడానికి మీ అధ్యయనమప్పుడు కొంత సమయాన్ని కేటాయించగలరా? మీరు తెలుసుకోవాలనుకుంటున్న విషయం గురించిన సమాచారం కోసం వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ను (ఆంగ్లం) ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, 2008 నుండి 2010 వరకు వచ్చిన కావలికోట సార్వజనిక ప్రతిలో, “యేసు నుండి మనం నేర్చుకోగల అంశాలు,” “యేసు ఏమి బోధించాడు” అనే శీర్షికలతో కొన్ని ఆర్టికల్స్‌ వచ్చాయి. అంతేకాక, 2006 మొదలుకొని తేజరిల్లు! b పత్రికలో, “మీరెలా జవాబిస్తారు?” అనే శీర్షికతో కొన్ని ఆర్టికల్స్‌ వచ్చాయి. అందులో ఇవ్వబడిన ప్రశ్నలు దేవుని వాక్యంపై మీకున్న జ్ఞానాన్ని పెంచుతాయి. అలాంటి ఆర్టికల్స్‌ను అప్పుడప్పుడు మీ కుటుంబ ఆరాధనలో ఉపయోగించుకోవచ్చు.

మనం లోకాన్ని జయించవచ్చు

22, 23. మనం లోకాన్ని జయించాలంటే ఏమి చేయాలి?

22 దేవుని ఆత్మచేత నడిపించబడాలంటే మనం లౌకికాత్మను ఎదిరించాలి. అది అంత సులభం కాదు. దానికోసం మనం ఎంతో పోరాడాలి. (యూదా 3) అయితే ఈ పోరాటంలో మనం విజయం సాధించవచ్చు! యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను.”—యోహా. 16:33.

23 లౌకికాత్మను ఎదిరించడానికి, దేవుని ఆత్మను పొందడానికి చేయగలిగినదంతా చేస్తే మనం కూడా లోకాన్ని జయించవచ్చు. నిజానికి, “దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?” (రోమా. 8:31) దేవుని ఆత్మను పొంది, అది బైబిలు ద్వారా ఇచ్చే నిర్దేశాన్ని పాటిస్తే మనం సంతృప్తిని, సమాధానాన్ని, సంతోషాన్ని పొందుతాం. అంతేకాక, త్వరలో రాబోయే నూతనలోకంలో నిత్యం జీవిస్తామనే నమ్మకంతో ఉండగలుగుతాం.

[అధస్సూచీలు]

b తెలుగులో తేజరిల్లు! పత్రిక అక్టోబరు-డిసెంబరు, 2007 సంచికతో ఆగిపోయింది. ఇది ప్రస్తుతం ఆంగ్లంలో అందుబాటులో ఉంది.

మీకు జ్ఞాపకమున్నాయా?

• లౌకికాత్మ ఎందుకు ఇంతగా వ్యాపించింది?

• మనం ఏ నాలుగు ప్రశ్నలు వేసుకోవాలి?

• దేవుని ఆత్మను పొందడం గురించి యేసు నుండి మనం ఏ మూడు విషయాలను నేర్చుకున్నాం?

[అధ్యయన ప్రశ్నలు]

[8వ పేజీలోని చిత్రం]

కొందరు దూతలు ఎలా దయ్యాలుగా మారారు?

[10వ పేజీలోని చిత్రం]

ప్రజల్ని తన అదుపులో ఉంచుకోవడానికి సాతాను లౌకికాత్మను ఉపయోగిస్తున్నాడు కానీ, మనం దాని ప్రభావం నుండి విడుదలను పొందవచ్చు