కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పిల్లలు బాప్తిస్మం తీసుకోవాలా?

పిల్లలు బాప్తిస్మం తీసుకోవాలా?

పిల్లలు బాప్తిస్మం తీసుకోవాలా?

“ఇప్పుడు మా అమ్మాయి యెహోవా సేవకురాలు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మాయి కూడా సంతోషిస్తోందని నాకు తెలుసు” అని ఫిలిప్పైన్స్‌ దేశస్థుడైన కార్లోస్‌ a అనే క్రైస్తవ తండ్రి చెప్పాడు. గ్రీసు దేశానికి చెందిన ఒక తండ్రి ఇలా రాశాడు: “కౌమారదశలో ఉన్నప్పుడే మా ముగ్గురు పిల్లలు బాప్తిస్మం తీసుకొని యెహోవాసాక్షులు అయినందుకు నేను, నా భార్య చాలా సంతోషిస్తున్నాం. వారు సత్యంలో ప్రగతి సాధిస్తూ సంతోషంగా యెహోవా సేవ చేస్తున్నారు.”

పిల్లలు బాప్తిస్మం తీసుకున్నప్పుడు క్రైస్తవ తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. కానీ కొన్నిసార్లు సంతోషంతోపాటు వారికి ఆందోళన కూడా కలుగుతుంది. ఒక తల్లి ఇలా చెప్పింది: “నేను చాలా సంతోషించాను. అయితే ఎంతో ఆందోళనకు కూడా గురయ్యాను.” ఆమెకు ఎందుకలా అనిపించింది? “ఇప్పటి నుండి యెహోవా ముందు మా అబ్బాయి తన పనులకు తానే బాధ్యుడని నాకు అర్థమైంది” అని ఆమె అంది.

బాప్తిస్మం తీసుకున్న సాక్షులుగా యెహోవాను సేవించాలనే లక్ష్యాన్ని పిల్లలందరూ కలిగి ఉండాలి. అయితే, ‘మా పిల్లలు మంచి ప్రగతి సాధించారని మాకు తెలుసు. కానీ అనైతికతకు సంబంధించిన ఒత్తిళ్లను ఎదిరించి, యెహోవా ఎదుట పవిత్రంగా ఉండేంత సామర్థ్యం వారికుందా?’ అని దైవభక్తిగల తల్లిదండ్రులకు అనిపించవచ్చు. ‘వస్తుసంబంధమైన ఆకర్షణలు ఎదురైనప్పుడు మా పిల్లలు సంతోషంగా, ఉత్సాహంగా దేవుని సేవలో కొనసాగుతారా?’ అని ఇంకొంతమంది తల్లిదండ్రులు అనుకుంటుండవచ్చు. కాబట్టి తమ పిల్లలు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి బైబిల్లోని ఏ నిర్దేశాలు తల్లిదండ్రులకు సహాయం చేస్తాయి?

బాప్తిస్మం తీసుకోవాలంటే క్రీస్తు శిష్యులుగా ఉండడం ఎంతో ప్రాముఖ్యం

ఏ వయసులో బాప్తిస్మం తీసుకోవాలో దేవుని వాక్యం చెప్పడం లేదుగానీ, బాప్తిస్మానికి ఎవరు అర్హులో చెబుతోంది. యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు: ‘సమస్త జనులను శిష్యులుగా చేయండి, వారికి బాప్తిస్మం ఇవ్వండి.’ (మత్త. 28:19) దీన్నిబట్టి, క్రీస్తు శిష్యులుగా తయారైన వారే బాప్తిస్మం తీసుకోవాలని తెలుస్తోంది.

శిష్యుడు అనే మాటకు అర్థమేమిటి? “శిష్యుడు అనే పదం ముఖ్యంగా, క్రీస్తు బోధల మీద నమ్మకముంచడమే కాక వాటిని నిక్కచ్చిగా పాటించేవారికి వర్తిస్తుంది” అని లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) చెబుతోంది. పిల్లలు క్రీస్తుకు నిజమైన శిష్యులుగా ఉండగలరా? లాటిన్‌ అమెరికాలో 40 కన్నా ఎక్కువ సంవత్సరాలు మిషనరీగా సేవచేసిన ఒక సహోదరి తన గురించి, తన అక్కా చెల్లీ గురించి ఇలా రాసింది: “మేము సమర్పించుకునే సమయానికి యెహోవా సేవ చేయాలనే, పరదైసులో జీవించాలనే కోరిక మాకుందని అర్థంచేసుకునేంత వయసులో ఉన్నాం. మేము సమర్పించుకోవడం వల్ల, యౌవనంలో వచ్చిన ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి కావాల్సిన బలాన్ని పొందాం. చిన్న వయసులో దేవునికి సమర్పించుకున్నందుకు మేము ఏ మాత్రం బాధపడడంలేదు.”

మీ పిల్లలు క్రీస్తుకు శిష్యులయ్యారని మీరెలా తెలుసుకోవచ్చు? బైబిలు ఇలా చెబుతోంది: “బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును.” (సామె. 20:11) పిల్లలు ఏ పనులు చేయడం ద్వారా క్రీస్తు శిష్యులుగా ‘తమ అభివృద్ధిని అందరికీ తేటగా చూపిస్తారో’ ఇప్పుడు పరిశీలిద్దాం.—1 తిమో. 4:15.

మీ పిల్లలు క్రీస్తు శిష్యులు అయ్యారనేందుకు రుజువులు

మీ పిల్లలు మీరు చెప్పింది వింటారా? (కొలొ. 3:20) ఇంట్లో మీరు చెప్పిన పనులన్నీ చేస్తారా? యేసుకు 12 ఏళ్లున్నప్పుడు “ఆయన [తన తల్లిదండ్రులకు] లోబడియుండెను” అని బైబిలు చెబుతోంది. (లూకా 2:51) నిజమే, ఈ రోజుల్లో పిల్లలెవ్వరూ తమ తల్లిదండ్రులు చెప్పినదానికి పూర్తిగా లోబడరు. కానీ, నిజ క్రైస్తవులు మాత్రం ‘యేసు అడుగుజాడల్లో నడుచుకోవాలి.’ కాబట్టి బాప్తిస్మం తీసుకోవాలనుకునే పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడేవారిగా మంచి పేరు సంపాదించుకోవాలి.—1 పేతు. 2:21.

ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి: మీ పిల్లలు పరిచర్య చేయడం ద్వారా ‘రాజ్యాన్ని, నీతిని మొదట వెదకుతున్నారా’? (మత్త. 6:33) ఇతరులతో సువార్తను పంచుకోవడానికి వారు ఇష్టపడతారా లేక ఇంటింటి పరిచర్యకు వెళ్లమని, పరిచర్యలో మాట్లాడమని వారిని ఎప్పుడూ ప్రోత్సహించాల్సి వస్తోందా? బాప్తిస్మం తీసుకోని ప్రచారకులుగా తమ బాధ్యత ఏమిటో వారికి తెలుసా? ఇంటింటి పరిచర్యలో తాము కలుసుకున్న ఆసక్తిగల వ్యక్తుల దగ్గరికి మళ్లీ వెళ్లడానికి వారు ఇష్టపడతారా? తాము యెహోవాసాక్షులమని తమ తోటి విద్యార్థులకు, టీచర్లకు చెబుతారా?

వారు సంఘ కూటాలకు హాజరవ్వడానికి ప్రాముఖ్యతనిస్తారా? (కీర్త. 122:1) కావలికోట అధ్యయనంలో, సంఘ బైబిలు అధ్యయనంలో వ్యాఖ్యానాలు చేయడమంటే వారికి ఇష్టమేనా? దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో వారు ఉత్సాహంగా పాల్గొంటారా?—హెబ్రీ. 10:24, 25.

పాఠశాలలో, ఇతర ప్రదేశాల్లో చెడు స్నేహితుల నుండి దూరంగా ఉంటూ నైతికంగా పవిత్రంగా ఉండడానికి మీ పిల్లలు కృషి చేస్తున్నారా? (సామె. 13:20) సంగీతం, సినిమాలు, టీవీ కార్యక్రమాలు, వీడియోగేమ్స్‌, ఇంటర్నెట్‌ వాడడం వంటి విషయాల్లో మీ పిల్లల అభిరుచులు ఏమిటి? బైబిలు ప్రమాణాల ప్రకారం జీవించాలనే కోరిక తమకుందని వారి మాటలు, చేతలు చూపిస్తున్నాయా?

మీ పిల్లలకు బైబిలు గురించి ఎంత బాగా తెలుసు? మీ కుటుంబ ఆరాధన సమయంలో నేర్చుకున్న విషయాలను తమ సొంత మాటల్లో చెప్పగలరా? వారు బైబిలు ప్రాథమిక బోధల్ని వివరించగలరా? (సామె. 2:6-9) బైబిలు చదవడం, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి అందించిన సాహిత్యాన్ని చదవడం వారికి ఇష్టమేనా? (మత్త. 24:45) బైబిలు బోధల గురించి, దానిలోని వచనాల గురించి వారు ప్రశ్నలు అడుగుతారా?

అలాంటి ప్రశ్నల గురించి ఆలోచిస్తే, మీ పిల్లలు ఎంత ఆధ్యాత్మిక ప్రగతి సాధించారో మీరు తెలుసుకోగలుగుతారు. దానివల్ల, బాప్తిస్మం తీసుకునే ముందు వారింకా కొన్ని విషయాల్లో మెరుగవ్వాలని మీకు అనిపించవచ్చు. అయితే, తాము క్రీస్తు శిష్యులమయ్యామని తమ మాటల్లో, చేతల్లో చూపించి తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే మీరు వారిని బాప్తిస్మానికి అనుమతించవచ్చు.

పిల్లలు యెహోవాను స్తుతించవచ్చు

చాలామంది దేవుని సేవకులు కౌమారదశలో లేదా అంతకన్నా చిన్న వయసులో విశ్వాసాన్ని, యథార్థతను చూపించారు. అలాంటి వారిలో యోసేపు, సమూయేలు, యోషీయా, యేసు ఉన్నారు. (ఆది. 37:2; 39:1-3; 1 సమూ. 1:24-28; 2:18-20; 2 దిన. 34:1-3; లూకా 2:42-49) అంతేకాక, ప్రవచించేవారిగా ఉన్న ఫిలిప్పు నలుగురు కుమార్తెలు కూడా చిన్న వయసు నుండే మంచి శిక్షణ పొంది ఉండవచ్చు.—అపొ. 21:8, 9.

గ్రీసు దేశంలోని ఒక సాక్షి ఇలా చెప్పాడు: “నేను 12 ఏళ్ల వయసులో బాప్తిస్మం తీసుకున్నాను. అలా చేసినందుకు నేనెప్పుడూ బాధపడలేదు. నేను బాప్తిస్మం తీసుకొని 24 సంవత్సరాలైంది, వాటిలో 23 సంవత్సరాలు నేను పూర్తికాల సేవ చేశాను. యెహోవా మీద ప్రేమ ఉండడం వల్ల నేను యౌవనంలో వచ్చే సమస్యల్ని ఎదుర్కోగలిగాను. లేఖనాల గురించి నాకిప్పుడు ఉన్నంత జ్ఞానం, 12 ఏళ్ల వయసులో లేదు. కానీ నేను యెహోవాను ప్రేమించానని, ఆయనను ఎల్లప్పుడూ సేవించాలనే కోరిక నాకు ఉందని మాత్రం నాకప్పుడు తెలుసు. తన సేవలో కొనసాగడానికి యెహోవా నాకు సహాయం చేసినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను.”

క్రీస్తు నిజ శిష్యులుగా ఉన్నామని నిరూపించుకున్నవారు పిల్లలైనా, పెద్దవారైనా బాప్తిస్మం తీసుకోవాలి. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.” (రోమా. 10:10) క్రీస్తు శిష్యులుగా ఉన్న పిల్లలు బాప్తిస్మం అనే ప్రాముఖ్యమైన చర్య తీసుకున్నప్పుడు, వారూ వారి తల్లిదండ్రులూ ఒక మైలురాయిని చేరుకున్నట్లే. కాబట్టి, మీ ముందున్న సంతోషాన్ని పొందకుండా మిమ్మల్ని గానీ, మీ పిల్లల్ని గానీ ఏదీ ఆపకూడదని మేము మనసారా కోరుకుంటున్నాం.

[అధస్సూచి]

a కొన్ని అసలు పేర్లు కావు.

[5వ పేజీలోని చిత్రం]

బాప్తిస్మం గురించి సరైన అభిప్రాయం కలిగివుండండి

పిల్లలు బాప్తిస్మం తీసుకోవడం ప్రయోజనకరమైనదే అయినా అది సాహసంతో కూడినదని కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే బాప్తిస్మం వల్ల, పరిశుద్ధ సేవ వల్ల ఒక వ్యక్తి భవిష్యత్తు దెబ్బతింటుందా? లేదు అని బైబిలు చెబుతోంది. సామెతలు 10:22 (నూతనలోక అనువాదం) ఇలా చెబుతోంది: ‘యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్నిస్తుంది. ఆయన దానితో ఏ బాధనూ చేర్చడు.’ యౌవనస్థుడైన తిమోతికి పౌలు ఇలా రాశాడు: “సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.”—1 తిమో. 6:6.

నిజమే, యెహోవా సేవచేయడం సులభం కాదు. దేవుని ప్రవక్తగా యిర్మీయా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అయినా, తాను సత్య దేవునికి చేసిన ఆరాధన గురించి ఆయన ఇలా అన్నాడు: “సైన్యముల కధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.” (యిర్మీ. 15:16) దేవుణ్ణి సేవించడం వల్లే తాను నిజమైన సంతోషాన్ని పొందాడని యిర్మీయాకు తెలుసు. కానీ, సాతాను లోకం వల్ల ఎన్నో కష్టాలు వస్తాయి. కాబట్టి దేవుని సేవలో గడిపే జీవితానికి, సాతాను లోకంలోని జీవితానికి మధ్య ఉన్న తేడాను గుర్తించడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేయాలి.

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

మా పిల్లల బాప్తిస్మాన్ని మేము వాయిదావేయాలా?

పిల్లలు బాప్తిస్మం తీసుకోవడానికి అర్హులైనా కొన్నిసార్లు వారి తల్లిదండ్రులు దాన్ని వాయిదావేయాలని నిర్ణయించుకుంటారు. ఎందుకు?

ఒకవేళ మా పిల్లలు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏదైనా గంభీరమైన పాపం చేసి బహిష్కరించబడతారేమోనని మాకు భయమేస్తుంది. బాప్తిస్మాన్ని వాయిదావేసే పిల్లలు తమ ప్రవర్తన విషయంలో దేవునికి లెక్క ఒప్పజెప్పాల్సిన అవసరం లేదని అనుకోవడం సరైనదేనా? సొలొమోను యౌవనస్థులకు ఇలా చెప్పాడు: “[నీ పనులను బట్టి] దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము.” (ప్రసం. 11:9) అంతేకాక, “మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను” అని పౌలు అన్నప్పుడు ఆయన నిర్దిష్టమైన వయసు గురించి మాట్లాడలేదు.—రోమా. 14:11, 12.

బాప్తిస్మం తీసుకున్నా, తీసుకోకపోయినా దేవుని ఆరాధకులంతా తాము చేసే పనుల విషయంలో ఆయనకు లెక్క ఒప్పజెప్పాలి. యెహోవా తన సేవకులను ‘సహింపగలిగిన దానికన్నా ఎక్కువగా శోధింపబడనివ్వడు’ అని గుర్తుంచుకోండి. (1 కొరిం. 10:13) ‘మెలకువగా’ ఉండి శోధనలను ఎదిరిస్తూ ఉన్నంతవరకు మనకు దేవుని సహాయం ఉంటుందని నమ్మవచ్చు. (1 పేతు. 5:6-9) ఒక క్రైస్తవ తల్లి ఇలా రాసింది: “బాప్తిస్మం తీసుకున్న పిల్లలు లోకంలో ఉన్న చెడు పనులకు దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 15 ఏళ్ల వయసులో బాప్తిస్మం తీసుకున్న మా అబ్బాయి అది తనకు ఒక రక్షణగా ఉందని భావిస్తున్నాడు. ‘యెహోవా నియమాలకు వ్యతిరేకమైన వాటిని చేయాలన్న ఆలోచనే రాదు’ అని మా అబ్బాయి అన్నాడు. బాప్తిస్మం నీతిగా జీవించేందుకు కావాల్సిన బలాన్నిస్తుంది.”

మీ మాటల ద్వారా, మాదిరి ద్వారా యెహోవాకు లోబడడాన్ని మీ పిల్లలకు నేర్పిస్తే, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా వారు ఆయనకు లోబడే ఉంటారని మీరు నమ్మవచ్చు. సామెతలు 20:7 ఇలా చెబుతోంది: “యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు.”

మా పిల్లలు ముందుగా కొన్ని లక్ష్యాలు చేరుకుంటే చూడాలనుంది. పిల్లలు పనిచేయడం నేర్చుకోవాలి. అలా చేస్తే కొన్ని సంవత్సరాలకు వారు సంతృప్తిగా జీవించగలుగుతారు. కానీ, సత్యారాధనకు బదులు చదువుకు, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యతనిచ్చే జీవితాన్ని అనుసరించమని ప్రోత్సహించడం ప్రమాదకరమైనది. రాజ్యానికి సంబంధించిన వాక్యాన్ని యేసు విత్తనంతో పోల్చాడు. పెరగని ఒక ‘విత్తనం’ గురించి ఆయన ఇలా చెప్పాడు: “ముండ్లపొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును.” (మత్త. 13:22) పిల్లలు ఆధ్యాత్మిక విషయాలకు కాక లోకసంబంధ లక్ష్యాలకు మొదటి స్థానమిస్తే దేవుణ్ణి సేవించాలనే వారి కోరిక నీరుగారిపోవచ్చు.

బాప్తిస్మం తీసుకోవడానికి పిల్లలు అర్హులైనా దానికి ఒప్పుకోని తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఒక అనుభవంగల పెద్ద ఇలా అన్నాడు: “పిల్లలు బాప్తిస్మం తీసుకోవడాన్ని తల్లిదండ్రులు ఆపడం వల్ల పిల్లల ఆధ్యాత్మిక ప్రగతి దెబ్బతినడమే కాక వారు నిరుత్సాహానికి కూడా గురౌతారు.” ఒక ప్రయాణ పర్యవేక్షకుడు ఇలా రాశాడు: “తాము కావాల్సినంత ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేదనే ఆలోచన పిల్లల్లో మొదలయ్యే అవకాశం ఉంది. దానివల్ల, వారు ఏదో సాధించామనే అనుభూతిని పొందడం కోసం లోకం వైపు చూసే ప్రమాదం ఉంది.”

[చిత్రం]

విశ్వవిద్యాలయ చదువుకు మొదటి స్థానం ఇవ్వాలా?

[3వ పేజీలోని చిత్రం]

తాము క్రీస్తు శిష్యులమయ్యామని పిల్లలు నిరూపించుకోగలరు

[3వ పేజీలోని చిత్రాలు]

కూటాలకు సిద్ధపడి, వాటిలో భాగం వహించడం

[4వ పేజీలోని చిత్రం]

తల్లిదండ్రులకు లోబడడం

[4వ పేజీలోని చిత్రం]

పరిచర్యలో పాల్గొనడం

[4వ పేజీలోని చిత్రం]

వ్యక్తిగతంగా ప్రార్థించడం