కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా సేవకు ప్రాముఖ్యతనిద్దాం

యెహోవా సేవకు ప్రాముఖ్యతనిద్దాం

యెహోవా సేవకు ప్రాముఖ్యతనిద్దాం

“ఏవి మాన్యమైనవో . . . వాటిమీద ధ్యానముంచుకొనుడి.”—ఫిలి. 4:8.

1, 2. నేడు చాలామంది ఎందుకు సరదాలకు ప్రాముఖ్యతనిస్తున్నారు? మనకెలాంటి ప్రశ్నలు వస్తాయి?

 మానవ చరిత్రలోనే అత్యంత కష్టమైన, విపత్కరమైన కాలాల్లో మనం జీవిస్తున్నాం. యెహోవాతో దగ్గరి సంబంధం లేని ప్రజలకు ఈ ‘అపాయకరమైన కాలాల్లోని’ పరిస్థితుల్లో ఏమి చేయాలో తోచట్లేదు. (2 తిమో. 3:1-5) కాబట్టి వారు అతికష్టం మీద బ్రతుకు బండిని ఈడుస్తున్నారు. తమ బాధలను మర్చిపోవాలనే ఉద్దేశంతో చాలామంది ఎప్పుడూ ఏదో ఒక కొత్త రకమైన వినోదాన్ని ఆశ్రయిస్తున్నారు.

2 జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు తరచూ సుఖభోగాలకు ప్రాముఖ్యతనిస్తున్నారు. ఒకవేళ క్రైస్తవులు జాగ్రత్తగా ఉండకపోతే లోకంలోని ప్రజల్లాగే ప్రవర్తించే ప్రమాదం ఉంది. అయితే మనం జాగ్రత్తగా ఎలా ఉండవచ్చు? జాగ్రత్తగా ఉండాలంటే మనం ఎలాంటి సరదాలు లేకుండా ఎప్పుడూ గంభీరంగా ఉండాలా? సరదాగా ఉంటూనే మన క్రైస్తవ బాధ్యతలను ఎలా నిర్వర్తించవచ్చు? మరీ గంభీరంగా ఉండకుండానే, జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలకు మొదటి స్థానమివ్వాలంటే మనం ఏ లేఖనాలను పాటించాలి?

సుఖభోగాల్ని ప్రేమించే లోకంలో జీవిస్తున్నా యెహోవా సేవకే ప్రాముఖ్యతనిద్దాం

3, 4. జీవితంలో ప్రాముఖ్యమైన వాటికి మొదటి స్థానమిచ్చేందుకు లేఖనాలు మనకెలా సహాయం చేస్తాయి?

3 నేటి ప్రజలు ‘సుఖానుభవాన్నే ఎక్కువగా’ ప్రేమిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. (2 తిమో. 3:4) మనం అలాంటివారిని చూసి యెహోవాతో మనకున్న సంబంధాన్ని పాడుచేసుకునే ప్రమాదం ఉంది. (సామె. 21:17) అందుకే యెహోవా సేవకు ప్రాముఖ్యతనివ్వాలని అపొస్తలుడైన పౌలు తిమోతికి, తీతుకు రాసిన ఉత్తరాల్లో ఉపదేశమిచ్చాడు. ఆ ఉపదేశాన్ని పాటిస్తే మనం లోకంలోని ప్రజల్లా సరదాలకు ప్రాముఖ్యతనివ్వం.—1 తిమోతి 2:1, 2; తీతు 2:2-8 చదవండి.

4 కొన్నిసార్లు, జీవితంలో ప్రాముఖ్యమైన వాటికి మొదటి స్థానమిచ్చేందుకు మనం లోకంలోని సరదాలను వదులుకోవాల్సి రావచ్చు. అలా చేయడం ఎంత మంచిదో సొలొమోను చాలా శతాబ్దాల క్రితమే రాశాడు. (ప్రసం. 3:4; 7:2-4) జీవితం చాలా చిన్నది కాబట్టి రక్షణ పొందేందుకు మనం తీవ్రంగా ‘పోరాడాలి.’ (లూకా 13:24) దీనికోసం మనం ‘మాన్యమైనవాటి’ లేక ప్రాముఖ్యమైనవాటి గురించే ఆలోచిస్తూ ఉండాలి. (ఫిలి. 4:8, 9) అంటే క్రైస్తవులుగా ఉండేందుకు అవసరమైన ప్రతీ విషయంలో మనం తగిన శ్రద్ధ తీసుకోవాలి.

5. జీవితంలో మనకున్న ఒక ప్రాముఖ్యమైన బాధ్యత ఏమిటి?

5 ఉదాహరణకు యెహోవాను, యేసును అనుకరిస్తూ క్రైస్తవులు కూడా కష్టపడి పనిచేస్తారు. దాన్ని వారు ప్రాముఖ్యమైన బాధ్యతగా ఎంచుతారు. (యోహా. 5:17) అందుకే ప్రజలు వారిని కష్టపడి పనిచేసేవారనీ, నమ్మకస్థులనీ మెచ్చుకుంటారు. ప్రత్యేకంగా కుటుంబ పెద్దలు తమ కుటుంబాలను పోషించడానికి ఎంతో కష్టపడి పనిచేస్తారు. ఎందుకంటే, ఒకవేళ కుటుంబ పెద్ద తన కుటుంబాన్ని పోషించకపోతే ఆయన “విశ్వాసత్యాగము” చేసినట్లే లేదా యెహోవాను విడిచిపెట్టినట్లే.—1 తిమో. 5:8.

ఆరాధనను గంభీరమైనదిగా ఎంచుతూనే దానిలో సంతోషాన్ని పొందండి

6. యెహోవాను ఎల్లప్పుడూ సరైన విధంగా ఎందుకు ఆరాధించాలి?

6 ప్రజలు తనను సరైన విధంగా ఆరాధించాలని యెహోవా ఎల్లప్పుడూ కోరుకుంటాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు యెహోవా ఆరాధనను విడిచిపెట్టి పక్కదారి పట్టినప్పుడు మోషే ధర్మశాస్త్రం చెప్పినట్లే చెడు పరిణామాలను చవిచూశారు. (యెహో. 23:12, 13) అబద్ధ బోధల వల్ల, తప్పుడు ఆలోచనల వల్ల సత్యారాధన కలుషితం కాకుండా ఉండేందుకు మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. (2 యోహా. 7-11; ప్రక. 2:14-16) అలాగే నేటి క్రైస్తవులు కూడా సరైన విధంగా యెహోవాను ఆరాధించేందుకు తీవ్రంగా కృషిచేస్తారు.—1 తిమో. 6:20.

7. పౌలు రాజ్య సువార్తను ప్రకటించడానికి ఎలా సిద్ధపడ్డాడు?

7 మనం రాజ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతో సంతోషాన్ని పొందుతాం. అయితే ఆ సంతోషాన్ని కాపాడుకోవాలంటే, మనం దానిగురించి జాగ్రత్తగా ఆలోచించి ముందుగానే సిద్ధపడాలి. తన శ్రోతల పట్ల తనకున్న శ్రద్ధ గురించి పౌలు ఇలా రాశాడు: “ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను.” (1 కొరిం. 9:22, 23) యెహోవా గురించి ప్రజలకు తెలియజేయడంలో పౌలు సంతోషాన్ని పొందాడు. అంతేకాక, తన శ్రోతల అవసరాలకు తగినట్లు ప్రకటించడానికి ఆయన ముందుగానే సిద్ధపడ్డాడు. అందుకే, యెహోవాను ఆరాధించేందుకు వారికి కావాల్సిన ప్రోత్సాహాన్ని, ప్రేరణను ఆయన ఇవ్వగలిగాడు.

8. (ఎ) పరిచర్యలో మన బోధ వినే ప్రజల పట్ల మనకు ఎలాంటి అభిప్రాయం ఉండాలి? (బి) బైబిలు అధ్యయనం నిర్వహిస్తే మనం పరిచర్యలో సంతోషాన్ని పొందుతామని ఎందుకు చెప్పవచ్చు?

8 పౌలు తన పరిచర్యకు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడు? ఆయన యెహోవాకు, తన శ్రోతలకు “దాసునిగా” ఉండడానికి ఇష్టపడ్డాడు. (రోమా. 12:11; 1 కొరిం. 9:19) గృహ బైబిలు అధ్యయనంలో, క్రైస్తవ కూటంలో లేదా కుటుంబ ఆరాధనలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మన శ్రోతల పట్ల మనకున్న బాధ్యతను గుర్తిస్తున్నామా? క్రమంగా బైబిలు అధ్యయనాన్ని నిర్వహించడం మోయలేని భారమని మనకు అనిపిస్తుండవచ్చు. నిజమే, దానికోసం మన సొంత పనులను పక్కనబెట్టి ఆ సమయాన్ని ఇతరులకు సహాయం చేసేందుకు వెచ్చించాల్సి వస్తుంది. అయితే అలాచేస్తే, “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని యేసు చెప్పిన మాటలను పాటించగలుగుతాం. (అపొ. 20:35) మనం ఇతరులకు రక్షణ మార్గం గురించి నేర్పించినప్పుడు పొందే సంతోషాన్ని దేనితోనూ పోల్చలేం.

9, 10. (ఎ) ప్రాముఖ్యమైన విషయాలకు మొదటి స్థానమివ్వడమంటే విశ్రాంతి తీసుకోకూడదనీ ఇతరులతో సరదాగా సమయం గడపకూడదనీ దానర్థమా? వివరించండి. (బి) ఇతరులు తమ నుండి ప్రోత్సాహం పొందాలన్నా, భయపడకుండా తమ దగ్గరికి రావాలన్నా పెద్దలు ఏమి చేయాలి?

9 ప్రాముఖ్యమైన విషయాలకు మొదటి స్థానమివ్వడమంటే ఇతరులతో సరదాగా సమయం గడపకూడదని దానర్థం కాదు. కేవలం బోధించడానికే కాక విశ్రాంతి తీసుకునేందుకు, ఇతరులతో మంచి సంబంధాలను ఏర్పరచుకునేందుకు సమయాన్ని వెచ్చించే విషయంలో యేసు పరిపూర్ణ మాదిరి. (లూకా 5:27-29; యోహా. 12:1, 2) అంతేగాక, ప్రాముఖ్యమైన విషయాలకు మొదటి స్థానమివ్వడానికి మనం ఎప్పుడూ గంభీరంగా కనిపించాల్సిన అవసరం లేదు. యేసు ఒకవేళ కఠినంగా, అతి గంభీరంగా కనిపించివుంటే ప్రజలు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్లివుండేవారు కాదు. చివరికి పిల్లలు కూడా ఆయన దగ్గరికి వెళ్లడానికి భయపడలేదు. (మార్కు 10:13-16) అయితే, యేసులా ఉండడానికి మనం ఏమి చేయాలి?

10 ఒక సంఘ పెద్ద గురించి మాట్లాడుతూ ఓ సహోదరుడు ఇలా అన్నాడు: “ఆయన చాలా ఉన్నత ప్రమాణాలను పాటిస్తాడు కానీ ఇతరుల నుండి పరిపూర్ణతను ఎన్నడూ ఆశించడు.” సహోదర సహోదరీలు మీ గురించి కూడా అలాగే చెబుతారా? మనం ఇతరుల పరిమితులను అర్థం చేసుకోవడం మంచిది. ఉదాహరణకు, తల్లిదండ్రులు తమ పిల్లలు చేరుకోగలిగే లక్ష్యాలను ఏర్పరచి, వాటిని చేరుకోవడానికి వారికి సహాయం చేసినప్పుడు పిల్లలు చక్కగా స్పందిస్తారు. అదేవిధంగా సంఘ పెద్దలు ఆధ్యాత్మికంగా మరింత ప్రగతి సాధించమని ఇతరులను ప్రోత్సహించి, వారలా చేయడానికి స్పష్టమైన సలహాలను ఇవ్వవచ్చు. అంతేకాక, ఒక పెద్ద తన పరిమితులను గుర్తించి ప్రవర్తిస్తే ఇతరులు ప్రోత్సాహం పొందుతారు, భయపడకుండా ఆయన దగ్గరికి వెళ్తారు. (రోమా. 12:3) ఒక సహోదరి ఇలా చెప్పింది: “ఒక పెద్ద ప్రతీదాన్ని సరదాగా తీసుకోవాలని నేను కోరుకోను. అలాగని ఆయన ఎప్పుడూ గంభీరంగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్లడం కష్టమౌతుంది.” కొంతమంది పెద్దలు “చాలా గంభీరంగా ఉంటారు కాబట్టి వారిని చూస్తేనే భయమేస్తుంది” అని మరో సహోదరి చెప్పింది. ‘సంతోషంగల దేవుడైన’ యెహోవాను ఆరాధిస్తున్న విశ్వాసులు ఆరాధనలో పొందుతున్న సంతోషాన్ని తమ కారణంగా కోల్పోవాలని సంఘ పెద్దలు ఎన్నడూ కోరుకోరు.—1 తిమో. 1:11, NW.

సంఘంలో బాధ్యతలను స్వీకరిద్దాం

11. సంఘంలో బాధ్యతలను చేపట్టేందుకు అర్హులు కావడమంటే ఏమిటి?

11 సంఘంలో బరువైన బాధ్యతలను చేపట్టడానికి అర్హులయ్యేందుకు కృషి చేయమని పౌలు సంఘంలోని పురుషులను ప్రోత్సహించాడు. అయితే, వారు అధికార కాంక్ష కలిగివుండాలనే ఉద్దేశంతో ఆయన అలా చెప్పలేదు. కానీ, ఇలా రాశాడు: “ఎవడైనను అధ్యక్ష్యపదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడు.” (1 తిమో. 3:1, 4) ఒక క్రైస్తవుడు తన సహోదరులకు సేవ చేయడానికి కావాల్సిన ఆధ్యాత్మిక లక్షణాలను సంపాదించుకోవడానికి కృషి చేయాలన్న బలమైన కోరికను పెంపొందించుకోవాలి. అప్పుడే ఆయన బాధ్యతలను చేపట్టేందుకు అర్హుడు కాగలుగుతాడు. ఓ సహోదరుడు బాప్తిస్మం తీసుకొని కనీసం ఒక సంవత్సరం గడవడమేకాక, 1 తిమోతి 3:8-13లో చెప్పబడిన లేఖనార్హతలను సముచితమైన విధంగా సాధించివుంటే, పరిచర్య సేవకునిగా నియమించబడడానికి సంఘ పెద్దలు ఆయనను సిఫారసు చేయవచ్చు. ‘పరిచారకులు మాన్యులై ఉండాలి’ అంటే యెహోవా ఆరాధనకు ప్రాముఖ్యతనిచ్చే వారై ఉండాలి అని 8వ వచనం స్పష్టంగా చెబుతోందని గమనించండి.

12, 13. యౌవనస్థులు సంఘ బాధ్యతలు చేపట్టేందుకు ఎలా అర్హతలను సంపాదించుకోవచ్చో వివరించండి.

12 మీరు బాప్తిస్మం పొంది యెహోవా ఆరాధనకు ప్రాముఖ్యతనిస్తున్న యౌవనస్థులా? అలాగైతే బాధ్యతలను చేపట్టడానికి అర్హులయ్యేందుకు మీకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీరు పరిచర్యలో ఎక్కువ సమయం వెచ్చించడానికి ప్రయత్నించవచ్చు. ఏ వయసువారితోనైనా కలిసి పరిచర్య చేయడానికి మీరు ఇష్టపడతారా? మీరు బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారా? క్రైస్తవ కూటాల్లో ఇవ్వబడే సలహాలను ఉపయోగించి బైబిలు అధ్యయనం నిర్వహిస్తే, బోధనా సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతారు. అంతేకాక, యెహోవా మార్గాల గురించి తెలుసుకునేవారి పట్ల సహానుభూతి చూపించగలుగుతారు. మీ బైబిలు విద్యార్థి తన జీవితంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తిస్తున్నప్పుడు, బైబిలు సూత్రాలను అన్వయించుకోవడానికి ఆయనకు ఓపికతో, వివేచనతో సహాయం చేయడం నేర్చుకుంటారు.

13 యౌవనస్థులారా, మీ సంఘంలోని వృద్ధులకు ఏ సహాయం అవసరమో తెలుసుకొని, వారికి చేయూతనివ్వడానికి మీరు అందుబాటులో ఉండవచ్చు. రాజ్యమందిరాన్ని శుచిగా-శుభ్రంగా ఉంచడానికి సహాయం చేస్తూ అది కనిపించే తీరు విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవచ్చు. చేతనైనంత సహాయం చేయడానికి ముందుకు రావడం వల్ల మీరు పరిచర్యను ప్రాముఖ్యమైనదిగా ఎంచుతున్నారని చూపిస్తారు. తిమోతిలా మీరు కూడా సంఘ అవసరాల పట్ల నిజమైన శ్రద్ధ చూపించడం నేర్చుకుంటారు.—ఫిలిప్పీయులు 2:19-22 చదవండి.

14. యౌవనస్థులు సంఘంలో సేవచేయడానికి అర్హులో కాదో పెద్దలు ఎలా ‘పరీక్షించవచ్చు’?

14 సంఘ పెద్దలారా, ‘యౌవనేచ్ఛల నుండి పారిపోవడానికి’ కృషి చేస్తూ ‘నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము’ వంటి మంచి లక్షణాలను అలవర్చుకుంటున్న యౌవనస్థులను సంఘంలో ఎలా ఉపయోగించవచ్చో ఆలోచించండి. (2 తిమో. 2:22) సంఘంలో వారికి కొన్ని పనులు అప్పగిస్తే, వారు బాధ్యతలు చేపట్టేందుకు అర్హులో కాదో ‘పరీక్షించగలుగుతారు.’ దానివల్ల వారి ‘అభివృద్ధి అందరికీ తేటగా కనబడుతుంది.’—1 తిమో. 3:10; 4:15.

సంఘంలో, కుటుంబంలో . . .

15. మనం 1 తిమోతి 5:1, 2లో చెప్పబడినట్లుగా ఇతరులతో ఎలా గౌరవప్రదంగా వ్యవహరించవచ్చు?

15 సరైన వాటికి ప్రాముఖ్యత ఇవ్వడంలో భాగంగా సహోదరులకు తగిన గౌరవాన్ని కూడా ఇవ్వాలి. పౌలు తిమోతికి ఇచ్చిన ఉపదేశంలో ఇతరులను గౌరవించాల్సిన అవసరాన్ని ప్రస్తావించాడు. (1 తిమోతి 5:1, 2 చదవండి.) స్త్రీపురుషులు ఒకరితో ఒకరు వ్యవహరిస్తున్నప్పుడు తప్పుడు సంకేతాలను పంపించేలా ప్రవర్తించకుండా జాగ్రత్త వహించడం ఎంతో ప్రాముఖ్యం. స్త్రీలను, ప్రత్యేకంగా తన భార్యను గౌరవించే విషయంలో యోబు మంచి మాదిరిని ఉంచాడు. మనం ఆయనను అనుకరించాలి. ఆయన తప్పుడు ఉద్దేశాలతో స్త్రీలవైపు చూడకుండా జాగ్రత్తపడ్డాడు. (యోబు 31:1) మన సహోదర సహోదరీలతో గౌరవప్రదంగా వ్యవహరించాలంటే వారితో సరసాలాడకూడదు, వారికి ఇబ్బంది కలిగించే ఏ పనీ చేయకూడదు. ఓ అబ్బాయి, అమ్మాయి వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో కలిసి సమయం గడుపుతున్నప్పుడు ఒకరితో ఒకరు గౌరవపూర్వకంగా వ్యవహరించాలి. గౌరవప్రదంగా వ్యవహరించే క్రైస్తవ స్త్రీపురుషులు ఒకరి భావావేశాలతో ఒకరు ఆటలాడకూడదు.—సామె. 12:22.

16. భర్త పాత్రను, తండ్రి పాత్రను లోకం చూసే తీరుకూ బైబిలు వివరిస్తున్న తీరుకూ మధ్యవున్న తేడా ఏమిటి?

16 కుటుంబంలో ప్రతీ ఒక్కరికి దేవుడు ఇచ్చిన బాధ్యతలను కూడా ఎల్లప్పుడూ గంభీరమైనవిగా పరిగణించాలి. భర్త పాత్రను, తండ్రి పాత్రను సాతాను లోకం అపహాస్యం చేస్తోంది. వినోద పరిశ్రమ కుటుంబ యజమాని పాత్రను హేళన చేస్తోంది, అగౌరవపరుస్తోంది. కానీ, భర్తకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయని, ఆయన ‘భార్యకు శిరస్సు’ అని లేఖనాలు చూపిస్తున్నాయి.—ఎఫె. 5:23; 1 కొరిం. 11:3.

17. కుటుంబ ఆరాధనలో పాల్గొనడం ద్వారా మన బాధ్యతల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నామని మనమెలా చూపించవచ్చు?

17 భర్త తన కుటుంబానికి వస్తుపరంగా అన్నీ సమకూరుస్తుండవచ్చు కానీ, ఆధ్యాత్మిక నిర్దేశాన్ని ఇవ్వకపోతే ఆయన అవివేకంగా, అజ్ఞానంగా ప్రవర్తించినట్లే. (ద్వితీ. 6:6, 7) కాబట్టి, మీరు కుటుంబ యజమానిగా ఉండి సంఘంలో మరిన్ని బాధ్యతలను చేపట్టేందుకు అర్హతల్ని సంపాదించుకోవడానికి కృషి చేస్తున్నట్లైతే, మీరు ‘సంపూర్ణమాన్యత కలిగి మీ పిల్లలను స్వాధీనపరచుకుంటూ ఇంటివారిని బాగా ఏలేవారై ఉండాలి’ అని 1 తిమోతి 3:4 చెబుతోంది. అందుకే ఈ ప్రశ్న వేసుకోండి: ‘ఇంటివారితో ప్రతీవారం కుటుంబ ఆరాధన చేస్తున్నానా?’ కొంతమంది ఇళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆధ్యాత్మిక విషయాల్లో నాయకత్వం వహించమని భార్యలు తమ భర్తలను బతిమిలాడాల్సి వస్తుంది. కాబట్టి, ఈ బాధ్యత పట్ల తన అభిప్రాయం ఎలా ఉందో ప్రతీ భర్త జాగ్రత్తగా ఆలోచించాలి. అయితే, కుటుంబ ఆరాధన ఏర్పాటు ద్వారా మంచి ఫలితాలు వచ్చేలా ఓ క్రైస్తవ భార్య తన భర్తకు సహాయం చేస్తూ ఉండాలి.

18. భవిష్యత్తులో మరింత చక్కగా యెహోవా సేవచేసేందుకు సహాయం చేసే విషయాలకు పిల్లలు ఎలా ప్రాముఖ్యతనివ్వవచ్చు?

18 పిల్లలు కూడా భవిష్యత్తులో మరింత చక్కగా యెహోవా సేవచేసేందుకు సహాయం చేసే విషయాలకు ప్రాముఖ్యతనివ్వాలి. (ప్రసం. 12:1, 2) పిల్లలు తమ వయసుకు, సామర్థ్యాలకు తగినట్లు ఇంట్లో కష్టపడి పనిచేయడం నేర్చుకుంటే వారు ప్రయోజనం పొందుతారు. (విలా. 3:27) రాజైన దావీదు చిన్నప్పుడే మంచి కాపరిగా ఉండడం నేర్చుకున్నాడు. అంతేకాక సంగీతం వాయించే, పాటలు కూర్చే నైపుణ్యాలను సంపాదించుకున్నాడు. దానివల్ల ఆయన ఇశ్రాయేలీయుల రాజు దగ్గర సేవ చేసే అవకాశాన్ని పొందాడు. (1 సమూ. 16:11, 12, 18-21) చిన్నప్పుడు దావీదు సరదాగా సమయం గడిపాడు. అలాగే ఆయన మంచి నైపుణ్యాలను కూడా సంపాదించుకున్నాడు, ఆ తర్వాత వాటిని యెహోవాను స్తుతించడానికి ఉపయోగించాడు. కాపరిగా తనకున్న అనుభవం వల్ల ఇశ్రాయేలు జనాంగాన్ని ఓపిగ్గా నడిపించగలిగాడు. యౌవనస్థులారా, మీ సృష్టికర్తకు సేవచేయడానికి, భవిష్యత్తులో బాధ్యతలను చేపట్టడానికి మీరు ఏయే నైపుణ్యాలను సంపాదించుకుంటున్నారు?

సరదాగా ఉంటూనే క్రైస్తవ బాధ్యతలకు ప్రాముఖ్యతనిద్దాం

19, 20. మీ వ్యక్తిత్వానికి, యెహోవా ఆరాధనకు సంబంధించి మీరు ఏ కృతనిశ్చయంతో ఉన్నారు?

19 మనమందరం సరదాలను పూర్తిగా పక్కనబెట్టేంత గంభీరంగా ఉండకుండా జాగ్రత్తపడవచ్చు. మనం ‘అధికముగా నీతిమంతులమై’ ఉండాలనుకోం. (ప్రసం. 7:16) ఇంట్లో, ఉద్యోగంలో లేదా సహోదర సహోదరీలతో ఉన్నప్పుడు మనం కాస్త సరదాగా ఉంటే అనవసరమైన ఒత్తిడిని, ఆవేశాన్ని తగ్గించవచ్చు. ఇల్లు శాంతికి నెలవుగా ఉండాలి. అయితే, కుటుంబ సభ్యులు ఒకరినొకరు అతిగా విమర్శించుకుంటే అశాంతి చోటుచేసుకుంటుంది. కాబట్టి అలా చేయకుండా జాగ్రత్తపడాలి. సంఘంలో బోధించేటప్పుడు, ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ప్రోత్సాహకరంగా, సానుకూలంగా మాట్లాడడానికి కృషిచేయాలి. అలా ప్రతీ ఒక్కరు ఇతరులతో సరదాగా, సంతోషంగా గడపడం నేర్చుకోవచ్చు.—2 కొరిం. 13:10; ఎఫె. 4:29.

20 లోకంలోని ప్రజలు యెహోవాను, ఆయన నియమాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కానీ, యెహోవా సేవకులు మాత్రం ఆయనకు విధేయత చూపిస్తూ యథార్థంగా ఉండడానికే ప్రాముఖ్యతనిస్తారు. ‘సంపూర్ణ మాన్యతతో’ యెహోవాను ఆరాధించే ప్రజల పెద్ద సమూహంలో ఒకరిగా ఉండడం వల్ల మనం ఎంత సంతోషాన్ని పొందుతాం! కాబట్టి, మన జీవితంలో యెహోవా ఆరాధనను, ఇతర బాధ్యతలను ఎల్లప్పుడూ ప్రాముఖ్యమైనవిగా ఎంచాలనే కృతనిశ్చయంతో ఉందాం.

మీరెలా జవాబిస్తారు?

• లోకంలోని ప్రజల్లా మనం సరదాలకు ఎందుకు ప్రాముఖ్యతనివ్వకూడదు?

• పరిచర్యను గంభీరమైనదిగా ఎంచుతూనే దానిలో ఎలా సంతోషాన్ని పొందవచ్చు?

• బాధ్యతలను స్వీకరించే విషయంలో మనకున్న అభిప్రాయాన్ని బట్టి యెహోవా ఆరాధనకు ప్రాముఖ్యతనిస్తున్నామో లేదో ఎలా తెలుస్తుంది?

• సహోదర సహోదరీలకు, కుటుంబ సభ్యులకు తగిన గౌరవాన్ని ఇవ్వడం ఎందుకు ప్రాముఖ్యం?

[అధ్యయన ప్రశ్నలు]

[12వ పేజీలోని చిత్రాలు]

భర్త తన కుటుంబ భౌతిక అవసరాలను, ఆధ్యాత్మిక అవసరాలను తీర్చాలి