కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మంచి పర్యవేక్షకుడు, ప్రియమైన స్నేహితుడు”

“మంచి పర్యవేక్షకుడు, ప్రియమైన స్నేహితుడు”

“మంచి పర్యవేక్షకుడు, ప్రియమైన స్నేహితుడు”

యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యునిగా సేవచేసిన జాన్‌ (జ్యాక్‌) బార్‌ 2010, డిసెంబరు 4 శనివారం ఉదయం తన భూజీవితాన్ని ముగించాడు. అప్పటికి ఆయనకు 97 ఏళ్లు. ఆయన “మంచి పర్యవేక్షకుడు, ప్రియమైన స్నేహితుడు” అని అందరూ అంటుండేవారు.

సహోదరుడు జాన్‌ బార్‌ స్కాట్లండ్‌లోని అబర్డీన్‌లో జన్మించాడు. ఆయనకు ఒక అన్న, ఒక అక్క ఉన్నారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ అభిషిక్తులే. సహోదరుడు బార్‌ తన చిన్ననాటి కుటుంబ పరిస్థితుల గురించి ఎంతో ఇష్టంగా మాట్లాడేవాడు. ప్రేమగల తన తల్లిదండ్రులు ఉంచిన చక్కని మాదిరిని ఆయన ఎంతగానో ప్రశంసించేవాడు.

కౌమారదశ వచ్చేసరికి ఆయనకు కొత్తవారితో మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉండేది. అయితే, ఆయన ఆ సమస్యను తీసేసుకోవడానికి శతవిధాల ప్రయత్నించాడు. ఆ తర్వాత 1927లో తనకు 14 ఏళ్లున్నప్పుడు ఒక ఆదివారం మధ్యాహ్నం వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి, ఆయనతో కలిసి ఇంటింటి పరిచర్యలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నానని బార్‌ చెప్పాడు. ఎన్నో సంవత్సరాల పాటు ఆయన చేసిన సేవకు అదే తొలిమెట్టు. ఆ రోజు నుండి చనిపోయేంతవరకు ఆయన ఉత్సాహంగా రాజ్య సువార్తను ప్రకటించాడు.

ఒకసారి, ఘోరమైన ప్రమాదంలో వాళ్లమ్మకు దాదాపు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినప్పుడు, యౌవనస్థుడైన బార్‌ జీవిత సంకల్పం గురించి జాగ్రత్తగా ఆలోచించాడు. 1929లో యెహోవాకు సమర్పించుకొని, ఆ తర్వాత తన సమర్పణను బహిరంగంగా తెలియజేయడానికి వచ్చిన మొదటి అవకాశంలోనే అంటే 1934లో బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన 1939లో ఇంగ్లాండ్‌లోని లండన్‌లో బెతెల్‌ సేవ మొదలుపెట్టాడు. ఆ తర్వాత, 71 ఏళ్ల పాటు పూర్తికాల సేవచేశాడు.

ఆయన 1960, అక్టోబరు 29న మిల్‌డ్రడ్‌ విల్లట్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె చాలాకాలంపాటు ఉత్సాహం గల పయినీరుగా, మిషనరీగా సేవ చేసింది. సహోదరుడు బార్‌ తన వివాహ జీవితాన్ని “ప్రత్యేకమైన, అమూల్యమైన సంబంధం” అని సంబోధించేవాడు. వారు మాదిరికరమైన, దైవభక్తిగల దంపతులు అనే పేరు సంపాదించుకున్నారు. 2004, అక్టోబరులో తన భార్య మిల్‌డ్రడ్‌ భూజీవితాన్ని ముగించేంతవరకు వారు తాము సంపాదించుకున్న మంచి పేరుకు తగినట్లు జీవించారు. వివాహ జీవితమంతటిలో ప్రతీరోజు ఇద్దరూ కలిసి బైబిలు చదివేవారు.

జాన్‌ బార్‌ పేరు వినగానే ఆయన సహేతుకంగా, దయగా, లేఖనాధారంగా సలహా ఇస్తాడని ఆయన గురించి తెలిసినవారు గుర్తుచేసుకుంటారు. జీవితకాలమంతటిలో ఆయన ఎంతో కష్టపడి పనిచేశాడు, ఇతరులను అర్థం చేసుకుంటూ ప్రేమగల పర్యవేక్షకుడిగా, యథార్థమైన స్నేహితునిగా ఉన్నాడు. ఆయన వ్యాఖ్యానాలను, ప్రసంగాలను, ఆయన చేసే ప్రార్థనలను విన్నప్పుడు ఆయనకు సత్యం పట్ల ఎంత ప్రేమ ఉందో, యెహోవాతో ఆయనకు ఎంత దగ్గరి సంబంధం ఉందో స్పష్టంగా తెలిసేది.

మన ప్రియ సహోదరుడు జాన్‌ బార్‌ ఇప్పుడు మనతో లేకపోయినా, అమర్త్యత అనే బహుమతిని పొందాడు కాబట్టి మనం ఆయనతోపాటు సంతోషిస్తున్నాం. ఆయన జీవించినంత కాలం ఆ బహుమతి కోసం ఎంతగానో ఎదురుచూశాడు, దాని గురించే తరచూ మాట్లాడుతుండేవాడు, దాన్నే ఆయన ఎల్లప్పుడూ కోరుకున్నాడు.—1 కొరిం. 15:53, 54. a

[అధస్సూచి]

a సహోదరుడు జాన్‌ ఈ. బార్‌ జీవిత కథ కోసం, కావలికోట జూలై 1, 1987 (ఆంగ్లం), సంచికలోని 26-31 పేజీలు చూడండి.