కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యాన్ని మీరు నిజంగా ఆస్వాదిస్తున్నారా?

దేవుని వాక్యాన్ని మీరు నిజంగా ఆస్వాదిస్తున్నారా?

దేవుని వాక్యాన్ని మీరు నిజంగా ఆస్వాదిస్తున్నారా?

“క్రమంగా బైబిలు చదవడం మొదలుపెట్టాక, ఏదో చదవాలి కదా అన్నట్లు చదివేదాన్నే తప్ప దాన్ని ఆస్వాదించేదాన్ని కాదు. అందుకే చదువుతున్నది నాకు అర్థమయ్యేది కాదు, దాంతో చాలాసార్లు నా మనసు ఎక్కడెక్కడికో వెళ్లిపోయేది” అని లరేన్‌ చెబుతోంది.

బైబిలు చదవడం మొదలుపెట్టినా దానిని ఆస్వాదించలేకపోతున్నామని వేరేవాళ్లు కూడా ఒప్పుకుంటారు. అయితే, పరిశుద్ధ లేఖనాలను చదవడం మంచిదని వాళ్లకు తెలుసు కాబట్టి వాళ్లు చదువుతూ ఉంటారు. “బైబిలు చదవడానికి, వ్యక్తిగత అధ్యయనం చేయడానికి ఏవేవో అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఎన్నోసార్లు ప్రార్థన చేసి, ఎంతో ప్రయత్నించిన తర్వాతే ప్రతీరోజు బైబిలు చదవడాన్ని నా దినచర్యలో ఒక భాగంగా చేసుకోవడం సాధ్యమైంది” అని మార్క్‌ చెబుతున్నాడు.

దేవుని వాక్యమైన బైబిలును ఎంతో విలువైనదిగా ఎంచాలంటే మీరు ఏమి చేయాలి? దాన్ని ఆనందంతో ఎలా చదవవచ్చు? ఇక్కడిచ్చిన సూచనలను పరిశీలించండి.

లక్ష్యాలు, పద్ధతులు

బైబిలు చదివే ముందు ప్రార్థన చేసుకుని, మనసు అటూ ఇటూ వెళ్లకుండా చూసుకోండి. బైబిలు అధ్యయనం చేయడానికి ఆసక్తిని వృద్ధి చేయమని యెహోవాకు ప్రార్థించండి. ఆయన జ్ఞానాన్ని మరింత బాగా అర్థం చేసుకునేలా సహాయం చేయమని కోరండి. (కీర్త. 119:34) ఇలా చేయకపోతే బైబిలు అధ్యయనం యాంత్రికంగా తయారవుతుంది, దాంతో ఇక చదవాలనిపించకపోవచ్చు. లిన్‌ ఇలా చెబుతోంది, “నేను కొన్నిసార్లు చాలా త్వరత్వరగా చదివేస్తాను, దాంతో ఆసక్తికరమైన అదనపు అంశాలను అస్సలు గుర్తించను. చాలాసార్లు ముఖ్యమైన అంశాలను నేను పూర్తిగా అర్థంచేసుకోలేను. అందుకే మనసుపెట్టి చదివేలా సహాయం చేయమని యెహోవాకు ప్రార్థిస్తాను. అప్పుడు నా మనసు అటూ ఇటూ వెళ్లకుండా ఉంటుంది.”

నేర్చుకుంటున్నదాన్ని విలువైనదిగా ఎంచండి. బైబిలు సత్యాలను అర్థంచేసుకుని వాటిని పాటిస్తేనే భవిష్యత్తులో ఎప్పటికీ జీవించి ఉండగలుగుతామని గుర్తుంచుకోండి. ఆచరణాత్మకమైన విషయాలను గ్రహించి, వాటిని పాటించడానికి మనస్ఫూర్తిగా కృషిచేయండి. క్రిస్‌ ఇలా చెబుతున్నాడు, “నాలో ఉన్న చెడు లక్షణాలను, ఉద్దేశాలను గుర్తించడానికి సహాయంచేసే విషయాల కోసం నేను చూస్తాను. బైబిలును, మన ప్రచురణల్లోని చాలా వాటిని రాసినవాళ్లు నన్ను ఎప్పుడూ కలవకపోయినా వాళ్లు రాసిన విషయాల నుండి వ్యక్తిగతంగా నేను ఎలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకోవడం సంతోషాన్నిస్తుంది.”

చేరుకోగలిగే లక్ష్యాలను పెట్టుకోండి. బైబిల్లోని వ్యక్తుల గురించి ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్లలోని చాలామంది గురించి ఆసక్తికరమైన వాస్తవాలను మన ప్రచురణలు చదివి తెలుసుకోవచ్చు. బైబిల్లోని స్త్రీపురుషులు మనలానే వ్యక్తిత్వాలు, భావాలు ఉన్న నిజమైన వ్యక్తులని తెలుసుకున్నప్పుడు, వాళ్లను ఆదర్శంగా తీసుకొని మీరు ఎంతో ప్రయోజనం పొందవచ్చు.

లేఖనాలను కొత్త పద్ధతుల్లో వివరించడానికి ప్రయత్నించండి. (అపొ. 17:2, 3) సఫీయ అదే మనసులో ఉంచుకుని అధ్యయనం చేస్తుంది. ఆమె ఇలా చెబుతోంది, “పరిచర్యలోనూ వేరే సందర్భాల్లోనూ ఉపయోగించడానికి లేఖనాలను కొత్తకొత్త పద్ధతుల్లో వివరించడం నేర్చుకోవాలన్నది నా కోరిక. అలా చేస్తేనే బైబిలు సత్యాలను నేను స్పష్టంగా వివరించగలుగుతాను. దానికి కావలికోట పత్రిక ఒక మంచి ఉపకరణం.”—2 తిమో. 2:15.

బైబిల్లోని సన్నివేశాలను ఊహించుకోండి. ‘దేవుని వాక్యం సజీవమైనది’ అని హెబ్రీయులు 4:12 చెబుతోంది. లేఖనాలను చదువుతున్నప్పుడు బైబిల్లోని వ్యక్తులు చూస్తున్నవి ఊహించుకోండి, వాళ్ళు వింటున్నవి వినడానికీ వాళ్లలో కలుగుతున్న భావాలను అర్థం చేసుకోవడానికీ ప్రయత్నించండి. అలా చేస్తే దేవుని సందేశం మీ మనసుల్లో నాటుకుపోతుంది. వాళ్లకు ఎదురైన అనుభవాలను మీ జీవితంలోని పరిస్థితులతో పోల్చి చూసుకోండి. ఆయా పరిస్థితుల్లో వాళ్లు వ్యవహరించిన విధానం నుండి నేర్చుకోండి. అలా చేసినప్పుడు బైబిలు వృత్తాంతాల విషయంలో మీ అవగాహన పెరుగుతుంది, అవి మీ మనసుల్లో ముద్రించుకుపోతాయి.

కష్టమైన లేఖనాలను, వాటి వివరణలను బాగా అర్థం చేసుకోవాలంటే వాటికి సమయం కేటాయించండి. అధ్యయనం కోసం ప్రతీసారి ఎక్కువ సమయం వెచ్చించండి. ఎంతో ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తినప్పుడు అదనపు పరిశోధన చేయాల్సి ఉంటుంది. తెలియని పదాల అర్థాన్ని నిఘంటువులో చూడండి, అధస్సూచిలను పరిశీలించండి, మీకు వచ్చిన మరో భాషా బైబిలులో క్రాస్‌ రెఫరెన్స్‌లు ఉంటే వాటిని తీసి చూడండి. చదివిన దానిని ఎంత ఎక్కువ అర్థం చేసుకొని, పాటిస్తే దేవుని వాక్యాన్ని మీరు అంతెక్కువ ఆస్వాదించవచ్చు. అప్పుడు కీర్తనకర్త చెప్పినట్లు మీరు చెప్పగలుగుతారు. ఆయన ఇలా చెప్పాడు, “నీ [యెహోవా] శాసనములు నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను.”—కీర్త. 119:111.

త్వరత్వరగా పూర్తిచేయాలని చూడకండి. సమయమంతా వ్యక్తిగత అధ్యయనం కోసమే కేటాయించకుండా సంఘ కూటాలకు సిద్ధపడడానికి కూడా తగినంత సమయం కేటాయించండి. “చాలాసార్లు నేనెంతో ఒత్తిడిలో ఉంటాను. అందుకే సరిగ్గా మనసుపెట్టి చదవలేను. కాబట్టి ఒకేసారి ఎక్కువసేపు అధ్యయనం చేయకుండా తరచూ కొద్దిసేపు అధ్యయనం చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నాకు అర్థమైంది” అని రాకెల్‌ చెబుతోంది. క్రిస్‌ ఇలా ఒప్పుకుంటున్నాడు, “త్వరత్వరగా చదివినప్పుడు నేను ఎక్కువ గ్రహించలేను కాబట్టి నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. అంతేకాదు, అలా చదివింది సాధారణంగా నా బుర్రకు ఎక్కదు.” అందుకే, ఎక్కువ సమయం కేటాయించండి.

దేవుని వాక్యం పట్ల ప్రగాఢమైన అపేక్షను పెంచుకోండి. “క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి” అని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. (1 పేతు. 2:1, 2) పసిపిల్లలు పాలంటే అపేక్షను పెంచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లలో అది సహజంగానే ఉంటుంది. కానీ మనం దేవుని వాక్యంపట్ల అపేక్షను పెంచుకోవాలని లేఖనాలు చెబుతున్నాయి. బైబిల్లో నుండి రోజుకు ఒక్క పేజీ చదివినా చాలు త్వరలోనే మీలో ఆ అపేక్ష పుడుతుంది. మొదట్లో కష్టంగా అనిపించినది ఆ తర్వాత ఇష్టంగా మారుతుంది.

లేఖన భాగాలను ధ్యానించండి. చదివిన దానిని ధ్యానించడం వల్ల కూడా మీరు ఎంతో ప్రయోజనం పొందుతారు. ధ్యానిస్తే, పరిశోధించి తెలుసుకున్న అంశాలు ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగివున్నాయో గ్రహించగలుగుతారు. అలా, జ్ఞానమనే ఆధ్యాత్మిక ముత్యాల హారం త్వరలోనే మీ సొంతమవుతుంది. నిజంగా, ఆ జ్ఞానం ఎంతో అమూల్యమైన సంపద!—కీర్త. 19:14; సామె. 3:3.

అలా వెచ్చించిన సమయం వృథాకాదు

క్రమంగా అధ్యయనం చేయాలంటే కృషి అవసరం. అయితే, అలా అధ్యయనం చేస్తే లెక్కలేనన్ని ఆశీర్వాదాలు మీ సొంతమౌతాయి. లేఖనాలపై మీకున్న అవగాహన పెరుగుతుంది. (హెబ్రీ. 5:12-14) ప్రేరేపిత లేఖనాలను చదివి మీరు వివేచన, జ్ఞానం సంపాదించుకుంటే సంతోషం, ప్రశాంతత, సమాధానం కలుగుతాయి. దేవుని ప్రేరేపిత వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకుని, దాని ప్రకారం నడుచుకునేవాళ్లకు అది “జీవవృక్షము” లాంటిది.—సామె. 3:13-18.

దేవుని వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేస్తే బుద్ధిగల మనసు సంపాదించుకోగలుగుతారు. (సామె. 15:14) అప్పుడు బైబిలును ఆధారం చేసుకొని మనస్పూర్తిగా సలహా ఇవ్వగలుగుతారు. బైబిల్లో చదివిన దాని ప్రకారం, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన” దాసుడు అందిస్తున్న ప్రచురణల్లో చదివిన దాని ప్రకారం, మీరు నిర్ణయాలు తీసుకుంటే యెహోవా ప్రేరేపిత వాక్యం సేదదీర్పునిస్తుందని, బలపరుస్తుందని మీకే తెలుస్తుంది. (మత్త. 24:45) మరింత సానుకూలంగా, ఉత్సాహంగా, ఆధ్యాత్మిక వ్యక్తులుగా ఉంటారు. అంతేకాదు, యెహోవాతో మీకున్న సంబంధంతో ముడిపడివున్న ప్రతీ విషయంలో సఫలులౌతారు.—కీర్త. 1:2, 3.

దేవుని మీద మీకు ప్రగాఢమైన ప్రేమ ఉంటే, మీ విశ్వాసం గురించి ఇతరులతో మాట్లాడతారు. ఇలా చేస్తే కూడా మీరు ఎంతో ప్రయోజనం పొందుతారు. ఇంటివాళ్ల ఆసక్తిని చూరగొనడానికి వివిధ లేఖనాలను గుర్తుపెట్టుకొని, వాటిని ఉపయోగించేందుకు సఫీయ కృషి చేస్తుంది. అలా ఆమె సమర్థవంతంగా, ఉత్సాహంగా క్రైస్తవ పరిచర్య చేయగలుగుతోంది. “బైబిల్లోని విషయాలు విన్నప్పుడు ప్రజల్లో కలిగే స్పందన చూస్తే నాకు ఎంతో ఆనందమనిపిస్తుంది” అని ఆమె చెబుతోంది.

దేవుని వాక్యాన్ని ఆస్వాదించడం వల్ల కలిగే ప్రయోజనాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే, మీరు యెహోవాతో దగ్గరి సంబంధాన్ని కలిగివుంటారు. బైబిలు అధ్యయనం వల్ల యెహోవా ప్రమాణాలను తెలుసుకుంటారు, ఆయన చూపించే ప్రేమను, ఉదారతను, న్యాయాన్ని అర్థంచేసుకుని వాటిని విలువైనవిగా ఎంచుతారు. అంతకన్నా ప్రాముఖ్యమైనది, అంతకన్నా ప్రయోజనకరమైనది ఏదీ లేదు. అందుకే మీరు దేవుని వాక్యాన్ని పైపైన కాదుగాని లోతుగా అధ్యయనం చేయాలి. దానికోసం వెచ్చించిన సమయం ఎంతమాత్రం వృథాకాదు.—కీర్త. 19:7-11.

[5వ పేజీలోని చిత్రం]

దేవుని వాక్యాన్ని చదవడం: లక్ష్యాలు, పద్ధతులు

▪ బైబిలు చదివే ముందు ప్రార్థన చేసుకుని, మనసు అటూ ఇటూ వెళ్లకుండా చూసుకోండి.

▪ నేర్చుకుంటున్న దాన్ని విలువైనదిగా ఎంచండి.

▪ చేరుకోగలిగే లక్ష్యాలను పెట్టుకోండి.

▪ లేఖనాలను కొత్త పద్ధతుల్లో వివరించడానికి ప్రయత్నించండి.

▪ బైబిల్లోని సన్నివేశాలను ఊహించుకోండి.

▪ కష్టమైన లేఖనాలను, వాటి వివరణలను బాగా అర్థం చేసుకోవాలంటే వాటికి సమయం కేటాయించండి.

▪ త్వరత్వరగా పూర్తిచేయాలని చూడకండి.

▪ దేవుని వాక్యం పట్ల ప్రగాఢమైన అపేక్షను పెంచుకోండి.

▪ లేఖన భాగాలను ధ్యానించండి.

[4వ పేజీలోని చిత్రం]

ఏదైనా ఒక బైబిలు వృత్తాంతాన్ని చదువుతున్నప్పుడు మీరు అలాంటి పరిస్థితిలో ఉన్నట్లు ఊహించుకోండి