కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవ కుటుంబ సభ్యులారా, ‘మెలకువగా ఉండండి’

క్రైస్తవ కుటుంబ సభ్యులారా, ‘మెలకువగా ఉండండి’

క్రైస్తవ కుటుంబ సభ్యులారా, ‘మెలకువగా ఉండండి’

“మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.”—1 థెస్స. 5:6.

1, 2. ఒక కుటుంబం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండాలంటే ఏమి చేయాలి?

 అపొస్తలుడైన పౌలు ‘యెహోవా భయంకరమైన మహాదినం’ గురించి థెస్సలొనీకలోని క్రైస్తవులకు ఇలా రాశాడు: “సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు. మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారముకాము; చీకటివారము కాము. కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.”—యోవే. 2:31; 1 థెస్స. 5:4-6.

2 పౌలు థెస్సలొనీకయులకు ఇచ్చిన ఆ ఉపదేశం ‘అంత్యకాలంలో’ జీవిస్తున్న క్రైస్తవులకు ఎంతో ఉపయోగపడుతుంది. (దాని. 12:4) అతి త్వరలో ఈ దుష్టవిధానం నాశనం కాబోతుంది కాబట్టి వీలైనంత ఎక్కువ మంది సత్యారాధకులను యెహోవా సేవ నుండి పక్కకు మళ్లించాలని సాతాను గట్టిగా తీర్మానించుకున్నాడు. అందుకే ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండమని పౌలు ఇచ్చిన హెచ్చరికను మనం లక్ష్యపెట్టాలి. ఒక క్రైస్తవ కుటుంబం మెలకువగా ఉండాలంటే ఆ కుటుంబంలోని ప్రతీ ఒక్కరు యెహోవా తమకిచ్చిన బాధ్యతలను నిర్వర్తించాలి. కుటుంబాలు ఆధ్యాత్మికంగా ‘మెలకువగా ఉండాలంటే’ భర్తలు, భార్యలు, పిల్లలు ఏమి చేయాలి?

భర్తలారా, “మంచి కాపరిని” అనుకరించండి

3. మొదటి తిమోతి 5:8 ప్రకారం, కుటుంబ శిరస్సుగా పురుషునికి ఏ బాధ్యత ఉంది?

3 “స్త్రీకి శిరస్సు పురుషుడు” అని బైబిలు చెబుతోంది. (1 కొరిం. 11:3) కుటుంబ శిరస్సుగా పురుషునికి ఏ బాధ్యత ఉంది? దాని గురించి లేఖనాలు ఇలా చెబుతున్నాయి: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.” (1 తిమో. 5:8) కాబట్టి ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యుల కనీస అవసరాలు తీర్చాలి. అయితే తన కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండేలా సహాయం చేయడానికి అది మాత్రమే సరిపోదు. కుటుంబ సభ్యులందరూ దేవునికి మరింత దగ్గరయ్యేందుకు సహాయం చేయడం ద్వారా ఆయన కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా బలపర్చాలి. (సామె. 24:3, 4) దాన్ని ఆయన ఎలా చేయవచ్చు?

4. భర్త తన కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా బలపర్చాలంటే ఏమి చేయాలి?

4 “క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు.” కాబట్టి, సంఘంపై క్రీస్తు తన శిరస్సత్వాన్ని ఎలా నిర్వహిస్తున్నాడో తెలుసుకొని భర్త ఆయనను అనుకరించాలి. (ఎఫె. 5:23) తన అనుచరులతో తనకున్న సంబంధం గురించి యేసు ఏమి చెప్పాడో పరిశీలించండి. (యోహాను 10:14, 15 చదవండి.) భర్త తన కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా బలపర్చాలంటే ముఖ్యంగా ఏమి చేయాలి? ‘మంచి కాపరిగా’ యేసు ఏమి చెప్పాడో, ఏమి చేశాడో తెలుసుకొని ఆయన ‘అడుగుజాడల్లో నడుచుకోవాలి.’—1 పేతు. 2:21.

5. సంఘం గురించి మంచి కాపరికి ఎంత తెలుసు?

5 క్రీస్తు మాదిరి నుండి ఒక కుటుంబ శిరస్సు ఏమి నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. కాపరికి, గొర్రెలకు మధ్య ఉండే సంబంధంలో జ్ఞానం, నమ్మకం అనే రెండు లక్షణాలు కనిపిస్తాయి. కాపరికి తన గొర్రెల గురించి అంతా తెలుసు. గొర్రెలకు కూడా తమ కాపరి ఎవరో తెలుసు, అవి ఆయనను పూర్తిగా నమ్ముతాయి, ఆయన స్వరాన్ని గుర్తించి ఆయన చెప్పినట్లు చేస్తాయి. “నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును” అని యేసు అన్నాడు. యేసుకు సంఘం గురించి ఏదో పైపై జ్ఞానం మాత్రమే లేదు. “ఎరుగును” అని అనువదించబడిన గ్రీకు పదానికి “వ్యక్తిగతంగా, బాగా తెలిసివుండడం” అనే అర్థం ఉంది. మన మాదిరికర్త, మంచి కాపరి అయిన యేసుకు ప్రతీ గొర్రె గురించి తెలుసు. వాటి అవసరాలు, బలాలు, బలహీనతలతో సహా ప్రతీ చిన్న విషయం ఆయనకు తెలుసు. అలాగే గొర్రెలకు కూడా తమ కాపరి బాగా తెలుసు, అవి ఆయన నడిపింపును పూర్తిగా నమ్ముతాయి.

6. భర్తలు మంచి కాపరిని ఎలా అనుకరించవచ్చు?

6 భర్త తన శిరస్సత్వాన్ని క్రీస్తులా నిర్వర్తించాలంటే తనను తాను కాపరిగా, తన కాపుదలలో ఉన్నవారిని తన గొర్రెలుగా ఎంచగలగాలి. ఆయన తన కుటుంబం గురించి బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే అలా తెలుసుకోవడం ఆయనకు సాధ్యమేనా? సాధ్యమే. దీనికోసం ఆయన తన కుటుంబ సభ్యులతో చక్కగా మాట్లాడాలి, వారి సాధకబాధకాలను వినాలి, కుటుంబ కార్యకలాపాల్లో నాయకత్వం వహించాలి. అంతేగాక కుటుంబ సభ్యుల పరిస్థితులను మనసులో ఉంచుకొని ఆరాధన, కూటాలకు వెళ్లడం, పరిచర్యలో పాల్గొనడం, వినోద కార్యకలాపాల వంటి వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి. భర్త దేవుని వాక్యం గురించే కాక తన కాపుదలలో ఉన్న వారి గురించి కూడా బాగా తెలుసుకొని నాయకత్వం వహిస్తే కుటుంబ సభ్యులు ఆయన శిరస్సత్వంపై నమ్మకముంచుతారు. అంతేకాక కుటుంబమంతా కలిసి సత్యారాధనలో పాల్గొనడం చూసి ఆయన సంతృప్తి పొందగలుగుతాడు.

7, 8. మంచి కాపరియైన యేసులా భర్త తన కాపుదలలో ఉన్నవారి పట్ల ఆప్యాయతను ఎలా చూపించవచ్చు?

7 మంచి కాపరికి తన గొర్రెల పట్ల ఆప్యాయత కూడా ఉంటుంది. యేసు జీవితం, పరిచర్య గురించి సువార్తల్లో చదివినప్పుడు, తన శిష్యుల పట్ల ఆయన చూపించిన ఆప్యాయతను బట్టి మన హృదయం గౌరవ భావంతో నిండిపోతుంది. ఆయన చివరకు ‘గొర్రెల కోసం తన ప్రాణాన్ని కూడా పెట్టాడు.’ భర్తలు తమ కాపుదలలో ఉన్నవారి పట్ల యేసులా ఆప్యాయతను చూపించాలి. దేవుని ఆమోదాన్ని కోరుకునే భర్త తన భార్యపై కఠినంగా అధికారం చెలాయించకుండా ‘క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు’ ఆయన తన భార్యను ఎల్లప్పుడూ ప్రేమించాలి. (ఎఫె. 5:25) ఆమె గౌరవం పొందడానికి అర్హురాలు కాబట్టి ఆమెను అర్థం చేసుకుంటూ ఆమెతో దయగా మాట్లాడాలి.—1 పేతు. 3:7.

8 కుటుంబ శిరస్సు పిల్లలకు శిక్షణ ఇచ్చే విషయంలో దేవుని సూత్రాలను తూ.చా. తప్పకుండా పాటించాలి. అలాగని ఆయన వారిపట్ల ఆప్యాయత చూపించడం మరచిపోకూడదు. ప్రేమతో వారికి అవసరమైన క్రమశిక్షణ ఇవ్వాలి. తల్లిదండ్రులు తమ నుండి ఏమి కోరుతున్నారో కొంతమంది పిల్లలకు వెంటనే అర్థంకాదు. అలాంటప్పుడు తండ్రి ఎంతో ఓపికను చూపించాలి. పురుషులు ఎల్లప్పుడూ యేసులా ప్రవర్తిస్తే ఇంట్లో సురక్షిత వాతావరణం నెలకొంటుంది. అలా వారు కీర్తనకర్త తన పాటలో వర్ణించిన ఆధ్యాత్మిక భద్రతను అనుభవిస్తారు.—కీర్తన 23:1-6 చదవండి.

9. పూర్వీకుడైన నోవహులా క్రైస్తవ భర్తలకు ఏ బాధ్యత ఉంది? దాన్ని వారెలా నెరవేర్చగలరు?

9 పూర్వీకుడైన నోవహు కాలంలో అప్పటి లోకం నాశనమైంది. అయితే యెహోవా ‘భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయాన్ని రప్పించినప్పుడు నోవహును, మరి ఏడుగురిని కాపాడాడు.’ (2 పేతు. 2:5) తన కుటుంబం జలప్రళయాన్ని తప్పించుకునేందుకు సహాయం చేయాల్సిన బాధ్యత అప్పుడు నోవహు మీద ఉంది. ఈ అంత్యదినాల్లో జీవిస్తున్న క్రైస్తవ కుటుంబ శిరస్సులకు కూడా అలాంటి బాధ్యతే ఉంది. (మత్త. 24:37) కాబట్టి వారు “మంచి కాపరి” మాదిరిని బాగా తెలుసుకొని ఆయనను అనుకరించడం ఎంత ప్రాముఖ్యం!

భార్యలారా, ‘మీ ఇంటివారిని కట్టండి’

10. భర్తకు లోబడితే భార్య స్థానం తక్కువౌతుందా? వివరించండి.

10 “స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (ఎఫె. 5:22) ఆ మాటలు భార్యల స్థానాన్ని ఎంతమాత్రం తక్కువ చేయడం లేదు. మొదటి స్త్రీయైన హవ్వను సృష్టించకముందు సత్య దేవుడు, “నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదును” అని అన్నాడు. (ఆది. 2:18) భర్త కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తుండగా ‘సాటియైన సహాయకారిగా’ ఆయనకు మద్దతునివ్వడం నిజంగా ఓ ఘనమైన బాధ్యత.

11. మాదిరికరమైన భార్య ఎలా ‘తన ఇంటివారిని కడుతుంది’?

11 మాదిరికరమైన భార్య తన కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం పాటుపడుతుంది. (సామెతలు 14:1 చదవండి.) మూఢురాలు శిరస్సత్వపు ఏర్పాటును ఏమాత్రం గౌరవించదు. కానీ, జ్ఞానవంతురాలు మాత్రం ఆ ఏర్పాటు పట్ల ఎంతో గౌరవం చూపిస్తుంది. అంతేకాక, లోకంలోని ప్రజల్లా ఆమె అవిధేయతను, స్వేచ్ఛా స్వభావాన్ని చూపించదు కానీ తన భర్తకు ఎల్లప్పుడూ లోబడివుంటుంది. (ఎఫె. 2:2) మూఢురాలు తన భర్త గురించి చెడుగా మాట్లాడడానికి ఏమాత్రం వెనుకాడదు. అయితే జ్ఞానవంతురాలు తన భర్తపై పిల్లలకూ ఇతరులకూ ఉన్న గౌరవాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. అలాంటి భార్య తన భర్త తప్పులు పట్టడం ద్వారా, ఆయనతో వాదించడం ద్వారా ఆయన శిరస్సత్వాన్ని చులకన చేయడానికి ప్రయత్నించదు. అంతేకాక, ఆమె తమకు ఉన్నవాటిని పొదుపుగా ఉపయోగిస్తుంది. మూఢురాలు మాత్రం తన భర్త కష్టార్జితాన్ని దుబారా చేస్తుంది. కానీ తన భర్తకు మద్దతునిచ్చే భార్య ఆర్థిక విషయాల్లో ఆయనకు ఎంతో చేదోడువాదోడుగా ఉంటూ చాలా జాగ్రత్తగా, పొదుపుగా ఖర్చు చేస్తుంది. అంతేగానీ ఉద్యోగంలో ఎక్కువ సమయం పనిచేయమని తన భర్తను పోరుపెట్టదు.

12. తన కుటుంబం ‘మెలకువగా ఉండడానికి’ భార్య ఏమి చేయవచ్చు?

12 మాదిరికరమైన భార్య యెహోవా గురించి తమ పిల్లలకు బోధించడంలో భర్తకు సహకరించడం ద్వారా తన కుటుంబం ‘మెలకువగా ఉండడానికి’ తోడ్పడుతుంది. (సామె. 1:8) అంతేకాక, ఆమె కుటుంబ ఆరాధనా ఏర్పాటుకు చక్కగా మద్దతునిస్తుంది. అలాగే పిల్లలకు ఉపదేశాన్ని, క్రమశిక్షణను ఇస్తున్నప్పుడు ఆమె తన భర్తకు సహకరిస్తుంది. అయితే, మూఢురాలు తన భర్తకు సహకరించదు కాబట్టి ఆమె పిల్లలు భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో నష్టపోతారు.

13. సంస్థకు, సంఘానికి సంబంధించిన పనుల్లో భార్య తన భర్తకు ఎందుకు సహకరించాలి?

13 సంఘ కార్యకలాపాల్లో భర్త చురుకుగా పాల్గొంటున్నప్పుడు చక్కగా సహకరించే భార్యకు ఏమనిపిస్తుంది? ఆమె ఎంతో సంతోషిస్తుంది. ఆమె భర్త పరిచర్య సేవకుడైనా, పెద్ద అయినా, ఆసుపత్రి అనుసంధాన కమిటీ లేదా రాజ్యమందిర నిర్వహణా కమిటీ సభ్యుడైనా ఆయనకున్న బాధ్యతలను బట్టి ఆమె సంతోషిస్తుంది. తన మాటలు, చేతల ద్వారా భర్తకు ఎప్పుడూ సహకరించాలంటే ఆమె కొన్ని త్యాగాలు చేయాల్సివుంటుంది. అయితే సంస్థకు, సంఘానికి సంబంధించిన పనుల్లో తన భర్త చురుగ్గా పాల్గొనడం వల్ల తమ కుటుంబం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉంటుందని ఆమె గుర్తిస్తుంది.

14. (ఎ) భర్తకు మద్దతునివ్వడం భార్యకు ఎప్పుడు కష్టమనిపించవచ్చు? అప్పుడు కూడా ఆమె తన భర్తకు ఎలా మద్దతును ఇవ్వవచ్చు? (బి) కుటుంబ సభ్యులందరి శ్రేయస్సు కోసం భార్య ఎలా పాటుపడాలి?

14 భార్యకు ఇష్టంలేని నిర్ణయాన్ని భర్త తీసుకున్నప్పుడు ఆయనకు మద్దతునివ్వడం ఆమెకు ఎంతో కష్టమనిపించవచ్చు. అప్పుడు కూడా ఆమె ‘సాధువైన, మృదువైన’ స్వభావంతో ఆయనకు సహకరిస్తుంది. (1 పేతు. 3:4) అంతేకాక శారా, రూతు, అబీగయీలు, యేసు తల్లియైన మరియ వంటి దైవభక్తిగల స్త్రీల చక్కని మాదిరిని అనుకరించడానికి ప్రయత్నిస్తుంది. (1 పేతు. 3:5, 6) అలాగే ‘ప్రవర్తనయందు భయభక్తులు గలవారైన’ నేటి వృద్ధ స్త్రీల మంచి మాదిరిని కూడా అనుకరిస్తుంది. (తీతు 2:3-5) మంచి మాదిరిని ఉంచే భార్య తన భర్త పట్ల ప్రేమ, గౌరవం చూపిస్తూ తమ వివాహం విజయవంతం కావడానికీ కుటుంబ సభ్యులందరి శ్రేయస్సుకూ ఎంతగానో పాటుపడుతుంది. ఆమె ఇల్లు సుఖసంతోషాలకు, భద్రతకు నెలవుగా ఉంటుంది. యెహోవాను ప్రేమించి, ఆయన కోసం కష్టపడి పనిచేసే పురుషునికి అలాంటి భార్య ఎంతో విలువైనది.—సామె. 18:22.

యౌవనస్థులారా, ‘అదృశ్యమైనవాటిని నిదానించి చూడండి’

15. కుటుంబం ఆధ్యాత్మికంగా ‘మెలకువగా ఉండడానికి’ యౌవనస్థులు తమ తల్లిదండ్రులకు ఎలా తోడ్పడవచ్చు?

15 యౌవనస్థులారా, కుటుంబం ఆధ్యాత్మికంగా ‘మెలకువగా ఉండడానికి’ మీరు మీ తల్లిదండ్రులకు ఎలా తోడ్పడవచ్చు? యెహోవా మీ ముందు ఉంచిన బహుమానం గురించి ఆలోచించండి. పరదైసులో జీవితాన్ని వర్ణించే చిత్రాలను చిన్నప్పటి నుండి మీ తల్లిదండ్రులు మీకు చూపించి ఉంటారు. మీరు పెద్దవారౌతుండగా వారు బైబిలును, క్రైస్తవ ప్రచురణలను ఉపయోగించి నూతనలోకంలో నిరంతర జీవితం ఎలా ఉంటుందో ఊహించుకునేందుకు మీకు సహాయం చేసివుంటారు. మీరు యెహోవా సేవకు ప్రాముఖ్యతనిచ్చి, దానికి అనుగుణంగా మీ జీవితాన్ని మలచుకుంటే ‘మెలకువగా’ ఉండగలుగుతారు.

16, 17. జీవితపు పరుగుపందెంలో యౌవనస్థులు ఎలా విజయం సాధించవచ్చు?

16 అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులు 9:24లో చెప్పిన మాటల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. (చదవండి.) విజయం సాధించాలనే కృతనిశ్చయంతో జీవితపు పరుగుపందెంలో పరుగెత్తండి. నిరంతర జీవితం అనే బహుమానాన్ని పొందేందుకు సహాయం చేసే మార్గాన్ని ఎంచుకోండి. వస్తుసంపదల కోసం ప్రాకులాడడం ద్వారా కొంతమంది బహుమానం మీద దృష్టి నిలపలేకపోయారు. అది ఎంత అవివేకం! డబ్బు సంపాదనకు ప్రాముఖ్యతనిస్తే మనం సంతోషంగా ఉండలేం. ఎందుకంటే, డబ్బుతో మనం కొనుక్కునేవి కొంతకాలమే ఉంటాయి. అయితే “అదృశ్యమైనవి నిత్యములు” కాబట్టి మీరు అదృశ్యమైనవాటిని నిదానించి చూడండి.—2 కొరిం. 4:17, 18.

17 ‘అదృశ్యమైన వాటిలో’ రాజ్య ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. మీరు వాటిని పొందే విధంగా జీవించేందుకు ప్రణాళిక వేసుకోండి. మీ జీవితాన్ని యెహోవా సేవకు అంకితం చేస్తే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. యెహోవాను సేవించడం వల్ల మీరు స్వల్పకాల లక్ష్యాలను, దీర్ఘకాల లక్ష్యాలను చేరుకోగలుగుతారు. a మీరు సాధించగలిగే ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకుంటే, నిరంతర జీవితమనే బహుమానాన్ని పొందాలనే కృతనిశ్చయం కలిగివుండగలుగుతారు, దేవుని సేవకు ప్రాముఖ్యతను ఇవ్వగలుగుతారు.—1 యోహా. 2:17.

18, 19. తనకు యెహోవాతో వ్యక్తిగత సంబంధం ఉందో లేదో ఒక యౌవనస్థుడు ఎలా తెలుసుకోవచ్చు?

18 యౌవనస్థులారా, జీవానికి నడిపే మార్గంలో నడవాలంటే మీరు వేయాల్సిన మొదటి అడుగు యెహోవాతో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడమే. మీరు ఆ అడుగు వేశారా? ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను ఆధ్యాత్మిక వ్యక్తినేనా? లేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నా తల్లిదండ్రులు పాల్గొంటేనే నేను పాల్గొంటానా? నేను దేవుణ్ణి సంతోషపెట్టే లక్షణాలను పెంచుకుంటున్నానా? సత్యారాధనకు సంబంధించిన కార్యకలాపాలను అంటే ప్రార్థన, అధ్యయనం, కూటాల హాజరు, పరిచర్య వంటి వాటిని క్రమం తప్పకుండా చేయడానికి కృషిచేస్తున్నానా? దేవునితో నా సంబంధాన్ని బలపర్చుకోవడానికి కృషిచేయడం ద్వారా నేను ఆయనకు దగ్గరౌతున్నానా?’—యాకో. 4:8.

19 మోషే ఉదాహరణను ధ్యానించండి. వేరే సంస్కృతిలో పెరగాల్సి వచ్చినప్పటికీ ఆయన ఫరో కూతురికి కుమారునిగా కాక యెహోవా ఆరాధికుడిగా గుర్తించబడడానికే ఇష్టపడ్డాడు. (హెబ్రీయులు 11:24-27 చదవండి.) క్రైస్తవ యౌవనస్థులారా, మీరు కూడా యెహోవాను నమ్మకంగా సేవించాలనే కృతనిశ్చయంతో ఉండండి. అలాచేస్తే మీరు నిజమైన సంతోషాన్ని పొందుతారు, ఇప్పుడు మెరుగైన జీవితాన్ని అనుభవిస్తారు, ‘వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి మంచి పునాది’ వేసుకుంటారు.—1 తిమో. 6:18, 19.

20. జీవపు పరుగుపందెంలో ఎవరు బహుమానాన్ని పొందుతారు?

20 పూర్వం పరుగుపందాల్లో ఒక్కరే విజయం సాధించేవారు. కానీ జీవపు పరుగుపందెంలో మాత్రం అలా జరగదు. ఎందుకంటే, “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెను” అనేది దేవుని చిత్తం. (1 తిమో. 2:3, 4) మీకన్నా ముందు ఎంతోమంది విజయం సాధించారు, ఇప్పుడు ఎంతోమంది మీతోపాటు పరుగెత్తుతున్నారు. (హెబ్రీ. 12:1, 2) పట్టువిడవకుండ పరుగెత్తే ప్రతి ఒక్కరూ బహుమానాన్ని పొందుతారు. కాబట్టి విజయం సాధించాలనే కృతనిశ్చయంతో ఉండండి.

21. తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చూస్తాం?

21 “యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము” వచ్చితీరుతుంది. (మలా. 4:5) అది వచ్చినప్పుడు క్రైస్తవ కుటుంబాలు నివ్వెరపోకూడదంటే కుటుంబంలోని ప్రతీ ఒక్కరు దేవుడు తమకిచ్చిన బాధ్యతలను నిర్వర్తించాలి. కాబట్టి ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండడానికి, దేవునితో ఉన్న సంబంధాన్ని బలపరచుకోవడానికి మీరు ఇంకా ఏమి చేయవచ్చు? కుటుంబ సభ్యులందరి ఆధ్యాత్మిక శ్రేయస్సుకు దోహదపడే మూడు అంశాలను తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం.

[అధస్సూచి]

a కావలికోట నవంబరు 15, 2010 సంచికలోని 12-16 పేజీలు, జూలై 15, 2004 సంచికలోని 21-23 పేజీలు చూడండి.

మీరేమి నేర్చుకున్నారు?

• క్రైస్తవ కుటుంబాలు ఎందుకు ‘మెలకువగా ఉండాలి’?

• ఒక భర్త మంచి కాపరిని ఎలా అనుకరించవచ్చు?

• మాదిరికరమైన భార్య తన భర్తకు ఎలా సహకరించవచ్చు?

• కుటుంబాలు ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండడానికి యౌవనస్థులు ఎలా తోడ్పడవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[9వ పేజీలోని చిత్రం]

సహాయ సహకారాలు అందించే భార్య ఆధ్యాత్మిక పురుషునికి ఎంతో విలువైనది