అబ్రాహాముకు నిజంగానే ఒంటెలు ఉండేవా?
అబ్రాహాముకు నిజంగానే ఒంటెలు ఉండేవా?
ఫరో అబ్రాహాముకు ఇచ్చిన పెంపుడు జంతువుల్లో ఒంటెలు కూడా ఉన్నాయని బైబిలు చెబుతోంది. (ఆది. 12:16) అబ్రాహాము సేవకుడు దూరప్రయాణం చేసి మెసొపొటేమియాకు వెళ్లినప్పుడు “తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను” తీసుకుని వెళ్లాడు. కాబట్టి, దాదాపు 4,000 సంవత్సరాల క్రితమే అబ్రాహాముకు ఒంటెలు ఉండేవని బైబిలు స్పష్టంగా చూపిస్తోంది.—ఆది. 24:10.
అయితే కొంతమంది దీనికి ఒప్పుకోరు. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఆర్కియోలాజికల్ స్టడీ బైబిల్ ఇలా చెబుతోంది: “ఒంటెల గురించిన ఆ వివరాలు చరిత్రపరంగా నిజం కావని పండితులు వాదించారు. ఎందుకంటే అబ్రాహాము జీవించిన చాలాకాలం తర్వాత అంటే దాదాపు సా.శ.పూ. 1200వ సంవత్సరం వరకు కూడా
ప్రజల దగ్గర ఒంటెలు ఉండేవి కావని చాలామంది నమ్ముతారు.” ఒంటెల గురించి బైబిలు ఇస్తున్న వివరాలన్నీ తప్పని, ఎందుకంటే ఆ బైబిలు వృత్తాంతాల్లో ఉన్న వ్యక్తులు జీవించిన కాలంలో ప్రజల దగ్గర ఒంటెలు ఉండేవి కావని పరిగణించబడుతోంది.దాదాపు 3,000 సంవత్సరాల క్రితం ఒంటెలను పెంచుకోవడం ప్రాముఖ్యతను సంతరించుకున్నా అంతకుముందు అవి ప్రజల దగ్గర ఉండేవి కావని మనం అనుకోవాల్సిన అవసరం లేదని ఇంకొంతమంది పండితులు వాదిస్తున్నారు. సివిలైజేషన్స్ ఆఫ్ ది ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అనే పుస్తకం ఇలా చెబుతోంది: “4,000 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితమే ఆగ్నేయ అరేబియాలోని ప్రజలు ఒంటెలను పెంచుకునేవారని ఇటీవలి పరిశోధనలు తెలియజేశాయి. మొదట్లో బహుశా పాలు, బొచ్చు, తోలు, మాంసం కోసమే ఒంటెలను పెంచుకునేవారు. కానీ కొంతకాలానికి, సరుకులను రవాణా చేయడానికి కూడా వాటిని ఉపయోగించుకోవచ్చని ప్రజలు గ్రహించివుంటారు.” పురావస్తుశాస్త్రజ్ఞులు కనుగొన్న ఇతర శిథిలాలను బట్టి, ఎముకల అవశేషాలను బట్టి అబ్రాహాము కాలానికి ముందున్న ఆ మూడవ సహస్రాబ్ది గురించిన ప్రస్తావన సరైనదేనని తెలుస్తోంది.
దీనికి రాతపూర్వక ఆధారాలు కూడా ఉన్నాయి. పై పుస్తకమే ఇంకా ఇలా చెబుతోంది: “మెసొపొటేమియాలోని కీల లిపిలో వాటి గురించిన ప్రస్తావన ఉంది, చాలా ముద్రల్లో ఒంటెల చిత్రాలు కూడా ఉన్నాయి. దీన్నిబట్టి దాదాపు 4,000 సంవత్సరాల క్రితం” అంటే అబ్రాహాము కాలానికల్లా, “ఒంటెలు మెసొపొటేమియాకు చేరుకొని ఉండవచ్చని తెలుస్తోంది.”
దక్షిణ అరేబియన్ వర్తకులు ఎడారి గుండా ఉత్తరానికి అంటే ఈజిప్టు, సిరియా వంటి ప్రాంతాలకు అత్తరును రవాణా చేయడానికి ఒంటెలను ఉపయోగించేవారని, ఆ విధంగా అక్కడి ప్రజలకు ఒంటెలను పరిచయం చేసేవారని కొంతమంది పండితులు నమ్ముతున్నారు. ఆ వ్యాపారం సా.శ.పూ. 2000కల్లా సర్వసాధారణమై ఉండవచ్చు. ఆసక్తికరంగా, అబ్రాహాము జీవించిన దాదాపు 100 సంవత్సరాల తర్వాత, అత్తరును ఐగుప్తుకు రవాణా చేయడానికి ఒంటెలను ఉపయోగించిన ఇష్మాయేలీయులైన వర్తకుల గురించి ఆదికాండము 37:25-28 ప్రస్తావిస్తోంది.
దాదాపు 4,000 సంవత్సరాల క్రితం ప్రాచీన తూర్పు ప్రాంతాల్లో ఒంటెలను అంతగా ఉపయోగించి ఉండకపోవచ్చు. అలాగని వాటి గురించి ప్రజలకు అసలు తెలియదని అనుకోవాల్సిన అవసరం లేదని ఆధారాలు చూపిస్తున్నాయి. అబ్రాహాము కాలం కన్నా ముందే ప్రజలు ఒంటెలను పెంచుకునేవారని నమ్మేందుకు కావాల్సినన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి బైబిల్లో ఒంటెల గురించిన ప్రస్తావనలు తప్పని అనుకోవాల్సిన అవసరం లేదని ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది.