యెహోవాపై పూర్తి నమ్మకముంచితే సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాం
యెహోవాపై పూర్తి నమ్మకముంచితే సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాం
“నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును.”—కీర్త. 4:3.
1, 2. (ఎ) దావీదు ఎలాంటి అపాయకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు? (బి) మనం ఏ కీర్తనలను పరిశీలిస్తాం?
రాజైన దావీదు కొంతకాలం ఇశ్రాయేలును పరిపాలించాడు. ఆయన ఒకానొక సందర్భంలో అపాయకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆయన కుమారుడైన అబ్షాలోము కుట్ర పన్ని తననుతాను రాజుగా ప్రకటించుకున్నాడు, దానివల్ల దావీదు యెరూషలేమును విడిచి వెళ్లాల్సివచ్చింది. ఆయన సన్నిహిత స్నేహితుడే నమ్మకద్రోహి అయ్యాడు. దాంతో ఆయన నమ్మకమైన కొంతమంది వ్యక్తులతోపాటు ఏడుస్తూ చెప్పులు లేకుండా ఒలీవ కొండ ఎక్కాడు. మరో సందర్భంలో సౌలు కుటుంబీకుడైన షిమీ దావీదుపై రాళ్లు విసురుతూ, దుమ్ము రేపుతూ ఆయనను శపించాడు.—2 సమూ. 15:30, 31; 16:5-14.
2 ఆ కష్టమైన పరిస్థితి వల్ల దావీదు బాధతో, అవమానంతో చనిపోయాడా? లేదు, ఎందుకంటే ఆయన యెహోవాపై నమ్మకముంచాడు. తాను అబ్షాలోముకు భయపడి పారిపోతున్న సందర్భం గురించి దావీదు కూర్చిన 3వ కీర్తనలో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. 4వ కీర్తనను కూడా ఆయనే రాశాడు. ఆ రెండు కీర్తనలు చదివితే దేవుడు మన ప్రార్థనలను విని, వాటికి జవాబు ఇస్తాడనే నమ్మకం కలుగుతుంది. (కీర్త. 3:4; 4:3) యెహోవా తన నమ్మకమైన సేవకులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ వారికి మద్దతును, సమాధానాన్ని, కాపుదలను దయచేస్తాడని ఆ రెండు కీర్తనలు మనకు అభయమిస్తున్నాయి. (కీర్త. 3:5; 4:8) కాబట్టి మనం ఆ కీర్తనలను పరిశీలించి, అవి మనకు దేవుని మీద నమ్మకాన్ని, సురక్షితంగా ఉన్నామనే భావనను ఎలా కలిగిస్తాయో చూద్దాం.
‘అనేకులు మనమీదికి లేచినప్పుడు’
3. కీర్తన 3:1, 2 ప్రకారం దావీదు పరిస్థితి ఎలా ఉంది?
3 ‘ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షం వహించారు’ అనే వార్త దావీదు విన్నాడు. (2 సమూ. 15:13) అబ్షాలోము అంతమంది మద్దతుదారులను ఎలా కూడగట్టుకున్నాడని ఆలోచిస్తూ దావీదు ఇలా అన్నాడు: “యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు నామీదికి లేచువారు అనేకులు. —దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదని నన్నుగూర్చి చెప్పువారు అనేకులు.” (కీర్త. 3:1, 2) అబ్షాలోము నుండి, అతని మద్దతుదారుల నుండి దావీదును యెహోవా రక్షించడని చాలామంది ఇశ్రాయేలీయులు అనుకున్నారు.
4, 5. (ఎ) దావీదుకు ఏ నమ్మకం ఉంది? (బి) ‘నా తలను ఎత్తువాడు’ అనే మాటను బట్టి ఏమి తెలుస్తోంది?
4 దావీదుకు దేవుని మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఆయన సురక్షితంగా ఉన్నట్లు భావించాడు. ఆయనిలా పాడాడు: “యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు.” (కీర్త. 3:3) కేడెము లేదా డాలు సైనికుణ్ణి రక్షించినట్లే యెహోవా తనను రక్షిస్తాడని దావీదు నమ్మాడు. నిజమే, వయసు పైబడిన దావీదు రాజు తన తలను కప్పుకొని, అవమానంతో తలదించుకొని పారిపోయాడు. కానీ సర్వోన్నతుడు ఆయన పరిస్థితిని మార్చి ఆయనను తిరిగి ఘనపరిచాడు. ఆయన మళ్లీ తలెత్తుకొని నిలబడేలా యెహోవా చేశాడు. అంతకుముందు దేవుడు తన ప్రార్థనకు జవాబు ఇస్తాడనే నమ్మకంతో దావీదు ఆయనకు ప్రార్థించాడు. మీరు ఆయనలాంటి నమ్మకాన్నే చూపిస్తున్నారా?
5 ‘నా తల ఎత్తువాడు’ అనే మాటను బట్టి యెహోవాయే తనకు సహాయం చేస్తాడనే నమ్మకాన్ని దావీదు చూపించాడని తెలుస్తోంది. ఆ లేఖనం టుడేస్ ఇంగ్లీష్ వర్షన్ (ఆంగ్లం) అనువాదంలో ఇలా ఉంది: ‘ఓ ప్రభువా, నీవే నన్ను ఎల్లప్పుడూ అపాయం నుండి కాపాడతావు. నన్ను గెలిపించి నాలో మళ్లీ ధైర్యాన్ని నింపుతావు.’ ‘నా తల ఎత్తువాడు’ అనే మాట గురించి ఓ రెఫరెన్సు పుస్తకం ఇలా చెబుతోంది: “దేవుడు ఒక వ్యక్తి ‘తలను’ ఎత్తినప్పుడు . . . ఆయన ఆ వ్యక్తిలో నిరీక్షణను, నమ్మకాన్ని నింపుతాడు.” ఇశ్రాయేలీయులపై రాజుగా ఉండకుండా పారిపోవాల్సి వచ్చినప్పుడు దావీదు కృంగిపోయి ఉండవచ్చు. అయితే, ‘తన తల ఎత్తబడినప్పుడు’ ఆయనలో మళ్లీ ధైర్యం, విశ్వాసం, దేవునిపై పూర్తి నమ్మకం నింపబడ్డాయి.
‘యెహోవా ఉత్తరమిస్తాడు’
6. యెహోవా పరిశుద్ధ పర్వతం నుండి తన ప్రార్థనకు జవాబు వస్తుందని దావీదు ఎందుకు అన్నాడు?
6 యెహోవాపై పూర్తి నమ్మకంతో దావీదు ఇంకా ఇలా పాడాడు: “ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతమునుండి నాకుత్తరమిచ్చును.” (కీర్త. 3:4) దేవుని ప్రత్యక్షతకు సూచనగా ఉన్న నిబంధన మందసం అంతకుముందు దావీదు ఆజ్ఞమేరకు సీయోను కొండకు తీసుకురాబడింది. (2 సమూయేలు 15:23-25 చదవండి.) అందుకే, యెహోవా పరిశుద్ధ పర్వతం నుండి తన ప్రార్థనకు జవాబు వస్తుందని దావీదు అన్నాడు.
7. దావీదు ఎందుకు భయపడలేదు?
7 దేవునికి తాను చేసిన ప్రార్థన వృథా కాదని నమ్మాడు కాబట్టి దావీదు భయపడలేదు. ఆయనిలా పాడాడు: “యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును.” (కీర్త. 3:5) శత్రువులు అకస్మాత్తుగా దాడిచేసే ప్రమాదం ఎక్కువగా ఉండే రాత్రి సమయంలో కూడా దావీదు భయపడకుండా నిద్రపోయాడు. యెహోవా తనకు తప్పక తోడుగా ఉంటాడని దావీదు తన గత అనుభవాలను బట్టి తెలుసుకున్నాడు కాబట్టి, తాను తిరిగి మేల్కొంటాననే నమ్మకంతో ఉన్నాడు. “యెహోవా మార్గములను” అనుసరిస్తూ ఆయనను విడిచిపెట్టకుండా ఉంటే మనం కూడా అలాంటి నమ్మకంతో ఉండవచ్చు.—2 సమూయేలు 22:21, 22 చదవండి.
8. కీర్తన 27:1-4లోని మాటలు, దావీదుకు దేవునిపై నమ్మకం ఉందని ఎలా చూపిస్తున్నాయి?
8 దావీదుకు దేవునిపై ఉన్న విశ్వాసం, పూర్తి నమ్మకం ఆయన కూర్చిన మరో ప్రేరేపిత కీర్తనలో స్పష్టంగా కనిపిస్తోంది. దానిలో ఈ మాటలు ఉన్నాయి: “యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? . . . నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు . . . యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను.” (కీర్త. 27:1-4) మీకూ అలాగే అనిపించి మీ పరిస్థితులు అనుకూలిస్తే, క్రమం తప్పకుండా యెహోవా ఆరాధికులతో సహవసిస్తారు.—హెబ్రీ. 10:23-25.
9, 10. కీర్తన 3:6, 7లో దావీదు అలా మాట్లాడినా, ఆయనకు పగ తీర్చుకునే స్వభావం లేదని ఎందుకు చెప్పవచ్చు?
9 అబ్షాలోము పన్నిన కుట్రకు, ఇతరుల ద్రోహానికి గురైనా దావీదు ఇలా పాడాడు: “పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవు నీవే.”—కీర్త. 3:6, 7.
10 దావీదుకు పగ తీర్చుకునే స్వభావం లేదు. దేవుడే శత్రువులను ‘దవడ మీద కొడతాడని’ దావీదు నమ్మాడు. దావీదు రాజు ధర్మశాస్త్రాన్ని తనకోసం నకలు రాసుకున్నాడు కాబట్టి, “పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే” అని యెహోవా చెప్పిన మాటలు ఆయనకు తెలుసు. (ద్వితీ. 17:14, 15, 18; 32:35) అంతేకాక, దేవుడే ‘దుష్టుల పళ్లు విరుగగొడతాడు.’ పళ్లు విరుగగొట్టడమంటే హానిచేసే శక్తి లేకుండా చేయడమే. “యెహోవా హృదయమును లక్ష్యపెట్టును” కాబట్టి, దుష్టులు ఎవరో ఆయనకు తెలుసు. (1 సమూ. 16:7) అత్యంత దుష్టుడైన సాతానును ఎదిరించేంత విశ్వాసాన్ని, శక్తిని యెహోవా ఇస్తున్నందుకు మనం ఆయనకు ఎంతో రుణపడివున్నాం. సాతాను త్వరలోనే గర్జిస్తున్న పళ్లు లేని సింహంలా అగాధంలో పడవేయబడతాడు, అతడు నాశనానికి పాత్రుడు.—1 పేతు. 5:8, 9; ప్రక. 20:1, 2, 7-10.
“రక్షణ యెహోవాది”
11. మనం తోటి విశ్వాసుల గురించి ఎందుకు ప్రార్థించాలి?
11 తనకు ఎంతగానో అవసరమైన విడుదలను యెహోవా మాత్రమే దయచేయగలడని దావీదు గుర్తించాడు. అలాగని కీర్తనకర్త కేవలం తన గురించే ఆలోచించుకోలేదు. యెహోవా అనుగ్రహం ఉన్న ప్రజలందరి విషయమేమిటి? దావీదు ఆ ప్రేరేపిత కీర్తనను ఈ మాటలతో ముగించాడు: “రక్షణ యెహోవాది నీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక.” (కీర్త. 3:8) నిజమే, దావీదుకు పెద్దపెద్ద కష్టాలు వచ్చినా, దేవుని ప్రజల గురించి ఆలోచించాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని నమ్మాడు. మనం కూడా మన తోటి విశ్వాసుల గురించి ఆలోచించవద్దా? వారు ధైర్యాన్ని కూడగట్టుకొని గట్టి నమ్మకంతో రాజ్య సువార్తను ప్రకటించగలిగేలా తన పరిశుద్ధాత్మను ఇవ్వమని యెహోవాను కోరుతూ వారికోసం ప్రార్థిద్దాం.—ఎఫె. 6:17-20.
12, 13. అబ్షాలోముకు ఏమి జరిగింది? దానికి దావీదు ఎలా స్పందించాడు?
12 అబ్షాలోము అవమానకరంగా మరణించాడు. ఇతరులను, ప్రత్యేకంగా దేవుడు అభిషేకించిన దావీదువంటి వారిని నిందించే వారందరికీ ఇది ఓ హెచ్చరిక. (సామెతలు 3:31-35 చదవండి.) ఓ యుద్ధంలో అబ్షాలోము సైన్యాలు ఓడిపోయాయి. అబ్షాలోము ఓ కంచర గాడిదపై ఎక్కిపోతున్నప్పుడు దట్టమైన ఆయన తల వెంట్రుకలు ఓ పెద్ద చెట్టు కొమ్మకు చిక్కుకున్నాయి. దాంతో ఆయన నిస్సహాయంగా ఆ చెట్టుకు వేలాడాడు. ఆ తర్వాత యోవాబు మూడు బాణాలను అబ్షాలోము గుండెలోకి వేసినప్పుడు అతడు చనిపోయాడు.—2 సమూ. 18:6-17.
13 తన కుమారుడు చనిపోయాడని తెలిసినప్పుడు దావీదు సంతోషించాడా? లేదు. ఆయన అటూఇటూ తిరుగుతూ, ఏడుస్తూ “నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా, అని కేకలువేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును” అని అన్నాడు. (2 సమూ. 18:24-33) అయితే, ఆ తర్వాత యోవాబు చెప్పిన మాటలకు దావీదు ఏడ్వడం ఆపేశాడు. యెహోవా అభిషేకించిన రాజే కాక స్వయంగా తన తండ్రి అయిన దావీదుకు స్వార్థంతో ఎదురుతిరగడం వల్ల అబ్షాలోము ఎంత ఘోరంగా మరణించాడు!—2 సమూ. 19:1-8; సామె. 12:21; 24:21, 22.
దావీదు మరోసారి యెహోవాపై నమ్మకాన్ని వ్యక్తం చేశాడు
14. నాలుగవ కీర్తన కూర్పు గురించి ఏమి చెప్పవచ్చు?
14 మూడవ కీర్తనలాగే, నాలుగవ కీర్తన కూడా దావీదు పట్టుదలతో చేసిన ఓ ప్రార్థన. అది యెహోవాపై ఆయనకున్న పూర్తి నమ్మకాన్ని చూపిస్తుంది. (కీర్త. 3:4; 4:3) బహుశా, అబ్షాలోము పన్నిన కుట్ర నుండి తనకు లభించిన విడుదలను బట్టి దేవుని పట్ల కృతజ్ఞతతో దావీదు 4వ కీర్తనను కూర్చి ఉంటాడు. లేదా లేవీ గాయకులను మనసులో ఉంచుకొని ఆ కీర్తనను కూర్చి ఉంటాడు. కారణం ఏదైనా, ఆ కీర్తనను ధ్యానిస్తే యెహోవాపై మనకున్న నమ్మకం బలపడుతుంది.
15. తన కుమారుని ద్వారా యెహోవాకు మనం ఎందుకు ధైర్యంగా ప్రార్థించవచ్చు?
15 దావీదు మరోసారి యెహోవాపై తనకున్న పూర్తి నమ్మకాన్ని, తన ప్రార్థనలకు ఆయన జవాబు ఇస్తాడనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఆయనిలా పాడాడు: “నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.” (కీర్త. 4:1) నీతిని అనుసరిస్తే మనమూ అలాంటి నమ్మకాన్నే కలిగివుండవచ్చు. “నీతికి ఆధారమగు” దేవుడైన యెహోవా నీతిమంతులను ఆశీర్వదిస్తాడని గుర్తించి, విమోచన క్రయధన బలిపై విశ్వాసంతో తన కుమారుడైన యేసు ద్వారా మనం ధైర్యంగా యెహోవాకు ప్రార్థించవచ్చు. (యోహా. 3:16, 36) ఇది మనకు ఎంతో మనశ్శాంతిని ఇస్తుంది.
16. దావీదు ఎందుకు నిరుత్సాహపడివుండవచ్చు?
16 కొన్నిసార్లు, ఒకానొక పరిస్థితి తలెత్తడం వల్ల మనం నిరుత్సాహపడి నమ్మకాన్ని కోల్పోవచ్చు. బహుశా దావీదు కూడా తాత్కాలికంగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొనివుంటాడు. ఎందుకంటే, ఆయన ఇలా పాడాడు: “నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు? ఎంత కాలము అబద్ధమైనవాటిని వెదకెదరు?” (కీర్త. 4:2) ఇక్కడ ‘నరులు’ అనే పదం ప్రతికూల భావంలో ఉపయోగించబడిందని తెలుస్తోంది. దావీదు శత్రువులు ‘వ్యర్థమైనవాటిని ప్రేమించారు.’ న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ (ఆంగ్లం) ఆ వచనాన్ని ఇలా అనువదిస్తోంది: ‘మీరు ఎంతకాలం తప్పుడు ఆలోచనలను ప్రేమిస్తారు? ఎంతకాలం అబద్ధ దేవుళ్లను అనుసరిస్తారు?’ ఇతరులు చేసేదాన్ని బట్టి మనం నిరుత్సాహపడినా ఎల్లప్పుడూ పట్టుదలతో ప్రార్థిస్తూ, అద్వితీయ సత్య దేవునిపై పూర్తి నమ్మకాన్ని చూపిద్దాం.
17. కీర్తన 4:3 ప్రకారంగా మనం ఎలా ప్రవర్తించవచ్చో వివరించండి.
17 దావీదుకు దేవునిపై ఎంత నమ్మకముందో ఈ మాటల్లో చూడవచ్చు: “యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి. నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును.” (కీర్త. 4:3) యెహోవా పట్ల యథార్థంగా ఉండాలంటే మనకు ధైర్యం, ఆయనపై పూర్తి నమ్మకం ఉండాలి. ఉదాహరణకు, పశ్చాత్తాపపడని తమ బంధువు సంఘం నుండి బహిష్కరించబడినప్పుడు క్రైస్తవ కుటుంబ సభ్యులు ఆ లక్షణాలను చూపించాలి. తన పట్ల, తన మార్గాల పట్ల యథార్థత చూపించేవారిని యెహోవా ఘనపరుస్తాడు. అంతేకాక యెహోవా ప్రజలు ఆయన పట్ల యథార్థతను, పూర్తి నమ్మకాన్ని చూపించినప్పుడు వారి మధ్య సంతోషం నెలకొంటుంది.—కీర్త. 84:11, 12.
18. ఇతరులు మనతో నిర్దయగా మాట్లాడినప్పుడు లేదా ప్రవర్తించినప్పుడు, కీర్తన 4:4 ప్రకారంగా మనం ఏమి చేయాలి?
18 ఇతరులు మనల్ని బాధపెట్టేలా మాట్లాడినప్పుడు లేదా ప్రవర్తించినప్పుడు మనం ఏమి చేయాలి? దావీదు చెప్పిన ఈ మాటలను పాటిస్తే మనం సంతోషంగా ఉండగలుగుతాం: “భయమునొంది పాపముచేయకుడి [‘కోపపడండి కానీ పాపం చేయకండి,’ NW] మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి.” (కీర్త. 4:4) ఇతరులు మనతో నిర్దయగా మాట్లాడినప్పుడు లేదా ప్రవర్తించినప్పుడు పగ తీర్చుకోకుండా ఉండడం ద్వారా మనం పాపం చేయకుండా ఉందాం. (రోమా. 12:17-19) పడుకునే ముందు వ్యక్తిగత ప్రార్థనలో ఆ విషయం గురించి మన భావాలను యెహోవాకు తెలియజేయవచ్చు. అప్పుడు దాని విషయంలో మన అభిప్రాయం మారి, అవతలి వ్యక్తిని ప్రేమతో క్షమించే అవకాశం ఉంది. (1 పేతు. 4:8) ఆసక్తికరమైన విషయమేమిటంటే, దీనిగురించి అపొస్తలుడైన పౌలు కూడా సలహా ఇచ్చాడు. బహుశా ఆయన సలహా కీర్తన 4:4పై ఆధారపడి ఉండవచ్చు. ఆయన ఇలా రాశాడు: “కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటియ్యకుడి.”—ఎఫె. 4:26, 27.
19. కీర్తన 4:5ను పాటిస్తే, మన ఆధ్యాత్మిక బలులు ఎలా ఉంటాయి?
19 దేవునిపై నమ్మకం ఉంచడం ఎంత ప్రాముఖ్యమో వివరిస్తూ దావీదు ఇలా పాడాడు: “నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి.” (కీర్త. 4:5) ఇశ్రాయేలీయులు సరైన ఉద్దేశాలతో బలులు అర్పించినప్పుడు మాత్రమే యెహోవా వాటిని అంగీకరించేవాడు. (యెష. 1:11-17) యెహోవా మన ఆధ్యాత్మిక బలులను అంగీకరించాలంటే మనకు కూడా సరైన ఉద్దేశాలు ఉండాలి, యెహోవాపై పూర్తి నమ్మకం ఉండాలి.—సామెతలు 3:5, 6; హెబ్రీయులు 13:15, 16 చదవండి.
20. ‘యెహోవా సన్నిధికాంతి’ అంటే ఏమిటి?
20 దావీదు ఇంకా ఇలా పాడాడు: “మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.” (కీర్త. 4:6) ‘యెహోవా సన్నిధికాంతి’ ఆయన అనుగ్రహానికి సూచనగా ఉంది. (కీర్త. 89:15) కాబట్టి, “నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము” అని అన్నప్పుడు నిజానికి, ‘మాపై అనుగ్రహాన్ని చూపించు’ అని దావీదు వేడుకున్నాడు. యెహోవాపై నమ్మకం ఉంచుతాం కాబట్టి, విశ్వాసంతో ఆయన చిత్తం చేస్తుండగా మనకు ఆయన అనుగ్రహం ఉంటుంది, గొప్ప సంతోషం కూడా కలుగుతుంది.
21. నేటి ఆధ్యాత్మిక కోతపనిలో చేయగలిగినదంతా చేస్తే మనం ఏ అభయంతో ఉండవచ్చు?
21 కోతకాలంలో ప్రజలకు కలిగే సంతోషం కన్నా ఎక్కువ సంతోషాన్ని యెహోవా ఇస్తాడనే నమ్మకంతో భవిష్యత్తు వైపు చూస్తూ దావీదు యెహోవాకు ఇలా పాడాడు: ‘వారి ధాన్యం, ద్రాక్షారసం విస్తరించిన రోజు ఉండే సంతోషం కన్నా అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టిస్తావు.’ (కీర్త. 4:7, NW) నేటి ఆధ్యాత్మిక కోతపనిలో చేయగలిగినదంతా చేస్తే మనకు కూడా హృదయపూర్వకమైన సంతోషం కలుగుతుందని నమ్మవచ్చు. (లూకా 10:2) ‘విస్తరించిన జనాంగమైన’ అభిషిక్త క్రైస్తవుల నాయకత్వంలో ‘కోత పనివారి’ సంఖ్య అంతకంతకూ పెరగడాన్ని చూసి మనం ఎంతో సంతోషిస్తున్నాం. (యెష. 9:3) సంతోషాన్నిచ్చే ఈ కోతపనిలో మీరు సంతృప్తికరమైన వంతు కలిగివుంటున్నారా?
దేవుని మీద పూర్తి నమ్మకంతో ధైర్యంగా ముందుకు వెళ్లండి
22. కీర్తన 4:8లో చెప్పబడినట్లుగానే, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించినప్పుడు ఇశ్రాయేలీయులు ఎలా జీవించారు?
22 దావీదు ఆ కీర్తనను ఈ మాటలతో ముగించాడు: “యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.” (కీర్త. 4:8) ఇశ్రాయేలీయులు యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటించినంతకాలం ఆయనతో సమాధానకరమైన సంబంధాన్ని కలిగివున్నారు, సురక్షితంగా ఉన్నట్లు భావించారు. ఉదాహరణకు, సొలొమోను పరిపాలన తొలి సంవత్సరాల్లో ‘ఇశ్రాయేలీయులు, యూదులు నిర్భయంగా నివసించారు.’ (1 రాజు. 4:25) పొరుగు దేశాల నుండి బెదిరింపులు వస్తున్నా దేవునిపై నమ్మకం ఉంచినవారు నెమ్మదితో జీవించారు. మనం సురక్షితంగా ఉన్నామని భావించేలా దేవుడు చేస్తాడు కాబట్టి, దావీదులాగే మనం కూడా నెమ్మదితో నిద్రపోవచ్చు.
23. దేవునిపై పూర్తి నమ్మకం ఉంచితే మనం ఏమి అనుభవిస్తాం?
23 యెహోవా సేవలో మనం ధైర్యంగా ముందుకు సాగుదాం. అలాగే విశ్వాసంతో ప్రార్థిస్తూ, ‘సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానాన్ని’ అనుభవిద్దాం. (ఫిలి. 4:6, 7) అది మనకు ఎంతో సంతోషాన్నిస్తుంది. యెహోవాపై పూర్తి నమ్మకం ఉంచితే మనం భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోవచ్చు.
మీరెలా జవాబిస్తారు?
• అబ్షాలోము వల్ల దావీదు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు?
• మనం సురక్షితంగా ఉన్నామనే భావనను 3వ కీర్తన ఎలా కలిగిస్తుంది?
• 4వ కీర్తన యెహోవాపై మన నమ్మకాన్ని ఎలా బలపరుస్తుంది?
• దేవునిపై పూర్తి నమ్మకం ఉంచితే మనమెలా ప్రయోజనం పొందుతాం?
[అధ్యయన ప్రశ్నలు]
[29వ పేజీలోని చిత్రం]
అబ్షాలోము వల్ల పారిపోయినప్పుడు కూడా దావీదు యెహోవాపై పూర్తి నమ్మకాన్ని ఉంచాడు
[32వ పేజీలోని చిత్రాలు]
మీరు యెహోవాపై పూర్తి నమ్మకం ఉంచుతారా?