కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేను ఎన్నో మేలులను పొందాను

నేను ఎన్నో మేలులను పొందాను

నేను ఎన్నో మేలులను పొందాను

ఆర్థర్‌ బోనో చెప్పినది

నేను, నా భార్య ఈడత్‌ 1951వ సంవత్సరంలో జరిగిన జిల్లా సమావేశంలో ఓ ప్రకటన విన్నాం. మిషనరీ సేవ పట్ల ఆసక్తి ఉన్నవారి కోసం ఒక కూటం నిర్వహించబడుతుందని ఆ ప్రకటనలో చెప్పారు.

“అక్కడేమి చెప్తారో విందాం పద!” అని ఉత్సాహంగా అన్నాను.

“ఆర్ట్‌, మనం మిషనరీలం కాలేం!” అని ఈడత్‌ అంది.

“ఊరికే విని వద్దాం పద ఈడీ.”

ఆ కూటం అయిపోయాక గిలియడ్‌ పాఠశాలకు దరఖాస్తులను ఇచ్చారు.

“వాటిని నింపుదాం” అని నేను అన్నాను.

“కానీ ఆర్ట్‌, మన కుటుంబాల పరిస్థితి ఏంటి?”

ఆ సమావేశం జరిగిన ఒకటిన్నర సంవత్సరాల తర్వాత, మేము గిలియడ్‌ పాఠశాలకు హాజరయ్యాం. అది పూర్తయ్యాక, దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌లో సేవచేయడానికి మమ్మల్ని నియమించారు.

పై మాటల్లో మీరు చూసినట్లుగా నాకు కొంచెం పట్టుబట్టే స్వభావం, మేము అనుకున్న ప్రతీది చేయగలమనే ధీమా ఉండేవి. కానీ, ఈడత్‌ మాత్రం వినయస్థురాలు, అణుకువగలది. అమెరికాలో ఉన్న పెన్సిల్వేనియాలోని చిన్న పట్టణమైన ఎలీజబెత్‌లో ఆమె పెరిగింది. అప్పట్లో ఆమె ఎన్నడూ తన ఇల్లు వదిలి దూర ప్రయాణాలు చేయలేదు, విదేశీయులను కలవలేదు. కాబట్టి, తన కుటుంబాన్ని విడిచిరావడం ఆమెకు కష్టమనిపించింది. అయినా విదేశాల్లో సేవచేయడానికి ఆమె సంతోషంగా ఒప్పుకుంది. మేము 1954లో ఈక్వెడార్‌కు వచ్చినప్పటినుండి ఈ దేశంలోనే మిషనరీలుగా సేవ చేస్తున్నాం. మేము ఇక్కడ చాలా మేలులను పొందాం. వాటిలో కొన్నిటిని మీకు చెప్పాలనుకుంటున్నాను.

తీపి జ్ఞాపకాలు

మమ్మల్ని మొదట ఆ దేశపు రాజధానియైన క్విటోలో సేవచేయడానికి నియమించారు. అది ఆండిస్‌ పర్వతాల్లో దాదాపు 9000 అడుగుల ఎత్తులో ఉంది. సముద్ర తీరప్రాంతంలో ఉన్న గ్వాయాక్విల్‌ నుండి రైల్లో, ట్రక్కులో ప్రయాణించడానికి అప్పుడు రెండు రోజులు పట్టింది. అదే ఇప్పుడు విమానంలో ప్రయాణం చేస్తే అరగంటే పడుతుంది. మేము క్విటోలో నాలుగు సంవత్సరాలు సేవచేశాం. ఆ సంవత్సరాలను మేము మరచిపోలేం. తర్వాత, 1958లో మాకు మరో మేలు జరిగింది. అదేమిటంటే, మేము ప్రాంతీయ సేవ చేసేందుకు ఆహ్వానాన్ని అందుకున్నాం.

ఆ దేశమంతటిలో అప్పుడు రెండు సర్క్యూట్‌లు మాత్రమే ఉండేవి. కాబట్టి సంఘాలను సందర్శించడంతోపాటు, ఆ దేశంలో సాక్షులెవరూ లేని చిన్న పట్టణాల్లో ఎన్నో వారాలు పరిచర్య చేసేవాళ్లం. అక్కడ మేము కిటికీలు లేని చిన్న గదిలో ఉండాల్సివచ్చేది. అందులో ఒక పరుపు తప్ప ఇంకేమీ ఉండేది కాదు. అందుకని ఒక కిరసనాయిలు స్టవ్‌, ఒక పెనం, ప్లేట్లు, వాష్‌ బేసిన్‌, దుప్పట్లు, దోమతెర, బట్టలు, పాత వార్తాపత్రికలు వంటి వస్తువులను ఒక చెక్కపెట్టెలో తీసుకెళ్లేవాళ్లం. గోడల్లోని రంధ్రాల నుండి ఎలుకలు జొరబడకుండా ఆ రంధ్రాల్లో వార్తాపత్రికలను కుక్కేవాళ్లం. అయినా కొన్నిసార్లు వాటి బెడద తప్పేదికాదు.

ఆ గదులు చీకటిగా, అశుభ్రంగా ఉండేవి. అయినా, రాత్రుల్లో కిరసనాయిలు స్టవ్‌పై వండుకున్న మామూలు భోజనాన్ని పరుపుపై కూర్చొని తింటూ మాట్లాడుకున్న మధురమైన జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. నేను సహోదరులతో ఇంకా నేర్పుగా ఎలా మాట్లాడవచ్చో ఆ ప్రశాంత సమయాల్లో నా భార్య నాతో చెప్పేది. ఎందుకంటే, మేము సహోదరులను సందర్శించినప్పుడు నా దుడుకుతనం వల్ల కొన్నిసార్లు వారితో అనాలోచితంగా మాట్లాడేవాడిని. నేను ఆమె మాట వినడం వల్ల, తర్వాతి సందర్శనాల్లో సహోదరులను మరింత ప్రోత్సహించగలిగాను. అంతేగాక నేను అనాలోచితంగా ఇతరుల గురించి చెడుగా మాట్లాడినప్పుడు ఆమె మాటలు కలిపేది కాదు. అలా నేను సహోదరుల గురించి మంచిగా ఆలోచించడం నేర్చుకున్నాను. అయితే రాత్రుల్లో ఎక్కువగా, కావలికోట పత్రిక నుండి మేము నేర్చుకున్న విషయాల గురించి, ఆ రోజు క్షేత్రసేవ అనుభవాల గురించి మాట్లాడుకునేవాళ్లం. నిజంగా, మాకు ఎంతో చక్కని అనుభవాలు ఎదురయ్యాయి!

మేము కార్లోస్‌ను ఎలా కనుగొన్నామంటే . . .

పడమటి ఈక్వెడార్‌లోని హీపీహాప అనే పట్టణంలో, కార్లోస్‌ మెహీయా అనే వ్యక్తికి ఆసక్తి ఉందని మాకు కబురందింది. కానీ ఆయన చిరునామా తెలియలేదు. ఆ ఉదయాన్నే మేము మా ఇంటి నుండి బయల్దేరాం. ఆ వ్యక్తి కోసం ఎక్కడ వెదకాలో తెలియదు, కాబట్టి మాకు తోచిన వైపుగా నడక సాగించాం. ముందురోజు రాత్రి జోరుగా వర్షం పడడంతో వీధులు బురదబురదగా ఉన్నాయి. దానివల్ల, మేము చాలా జాగ్రత్తగా బురద గుంటలను దాటుకుంటూ నడవాల్సి వచ్చింది. నేను కొంచెం ముందుగా నడుస్తున్నాను. అకస్మాత్తుగా వెనకనుండి “ఆర్ట్‌!” అనే అరుపు వినిపించింది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి నల్లటి బురద గుంటలో ఈడీ మోకాళ్ల వరకు మునిగిపోయి ఉంది. ఆ దృశ్యం ఎంత నవ్వు తెప్పించేదిగా ఉందంటే, ఆమె ఏడ్వకపోయుంటే నేనెంతో నవ్వేవాణ్ణి.

ఆ గుంటలో నుండి ఆమెనైతే బయటికి లాగగలిగాను కానీ, ఆమె బూట్లు మాత్రం బురదలోనే ఇరుక్కుపోయాయి. ఇదంతా ఓ పిల్లవాడు, ఓ పాప చూస్తున్నారు. వాళ్లతో, “మీరు ఆ బూట్లను బురదలో నుండి బయటకు తీస్తే మీకు డబ్బులు ఇస్తాను” అని అన్నాను. అంతే, చిటికెలో తీసిచ్చారు. ఈడీ వాటినిప్పుడు ఎక్కడైనా శుభ్రం చేసుకోవాలి. అయితే, జరుగుతున్న దాన్ని గమనిస్తున్న ఆ ఇద్దరు పిల్లల తల్లి మమ్మల్ని ఇంట్లోకి పిలిచి నా భార్యకు కాళ్లు కడుక్కోవడానికి సహాయం చేసింది, పిల్లలేమో బూట్లను శుభ్రం చేశారు. అక్కడినుండి బయటికి వెళ్లే ముందు ఒక మంచి జరిగింది. అదేమిటంటే, కార్లోస్‌ మెహీయా అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడని ఆమెను అడిగాం. ఆమె ఆశ్చర్యపోయి, “ఆయన నా భర్త” అని చెప్పింది. కొన్నిరోజుల తర్వాత బైబిలు అధ్యయనం ప్రారంభమై, చివరికి ఆ కుటుంబంలోని సభ్యులందరూ బాప్తిస్మం తీసుకున్నారు. కొంతకాలానికి కార్లోస్‌, ఆయన భార్య, వాళ్ల పిల్లల్లో ఇద్దరు అమ్మాయిలు ప్రత్యేక పయినీర్లు అయ్యారు.

కష్టమైన ప్రయాణాలు, ప్రోత్సాహకరమైన ఆతిథ్యాలు

ప్రాంతీయ సేవలో ప్రయాణాలు చేయడం సవాళ్లతో కూడుకున్న పని. మేము బస్సుల్లో, రైళ్లలో, ట్రక్కుల్లో, దోనెల్లో, చిన్న విమానాల్లో ప్రయాణించేవాళ్లం. ఒకసారి జిల్లా పర్యవేక్షకుడైన జాన్‌ మక్లెనకన్‌, ఆయన భార్య డొరథీ కొలంబియా సరిహద్దుకు దగ్గర్లోవున్న జాలర్ల గ్రామాల్లో పరిచర్య చేయడానికి మాతో పాటు వచ్చారు. వెనక మోటారు బిగించిన దోనెలో అప్పుడు మేము ప్రయాణించాం. ఆ సమయంలో, దోనె అంత పెద్ద సొరచేపలు మా పక్కనే ఈదుతూ కనిపించాయి! దోనెను నడుపుతున్న అనుభవంగల నావికుడు కూడా ఆ పెద్ద సొరచేపలను చూసి భయంతో, దోనెను త్వరగా తీరం వైపు మళ్లించాడు.

అయితే, ప్రాంతీయ సేవలో మాకు ఎదురైన సవాళ్ల వల్ల మేము విలువైన పాఠాలు నేర్చుకున్నాం. అతిథి ప్రియులైన మంచి సహోదరులు మాకు పరిచయమయ్యారు. చాలాసార్లు, మాకు ఆతిథ్యమిచ్చిన వారు తాము ఒక్క పూటే తిని మమ్మల్ని మాత్రం మూడు పూటలూ భోజనం చేయమని పట్టుబట్టేవారు. అంతేగాక, తమ ఇంట్లో ఉన్న ఒకేఒక్క పరుపుపై మమ్మల్ని పడుకోమని చెప్పి, వాళ్లు మాత్రం నేల మీద పడుకునేవారు. నా భార్య తరచూ ఇలా అంటుండేది: “ఉన్నవాటితో ఎలా సర్దుకుపోవచ్చో ఈ ప్రియమైన సహోదర సహోదరీలను చూసి నేర్చుకుంటున్నాను.”

“మేము వదులుకోవాలని అనుకోవడంలేదు”

1960లో మాకు మరో మేలు జరిగింది. గ్వాయాక్విల్‌ బ్రాంచి కార్యాలయంలో సేవచేయడానికి మమ్మల్ని ఆహ్వానించారు. నన్ను కార్యనిర్వాహక పని చేయడానికి నియమించారు, ఈడత్‌నేమో బ్రాంచికి దగ్గర్లోని ఒక సంఘంలో పరిచర్య చేయడానికి నియమించారు. నేను ఆఫీసు పనికి సరిపోతానని ఎప్పుడూ అనుకోలేదు, అందుకు అసమర్థుణ్ణని నాకనిపించేది. కానీ, హెబ్రీయులు 13:20, 21 చెబుతున్నట్లుగా దేవుడు ‘తన చిత్తం చేయడానికి ప్రతి మంచి విషయాన్ని’ మనకు అనుగ్రహిస్తాడు. రెండు సంవత్సరాల తర్వాత, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ బెతెల్‌లో పది నెలలపాటు జరిగే గిలియడ్‌ పాఠశాలకు హాజరవ్వమనే ఆహ్వానం నాకు అందింది. ఆ సమయంలో, భార్యలందరూ తమ నియామకంలోనే కొనసాగాలని ప్రధాన కార్యాలయం కోరింది. బ్రూక్లిన్‌ నుండి నా భార్యకు ఒక ఉత్తరం వచ్చింది. అందులో, పది నెలలపాటు నేను దూరంగా ఉండడం తనకు సమ్మతమేనా అనే విషయం గురించి జాగ్రత్తగా ఆలోచించమని ఈడీని అడిగారు.

దానికి ఈడీ జవాబిస్తూ ఇలా రాసింది: “ఇది అంత సులువైన పనేమీ కాదు కానీ, మాకు ఎదురయ్యే ఎలాంటి కష్టాల్లోనైనా యెహోవా తప్పక సహాయం చేస్తాడని మాకు తెలుసు . . . మా ముందుంచబడిన ఏ ఆధిక్యతనైనా, మా బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహించడానికి దోహదపడే ఏ అవకాశాన్నైనా మేము వదులుకోవాలని అనుకోవడంలేదు.” నేను బ్రూక్లిన్‌లో ఉన్నప్పుడు, నా భార్య నుండి నాకు ప్రతీవారం ఉత్తరం వచ్చేది.

నమ్మకస్థులైన తోటి విశ్వాసులతో కలిసి సేవచేశాం

1966లో అనారోగ్య సమస్యల వల్ల నేను, నా భార్య క్విటోకు తిరిగివచ్చాం. అక్కడ స్థానిక సహోదర సహోదరీలతో కలిసి మళ్లీ మిషనరీ సేవలో కొనసాగాం. నిజంగా వారెంతో యథార్థపరులు.

ఓ నమ్మకమైన సహోదరి భర్త అవిశ్వాసి, ఆయన తరచూ ఆమెను కొట్టేవాడు. ఒకరోజు తెల్లవారుజామున ఆరు గంటలకు ఒకాయన వచ్చి, ఆమె భర్త ఆమెను మళ్లీ కొట్టాడని చెప్పాడు. వెంటనే ఆ సహోదరి ఇంటికి పరుగెత్తుకెళ్లాను. ఆమెను చూసినప్పుడు, నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. ఆమె దెబ్బలతో హూనమైపోయి, వాపులతో పరుపు మీద పడుకొనివుంది. తన భర్త ఆమెను చీపురుకట్ట విరిగిపోయే వరకు కొట్టాడు. అదేరోజు కొన్ని గంటల తర్వాత ఇంట్లో ఆమె భర్తను కలిసి, ‘నువ్వు పిరికిపందలా ప్రవర్తించావు’ అని ఆయనతో అన్నాను. అందుకాయన చాలా క్షమాపణలు కోరాడు.

1970ల ప్రారంభంలో నా ఆరోగ్యం కుదుటపడడంతో మేము తిరిగి ప్రాంతీయ సేవ మొదలుపెట్టాం. మా సర్క్యూట్‌లో ఈబార్రా అనే నగరం ఉండేది. 1950ల చివరి భాగంలో మేము ఆ నగరాన్ని సందర్శించినప్పుడు అక్కడ కేవలం ఇద్దరు సాక్షులు అంటే ఒక మిషనరీ, ఒక స్థానిక సహోదరుడు మాత్రమే ఉండేవారు. కాబట్టి, కొత్తగా సంఘంలోకి వచ్చిన సహోదర సహోదరీలను కలవాలని మేము ఎంతో ఆత్రంగా ఎదురుచూశాం.

మొదటిసారి మేము అక్కడ కూటానికి హాజరైనప్పుడు, రోడ్రీగో వాకా అనే సహోదరుడు స్టేజీ పైనుండి ప్రేక్షకులు పాల్గొనే ఒక భాగాన్ని నిర్వహిస్తున్నాడు. ఆయన ప్రశ్న అడిగిన ప్రతీసారి, ఆ ప్రేక్షకులు జవాబులు చెప్పడానికి చేతులు పైకి ఎత్తే బదులు “యో, యో!” (“నన్ను, నన్ను!”) అని బిగ్గరగా అనేవారు. నేనూ నా భార్య నివ్వెరపోయి ఒకరి ముఖం ఒకరం చూసుకున్నాం. ‘అసలు ఇక్కడ ఏమి జరుగుతోంది?’ అని అనుకున్నాను. సహోదరుడు వాకాకు చూపులేదని, సంఘ సభ్యులు అలా అంటున్నప్పుడు వారి స్వరాలను గుర్తుపడతాడని మాకు ఆ తర్వాత తెలిసింది. ఆయన నిజంగా తన గొర్రెలేవో బాగా తెలిసిన కాపరి! ఆయనను చూసినప్పుడు మంచి కాపరి, ఆయన గొర్రెల గురించి యోహాను 10:3, 4, 14లో యేసు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ప్రస్తుతం ఈబార్రాలో ఆరు స్పానిష్‌ భాషా సంఘాలు, ఒక కిచువా భాషా సంఘం, ఒక సంజ్ఞా భాషా సంఘం ఉన్నాయి. సహోదరుడు వాకా ఓ పెద్దగా, ప్రత్యేక పయినీరుగా దేవుని సేవలో నమ్మకంగా కొనసాగుతున్నాడు. a

యెహోవా మంచితనానికి మేము రుణపడివున్నాం

1974లో బెతెల్‌కు తిరిగి రమ్మనే ఆహ్వానం అందినప్పుడు, యెహోవా మంచితనాన్ని మరోసారి రుచి చూశాం. అక్కడ నన్ను మళ్లీ కార్యనిర్వాహక పని చేయడానికి నియమించారు, ఆ తర్వాత బ్రాంచి కమిటీ సభ్యునిగా నియమించారు. ఈడత్‌ మొదట కిచెన్‌లో చేసేది. ఆమె ఆ తర్వాత ఉత్తరాల క్లర్కుగా ఆఫీసులో పని చేయడం ప్రారంభించి ఇప్పటివరకు అందులో కొనసాగుతోంది.

గడిచిన సంవత్సరాల్లో, గిలియడ్‌ పాఠశాలలో శిక్షణ పొందిన వందలాది మిషనరీలను ఎంతో సంతోషంగా ఆహ్వానించగలిగాం. మిషనరీల వల్ల సంఘాలు మరింత ఉత్సాహం, పరిణతి గలవిగా తయారౌతాయి. 30కన్నా ఎక్కువ దేశాల నుండి సేవచేయడానికి ఇక్కడికి వచ్చిన వేలాది మంది సహోదర సహోదరీల వల్ల మేము ఎంతో ప్రోత్సాహాన్ని పొందాం. వారి స్వయంత్యాగ స్ఫూర్తిని చూస్తే మాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సేవచేయడం కోసం ఇక్కడకు రావడానికి కొంతమంది తమ ఇళ్లను, వ్యాపారాలను అమ్మేశారు. వాళ్లు మారుమూల ప్రాంతాల్లో ప్రకటించడానికి వాహనాలను కొన్నారు, కొత్త సంఘాలను స్థాపించారు, రాజ్యమందిరాలను నిర్మించడం కోసం సహాయం చేశారు. చాలామంది ఒంటరి సహోదరీలు పయినీరు సేవ చేయడం కోసం ఇక్కడికి వచ్చారు. వారు ఎంతో ఉత్సాహవంతులు, సమర్థులు.

ఇప్పటివరకు దేవుని సేవలో నిజంగా నేను ఎన్నో మేలులను పొందాను. వాటిలో యెహోవాతో నాకున్న సంబంధమే అన్నింటికన్నా ప్రాముఖ్యమైనది. యెహోవా నాకు ఒక ‘సహాయకారిని’ ఇచ్చినందుకు కూడా నేనెంతో కృతజ్ఞుణ్ణి. (ఆది. 2:18) మా 69 సంవత్సరాల వివాహ జీవితం గురించి ఆలోచిస్తే, నాకు సామెతలు 18:22 గుర్తొస్తుంది. అక్కడిలా ఉంది: “భార్య దొరికినవానికి మేలు దొరికెను.” ఈడత్‌ సాహచర్యంలో నేను ఎంతో ఆనందించాను. తాను నాకు ఎన్నో విధాలుగా సహాయం చేసింది. అంతేకాక, వాళ్ల అమ్మకు ఆమె ప్రియమైన కూతురు కూడా. మేము ఈక్వెడార్‌కు వచ్చినప్పటినుండి 1990లో వాళ్లమ్మ 97 ఏళ్ల వయసులో చనిపోయే వరకు నా భార్య ప్రతీవారం ఆమెకు ఓ ఉత్తరం రాసేది.

నాకిప్పుడు 90 ఏళ్లు, నా భార్యకు 89 ఏళ్లు. యెహోవా గురించి తెలుసుకోవడానికి దాదాపు 70 మందికి సహాయం చేయడంలో మాకు దొరికిన సంతోషాన్ని మేమెంతో విలువైనదిగా ఎంచుతున్నాం. 60 సంవత్సరాల క్రితం గిలియడ్‌ పాఠశాలకు వెళ్లడం కోసం దరఖాస్తులను నింపినందుకు మేము నిజంగా సంతోషిస్తున్నాం. ఆ నిర్ణయం వల్ల మా జీవితంలో మేము ఎన్నో మేలులను పొందాం.

[అధస్సూచి]

a సహోదరుడు వాకా జీవిత కథ తేజరిల్లు! (ఆంగ్లం) సెప్టెంబరు 8, 1985 సంచికలో వచ్చింది.

[29వ పేజీలోని చిత్రం]

1958లో మాతోపాటు గిలియడ్‌ పాఠశాలలో శిక్షణ పొందిన తోటి మిషనరీలతో కలిసి న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో

[31వ పేజీలోని చిత్రం]

1959లో ప్రాంతీయ సేవలో సాక్షి కుటుంబాన్ని సందర్శిస్తున్నప్పుడు

[32వ పేజీలోని చిత్రం]

2002లో ఈక్వెడార్‌ బ్రాంచి కార్యాలయంలో