కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవితంలో మీరు ఎవరికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నారు?

జీవితంలో మీరు ఎవరికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నారు?

జీవితంలో మీరు ఎవరికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నారు?

“నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు.”—కీర్త. 83:18.

1, 2. యెహోవా పేరు తెలుసుకోవడం ప్రాముఖ్యమే అయినా మన రక్షణ కోసం ఇంకా ఏమి చేయాలి?

 మీరు యెహోవా పేరును మొదటిసారి ఎక్కడ చూశారు? ఎవరో మీకు కీర్తన 83:18 లో దాన్ని చూపించివుంటారు. అక్కడ ఈ మాటలను చూసి మీరు ఆశ్చర్యపోయి ఉండవచ్చు: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.” అప్పటి నుండి, మన ప్రేమగల దేవుడైన యెహోవా గురించి ఇతరులకు తెలియజేసేందుకు ఈ లేఖనాన్ని ఎన్నోసార్లు ఉపయోగించివుంటారు.—రోమా. 10:12, 13.

2 ప్రజలు యెహోవా పేరును తెలుసుకోవడం అవసరమే అయినా, అది మాత్రమే సరిపోదు. కీర్తనకర్త చెప్పిన మాటలనుబట్టి మన రక్షణకు మరొకటి కూడా అవసరమని అర్థమౌతుంది. ఆయన, “నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు” అని చెప్పాడు. నిజమే, ఈ విశ్వమంతటిలో యెహోవాయే అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి. తాను సృష్టించిన ప్రాణులు తనకు పూర్తిగా లోబడివుండాలని చెప్పే హక్కు సృష్టికర్తగా ఆయనకు ఉంది. (ప్రక. 4:10, 11) అందుకే, ‘జీవితంలో నేను ఎవరికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నాను?’ అని మనం ప్రశ్నించుకోవాలి. దానికి మనమిచ్చే జవాబు గురించి జాగ్రత్తగా ఆలోచించడం చాలా అవసరం.

ఏదెను తోటలో తలెత్తిన వివాదాంశం

3, 4. సాతాను హవ్వను ఎలా మోసగించాడు? దాని ఫలితమేమిటి?

3 ఏదెను తోటలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే, ఆ ప్రశ్న ఎంత ప్రాముఖ్యమైనదో మనకు స్పష్టంగా అర్థమౌతుంది. ఫలానా చెట్టు ఫలాన్ని తినొద్దని యెహోవా ఇచ్చిన ఆజ్ఞ కన్నా సొంత కోరికలకే ప్రాధాన్యతనిచ్చేలా తిరుగుబాటుదారుడైన దూత మొదటి స్త్రీయైన హవ్వను ప్రలోభపెట్టాడు. అతడే ఆ తర్వాత అపవాదియైన సాతానుగా పేరుపొందాడు. (ఆది. 2:17; 2 కొరిం. 11:3) ఆమె ఆ ప్రలోభానికి లోనై యెహోవా సర్వాధిపత్యాన్ని అగౌరవపరిచింది. హవ్వ తన జీవితంలో యెహోవాను అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఎంచలేదు. అయితే, సాతాను హవ్వను ఎలా మోసగించాడు?

4 సాతాను ఎన్నో మోసపూరితమైన పన్నాగాలను పన్నాడని హవ్వతో అతడు మాట్లాడిన మాటలనుబట్టి తెలుస్తుంది. (ఆదికాండము 3:1-5 చదవండి.) మొదటిగా, సాతాను యెహోవా పేరును ఉపయోగించలేదు. అతడు కేవలం “దేవుడు” అని మాత్రమే అన్నాడు. అయితే, ఆదికాండము రాసిన వ్యక్తి మాత్రం ఆ అధ్యాయం మొదటి వచనంలో యెహోవా పేరును ఉపయోగించాడు. రెండవదిగా, దేవుడు ఏ “ఆజ్ఞ” ఇచ్చాడని అడిగే బదులు దేవుడు “చెప్పెనా” అని సాతాను అడిగాడు. (ఆది. 2:16, 17) అలా సాతాను కుయుక్తితో, ఆ ఆజ్ఞకున్న ప్రాముఖ్యతను తగ్గించడానికి ప్రయత్నించివుంటాడు. మూడవదిగా, అతడు కేవలం హవ్వతోనే మాట్లాడుతున్నా ఆమెను “మీరు” అని బహువచనంలో సంబోధించాడు. ఆ విధంగా ఆమెలో అహాన్ని పెంచి, తాను ఎంతో ప్రాముఖ్యమైనదాన్నని, తాను తన భర్త తరఫున మాట్లాడే ప్రతినిధినని ఆమె అనుకునేలా చేసివుంటాడు. దాని ఫలితమేమిటి? హవ్వ అహంకారంతో తన భర్త గురించి, తన గురించి మాట్లాడుతూ, ‘ఈ తోట చెట్ల పండ్లను మేము తినవచ్చు’ అని సర్పంతో చెప్పింది.

5. (ఎ) హవ్వ దేని గురించి ఆలోచించేలా సాతాను చేశాడు? (బి) తినొద్దని చెప్పిన పండ్లను తిని హవ్వ ఏమి చూపించింది?

5 సాతాను వాస్తవాలను వక్రీకరించాడు. “ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదు” అని ఆదాముహవ్వలకు ఆజ్ఞాపించి దేవుడు వారికి అన్యాయం చేశాడని సాతాను సూచించాడు. ఆ తర్వాత, హవ్వ తన గురించి, ‘దేవునిలా’ అవ్వడం ద్వారా తన జీవితాన్ని మెరుగుపరచుకోవడం గురించి ఆలోచించేలా చేశాడు. చివరకు, తనకు సమస్తాన్ని ఇచ్చిన దేవునితో తనకున్న సంబంధం గురించి కాక, ఆ చెట్టు గురించి, దాని పండ్ల గురించి హవ్వ ఆలోచించేలా సాతాను చేశాడు. (ఆదికాండము 3:6 చదవండి.) విచారకరంగా హవ్వ ఆ పండ్లను తిని, యెహోవాను తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా పరిగణించడంలేదని చూపించింది.

యోబు దినాల్లో తలెత్తిన వివాదాంశం

6. సాతాను యోబు యథార్థతను ఎలా ప్రశ్నించాడు? దానివల్ల యోబుకు ఏ అవకాశం లభించింది?

6 కొన్ని శతాబ్దాలు గడిచిన తర్వాత, తన జీవితంలో ఎవరికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నాడో చూపించే అవకాశం నమ్మకస్థుడైన యోబుకు దొరికింది. యోబు యథార్థత గురించి యెహోవా సాతానుకు చెప్పినప్పుడు సాతాను, “యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా?” అని ప్రశ్నించాడు. (యోబు 1:7-10 చదవండి.) యోబుకు దేవునిపట్ల ఉన్న విధేయతను సాతాను ప్రశ్నించలేదు కానీ, యోబు ఉద్దేశాలను ప్రశ్నించాడు. యోబు ప్రేమతో కాక, స్వార్థంతో యెహోవాను సేవిస్తున్నాడని అతడు కుయుక్తితో నిందమోపాడు. యోబు మాత్రమే ఆ నిందకు జవాబివ్వగలడు. అలా జవాబిచ్చే అవకాశం కూడా ఆయనకు లభించింది.

7, 8. యోబు ఏ కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది? నమ్మకంగా సహించడం ద్వారా ఆయన ఏమి నిరూపించాడు?

7 సాతాను వెంటవెంటనే యోబుకు అనేక కష్టాలు తెచ్చేందుకు యెహోవా అనుమతించాడు. (యోబు 1:12-19) పరిస్థితులు మారినప్పుడు యోబు ఎలా స్పందించాడు? “యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు” అని బైబిలు చెబుతోంది. (యోబు 1:22) అయినా సాతాను ఊరుకోలేదు. అతడు ఇంకా ఇలా అన్నాడు: “చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా.” a (యోబు 2:4) యోబు స్వయంగా బాధలు అనుభవిస్తే, ఆయన యెహోవాను తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా పరిగణించడని సాతాను ఆరోపించాడు.

8 అసహ్యకరమైన రోగం వల్ల యోబు కురూపిగా మారాడు, అంతేకాదు దేవుణ్ణి శపించి చనిపోమని ఆయన భార్య ఆయనను ఒత్తిడిచేసింది. ఆ తర్వాత, ఓదార్చడానికని వచ్చిన ముగ్గురు స్నేహితులు ఆయన తప్పు చేశాడని నిందమోపారు. (యోబు 2:11-13; 8:2-6; 22:2, 3) అయితే, ఆ కష్టాలు అనుభవిస్తున్నప్పుడు యోబు తన యథార్థత కోల్పోలేదు. (యోబు 2:9, 10 చదవండి.) వాటిని నమ్మకంగా సహించడం ద్వారా తన జీవితంలో యెహోవాయే అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి అని ఆయన చూపించాడు. అంతేకాక, అపరిపూర్ణ మానవులు కూడా అపవాది తప్పుడు ఆరోపణలకు కొంతమేరకైనా జవాబివ్వగలరని యోబు నిరూపించాడు.—సామెతలు 27:11 పోల్చండి.

యేసు పరిపూర్ణ జవాబు

9. (ఎ) యేసుకున్న అవసరాన్ని శోధనగా మార్చడానికి సాతాను ఎలా ప్రయత్నించాడు? (బి) యేసు ఎలా స్పందించాడు?

9 యేసు బాప్తిస్మం తీసుకున్న కొన్ని రోజులకు, యెహోవాకన్నా స్వార్థపూరిత కోరికలకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేలా యేసును ప్రలోభపెట్టేందుకు సాతాను ప్రయత్నించాడు. అపవాది యేసును మూడు రకాలుగా శోధించాడు. మొదటిగా, అతడు యేసు ఆకలితో ఉన్నాడని పసిగట్టి, రాళ్లను రొట్టెలుగా మార్చుకోమని శోధించాడు. (మత్త. 4:2, 3) యేసు అప్పటికే 40 దినాలు ఉపవాసముండి ఎంతో ఆకలితో ఉన్నాడు. అద్భుతాలు చేసే శక్తిని ఆకలి తీర్చుకునేందుకు తప్పుగా ఉపయోగించమని అపవాది యేసును ప్రలోభపెట్టాడు. అప్పుడు యేసు ఏమి చేశాడు? యేసు హవ్వలా కాక యెహోవా వాక్యంమీద మనసు నిలిపి, ఆ శోధనను వెంటనే తిప్పికొట్టాడు.—మత్తయి 4:4 చదవండి.

10. యేసును దేవాలయ శిఖరం నుండి కిందికి దూకమని సాతాను ఎందుకు చెప్పాడు?

10 యేసు స్వార్థపూరితంగా స్పందించేలా చేయడానికి కూడా సాతాను ప్రయత్నించాడు. యేసును దేవాలయ శిఖరం నుండి కిందికి దూకమని చెప్పాడు. (మత్త. 4:5, 6) అలా చెప్పడం ద్వారా సాతాను ఏమి సాధించాలనుకున్నాడు? కిందికి దూకినప్పుడు గాయంకాకపోతే యేసు “దేవుని కుమారుడు” అనేది నిరూపించబడుతుందని సాతాను చెప్పాడు. యేసు తన సొంత పేరు గురించి ఎక్కువగా ఆలోచించాలని, దానికోసం తన శక్తిని డంబంగా ప్రదర్శించడానికి కూడా వెనకాడకూడదని అపవాది కోరుకున్నాడు. గర్వంతో, ఇతరుల ముందు తమ పరువును కాపాడుకోవాలనే కోరికతో ఒక వ్యక్తి ప్రమాదకరమైన సాహసానికి కూడా వెనకాడడని సాతానుకు తెలుసు. లేఖనాన్ని సాతాను తప్పుగా అన్వయించాడు. కానీ యెహోవా వాక్యంపై తనకు పూర్తి అవగాహన ఉందని యేసు చూపించాడు. (మత్తయి 4:7 చదవండి.) ఆ సాహసకార్యానికి ఒప్పుకోకపోవడం ద్వారా తన జీవితంలో యెహోవాయే అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి అని యేసు మళ్లీ చూపించాడు.

11. సాతాను లోక రాజ్యాలన్నీ ఇవ్వజూపినప్పుడు యేసు ఎందుకు తిరస్కరించాడు?

11 చివరి ప్రయత్నంగా, సాతాను యేసుకు లోక రాజ్యాలన్నీ ఇవ్వజూపాడు. (మత్త. 4:8, 9) యేసు వెంటనే ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. సాతాను ప్రతిపాదనను అంగీకరిస్తే యెహోవా సర్వాధిపత్యాన్నే అంటే సర్వోన్నతునిగా పరిపాలించేందుకు దేవునికున్న హక్కునే తిరస్కరించినట్లౌతుందని ఆయన గుర్తించాడు. (మత్తయి 4:10 చదవండి.) సాతాను శోధించిన ప్రతీసారి యెహోవా పేరున్న లేఖనాలను ఉల్లేఖించి యేసు జవాబిచ్చాడు.

12. ఏ విషయం యేసుకు ఎంతో వేదన కలిగించింది? ఆయన ఎలా స్పందించాడు? ఆయన స్పందించిన తీరు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

12 యేసు తన భూజీవితం చివర్లో ఎంతో కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. తన జీవితాన్ని బలిగా అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తన పరిచర్యలో ఎన్నోసార్లు చెప్పాడు. (మత్త. 20:17-19, 28; లూకా 12:50; యోహా. 16:28) అయితే శత్రువులు తనమీద తప్పుడు ఆరోపణలు మోపి, యూదుల చట్ట ప్రకారం దేవదూషకునిగా తీర్పుతీర్చి చంపుతారని కూడా ఆయన గుర్తించాడు. ఆ విషయం ఆయనకెంతో వేదన కలిగించింది. ఆయన వేదనతో, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము” అని ప్రార్థించాడు. అయితే ఆ తర్వాత “అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము” అని అన్నాడు. (మత్త. 26:39) యేసు మరణంవరకు నమ్మకంగా ఉండడం ద్వారా ఆయన తన జీవితంలో ఎవరికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చాడో తిరుగులేని విధంగా చూపించాడు!

ఆ ప్రశ్నకు మన జవాబు

13. హవ్వ, యోబు, యేసుక్రీస్తు ఉదాహరణల నుండి మనం ఏ పాఠాలు నేర్చుకున్నాం?

13 మనం ఇప్పటివరకు ఏమి నేర్చుకున్నాం? స్వార్థపూరిత కోరికలకు లేక అహంకారానికి ప్రాధాన్యతనిచ్చేవారు తమ జీవితంలో యెహోవా అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి కాదని చూపిస్తారనే విషయాన్ని హవ్వ ఉదాహరణ నుండి నేర్చుకున్నాం. అయితే, యోబు యథార్థత నుండి మనం మరో విషయాన్ని నేర్చుకున్నాం. అదేమిటంటే, తమ కష్టాలకు కారణమేమిటో పూర్తిగా తెలియకపోయినా వాటిని నమ్మకంగా సహించడం ద్వారా తమ జీవితంలో యెహోవాయే అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తని అపరిపూర్ణ మానవులు కూడా నిరూపించగలరు. (యాకో. 5:11) సొంత పేరుప్రతిష్ఠలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వకుండా, అవమానాన్ని సహించడానికి సిద్ధంగా ఉండాలని యేసు మాదిరి నుండి నేర్చుకున్నాం. (హెబ్రీ. 12:1, 2) ఈ పాఠాలను మనం ఎలా అన్వయించుకోవచ్చు?

14, 15. శోధన ఎదురైనప్పుడు యేసు స్పందించిన తీరుకూ హవ్వ స్పందించిన తీరుకూ ఏ తేడా ఉంది? మనం యేసును ఎలా అనుకరించవచ్చు? (18వ పేజీలోని చిత్రంపై వ్యాఖ్యానించండి.)

14 శోధనలు ఎదురైనప్పుడు యెహోవాను మరచిపోకండి. హవ్వ తన కళ్లెదుట ఉన్న శోధన గురించే ఆలోచించింది. ఆ చెట్టు పండ్లు ‘ఆహారమునకు మంచివిగా, కన్నులకు అందమైనవిగా, వివేకమిచ్చేవిగా, రమ్యమైనవిగా’ ఆమెకు కనిపించాయి. (ఆది. 3:6) శోధనలు ఎదురైనప్పుడు, యేసు స్పందించిన తీరుకూ ఆమె స్పందించిన తీరుకూ ఎంత తేడా ఉంది! తనకు శోధన ఎదురైన ప్రతీసారి తన చర్యల వల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదురౌతాయో యేసు ఆలోచించాడు. అంతేకాక యెహోవా పేరును, ఆయన వాక్యాన్ని యేసు ఉపయోగించాడు.

15 యెహోవా ఇష్టపడనివాటిని చేయాలనే శోధన మనకు ఎదురైనప్పుడు మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం? మనం శోధన గురించే ఎక్కువగా ఆలోచిస్తే, చెడు చేయాలనే కోరిక బలపడుతుంది. (యాకో. 1:14, 15) ఆ కోరికను కూకటివేళ్లతోసహా పెకలించడానికి మనం వెంటనే చర్య తీసుకోవాలి. శరీరంలో ఒక భాగాన్ని తీసేసుకునేంత తీవ్రమైన చర్య తీసుకునేందుకు కూడా వెనకాడకూడదు. (మత్త. 5:29, 30) యేసులా మనం మన చర్యల వల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదురౌతాయో అంటే, వాటివల్ల యెహోవాతో మన సంబంధం దెబ్బతింటుందో లేదో ఆలోచించాలి. అంతేకాక, బైబిల్లోని మాటలను గుర్తుచేసుకోవాలి. అలా చేస్తేనే, మన జీవితంలో యెహోవాకు అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నామని చూపిస్తాం.

16-18. (ఎ) వేటివల్ల మన హృదయాలు బరువెక్కవచ్చు? (బి) కష్టమైన పరిస్థితులను తాళుకోవడానికి మనం ఏమి చేయాలి?

16 మీకు ఎదురయ్యే కష్టాలనుబట్టి యెహోవామీద కోపగించుకోకండి. (సామె. 19:3) ఈ దుష్టలోక నాశనం దగ్గరయ్యేకొద్దీ, ఎంతోమంది యెహోవా సేవకులు విపత్తులను, కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో యెహోవా మనల్ని అద్భుతంగా రక్షించాలని ఆశించం. అయినా, మన ఆత్మీయులను పోగొట్టుకున్నప్పుడు లేదా మనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు యోబులా మన హృదయాలు బరువెక్కవచ్చు.

17 యెహోవా కొన్ని పరిస్థితులను ఎందుకు అనుమతించాడో యోబుకు అర్థంకాలేదు. అలాగే చెడు సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో మనకు కొన్నిసార్లు అర్థంకాకపోవచ్చు. ఉదాహరణకు హయిటీలో వచ్చిన భూకంపంలో లేక అలాంటి మరితర విపత్తుల్లో నమ్మకమైన మన సహోదరులు మరణించారని మనం వినివుండవచ్చు. లేదా యథార్థవంతుడైన ఓ సహోదరుడు హింస వల్ల గానీ ఘోరమైన దుర్ఘటన వల్ల గానీ మరణించాడని మనకు తెలిసివుండవచ్చు. లేదా మనం దుఃఖకరమైన పరిస్థితులను ఎదుర్కొంటుండవచ్చు లేక మనకు అన్యాయం జరుగుతోందని అనిపించవచ్చు. అలాంటప్పుడు, హృదయ వేదనతో మనం ఇలా అడిగే అవకాశముంది: ‘యెహోవా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? నేనేం తప్పు చేశాను?’ (హబ. 1:2, 3) అలాంటి పరిస్థితులను తాళుకోవడానికి మనం ఏమి చేయాలి?

18 మనకు కష్టాలు ఎదురైనప్పుడు యెహోవా అనుగ్రహం మనమీద లేదని అనుకోకూడదు. యేసు తన కాలంలో జరిగిన రెండు దుర్ఘటనల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాన్నే నొక్కిచెప్పాడు. (లూకా 13:1-5 చదవండి.) అనేక విపత్తులు ‘కాలవశము చేత, అనూహ్యంగా’ సంభవిస్తాయి. (ప్రసం. 9:11, NW) మనకు ఏ కారణంగా కష్టాలు ఎదురౌతున్నా, “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుని” మీద మనం మనసు నిలిపితే వాటిని తాళుకోగలుగుతాం. దేవుని సేవలో నమ్మకంగా కొనసాగేందుకు కావాల్సిన శక్తిని ఆయన మనకు ఇస్తాడు.—2 కొరిం. 1:3-6.

19, 20. అవమానాలను యేసు ఎలా సహించగలిగాడు? మనం కూడా ఎలా సహించవచ్చు?

19 గర్వానికి లేదా అవమానం పొందుతామేమోననే భయానికి చోటివ్వకండి. యేసు వినయస్థుడు కాబట్టి, ‘తన్ను తానే రిక్తునిగా చేసుకొని, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు.’ (ఫిలి. 2:5-8) యెహోవా మీద ఆధారపడినందువల్ల ఆయన ఎన్నో అవమానాలను సహించగలిగాడు. (1 పేతు. 2:23, 24) అలా యేసు యెహోవా చిత్తానికి మొదటి స్థానమిచ్చాడు. దానివల్ల యెహోవా ఆయనను ఉన్నత స్థానానికి హెచ్చించాడు. (ఫిలి. 2:9-11) తన శిష్యులు కూడా తనలాగే ప్రవర్తించాలని యేసు ప్రోత్సహించాడు.—మత్త. 23:11, 12; లూకా 9:26.

20 కొన్నిసార్లు, విశ్వాస పరీక్షల వల్ల మనకు అవమానం జరిగినట్లు అనిపించవచ్చు. అయినా, అపొస్తలుడైన పౌలులా మనం నమ్మకాన్ని కనబరచాలి. ఆయన ఇలా అన్నాడు: “ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవుచున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.”—2 తిమో. 1:12.

21. లోకంలో ఎక్కువగా స్వార్థప్రియులే ఉన్నప్పటికీ మీరు ఎలా ఉండాలనే కృతనిశ్చయంతో ఉన్నారు?

21 మన కాలంలోని ప్రజలు ‘స్వార్థప్రియులుగా’ ఉంటారని బైబిలు చెబుతోంది. (2 తిమో. 3:2) అందుకే, యెహోవాకు కాక తమకే ప్రాముఖ్యతనిచ్చుకునే ప్రజలను ఎక్కువగా చూస్తున్నాం. మనమైతే అలా ఉండకుండా జాగ్రత్తపడదాం! మనకు శోధనలు, కష్టాలు, అవమానాలు ఎదురైనప్పుడు మన జీవితంలో యెహోవాయే అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి అని నిరూపించాలనే కృతనిశ్చయంతో ఉందాం!

[అధస్సూచి]

a “చర్మము కాపాడుకొనుటకై చర్మము” అనే మాటకు, యోబు తన చర్మానికి లేక ప్రాణానికి ఏ హానీ జరగనంతవరకు తన పిల్లల, పశువుల ప్రాణాలు పోవడం గురించి పట్టించుకోడనే అర్థముందని కొందరు బైబిలు విద్వాంసులు చెబుతారు. తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు కొంత చర్మాన్ని కోల్పోవడానికి కూడా ఒక వ్యక్తి సిద్ధంగా ఉంటాడనేది ఆ మాటల అర్థమని మరికొందరు అంటారు. ఉదాహరణకు, తలకు తగిలే దెబ్బను తప్పించుకోవడానికి ఒక వ్యక్తి తన చేతిని అడ్డుగా పెట్టుకుంటాడు. అలా తన చర్మాన్ని కాపాడుకోవడానికి కొంత చర్మాన్ని కోల్పోతాడు. ఆ మాటల అర్థమేదైనా, తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం సమస్తాన్ని కోల్పోవడానికైనా యోబు సిద్ధంగా ఉంటాడని అవి సూచిస్తున్నాయి.

మనం ఏమి నేర్చుకోవచ్చు?

• సాతాను హవ్వను మోసగించిన విధానం నుండి

• కష్టాలు ఎదురైనప్పుడు యోబు స్పందించిన తీరు నుండి

• యేసు దేనికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చాడనే దాని నుండి

[అధ్యయన ప్రశ్నలు]

[17వ పేజీలోని చిత్రం]

హవ్వ యెహోవాతో తనకున్న సంబంధం మీద మనసు నిలపలేకపోయింది

[18వ పేజీలోని చిత్రం]

సాతాను శోధనలను తిరస్కరించి, యెహోవా చిత్తాన్ని చేయడం మీదే యేసు మనసు నిలిపాడు

[20వ పేజీలోని చిత్రాలు]

హయిటీలో భూకంపం తర్వాత గుడారాలకు వెళ్లి ప్రకటిస్తున్న సాక్షులు

కష్టాలు ఎదురైనప్పుడు ‘సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుని’ మీద మనసు నిలపవచ్చు