‘మీ మార్గాన్ని ఎలా వర్ధిల్లజేసుకోవచ్చు’?
‘మీ మార్గాన్ని ఎలా వర్ధిల్లజేసుకోవచ్చు’?
“విజయం” అనే పదం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొంతమంది కార్పొరేట్ మెట్లను ఎక్కి బాగా డబ్బును, పేరుప్రఖ్యాతులను సంపాదించడంలో విజయం సాధించారు. ఇంకొంతమంది విజయం కోసం కలలు కన్నారు కానీ ఘోరంగా విఫలమయ్యారు.
జీవితంలో మీరు దేనికి అత్యంత ప్రాముఖ్యతనిస్తారనే దానిపైనే మీ విజయం ఎక్కువగా ఆధారపడివుంటుంది. అంతేకాక మీ సమయాన్నీ శక్తినీ ఎలా ఉపయోగిస్తారు అనేదానిపై, మీరు అసలు ఏదైనా చేయడానికి ముందడుగు వేస్తారా లేదా అనేదానిపై కూడా మీ విజయం ఆధారపడివుంటుంది.
పరిచర్యలో పూర్తిగా పాల్గొనడం వల్ల తాము ఎంతో సంతృప్తి పొందామని చాలామంది క్రైస్తవులు గ్రహించారు. పూర్తికాల సేవను తమ జీవిత లక్ష్యంగా చేసుకోవడం వల్ల పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ జీవితంలో విజయం సాధించగలిగారు. అయితే కొంతమంది ప్రకటనా పని అంత ఆసక్తికరంగా ఉండదని భావించి ఇతర లక్ష్యాలను ఏర్పర్చుకొని దాన్ని రెండవ స్థానంలోకి నెట్టేస్తారు. అలా ఎందుకు జరుగుతుంది? నిజంగా అమూల్యమైన విషయాలపైనే మనసు నిలపడానికి మీరేమి చేయవచ్చు? మీరు మీ ‘మార్గాన్ని ఎలా వర్ధిల్లజేసుకోవచ్చు’?—యెహో. 1:8.
హాబీలు, ఇతర కార్యకలాపాలు
క్రైస్తవ యౌవనులు ఇతర కార్యకలాపాల్లో పాల్గొంటూ సత్య దేవుని సేవను అశ్రద్ధ చేయకూడదు. దేవుని సేవకు తగిన ప్రాముఖ్యతనిచ్చే యౌవనులు జీవితంలో విజయం సాధించే దిశగా పయనిస్తున్నారు. అలాంటి వారిని మనం మెచ్చుకోవాలి.
కొంతమంది క్రైస్తవ యౌవనులు హాబీల్లో, ఇతరత్రా కార్యకలాపాల్లో మునిగిపోతారు. అలాంటివి తప్పు కాకపోవచ్చు. అయితే యౌవన క్రైస్తవులు ఈ ప్రశ్నలు వేసుకోవాలి: ‘అలాంటి కార్యకలాపాల కోసం నేను ఎంత సమయం వెచ్చించాల్సి వస్తోంది? నేను ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నాను? ఆ కార్యకలాపాల వల్ల నాలో ఎలాంటి వైఖరి కలిగే అవకాశం ఉంది? వాటివల్ల జీవితంలో నేను దేనికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చే అవకాశం ఉంది?’ ఒక వ్యక్తి అలాంటి కార్యకలాపాల్లో మునిగిపోతే యెహోవాతో తనకున్న సంబంధాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ సమయం, శక్తి ఉండవని మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి, మీ జీవితంలో ప్రాధాన్యతలను ఏర్పరచుకోవడం ఎంత ప్రాముఖ్యమో మీకు అర్థమైందా?—ఎఫె. 5:15-17.
వంశీ అనే సహోదరుని ఉదాహరణను గమనించండి. a ఆయనిలా చెప్పాడు: “12 ఏళ్ల వయసులో నేను వాలీబాల్ క్లబ్బులో చేరాను. కొంతకాలానికి నేను ఎన్నో బహుమతులను, అవార్డులను అందుకున్నాను. ఓ పెద్ద స్టార్ అయ్యే అవకాశం అప్పుడు నాకు ఉంది.” కొంతకాలానికి, ఆ ఆట వల్ల తన ఆధ్యాత్మికతకు జరుగుతున్న హాని గురించి ఆలోచించి వంశీ ఆందోళన చెందాడు. ఒకరోజు ఆయన బైబిలు చదవడం మొదలుపెట్టి అలాగే నిద్రపోయాడు. అంతేకాక, తాను సంతోషంగా క్షేత్ర సేవ చేయడం లేదని ఆయన గుర్తించాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: “ఆ ఆట నా శక్తినే కాక ఆధ్యాత్మిక విషయాల్లో నాకున్న ఉత్సాహాన్ని కూడా హరించివేస్తోందని గుర్తించాను. యెహోవా సేవలో నేను చేయగలిగినదంతా చేయలేకపోతున్నానని నాకు అర్థమైంది.”
ఉన్నత విద్య
క్రైస్తవులకు కుటుంబాన్ని చూసుకోవాల్సిన లేఖనాధార బాధ్యత ఉంటుంది. అలా చూసుకోవాలంటే కుటుంబ సభ్యుల వస్తుపరమైన అవసరాలను కూడా తీర్చాలి. (1 తిమో. 5:8) అందుకోసం ఒక వ్యక్తికి నిజంగా కాలేజి లేదా విశ్వవిద్యాలయ పట్టా అవసరమా?
ఉన్నత విద్యను అభ్యసిస్తే యెహోవాతో తనకున్న సంబంధానికి ఏమౌతుందో ఒక వ్యక్తి ఆలోచించడం మంచిది. మనం ఈ విషయంలో ఓ బైబిలు ఉదాహరణను పరిశీలిద్దాం.
బారూకు యిర్మీయాకు సహాయకునిగా పనిచేసేవాడు. ఒకానొక సమయంలో, యెహోవా సేవలో తనకున్న ఆధిక్యతలపై దృష్టి నిలిపే బదులు ఆయన స్వార్థపూరిత లక్ష్యాలను వెంబడించాలనుకున్నాడు. యెహోవా దాన్ని గమనించి యిర్మీయా ద్వారా ఇలా హెచ్చరించాడు: “నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు.”—బారూకు ఏ “గొప్పవాటిని” వెదికాడు? యూదా వ్యవస్థలో తనకంటూ ఓ పేరు సంపాదించుకోవాలని ఆయన అనుకొని ఉండవచ్చు. లేదా ధనవంతుడవ్వాలని అనుకొనివుండవచ్చు. ఏదేమైనా ఆయన యెహోవాతో దగ్గరి సంబంధం కలిగివుండేందుకు తనకు సహాయం చేసే విషయాలకు ప్రాముఖ్యతనివ్వడం మానేశాడు. (ఫిలి. 1:9-11) అయితే, యిర్మీయా ద్వారా యెహోవా తనకు ఇచ్చిన హెచ్చరికను బారూకు పాటించాడు. దానివల్ల ఆయన యెరూషలేము నాశనాన్ని తప్పించుకున్నాడు.—యిర్మీ. 43:5, 6.
మనం బారూకు ఉదాహరణ నుండి ఏమి నేర్చుకోవచ్చు? బారూకుకు యెహోవా ఇచ్చిన ఉపదేశాన్నిబట్టి బారూకు ఆలోచనలో ఏదో తప్పుందని తెలుస్తోంది. ఆయన తనకోసం గొప్పవాటిని వెదికాడు. మీకు ఒక జీవనాధారం ఉన్నట్లయితే, కేవలం మీ వ్యక్తిగత లక్ష్యాల కోసం లేదా మీ తల్లిదండ్రులూ బంధువులూ ఏర్పరచిన లక్ష్యాల కోసం పైచదువులు చదవడానికి మీ సమయాన్ని, శక్తిని, డబ్బును వెచ్చించడం నిజంగా అవసరమా?
కంప్యూటర్ ప్రోగ్రామర్ అయిన చేతన్ విషయమే తీసుకోండి. ఆయన తన తోటి ఉద్యోగస్థుల ఒత్తిడికి లొంగిపోయి, ఎక్కువ కష్టపడాల్సి వచ్చే ఓ ప్రత్యేకమైన అదనపు శిక్షణను తీసుకున్నాడు. దానివల్ల ఆధ్యాత్మిక విషయాలకు సమయం లేకుండా పోయింది. ఆయనిలా గుర్తుచేసుకుంటున్నాడు: “నాకు అసలు తీరిక లేదని తరచూ అనిపించేది. నేను ఏర్పరచుకున్న ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోలేకపోయాను కాబట్టి నా మనస్సాక్షి నన్ను వేధించింది.”
ఉద్యోగంలో మునిగిపోవడం
క్రైస్తవులు కష్టపడి పనిచేయాలనీ బాధ్యతగల యజమానులుగా, ఉద్యోగస్థులుగా ఉండాలనీ దేవుని వాక్యం ప్రోత్సహిస్తోంది. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు [యెహోవా] నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.” (కొలొ. 3:22, 23) కష్టపడి పనిచేయడం ప్రాముఖ్యమైనదే అయినా సృష్టికర్తతో మంచి సంబంధాన్ని కలిగి ఉండడం అంతకన్నా ప్రాముఖ్యమైనది. (ప్రసం. 12:13) ఒక క్రైస్తవుడు ఉద్యోగంలో మునిగిపోతే ఆధ్యాత్మిక విషయాలను సులభంగా రెండవ స్థానంలోకి నెట్టేసే అవకాశం ఉంది.
ఒక క్రైస్తవుడు ఉద్యోగంలో మునిగిపోతే తన వ్యక్తిగత, కుటుంబ ఆధ్యాత్మిక అవసరాలను తీర్చలేనంతగా అలసిపోయాడని ఆయనకు అనిపించవచ్చు. “రెండు చేతులనిండ” ఉండే ‘శ్రమతోపాటే’ తరచూ “గాలికైన యత్నములు” కూడా ఉంటాయని రాజైన సొలొమోను గమనించాడు. ఒక క్రైస్తవుడు లోకంలో మంచి భవిష్యత్తు కోసం ఎక్కువగా ప్రయత్నిస్తే దీర్ఘకాలం ఉండే తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాడు. ఆయన తన ఉద్యోగానికి దాసుడై చివరకు జీవితంలో పూర్తిగా అలసిపోయే ప్రమాదం ఉంది. అలాంటి ప్రసం. 3:12, 13; 4:6) అంతకన్నా ప్రాముఖ్యంగా, తన కుటుంబ బాధ్యతలు నెరవేర్చడానికి, ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి సరిపోయేంత శారీరక, మానసిక శక్తి ఆయనలో మిగిలి ఉంటుందా?
వ్యక్తి ‘సంతోషంగా ఉంటూ తన కష్టార్జితం వల్ల సుఖమనుభవించడం’ సాధ్యమౌతుందా? (తూర్పు ఐరోపాలో ఉంటున్న రిచర్డ్, తోట వ్యాపారంలో నిమగ్నమైపోయాడు. ఆయనిలా గుర్తుచేసుకుంటున్నాడు: “నేను చొరవ తీసుకొని పనిచేయడాన్ని బట్టి, అప్పగించబడిన ప్రతీ పనిని పూర్తి చేయడాన్ని బట్టి లోకంలోని ప్రజలు నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. కానీ నా ఆధ్యాత్మికత దెబ్బతింది, క్షేత్ర సేవలో పాల్గొనడం మానేశాను. మెల్లమెల్లగా కూటాలకు వెళ్లడం కూడా మానేశాను. నేను ఎంత గర్విష్ఠిని అయ్యానంటే పెద్దలు ఇచ్చిన ఉపదేశాన్ని త్రోసిపుచ్చాను, సంఘానికి దూరమయ్యాను.”
మీరు మీ జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు
స్కూలు కార్యకలాపాల్లో, ఉన్నత విద్యలో, ఉద్యోగంలో మునిగిపోతే ఒక క్రైస్తవుని ఆధ్యాత్మికత దెబ్బతింటుందని మనం చూశాం. మీరు వాటిలో ఏదైనా ఒకదానిలో వంతు కలిగివున్నారా? అలాగైతే, కింద ఉన్న ప్రశ్నలు, లేఖనాలు, వ్యాఖ్యానాలు మీరు విజయం సాధించే దిశగా వెళ్తున్నారో లేదో పరిశీలించుకోవడానికి మీకు సహాయం చేస్తాయి.
హాబీలు, ఇతర కార్యకలాపాలు: మీరు అలాంటి కార్యకలాపాల్లో ఎంతమేర నిమగ్నమౌతున్నారు? ఇంతకుముందు మీరు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు వెచ్చించిన సమయాన్ని అవి హరించివేస్తున్నాయా? తోటి విశ్వాసుల సహవాసం బోరు కొట్టించేదిగా ఉన్నట్లు మీకు అనిపిస్తోందా? అలాగైతే రాజైన దావీదును అనుకరించండి. ఆయన యెహోవాను ఇలా వేడుకున్నాడు: “నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము.”—కీర్త. 143:8.
పైన ప్రస్తావించబడిన వంశీకి ఒక ప్రయాణ పర్యవేక్షకుడు సహాయం చేశాడు. ఆయన వంశీతో ఇలా అన్నాడు: “నీ వాలీబాల్ జీవితం గురించి చాలా ఇష్టంగా మాట్లాడుతున్నావు.” వంశీ ఇలా అంటున్నాడు: “ఆయన మాటలు నన్నెంతో కదిలించాయి. నేను ఎంతో దూరం వెళ్లానని నాకు అర్థమైంది. కొంతకాలానికి, నేను వాలీబాల్ క్లబ్బులోని లోకస్థులతో స్నేహాన్ని తెంచేసుకొని సంఘంలో స్నేహితులను సంపాదించుకోవడానికి ప్రయత్నించాను.” వంశీ ఇప్పుడు సంఘంలో ఉత్సాహంగా యెహోవా సేవ చేస్తున్నాడు. ఆయన ఈ సలహా ఇస్తున్నాడు: “మీ స్కూలు కార్యకలాపాలు మిమ్మల్ని యెహోవాకు సన్నిహితం చేశాయా లేక దూరం చేశాయా? ఈ విషయంలో మీ స్నేహితులు, తల్లిదండ్రులు లేదా సంఘ పెద్దలు ఏమి గమనించారో అడిగి తెలుసుకోండి.”
మీరు దేవుని సేవలో మరిన్ని ఆధిక్యతలకు అర్హులయ్యేందుకు ఇష్టపడుతున్నారని మీ సంఘ పెద్దలకు చెప్పవచ్చు. సహాయం లేదా సహవాసం అవసరమైన వృద్ధులకు చేయూతనివ్వగలరా? బహుశా మీరు వారి కోసం ఏదైనా కొనుగోలు చేయవచ్చు లేదా ఇంటి పనుల్లో సహాయం చేయవచ్చు. పిల్లలైనా, పెద్దలైనా మీరు సంతోషంగా ఉండడానికి గల కారణాలను ఇతరులతో పంచుకోవడానికి పూర్తికాల సేవ చేయవచ్చు.
ఉన్నత విద్య: ‘స్వకీయ మహిమను వెదకవద్దని’ యేసు హెచ్చరించాడు. (యోహా. 7:18) మీరెంత విద్యాభ్యాసం చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ, ముందు ఏవి ‘శ్రేష్ఠమైన కార్యాలో’ గుర్తించారా?—ఫిలి. 1:9, 10.
కంప్యూటర్ ప్రోగ్రామర్ అయిన చేతన్ తన జీవితంలో కొన్ని మార్పులు చేసుకున్నాడు. ఆయనిలా అన్నాడు: “పెద్దలు ఇచ్చిన సలహా ప్రాముఖ్యమైనదని గుర్తించి నా జీవితాన్ని సరళం చేసుకున్నాను. నేను ఎక్కువ విద్యాభ్యాసం చేయాల్సిన అవసరం లేదని గుర్తించాను. అది కేవలం నా సమయాన్ని, శక్తిని హరించివేస్తుంది.” చేతన్ ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి, ఆయన పరిచర్య శిక్షణా పాఠశాలకు హాజరయ్యాడు. అది ఇప్పుడు ‘ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాల’ అని పిలువబడుతోంది. ఆయన నిజంగా దైవిక విద్యను అభ్యసించడానికి ‘సమయాన్ని సద్వినియోగం’ చేసుకున్నాడు.—ఎఫె. 5:15, 16.
ఉద్యోగం: ఆధ్యాత్మిక కార్యకలాపాలను పక్కకు నెట్టేసేంతగా మీరు ఉద్యోగంలో మునిగిపోయారా? మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి మీరు తగినంత సమయం తీసుకుంటున్నారా? సంఘంలో మీరిచ్చే వ్యాఖ్యానాల, ప్రసంగాల నాణ్యతను పెంచుకుంటున్నారా? ఇతరులతో ప్రోత్సాహకరంగా మాట్లాడుతున్నారా? “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి” నడుచుకోండి. అలాచేస్తే యెహోవా మిమ్మల్ని మెండుగా ఆశీర్వదిస్తాడు, మీరు మీ ‘కష్టార్జితం చేత సుఖాన్ని అనుభవిస్తారు.’—ప్రసం. 2:24; 12:13.
పైన ప్రస్తావించబడిన రిచర్డ్, తోట వ్యాపారంలో రాణించలేకపోయాడు. ఆయన వ్యాపారం విఫలమైంది. ఆదాయం ఏమీ లేక అప్పుల్లో కూరుకుపోయాడు. ఆ పరిస్థితుల్లో ఆయన యెహోవావైపు తిరిగాడు. ఆయన తన ప్రాధాన్యతలను మార్చుకొని ఇప్పుడు క్రమపయినీరుగా, సంఘ పెద్దగా సేవచేస్తున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “నేను కనీస అవసరాలను తీర్చుకోవడంతో తృప్తి చెందుతూ ఆధ్యాత్మిక విషయాలకు నా శక్తిని ఉపయోగించినప్పుడు నాకు మనశ్శాంతి ఉంటుంది.”—ఫిలి. 4:6, 7.
మీ ఉద్దేశాలను, ప్రాధాన్యతలను ఒకసారి నిజాయితీగా పరిశీలించుకోండి. యెహోవాను సేవిస్తే జీవితాంతం విజయం సాధించవచ్చు. మీ జీవితంలో యెహోవా సేవకే ప్రాముఖ్యతను ఇవ్వండి.
“ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో” పరీక్షించి తెలుసుకోవడానికి మీరు కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి రావచ్చు, అనవసరమైన విషయాలను పూర్తిగా పక్కనబెట్టాల్సి రావచ్చు. (రోమా. 12:2) అయితే, యెహోవాను పూర్ణాత్మతో సేవిస్తే మీరు మీ ‘మార్గాన్ని వర్ధిల్లజేసుకోవచ్చు.’
[అధస్సూచి]
a కొన్ని అసలు పేర్లు కావు.
[31వ పేజీలోని బాక్సు/చిత్రం]
మీ మార్గాన్ని ఎలా వర్ధిల్లజేసుకోవచ్చు?
మీ సమయాన్ని హరించే విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ, నిజంగా అమూల్యమైన విషయాలపైనే మనసు నిలపాలంటే మీరేమి చేయాలి? కింద ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించి మీ ఉద్దేశాలను, ప్రాధాన్యతలను పరిశీలించుకోండి:
హాబీలు, ఇతర కార్యకలాపాలు
▪ ఆ కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల మీలో ఎలాంటి వైఖరి కలిగే అవకాశం ఉంది?
▪ వాటికోసం మీరు ఎంత సమయం వెచ్చించాల్సి వస్తోంది?
▪ మీ జీవితంలో అవే అత్యంత ప్రాముఖ్యమైన విషయాలుగా మారే అవకాశం ఉందా?
▪ ఇంతకుముందు మీరు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు వెచ్చించిన సమయాన్ని అవి హరించివేస్తున్నాయా?
▪ ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నారు?
▪ తోటి విశ్వాసుల కన్నా వారినే ఎక్కువగా ఇష్టపడుతున్నారా?
ఉన్నత విద్య
▪ మీకు ఒక జీవనాధారం ఉన్నట్లయితే పైచదువులు చదవడానికి మీ సమయాన్ని, శక్తిని, డబ్బును వెచ్చించడం నిజంగా అవసరమా?
▪ మీ కనీస అవసరాలు తీర్చుకోవడానికి మీకు కాలేజి లేదా విశ్వవిద్యాలయ పట్టా నిజంగా అవసరమా?
▪ వాటివల్ల మీరు కూటాలకు క్రమంగా హాజరవ్వగలరా?
▪ ఏవి ‘శ్రేష్ఠమైన కార్యాలో’ మీరు గుర్తించారా?
▪ యెహోవా మీ కనీస అవసరాలను తీర్చగలడనే నమ్మకాన్ని మీరు బలపర్చుకోవాల్సిన అవసరం ఉందా?
ఉద్యోగం
▪ మీరు ఎంపిక చేసుకునే ఉద్యోగం వల్ల ‘సంతోషంగా ఉంటూ మీ కష్టార్జితం చేత సుఖమనుభవించడం’ సాధ్యమౌతుందా?
▪ మీ కుటుంబ బాధ్యతలు నెరవేర్చడానికి, ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి సరిపోయేంత శారీరక, మానసిక శక్తి మీలో మిగిలి ఉంటుందా?
▪ మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి మీరు తగినంత సమయం తీసుకుంటున్నారా?
▪ ఆధ్యాత్మిక కార్యకలాపాలను పక్కకు నెట్టేసేంతగా మీరు ఉద్యోగంలో మునిగిపోయారా?
▪ దానివల్ల, సంఘంలో మీరిచ్చే వ్యాఖ్యానాల, ప్రసంగాల నాణ్యత దెబ్బతిందా?
[30వ పేజీలోని చిత్రం]
స్వార్థపూరిత లక్ష్యాలను వెంబడించవద్దని యెహోవా బారూకును హెచ్చరించాడు